Naa Ramanasrma Jeevitham    Chapters   

22. తిరిగి లేఖారచన

అన్నిటికంటే ముఖ్య విషయం ఏమంటే నా ప్రార్థనాను సారం భగవాన్‌ తాముగా పలుకరించి మాట్లాడిన వెనుక ఎంతో వాత్సల్యంతో నేను హాలులో లేని సమయంలో ఏదైనా విశేషం జరిగినా, ఎవరైనా ప్రశ్నించినా నేను రాగానే ''ఇదుగో! నీవు లేవు. ఇప్పుడు ఈ సంగతి జరిగింది. వారిల్లా ప్రశ్నిస్తే నేనిల్లా సమాధానం చెప్పాను'' అని అదివరకు కన్న విపులంగా సెలవిచ్చేవారు భగవాన్‌. అది చూచీ, వినీ కుంజు స్వామి మురగనారు మొదలైన ఆప్తమిత్రులు ''భగవాన్‌ ఆ విధంగా సెలవిస్తూ వుంటే వ్రాయకుండా వదలటం అపచారం గాదా? మీరు వ్రాస్తారనే వారు సెలవిస్తున్నారు గాని మా కందరికి చెపుతున్నారటమ్మా? వ్రాయకుండా విడువ వద్దు'' అని హెచ్చరించుటవల్ల తిరిగి 1947 సెప్టెంబరు 3వ తేదీన, మూడవ భాగంగా లేఖలు వ్రాయుటకు ఆరంభించాను. అన్ని పనులూ వదలి ఆ ఒక్క పనిమీదనే వుండటం వల్ల ఆ మూడవ భాగంలో మంచి మంచి ఉపదేశలన్నీ సేకరించటానికి చక్కని అవకాశం లభించింది.

లేఖలు మూడవ భాగంగా తిరిగి వ్రాయుటకు ఆరంభించి కొంతవరకు సాగిన వెనుక 1948 ఫిబ్రవరి, మార్చి ఆ ప్రాంతాలలో వేలూరి శివరామశాస్త్రిగారు భగవాన్‌ దర్శనార్థం దేవులపల్లి సుబ్బమ్మ అక్కగారి కొమారుడు శ్రీరామ మూర్తితో సహా ఆశ్రమానికి వచ్చారు. వారిద్దరూ మధ్యాహ్న భోజనానంతరం నా బసకు వస్తే లోగడ లేఖారచనకు కలిగిన అంతరాయాలూ, ప్రస్తుతం ఆ వ్రాతకు గల ఇబ్బందులూ అన్నీ శాస్త్రిగారికి చెప్పి మూడవ భాగంగా వ్రాస్తున్న ఆ లేఖలు చూపాను. వారందులో కొన్ని చదివి చాలా సంతోషించి ''ఎన్ని అంతరాయాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులున్నా నీవీ పని మాత్రం మానవద్దు. ఇది భగవత్ప్రేరితం గాని మరొకటి కాదు. నీ కెందుకు సందేహం?'' అన్నారు. నే నందుకొని ''ఇన్ని సంకటాలలో ఏమీ చదువురాని ఆడదాన్ని నన్ను వ్రాయమనకుంటే మీరంతా మంచి పండితులు గదా? ఇక్క డుండి వ్రాయరాదా?'' అన్నాను. శివరామ శాస్త్రిగారు చిరునవ్వు నవ్వి ''అమ్మా! మేము, ఈ పని చేయగలమని నీ వనుకోవద్దు. మా మనస్సులు శాస్త్ర సంసారాలలో విహరిస్తున్నందున భగవాన్‌ వాక్కులలో అంత గంభీరార్థాన్ని గమనించవు. నీకు ఆ సంసారం లేదు గనుక భగవానే దైవమనీ, వారి వాక్కే వేదమని భావిస్తావు. అందువల్ల నీవే ఈ పనిచేయాలి. తప్పదు. అధైర్యపడక ఇది నీ విధిగా భావించు'' అని సలహాగానూ, శాసనంగానూ చెప్పి వెళ్ళి పోయినారు. తరువాత ఆ మూడవభాగం ప్రింటయినప్పుడు వారే అంతా పరిశీలించి తొలిపలుకు వ్రాసి యిచ్చారు. నాకు ఎంతో ధైర్యమూ ఉత్సాహమూ కలిగి కలం నడపసాగాను.

అప్పుడప్పుడు చిన్న స్వాములు ''ఏమి? ఇంకా వ్రాస్తూనే వున్నావా?'' అని అడిగేవారు. ''లేదు స్వామీ!'' అనేదాన్ని. కొట్టగా కొట్టగా పైకెగిరే బంతిలాగా వా రదలించిన కొద్దీ నా కలం జరజరా సాగిపోయేది. అయ్యో! చిన్నస్వామితో అసత్యం చెపుతున్నానే అని మనస్సులో సంకోచంగా ఉండేది. వారు నాయం దెంతో దయ చూపేవారు. అటువంటి వారితో అబద్ధం చెప్పవలసి వస్తున్న దే అని తోచి ఒకటి రెండుసార్లు భగవానుని సమీపించి ''నిన్న తమరు సెలవిచ్చిందంతా వ్రాశాను. ఆ శ్లోకా లెక్కడున్నవో?'' అని శ్రీవారి నడిగితే నెంబర్లన్నీ వివరంగా చూపి చెప్పేవారు. ఇంకా సందేహం తీరక ''ఇప్పటికి వ్రాసినవి ఇన్ని లేఖలయినవి. భగవాన్‌ చూస్తారా?'' అని నిదానంగా అడిగితే ''మంచిదే. ఉండనియ్యి. తెలుసులే. చూడనక్కరలేదు. అక్కడుంటేనే భద్రం. ఉండనీ. ఉండనీ,'' అని ఆజ్ఞాసూచకంగా సెలవిచ్చేవారు భగవాన్‌. చూడలేదే అని నా కెంతో కించగా వుండేది.

