Paramacharya pavanagadhalu    Chapters   

104. అగర్‌ బత్తి

1983లో స్వామి వారు కర్నూలులో చాతుర్మాస్యం చేసినప్పుడు ఆయనకు ఆ జిల్లా కలక్టర్‌ శ్రీ అగర్‌వాలా స్వాగతం పలికి నగరం లోకి తీసుకొని వచ్చారు. ఆ సందర్భంలో ఆయన కంచి పెద్ద స్వాముల వారికి తనను తాను పరిచయం చేసుకున్నారు. స్వామి 'మీ పేరు నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. పూజలో అగర్‌వత్తులు వెలిగించినప్పుడల్లా మీరు గుర్తు రాక తప్పదు' అన్నారు నవ్వుతూ.

స్వామి ఆ తరువాత అక్కడ నాలుగు నెలలున్నారు. ఆఖరున కలక్టరు గారు వెళ్లి స్వాముల వారి దర్శనం చేసుకోగా పక్కన వున్న వారెవరో కలక్టరు గారి పేరు చెప్పి స్వామికి పరిచయం చేయబోయారు. స్వామి అది వినిపించుకోకుండా 'అగర్‌బత్తి' అని, వూరుకొన్నారు. శిష్యులు స్వామి వారెందుకో అగరువత్తులడుగుతున్నారనుకొని పరిగెత్తి వూదు కడ్డీలు తెచ్చారు. స్వామి అవి పక్కకు నెట్టి మళ్లీ 'అగర్‌ బత్తి' అన్నారు.

కలక్టరు గారికి కూడ ఆ రోజు స్వామి చెప్పింది గుర్తు రాలేదు. ఆయన స్వామి ఏమడుగుతున్నారో అర్థం కాక చూస్తున్నారు. అప్పుడు స్వామి నాలుగు నెలల క్రింద కలక్టరును మొదటిసారి కలిసినప్పుడు తాను చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చి, ఆయన పేరు తనకు రోజూ గుర్తొస్తుందనీ, మరిచిపోలేదని, కనుక తనకు ఆయనను ఎవరో మళ్లీ పరిచయం చేయవలసిన అవసరం లేదని వివరించారు.

''నమః కపర్దినేచ వ్యుప్తకేశాయచ''

శివునికి వ్యుప్తకేశుడు అనే పేరుంది. అంటే ముండనం (గుండు) చేయించుకున్నవాడు. శివుడు జటాధారి అని అందరకు తెలిసిందే! మరి, బోడి తల వాడు అని ఆయనకు పేరెలా నప్పుతుంది? వాయు పురాణంలో ఈశ్వరుడు నల్గురు శిష్యులతో గురువుగా అవతరించగలరని చెప్పబడింది. కనుక వ్యుప్తకేశుడైన శివుడు శంకరాచార్య భగవత్పాదులే- అని భాష్యకారులు పేర్కొన్నారు.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters