Naa Ramanasrma Jeevitham    Chapters   

7. అమృత నాడి

1942లో తమిళ్‌ పండితు లొకరు వచ్చి అమృతనాడిని గుఱించి శ్రీవారితో మూడు రోజులు ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడుతూ వచ్చారు. భగవాన్‌ ఉత్సాహంతో సమాధానమిస్తూ ఆ అమృతనాడి అల్లాగుంటుందనీ, ఇల్లాగుంటుందనీ ఏదో సెలవిస్తూ వుండటం గమనించి అయ్యో! మనకా అనుభవం రాలేదే అన్న దిగులు కలిగింది నాకు. ఆ వచ్చిన వారు వెళ్ళిన వెనుక గూడా భగవాన్‌ మాధవస్వామితో ఆ విషయమే మాట్లాడటం చూచి అడుగుదామన్న ఆసక్తితో భగవాన్‌ గోశాలవైపు నుండి వస్తుండగా మెల్లిగా దగ్గరకు వెళ్ళి ''అమృతనాడిని గుఱించి చాలా దూరం సెలవిస్తున్నారే? అది'' అని అన్నానో లేదో భగవాన్‌ ''అదంతా నీకెందుకు?'' అన అదిలించినట్లు మాట్లాడారు. ''నాల్గు రోజులనుంచీ ప్రశంసగా మాట్లాడుతున్నాను గదా! దాన్ని గుఱించి తెలుసుకుందామని అడుగుతున్నాను' అన్నాను. ''సరిపోయింది. వారేదో శాస్త్రాన్ని బట్టి అడిగితే తగినట్లు సమాధానం చెప్పాను. అదంతా నీ కెందుకు? నీ వెవరో చూచుకుంటే పోయేదానికి?'' అని శిక్షా పూర్వకమైన ధ్వనితో సెలవిస్తూ నడక సాగించారు భగవాన్‌. నా కాలు సాగక నిలిచి పోయినాను.

రెండు మూడు రోజులయిన వెనుక, హాలులో అట్టే జనంలేని సమయంలో ఆ అమృతనాడిని గుఱించిన ప్రసంగ వశంగా, ''ఆ - అదొక భావన'' అంటున్నారు భగవాన్‌. ''అయితే అమృతనాడి విషయం గూడా భావనామాత్రమేనా?'' అన్నా నేను. ''ఊ-భావనగాక మరేమి? శరీరమే భావనామాత్రమైతే ఇది మాత్రం భావనకాదా యేమి?'' అంటూ ప్రశాంతదృష్టితో నా సందేహమంతా తీరేట్లుగా అనుగ్రహించారు భగవాన్‌. శ్రీవారి అనుగ్రహవాహిని ఇంకా అనేక విధాలుగా ప్రవహించి నా హృదయ క్షేత్రాన్ని తడుపుతూ వుండుటవల్ల సాధనసస్యాలు చక్కగా పెరుగుతూ వచ్చినవి. వృత్తిమూలాన్వేషణయే ముఖ్యమైన లక్ష్యంగా సాధన సాగిస్తూ వచ్చాను. అప్పు డప్పుడు నా మనోవానరం భ్రమ ప్రమాదములకులోనై అటూ యిటూ గంతులు పెడుతూ వుండేది. వెంటనే భగవాన్‌ అదలించినట్లు నావంక పరిశీలించి చూచేవారు. అప్పుడే ఉలిక్కిపడ్డట్లు కళ్ళు తెరవాలని బుద్ధిపుట్టేది. తెరవగానే భగవానుని శిక్షాపూర్వకమైన దృష్టిగోచరించి నా తప్పు నాకవగతమై ఎంతో లజ్జగా వుండేది. అయినా నా అవకతవక అనుభవాలన్నీ అప్పు డప్పుడు శ్రీవారి చెవులలో వూదుతునే వుండేదాన్ని. ఒక్కొక్కప్పుడు కాగితంలో వ్రాసిన్నీ ఇచ్చేదాన్ని. అయినా వేసట అనేది లేకుండా అనునయంగానూ అదలింపుగానూ సమాధానమిచ్చే వారు భగవాన్‌. ఇదేగాక ఇంకా ఎన్నో విధాలుగా శిక్షణ యిచ్చి నాకు శాంతి సుఖాన్ని ప్రసాదించారు. ఇంకా విశేష మేమంటే, శ్రీవారి చరణసన్నిధిలో ఆశ్రయం లభించిన వెనుక మరెక్కడికీ పోవాలన్న ఆశ##యే నశించిపోయింది. అంటే దానంతటది లభిస్తే తప్ప ఎక్కడికోపోయి ఏదో తెలుసుకోవాలని గాని ఏదేదో చేసి పుణ్యం సంపాదించాలని గాని అనిపించక ఇక్కడే స్థిరంగా వుండిపోదామని అనిపించింది. ''ఎందరో మహానుభావులు వారందరికి వందనం'' అన్నాడు త్యాగయ్య. అదే నాకు బాగా నచ్చింది.

Naa Ramanasrma Jeevitham    Chapters