Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page

మండన మిశ్ర విజయం

వ్యాసులవారు ఆదేశించినట్లు శ్రీ శంకారాచార్యులవారు దిగ్విజయం గావించేరని వెనుక చెప్పేము. వారి దిగ్విజయాన్ని గూర్చి కొన్ని వివరాలు మనం గమనించాలి. దిగ్విజయానికై ఆచార్యులవారు మున్ముందు తూర్పుగా పయనించేరు. ఆచార్యులవారు దిగ్విజయానికై బయలుదేరి ప్రయాగకు వెళ్ళి అప్పటికే తుషాగ్నిప్రవేశం గావించి ఉన్న కుమారిలభట్టును కలిసికొన్నారని, కేవలకర్మమార్గాన్ని అనుసరించడంవల్ల ప్రయోజనం ఉండదని వారికి బోధించి వారిచే జ్ఞానమార్గం అంగీకరింపజేసెరని, కుమారిలభట్టు మండన మిశ్రులను జ్ఞానమార్గావలంబులుగా చేయడంవల్ల ఎక్కువ మేలు కలుగుతుందని ఆచార్యులకు చప్పేరని వెనుక చెప్పుకొన్నాము.

కుమారిలభట్టు చెప్పిన మాటలు విని శంకరులు మండన మిశ్రులను వెదకుకొంటూ వారు నివసించే మాహిష్మతీ నగరానికి, చేరుకొన్నారు మండన మశ్రులవారి భర్య పేరు సరసవాణి. ఆ దంపతులు సరస్వతీ చతుర్ముఖుల అవతారములు. మండన మిశ్రులు, కుమారిలభట్టు, జైమిని - ఈ ముగ్గురు మన విషయంలో ఏకాభిప్రాయం కలవారు. ఈ ముగ్గురు మీమాంస మతానికి చెందినవారు. వేదంలోని కర్మకాండయే ముఖ్యమైనదని మీమాంస మత సిద్దాంతం.

కొంత స్థూలంగా మీమాంస మత సిద్దాంతం ఏమంటే? - భగవంతుడు ఉన్నాడా లేడా అన్న ఆలోచన అనవసరం, ఉంటే ఉండనీయి. లేకుంటే లేకపోనీయి, అది ప్రయోజనంలేని ఆలోచన. వేదంలో చెప్పబడ్డ కర్మలను ఆచరించండం నీవు చేయవలసిన పని. ఆ కర్మలను ఆచరించు. అవి ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఒక కార్యం చేసినపుడు దానికి ప్రయోజనం పుట్టకుండా ఉండదు. కర్మాచరణానికి దాని ఫలితానికీ మధ్య పరమేశ్వరుడు అంటూ ఎవరినో తెచ్చి పెట్టి వాడు ఉన్నాడా లేడా అన్న వాదోపవాదాలు పెంచడంవల్ల ప్రయోజనం శూన్యం. కార్యమే ఫలితాన్ని ప్రసాదిస్తుంది. కృషిచేసేము. కృషి ఫలితంగా క్షేత్రం ఫలించింది. ధాన్యం లభించేయి. అలాగే వేదవిహితమైన కర్మాచరణంకూడా ఫలిస్తుంది. మనం ఎరుగని మనకు తెలియని విషయాలు వేదాలు చెపుతున్నాయి. ఆ వేదాలలో చెప్పినట్లు కర్మానుష్ఠానంచేస్తే ఫలితం కలిగి తీరుతుంది. అంతే! కార్యాచరణానికి దాని ఫలితానికీ మధ్య భగవంతుడు దేనికీ?

కాదు, ఈ జగత్తును స్వామి (పరమేశ్వరుడు) సృష్టించేడు, అని అంటారా? ఆయన సృష్టించడం దేనికి? ఈ జగత్తు ఎప్పుడూ ఉన్నదే, ఇదేదో హఠాత్తుగా పుట్టిందని, దీనిని ఎవరో సృష్టించేరని ఎందుకు అంగీకరించాలి?

