Naa Ramanasrma Jeevitham    Chapters   

55. రామేశ్వర యాత్ర

శ్రీరమణ భగవానుడు మధుర నుండి తిరువణ్ణామలకు వచ్చునప్పుడు ముద్దుకృష్ణభాగవతారుని యింట్లో విందారగించిన తిరుక్కోవిలూరు అనే పుణ్యక్షేత్రం తిరువణ్ణామల నుండి విల్లుపురం వెళ్ళేమార్గంలో వున్నది. అదివరకు నే నా క్షేత్రం చూడనందున ముందు అక్కడికే టిక్కెట్టుకొని ఉదయం 6 గంటల రైలులో తిరుక్కోవిలూరు వెళ్ళాను. రైలు దిగేసరికి 7 గంట లయింది. ఎచ్చమ్మ మేనల్లుడు జయరామన్‌ ఆ వూళ్ళోవున్నందున వారింటికి బండిలో వెడుతూ వున్నాను. ఆ రోజున ఏకాదశి గనుక వా రింట్లో ఏ కాహం చేస్తున్నారట. జయరామన్‌ ఆ భజన సమూహంతోనూ, దీప స్తంభంతోనూ నగరసంకీర్తనకుగాను బయలుదేరి నా బండికి ఎదురుగా వచ్చాడు. నా కది శుభసూచకంగా తోచి ఎంతో సంతోషం కలిగినది. వారంటికొఱకై నాకిక వెదకవలసిన పనిలేకపోయింది. వారింట బసచేసి, భజన చూచి, సాయంత్రం ఒక కుఱ్ఱవాని సహాయంతో భగవానునకు జ్యోతిర్దర్శన మిచ్చిన అతుల్యనాధేశ్వరాలయం, విరాటేశ్వర దేవాలయం, భగవానునకు చల్ది అన్నం పెట్టి కాపాడిన ముత్తుకృష్ణ భాగవతారుని ఇల్లూ అన్నీ చూచుకొని ఆ రాత్రికే బయలు దేరి విల్లుపురంలో రైలు మారి మధురకు చేరుకున్నాను.

సత్రంలో ఎక్కడా బస దొరకక చొక్కనాథ వీధిలో వున్న రమణమందిరానికే వెళ్ళాను. ఎక్కడ చూచినా జన సమూహమే. ఎల్లాగో మీనాక్షిసుందరేశుల సందర్శించి, మరుదినం రాత్రి బయలుదేరి సరాసరి రామేశ్వరం చేరుకున్నాను. అక్కడ నాడారు సత్రంలో బసకు వసతిగా వుంటుందని ముందే వినివుండుటవల్ల సరాసరి అక్కడికే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం 11 గంట లయింది. వెనుక వైపున ఒక చిన్నగది యిచ్చారు. అది శుభ్రపరచుకొని, వంటచేసుకొని భుజించి విశ్రమించాను. అప్పు డా సత్రంలో పనివాళ్ళేతప్ప యాత్రికులెవ్వరూ లేరు. పగలు ఎల్లా గడిచినా రాత్రి ఎల్లాగా? ఇక్కడి వాళ్ళు ఎటువంటి వాళ్ళో ఏమోనని విచారిస్తూ పడుకున్నను. 3 గంటలయ్యేసరికి ప్రక్కగదిలో మనుష్యుల సందడి వినిపించింది. లేచి తలుపు తెఱచి చూతును గదా వృద్ధబ్రాహ్మణ దంపతులు పార్వతీ పరమేశ్రుల వలె ఆ గదిలో వున్నారు. వారిని చూచేసరికి ప్రాణంలేచి వచ్చి నట్లయింది. వా రెవరని విచారిస్తే వై శాఖజిల్లా నుండి వచ్చామని ఏమేమో చెప్పారు. నన్ను గుఱించి వారూ విచారించి తెలుసుకొని ''అమ్మా! మేము ధనుష్కోటి వరకూ వస్తాము.'' ప్రక్కగదిలోనే వున్నాము గనుక నీ కేమీ భయం వుండదు'' అని చెప్పి స్నానపానాదులు ముగించుకొన్న వెనుక ముగ్గురం దేవాలయానికి వెళ్ళాం.

