Naa Ramanasrma Jeevitham    Chapters   

60. ఆశ్రమనివాస విరమణ

రాజు సెట్టి కాంపౌండులో నే నుంటున్న యిల్లు శిధిలాపస్థకు రావటంవల్ల 1953 లో ఆ కాంపౌండులోనే ఒక చిన్న యింటికి నా మకాం మార్చాను. అక్కడే జబ్బుచేసి వెళ్ళటం జరిగింది. తిరిగి 1953 చివరలో కాశీనుంచి వచ్చి ఆ యిల్లు మరీ చిన్నదగుటవల్ల ఆ ప్రక్కనే మరొక భాగానికి మారాను. ఎన్నిచోట్లకు మారినా ఆ మొదటి ఇంటి సౌకర్యం రాలేదు. ఆపరేషన్‌ అయిన వెనుక నడుములోనూ శరీరంలోనూ బలం తగ్గిపోయి రమణాశ్రమ నివాసం చాలా కష్టమయింది. మా అన్నలున్నూ ''నీ శరీరం ఇప్పుడు దుర్బల మయింది. భగవాన్‌ సశరీరులుగ లేరుగదా? ఇక మాకు దగ్గరగా వుండవలపింది'' అన్నారు. వెనుకటివలెనే వారి యిళ్ళల్లోనే వుండమన్నారుగాని వదలిన సంసారాలలో తిరిగి ప్రవేశించటం ఇష్టంలేక ''విడిగా ఏదైనా ఏర్పాటుచేస్తే వుంటా'' నన్నాను. విజయవాడలో పెద్దన్నగారి కాంపౌండులోగాని, మద్రాసులో చిన్నన్నగారి కాంపౌండులోగాని విడిగా రెండు గదులు కట్టిస్తాం.'' అన్నారు. కాంపౌండులో కాకుండా కొంచెం దూరంగావుంటే మంచిదని నా పట్టుదల. 1940 నుంచీ అప్పటివరకు అంటే 1954 వరకూ ఏకాంతంగా వుండి మళ్ళీ సందడిలో చొరబడటం ఎందుకని నా తలపు. వారి కా ఈ దుర్బలస్థితిలో ఒంటరిగా వుండలేనేమోనని బాధ.

ఈ అలోచనలతో ఏదీ తెంపులేక 1954 మార్చి వరకూ అరుణాచలంలో, రాజుసెట్టి కాంపౌండులోనే ఏదో ఒక కుటీరంలో వుంటూ వచ్చాను. కాని నీటివసతి లేక, బజారు దూరం గనుక ఆ బలహీనతతో కాలం గడపటం దుర్భరమైనది. అప్పుడు భగవాన్‌ దయవల్ల నాలో నాకే ఒక యోచన కలిగింది. ఏమంటే, శ్రీరమణ సందర్శనానికి రాక పూర్వం 1940 లో నా జన్మస్థానమైన కొలనుకొండకు వెళ్ళి, ఒక సంవత్సరం అక్క డుండి, ఆ గ్రామానికి అధిష్ఠాన దైవమైన భోగేశ్వరుని సేవించిన వెనుక గదా నాకు శ్రీ గురుని సన్నిధిసేవ లభించింది. తిరిగి నా మకాం అక్కడికే మారిస్తే, ఆ భోగేశ్వరునే ఆరాధించవచ్చు. పెద్దన్నగారికి కొంచెం దగ్గరగానూ

వుంటుంది. ఏకాంతవాసానికి భంగం వుండదు. క్రమంగ భగవానుడు ఏదో ఒక

పంథా చూపక పోడు అని తోచి అక్కడికే వెడదామని నిశ్చయించాను. ఇంతలో విజయవాడలోవున్న మా పెద్దన్నగారి మూడవకుమార్తె విద్యకు వివాహం 1954 మార్చిలో జరుగగలదనీ, నన్ను రమ్మనీ వ్రాశారు. ఇది భగవదాదేశ##మే గాబోలు నని కొలనుకొండ యింట్లో పెట్టటానికి భగవాన్‌ ఫోటో పెద్ద దొకటి పెట్టెలో పెట్టుకొని వెళ్ళాను. వివాహమండపం లోనూ ఆ ఫోటోయే అలంకరించాం.

Naa Ramanasrma Jeevitham    Chapters