Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

11. నారదుని పూర్వజన్మ వృత్తాంతము

భాగవతము వ్రాయుటకు కారణము

కలికాలమున మానవులు మందప్రజ్ఞులని భావించి వ్యాసుడు ఒకటిగానున్న వేదమును ఋగ్యజుస్సామాధర్వణములను నాలుగు వేదములుగా విభజించెను. స్త్రీ శూద్రుల నిమిత్తము భారతమును రచించి వేదార్థములను దెలిపి స్త్రీ శూద్ర ముఖ్య ధర్మములను వివరించెను. ఇట్టి భూతహిత మొనర్చియు వ్యాసుని ఆత్మ సంతస మందలేదు. శాంతి లభింపలేదు. తన బాధను నారదునకు విన్నవించి కారణమును తెలుపుమని కోరెను. అనుభవజ్ఞానముతో నారదు డిట్లు వివరించెను.

ఉ|| అంచితమైన ధర్మచయ మంతయు జెప్పితి వందులోన నిం

చించుకగాని విష్ణుకథ లేర్పడ జెప్పవు, ధర్మముల్‌ ప్రపం

చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినగాక, నీకు ని

కొంచెము వచ్చుటెల్ల హరి గోరి నుతింపమి నార్యపూజితా!

మ|| హరినామస్తుతిసేయు కావ్యము సువర్ణాం భోజ హంసావళీ

సురుచి భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్‌ వెలుంగొందు, శ్రీ

హరి నామస్తుతి లేని కావ్యము విచిత్రార్థా న్వితం బయ్యు శ్రీ

కరమైయుండ దయోగ్య దుర్మలిన వత్కాకోల గర్తా కృతిన్‌

భాగవతము 1-95, 96

(పై పద్యములో సువర్ణాంభోజము లనబడు షట్చక్రములందు, ప్రాణవాయువు హంస రూపమున చరించి ప్రాణాపానములు సమాన మైనపుడు నిశ్చలముగానున్న సరోవరమువలె మనస్సు విక్షేపము లేక యుండునని స్ఫురించు చున్నది కదా.)

మ|| అపశబ్దంబుల గూడియున్‌ హరిచరి త్రాలాపముల్‌ సర్వపా

ప పరిత్యాగము సేయు, గావున హరిన్‌ భావించుచున్‌ బాడుచున్‌

జపముల్‌ సేయుచు వీనులన్‌ వినుచు నశ్రాంతంబు గీర్తించుచున్‌

దపసుల్‌ సాధులు ధన్యులౌదురు గదా తత్త్వజ్ఞ! చింతింపుమా

భాగవతము 1-97

''నిరత కర్మంబై నిరుపాధికంబైన జ్ఞానము హరిభక్తి లేకున్న విశేషంబుగ శోఖితంబుగాదు. - భాగవతము 1-98

భక్తిలేని కర్మలుగాని జ్ఞాని వాక్యములుగాని నిరర్థకములు. నిఖిల బంధ మోచనమునకు, శ్రీహరి లీలావిశేషముల వర్ణింపుము. కుల ధర్మముల ననుష్ఠించుట వలన మోక్షము సిద్ధింపదు. శ్రీహరి పద పద్మసేవయే మోక్షప్రదము. సుఖ దుఃఖములు ప్రాప్తించినను హరి సేవ విడువరాదు.

చ|| తన కుల ధర్మమున్‌ విడచి దానవవైరి పదారవిందముల్‌

పనివడి సేవసేసి పరిపాకము పొందక నెవ్వడేని జ

చ్చిన మఱుమేననైన నది సిద్ధి వహించు దదీయసేవ బా

సిన గుణధర్మ గౌరవము సిద్ధి వహించునె ఎన్ని మేనులన్‌

అని బోధించెను. భాగవతము 1-100

నారదునకు పూర్వజన్మ జ్ఞానముండుటచేత తన అనుభవముతో చెప్పగలిగెను. తొల్లిటి జన్మమున నారదుడు వేదవాదుల ఇంట దాసి పుత్రుడై జన్మించెను. ఆ భాగవతులు చాతుర్మాస్యము ననుష్ఠించు నపుడు, నారదుడు వారికి పరిచర్యచేసి వారుచెప్పిన శ్రీకృష్ణ చరితము వినెను. తానుకూడ హరిసేవ యొనర్చి తన అనుభవము నిట్లు తెలిపెను.

''ఇట్లు హరిసేవా నిరతింజేసి ప్రపంచాతీతుండనై బ్రహ్మ రూపకుండనైన నాయందు స్థూల సూక్ష్మంబైన ఈ శరీరంబు నిజమాయా కల్పితంబని యమ్మహాత్ములగు యోగిజనుల మూలంబున రజస్తమో పరిహారిణి యయిన భక్తి సంభవించె. భాగ-1-108

ఏనును వారి యుపదేశంబున వాసుదేవుని మాయానుభవంబు దెలిసితి, నీశ్వరుని యందు సమర్పితంబయిన కర్మంబు దాపత్రయంబు మానుప నౌషధంబగు.

