Naa Ramanasrma Jeevitham    Chapters   

27. గోలక్ష్మి సమాధి-సంవత్సరోత్సవం

1948 జూలై 18 వ తేదీన గోలక్ష్మిముక్తి. ఆమె సమాధి సంవత్సరోత్సవానికి తిరిగి రావాలన్న సంకల్పంతోనే 1949 జూన్‌ ప్రారంభంలో ఒక కారణంవల్ల నేను విజయవాడ వెళ్ళాను. ఆ కారణం ఏమంటే, లేఖలు రెండవ భాగం ఆశ్రమంవారి చేతిలో చిక్కినప్పటికీ ఒక కాపీ అన్నయ్యవద్ద వున్నది గదా అన్న ధైర్యంతోనూ, భక్తుల ప్రోద్బలంవల్లా, మూడు, నాలుగు, ఐదు భాగాలుగ లేఖలు వ్రాస్తునే వున్నాను. అయినప్పటికీ ముద్రణకయ్యే ఖర్చు భరిస్తాము, ప్రకటించవలసిందని ఎవ రడిగినా రెండవ భాగం అచ్చుకే ఆశ్రమంవారు అనుమతించనందు న ఆ లేఖల ముద్రణ ముచ్చట విరమించుకొని భగవాన్‌ సన్నిధికి రాక పూర్వం వ్రాసిన మానసశతకం, బాలకృష్ణ గీతావళి అచ్చు వేయిద్దామన్న ఉబలాటంతో మా పెద్దన్నగారికి వ్రాస్తే వారు సమ్మతించి నన్ను విజయవాడకు రమ్మన్నారు. సరేనని 1949 జూన్‌లో అక్కడికి వెళ్ళి పుస్తకం ప్రింటు కిచ్చాను. ప్రూఫులు అవీ చూస్తూ లక్ష్మి సంవత్సరోత్సవం మాట మరచిపోయి దాదాపొక 20 రోజులు అక్కడే వుండిపోయాను. భగవాన్‌ చేతిపుండుకు అదివరకే రెండు ఆపరేషన్‌లు అయినవి. రేడియం సూదులు వేసి కట్లు కట్టిన వెనుక రక్తం తగ్గిందనీ, పుండు మచ్చగూడా పడుతున్నదనీ వినుటవల్ల తొందరుండదని అనుకున్నాను.

