Naa Ramanasrma Jeevitham    Chapters   

5. అంతా రమణ మయం

ఆ మరుదినం నే నెక్కబోయే రైలు ఉదయం 91/2 గంటలకు అరుణాచలంలో బయలుదేరి కాట్పాడిమీదుగా సరాసరి గూడూరు చేరుకుంటుంది. నేను ఉదయానంతరం టవునులో గది ఖాళీచేసి ఆశ్రమానికి వచ్చాను. భగవాన్‌ అల్పాహారం ముగించుకొని, కొండకు వెళ్ళివచ్చి హాల్లో ప్రశాంతంగా కూర్చున్నారు. సామానంతా బండీలోనే వుంచి భగవాన్‌ వద్దకువచ్చి, నమస్కరించిలేచి చేతులు నలుపుకుంటూ నిలిచా నేను. భగవాన్‌ తేఱిపాఱ చూచారు. ఆహా! ఎంత చల్లనిచూపో. ఆపాదమస్తకం శీతలమైనది నాకు. దాదాపు ఒక పుష్కరంగా శ్రీగురుసేవకై తపిస్తూవున్న నాకు భగవదనుగ్రహ విశేషంవల్ల అన్నల ఆదేశానుసారం లభించిన ఈ పెన్నిధిని విడిచివెళ్ళడం ఎంత వెఱ్ఱితనమా? అనిన్నీ అని పించింది. కదలలేక పోయాను. బయట నిలబడ్డ బండీవాడు ''అమ్మా, టయిమయింది'' అన్నాడు. పోయివస్తాననేందుకు మాటపెగలక తలవూపాను. నా అవస్థ భగవాన్‌ గ్రహించి ''ఊ-ఊ'' అంటూ సెలవు చిహ్నంగా తలవూపారు. కాళ్ళు కదపగానే కళ్ళవెంట నీరు బొటబొట కారింది. గడపదాటగానే మా అక్క సుబ్బమ్మ, వారణాశి సుబ్బలక్ష్మమ్మ ''త్వరలోనే రాగలవులే. విచారించకు, పోయిరమ్మ''ని సాగనంపారు. హాల్లోనుంచి ఏదో ఛాయ నన్ను వెన్నంటి నడుస్తున్నట్లు తోచింది. బండీ ఎక్కాను.

బండీ ఆశ్రమం గేటు దాటగానే, గేటుకు వందనం చేసి కళ్ళనీళ్ళు తుడుచుకొని అటూయిటూ పరిశీలించి చూచాను. ఎటూచూచినా భగవానుని దివ్యతేజోమయ విగ్రహమే ప్రత్యక్షమైంది. కళ్ళు మూసుకున్నాను. అప్పుడూ భగవానే కనుపించారు. బండీ అరుణాచలాలయ సామీప్యానికి వచ్చింది. తలయెత్తి గోపురంవంక చూచాను. అక్కడా భగవాన్‌ గోచరించారు. బండీలో నుంచే నమస్కరించి స్టేషను చేరుకున్నాను. బండీవాడే టికెట్టుకొని రైలెక్కించాడు. ఆడవాళ్ళ పెట్టెలో అట్టే జనం లేరు. సామాను భద్రపరచి కిటికీవద్ద కూర్చుని తదేకదృష్టితో అరుణాచలం వైపే చూడసాగాను. రైలు కదిలింది. క్రమంగా దేవాలయగోపురాలూ, అరుణగిరి శిఖరం అన్నీ అదృశ్యమైనవి. భగవానుని మూర్తి మాత్రం నాదృష్టి ఎటుత్రిప్పితే అటే గోచరమౌతూవున్నది. కిటికీనుంచి దృష్టి మరలించి పెట్టె నలువైపులా చూచాను. అంతటా భగవానుడే. రైలుతోపాటు నాదృష్టి నాదృష్టితో పాటు రమణుని రమణీయమూర్తి ఎడబాటు లేకుండా పయనించినవి. నా హృదయ ఫలకంలో భగవానుని దివ్య తేజోమయ సుందర విగ్రహం ఎంత చక్కగా ప్రతిష్ఠింపబడినది. ఆహా! ఇది గదా గురుకటాక్షం. పులినోటి కండవలె అయినానే అని నాలో నే ననుకుంటూ కూర్చున్నాను. ఆ స్థితిలో ఆకలి దప్పులున్నూ బాధించలేదు. ''అంతా రమణమయం, ఈ జగమంతా రమణ మయం'' అన్న మాటలు నా నోట అప్రయత్నంగా వెలువడినవి. ప్రక్కనున్న ఒక యువతి ''ఎక్కడ నుంచి వస్తున్నారమ్మా?'' అన్నది. ''రమణాశ్రమం నుంచి'' అన్నాను. ''అల్లా చెప్పండి. అందుకే ధోరణి అల్లా వున్నది. భోజనం అయినట్లు లేదు. కాట్పాడిలో కాఫీ అయినా పుచ్చుకోండి'' అన్నది. సరేనని కాట్పాడిలో కాఫీ త్రాగి, గూడూరులో రైలుమారి విజయవాడ చేరుకున్నాను.

శరీరం బంధువుల మధ్య మసలుతూ పనులన్నీ నిర్వహిస్తూ వున్నదే గాని మనస్సు మాత్రం శ్రీ రమణచరణ సన్నిధినే బంధింపబడ్డది. అందువల్ల అందరికీ నా దృష్టిలో భేదం కనుపించి ''అల్లా గున్నావేమి?'' అని అడుగసాగారు. ''ఏమీ లేదని'' సమాధానం చెప్పేదాన్ని. నమ్మిన వారు నమ్మారు, నమ్మని వారు ఏదో పిచ్చివాలకంగా వున్నదే?అని గుస గుస లాడుకొనేవారు. అంటే, మా మేనత్త ఒకా మెకు పిచ్చిపట్టింది. అందువల్ల వారికి నన్ను గుఱించి సందేహం. అయితే నాకు పట్టిన పిచ్చి మరొకరకం. ఇది అందరికీ అర్థ మవుతుందా? సరే. త్వరలోనే మా వదినె ప్రసనించి మగ శిశువును కన్నది. అష్టమ ప్రసూతి గనుక కొంచెం కష్టమయినా రోజులు సుఖంగానే గడచినవి. ''పేరేం పెట్టమంటావ్‌'' అని నన్నడిగారు. ''రమణ నామంకంటె రమణీయమే మున్నది?'' అన్నాను. ''రమణశర్మ'' అని పేరు పెట్టారు. వచ్చిన పని సుఖప్రదంగా ముగిసింది గదా? అరుణాచలం వెళ్ళి, అక్కడే వుంటాననీ, మీరు రమ్మన్నప్పుడల్లా రాగలననీ, వాల్ళందరికీ నచ్చచెప్పి 1941 నవంబరులో తగుసామగ్రి తీసుకొని కృత్తికాదీపోత్సవ సమయానికి అరుణాచలం చేరుకున్నాను.

Naa Ramanasrma Jeevitham    Chapters