Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

23. వృత్రాసుర వధ - దాని సంకేతము

చిత్రకేతూపాఖ్యానము:-

వృత్రాసురవధ కథ ఋగ్వేదము, యజుర్వేదము, భారతము, భాగవతము, దేవీ భాగవతము, పరాశర సంహిత-వీనియందు కలదు. రామాయణముకూడ వృత్రాసురవధ నాధారముగ జేసికొని వ్రాసినదే నని పెద్దల అభిప్రాయము. ఇన్నిటియందు ఈ కథ అగుపించుటచేత దీని ప్రాశస్త్యమును గూర్చి తెలుపనవసరములేదు. దీని ఆవశ్యకత, సంకేతార్థము మనము గ్రహించవలెను. వ్యాసుడు సంప్రదాయ రహస్యములను కథలరూపమున తెలిపెననుట కిది ఉదాహరణ మనవచ్చును.

మత్స్యపురాణములోని భాగవత నిర్వచనమునందు వృత్రాసురవధతో కూడిన పురాణము భాగవతమని తెలుపబడినిది.

శ్లో|| యత్రాదికృత్య గాయ తీం వర్ణ్యతే ధర్మ విస్తరః

వృత్రాసుర వధోపేతమ్‌ త ద్భాగవత మిష్యతే.

అనగా ఏ పురాణమునందు గాయత్రి నధికరించి ధర్మ విస్తరము చేయబడి వృత్రాసురవధ చెప్పబడినదో ఆ పురాణము భాగవతమనబడును.

పంచమవేదము లనబడు భాగవతము, భారతము మొదలగు పురాణములు వేరార్థమును, భగవత్తత్త్వమును నిరూపించును. వీని యందు వృత్రాసురవధ యుండుటచేత భగవత్తత్త్వ ప్రతిపాదనకు వృత్రాసురవధకు గల సంబంధ మేమియో తెలిసికొనవలయును. తొలుత వేదమునగల వృత్రాసుర వధ సంకేతార్థమును భాష్యముల యందు ఎట్లు వివరించిరో పరిశీలింతము.

ఋగ్వేదము - వృత్రాసురవధ:-

ఋగ్వేదమునకు సాయణుడు భాష్యము వ్రాసెను. అందులో వృత్రాసుర వధ సంకేతార్థము క్రింది విధముగా చెప్పబడినది.

''దట్టముగా ఆవరించిన నల్లని మేఘమే వృత్రాసురుడు. ఇంద్రుడు మెఱపుతీగ అను వజ్రాయుధముతో మేఘ మనెడి వృత్రాసురుని ఛేదింపగా వర్షము కురిసెను.''

శ్రీ అరవిందులు 'On Veda లను గ్రంథములో సాయణుని భాష్యము కేవలము వైదిక కర్మకాండకు సంబంధించిన వివరణమే కాని దాని ఆధ్యాత్మ సంకేతమునకు వివరణము కాదని భావించెను. ఈ అభిప్రాయమునే శ్రీ కావ్యకంఠ గణపతిముని శ్రీ కపాలిశాస్త్రి సమర్థించిరి. పై వివరణలో నల్లని మేఘము రాక్షసుడుగను, మెఱుపు తీగ వజ్రాయుధముగను ప్రకృతిలోని విషయములకు రూపకల్పన చేయవలెను. ప్రకృతిలో జరుగు పై సంఘటన దేవతలు రాక్షసుల మధ్య జరుగు సంఘర్షణగా భావింపబడినది. అయినచో వేదము ప్రకృతిలోని సంఘటనలను కథారూపముగా వర్ణించినదిని భావింప వలసి యుండును.

"If Vritra and the waters symbalise the Could and the rain .................the Veda in a symbolism of natural phenomena personified is figures of Gods and Demons."

చారిత్రకులు పై కథను వేరొక విధముగా వ్యాఖ్యానించిరి. వృత్రాదులు హిందూదేశమున తొలుత నివసించుచున్న ద్రావిడుల దేవతా మూర్తులుగ భావించినచో ప్రకృతిని ఆరాధించడి ఆర్యులు ద్రావిడులపై జరిపిన దండయాత్రకు సంకేతముగా వృత్రాసుర వధ రచింపబడిన దనవచ్చును. ఇట్టి చారిత్రాత్మక కథ సాంకేతికముగా వ్రాయబడి యుండవచ్చును.

"If Vritras........are Dravidian Gods,.......the Veda is a poetical and legendary account of the invasion of Dravidia India by Nature worshipping A yans."

పై రెండు అభిప్రాయములు సత్యదూరములే. నిజమైన సంకేతార్థము లివికావు. ఆత్మజ్ఞాన ప్రకాశము అజ్ఞానాంధకారములకును, సత్యాసత్యములకును, విద్యా అవిద్యలకును, మృత్యువు అమృతత్త్వములకును మధ్య జరిగిన సంఘర్షణమునే వేదము సంకేతరూపమున కథగా వర్ణించినది.