'న కదాచిత్‌ ఈనీదృశం జగత్‌'

ఈ జగత్తు ఈ విధంగానే ఎప్పుడూ ఉన్నది. ఇదిలేని వేళ అన్నదిలేదు. అందుచే ఎల్లకాలమూ ఉన్నవస్తువును ఎవరో సృష్టించేరనడం ఎలా? ఎల్లకాలము ఉండేదానిని గూర్చి ప్రళయ ప్రసక్తి మాత్రం ఎలా సంభవం? ప్రాణులు పుడుతున్నారు, ఛస్తున్నారు. ఇందులో స్వామి లేక పరమేశ్వరునకు తావెక్కడ? పనిచెయ్యి! ఫలితం కలిగితీరుతుంది. వేదం చెప్పే విషయాలను మనం మన బుద్ధిచే తెలిసికొనలేము. అందు చెప్పబడ్డ విధంగా కర్మాచరణం చేయడమే మనపని. కర్మాచరణంవల్ల ఫలితం ప్రాప్తిస్తుంది. అందుచే వ్యర్థమైన వాదాలు విడచిపెట్టు. వేదంలో చెప్పబడ్డ విషయాలను గూర్చి, స్వామిని గూర్చి ప్రయోజనం మాలిన వాదాలు చేయకు. అనాదిగా వచ్చిన శబ్దాలే వేదం. అందరకూ బుద్ధి ఎలా ఉన్నదో అలాగే వేదమూ ఉన్నది. కాలం వలె, ఆకాశం వలె, వేదం అనాది.

చెడ్డపనులు చేస్తే చెడ్డదైన ఫలితం, మంచి పనులుచేస్తే మంచిదైన ఫలితం కలుగుతుంది. ఆ ఫలితాలను అనుభవిస్తే మనం వాని చుట్టూ తిరుగుతున్నాం. ఇంతే! ఇందులో స్వామినిగూర్చి ప్రసక్తి అనవసరం. మనం కర్మాచరణం మానకూడదు. మానితే పాపం కలుగుతుంది. మనం నరకానికి పోవలసి వస్తుంది.

కర్మలు మూడు రకాలు. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు అని వాని పేర్లు. నిత్యమూ విడువక చేయవలసిన కర్మలు నిత్యకర్మలు. ఒక నిమిత్తన్ని పురస్కరించుకొని చేసే కర్మలు నైమిత్తిక కర్మలు, అనగా గ్రహణం వచ్చింది. అపుడు మనం చేసే స్నాన తర్పణాది కర్మలు గ్రహణ నిమిత్తంగా చేయబడుతున్నాయి గనుక నైమిత్తిక కర్మలు అనబడుతాయి. అట్లే యింటికి ఒక అతిథి వచ్చేడు. ఆ అతిథికి మనం ఉపచారాలు చేసేము. ఇది కూడా నైమిత్తికమే. నిత్యనైమిత్తిక కర్మలు అందరూ ఆచరించ వలసినవి. కాని కామ్య కర్మలు అట్టివి కావు. ఒక ప్రయోజనాన్ని కోరి చేసే కర్మ కామ్యకర్మ అనబడుతుంది. వరం కురియ వలెనని వరుణజపం చేస్తాము. సంతతిని కోరి పుత్రకామేష్టిని ఆచరిస్తాము. ఆయుర్దాయాన్ని వాంఛించి ఆయుష్టోమము నాచరిస్తాము. ఇవన్నీ కామ్యకర్మలు. ఇవి చేసి తీరాలి అనే నియమం లేదు. ఆ కోర్కె ఉన్నవారు చేస్తారు, లేనివారు లేదు. స్థూలంగా మీమాంసకుల మతం ఇదే. దీనిని గూర్చి వారు ఒక విధమైన యుక్తితో వాదిస్తూ ఉంటారు.

