Naa Ramanasrma Jeevitham    Chapters   

12. లేఖా రచన

ఆ డైరీ ఏర్పాటు జరిగి నప్పుడే మా చిన్నన్నగారు ''నీవు గూడా తెలుగులో వ్రాయవమ్మా; ఎంత మంది వ్రాసినా ఇబ్బంది లేదు'' అని నాకొక డైరీ పుస్తకం తెచ్చియిచ్చారు. నాకు ఫక్కి కుదరక లాభంలేదని వారితో చెప్పాను. ''పోనీ, నా కెప్పుడూ ఉత్తరాలలో భగవాన్‌ విషయా లెన్నెన్నో వ్రాస్తూ వుంటావు గదా. అదే విధంగా వ్రాసి వుంచితే తరువాత ఏం చేయాలో, ఎల్లా మార్చాలో మేము చూచుకుంటాం'' అని చెప్పి పెన్నూ, కాగితాలూ అన్నీ తెచ్చి యిచ్చారు. వారే గాక చింతా దీక్షితులుగారూ, గుఱ్ఱం సుబ్బరామయ్యగారూ మొదలైన భక్తులంతా ''ఆంధ్రులలో ప్రస్తుతం ఇక్కడ నివాసంగా వుంటున్నది నీవే గదా? మేమంతా ఇట్టే వచ్చి అట్టే వెళ్ళే వాళ్ళమేగాని వుండేవాళ్ళం కాదు. మాకు భగవద్వాణిని సేకరించి పంచిపెట్టుట మీ విధిగా భావించి ఈ పని చేయవలసిందని ఎంతో దూరం చెప్పారు. సరే నని 1945 నవంబరు 21వ తేదీన లేఖా రచనకు ఆరంభిస్తూ నేనిట్లా ప్రారంభిస్తున్నా నని భగవాన్‌తో ముఖాముఖిన చెప్పే ధైర్యసాహసాలు లేక మనస్సులోనే మనవి చేసుకున్నాను.

నా యీ రచన జనరంజకంగా వుండదేమో నన్న శంక తోచి గోప్యంగా వుంచా లనుకున్నాను. ''తా నొకటి దలంప దైవ మొక్కటి దలంచు'' నన్నట్లు ఒక చిత్రం జరిగింది. అదేమంటే, అయిదారు లేఖలు వ్రాయగానే శ్రీ భగవానుని స్కందాశ్రమయాత్రా, అక్కడి విందు భోజనాలూ జరిగినవి. ఆ సమాచారమంతా మూడు లేఖలుగా వ్రాసి *ఒకనాటి సాయంత్రం నా బసకు ముందున్న వసారాలో కూర్చుని అవి సరి చూచుకుంటున్నాను. ఛట్టున దేవరాజు మొదలియార్‌ వచ్చి చూచి ''ఏమమ్మా అది?'' అన్నారు. విషయం విని చదువుమంటె చదివారు. వారికి మనం తెలుగు చదివితే బాగా అవగతమవుతుంది గనుక ఎంతో సంతోషించి వెంటనే ఈ సంగతి భగవాన్‌ చెవులో వూదారు. మరుదినం ఉదయాన నేను వెళ్ళి నమస్కరించి లేవగానే ''స్కందాశ్రమం వెళ్ళిన సమాచారమంతా వ్రాశారట గదూ?'' అన్నారు భగవాన్‌. ''ఎవరు చెప్పారు?'' అన్నాను.

-----------------------------------------------------------------------------------------------------

*శ్రీ రమణాశ్రమ లేఖలు ప్రథమభాగం.

''మొదలియార్‌ చెప్పారు. ఏదీ?'' అన్నారు భగవాన్‌. ఇక దాచేందుకు వీల్లేక సాఫీ వ్రాసి సాయంత్రం ఆ మూడు లేఖలూ తెచ్చాను. అప్పుడే భగవా& చదువుమంటే చదివాను. మొదటి లేఖలో ''వారికేం మూటగట్టాలా? ముల్లె గట్టాలా? కఱ్ఱ, కమండలం, కౌపీనం ఇవే గదా పరికరాలు'' అని చదివేసరికి భగవా& నవ్వుతూ ''అయ్యయ్యో! ఈ తుండో మఱి? మరిచిపోయిందే'' అన్నారు తమాషాగా. అందరికీ నవ్వు వచ్చింది. ఆ వెనుక ఆ పదం గూడా చేర్చాను. చాలా బాగున్నవని అంతా అనటంవల్ల మిసెస్‌ తలియార్‌ ఖాను మొదలైన పార్శీ, గుజరాత్‌ భక్తులంతా మర్నాడు మళ్ళీ చదివించారు. తత్కాల సమాగతులైన చలంగారు ప్రతి పదం నిలిపి నేను చదువగా తాము ఇంగ్లీషులో వారందరికీ వివరించి చెప్పారు.

ఇదంతా జరిగిన నాల్గయిదురోజులకు మా చిన్నన్నడి. యస్‌. శాస్త్రిగారు భగవా& దర్శనార్థంవస్తే. పార్శీ, గుజరాతి భక్తులంతా ఆ లేఖలకు ఇంగ్లీషు తర్జుమా వ్రాయుమని వారిని అడిగారు. అప్పటికి ఆ మూడు లేఖలకు ముందు వెనుక కలిసి పది లేఖలు మాత్రమే తయారై వున్నవి. ఆ పదింటికీ కార్బను పేపరుతో వ్రాసిన రెండవ కాపీ వారు తీసుకొని మద్రాసు వెళ్ళి తర్జుమాకు అవకాశం చిక్కక అట్లాగే వుంచారట. అప్పుడు నవీనంగా ''నవోదయ'' పత్రిక నడుపబడుతూ వున్నది. దానికి ఎడిటర్‌ నీలంరాజు శేషయ్యగారు. వారు మా అన్నాగారిని ఏదైనా వ్యాసం వ్రాయుమని కోరితే ''నా కేమీ తీరిక లేదు. ఈ లేఖ లున్నవి. కావాలంటే ప్రచురించం'' డని ఇచ్చారట. శేషయ్యగారే వాటికి ''శ్రీ రమణాశ్రమ లేఖలు'' అని పేరుపెట్టి నవోదయలో క్రమంగా ప్రకటిస్తూ ఆశ్రమానికి కొన్ని కాపీలు పంపేవారు. మొదటి సంచిక రాగానే భగవా& చూచి సమీపవర్తులతో ''ఇదుగో నోయ్‌, రామకృష్ణ (ప్రభ) విజయంలో వలెనే ఇక మనమాటలన్నీ వస్తవన్నమాట. (రామకృష్ణ విజయం ఆ మఠం వారి మాసపత్రిక.) నాగమ్మ వ్రాయటం ప్రారంభించింది. అవి నవోదయ పత్రికలో ప్రకటించారు. చూడండి'' అంటూ ఆ పత్రిక అందరికి చూపారు. దీక్షితులుగారు వచ్చినప్పుడు ''ఈ నాగమ్మ పత్రికలకు విషయదానం చేస్తుంది'' అన్న భగవద్వాణికి ఇదే భవిష్యదర్థం కాబోలునని అనుకున్నాను.

Naa Ramanasrma Jeevitham    Chapters