రామేశ్వరంలో మూడు రోజులుండి, ధనుష్కోటికి వెళ్ళి అక్కడా నాడారు సత్రంలోనే దిగి సేతుస్నానాకికి వెళ్ళాం. అక్కడి కలాపమంతా ముగిసిన వెనుక ఆ వృద్ధబ్రాహ్మణుడు ''అమ్మా! మేము రామనాథపురం వెడతాము. నీవు స్నూ వస్తావా?'' అన్నాడు. అప్పటికే నా ఆరోగ్యం సరిగాలేదు. రామనాథపురం లోగడ చూచే వున్నాను. అందువల్ల ''రాను బాబు'' అన్నాను. ఆ బ్రాహ్మణుడు ఎంతో వాత్సల్యంతో ''అమ్మా! నీవు రమణమహర్షి సన్నిధానంలో పది సంవత్సరాలుగ వుండి వారి సేవవల్ల పునీతురాలవై నావు. నీ కెందుకమ్మా యీ యాత్రలు. వారి సన్నిధినే నమ్ముకొని ప్రశాంతంగా జీవయాత్ర నడుపుకోవటం మంచిది. శ్రీగురుని అనుగ్రహం లభించనివారికి తీర్థాటనంగాని ఆ అనుగ్రహం లభించినవారికి అన్ని తీర్థాలూ అక్కడే వుంటవమ్మా. ఇక చాలును. చల్లగా స్వస్థానం చేరుకో'' అని హితోపదేశం చేశాడు. నా కెంతో సంతోషం కలిగింది.

ఆ పుణ్యదంపతులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారిని సాగనంపి ఆ రాత్రి ధనుష్కోటిలో ఒంటరిగానే గడిపి మరుదినం ఉదయాన రామేశ్వరం చేరుకొని తిరిగి రామలింగేశ్వరుని దర్శించి, ఆ రాత్రికే బయలుదేరి, తెల్లవారేసరికి మధురలో దిగి రమణమందిరం చేరుకున్నాను. అప్పుడు మా పెద్దన్నగారి కుమారుడు ''తిలకు'' కోయంబత్తూరు టీ. కంపెనీలో పని చేస్తున్నాడు. మధురనుండి అక్కడికి వెడదామని యోచిస్తే కొందరు రమణభక్తులు ''మధురనుండి కోయంబత్తూరుకు సరాసరి రైలు వున్నది గాని మార్గ మధ్యంలో సలని క్షేత్రం వున్నది. అది చూచి వెళ్ళరాదా?'' అన్నారు. అక్కడ తెలిసిన వారెవరూ లేరు గదా? అంటే ''రమణ భక్తులే ఒక రున్నారని'' వాళ్ళు చిరునామా వ్రాసి యిచ్చి రాత్రి రైలు ఎక్కించారు. ఉదయం పలనిలో దిగి అక్కడవున్న ఆ రమణ భక్తుల సహాయంతో పలని దండ పాణి (సుబ్రహ్మణ్యశ్వర) స్వామిని దర్శించి, ఆ రాత్రికే బయలు దేరి మరుదినం ఉదయాన కోయంబత్తూరు చేరుకొని మా చిన్నన్నగారికి జాబు వ్రాశాను. ఒంటరిగా వెళ్ళానే. ఎల్లా గున్నానో అని భయపడుతున్న వారికి ఆ జాబు శాంతి నిచ్చింది. అక్కడ పది రోజు లుండి మద్రాసు వెళ్ళాను. అక్క డొక వారం గడిపి ఆశ్రమం చేరుట కొక ఉదయాన బయలుదేరి చెంగల్పట్టులో దిగి, పక్షితీర్థం వెళ్ళి ఆ క్షేత్రమూ చూచుకొని ఆ రాత్రికే రైలెక్కి మరుదినం ఉదయాన ఆశ్రమం చేరుకున్నాను. అటూ యిట్లూ వెళ్ళిన రమణ భక్తులలో కొందరు అప్పటికి తిరిగి వచ్చారు.

భగవాన్‌ శరీరం విడిచిన వెనుక ఆశ్రమ అధికారవర్గానికీ, తదితరులకూ అభిప్రాయభేదాలు ఏర్పడి కలతలతో గజిబిజిగా వుండుటవల్ల ఏ క్షేత్రంలోనైనా సద్గోష్ఠితో ప్రశాంతంగా జీవితం గడుపుదామనే కాంక్షతోనే అన్ని క్షేత్రాలూ తిరిగాను. కొన్నాళ్ళయిన వెనుక తిరుపతి, కాళహస్తి గూడా చూచి వచ్చాను. ఎక్కడ చూచినా యాత్రికుల కోలాహలము. పండాల ధనకాంక్ష తప్ప సద్గోష్ఠికిగాని శాంతికిగాని అవకాశం కనుపించలేదు.

Naa Ramanasrma Jeevitham    Chapters