"If on the other hand this is the symbolism of struggle between spiritual powers of Light and Darkness, Truth and Falsehood, knowledge & Ignorance. Death and Immortality, then that is the real sense of Veda"

పంచేంద్రియములచే బాహ్యవిషయములు గ్రహింపబడుచున్నవి. మనస్సుచే అనుభూత విషయములు తర్కింప బడుచున్నవి. ఇట్లు ఇంద్రియ మనస్సులయొక్క బాహ్యాభ్యంతర ప్రవృత్తుల సహాయమున భౌతిక రసాయనాది శాస్త్రములు వ్రాయబడినవి. వేద ఋక్కులు అట్లు వ్రాయబడలేదు. అవి ఇంద్రియములకు మనస్సునకు తర్కమునకు అతితములు. ''యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ'' అనగా వాక్కులకు మనస్సునకు అందరాని సమాధిస్థితిలో ఋషులు తాము దర్శించిన సత్యములను, వైఖరీవాక్కుతో ఋక్కులరూపమున ప్రకటించిరి. కావున వేదములను సామాన్యమానవుడు మానసిక తర్కముతో వ్రాయలేదు. అందులకే వేదములను అపౌరుషేయము లనిరి.

"The Rishi was not the individual composer of the hymns, but the seer (ద్రష్ట) of an eternal truth, an impersonal knowledge (అపౌరుషేయము). The language of Veda is Sruthi, a rythm not composed by intellect, but heard."

వేదకాలమున ఆర్యులు సత్యమును దర్శించుటకు తమ ఆంతరంగిక ప్రబోధము

(Intution) పై ఆధారపడిరి. ప్రస్తుతము భౌతిక రసాయనాది శాస్త్రములలోని సత్యములు, ప్రకృతి వరిశీలనముచేతను తర్కముచేతను (Inductive and Deductive logic introduced by Becon) నిర్ణయింపబడుచున్నది. తర్కమునకు లొంగని విషయములు శాస్త్రవిరుద్ధముగా పరిగణింపబడుచున్నవి. విశేషమేమనగా తర్కము భౌతిక రసాయనికశాస్త్రములకే పరిమితిచెంది యున్నదని గ్రహింపవలయును. మానసికమైన తర్క ప్రాబల్యమున వైదిక సత్యములను సాధింప వీలుపడదు. అవి ఇంద్రియములను మనస్సును అధిగమించిన (Transcendental meditation) సమాధిస్థితిలో దర్శింపబడినది.

అందులకే పోతన భాగవత పాఠకుల నిట్లు హెచ్చరించెను. విష్ణు లీలలను ''నామరూపముల్‌ దవిలి చరించు మానవులు తార్కిక చాతురి ఎంత గల్గియున్‌, మిగిలి కుతర్కవాదముల మేరలు మీరి ఎఱుంగ నేర్తురే?'' అనగా నామరూపాత్మకమైన జగతత్తును సత్యమని ఇంద్రియ మనోవృత్తులచే భావించెడి మానవుడు తర్క చాతుర్యమున ఆత్మదర్శనము పొందజాలడు.

ఋగ్వేదమున వృత్రాసురవధ ఆంగిరసులకథ అనునవి రెండు కథలు కలవు. ఈ కథలు అనేక పర్యాయములు ఋజ్మంత్రముల యందు మరల మరల చెప్పబడినవి. వీని సంకేతార్థము గ్రహించినచో ఋగ్వేద సంహిత అంతరార్థము గ్రహించినట్లే.

"They (the two stories) run through the hymns as two closely connected threads of symbolic imagery, and around them all the rest of Vedic symbolism is woven. Not that they are the central ideas but they are two main pillars of ancient (vedic) structure. When we determine their sense we have determined the sense of the whole Rik Samhitha."

వేదములు, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు, పురాణములు, సంహితలు - అన్నింటికి ఏకవాక్యత కలదు. (Unity in diversity) అన్నింటిలోను గల వృత్రాసురవధ కథ సంకేతార్థము ఒకటిగానే ఉండ వలయును కదా? వైదికపదములకు సంకేతార్థము కలదని నిర్ణయించుటకు భారతమే ఒక నిదర్శనము.

శ్లో|| అజో అగ్ని ర్వరుణో మేషః సూర్యో అశ్వ ఇతి దర్శనమ్‌

కుంజరాశ్చ మృగా నాగా మహిషా శ్చాసురా ఇతి

---భారతము - అనుశాసనిక పర్వము

అజ=అగ్ని : మేష=వరుణ; అశ్వ=సూర్య!

ఏనుగు, జింక. పాము, ఎనుము=అసురులు

కోళ్ళు, పందులు=రాక్షసులు

"The Cows are the rays of the dawn, the herds of the Sun and not Physical Cattle"

వేదమంత్రములకు మూడువిధములైన అర్థములను చెప్పవచ్చు నని శ్రీమధ్వాచార్యులు తెలిపిరి.

1) యజ్ఞ యాగాది కర్మలయందు క్రియా కలాపపరముగ (కర్మ)

2) భగవంతుని పొగడ్త, వర్ణ నపరముగ(భక్తి)

3) వేదమంత్రమునే దేవతగా భావించుట (జ్ఞానము)

వేదమంత్ర ఉచ్చారణతో చేయబడు యజ్ఞములయొక్క ప్రయోగ విధానములను బ్రాహ్మణములు వివరించెను. సాయణ భాష్యముకూడ ఇందులకే ఉపయోగింపబడినది (కర్మకాండ). వేదమంత్రముల అర్థమును పురాణాలు భగవంతునిపై భక్తి పరముగా వివరించెను. (భక్తి మార్గము). ఉపనిషత్తులు వేదమంత్రముయొక్క జ్ఞాన విమర్శనముగావించెను. కాబట్టి వైదికపదముల అర్థము కర్మ, భక్తి, జ్ఞాన పరముగ నిర్ణయింపవలయును.

