Naa Ramanasrma Jeevitham    Chapters   

66. ఆశ్రమం - ప్రస్తుత పరిస్థితులు

భగవాన్‌ శరీరం విడిచిన ఒక సంవత్సరం లోపలనే వారి సోదరి అలిమేలమ్మ అత్త స్వర్గస్థురాలైనది. ఒక సంవత్సరం దాటిన వెనుక శ్రీవారి సోదరుడు శ్రీ నిరజంనానంద స్వాములున్నూ స్వర్గస్థులైనారు. అంతకుముందే సహాయ కమిటీ ఏర్పాటయింది. నిరజంనానందులు స్వర్గస్థులైన వెనుక వారి కొమారుడు టి. యన్‌. వెంటకరామన్‌ ప్రెసిడెంటయినాడు. అతడు గవర్నమెంటుచే నియమింపబడిన కమిటీ సహాయంలో సర్వ కార్యములు నిర్వహిస్తున్నాడు. ఆదిలో ఆశ్రమ పరిస్థితులు కొంచెం చిక్కులలో పడినప్పటికీ భగవాన్‌ కృపవల్ల త్వరలోనే అవన్నీ చక్కబడినవి.

1965-66 ఆ ప్రాంతంలో భగవాన్‌ సమాధిపైన మూడు లక్షల ధనం వ్యయపరచి చక్కని మండపం నిర్మించారు. దానికి 1967 జూ& లో కుంభాభిషేకం జరిగినది. ఆ మండపానికి ఎదురుగా ఈ మధ్య విశాలమైన ఒక పెద్ద హాలు కట్టారు. దాదాపు రెండు మూడు వేలమంది జనం ఆ హాలులో కూర్చో వచ్చును. సాధకులు నివసించేందుకు గదులెన్నో కట్టించి ఆ గదులందున్నూ ఎన్నో సదుపాయాలు చేశారు. పాత భక్తులందరూ ఆశ్రమంలోనే ఆశ్రయ మిచ్చారు. మురగనార్‌, టి.పి. యార్‌. విశ్వనాథ బ్రహ్మ చారి, కృష్ణభిక్షువు, నటేశయ్యర్‌, రాజయ్య, రామస్వామి పిళ్లె, వడవుడియార్‌ ఇంకా ఎందరెందరో ఆశ్రయభూతులై వున్నారు. వంటయింట్లో పనిచేసి వృద్ధాప్యంతో బాధపడుతూవున్న లోకమ్మ, సుబ్బలక్ష్మమ్మ అనే అవ్వ లిద్దరికి ఆశ్రమంవారు ధనరూపకంగాను సహకరిస్తూవున్నారు. సంపూర్ణమ్మకున్నూ తగు వసతులు చేశారు. భగవాన్‌ సేవకులలో ఒక డైన సత్యానందస్వామి భగవాన్‌ బ్రహ్మ నిర్వాణము పొందిన గదిని జాగ్రత్తగా చూచుకుంటూ నాటి నుండీ నేటి వరకూ ఆశ్రమంలోనే వుండిపోయినాడు. కుంజుస్వామి మొదలైన తదితర భక్తులు ఆశ్రమం వెలుపలనే నివసిస్తూ, నూతన భక్తులకు పాతగాథలను వివరిస్తూ ప్రదక్షినాదులందు పాల్గొంటూ ప్రశాంతంగా జీవితం గుడుపుతూ వున్నారు.

ఆధ్యాత్మిక మార్గమును జూపుటకై అమర్చిన పతాకమువలె అరుణాచలశిఖరం అతి మనోహరమై నూతనాగతుల మనస్సును ఆకర్షిస్తూ వుంటుంది. ఆ శిఖరాగ్రమున వటవృక్షమూలమందు నివసించివున్న అరుణగిరియోగి ఆర్తులగు భక్తులను ఆశీర్వదించి అధ్యాత్మ మార్గమందు నడిపింప గలడని పురాణ ప్రసిద్ధము. ఆ గిరియందు ఎన్నో గుహలున్నవి. ఆ గుహలలో సిద్ధపురుషులు నేటికీ నివసిస్తూ వుంటారని పెద్దల వాక్యం. ''కూర్చుంటే కుదురని ధ్యానం గిరి ప్రదక్షిణంవల్ల కుదురగల'' దని భగవాన్‌ చాలా సార్లు సెలవిచ్చి వున్నారు, ఆ విషయమైన అనుభవం, సాధకు లెందరికో అనుభూతంగానున్నూ వున్నది. ఆ అరుణగిరి పార్శ్వమందే అమరి వున్న శ్రీ రమణాశ్రమ వాతావరణం ప్రశాంతంగా వుండటంలో ఆశ్చర్యం ఏముమున్నది?

ఆశ్రమం ఆవరణలోవున్న వైద్యశాలకు వారానికి మూడు సార్లు డాక్టరు వచ్చి భక్తులకు ఉచితంగా మందులూ ఇంజెక్షన్లు ఇస్తూ వుంటాడు. సంస్కృతం, అరవం, తెలుగు, మళయాళం, ఇంగ్లీషు భాషలలోవున్న అద్వైత గ్రంథాలతో నిండిన బీరువాలతో చక్కని లైబ్రరీ ఏర్పడి పాఠకుల కెంతో అనుకూలంగా వున్నది. భగవాన్‌ ఉపదేశాలూ, చరిత్రలూ, అరవం, తెలుగు, మళయాళం, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో ప్రకటించి విక్రయింపబడుతూ వున్నవి. భగవానుని ఉపదేశాలేకాక మరికొన్ని అద్వైత గ్రంథాలున్నూ ఆశ్రమంవారే ప్రకటించి విక్రయిస్తూ వున్నారు.

