Naa Ramanasrma Jeevitham    Chapters   

13. వేలూరి శివరామశాస్త్రిగారి జాబులు

ఆ నవోదయ మొదటి సంచిలో వచ్చినవి నాలుగు లేఖలు. అవి చూచిన వెంటనే శ్రీవేలూరి శివరామశాస్త్రి గారు నా కొక జాబు వ్రాశారు. వారు మాకు దగ్గర చుట్టమే అయినా ఎప్పుడూ ఉత్తరం వ్రాయని వారు ఎందుకు వ్రాశారో, ఏమో తెలియక తికమకలాడాను. నేను పద్యరచన కారంభించిన మొదటి రోజుల్లో వారిని సలహా అడిగినప్పుడు ''త్వరపడి ఏదీ ప్రకటించకు'' మని చెప్పారుగదా. అందువల్ల ఏదో నాలుగు మాటలు వ్రాయగానే సవరణ లేకుండా ఎందుకిల్లా ప్రకటించావని వ్రాశారుగాబో లనుకొని కవరు చింపి చూడగానే విస్మయం కలిగింది. దిగువ వారి జాబే పొందుపరుస్తున్నాను.

6-10-47-సూరవరం-ఆత్కూరు టపా-కృష్ణాజిల్లా.

ఓమ్‌. సూరి నాగమ్మ.

''నీ శ్రీరమణాశ్రమ లేఖలు చూచి పొంగిపోయినాను. ఆ మహాపురుషునకు మే మెంతో దూరమునందున్నా నీ లేఖలు మమ్ములను గూడా సాక్షాచ్ఛ్రోతలనుగానూ, సాక్షాద్ద్రష్టలనుగానూ చేసినై. ధన్యాసి. అమ్మా! ఇంకాయీ రీతిగా దూరశ్రోతలను ధన్యులను జేయగోర్తాను. నేను కళ్ళుండి గ్రుడ్డిని. కాళ్ళుండి కుంటిని. నన్నూ, నాబోటి వాళ్ళనూ ఆశ్రమంలోనికే కాక శ్రీ మహర్షుల హృదయగుహలోనికి గూడా తీసుకోపొమ్మని ప్రార్థిస్తాను. ''ఓం పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణా త్పూర్ణ ముదచ్యతే.''

వేలూరి శివరామశాస్త్రి

పై జాబు చదువుకొని కంపితహస్తాలతో శ్రీవారిని సమీపించి ''వేలూరి శివరామశాస్త్రిగారు వ్రాశారిది'' అని చేతికీయగా అందుకొని చూచి హసన్ముఖులై ప్రక్కనున్న రాజగోపాలయ్యరుకు పంక్తి పంక్తీ చదివి, అరవంలో అర్థం చెప్పారు. ''ధన్యాసి అంటే ఏమి?'' అన్నా రా అయ్యరు. ''నీవు ధన్యురాలవు అని అర్థం'' అన్నారు భగవాన్‌. భగవాన్‌ సెలవు పొంది, నేనా ఉత్తరానికి కాపీ తీసుకొని మద్రాసులో ఉన్న మా చిన్నన్నగారికి పంపి, శివరామ శాస్త్రిగారికి బదులు వ్రాయగా వారు వ్రాసిన రెండవ జాబున్నూ దిగువ చూడగలరు.

15-10-47 : సూరవరం

సూరి నాగమ్మ : ఆత్కూరు టపా-కృష్ణాజిల్లా.

''నవోదయలో పడిన నీ నాలుగు లేఖలే నే నెరుగుదును. ఈ అడవి మనిషికి నీ వెనుకటి లేఖ లెట్లా తెలుస్తయ్యను కున్నావమ్మా! సరే. వానిని గూడా చూడాలని వున్నది. ఈ సంగతి నీ వెఱుగవు కాబట్టి తలవని తలంపుగా లభించిన యీ అకారణ వాత్సల్యానికి విభ్రాంతి కలిగింది అని వ్రాశావు. ని న్నీ లేఖలు వ్రాయడానికి ప్రోత్సహించిన మీ చిన్నన్న గారిని అభినందించకుండా వుండలేను.

''ఈ లేఖల ప్రయోజనం అతిమాత్రం. అది మీ అన్న గారికినీ, నీకునూ తెలియకుండా వచ్చిన భగవ దాదేశం. నీ లేఖలు మాటి మాటికి మఱచే జీవులకు మేలుకొలుపు. వీనిని చక్కగా అచ్చు వేయించే భారం మీ చిన్నన్నగారిది. నా లేఖ భగవంతుని హృదయ గుహలోకి వెళ్ళిందని వ్రాశావు. కనుల వెంట జీవభారం చాలా తగ్గిందమ్మా. చాలా తగ్గింది. మీరు వారి పాదసన్నిధిలో వుండడం మీకు గూడా యోగైశ్వర్యం. వారికి పాదవందనములు చెప్పవలెను - మనసులో.''