'అకరణ ప్రత్యవాయ జనకం, కరణ2భ్యుదయం' అని నిత్యకర్మలను గూర్చి చెప్పబడినది. అనగా నిత్యకర్మలు చేయకుంటే పాపం సంభవిస్తుంది. ఆచరిస్తే అభ్యుదయం అంటారు. గృహము, క్షేత్రము, పుత్రులు, జ్ఞానము, మొదలగునవన్నీ అభ్యుదయంలోనే చేరుతాయి. వేదాంత పరిభాషలో 'నిశ్శ్రేయసం' అని ఒకటి ఉంది. ఏది గొప్పసంతోషమో, దేనిని మించిన సంతోషం మరిలేదో దానినే నిశ్శ్రేయనం అంటారు. అల్ప సంతోషకారణమైనది అభ్యుదయం, నిత్యకర్మలు అభ్యుదయాన్నే కలిగిస్తాయి. నిత్య కర్మాచరణం ఋణం తీర్చడం అనబడుతుంది. ఇవి ఋణాలు అయితే మనం ఎవరికో ఋణపడి ఉన్నామని అంగీరకించాలి. ఎవరికి ఋణపడి ఉన్నాం? నిత్యకర్మలద్వారా ఎవరి ఋణం తీరుస్తున్నాం? అని ప్రశ్నిస్తే

''జయామానో హ వై బ్రాహ్మణ స్త్రిభిః ఋణవాన్‌ జాయతే|

బ్రహ్మచర్యేణ ఋషిభ్యః యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః||

- తైత్తరీయ సంహిత.

ఋషిఋణం, పితౄణం, దేవఋణం అని మూడు ఋణాలు బ్రాహ్మణునికి పుట్టుకతోడనే ఏర్పడుతున్నాయి. ఆ ఋణాలు తీర్చడానికే నిత్యకర్మాచరణం చేయాలి. కర్మకు తగిన జన్మ మనకు ఏర్పడుతోంది. ఆ జన్మకు తగిన కర్మలు చేయవలసిన విధి మనకు ఉన్నది. చేయకపోతే ఉపద్రవం కలుగుతుంది. వేదాలలో చెప్పబడ్డ ఆచారానుష్ఠానాలను నియమంగా పాటించాలి. వేదాంతార్థాలను తెలిసికొని శాంతుడై, ఇతరులకు ఏమీ దఃఖం కలిగించకుండా జీవించడం బ్రాహ్మణునకు విధి. అలాగే అందరూ తమకు విధింపబడిన కర్మలను ఆచరించాలి. శరీరాన్ని, మనస్సును, ఆత్మను శుద్ధంగా ఉంచుకొని ఆహారావిహారములలో నియమాలను పాటిస్తూ ఇతరులను కూడా సత్కర్మాచరణానికి ప్రోత్సహిస్తూ అందరూ జీవించాలి. అగ్నిహోత్రాది శ్రౌతకర్మలను, స్మార్తకర్మలను తప్పక ఆచరించాలి. 'యావజ్జీవ మగ్నిహోత్రం జుహుయాత్‌' ఇలా కర్మలను ఆచరిస్తూ ఉండాలని మీమాంసకులు అంటారు. ఇందులో నిత్యకర్మలను గూర్చి - 'ఆకరణ ప్రత్యవాయ జనకం, కరణస్త్ర2భ్యుదయం' చేయకుంటేపాపము, చేస్తే అభ్యుదయము అనే విషయాన్ని మనం కూడా (వేదాంతులు కూడా) అంగీకరించేరు.

సన్యాసులు బుద్ధిపూర్వకంగా కర్మను త్యజిస్తారు. వారు సన్యాసులను నిందిస్తూ వేదం యీ క్రింది లోనిపంక్తులను ఉదాహరిస్తూ ఉంటారు.

'కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః'

- ఈశావాస్యోపనిషత్‌.

'వీరహా వా ఏష దేవావాం యో2గ్ని ముద్వాసయతే'

- తైత్తరీయ బ్రాహ్మణం.

కర్మలను ఆచరిస్తూ నూరు సంవత్సరాలు జీవించాలి. అగ్ని హోత్రాన్ని విడిచిపెడితే వీరహత్యాదోషం కలుగుతుంది. చెడ్డవైన కర్మలను ఆచరిస్తే పాపం కలుగుతుంది. సన్యాసి అన్ని కర్మలను విడిచిపెట్టిన కర్మభ్రష్టుడు. అందుచే వానిని చూస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పాపిని చూచినా, తాకినా, వానితో పంక్తిలో భోజనం ఆచరించినా పాపం కలుగుతుంది. అందుచే సన్యాసిని చూడకూడదు - అని మీమాంసకులు అంటారు.

