Naa Ramanasrma Jeevitham    Chapters   

శ్రీ

ఓం నమో భగవతే శ్రీరమణాయ

1. బాల్యం

గుంటూరు జిల్లాలో మంగళగిరికి దగ్గరనున్న కొలను కొండ అగ్రహారం నా జన్మస్థానం. జన్మించింది ప్లవనామ సంవత్సర భాద్రపద మాసం. అది భోగేశ్వర క్షేత్రం. దోర్బల చిన వెంకటశాస్త్రిగారు నా తండ్రి. సోమి దేవమ్మ నా తల్లి, వామనమూర్తివలె వుండే వ్యాఘ్ర నృసింహశాస్త్రి అనేవారు నా జ్యేష్ఠ సోదరుడు, వారి వెనుక కనకదుర్గ అనే అక్క, శేషాద్రిశాస్త్రి, శోభనాద్రిశాస్త్రి అనే అన్న లిద్దరూ, నేనూ, మా తల్లిదండ్రుల సంతానం. నాకు నాలుగేండ్ల వయస్సులోనే తండ్రి, పదేండ్ల వయసులో తల్లి స్వర్గస్థులైనారు. నా వయస్సు 11 దాటకుండా ఏలూరు వాస్తవ్యులు సూరి రామావధాన్లుగారి ప్రథమ పుత్రునకిచ్చి పెండ్లి చేశారు. సునీతి మొదలైన స్త్రీలంతా పతిసేవ వల్లనే తరించారు గదా నేనూ అదే విధంగా కాలం గడుపుదామని అనుకుంటే, పన్నెండో ఏడు దాటగానే ఆ భర్త గూడా ఆ జన్మబ్రహ్మచర్యం నాకిచ్చి స్వర్గస్థులైనారు. తెలిసీ తెలియని వయస్సయినా వెంట వెంటనే వచ్చిన యీ కష్ట పరంపరలవల్ల నా హృదయం పగిలినట్లయింది. హృదయవిదారకమైన చింతతో దాదాపు మూడేండ్ల వరకూ మా తండ్రిగారి పెద్ద భవనంలో, ఒక్క గదిలోనే ఉండిపోయినాను. తగిన ఆహారం తీసుకొన కుండుటవల్ల జీర్ణకోశం దెబ్బతిన్నది. సూర్య చంద్ర రశ్మి సోకటం అప రూపమైనందువల్ల పాలిపోయి బల్లివలె చినుగుల చాపనంటుకొని చెయ్యియే తలగడగా చాలా భాగం శయనించే వుండే దాన్ని, ఎవరు వచ్చినా ఏడుపే, అల్లా కొన్ని నెలలు గడిచినది.

పూర్వజన్మ సుకృతంవల్లనో ఏమో నాకు బుద్ధి తెలిసిన దాదిగా ఏవరైనా ఉత్తమ గ్రంథాలు చదివినా, భక్తి గీతాలు పాడినా అర్ధరాత్రి, అపరరాత్రి అనకుండా కూర్చుని వినడం నాకు పరిపాటిగా వుండేది. ఆ శ్రద్ధకు అంతా సంతోషించేవాళ్ళు. ఆ వినికిడి ఆ కష్టదశలో ఎంతో ఉపకరించిందన్నమాట. తల్లి, తండ్రి, భర్తా, బిడ్డలూ, ఇల్లూ, వాకిలీ ఇత్యాది ముఖ్య బంధాలన్నీ ముందే గతించినవి గనుక దైవ చింతనకన్న వేరే గతిలేదని తోచింది. భగవత్కృపవల్ల సంసార సాగరంలో అడుగైనా పెట్టకుండా ఆ జన్మబ్రహ్మ చర్యం లభించిందిగదా. అది ఎల్లాగైనా సార్థకపరచుకోవాలన్న ఆరాటం నన్నావరించింది. పాఠశాలాప్రవేశ మెరుగని విద్య అయినా ఎల్లాగో గుణించుకుంటూ స్వభాషలోవున్న ఉత్తమ గ్రంథాలు కొన్ని చదువుటకు ఆరంభించాను. అన్నిటి లోనూ పోతన భాగవతం అభిమాన గ్రంథం అదే అధికంగా చదువుకునే దాన్ని. ఆ భాగవతం తృతీయ స్కంధంలో కపిల మహాముని తల్లియైన దేవహూతికి తత్త్వబోధచేసే ఘట్టం చాలా అద్భుతంగా వుంటుంది. ఒకసారి ఆ ఘట్టం పదేపదే చదివి అంత వాత్సల్యంతో అన్నీ బోధించే సిద్ధపురుషు లెవ్వరూ నాకు సన్నిహితులుగా లేరే అన్న చింతతో కన్నీరు కార్చి కార్చి సొమ్మసిలి నిద్రపోయినాను.

ఆ నిద్రలో ఒక సిద్ధ పురుషుడు దక్షిణాభిముఖంగా భూమికి గజం ఎత్తున పద్మాసనస్థుడై అభయహస్తంతో దర్శనం ఇచ్చాడు. సాక్షాద్దక్షిణామూర్తివలె మౌన ముద్రాంకితుడై వున్న ఆ మహాత్ముని చుట్టూ అలౌకికమైన తేజస్సు ఆవరించి వున్నది. ఆ తేజోమూర్తిని చూడగానే శరీరం గగుర్పొడిచింది. నమస్కరింతామని లేవబోయి ఉలిక్కిపడి కళ్ళు తెఱిచాను. ఆ దృశ్యం అదృశ్యమైంది. కలవరపడిన మనస్సుతో గది అంతా కలయ జూచాను. ఎక్కడా ఏమీ లేదు. ఎంతో విభ్రాంతి కలిగింది. ఇది 1913 ఆ ప్రాంతాన జరిగిన ఘట్టం. అప్పు డప్పుడు ఆ మూర్తి నా హృదయ ఫలకంతో అచ్చు గ్రుద్దినట్లు గోచరిస్తూనే వుండేది. గోచరించి నప్పుడల్లా జాగ్రత్ప్రపంచంలో అట్టి సిద్ధపురుషుని సేవ లభించునట్లొనర్పుమని సర్వేశ్వరుని ప్రార్థిస్తూ, నా యీ అనుభవం నాలోనే ఇముడ్చుకొని సమయానుసారంగా సద్గోష్టిని కల్పించుకుంటూ జీవసేవ దేవపూజగా భావించి అన్నల వద్దనే కాలం గడుపుతూ వచ్చాను.

మా అన్న శేషాద్రిశాస్త్రిగారు విజయవాడలో వకీలు పనికి ప్రారంభించుటవల్ల 1918 లో మా మకాం అక్కడికి మారింది. అప్పుడు కృష్ణానదీ స్నానమనీ, దీపారాధనలనీ, దేవతాపూజలనీ, ఉపవాసాలనీ అందరితోపాటు నేనూ ఆరంభించాను. పూర్వాచారపరాయణులైన పెద్ద వాళ్ళల్లో కొందరు సకేశినుల కివి పరికిరావని ఆక్షేపించారు. మంత్రోప దేశం పొందుదామన్నా అదే మాట. ఆ పీడ వదలించు కుందామని మా వాళ్ళను పోరితే ఒకసారి తిరుపతి యాత్రగా బయలుదేరి అన్న లిద్దరూ కుటుంబాలతో నన్ను వెంటబెట్టుకొని మద్రాసు చేరగానే, మా ముఖ్య బంధువులకు గొప్ప విపత్తు సంభవించినదని తెలసి వెనక్కు రావలసి వచ్చింది. అంతటితో దైవ నిర్ణయం అది కాదని అనిపించింది. అదేగాక, మొదలే ఈ కేశఖండనకు అంగీకరించని మా అన్నలు ఈ అంతరాయాలవల్ల ఆ వెనుక ఆ విషయమే తలపెట్టలేదు. ఏం జేస్తాం? ఈ నియమాలన్నీ కర్మకాండకేగాని జ్ఞానకాండ కేమీ లేవు అన్న పెద్దల వాక్యాలు స్మరించి కర్మకాండకు స్వస్తి చెప్పాను, అయినా సూటిపోటు మాటలు చురుక్కు చురుక్కున సూదులల్లే గుచ్చుకుంటునే వుండేవి.