యజ్ఞయాగాదు లొనరించుటవలన ఇంద్రుడు తృప్తి జెంది వర్షము కురింపించును. కావున సాయణుడు సూచించిన వృత్రాసురవధ సంకేతార్థము వైదిక కర్మపరముగా నున్న దనవచ్చును. భక్త రక్షణకై విష్ణువు రాక్షససంహార మొనర్చినట్లు ఇంద్రుడు వృత్రాసురుని జంపెనని భక్తి పరముగా వ్యాఖ్యానించవచ్చును. ఎందుకనగా ఋగ్వేదమున ఇంద్రుడే పరమదైవముగా చిత్రింపబడెను. కాని జ్ఞానపరముగా వృత్రశబ్ద సంకేతార్థము నిర్ణయించునప్పుడు మేఘమని కాని అసురుడని కాని తెలుప వీలుపడదు. యాస్కుడు మొదలగు నిరుక్తకారు లిట్టి పదములకు ధాతువునుబట్టి అర్థము గ్రహింపవలెనని తెలిపిరి. వృత్రశబ్దమునకు ''చుట్టుకొనునది'' ''మఱగుపరచునది'' (ఆవృతం = Encircle) అను అర్థమును చెప్పినఎడల ఆత్మజ్ఞానము అరిషడ్వర్గము లచే ఆవృతమై మఱుగుపడి యున్నదని ఈ క్రింది భగవద్గీత శ్లోకము సూచించుచున్నది. వృత్రాసురవధ సంకేతార్థము ఇంద్రియవృత్తుల నిరోధమేనని సూచించి ధృవపరచుచున్నది.

భగవద్గీతలో వృత్రాసురవధ:-

శ్లో|| ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా

కామరూపేణ కౌన్తేయ దుష్పూరే ణానలేనచ.

---గీత 3-39

కౌన్తేయ! జ్ఞానికి నిత్యశత్రువును, ఎప్పటికిని కోర్కె తీర నిదియును, కోరికలే స్వభావముగా గలదియును అగు కామముచే జ్ఞానము (ఆవృతం) చుట్టుకొనబడినది.

పై శ్లోకమున ''ఆవృతం'' అను పదము గమనింపదగినది. ఈ పదమె వృత్రాసుర కల్పనకు మూలము.

శ్లో|| ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్ఠాన ముచ్యతే

ఏతై ర్విమోహయ త్యేష జ్ఞాన మావృత్య దేహినమ్‌.

---గీత 3-40

కామమునకు ఆశ్రయము లెవ్వి? ఇంద్రియములు, మనస్సు, బుద్ధి - ఈ మూడు కామమునకు ఆశ్రయములు. కామము ఇంద్రియములచేత జ్ఞానమును మఱగు పరచి నా నా విధములుగ మోహ పెట్టు చున్నది. పై శ్లోకమున ''ఆవృత్య'' అను పదము గమనింపదగినది.

శ్లో|| తస్మాత్వ మింద్రియా ణ్యాదౌ నియమ్య భరతర్షభ!

పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశకమ్‌||

గీత 3-41

అర్జునా! అందువలన నీవు మొదట ఇంద్రియముల నిగ్రహించుము. పాప స్వరూపమును. శాస్త్రానుభవ జ్ఞాన నాశకమగు కామమును విడువుము.

శ్లో|| ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరమ్‌ మనః

మనసస్తు పరా బుద్ధి ర్యో బుద్ధేః పరతస్తు సః

---గీత 3-42

స్థూలదేహముకంటె ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటె మనస్సు గొప్పది. సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు కంటె నిశ్చయాత్మకమైన బుద్ధి గొప్పది. బుద్ధికంటెను పరమాత్మ గొప్పవాడు.

శ్లో|| ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్త భ్యాత్నాన మాత్మనా

జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్‌.

--గీత 3-43

మహాబాహూ! బుద్ధికంటె శ్రేష్ఠమగు ఆత్మను తెలిసికొని, ఆత్మచేత బుద్ధిని, బుద్ధిచేత మనస్సును, మనస్సుచేత ఇంద్రియములను జయించి సమస్త దుఃఖములకు కారణమను శత్రువును జయించుము.

వై గీతా వాక్యములవలన జ్ఞానము ఇంద్రియాధిష్ఠమైన కామముచే ఆవృత్తమైనదనియు. ఇంద్రియ మనో నిగ్రహములచే కలిగిన నిశ్చయాత్మక బుద్ధివలన జ్ఞానమును పొందవచ్చుననియు, సూచింపబడినది. కావున ఇంద్రియ మనోవృత్తులే వృత్రాసురుడు. ఆ వృత్తుల నిరోధమే జ్ఞాన సాధన మార్గము.

శ్లో|| ''సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ''

అను భగవద్గీత యందలి వాక్యములో ''ధర్మ''శబ్డమునకు ఇంద్రియ మనోధర్మములు లేక కోరికలని కుర్తాలం స్వాములవారు వ్యాఖ్యానించిరి. అన్ని కోరికలు వదలి నన్ను శరణు వేడుమని పై శ్లోకార్థము. ఇంద్రియార్థములే మన కోరికలు. కామమే వీని మూలము. దానివలన క్రోధ లోభ మద మాత్సర్యము లేర్పడును. ఇంద్రియ మనోనిగ్రహమే రజస్తమోగుణ పరిహారియగు భాగవత భక్తి. ఇంద్రియ మనోవృత్తుల నిగ్రహమే వృత్రాసురవధకు సంకేతము.