అయితే సన్యాసము, పరబ్రహ్మము, మోక్షము అనే విషయాలు కూడా వేదంలో చెప్పబడినవే కదా! వేదాన్ని అంగీకరిస్తూ వీని నేల అంగీకరించరు? అని మీమాంసకులను ఎవరైనా ప్రశ్నిస్తే వారు ఈ విధంగా సమాధానం చెపుతారు.

జ్ఞానం, మోక్షం, పరబ్రహ్మము మొదలైన విషయాలు వేదాలలోనూ ఉపనిషత్తులలోనూ చెప్పబడ్డమాట వాస్తవం. కాని వేదం అంటే ఏమిటి? వేదం శబ్దం. తెలియని దానిని చెప్పుటకై వేదాలు ఏర్పడి శబ్ద రూపప్రమాణాలుగా అంగీకరింపబడ్డాయి. కంటిచే చూడబడనిది, మనస్సుచే ఊహించుటకు అసాధ్యమైనది ఏదో, దానిని తెలియచెప్పడం వేదాల పని. విశబ్దరూప ప్రమాణాలుగా కదా ఉన్నాయి. అన్ని శబ్దాలకు ఉండే ప్రయోజనం ఒక్కటే. ఒక పని చేయవలయునని కాని చేయరాదని కాని శబ్దము చెపుతుంది. అదే దాని ప్రయోజనం.

ప్రవృత్తి ర్వా నివృత్తి ర్వా నిత్యేన కృతకేన వా|

పుంసాం యేనోపదిశ్యేత తచ్ఛాస్త్ర మభిధీయదే||

లేని వస్తువునుగూర్చి చెప్పే మాటలు వృధాప్రలాపాలు. వస్తువు ఉన్నప్పటికి ప్రయోజనం లేని మాటలు ఉంటాయి. ఉదాహరణకు ఒకడు 'కాకి ఎగురును, కాకి నలుపు' అన్నాడు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఏమీ లేదు. 'రేపు రాత్రి యిక్కడ ఉపన్యాసం ఉన్నది' అని చెపితే- 'అందరూ రావాలని దానికి ఒక అభిప్రాయం, ప్రయోజనమూ ఉన్నాయి. 'కుంభకోణంలో రేపు ఉపన్యాసం' అని ఎవరైనా అంటే అది వృథా ప్రలాపమే అవుతుంది. ఏమంటే? ఎక్కడ కుంభకోణం! ఎక్కడ మనం! వీడు చెప్పేమాట వాస్తవం అయినా కాకపోయినా ప్రయోజనం శూన్యం. ఇలా ప్రయోజనం లేని మాటలు ఉండకూడదు. ప్రతి విషయానికి ప్రవృత్తి ప్రయోజనమో నివృత్తి ప్రయోజనమో ఉండాలి. ప్రవృత్తి నివృత్తులను విడిచి చెప్పబడిన దంతా కథ మాత్రమే అవుతుంది. అట్టి కథనే అర్థవాదం అంటారు. వేదం రెండు భాగాలుగా ఉన్నది. ప్రవృత్తి నివృత్తులను వివరించే భాగం ఒకటి, కథాకథన రూపంగా అర్థవాదంతో నిండిని భాగం ఒకటి. అయితే యీ అర్థావాదం భాగంకూడా పరిణామంలో ప్రవృత్తి నివృత్తులనే భోదిస్తూ ఉంటుంది.

ఒక యజ్ఞాన్ని గూర్చి చెపుతూ వేదం 'బంగారాన్ని దానంచేయి కాని వెండిని దానం చేయకు' అన్నది.

'బరిషి రజతం నదేయం'.

- తైత్తరీయ సంహిత.