మాకు దూరపు బంధువైన కైవారపు బాలాంబగారప్పుడు మంగళగిరి క్షేత్రంలో అన్న దానంచేస్తూ వుండేది. ఆమె సత్రంలో అన్నం తినని యాత్రికు లెవ్వరూ వుండరనటం అతిశయో క్తి కాదు. ఆ క్షేత్రాధిష్ఠానదైవమైన పానకాల నృసింహస్వామియే ఆమెకు ఉపాసనా దైవం, ఉత్సవ సమయాలలో వండిన పదార్థానికి మించిన జనం అప్పుడప్పుడు రావటం కలదనీ, కార్యనిర్వాహకులంతా కలత పడుతూ వుంటే, ఆమె ఆ పదార్థ రాశివద్ద నిలిచి, టెంకాయ కొట్టి, కర్పూరం వెలిగించి, రాశి చుట్టూ ముమ్మారు తిరుగుతూ ''నాయానా! నరసింహా! ఎల్లాగురా బాబూ? అంతా సరిచేయాలి సుమా'' అని ప్రార్థించి వడ్డన ప్రారంభింప చేసే దనీ, చిత్రంగా పదార్థం సరిపోయేదనీ వింతగా చెప్పుకునే వారు. ఏటేటా చందా నిమిత్తం ఆమె విజయవాడలో మా అన్నగా రింటికి వస్తూ నన్నెంతో వాత్సల్యంతో చూచి భాగవత గాథలన్నీ చెపుతూ వుండేది. ఆమె గూడా సకేశినియగు వితంతువే. ఆమె నొక ఆదర్శంగా తీసుకొని నేను ధైర్యం తెచ్చుకునే దాన్ని.

అదేగాక కీర్తిశేషురాలైన తరికొండ వెంకమాంబ గారి జీవతమున్నూ నాకు ఆదర్శమే అయింది. ఆమె నావలెనే బాలవితంతువని వినికిడి. ఆమె బాలకృష్ణుని సాకారోపాసనతో ప్రారంభించి నిర్గుణ పరతత్త్వావధిని చేరిన ఉత్తమజ్ఞాని, ఆమె గాథ లెన్నో అజ్ఞాతంగా వున్నాయి. ఆమె వ్రాసిన వేంకటాచలమహాత్మ్యం, రాజయోగసారం (ద్విపదకావ్యం) సుప్రసిద్ధమై వున్నాయి. వాసిష్ఠంగూడా ద్విపద కావ్యంగా వ్రాసింది. బాలకృష్ణుని ముద్దులున్నూ పాటలుగ సనాతన స్త్రీల కంఠస్థమై వున్నవి. ఆమె గూడా సకేశినియేనట. తరి కొండ వాస్తవ్యులలో కొంద రది. సహించక శంకరపీఠాధిపతులలో ఒకరిద్వారా ఆజ్ఞాపత్రిక పంపగా ఆమె నేను శ్రీవారితో మాట్లాడిని వెనుక నా ప్రశ్నకు సరియైన ప్రత్యుత్తరం వస్తే వారి యాజ్ఞ శిరసావహిస్తానని అన్నదట. శ్రీవా రామెను చూడరు గదా! పటాంతరమున నిలిచి ప్రశ్నించుటకు ఏర్పాటు కాగా ''బోడి కావలసినది ఏది? మళ్ళీ మొలవనిది ఏది?'' అని ప్రశ్నిస్తే, శ్రీవారు ఆమె విజ్ఞానమునకు విస్మితులై ''తల్లీ! లోకాచారాన్ననుసరించి పత్రిక పంపామేగాని నీ వంటి వారికి విధి నిషేధములు లే'' వని ప్రశంసించినారనన్నీ ప్రతీతి. నేను ఇవన్నీ ఆదర్శంగా తీసుకున్నప్పటికీ తలపులు బోడులయ్యేందుకు తగిన గురువు కావాలి గదా? ఆ భాగ్యం ఎల్లా లభిస్తుందా? అని ఎదురుచూస్తూ వుండగా కవయిత్రి శ్రీమతి గుడిపూడి ఇందుమతీదేవిగారి పరిచయం లభించింది. ఆమెవద్ద కవిత్వ లక్షణం కొంచెం తెలుసుకొని మనస్సుకు ఎన్నో నీతులు బోధించుకుంటూ మానసశతకం అను పేరుతో 108 పద్యాలు వ్రాశాను.