పరాశర సంహితలో వృత్రాసుర వధ:-

పంచముఖ హనుమత్‌ స్తోత్రము, దాని ప్రయోజనమును తెలుపు నపుడు, పరాశర సంహితయందు వృత్రాసుర ప్రసక్తి వచ్చినది.

ఇంద్రుడు వృత్రునితో పోరజాలక తనచేతనున్న వజ్రాయుధమును జారవిడచి మూర్ఛ నొందెను. ఇది గమనించిన దేవగురువైన బృహస్పతి ఇంద్రుని మేల్కొల్పి పంచముఖ హనుమత్‌స్తోత్రము నుపదేశించెను. దాని ప్రభావముచే ఇంద్రుడు సత్వవంతుడై వజ్రాయుధముచే వృత్రుని సంహరించెను. పై విధముగా మైత్రేయునకు శ్రీపరాశరమహర్షి వృత్రాసుర కథను తెలిపి పంచముఖ హనుమత్‌ స్తోత్ర పఠన ఫలమును ఇట్లు తెలిపెను.

శ్లో|| పఠంతి యే స్తోత్ర మిదం పవిత్రం

జిగీషవ స్తే7రిజయం ప్రయాతి

అస్మాక మంత ర్ద్విషతా మపేక్షయా

హనూమత స్తోత్ర బలాదభూత్‌ పురా||

అనగా శత్రుజయమును కోరువారికి బృహస్పతి ఉపదేశించిన పంచముఖ హనుమత్‌ స్తోత్రమును పఠించినచో శత్రుజయము సిద్ధించును. విశేషమేమనగా పరాశరుడు పూర్వము ఈ హనుమత్‌ స్తోత్రపఠన బలమువలన కామ క్రోధ లోభ మద మాత్సర్యములను అంతః శత్రువులను జయింపగలిగెను. అనగా వృత్రాసురవధ కుపయోగపడిన హనుమత్‌స్తోత్రమే అరిషడ్వర్గ జయమున కుపయోగపడి, ఇంద్రియ మనోనిగ్రహములకు దారిదీసినదని చెప్పవీలగుచున్నది కదా? అంతః శత్రునాశ##మే వృత్రాసురవధ రూపమున సాంకేతికముగా చెప్పబడిన దనుట నిర్వివాదాంశము.

భారతములో వృత్రాసురవధ:-

సంస్కృత భారతమున అశ్వమేధ పర్వమున వృత్రాసుర వధ చెప్పబడినది.

శ్లో|| తతో వృత్రం శరీరస్థం జఘాన భరతర్షభ!

శతక్రతు రదృశ్యేన వజ్రేణ తీ హనః శ్రుతమ్‌

శరీరస్థుడగు వృత్రుని ఇంద్రుడు అదృశ్యమగు వజ్రాయుధము చేత సంహరించెను. వ్యాసుడు వృత్రాసురవధను గూర్చిన సంకేతార్థమును తాను ఋషులవద్ద గ్రహించెనని ధర్మరాజుతో చెప్పెను. ఇదియే ''చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ'' అని ప్రహ్లాదుడు చూచిన మర్మము.

''The Mahabharatha also says that the whole legend of Vritra is a secret" - Aravindo.

ఆంధ్రభారతము ఈ వృత్రాసురవధ సంకేతార్థమునుక్రింది విధముగా సువ్యక్తము చేయుచున్నది.

''ధర్మరాజు బంధువిషయ శోకంబునన్‌ గ్రమ్మఱన్‌ దెలివి నందియు, నొందక ధూమంబు పొదివిన యనలంబునుం బోలెనున్న పాండవాగ్రజున్‌ గనుగొని కమలనాభుండు.

సీ|| ఆవని ఎల్లను వృత్రు డాక్రమించి తదీయ

గుణమగు గంధంబు గొనిన, వజ్రి

వానిపై వజ్రంబువైవ, గ్రమంబున

నంబు తేజః పవనాంబరముల

యందు బ్రవేశించి, యందుల రసరూప

సంస్పర్శ శబ్దముల్‌ చండ విక్ర

ముండై యతడు సముద్ధత గొనగొని

దోడ్తోడ నమ్మహేంద్రుడు గులిశ

ఆ|| నిహతి వెలువరింప, నిర్భరవేగుడై

నతనిలోన జొచ్చె నసుర, దాన

మూర్ఛవోయె దివిజ ముఖ్యుడు, బోధితు

జేసె మంత్రవిధి వశిష్ఠు డతని.

ఇట్లు వశిష్ఠ ప్రయుక్త మంత్ర శక్తిం బ్రబుద్ధుండై వృత్రునదృశ్యంబైన వజ్రంబున వధియించె, నవ్వాసవుండీ ధర్మరహస్యంబు తెఱుంగు మునుల కెఱింగించె, మునులు నాకుం జెప్పిరి. మానవేశ్వర దీనిని నీవు తెలిసికొనుము.'' అని వ్యాసుడు తెలపెను.

తొలుత వృత్రుడు ప్రపంచమునందలి పంచభూతముల నాక్రమించి శబ్ద స్సర్శ రూప రస గంధములను గ్రహించెను. ఇంద్రుడు వజ్రాయుధముచే వృత్రుని వానినుండి వెలువడునట్లు చేసెను. అంతట వృత్రుడు ఇంద్రుని దేహమునందు ప్రవేశించెను. త్వక్‌ చక్షు శ్రోత్రజిహ్వా ఘ్రాణములనెడి పంచేంద్రియముల యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధముల నాక్రమించెను. అంత ఇంద్రుడు మూర్ఛపోయెను.