నే నటువెళ్ళిన పది రోజుల కే మా చిన్న వదినె భగవా& ఆరోగ్యం బాగాలేదు గదా ఒక నెలవుండి పోదామని, వంటమనిషితో సహా మద్రాసు నుంచి అరుణాచలం వచ్చి నా నివాస గృహంలో మకాం పెట్టింది. ఆమె శరీరం కొంచెం స్థూలమూ, అనారోగ్యమూ కలది గనుక ఎప్పుడూ ఆమె సౌకర్యాలన్నీ నేనే చూచేదాన్ని. ఈసారి నేను లేనందున భగవాన్‌ అన్నీ విచారిస్తూ "నాగమ్మ ఎప్పుడు వస్తుంది" అని అడిగేవారట, భగవాన్‌ ఇల్లా అడుగుతున్నారని వదినె వెంటనే ఒక జాబు వ్రాస్తే నేను కదలలేదు. మరి రెండు రోజులయ్యేసరికి మళ్ళీ పుండు రక్తం కారుతున్నదన్న వార్త ఆమె చెవిసోకి "భగవా& నాగమ్మ ఎప్పుడు వస్తుందని రోజూ అడుగుతూ వుంటె నీ వక్కడ ఆగడం ఏమీ బాగాలేదు. భగవా& చేతి పుండు మళ్ళీ రక్తం కారుతున్నదనీ అంటున్నారు. నీవు తక్షణం బయలు దేరి రావలసింది" అని మళ్ళీ వ్రాసింది. ఆ వుత్తరం చూస్తూనే రాత్రి రై లెక్కి మద్రాసులో దిగినా ఆగకుండా పదింటికే బయలు దేరి రాత్రి ఏడున్నరకు అరుణాచలం చేరుకొన్నాను. నా బనకు వెళ్ళగానే వదినె ఇవాళ గోలక్ష్మి సమాధికి సంవత్సరోత్సవమనీ "నాగమ్మ రాకుండా వుండదే? ఎందువల్ల రాలేదో?" అని భగవా9 ఎన్ని సార్లో అన్నారనీ, సాయంకాలం నేను వ్రాసిన "గోలక్ష్మి చరిత్ర" ద్విపద మాలిక తీసుకొని వెళ్ళి తాను చదివాననీ, భగవా నప్పుడు "లక్ష్మి నాగమ్మ చేతుల్లోనే ప్రాణం విడిచింది. ఆనా డంతానాగమ్మ లక్ష్మివద్దనే వున్నది. ఈ ద్విపద నాగమ్మ వ్రాసింది" అని ఎంతో ప్రేమగా అందరితో చెప్పారనీ నాతో అని "రా పోదాం ఆశ్రమానికి" అంటూ నన్ను వెంటబెట్టుకొని తానూ వచ్చింది. భగవాన్‌ భోజనం ముగించి చెయ్యి పళ్ళెంలో కడుక్కుంటూ వున్నారు. మేము ముందు లక్ష్మి విగ్రహాన్ని చూచే భగవా& వద్దకు వెళ్ళాం, భగవా& చూస్తూనే "అరే, నాగమ్మ వచ్చిందే, ఇవాళ లక్ష్మి సంవత్సరదినమే, నాగమ్మ రాకుండా వుండదు అనుకున్నాను. సరిగా ఇవాళే వచ్చిందే, సరిసరి, పోయి లక్ష్మిని చూచిరా" అన్నారు దయతో. చూచే వచ్చాము అన్నాం మేము. "వదినె లక్ష్మి చరిత్రంతా చదివింది ఈ రోజు" అన్నారు భగవా&. "అల్లాగా" అన్నా నేను. తెచ్చినవళ్లూ, పూలూ లక్ష్మివద్దపెట్టి, ప్రసాదం తీసుకొని ఇంటికి పోతుంటే విశ్వనాథ బ్రహ్మచారి కనుపించి "ఓహో, వచ్చావే. 'లక్ష్మి సంవత్సరోత్సవానికి నాగమ్మ రాకుండా వుండదు' అని భగవాన్‌ అంటూనే వున్నారు ఏదోవిధంగా అల్లా వూడిపడ్డావన్నమాట. భగవానుకు నీ మీద వాత్సల్యం ఎంత వున్నదో ఈ రోజు ప్రత్యక్షంగా చూచామమ్మా. నాగమ్మ, నాగమ్మ అంటూ ఎన్నిసార్లు నిన్ను గుఱించి చెప్పారో లెక్కలేదు. బిడ్డలు దగ్గర లేనప్పుడే తల్లిందండ్రుల వాత్సల్యం కనుపిస్తుంది సుమా" అన్నారు. ఈ ప్రభువు ఇంత వాత్సల్యం చూపుతుంటే పుస్తకం అచ్చు నిమిత్తం ఇన్నాళ్ళుగడిపానే. లక్ష్మి సంవత్సరదినం ఉదయానికైనా రాకపోతినే అన్న లఙ్జ న న్నావహించింది. భగవాన్‌ చేతి పుండు మళ్ళీ రక్తం కారుతున్నదన్న వార్త రాగానే ఎక్కడి వని అక్కడే విడిచి వచ్చానని నే ననుకున్నానేగాని "నాగమ్మ లక్ష్మి సంవత్సర దినానికి తప్పక వస్తుంది" అన్న భగవద్వాణియే నన్ను ఈడ్చుకొని వచ్చిందన్న విషయం ఇక్కడికి వచ్చిన వెనుక వీ రందరి మాటలవల్ల తెలిసింది. భగవన్‌ వాక్కు పొల్లుపోతుందా?

Naa Ramanasrma Jeevitham    Chapters