ఇంతలో అశక్తుడై బ్రహ్మచారిగా నా సేవపైన ఆధారపడివుండే మా జ్యేష్ఠసోదరుడు వ్యాఘ్రనృసింహశాస్త్రి, 1923లో స్వర్గస్థులైరి. అంతటితో నాకుగల రవ్వంత బాధ్యత బంధమున్నూ వీడినట్లయింది. ఇక యీ కుటుంబాల మధ్య నలగటం ఏమాత్రం రుచించలేదు. ఏ మహనీయుని వద్దనైనా జన్మ తరించగల మార్గం తెలుసుకొనవలెనన్న జిజ్ఞాస ప్రబలమైంది. ఎందరో మహానుభావు లున్నారని విన్నాకలలో కనుపించిని సిద్ధ పురుష లక్షణాలు వారెవరికిని కలవని వినబడనందున ఎవరినీ గురువుగా స్వీకరించ లేదు. అవకాశం చిక్కినప్పుడల్లా విజయవాడకు అధిష్టాన దేవతయైన కనక దుర్గను దర్శించి సద్గురువు నొకరిని ప్రసాదింపుమని ప్రార్థిస్తూ వుండేదాన్ని, మానస శతకం ఆ దేవికే అంకిత మిచ్చాను. అందులో సద్గురుని అన్వేషణను గుఱించే చాలా పద్యాలు వున్నవి. ఈ పద్య రచన కారంభించిన కొత్తలో ఒక్కసారి శ్రీ వేలూరి శిరామశాస్త్రిగారితో నా పద్య రచనను గుఱించి సలహా అడిగాను. వారెంతో సంతసించి ''నా జీవితానికి ఈ రచన చాలా సహకరిస్తుందనీ, రచన భక్తిపరంగా వుంటే మంచిదనీ చెప్పి పది పద్యాలకు ఒక్కటి పనికి వస్తుందనే భావంతో వ్రాస్తే బాధవుండదనీ, తొందరపడి ప్రకటించవద్దనీ చక్కని సలహా యిచ్చారు. అందువల్ల నా రచన నిగూఢంగానే వుండిపోయింది.

వాసుదేవమననం, సీతారామాంజనేయం, కైవల్య నవనీతం, పంచదశి, వాసిష్ఠం ఇత్యాది వేదాంత గ్రంథాలు ఎన్నో చదివాను. ఎన్ని చదివినా శ్రీగురు కటాక్షం పొందనందువల్ల అనుభూతి నందటం దుష్కరమైంది. కడకు ఉపాసనా మార్గమును అనుసరించి, ఆత్మయే బాలకృష్ణుడుగా, చిత్తమే గోప భామినిగా మానసికారాధనతో కాలం గడుపుతూ ఏ తత్‌ పద ప్రాప్తికై చింతించునట్లు అప్పుడప్పుడొదవిన భావములను ''బాలకృష్ణ గీతావళి'' అను పేరుతో పద్యాలు వ్రాసుకుంటూ, పగలు గృహ కృత్యములతో గడపి రాత్రికాలం ఈ చింతనకు ఉపయోగించే దాన్ని, అందువల్ల నా పద్య రచనగాని, నా ఉపాసనా విధానంగాని, స్వప్నగత సిద్ధ పురుష సందర్శనంగాని నా అన్నలకు గూడా తెలియనంత నిగూఢంగా వుండిపోయింది. మా అన్నలు నే నడిగిన గ్రంథాలన్నీ ఆదరంతో తెచ్చేవారు. అన్నీ చదివే దాన్ని, ఎన్ని చదివినా ఎంత సాధనచేసినా శాంతి కుదరలేదు.