వశిష్ఠు డతనిని మేల్కొల్పి మంత్రోపదేశ మొనర్చెను. ఇంద్రుడు మంత్రశక్తిచే ప్రబుద్ధుడై వృత్రుని అదృశ్యంబైన వజ్రముచే వధించెను. వృత్రుడు పంచేంద్రియములలో ప్రవేశింపగా. ఇంద్రుడు మంత్రశక్తిచే ప్రబుద్ధుడై ఇంద్రియ వృత్తుల నిరోధించెనని భావము. ఇంద్రియములు స్థూలదేహము తమోగుణము వలన జనించినవి. మనో విక్షేపము రజోగుణము వలన కలిగెను. ఇంద్రయవృత్తి నిరోధమే తమోగుణ పరిహారము. మానవుడు ఇంద్రి యార్థముల వెంటబడి సంసార బద్ధుడగును. ఇంద్రియార్థములకు మూలము కామము. దాని నుండి క్రోధలోభమద మాత్సర్యాది అంతః శత్రువులు ఏర్పడినవి, ఇంద్రియముల నిగ్రహించి అంతః శత్రునాశనము చేయగలిగిన శాంతి లభించును. కామాద్యరిషడ్వర్గ లయమే శాంతి. బంధుశోక విషయ మెవ్విధంబునను బాయకపోవుటచేత ధర్మరాజునకు శోకము కలిగి శాంతి చేకూర దయ్యెను. అతని శోకము బావుటకై శాంతిని చేకూర్చు టకై వృత్రాసురవధ కథ చెప్పబడినది.

ధర్మరాజు బాహ్య శత్రువులైన కౌరవులను మాత్రమే జయించెను. బాహ్య శత్రువుల జయించుట కంటె అంతః శత్రువుల జయించుటయే (అనగా ఇంద్రియముల నిగ్రహించి కామా ద్యరిషడ్వర్గముల జయించుటయే) కష్టతరమని వ్యాసుడు తెలిపెను.

క|| వెలి పగఱ గెలుపు గెలుపే

యల ఘముతిన్‌ గెలువ వలయు నభ్యంతర శ

త్రుల దద్విజయము మోక్షము

నలువఱుపం జాలు, నొంట నమ్మేలగునే

అంతః శత్రుజయమే మోక్షప్రదము. అదియే నిజమగు గెలుపు. బాహ్య శత్రువుల జయించుట గొప్పవిషయము కాదు.

క|| విను మంతశ్శత్రువులలో

ఘనుడగు కాముడు, నిరస్త కామంబగు వ

ర్తనము విరల, మధ్యయన య

జన దానంబులును గామ సహితములు గదా?

అరిషడ్వర్గములలో కామము బలవత్తరమైనది. కామ రహిత మైన వర్తనమే శ్రేష్ఠము. యజ్ఞము దానము మొదలగునవి కామ సహితములు.

పై కామమునకు ఆశ్రయము పంచేంద్రియములు మనస్సు బుద్ధి లని భగవద్గీతలో తెలుపబడినది.

శ్లో|| ''ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాదిష్ఠాన ముచ్యతే''

ఇంద్రియార్థముల గోరియే మానవుడు సంసార మగ్ను డగు చున్నడు. ఇంద్రియముల వశపరచుకొని కోరికల నాపువాడే స్థిత ప్రజ్ఞుడు.

శ్లో|| తస్మా దింద్రియా ణ్యాదౌ నియమ్య భరతర్షభ!

''నీవు ఇంద్రియముల తొలుత నియమింపుమని అర్జునునకు శ్రీకృష్ణు డుపదేశించెను.

క|| విను పెక్కులేల, కోరిక

మనమున జొరనీయకున్న మడియును గాముం''డు. భారతము మార్కండేయ పురాణములో వృత్రుని గూర్చియు, పాండవులనుగూర్చి ఇట్లు చెప్పబడినది. పంచ పాండవులు ఇంద్రునిలోని భాగములే అయినను వేరువేరు దేవతలకు జనించిరని తెలుపబడినది. ఇంద్రుడు త్వష్ఠకుమారుని వధించుటచేత అతని తేజస్సు ధర్మదేవతను ప్రవేశించెను. తరువాత ఆ త్వష్టకుమారుడే వృతుడుగా జన్మించి మరల ఇంద్రునిచే చంపబడెను. ఇప్పుడు ఇంద్రునితేజస్సు మరుత్తునందు ప్రవేశించెను. తరువాత ఇంద్రుడు అహల్యను కామించుటచేత అతని సౌందర్యము అశ్వినుల ప్రవేశించెను.

ధర్మదేవత, మరుత్తు, అశ్విమలు తాము గ్రహించినవి తిరిగి ఇంద్రున కిచ్చిరి. అందువలన ధర్మరాజు. భీముడు, నకులుడు, సహదేవుడు జన్మించిరి. అర్జునుడు ఇంద్రుని సగము తేజస్సుచే జన్మించెను. వీరందరు ఇంద్రుని అంశ##లే కాబట్టి ద్రౌపది ఆ ఐదుగురిని వివాహమాడుటలో దోషము లేదు.

The Maha Bharatha, a History and a Drama by Rai Promothanath Mullick Bahadur.