వేలూరి శివరామశాస్త్రి

ఈ రెండవ జాబున్నూ భగవానుని కందించాను. శ్రీవా రది సావధానంగా చూచి ''ఇవన్నీ పుస్తకరూపంగా వస్తే బాగుండు నంటున్నారే వారు. సరే. ఈ ఉత్తరం గూడా అన్నయ్యకు పంపు'' అని సెలవిచ్చి, చాల కాలంగా వస్తూ, పోతూ వుండే శ్రద్ధాభక్తులు కలిగి విజ్ఞలగు ఆంధ్రు లొకరు (బలరామరెడ్డిగారు) సమీపంలో వుంటె శివరామశాస్త్రిగారి జాబు వారికి చూపారు భగవా&. వారు అదంతా పరిశీలనగా చూచి ''శివరామశాస్త్రిగారు మెచ్చుకున్నారంటె ఈ లేఖలకు చాలా విలువ వున్నదన్నమాటే'' అన్నారు. ''శివరామ శాస్త్రిగారంటె ఎవరు? అన్నాడు రాజగోపాలయ్యర్‌. బలరామరెడ్డిగా రందుకొని ''వారు తెలుగు దేశంలో ప్రసిద్ధి కెక్కిన గొప్ప కవులూ, పండితులూను, శతావధాని, గణపతిశాస్త్రిగారి తరువత ప్రస్తుతం వారికే మంచి పేరున్నది, మంచి వక్త, సాధకుడూను.'' అన్నారు బలరామరెడ్డి గారు. ఆ సాయంత్రమే భగవదాజ్ఞానుసారం ఆ రెండవ జాబున్నూ కాపీచేసి అన్నయ్యకు పంపాను. భగవాన్‌ సెలవిచ్చిన మాటలున్నూ అన్నయ్యకు వ్రాశాను. ఆ వెనుక శివరామశాస్త్రిగారి కిన్నీ పై విషయం వ్రాసి ఆశ్రమం పుస్తకాలున్నూ కొన్ని పంపాను. ఆ జాబుకు బదులు వ్రాసిన వారి మూడవ లేఖ గూడా దిగువ చూడగలరు.

ఓమ్‌. 23-10-46 సూరవరం

సూరినాగమ్మ ఆత్కూరు టపా-కృష్ణాజిల్లా

శ్రీరమణాశ్రమం

''నీ ఉత్తర మందినది. నవోదయ నాకు వారం వారం వస్తుంది. ఆ గొబ్బిపాట అందింది. మిగిలినవి ఎందున్నవో తెలిపినా సరే లేక మీ అన్నగారికడ వుంటే పంపినా సరే. నీవు పంపిన శ్రీ గణపతిశాస్త్రి గారి రమణగీత చూచాను నేటికి.

''హృదయకుహరమధ్యే కేవలం బ్రహ్మమాత్రం

హ్యహమహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి ||

హృదివిశ మనసా స్వం చిన్వతా మజ్జతావా

పవన చలన రోధా దాత్మ నిష్ఠో భవత్వం ||

అనే శ్లోకం ధారణలో వుంది. తరువాత శ్రీసూరి సుబ్బరాయ శాస్త్రిగారున్నూ, బుచ్చిరామశాస్త్రిగారున్నూ అరుణా చలమ్మీద (అప్పటికీ కట్టడాలు లేవు) స్వామిని చూచి వచ్చి

''పరాఞ్చి ఖాని వ్యతృణ త్స్వయం భూ

స్తస్మాత్‌ పరాఙ్పశ్యతి నాంతరాత్మ&,

కశ్చిద్ధీరః ప్రత్యగాత్మాన మైక్ష

దావృత్తచక్షు రమృతత్వమిచ్ఛన్‌''

అను కఠానికి ఉదాహరణ చూచామని నాకు చెప్పారు. నాటి నుండి వారికోసం జీవుడు పలవరిస్తున్నాడు. సంసారం (శాస్త్ర సంసారం) ఇంకా నాశం కాలేదు. అదే అడ్డంకి అని నాకు తెలుసు. భరతఖండంమీద భగవంతుడికి మహా ప్రేమట. ఇక్కడ జంఉతవులు కూడా ఆయన వల్లనే తరిస్తవట. ఇది భాగవతంలో చదివే వుంటావు. అట్టి భగవానుని ఆశ్రయం నీకు దొరికింది. ఇది నాకు మహానందం. నీవు ధన్యవు. వారు చెప్పింది ప్రతిదీ మననం నెయ్యి. నాకూ, లోకానికీ నీ వెంతో వారిని గూర్చి చెపుతావని ఆశిస్తాను.''

వే-శి-శా

ఇదిన్నీ భగవాన్‌ చూచి చిరునవ్వుతో మౌనం వహించారు.

Naa Ramanasrma Jeevitham    Chapters