సీతారామాంజనేయ సంవాదం చదివినప్పుడు, ముద్రా లక్షణాలున్నూ పట్టి చూచాను. ఉహూ! పట్టు చిక్కలేదు. అప్పుడప్పుడు పద్మాసనం మొదలైన ఉత్తమ ఆసనాలున్నూ అభ్యసించి చూచాను. శాంతి కుదరలేదు. శారదా నికేతనానికి రమ్మని ఉన్నవ లక్ష్మీబాయమ్మగారు ఆహ్వానించింది. ''అది ఆధ్యాత్మిక పంథా కాదు గదా?'' అని మా అన్న లందుకు సమ్మతించలేదు. జీవసేవ దేవ పూజగా భావించి వ్యాధిగ్రస్తు లెందరికో సేవ చేశాను. అయినా తృప్తిలేదు ఏదో వ్యధ, ఏదో అసంతృప్తి, అనవరతం బాధించేది. రానురాను ఈ అసంతృప్తి ప్రబలి కుటుంబాల మధ్యనుండి ఎట్లా గైనా బయలపడాలని అనిపించింది. ఏ క్షేత్రమందైనా వుండి ప్రశాంతంగా జీవితం గడుపుట కాశించి అన్నల నడిగితే ''ఒంటరిగా ఎక్కడకు వెళ్ళగలవమ్మా?'' అని అనేవారు. మా చిన్నన్న డి. యస్‌. శాస్త్రిగారు అలప్పిలో వుండగా వారితో అనంతశయనం, కన్యకుమారి ఇత్యాది క్షేత్రాలన్నీ చూచాను. అక్కడ ఒంటరిగావుండి కొన్నాళ్లు చూద్దామా? అని అనిపించింది. కాని ఒంటరిగా వదులుతారా? పోనీ, విజయవాడలోనే విడిగా చిన్న కుటీరం నిర్మిస్తే, అక్కడ వుంటూ సద్గోష్ఠితో కాలం గడుపగలను అని అనే దాన్ని, ''అయితే, అక్క కొడుకును దత్తత చేసుకో'' అనేవారు. అదొక సంసారం కాదా? అనీ, మనువర్తిదారుకు దత్తుయేమనీ అనేదాన్ని. అందువల్ల అది జరగలేదు.

విజయవాడ వచ్చిన దాదిగా అప్పుడప్పుడు అరుణా చలంలో ఒక మహాత్ముడున్నాడని చెవిని పడేదేగాని వెళ్ళాలన్న తీవ్రత అప్పుడు కలుగలేదు. అల్లా దాదాపు పదేండ్లు ఆ అసంతృప్తితోనే గడిచిపోయింది. అంతకంతకు ఆ జిజ్ఞాస (అసంతృప్తి) ప్రబలమై నరాలలోని బలాన్ని క్రుంగదీసి మంచం పట్టించింది. మందులు ఎన్నో వాడారు. ప్రయోజనం సున్న. కోకా చలపతిరావుగారూ, కొమఱ్ఱాజు అచ్చమాంబ మాకు కుటుంబ వైద్యులూ, ఆప్తమిత్రులూను, వారిద్దరూ చాలా దూరం పరిశీలించి ''ఈ వ్యాధికి మూలం మానసికంగా కనుపిస్తున్నది, మా మందులకు లొంగదు. ఆమె చిత్తవృత్తికి అనుకూలమైన వాతావరణంలో వుంచితేగాని కుదుటపడదు.'' అని మా అన్నలతో చెప్పుటయేగాక ''నీ మనస్సును నీవే బాగుపరచుకోవలసిం'' దని నాకున్నూ సలహా యిచ్చారు. నాకదే భగవ దాదేశంగా తోచి ఏ విధంగా నైనా ఈ కుటుంబాలలోనుంచి బయట పడవలెనన్న దృఢ నిశ్చయం కలిగింది. 1940 జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతాలలో జరిగిన యీ ప్రబోధము ఫలితంగా 1940 మేలో ప్రకృతి వైద్యం ఆరంభించి, జొన్న నూకతో అన్నమూ, సాత్వికమైన కూరలూ ఆహారంగా తీసుకుంటూ ఆ వైద్యమే ఒక నెపంగా 1940 జూన్‌లో మా అన్నల అనుమతి పొంది కొలనుకొండకు నా మకాం మార్చాను.

