Naa Ramanasrma Jeevitham    Chapters   

39. జ్ఞానికి సంకల్ప మేది ?

డాక్టరు అనంత నారాయణరావుగారు కొంతకాలంగా రాత్రి ఎనిమిదింటి నుండీ తొమ్మిదింటివరకూ శ్రీ భగవానుని కాళ్ళకు తైలంరాచి మర్దనచేసే సమయంలో దగ్గరుండటం జరుగుతున్నది. భగవాన్‌ చేతిపుండుకు రెండవ ఆపరేషన్‌ జరిగినప్పటినుండీ ఏమో భయం తోచి అప్పు డప్పుడు నేనా అనంత నారాయణరావుగారిని ''భగవాన్‌ ఆరోగ్యం ఎట్లా గున్నది?'' అని అడగటం అలవాటయింది. 49 మే మాసంలో ఒక ఉదయాన అదే విధంగా అడిగితే ''ప్రస్తుతం కొంచెం గుణంగానే వున్నది. కాని భగవానుకు నయం కావాలన్న సకల్పం రావాలమ్మా'' అన్నారు వారు. ''ఏమన్నారు? అట్లా గంటారు?'' అన్నాను.

''ఏమీ లేదమ్మా, గత రాత్రి యథాప్రకారం ఎనిమిదింటికి వెళ్ళి నేను కాళ్ళకు తైలంరాచి మర్దనచేస్తూ వుంటే భగవాన్‌ తాముగానే కొన్ని మాటలన్నారు. అవి విన్నప్పటినుండీ ఎట్లాగో వున్నదమ్మా'' అన్నారు డాక్టర్‌. ''ఏమన్నా రేమిటి?'' అన్నాను. ''ఏమి అన్నారా? 'జ్ఞాని, తన శారీరకమైన కర్మ ఎప్పుడు తీరుతుందా? అని ఎదురుచూస్తూనే వుంటాడు. అది తీరిందని తెలిసిన వెంటనే దేహం విడుస్తారు. ఎట్లాగంటే, ఒకడు తలమీద పెద్ద భారం పెట్టుకొని చాలా కష్టంతో (కూలికి) మోస్తూ ఒక చోటినుండి మరొక చోటికి వెళ్ళుతూ గమ్యస్థానం ఎప్పుడు వస్తుందా అని ఎదురెదురు చూస్తూ వుంటాడు. అది రాగానే భారం క్రిందపడవేసి 'అమ్యయ్య' అని విశ్రాంతి తీసుకుంటాడు. అంతటితో వాడిపని తీరినట్లే. అదే విధంగా జ్ఞానిన్నీ తన పని తీరగానే శరీరాన్ని పడేసిపోతాడు. విస్తరి వుంటుంది. భోజనవేళకు దాన్ని శుభ్రంగా కడిగి నానా విధ పదార్థాలూ దానిమీద వడ్డిస్తారు. అవన్నీ తిన్న వెనుక ఆ విస్తరి మడిచి జేబులో పెట్టుకొని పోతారా? అంతటితో దాని పని తీరిందని ఎత్తి విసరి పాఱవేస్తారు. అదే విధంగా జ్ఞానికి ఈ శరీరమున్నూ. పని తీరగానే పాఱవేసి పోతాడు' అన్నా రమ్మా భగవాన్‌. నే నేమీ మాట్లాడలేదు. తల వంచి వూరుకున్నాను'' అన్నారు డాక్టర్‌.

నా గుండె ఝల్లుమన్నది. ''అయినా మన మంతా ఒక్క సంకల్పం తెచ్చుకొవలసిందని ప్రార్థిస్తే తెచ్చుకోరా? ప్రార్థన చేస్తూనే వుందాం'' అన్నారు. ''సరేనమ్మా'' అన్నారు డాక్టర్‌. ఆ వెనుక ఆ పుండు సెలవేసి రక్తం కారటానికి ఆరంభించిందన్న సంగతి విని ఒక సాయంకాలం మళ్ళీ డాక్టర్‌ కనుపిస్తే ''మీరు రాత్రి భగవాన్‌ వద్దకు వెళ్ళి నప్పుడు ఎవరూ ఉండరు గదా. ఒక్క సంకల్పం తెచ్చోకోవలసిందని ప్రార్థించలేదా''' అన్నాను. ''ఎన్నో సార్లయింది. మనస్సనేది వుంటే గదా సంకల్పం తెచ్చుకోవటానికి. మనస్సనేదే లేదాయె. సంకల్పం ఎట్లా తెచ్చుకోవటం. అసలు లేని దాన్ని తెచ్చుకోవాలి; తెచ్చుకొని వృద్ధి చేసుకొని, నిలుపు కోవాలి. ఎందు కది? అన్నా రమ్మా భగవాన్‌. వారి కేం చెప్పగలం?'' అన్నారు డాక్టర్‌.

అది విన్నప్పటినుంచీ నా మనస్సులో ఆందోళన అతిశయించింది.

Naa Ramanasrma Jeevitham    Chapters