వజ్రాయుధ సంకేతము:-

ఇంతవరకు ఇంద్రియ వృత్తుల నిరోధమే వృత్రాసురవధయని గ్రహించితిమి కదా? ఇంద్రుడు వజ్రాయుధముతో వృత్రుని సంహరించె ననుటలో వజ్రాయుధ సంకేతార్థమేమి? వజ్రాయుధము దధీచి మహర్షి వెన్నెముక గదా? వెన్నెముకను వజ్రాయుధ మనుటలో విశేష మేమి?

పూర్వము వృత్రాసురుని బాధల కోర్వలేక ఇంద్రాది దేవతలు శ్రీమన్నారాయణుని శరణువేడిరి. వారల రక్షించుటకై భగవంతుడు దధీచి మహర్షి వెన్నెముకను ఆయుధముగ నుపయోగించిన వృత్రాసురుని జయింపవచ్చునని తెలిపెను. నారాయణ కవచ పారాయణ ముచే దధీచి మహిమోపేతు డయ్యెను. దేవతలు దధీచిని వెన్నెముక నివ్వమని కోరగా అతడు యోగమార్గమున దేహత్యాగ మొనర్చెను. దేవతలు ఆతని వెన్నెముకను గ్రహించిరి. ఇంద్రుడు దానిని వజ్రాయుధముగా ధరించి వృత్రుని వధించెను.

దేవతలు రాక్షసులు అనగా నెవరని తెలిసికొని తరువాత వజ్రాయుథ సంకేతమును పరిశీలింతము. ఛాందోగ్యములో ''దేవాసురాహవై యత్ర సంవేతరే'' అను వాక్యమునకు శంకరుని వ్యాఖ్యానము గమనింపుడు.

దేవాః = దీవ్యతే ద్యోతనార్థస్య శాస్త్రోద్భాసిత బుద్ధి వృత్తయః.

అసురా = స్త ద్విపరీతాః

సంగ్రామకృతవంతః

శాస్త్రీయ ప్రకాశ వృత్యభి భవనాయ ప్రవృత్తాః

స్వాభావిక్య స్తమోరూపా ఇంద్రియ వృత్తయో అసురాః

తథాతద్విపరీతాః శాస్త్రార్థ విషయ వివేక జ్యోతిరాత్మనో దేవాః స్వాభావిక తమోరూపా సురాభి భవనాయ ప్రవృత్తాః ఇత్యన్యో న్యాభి భవోద్భవ రూపః సంగ్రామ ఇవ సర్వప్రాణిషు ప్రతి దేహ దేవాసుర సంగ్రామో7నాది కాలప్రవృత్త ఇత్యభిప్రాయః

శాస్త్రోద్భాసిత సాత్విక బుద్ధి వృత్తులు దేవతలు. భాగవతము నందు దేవతలనగా''ఆమ్నాయ విహిత కర్మాచారములు గల్గి తివుటమై నర్తించు దేవగణము '' భాగవతము 3-887 అని శాస్త్రవిహిత కర్మా శరణముగలిగి వర్తించు వారే దేవతలని చెప్పబడినది.

తమస్సు రజస్సు రూపములైన ఇంద్రియ మనః ప్రవృత్తులే రాక్షసులు, అసురులు దేవతలసంపదను (రాక్షసులు) హరింపజూతురు. ప్రతి దేహమునందును సాత్త్విక వృత్తులకును (దేవతలకును) తామస రాజస వృత్తులకును (రాక్షస అసురులకును) మధ్య అనాదిగా యుద్ధము జరుగుచునే యున్నది. దేవాసురు లిద్దరు ప్రజాపతి నుండియే పుట్టిరి. అనగా మనస్సు నుండియే పుట్టిరి. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున (దేహమున) జరిగిన కౌరవ పాండవ యుద్ధమిట్టిదే. పై శంకర వ్యాఖ్యానము వలన వృత్రాసురు డనగా ఇంద్రియ వృత్తులని తెలియుచున్నది కదా? ఈ ఇంద్రియ వృత్తులు అదృశ్య వజ్రాయుధముచేత ఎట్లు నిరోధింపబడినవి?

బ్రహ్మదండి యనబడు వెన్నెముక యందు సుషమ్నానాడి కలదు. దానిలో షట్చక్రములున్నవి. మూలాధారము నుండి భ్రూమధ్యమువరకుగల నాడిని అధః కుండలిని యందురు. మూలాధారము నుండి భ్రూమధ్యము వరకు కుండలినీ శక్తిని ప్రభోదించినవారు రజస్తమోగుణముల జయించి ఇంద్రియ మనోనిగ్రహముల సాధింపగలరు. భ్రూమధ్యమున అజ్ఞాచక్రము కలదు. ఇది గాయత్రికి స్థానము. ఇచట ఇడా పింగళ సుషుమ్నా అను మూడు నాడులు కలియుటచేత ఈ స్థానమును త్రికూట స్థానమని యందురు. ఇచటనుండి సహస్రారమువరకు ఊర్ధ్వకుండలిని వ్యాపించినది. దీనిని సాధించిన ఆవరణము సత్వగుణము నశించి మోక్షము లభించును. ఇంద్రియ మనో నిగ్రహములను సాధించుటకు వెన్నెముకలోని సుషుమ్నానాడి యందలి అథః కుండలిని సాధించవలెను. కాన ఇంద్రియ వృత్తులైన అసురులను నిగ్రహించుటకు వెన్నెముకయే సంకేతముగా వజ్రాయుధ రూపమున చెప్పబడినదని అనవచ్చును కదా.

