Paramacharya pavanagadhalu    Chapters   

101. కురుక్షేత్రం పో! క్యూరవుతుంది!

డాక్టర్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావుగారు పేరొందిన సర్జన్‌. విజయవాడలోనే గాక ఆయన పేరు ఆ ప్రాంతమంతా సుపరిచితమే.

ఆయన రెండవ కుమారునికి ఒకసారి జబ్బు చేసింది. అంతకు కొద్ది రోజుల ముందే ఆయన కుమార్తె అకాల మరణం చెందింది. దానితో డాక్టరు గారికి, ఆయన భార్యకు మనశ్శాంతి లేకుండా పోయింది.

ఆయన స్వయంగా పేరు మోసిన వైద్యులే అయినా తన కుమారుని జబ్బు ఫలానా అని నిర్ణయించటం వీలు కాలేదు. అందువల్ల ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో రోగ నిర్ణయం చేయించుదామనుకున్నారు.

ఈలోగా కంచి స్వాములు శ్రీ చంద్రశేఖర సరస్వతి నరసారావుపేట వస్తున్నారని తెలిసి అక్కడకు పోయి ఆయన దర్శనం చేసుకున్నారు.

స్వామి వారు డాక్టరు గారు చెప్పినది అంతావిన్నారు. ఢిల్లీ పోదామనుకుంటున్నారు గదా! కురుక్షేత్రం వెళ్లి ఒకసారి దేవుణ్ణి దర్శించుకోండి!' అని సెలవిచ్చారు. వారదేవిధంగా ముందు కురుక్షేత్రం వెళ్లి దేవుణ్ణి సేవించుకొని ఢిల్లీ వెళ్లారు.

అక్కడ మెడికల్‌ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పిల్ల వాడికి అన్ని పరీక్షలూ చేయించారు. నిపుణులు అతడిని పరీక్షించారు. అంతా అయింతర్వాత 'ఇతనికే జబ్బూ లేదే'! అని చెప్పి వారతడిని యింటికి తీసుకొని పొమ్మన్నారు. స్వామి వారు చెప్పినట్లు కురుక్షేత్రంలో దైవదర్శనం చేయగానే అతడిలోని రుగ్మత చేత్తో తీసేసినట్లు పోయింది. ఆ అబ్బాయి అప్పటి నుంచి ఆరోగ్యంగా, హాయిగా వున్నాడు.

డాక్టరు ఆ తరువాత ఏ ఆపరేషన్‌ చేసినా ముందు కంచి స్వామి వారిని స్మరించే అది ప్రారంభించేవారు.

తమ గొప్ప తామే చెప్పుకోకూడదు. అలా చెప్పుకోవడం లోపం అవుతుంది. ఇతరులు తన గురించి చెపితే అది కీర్తి అవుతుంది.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters