Naa Ramanasrma Jeevitham    Chapters   

43. భగివాన్‌ ఎక్కడికి పోతారు?

23-7-49 తేదీన పోష్టులో మధుర కృష్ణమూర్తి అయ్యరు వద్దనుండి ఒక ఉత్తరం వచ్చింది. భగవానది చూచి పంపిన వెనుక నన్నుద్దేశించి ''ఇదిగో! మధుర కృష్ణమూర్తి ఉత్తరం వ్రాశాడు. 'భగవాన్‌ కిన్ని వైద్యాలెందుకు? సరియైన భక్తులెవరైనా ఒకరు ఈ బాధ తీసుకుంటే పోదా?'' అని వున్నది అందులో'' అని సెలవిచ్చారు.

నాకు దుఃఖం వచ్చి ''అవునది నిజమే'' ఒక్కరే ఈ బాధ అనుభవించకుంటే మా అందరికీ పంచిపెట్టరాదా? భగవాన్‌ సన్నిధికి మధుర పదార్థాలు ఏవి వచ్చినా అందరికీ పంచుతారే. ఇదెందుకు ఇవ్వరూ? మేముగా తీసుకునే సామార్థ్యం మాకు లేదాయె. భగవాన్‌ ఇవ్వాలి. కావాలని అడుగుతున్నానే. ఇవ్వరాదా?'' అని అన్నానో లేదో నా కళ్ళవెంట నీళ్ళు బొట బొట కారినై. ఇక మాట పెగల లేదు. భగవా& ప్రసన్నవదనంతో ''హూ-హూ'' అంటూ వూరుకున్నారు. హాల్లో అందరూ కంటతడిపెట్టారు. ఏమైతే నేమి కాలానువర్తిగదా భగవాన్‌. చొరవగలవా రెవరైనా ''భగవానే ఎట్లాగైనా ఇది నయం చేసుకోవలసిం''దని ప్రార్థిస్తుంటే ''నేనేం జేసే''దనీ ''నాదే మున్న''దనీ సెలవిచ్చే వారు భగవాన్‌.

25-7-49 మధ్యాహ్నాం మూడింటికి తలవని తలంగాపు డాక్టర్‌ గురుస్వామి మొదలియార్‌ వచ్చారు. వారు కారు దిగీ దిగకముందే ఎవరో వచ్చి భగవాన్‌ తో మనవి చేస్తూ వుండగానే డాక్టరున్నూ హాల్లో ప్రవేశించి భగవాన్‌కు నమస్కరించి ''మద్రాసులో వున్న భక్తులు కొందరు చెప్పటం వల్ల సమాచారం తెలిసింది. పుండు చూచి పోదామని వచ్చాను'' అని మనవి చేస్తే ''ఆహా! దానికేమి? చూడ వచ్చును'' అన్నారు భగవాన్‌. గురుస్వామి మొదలియార్‌ డాక్టర్ల సంప్రదింపు కొఱకు ఆశ్రమం అసుపత్రికి వెళ్ళగానే ''ఎవరు కట్టిన కట్టు వారే విప్పటం మర్యాద గదా. తాతను పిలిపించండి'' అన్నారు భగవాన్‌. వెంటనే బండీ పంపి తాతను పిలిపించారు. నాలుగు గంటల లోపలనే శ్రీవారిని గోశాల వెనకకు పిలుచుకొని వెళ్ళి, తాత చేతనే కట్టు విప్పించి చూచిన వెనుక 'అసలు దీనిమీద కత్తి పెట్టనే కూడదు. ఏదో జరిగిపోయింది. ఇంత ముదిరిన వెనుక తాతగారి మందు వేసి కట్టడానికి తగిన సమయంగా లేదు. అందువల్ల నిత్యం కడిగి కట్టు కట్టటం మంచిది'' అని చెప్పి డాక్డర్లే కట్టు కట్టునట్లు ఏర్పాటుచేసి హోమియో మందు ఏదో యిచ్చి ''మళ్ళీ 31 వ తేదీన రాగలననీ, అప్పుడ వైద్యభారం వహించేదీ లేనిదీ చెప్పగలననీ'' చెప్పి సాయంకాలమే వెళ్ళారు గురుస్వామి మొదలియార్‌. అసలిది కా& సర్‌ కాదేమోననిన్నీ అన్నారట వారు. ఆ మాట వినటంవల్ల అందరికీ కొంచెం ధైర్యం వచ్చింది.