అప్రస్తుతము కానిచో ఒక విషయము తెలుపుదును. భ్రూమధ్యమును వారణాసి అందురు. వారణ = ముక్కు; అసి = కొన అని అర్థము. నాసికాగ్రమే భ్రూమధ్యస్థానమని శ్రీకృష్ణుడు ఉత్తర గీతలో నిరూపించెను. వారణాసి లేక కాశియందు మరణించినవారికి శివుడు బ్రహ్మ తారక ముపదేశించి మోక్ష మొసగునని ప్రతీతి. కాని త్యాగరాజు తన పాటయందు ''గోచిలో పాపము గట్టుకపోయిన కాశి రక్షించునె త్యాగ రాజనుత'' అని తెలిపెను. అనగా ఇంద్రియ మనోనిగ్రహము లేనివాడు (వారణాసి = ముక్కుకొన వరకు అధః కుండలిని సాధించినవాడు). రజోగుణము తమోగుణములను బాయనివాడు, కాశిలో మరణించినను శివుడు బ్రహ్మోపదేశ మొనరింపడని భావము. ఇడా పింగళా సుషుమ్నానాడులు లేదా గంగా యమునా సరస్వతులు కలసిన స్థానమే త్రికూటము లేదా కాశి. ''నమో గంగా యమునయో ర్మధ్యే ఏ వసంతి తేమే ప్రసన్నాత్మానః చిరం జీవితం వర్థయంతి'' అని గంగా యమునల మధ్యప్రదేశమున గల ఋషులు మమ్ములను చిరంజీవులగా ఆశీర్వదించురుగాక యని సంధ్యా వందనములో చెప్పికొనుట అధః కుండలిని జయించిన ఋషుల మమ్మాశీర్వదింతురు గాక యని అర్థము.

శ్రీ మహా భాగవతములో వృత్రాసుర వధ:-

భాగవత కథలో వృత్రాసుర పూర్వజన్మ వృత్తాంతము కూడ చెప్పబడియున్నది. ఈ కథ ఇంద్రియ జయమే వృత్రాసుర వధ సంకేతమని నిస్సంశయముగా నిరూపించు చున్నది. (దేవీ భాగవతములో కథ వేరు విధముగా నున్నది. )

శూరసేన దేశమునకు భర్తయైన చిత్రకేతుడను రాజు అనవత్యుడై యుండి అంగిరసుడను ముని అనుగ్రహము వలన సుతుని బడసెను. రాజునకు అనేకభార్యలుండిరి. ఈర్ష్యచెందిన కొదరుభార్యలు ఆ కుమారునకు విషమును బెట్టించి చంపించిరి. చిత్రకేతుడు అతని పట్టపురాణి, పుత్ర వియోగబాధకు విలపించుచుండ, ఆంగిరస మునియు నారదుడు చనుదెంచి వేదాంత వాక్యముల వైరాగ్యమును బోధించి వారి దుఃఖోపశమనము గావింప ప్రయత్నించి విఫలులైరి. తుదకు మృత బాలుని తిరిగి బ్రతికించిరి. కాని ఆ బాలుడే జనన మరణ క్లేశముల మరలమరల బొందజాలనని చెప్పి తోడనే మరణించెను. చిత్ర కేతుడు విగత శోకుడై నారదునిచే మంత్రోపదేశమును బొంది సప్త వాసరములు శ్రీహరిని ధ్యానించెను.

చ|| మది నొకయింత మాత్రన సమంబుగ చేయుచు, బాహ్యవర్తనం

గదిసిన ఇంద్రియంబుల నొకంతకు దెచ్చి, మనంబు వాక్కునున్‌

గుదురుగ దోచి, తత్త్వమున గూర్చుచు, శాశ్వత విగ్రహంబునా

సదయు, బ్రశాంతు, లోకగురు సన్నుతిసేయ దొడంగె నిమ్ములన్‌

భాగవతము - 6- 468

అతని ఇంద్రియము లీశ్వరపరములై మదినిశ్చల వృత్తిని పొందెను. ఇట్టి తపముచే నతడు విద్యాధర పదవిని పొందెను.

విధ్యాధరుడైన చిత్రకేతుడు విమానమున విహరించుచు, కైలాస ప్రాంతమున కేగెను. అందు ''బ్రహ్మేంద్రాది సుర నికర సేవితుండై యూరు పీఠముననున్న భవానిం గౌగిటం జేర్చికొని యొడ్డోలగంబున నున్న పరమేశ్వరు జూచి'' అనగా బ్రహ్మ ఇంద్రుడు మహర్షులున్న సభయందు పార్వతిని తొడపై గూర్చుండ బెట్టుకొని కౌగలించుకొని యున్న శివుని జూచి '' చిత్రకేతుడు పకపకనగి యద్దేవి వినుచుండ నిట్లనియె.

సీ|| కొమరొప్పగా లోకగురుడును గడలేని

ధర్మస్వరూపంబు దాన యగుచు

జడలు ధరించియు సరిలేని తపమున

బొడవైన ఈ యోగి పుంగవులును

బ్రహ్మనాదులు గొల్వ భాసిల్లు కొలువులో

మిథున రూపంబున మెలత తోడ

బ్రాకృతుండును వోలె బద్ధాసురాగుడై

లాలితుండయ్యె నిర్లజ్జత నిట

ఆ|| అకట ప్రకృతి పురుషుడైన దా నేకాంత

మందు సతులతోడ నలరు గాని

యిట్లు ధర్మసభల వింతులతో గూడి

పరిఢవింప లేడు భ్రాంతి నొంది.

