Naa Ramanasrma Jeevitham    Chapters   

23. రిజర్వేషన్‌

వడ్డించేవాడు తనవాడైతే కడ పంక్తిన వుండమన్నా రన్న సామెత ఒకటున్నది గదా? అందుకు తార్కాణంగా భగవాన్‌ వుండే హాలులో ఆడంగులు కూర్చునే స్థలం ముందు భాగంలో ఏమాత్రం ఎడం లేకుండా కొందరు స్త్రీలు ఆసనాలు పరచి కూర్చునేవారు. నేను వెనుక ప్రక్కన ఏ కిటికీ వద్దనో నక్కి, కూర్చునేదాన్ని. భగవాన్‌ తమ వద్దకు ఏ తెలుగు కాగితాలు వచ్చినా, తమ్మెవరైనా ప్రశ్నించినా నా కొరకు తలయెత్తి చూచేవారు. ఒక్కొక్కప్పుడు నేను సరిగా కనుపించక ''నాగమ్మ ఏదీ?'' అని అనే వారు. భగవాన్‌ చూస్తున్నారనీ, పిలుస్తున్నారనీ ఎవరో ఒకరు నాతో చెప్పేవారు. నే నిక ముందుకురాక తప్పేదికాదు. వాళ్ళు స్థలం ఇవ్వకా తప్పేదికాదు. ఈ గొడవంతా చూచి భగవాన్‌ సమీసవర్తులుగా వుండే సత్యానంద స్వామీ వాళ్లు హాల్లో ఆట్టే జనం లేనప్పుడు నన్నుద్దేశించి ''భగవాన్‌ నీకొఱకు తలయెత్తి చూడటం, నాగమ్మ ఏదీ? అనటం ఇదంతా ఎందుకు? మీరు ముందువైపే కూర్చోరాదూ?'' అంటె వెంటనే భగవా నందుకొని ''ఇదంతా ముందే రిజర్వేషన్‌ అవుతుంది గదటయ్యా.'' అన్నారు నవ్వుతూను. అందరికీ నవ్వు వచ్చింది. పురుషు లెవరైనా ఆసనాలు పరచి బయటికి వెళ్ళితేగూడా యిట్లాగే ఛలో క్తిగా ''అదుగో! సీటు రిజర్వేషన్‌ అయిందయ్యా'' అని చిరునవ్వుతో సెలవిచ్చేవారు భగవా&.

ఒకసారి నేను హాల్లో కిటికీవద్ద కూర్చొని అరుణా చలం వైపు చూస్తూ ఏమరుపాటుగా వున్నాను. భగవా& ఎందుకో యిటు చూచారట. కాళహ స్తినుండి వచ్చి భర్తా, తానూ ఇక్కడ నివాసంగా వుంటున్న సూరమ్మ అనే ఒక భక్తురాలు నన్ను కదిపి ''భగవా నెందుకో చూస్తున్నారమ్మా'' అన్నది.

Naa Ramanasrma Jeevitham    Chapters