Naa Ramanasrma Jeevitham    Chapters   

11. నా గ్రంథ రచన

ఆరు నెలలు గడిచిన వెనుక నా నివాసం రాజుసెట్టి గారి కాంపౌండుకు మార్చాను. అక్కడ నా వ్రాతపని ప్రశాంతంగా వుండేది. ఆశ్రమం పని ఏదీ లేనప్పుడు గ్రంథ పఠన, పద్యరచన చేస్తూవుండేదాన్ని. 1943 నుఉండి 1945 లోపల తారాపథం, (భగవా& చూపును గుఱించిన 27 పద్యాలు) నక్షత్రమాల,అర్పణ ఇంకా ఏవేవో పద్యాలు వ్రాసి, లోగడ వ్రాసిన శరణాగతి ఇత్యాది పద్యాలున్నూ కలిపి కాపీచేసిన బైండు పుస్తకం శ్రీనివాసమౌనికి చూపితే వారెంతో సంతోషించి దానిపైన ''రమణకరుణావిలాసం'' అనే పేను వ్రాసియిచ్చారు. అదిఒక సంవత్సరాదికి శ్రీవారికి సమర్పించాను. మరొక సంవత్సరాదికి భగవా& సన్నిధికిరాక పూర్వం వ్రాసిన ''బాలకృష్ణగీతావళి'' అనే 108 పద్యసంపుటిది భగవానునకు అంకితం వ్రాసి ఆ పుస్తకం సమర్పించాను. ఆ నాడు మా చిన్నన్నగారు, వదినెగారు భగవా& సమక్షంలోనే వున్నారు. నా కవిత్వధోరణి వారికప్పుడు అవగతమైంది. ఇంకొక సంవత్సరాదికి ''రమణశతకం'' వ్రాసి సమర్పించాను. ఆ వెనుక కొన్ని పాటలూ, భగవా& నెల విచ్చే చిన్న కథలూ, స్వర్ణోత్సవ ద్విపదమాలిక, గోలక్ష్మి చరిత్ర, ఇంకాకొన్ని ద్విపదమాలికలూ వ్రాశాను. అవన్నీ చాలాభాగం అముద్రితాలే.

మా చిన్నన్నగారు మద్రాసు వచ్చిన వెనుక సెలవు రావటమే తడవుగ ఆశ్రమానికి వచ్చేవారు. ఒక్కొక్కసారి స్నేహితులతోనూ వచ్చేవారు. వచ్చినప్పుడల్లా భగవా& సన్ని ధిలో జరిగే సంభాషణలూ, చర్చలూ చెపుతూవుండే దాన్ని. వారవన్నీ చూచి ''ఇదంతా ప్రత్యేకం ఒక గ్రంథంగా వ్రాస్తే బాగుండును'' అనే వారు. నేను ఆశ్రమానికి రాక పూర్వం మునగాల వెంట్రామయ్యగారు ఆశ్రమ భక్తుల ప్రోత్సాహంతో ఇంగ్లీషులో డైరీ వ్రాయుటకు ఆరంభించారనీ కారణాంతరాలవల్ల కొంతవరకు వ్రాసిన వెనుక ఆపవలసి వచ్చిందనీ విన్నాను. అప్పుడా వ్రాత ప్రతి అజ్ఞాతంగా ఆశ్రమం లోనే వుండిపోయింది. (ఇటీవల మహర్షి ''టాక్సు'' అనే పేరుతో ప్రకటితమైనది) అందువల్ల ఆ వ్రాత పని కష్టం గనుక మగ వారెవరైనా వ్రాస్తే మంచిదని అనేదాన్ని. ఆ తరువాత అరవిందబోసు, మా అన్న మొదలైన వారంతా యోచించి 1945 లో ఆఫీసువారి అనుమతితో దేవరాజమొదలియారు ఇంగ్లీషులో డైరీ వ్రాసేలాగున ఏర్పాటుచేశారు.

Naa Ramanasrma Jeevitham    Chapters