భాగవతము-489

అనగా శివుడు బ్రహ్మవాదులున్న కొలువులో సతి నాలింగనము చేసికొని కూర్చుండుటకు కారణము ఈశ్వరునకు ఇంద్రియ నిగ్రహము లేకపోవుటయే నని చిత్రకేతుడు భావించెను. తనకు ఇంద్రియ నిగ్రహము కలదని తాను గర్వించెను.

ఇట్లు తన పూర్వకర్మ విశేషంబున ఇంద్రియ జయుండనని పుట్టిన అహంకారమంబున జగద్గురువుం బెక్కు ప్రల్లదము లాడుచున్న చిత్రకేతుం జూచి భవాని ''నీవు రాక్షసుడవై పుట్టు'' మని శపించెను. (భాగవతము 6-491) పై కథలో ఇంద్రియ జయములేని చిత్రకేతుడే వృత్రాసురుడుగా జన్మించెనని నిస్సంశయముగా తెలుపబడి యున్నది. గమనింపుడు.

పూర్వము ఇంద్రుడు విశ్వరూపుడను బ్రాహ్మణుని వలన నారాయణ కవచము నుపదేశము బొంది అతనిని గురువుగా స్వీకరించి యజ్ఞమున అతనికి హవిర్భాగము లొసగుచుండెను, విశ్వరూపునకు మూడు తలలుండెను. అతడు యజ్ఞ భాగముల గ్రహించి రహస్యముగా రాక్షసుల కందజేయుటను ఇంద్రుడు తిలకించి, కోపించి, గురువని లెక్కసేయక, అతని మూడు తలలను ఖండించెను. బ్రాహ్మణ హత్యవలన అతనిని బ్రహ్మహత్యా పాతకము భాదింపగా ఆ దోషమును భూజలవృక్ష స్త్రీలకు పంచి పెట్టెను.

విశ్వరూపుని తండ్రియగు త్వష్ట తన పుత్రుని చావునకు కోపించి ఇంద్రునిపై మారణ హోమము జరిపెను. పార్వతిచే శాపోవహతుడైన చిత్రకేతుడు వృత్రాసురుని రూపమున హోమగుండమున ఆవిర్భవించి ఇంద్రునిపై దండెత్తి పోయెను. ఇంద్రుడు దధీచి వెన్నెముకను వజ్రాయుధముగా గైకొని వృత్రుని సంహరించెను.

రహస్య మేమనగా ఇంద్రియ మనంబులను నిగ్రహింపక చేయునాత్మానాత్మ విచారము కేవల వాచా వేదాంతమే యగును. దానివలన ఆత్మానుభూతి కలుగును. అందులకే రమణమహర్షి

క|| ''ఏ సిద్ధియు లేదు విజిజ్ఞాసువునకు శాస్త్రచర్చ సలుపుట

మాత్రన్‌ వీసంబే'' అన్నాడు.

ఆత్మానాత్మ విచారమునకు అర్హత కావలయుననియు తెల్పిరి.

క|| తనువు నశియించునను బు

ద్ధిని, విషయమ్ముల నెడ గడిరిన విరాగ

మ్మున--గుఱుతుల నీరెంటను

తమ నధికారిగ నెఱుగుదగు నిక్కముగన్‌ -రమణగీత

విషయముల ఎడ విరాగము ఇంద్రియ మనో నిగ్రహముచేతనే కలుగును. అప్పుడు ఆత్మానాత్మ విచారమున కర్హుడగును. పై వివరణమువలన వృత్రాసురవధ ఆత్మసాక్షాత్కారమునకు ఎంత ఆవశ్యకమో విశదమైనది కదా?

కేవల తర్కబలముచేత వాదించి బ్రహ్మజ్ఞానమును పొందుటకు వీలు కాదనుటకు నిదర్శనమును ఉమర్‌ ఖయ్యాము రుబాయతులు సూచించుచున్నవి. ఖయ్యాము పండితుడు, జ్యోతిశ్శాస్త్రవేత్త, వాదోపవాదముల చేయగల సమర్థుడు. కాని అతనికి ఆత్మానుభూతి కలుగ లేదు. సంశయములు తీరలేదు.

Myself when young did eagerly frequent

doctor and saint and heard great argument

about if and about, but ever more

Came out by the same door as in I went.

There was the door to which I found no key

There was the Veil through which I could not see

Some little talk a while of Me and Thee

There was - and then no more of Thee and Me.

అతనికి మాయ, అజ్ఞానము తొలగి సత్యము గొచరించలేదు. కాబట్టి వృత్రాసురవధ జరిగినగాని ఆత్మానుభూతి కలుగదు. సంశయములు తీరవు. ఇంద్రియములచేతను, మనస్సుచేతను భూతిక సత్యములే గోచరించును. కాన పారమార్థిక సత్యములు ఇంద్రియ మనంబుల నధిగమించినగాని Transeendental meditation వృత్రాసురవధ జరిగినగాని గోచరింపవు.

ఇంద్రియాధిష్ఠాన దేవత ఇంద్రుడని భావించిన యెడల ఇంద్రుడు వజ్రాయుధమను కుండలినీ శక్తిచే వృత్రాసురుని సంహరించెను లేదా ఇంద్రియవృత్తుల నిరోధింప గలిగెనని సంకేతము. కావున వృత్రాసురవధ సంకేతము ఆవశ్యకత తెలియవచ్చినది కదా?

Sri Bhagavadgeetha Madanam-2    Chapters