Naa Ramanasrma Jeevitham    Chapters   

40. సూర్యకాంతమణి

కొత్త హాలుకు వచ్చిన వెనుక భగవాన్‌ కురుపు నుండి రక్తస్రావం తగ్గిందనీ, పుండు చాలా భాగం ఆరిందనీ కొద్ది రోజుల్లో మచ్చ పడవచ్చనీ చెప్పి కే. కే. నంబియార్‌, చావలి నాగేశ్వరరావు ఇత్యాది భక్తు లంతా భగవాన్‌ చేతికట్టు తీసివేయించి సినమా ఫోటోలు తీయటానికి ఆరంభించారు. నేను ఆ సందడిలో చేరేదాన్ని కాదు గనుక భగవానుని ఏ మడిగేందుకు వీలుకాలేదు. తగ్గిందని అంతా అనుకుంటూ వుంటే విని నిజమేననుకొని భగవా& సన్నిధికి రాక పూర్వం వ్రాసిన మానసశతకం బాలకృష్ణ గీతావళి అచ్చు కిచ్చేందుకై విజయవాడ వెళ్ళితే మా వదినె ఆశ్రమానికి వచ్చి వుండి తిరిగి కురుపు ఎదుగుతున్నదన్న వార్త విని వెంటనే రమ్మని నాకు వ్రాసింది. అందువల్ల గోలక్ష్మి సమాధి సంవత్సరోత్సవం నాటి సాయంకాలానికే నేను తిరిగి వచ్చాను. ఇక్కడి వారు పుండు మునుపటికన్న అధికంగా ఎదుగటమేకాక రక్తమున్నూ కారుతున్నదని తెలియచేయటం వల్ల 3-7-49 తేదీన మళ్ళీ రాఘవాచారీ మొదలైన డాక్టర్లంతా వచ్చి ''చెయ్యి తీసివేస్తేగాని లాభం లేదు. భగవా& సమ్మతించవలసిం'' దని ప్రార్థిస్తే భగవా& ''అదుగో, ఆ పక్షము వారంతా ఒప్పటంలేదు. భగవానుకు చెయ్యి తీసి వేయడం ఏమిటి? అని అంటున్నారు. నేనేం జేసేదీ'' అని అంటే వారు వచ్చి ఈ పక్క వారితో ''మీరు గూడా మాతో ఏకీభవించండయ్యా'' అంటే, వీరు సుతరాం సమ్మతించకపోవటం, ఆ వెనుక వారికీ వీరికీ వివాదం పెరగటం. ''ఇది ఇట్లాగే వదిలితే రోజులో వారాలో'' అన్న విచారం సూచిస్తూ దాక్టర్లు పట్నం వెళ్ళటం జరిగింది.

ఆ వెనుక ఆయుర్వేద వైద్యంలో, ఆరితేరినవారి నెవరినైనా రప్పించి వైద్యం చేయిస్తే బాగుండునని ఈ పక్షం వారంటే ఆయుర్వేద వైద్యంవల్ల రవంతగూడా ప్రయోజనం లేదనీ, అసలా వైద్యంలో నిపుణు లెవరూ లేరనీ, అనవసరంగా భగవాన్ని పథ్యపానాదులతో శ్రమపెట్టరాదనీ డాక్టర్ల పక్షం వారు వాదింపసాగారు. ''శస్త్రచికిత్స తప్ప వేరే ఉపాయం వాళ్ళ వైద్యంలో లేనప్పుడు వదలరాదా? ఈ డాక్టర్లు వదలరే'' అని వీరూ గోల పెట్టడానికి ఆరంభించారు. భగవాన్‌ వారి మాటలకు ''అవునవు''నని తల వూపారు. వీరి మాటకూ ''నిజమే నిజమే'' నన్నారు. పార్టీలు బలపడ్డవే గాని ప్రయోజనం సున్న.

పుండు క్రమంగా విచ్చి రక్తం అధికంగా కారటానికి ఆరంభించింది, డాక్టరు అనంతనారాయణరావూ శంకరరావూ కలసి ఉదయం అల్పాహారానంతరం గోశాల వెనుకకు వెళ్ళిన భగవానుని అక్కడే కుర్చీమీద కూర్చోబెట్టి కట్టు కట్టేవారు. పుండుమీద ఎండ తాకితే మంచిదని కడిగిన వెనుక ఎండ కెదురుగా కొంచెంసేపు వుంచేవారట. భగవాన్‌ నవ్వుతూ పుండువైపు చూపి ''ఆహాహా; చూడండయ్యా. సూర్యకాంతమణి మన చేతికి కంకణమయింది. ఎంత ఎఱ్ఱగా వున్నదో చూచారా? ఆ సూర్యరశ్శి దీనిమీదపడి ధగధగ ఎట్లా ప్రకాశిస్తున్నదో చూడండి'' అనిన్నీ అనేవారట. విపరీతంగా రక్తం కారటం చూచి ''అయ్యో ఇట్లా కారుతున్నదే?'' అని చొరవగలవారెవరైనా అంటే ''ఊఊ కారనీయండి. ఎవరెవరిరక్తమో తెచ్చి ఒంట్లో ఎక్కించారు. అదంతా పోవద్దూ? పోనీయండి మంచిదేననీ, సూర్యకాంతమణి గదా. శమంతకమణివలెనే ఇదిన్నీ నిత్యం బంగారం పెడుతున్నదన్న మాట. అది పచ్చబంగారమైతే ఇది ఎఱ్ఱ బంగారం. చూడండి. ఎంతెంత వర్షిస్తున్నదో'' అనిన్నీ అంటున్నారు భగవాన్‌.

ఆ రోజుల్లోనే ఒకనాడు కట్టుకట్టే సమయంలో డాక్టర్లూ ఇంకా ఒక రిద్దరు భక్తులూ ''అయ్యో; ఆ వ్రణం ఇంత ఘోరంగా వున్నదే. భగవా& రవంత సంకల్పం తెచ్చుకొని నయం చేసుకోరాదా?'' అని విడువకుండా ప్రార్థించారట. భగవాన్‌ విని విని ''సరిపోయింది. శరీరం ఒకటి వున్నదనీ, ఆ శరీరానికి చేతులున్నవనీ, అందులో ఒక చేతికి పుండనీ మీరంతా అంటూవుటే విని ఆదృష్టితో చూస్తే తోస్తున్నది గాని లేకుంటే నాకేమీ తోచటం లేదే. అంతా వచ్చినట్లే అదీ వచ్చింది. భేదం ఏమీ తోచటం లేదే. ఎవరికోఱకు సకంల్పం తెచ్చుకోవాలి'' అన్నారట భగవాన్‌. గిద్దలూరి సాంబశివరావుగా రక్కడుండి ''మా కొఱకు'' అన్నారట. ఆ వెనుక ఆ భక్తుల మాటకు ఏమీ అవకాశ మీయక భగవాన్‌ డాక్టర్లవైపు చూస్తూ ''ఏం? అంతా వచ్చినట్లే అదీ వచ్చి బాహువెక్కి కూర్చున్నది. మీరంతా వారికి సేవచేస్తున్నారంటే వచ్చిన వారిని గౌరవిస్తున్నారన్నమాట. మణిగదా. దాన్ని చూచి భ్రమించని వా రెవ్వరు?'' అనిన్నీ అన్నారట భగవాన్‌.

Naa Ramanasrma Jeevitham    Chapters