Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

20. బ్రహ్మ శ్రీకృష్ణుని పరీక్షించి

పరమాత్మగా తెలిసికొనుట

బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని విచిత్రమైన లీలలు విని, అతనిని పరీక్షింపదలచెను. గోవులను, గోపకులను మాయచేసి ఒక గుహలో దాచియుంచెను. శ్రీకృష్ణుడిది బ్రహ్మచేసిన పనిగా గ్రహించి గోవుల గోపకుల రూపములను తానే పొంది ఒక సంవత్సరము విహరించెను. ఋషుల అంశమున గోవులు పుట్టెననియు, దేవతల అంశమున గోపకులు జన్మించిరనియు బలదేవునకు ముందుగనే తెలియును. కాని ఇప్పుడు గోవులందును గోపకులందును అతనికి శ్రీకృష్ణుడే అగుపించు చుండెను. ఈ సందేహము శ్రీకృష్ణునకు దెలుపగా అతడు బ్రహ్మచేసిన పరీక్ష బలదేవునకు దెలిపెను.

ఒక సంవత్సరము గడచిన తరువాత బ్రహ్మ తిరిగివచ్చి తాను గుహయందు దాచిన గోవులు గోపకులు సుప్తులై యుండుట తిలకించెను. కాని, మందలో ఆ రూపములేగల గోవులు గోపకు లుండుటజూచి అశ్చర్య చకితుడయ్యెను. సృష్టికర్తయైన తాను గాక వేరొక సృష్ఠి యొనర్చు బ్రహ్మ ఎక్కడనుండి వచ్చెనని ఆలోచింప దొడగెను.

శ్రీకృష్ణుడు డిదిగాంచి తన మాయను ఉపసంహరించెను. బ్రహ్మ శ్రీ కృష్ణుడని మహాత్మ్యమును గుర్తించి తాను రజోగుణసంభవుడనియు, మూఢుడనియు విన్నవించి క్షమింపుమని వేడెను.

పై కథవలన శ్రీకృష్ణుడు మానవ మాత్రుడు కాదు, లీలా మానుష విగ్రహుడైన పరబ్రహ్మమూర్తియని తెలియుచున్నది.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters