Naa Ramanasrma Jeevitham    Chapters   

18. అర్పణ

సరే. తప్పదు గదా అని ముందే ఆఫీసులో యిస్తే భగవానుకైనా చూపరేమోనన్న భయంతో భగవాన్‌ కంటపడితే మంచిదని మరుదినం ఉదయాన లేఖలన్నీ కట్టగట్టి వదినే, నేనూ ఆఫీసువైపు రాకుండా కోనేటి ప్రక్క నుంచి భగవాన్‌ హాలుకే ముందు వెళ్ళాం. ముందు నేనూ నా వెనుక వదినే. భగవాన్‌ సావధానంగా కాళ్ళు చాచుకొని సోఫామీద కూర్చున్నారు. హాలంతా నిశ్శబ్దంగా వున్నది. కంపిత శరీరంతో హాల్లో ప్రవేశించి, కాగితాలకట్ట భగవా& పాదాలవద్ద పెట్టి, చేతులు జోడించి, గద్గదస్వరంతో ''ఇవుగో! వున్న లేఖలన్నీ ఇవ్వమన్నారు. అన్నీ కట్టగట్టి తెచ్చాను. ఇది లేఖల కట్టకాదు. నా హృదయనిక్షేపం. భగవాన్‌ ఏం జేసుకున్నాసరే. కీర్తిసంపదలకు ఆశించి ఈ పని చేయలేదు'' అని అనేసరికి నా కళ్ళవెంట నీళ్ళు బొటబొట కారినవి. భగవాన్‌ ''హూ-హూ'' అని జాలిగా నావైపు చూచి ఆ కాగితాలకట్ట రెండు చేతులతో అందుకొని, అటూ ఇటూ త్రిప్పిచూచి రాజగోపాలయ్యరు కిస్తూ ''ఊ-ఇదుగోనయ్యా. అన్నీ కట్టగట్టి తెచ్చింది. తీసుకుని వెళ్ళి అక్కడివ్వు'' అన్నారు. ఇంతలో నేను కళ్ళనీళ్ళు తుడుచు కొని ఆడవాళ్ళ స్థలంలో ముందువైపు కూర్చున్నాను. నా ప్రక్కనే మా వదినె కూర్చున్నది. నా కా కంటినీర ఆగదు. మా వదినె ఊరుకోమని నన్న ఓదారుస్తూ భగవా& నుద్దేశించి ''నాగమ్మ ఈ లేఖలు వ్రాయటానికి ఆరంభించిన వెనుక నిద్ర అనేదే మరచిపోయింది. రాత్రంతా ఇదే పని'' అన్నది. భగవా& హూ-హూ అంటూ తల వూపి మౌనం వహించారు. రాజగోపాలయ్యరు ఆఫీసునుంచి తిరిగి వచ్చి ''ఒరిజన లేదీ?'' అన్నాడు. ''అన్నయ్య వచ్చినప్పుడే తీసుకొని వెళ్ళారు'' అన్నాను. భగవాన్‌ సాక్షి మాత్రంగా అన్నీ వింటూ, చూస్తూ పలక్కుండా వూరుకున్నారు.

లైబ్రరీ పని వద్దనటం, లేఖలున్నూ వ్రాయకూడ దనటం వల్ల స్త్రీల వాలంటియర్‌ పని మాత్రం మన కెందుకని నేనే విరమించుకున్నాను. ఏ పనీ లేనందువల్ల భగవానుతో మాటలేదు, మంతనం లేదు. వదినె వెళ్ళటం వల్ల ఇంట్లోనూ ఖాళీయే. ఏమీ తోచలేదు. వారం పది రోజులల్లా గడిచేసరికి పిచ్చిపట్టిన ట్లయింది. ఈ పదిరోజు ల్లోపలే చింతా దీక్షితులుగారికి జాబు వ్రాస్తూ పై విషయమంతా వివరించి ఒక పద్యం సమస్యగా రెండు పాదాలు వ్రాసి వదిలేశాను. నా సమస్యయొక్క భావం ఏమంటే, ''అబలలకు (అంటె బలం లేనివారని ఒక అర్థం. స్త్రీలకని ఒక అర్థం) బలము తానే అయి సబలనుగా జేయకుంట తగునా? తనకున్‌'' (భగవానునకు) అని. దీక్షితులుగా రందుకు బదులు వ్రాస్తూ, ఆ సమస్య పూరించారు. ''తన్ను తా నెరిగినవారే సబలులు. తన్ను తా నరయనివారే అబలలు'' అని ఆ పూరణయొక్క భావం.

''అబలలకు బలము తానయి

సబలనుగా జేయకుంట చనునే తనుకున్‌?

సబలులు తన్నెఱిగినవా

రబలలు తన్నెరుగనట్టి యజ్ఞులు తల్లీ!''

దీక్షితులుగారి జాబు చూచిన వెనుక పై పద్యాన్ని ఆధారం చేసుకొని భగవానుని ప్రార్థిస్తూ ''విన్నపం'' అనే పేరుతో9 పద్యాలు వ్రాసి శ్రీ వారికి సమర్పించాను. ఆ పద్యాలు దిగువ వ్రాస్తున్నాను.

Naa Ramanasrma Jeevitham    Chapters