ఆశ్రమానికి ఎదుటనున్న మౌర్వీబంగళా చుట్టూ ఎన్నో వసతి గృహాలు నిర్మింపబడుటవల్ల గృహస్థ భక్తులకు, స్త్రీలకు ఎంతో సౌకర్యం ఏర్పడ్డది. రాత్రివేళ స్త్రీలు ఆశ్రమం ఆవరణలో వుండరాదన్న నియమం భగవాన్‌ సశరీరులైవున్న నాటినుండీ నేటివరకూ పాటింపబడుతూ వున్నది. భోజనసదుపాయమున్నూ పూర్వంవలెనే వుండుటవల్ల భక్తుల రాకపోకలకు ఏ యిబ్బంందీ లేదు. రాజకీయ వేత్తలలో ఏ ఒకరిద్దరో తప్ప అంతా భగవాన్‌ దర్శనార్థం నాటనుండి నేటివరకూ వచ్చి వెడుతునే వున్నారు. అప్పుడు సరూప భగవానుని సందర్శనమూ, ఇప్పుడు అరూప భగవానుని సందర్శనమూనూ అంతే భేదం.

భగవాన్‌ సశరీరులై వున్నప్పుడే పాల్‌ బ్రంట్‌&, హంప్రీజ్‌ మొదలైన పాశ్చాత్యులు వచ్చి చూచి, తమ తమ దేశాలలో భగవానుని కీర్తి వ్యాపించునట్లు చేసి వున్నారు. వారి వెనుక చాడ్విక్కు, మెస్ట& మొదలైన పాశ్చాత్యులు వచ్చి జీవితాంతము వరకూ అరుణాచలంలోనే వుండి పోయినారు. ఇటీవల అంటే 1964 లో భక్తులంతా యోచించి ''మౌంటె& పాతు'' అనే ఇంగ్లీషు త్రైమాసపత్రిక ఒకటి ఆశ్రమంలో ప్రారంభించారు. వానికి ఎడిటర్‌ ఆస్‌బోర& అనే ఆంగ్లేయ భక్తుడే. అతని అనంతరం అతని భార్య ఎడిటర్‌గా పనిచేస్తూ వున్నది. మేనేజింగ్‌ ఎడిటర్‌ టి.యన్‌. వెంకటరామ& రెండవ కుమారుడు వి. గణశ&, ఎం.ఎ. ఈ ప్రతికా ప్రకటనవల్ల భగవాన్‌ కీర్తివిదేశాలలో విరివిగా వ్యాపించి ఎందరో అమెరికన్‌, యూరపియన్‌, ఆస్త్రేలియన్‌ భక్తులు ఆశ్రమానికి వచ్చి నెలల తరబడిగా వుండి వెడుతున్నారు. కొంద రిక్కడనే వసతిగృహములనున్నూ నిర్మించు కున్నారు. వచ్చిన వారంతా హిందూ పద్ధతినే కట్టూ, బొట్టూ అంతా నడుపుకుంటూ స్వల్ప ఆదాయంతో జీవితం గడుపుతూ వున్నారు.

అమ్మ కోవెలలోని మాతృభూతేశ్వర లింగానికీ, భగవాన్‌ సమాధిపైనున్న రమణశ్వర లింగానికీ నిత్యం రెండు వేళలా అభిషేక పూజాదులు జరుగుటయేకాక సమయాను కూలముగ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక ములూ, సహస్రనామార్చనలూ, లక్షార్చనలూ జరుగుతూ వుంటవి. రమణశ్వర లింగానికి ఎదురుగా ఉదయం 8 గంటలకు ఉపనిషత్‌ పారాయణం, సాయంత్రం 5 గంటలకు రుద్రం, భగవద్రచిత ఉపదేశసారం పారాయణను పూర్వం వలెనే ఆశ్రమం వేద పాఠశాల ఉపాధ్యాయులూ విద్యార్థులు కలిసి జరుపుతూ వున్నారు. భగవాన్‌ చాలాకాలం నివసించిన పాత హాలు కేవలం ధ్యానం చేసుకొనే వారి కొఱకు వినియోగింపబడుతూ వున్నది. అక్కడ అందరు కడు నిశ్శబ్దంతో ధ్యానం చేసుకొంటు వుంటారు. పూలతోటలూ, ప్రహరీ గోడలూ అభివృద్ధిపొంది ఆశ్రమం అత్యంత రమణీయంగా వున్నది. యాత్రార్థులగు భక్తులు తండోపతండములుగా వచ్చి భగవానుని దర్శించి జన్మ తరింప జేసుకుంటూ వున్నారు. ఆ వాతావరణమంతా శ్రీరమణ భగవానుని అనుగ్రహ పూరితమై వున్నదనుట అతిశయోక్తి కాదు.

Naa Ramanasrma Jeevitham    Chapters