కర్మంబులు సంసారహేతుకంబు లయ్యును ఈశ్వరార్పితంబులై తామ తమ్ము జెరచుకొన నోపి యుండు. ఈశ్వరుని యందు జేయంబడు కర్మంబు విజ్ఞాన హేతుకంబై ఈశ్వర సంతోషణంబును భక్తి యోగంబును బుట్టించు. భాగవతము 1-110

ఇట్లు తన జన్మకర్మంబులను నారదుడు వ్యాసునకు తెలిపెను. కొన్ని దినముల తరువాత నారదుని తల్లి సర్పదష్టయై మరణింపగా ''సంగము వాసె మేలు మేలు రాజిల్లె నటంచు'' నారదుడు తలచెను. అరణ్యమునకేగి ఒక రావిచెట్టు క్రింద హృదయమున హరిని చింతించెను (అశ్వత్థవృక్ష సంకేతార్థమును గమనింపుడు) ధ్యానా రూఢుడైన అతని మనమును భగవంతు డగుపించెను. నారదుడు ఆనంద సముద్రమున మునిగి ఈశ్వరుని తన్ను తెలుసుకొన జాలక పోయెను. ధ్యానము చాలించి లేచిన తరువాత శ్రీహరి అగుపించక పోయిన బాధపడెను. అప్పు డశరీరవాణి ఇట్లు పలికెను. ''ఈ సృష్టిలయమై వేయి యుగము లైన తరువాత పునః సృష్టి జరుగును. అప్పుడు పూర్వజన్మ జ్ఞానముతో పుట్టగలవు. శుద్ధ సాత్వికుడవుగా బుట్టెద'' వని తెలిపెను. తరువాత కల్పమున నారదుడు జన్మించి నారాయణ కథా గానము చేయుచు, మూడు లోకముల చరించు చుండెను. తన పూర్వ జన్మములో అనుభవములన్నియు వ్యాసునకు తెలిపి ''విష్ణు సేవయే శాంతికి మూల'' మని భక్తిలేని యమ నియమాదులు వ్యర్థమని తెలిపెను.

చ|| యమ నియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యు కామరో

షముల ప్రచోదితంబయగు, శాంతి వహింపదు విష్ణు సేవచే

గ్రమమున శాంతి గైకొనిన కైవడి, నాదు శరీర జన్మక

ర్మముల రహస్యమెల్ల ముని మండన! జెప్పితి నీవు గోరినన్‌

భాగవతము 1-132

ఈ కథ వలన గమనించవలసిన విషయములు

(1) నారదునకు రజస్తమోగుణ పరిహారిణియగు భక్తి జనించినది. ''స్థూల సూక్ష్మంబయిన ఈ శరీరము నిజ మాయా కల్పిత మని'' నారదుడు గ్రహించెను. స్థూల దేహము తమో గుణమువలన కలిగెను. ఇది ఇంద్రియములతో కూడినది. సూక్ష్మ దేహమే మనస్సు. ఇది రజో గుణమువలన కలిగెను. కారణ దేహము సర్వ గుణముతో కలిగెను. మాయ త్రిగుణాత్మకమైన సృష్టి యొనర్చెను. సంసార బంధములన్నియు ఇంద్రియ మనంబులచే కలుగుచున్నవి. ''నిఖిల బంధ విమోచనంబు కొరకు వాసుదేవుని లీలా విశేషంబుల భక్తితో వర్ణింపు'' మని నారదుడు వ్యాసునితో తెలిపెను.

ఇంద్రియములను మనస్సును దాటిన తరువాతనే సత్వగుణము ఆవరణము తొలగి ఆత్మ సాక్షాత్కారము కలుగును. అందులకే నిర్గత కర్మంబును నిరుపాధికంబును ఆయిన జ్ఞానంబు హరిభక్తి లేకున్న శోభితంబు గాదని నారదుడు తెలిపెను. అనగా భక్తిచేత రజస్తమోగుణ పరిహారమైన తరువాత శుద్ధతత్త్వమేర్పడినగాని నిర్గుణ తత్త్వము నందుకొనుటకు వీలుకాదు. పరిమిత శక్తి గల ఇంద్రియములతోను మనస్సుతోను పరబ్రహ్మ వస్తువును గ్రహింపలేము. ఇంద్రియ మనో నిగ్రహము లేక తెలుపు వాచా వేదాంతము వలన ఆత్మానుభూతి కలుగదు.

(2) ఇంద్రియ మనో నిగ్రహములేని వారికి కామాద్యరి షడ్వర్గ లయ రూపమగు శాంతి కలుగదు.

(3) భగవంతుని సేవ వలన ఈ జన్మలో పరిపాకము చెందక మరణించిన మరు జన్మలోనైన సిది పొందును.

(4) నిష్కామ కర్మను ఈశ్వరార్పితముచేసి ఇంద్రియములను, భగవంతుని ఏకాగ్రతతో ధ్యానించి మనస్సును జయింపవచ్చును. ఇదియే రజస్తమో పరిహారిణియగు భక్తి.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters