Naa Ramanasrma Jeevitham    Chapters   

57. కాశీయాత్ర

అప్పుడే, అంటే 1953 సెప్టెంబరులో మా చిన్నన్నగారూ భార్యా కాశీయాత్రకు వెడుతుంటే అదివర కా క్షేత్రాలు చూడనందున నేనూ బయలుదేరాను. నా కింకా బలహీనత తగ్గనందున కాశీ, గయ, ప్రయాగ, ఆ మూడు మాత్రమే చూచి నేను వెనక్కు వచ్చేట్టు, వాళ్ళు హృషీకేశం వరకూ వెళ్ళేట్టు ఏర్పాటు చేసుకున్నాం. ముందు ప్రయాగ వెళ్ళి, ఒక్క రోజుతో ఆ యాత్ర ముగించుకొని రైలెక్కి మరుదినం ఉదయాన కాశి చేరుకున్నాం. విజయనగరం రాజావారి బంగళాలో మా మకాం. కాశీలో అడుగుపెట్టగానే మా వదినకు జ్వరం పట్టుకుంది. ఆ పగలంతా డాక్టరు, వైద్యం ఆ కలాపంతో వుండి సాయంకాలం ఎల్లాగో విశ్వేశ్వర దర్శనం మాత్రం చేసుకున్నాము. అసలు కాశిలో మూడు రోజులే వుండాలనుకున్నాం. కాని మరుదినం కూడా మా వదినెకు జ్వరం తగ్గలేదు. మా అన్న నన్ను చూచి ''అమ్మాయీ! మీ వదినె జ్వరం తగ్గకుంటే ఇంటికే ప్రయాణం కావలసి వస్తుంది. మా మాట ఎల్లాగున్నా నీవు నీ యాత్ర పూర్తిచేసుకో'' అన్నాడు. ''నాకు, గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం చాలును. మరి ఏ కర్మకాండ అక్కరలేదు'' అన్నా నేను. '' అయితే, నేను మీ వదినెవద్ద వుంటాను. నీవు నీ పని పూర్తిచేసుకో. కావాలంటె పండాను సహాయం తీసుకొని వెళ్ళు'' అన్నాడు. ''ఎవ్వరూ వద్దు ఒంటరిగానే వెడతా'' నని రిక్షా మాట్లాడుకొని, విశ్వేశ్వరాలయానికి సమీపంగా వున్న మణికర్ణికా ఘట్టానికి వెళ్ళాను.

గంగాస్నానం చేసి, పట్టుబట్ట కట్టుకొని, చెంబుతో గంగ తీసుకొని, మార్గంలో ఒక అర్దణాతో పత్రి కొనుక్కొని, విశ్వేశ్వరాలయానికి వెళ్ళాను. నిరాటంకాంగా భగవాన్‌ వద్దకు ఎలా వెళ్ళేదాన్నో అల్లాగే విశ్వేశ్వర సన్నిధాననానికే వెళ్ళి, గంగాజలంతో అభిషేకం చేసుకొని తెచ్చిన ప్రతితో పూజించి, ఇచ్చవచ్చినంతసేపు స్తుతించి, ఆనందబాష్ప పూరితమైన కళ్ళతో గర్భాలయం నుండి బయటికి వచ్చాను. ఆ గర్భాలయానికి నాల్గువైపులా ద్వారాలున్నా విశేష దినాలలో తప్ప తదితర దినాలలో సింహద్వారం ఒక్కటే తెఱచి వుంచుతారట. ఆ దినం అదొకటే తెఱచి వున్నది. ఆ ద్వారానికి ఎదురుగా కూర్చున్నాను. అక్కడ కావలి వున్న అతడు ''అమ్మా! ఎక్కడ నుంచి వచ్చారు?'' అని హిందీలో ప్రశ్నించాడు. ''రమణాశ్రమం నుంచి వచ్చాను. మా అన్నా వదినె గూడా వచ్చారు. విజయనగరం కొఠేలో వున్నారు.'' అని విషయ మంతా వచ్చీరాని హిందీలోనే చెప్పాను. అత నెంతో సంతోషించి ''అల్లాగా అమ్మా. రమణమహర్షి గొప్ప జ్ఞాని అని విన్నాను. వారి సన్నిధిలో నివసించి మీ జన్మ ధన్మం చేసుకున్నారు తల్లీ'' అని అంటూ వుండగానే ఎవరో వచ్చి అతణ్ణి పిలిచారు. అతడు వెళ్లకతప్పదని అటూ యిటూ చూస్తే ఎవరూ కనుపించలేదు. నన్ను చూచి ''మాతాజీ! కొంచెంసేపు ఇక్కడ నిలుచుని చూస్తూ వుంటారా? అల్లా వెళ్ళి వస్తాను'' అని వినయంగా అడిగాడు. ''ఓ. మంచిది. దాని కేమి? అది మహాభాగ్యం గదా?'' అన్నాను. వెంటనే తన స్థానం నా కిచ్చి వెళ్ళా డాతడు.

నేను పరమానందంతో విశ్వేశ్వరుని ద్వారపాలకురాలనుగా ఒక గంటసేపు నిలిచి, వచ్చేపోయే జనాన్ని సర్దుబాటు చేస్తూ, ఆలయంలో వున్న సామగ్రిని జాగ్రత్తగా చూస్తూ, జనం రానప్పుడు ఆ గుమ్మంమీద కూర్చుని ధ్యానంలో మగ్నమవుతూ, ఇంటి సంగతే మరచిపోయినాను. ఒక గంట అయిన వెనుక ఆ ద్వారపాలకుడు వచ్చి, నాకు కృతజ్ఞత తెలుపుతూ సాగనంపాడు. నేను బసకు వచ్చేసరికి 11 దాటింది. ఉదయం 7 లోపల వెళ్ళిన దానిని అంతవరకూ రానందున మా అన్న తత్తరబిత్తర లాడుతూ రోగిని వదలి బయలుదేరుటకు సంసిద్ధుడవుతూ వున్నాడు. నన్ను చూడ గానే ఆయన ప్రాణం లేచి వచ్చినట్లయింది. ''ఏమమ్మా! ఇంత ఆలస్యం చేశావు? గంగలో స్నానం చేస్తూ ఏమయినావో ఏమో నని గాభరాపడ్డాను. ఒంటరిగా వెళ్ళావాయెను. వెదకటానికి బయల్దేరుదామనుకుంటున్నాను'' అన్నాడు. ''గంగాస్నానం త్వరగానే ముగిసిందన్నయ్యా. విశ్వేశ్వరుని వద్దనే ఇంత ఆలస్యమూను. భగవాన్‌ తరువాత సులభంగా దర్శనమూ సేవాభాగ్యమూ ఇచ్చే నిరాడంబరదైవం విశ్వేశ్వరు డొక్కడే కనుపిస్తున్నాడు. ఈ క్షుద్రజీవిని తన ద్వార పాలకురాలిగా ఒక గంటసేపు నిలుపుకున్నాడు సుమా'' అన్నాను. మా అన్న విస్తుబోయి '' అదేమిటమ్మా! అక్కడ సిఫార్శులేనిదే ఎక్కువసేపు ఎవరినీ నిలువనీయరే! నీవు గంట సేపు ద్వారం వద్ద నిలవటానికి ఎవరు సిఫార్శుచేశారు?'' అన్నాడు. ''భగవాన్‌ దగ్గర కన్న బిడ్డలాగ నిలిచి సన్నిధిసేవ చేసేందుకు ఏ పరమాత్మ సిఫార్శుచేసి బెట్టాడో, ఆ పరమాత్మయే ఈ నాడు విశ్వేశ్వరుని ద్వారపాలకురాలినిగా నిలిపి సేవాభాగ్యం లభించేట్లు చేశాడు'' అని జరిగిన సంగతంతా చెప్పాను. వా రెంతో ఆశ్చర్యంతో ''అదంతా శ్రీ రమణానుగ్రహమేనమ్మా'' అన్నారు. ఆ వెనుక నాకే అశ్చర్యం కలిగింది. వెండిసామానుతో నిండివున్న ఆ దేవాలయం, ఆ ద్వారపాలకుడు సరికొత్తదానినైన నాకు ఒప్పగించి వెళ్లాడంటే ఏంజెప్పాలి? అంతా రమణానుగ్రహమే తప్ప మరేమీ కాదు.

Naa Ramanasrma Jeevitham    Chapters