Naa Ramanasrma Jeevitham    Chapters   

16. వెణ్పా - శుక్ల ఛందస్సు

1. గణములు-గల, గగ, య, ర, త, ఛ, జ, స, మ, న, జగ, నగ, భగ, యగ, సగ, బల, నల, భల, సల, జలల, నలల, జవ, నవ, ఇవియే వెణ్పాలో రాదగిన గణములు.

2. బంధము :- య, జ, స, న, గల, గగ, గణము లకు వెనుక వచ్చు గణము లఘు పూర్వము గలదిగను, ఇతర గణముల కనంతరము వచ్చునది గురు పూర్వము గలదిగను నుండవలయును. ఇదియే శుక్ల బంధము.

అంతిమ గణము మాత్రము - ల, గ, లల, లగ, లో నొకటి స్వయముగనో ఉకారయుక్తక, చ, ట, త, ప, వర్గాదిమ నాల్గక్షరములు - ఉ-ఈ వర్ణములోనొకటికూడి నదో రావలయును.

3. పాదములు :- 4, 3, 1, 4, 3 - గణములు గల నాల్గు పాదములు గలవు.

4. ప్రాసము :- 1, 5, 8, 9, 13 - ఈ ఐదు గణములు నొకే ప్రాసముగనో మొదటి మూడు నొకటి, తక్కిన రెండు నొకటిగనో నుండవచ్చును.

5. యతి :- ప్రతి పాదము మూడవ గణమున యతి నియమ మున్నది. ఎన్ని మిత్రము లుండినను మంచిదే.

కలి వెణ్పా :- వెణ్పాలోని పూర్వపాదములు రెండు వలె వరుసగా వచ్చి రెండుత్తర పాదుములతో పూర్తి యయ్యె డిది (కలి వెణ్పా) అనబడును.

1947 జూన్‌లో మౌని (శ్రీనివాసరావు) గారు భగవాన్‌అరవంలో వ్రాసిన విచార మణిమాలకు తెలుగు వ్రాయుడని రాజగోపాలయ్యరుచేత భగవానుని అడిగించి, నన్ను గూడా అడుగుమని ప్రోత్సాహిస్తే అడగటం, కడకు భగవా నది వ్రాయడం జరిగింది. ''నేనేమి పండితుడనా యేమి? మీరే వ్రాసుకోరాదూ? నన్ను వ్రాయమనటం ఎందుకు? తప్పు లున్న వనటం ఎందుకు?'' అని ముందు నాతో భగవాన్‌ అన్నా అవతల వారి తొందరవల్ల వ్రాయక తప్పింది కాదు. నే నీ సారి భగవా న్నేమీ తొందరించక తటస్థంగానే వూరుకున్నాను. భగవాన్‌ అదంతా పెన్సిల్‌తో వ్రాసి కాపీ చేయుమని నా కిచ్చారు. నేనది పుచ్చుకొని ఆఫీసు ముందరకు రాగానే ''నీవు కాపీ సరిగా చేయలేవు. నాకి''మ్మని ఆఫీసులో అధికారులుగా వున్న వా రొకరు తీసుకున్నారు. నేనా విషయం వెంటనే భగవానుకు నివేదించుకున్నాను. భగవాన్‌ ప్రక్కనున్న వారితో సరిపోయింది. నా అక్షరం దానికి బాగా తెలుసును. అదైతే సరిగా కాపీ చేస్తుందని దాని కిస్తే వారు తీసుకున్నారట. అదంతా దిద్ది ఏం పాడుచేస్తారో ఏమో?'' అన్నారు. నే నేమీ చేయలేక నివ్వెరపడి నిలుచున్నాను.

మర్నాడు నేను వెళ్ళగానే భగవాన్‌ ''ఇదిగో! ఆ విచారమణిమాల అంతా వారే కాపీచేసి దిద్దటానికి వారి కెవరికో పంపిస్తారట'' అన్నారు.. నాకు పట్టరాని కోపం వచ్చింది. ''ఓహో! అలాగా! భగవా& వ్రాసింది దిద్దటానికి వారెవరు? వాల్మీకియా? వ్యాసుడా?'' అన్నాను అప్రయత్నంగా, ''ఏమో? వ్యాసపరిష్కారం కానిది అచ్చుకా గూడదేమో?'' అన్నారు భగవాన్‌. రెండు రోజులు గడిచినా ఫెయిరు కాఫీ భగవాన్‌ వద్దకు రాలేదట. మూడవనాటి మధ్యాహ్నం నేను వెళ్ళి నమస్కరించి కూర్చున్న వెనుక తమ ప్రక్కనున్న రాజగోపాలయ్యరుతో ''ఆ విచారమణి మాల అంతా ఎలా కాపీ చేశారో ఏమో. ప్రెస్సుకు పంపే ముందు ఒకసారి నాకు చూపి పంపండని చెపితే బాగుండునే'' అన్నారు భగవాన్‌. వారు చేతులు నలుపుకుంటూ ''అమ్మో! చెపితే వారు కోపగించుకుంటారు.'' అన్నారు. ఆ వెనుక హాల్లో అందరిని చూచి ''ఎవరైనా చెపితే బాగుండును'' అన్నారు భగవాన్‌. అంతా ఒకరి ముఖాలు ఒకరు చూచుకుంటారేగాని ఎవరూ లేవరు. పది నిమిషాలు పురుషు లెవరైనా లేచి వెడతారేమోనని చూచాను. ఎవరూ లేవలేదు. ఏమయితే అయిందని నేనే లేచి ''వెళ్ళి చెప్పనా?'' అన్నాను. ''చెపితే మంచిదే'' అన్నారు భగవాన్‌.

నేను ఆఫీసుకు వెళ్ళి ''భగవాన్‌ తెలుగు విచారమణి మాల అచ్చుకు పంపేముందు ఒకసారి తమకు చూపుమన్నారు. వారు చూడాలట'' అన్నాను. దాంతో నేను తమతో ఏకీభవించలేదని ఉరుములూ మెరుపులూవలె కేకలు బయలుదేరినవి. నే నేమీ జంకక భగవాన్‌ ఈ మాట మీతో చెప్పుమన్నారు చెప్పాను. ఇది భగవదాజ్ఞ. తరువాత మీ యిష్టం. నేను మాత్రం దిద్దటానికి ఒప్పుకోను'' అంటూ బయటికివచ్చి హాల్లో ప్రవేశించాను. ఆ హంగామా అంతా భగవా& వింటూనే వున్నారు గనుక సంగతులు ఏమీ చెప్పక ''ఏమీ లాభం లేదు. ఈసారి భగవాన్‌ కొంచెం శ్రద్ధ వహించక తప్పదు'' అని నా స్థానంలో నేను కూర్చున్నాను పిల్లిలాగా. ఆ వెనుక భగవాన్‌ కృపవల్ల ఏమీ దిద్దుబాట్లు లేకుండానే ఆ విచారమణిమాల అచ్చయివచ్చింది. సత్యాని కెప్పుడూ విజయం తప్పదు. దాన్నను సరించిన వాళ్ళు బాధలు పడకా తప్పదు.

Naa Ramanasrma Jeevitham    Chapters