మా తండ్రి కట్టించిన పెద్ద భవనంలో అప్పు డెవరూ కాపురం లేరు. అందువల్ల పెద్ద పెద్ద పాములూ, జెఱ్ఱులూ, తేళ్ళూ తిరుగుతూ వుండేవి. అవి, నేనూ ఆ యింట్లో వుండే వాళ్ళం, నా జోలి కవీ రాలేదు. వాటి జోలికి నేనూ పోలేదు. రాత్రి సంచారం వాటిదీ, పగటి సంచారం నా దీను. మా నివాసం చాలా చిత్రంగా వుండేది. మనస్సుకు నిర్భీతిని అలవరించుకొనుట కానివాసం ఎంతో సహకరించింది. ప్రకృతి వైద్యం, అంటే తొట్టి స్నానం, కృష్ణ కాల్వలో శిరఃస్నానం సాత్వికాహారం, భోగేశ్వర, విశ్వేశ్వర, పట్టాభిరామ దేవాలయాల సేవ, మధ్యాహ్న వేళల భాగవత పఠనం ఇదీ అక్కడి నా దినచర్య. ఈ మార్పుతో ఆరోగ్యం కొంతవరకు కుదుట పడ్డది. ఆ రోజుల్లోనే గుడిపూడి ఇందుమతీ దేవి, ఆమె భర్త యాత్రకు వెడుతుంటే వారితో భద్రాచలం, రామేశ్వరం వగైరా యాత్రలు చేసివచ్చాను. అదీ అంతగా శాంతినీయలేదు. అందువల్ల ఏదో ఒక సత్పురుషసాన్నిధ్యం కావాలన్న చింతమాత్రం అంతకంతకు అధికమైంది. మార్గం కనిపించక భోగేశ్వరస్వామిని మనసా ప్రార్థిస్తూ వుండేదాన్ని. అప్పుడు మా చిన్నిన్న డి. యస్‌. శాస్త్రిగారు ఎర్నాకొలం (కేరళ) సెంట్రల్‌ బ్యాంకులో పనిచేస్తూ వుండేవారు. వారికి 1941-లో అక్కడనుండి అహమ్మదాబాదు బదిలీ కావటంవల్ల ఒక నెల సెలవుపెట్టి కుటుంబంతో సహా అటూయిటూ తిరగటంలో అరుణాచలం వెళ్ళి శ్రీ రమణభగవానుని దర్శనం చేసుకొనే భాగ్య వారికి లభించింది. భగవానుని చూడగానే నా పూర్వ పుణ్యంవల్ల నాగమ్మను ఇక్కడకు పంపితే స్తిమితపడగలదని వారికి తోచిందట.

అప్పు డక్కడ మా పెత్తండ్రిగారి కొమార్తె దేవులపల్లి సుబ్బమ్మగారు భర్త గతించిన దుఃఖం శమించుటకై కొన్నాళ్ళుగా వుంటున్నదట. ఆమెకూడా వున్నందున ఫరవాలేదని తోచి అహమ్మదాబాదు వెళ్ళగానే అంటే, 1941 జూన్‌లో శ్రీరమణభగవానుని సన్నిధికి వెళ్ళుమని నాకూ, పంపుమని విజయవాడలోనున్న పెద్దన్న శేషాద్రిశాస్త్రిగారికీ జాబులు వ్రాశారు. తోడెవరూ లేకుండా ఎల్లాపోగలనని వ్రాస్తే భగవంతుడే తోడని బదులు వచ్చింది. ఆ చిన్నన్నగారి కుటుంబంతోనే అప్పుడప్పుడు అటు బొంబాయి, ఇటు దక్షిణా పథంలో కోయంబుత్తూరు, ఎర్నాకొలం వగైరా వూళ్ళన్నీ నేనున్నూ తిరగటంవల్ల హిందీ, అరవం కొద్దిగా మాట్లాడటం అలవాటయింది. అందువల్ల ఒంటరిగా వెళ్ళినా ఫరవాలేదని 1941, జూలైలో మా పెద్దన్న గారు తిరువణ్ణామలకు సరాసరి టికెట్టుకొని విజయవాడలో రాత్రివేళ మద్రాసుమెయిలు ఎక్కించారు. గూడూరులో దిగి కాట్పాడిమీదగా విల్లుపురం వెళ్ళే రైలు ఎక్కాలన్నమాట.

Naa Ramanasrma Jeevitham    Chapters