గురుస్వామి మొదలియార్‌ వెళ్ళేముందు ''సూర్య నమస్కారాలు చేయిస్తే మంచి''దని అన్నారట. బలరామరెడ్డి విని ''ఆకైంకర్యం తానే చేయిస్తాననీ, భగవాన్‌ అను మతించాలనీ'' శ్రీవారి నడిగితే ''దానికేమీ? మీ యిష్టం. సూర్య నమస్కారాలు చేయటం చేయించటం మంచి పనే గదా'' అన్నారు భగవాన్‌. ఆ వెనుక ఒక శాస్త్రిగారిని నియమిస్తే 24-7-49 ఉదయమే వేదపాఠశాలలో ఆ ప్రక్రియ ప్రారంభించారు. నిత్యం ఆ నమస్కారాలు ముగిసిన వెంటనే తీర్థం తెచ్చి శ్రీవారికిస్తే అదీ ఒక ఔషధంగానే గ్రహించేవారు భగవాన్‌. ''శాస్త్రోక్తంగా ఇది జరగటం మంచిదే కాని నిరపేక్షులై కేవలం భక్తి శ్రద్ధలతో ఈ పని ఎవరైనా చేస్తే బాగుండునే'' అని భక్తులు కొందరు అంటూ వుండగా విని ఎన్నడూ కామ్యంగా ఏదైవాన్నీ ప్రార్థించి ఎరుగని నాకు ఆ పని మనమే చేద్దామని తోచింది. కొందరు భక్తులున్నూ ప్రోత్సహించటం వల్ల 27-7-49 సాయంకాలం శ్రీవారిని సమీపించి ''రేపటినుండి సూర్య నమస్కారాలు చేయాలని అనుకుంటున్నాను'' అన్నాను. భగవాన్‌ వెంటనే ''ఇక్కడ ప్రారంభించి చేస్తున్నారే?'' అన్నారు. ''అది విన్నాను. నేను గూడా ఇంట్లో చేస్తాను'' అన్నాను. భగవాన్‌ నా సంకల్పం గ్రహించి ''అది సరి. దానికేమి చేస్తేమంచిదే. ఇక్కడా చేస్తున్నారని చెప్పానంతే'' అని సెలవిచ్చారు.

28-7-49 ఉదయమే ఆదిత్యహృదయ పఠనంతో ఆరంభించి నమస్కారాలు చేయసాగాను. అంతకు ముందే కొందరు స్త్రీలు గుంపులుగా బయలుదేరి భగవాన్‌ శరీరాన్ని బాగు పరచవలెనని అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తూ వారానికొకసారి గిరిప్రదక్షిణం వెళ్ళటం సాగించారు. పురుషులున్నూ అదే విధంగా చేయసాగారు. ఇది ఇట్లా వుండగా 25-7-49 నుండీ డాక్టర్లే కట్టుకట్టటానికి ఆరంభిచారా? ఒక్కొక్కనాడు ఉదయమే కాక రాత్రిళ్ళున్నూ కట్టుకట్టవలసి వచ్చింది. 27-7-49 రాత్రి భగవాన్‌ భోజనమైన వెనుక పాలఘాటు నుండి వచ్చి వున్న పద్మనాభమనే డాక్టరూ, టి.పి. యార్‌, అనంతనారాయణరావు, శంకరరావు ఇతాద్యులంతా కట్టు కట్టే నిమిత్తం కొత్తహాలుకు వచ్చి లోగడ కట్టిన కట్టు విప్పబోతే అంతా రక్తంతో తడిపి వున్నదట. ఆ భీభత్సం చూచి పద్మనాభం, టి.పి. యార్‌ భీతచిత్తులై ఒక మూలకు వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నారట. కట్టు కట్టటం కాగానే భగవా& డాక్టర్లను చూచి ''పద్మనాభం, రామచంద్రం ఏరీ?'' అన్నారట. ''అరుగో! ఆమూల కూర్చుని ఏడుస్తున్నారు'' అన్నారట డాక్టర్లు. ''సరిపోయింది. ఇట్లా రమ్మనండి వాళ్ళని'' అన్నారట భగవాన్‌. ఆ డాక్టర్లు పిలిస్తే వీళ్ళిద్దరూ కళ్ళు తుడుచుకుంటూ భగవాన్‌ సన్నిధికి వెళ్ళారట. ''ఎందుకూ ఏడుపు? భగవాన్‌ కేమయిందిప్పుడు?'' అన్నారట భగవా&. వారిద్దరిలో ఒకరు ''ఇది ఇంత ఘోరంగా వున్నదే. భగవాన్‌ మాకు లేకుండా పోతారేమోనన్న భయం కలుగుతున్నదే'' అన్నారట. భగవాన్‌ చిరునవ్వుతో ''ఓహో! సరిపోయింది. భగవాన్‌ లేకుండా ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోగలరు?'' అన్నారట.

ఈ మాటలు వారు చెప్పగా విని నయమవుతుందేమో నన్న ఆశ అందరికీ అంకురించింది గాని ఆ మాటల్లో శ్లేష వున్నది. ''భగవాన్‌ ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోగలరు?'' అని అన్నారేగాని ''భగవాన్‌ శరీరం ఎక్కడికి పోతుంది? అని అనలేదే ఏమా అన్న శంక నన్ను పీడిస్తునే వున్నది.

Naa Ramanasrma Jeevitham    Chapters