అంతకుముందు ఒకసారి వంటయింట్లో మనుష్యులు సరిగాలేక చిన్న స్వాములు వంటపని చూడవలసి వచ్చింది. నే నెప్పుడైనా వెళ్ళి కొద్దిసహాయం చేసివచ్చేదాన్ని. పాపం పెద్ద పనులేవీ నాకు చెప్పేవారు కారు. ఒకనాడు నేనల్లాగే పాకశాలలోకి వెళ్ళితే చిన్న స్వాములు నన్ను చూచి ''అమ్మా! చూడు. వాళ్ళంతా ఆడవాళ్ళు వ్రాసే వాళ్ళూను. మగ వాళ్ళు వంటచేసేవాళ్ళూనా? అని నన్నా క్షేపిస్తున్నారమ్మా'' అన్నారు. ''అయితే స్వామీ నేనీ పెద్దవంట చేయగలనా?'' అన్నాను. ''అది కాదమ్మా. నీవు రవంత జొన్ననూక వండి, తిని పాలుత్రాగి సాత్విక ఆహారంతో గడిపేదానవు. ఈ వంట చేయగలవని నేనంటానా? వ్రాత పని మాని ధ్యానం చేసుకో అమ్మా. నీ కెందు కీగోల'' అన్నారు స్వామి. ''సరే స్వామీ'' అని అన్నానే గాని వ్రాతపని మానేందుకు హాల్లో ఏదో ప్రసంగం నడుస్తునే వుండటం వల్ల కలం సాగిపోతూనే వుండేది. ఒక రోజున ఎందుకో వేసటకలిగి, ఈ పని చాలా పెద్దదే సహాయపడేవా రెవ్వరూ లేరే ఎట్లాగా? అని చాలా విచారంగా భగవా& సన్నిధికి వెళ్ళి కూర్చుంటే ఏదో ప్రసంగ వశంగా పిచ్చుక, గరుడుని కథ చెప్పి ''సత్కార్యాచరణ పరులూ, ఆత్మాన్వేషణచిత్తులూ, ఈ పని పెద్దదే, సహాయం యెవ్వరూ లేరే. అని విచారించి విడువక ఆ పిచ్చుక వలెనే శ్రద్ధతో పనిచేస్తే గరుడుని సహాయం వచ్చినట్లే దైవ సహాయం ఒక్కమారుగా దానంతటదే వస్తుంది.'' అని అన్యాపదేశంగా సెలవిచ్చారు భగవా&.

మరొకసారి అడుగడుగునా చిన్నస్వామితోనే కాకుండా ఆసీసుకు సంబంధించిన వారందరూ ''ఇంకా లేఖలు వ్రాస్తున్నారా?'' అని అడగటం, నేను వ్రాయటం లేదని అసత్యం చెప్పటం జరుగుతున్నదే ఏమా ఇది. వ్రాయటం మానేస్తే పోదా? అన్న యోచన గట్టిగా కలిగి శ్రీవారి సన్నిధికి వెళ్ళితే ఆ నాడూ తమ చిన్ననాటి కథలన్నీ చెప్పటంలో ''నేనూ పిన్నికి ఒక్క అబద్ధం చెప్పాను. మధుర నుండి బయలుదేరే రోజున'' అని భగవాన్‌ సెలవిచ్చారు. ''అయితే సత్కార్యాచరణకు అబద్ధం చెప్పినా దోషం లేదా?'' అని నే నడిగితే ''తప్పనిసరి అయితే ఏం జేస్తాం? మనం చెప్పేదేమిటి? ఏదో ఒక శక్తి తానే చెప్పిస్తుంది. శంకరులున్నూ అబద్ధం చెప్పే సన్యసించారు'' అని సెలవిచ్చి నా సందేహం పోగొట్టారు భగవాన్‌.

ఇంకొక విశేషం ఏమంటే, నే నింకా లేఖలు వ్రాస్తున్నానేమో చూద్దామని అప్పుడప్పుడు కొందరు నా బసకు వచ్చేవారు. భగవదనుగ్రహంవల్ల వారొచ్చేసరికి పాతలేఖలే నా చేతులో వుండేవి. ''ఏమి? మళ్ళీ వ్రాస్తున్నారా?'' అనివారడిగితే'' లేదు. ఇవి పాతవే. సవరణలు చేసుకుంటున్నా'' నని సమాధానం చెప్పేదాన్ని. నమ్మినవారు నమ్మారు. నమ్మనివారు ''వ్రాయటం లేదని అంటుందే గాని వ్రాస్తున్నట్లే వున్నది. భగవాన్‌ ఏదో చెపుతునే వున్నారు గదా'' అని చిన్నస్వామి చెవులో వూదేవారు. వారేం జేస్తారు పాపం. నేనేమో వ్రాయటం లేదంటానాయె. గట్టిగా మాట్లాడితే నాకు కళ్ళవెంట నీరు కారేది. దాంతో వారి హృదయం కరిగి ''పో అమ్మా పో, ధ్యానం చేసుకో. ఈ గొడవంతా నీ కెందుకు?'' అనేవారు స్వామి. ''ఊ. ఊ'' అని ఊ కొట్టటమే గాని వ్రాతపని మానటం మాత్రం జరగలేదు.

Naa Ramanasrma Jeevitham    Chapters