ఈ సందర్భంలో ఒక పెద్ద కథ చెప్పబడింది. కథ అంతా పూర్తి అయిన మీదట చిట్టచివర 'వెండిని ఈయవద్దు' అని నిషేధం చేయబడింది. ఈ కథ అంతా ఆ నిషేధాన్ని బలపరచడానికే చెప్పబడింది. వేదంలో అర్థవాదాలు అన్నీ యిట్టివే. అని యీవిషయాలనే దృష్టిలో ఉంచుకొని మీమాంసకులు చెప్పే సమాధానం యిలా ఉంటుంది.

'ఉపనిషత్తులు బ్రహ్మస్వరూపాన్ని గూర్చి చెప్పిన మాట వాస్తవమే. కానీ ఆ మాటలు కార్యాన్ని గూర్చి చెప్పడం లేదు. కార్యాన్ని గూర్చి ప్రవృత్తి నివృత్తులను బోధించుటయందే వేదాల ప్రామాణ్యం ఇమిడి ఉన్నది. అందుచే ఉపనిషత్తులు అర్థవాదమే. ఉన్న వస్తువునుగూర్చి ఒక భాగంలో చెప్పబడింది. అయితే మనం గ్రహించవలసినది ఉన్న వస్తువును గూర్చియా? లేక చేయవలసిన కార్యాన్ని గూర్చియా? 'ఈశ్వరుడు ఉన్నాడు' - అనే మాట ఉన్నవస్తువును గూర్చి చెప్పిన మాట. 'యజ్ఞయాగాలను ఆచరించాలి' అన్న మాట మన కర్తవ్యాన్ని బోధించే మాట. ఉన్నవస్తువు ఎపుడైనా తెలుస్తుంది. కాగా కర్మాచరణాన్ని గూర్చి బోధించే మాటలే గ్రహింపదగినవి. ఉన్న వస్తువును గూర్చి చెప్పేమాటలు అర్థవాదానికి చెందినవే. అందుచే ఉపనిషత్తులు ప్రమాణం కావు. అయితే ఉపనిషత్తుల వల్ల ప్రయోజనం ఏమిటి అంటారా? యజ్ఞాలు చేసేవారిని గూర్చి ప్రశంసించడానికే అవి ఏర్పడ్డాయి. కర్మాచరణం యొక్క ఘనతనే ఉపనిషత్తులు అర్థవాదంగా ఉండి వెల్లడిస్తున్నాయి. కాగా కర్మచేయకుండా ఉండడం తప్పు. సన్యాసం తీసికొనడం దోషం- అని మీమాంసకులు యుక్తిగా వాదిస్తూ ఉంటారు.

ఇట్టి మత సిద్ధాంతాలలో విశ్వాసంకలవారై మండన మిశ్రులవారు మాహిష్మతీ నగరంలో నివసిస్తున్నారు. శ్రీ శంకరులు ఆ నగరానికి చేరుకొన్నారు. నిత్యమైన ఆనందమేదో తెలియక, కర్మనే నమ్ముకొని, అనవరతం కర్మాచరణంలోనే కొట్టుమిట్టాడుతూ, తత్ఫలితంగా అనిత్యమై అల్పమైన ఆనందాన్ని అనుభవిస్తూ, మరల మరల జన్మించుటయే జీవతపరమావధిగా భావించి యున్న మండన మిశ్రులను వారి అనుయాయులను ఏదో విధంగా తరింపజేయాలన్న అనుగ్రహబుద్ధితో శ్రీ శంకరులు అక్కడకు వచ్చేరు. చతుర్ముఖుని అంశతో జన్మించిన మండనులు, బౌద్ధులను వారి మతాన్ని నిరసించి ఖండించి క్రమంగా తాము మీమాంసకులై మతానికి ఆ కాలంలో వెన్నెముకగా ఉన్నారు.

మాహిష్మతిలో మండన మిశ్రుల గృహాన్ని వెదకుకొంటూ శ్రీ శంకరులు వస్తున్నారు. వారికి నది నుండి నీటి బిందెలతో వస్తూ ఉన్న పౌరపురంధ్రులు కాన వచ్చేరు. వారా వనితలను మండన మిశ్రుల యింటికి మార్గమేది? అని ప్రశ్నించేరు. అపుడు వారు

స్వతః ప్రమాణం పరతః ప్రమాణం

కీరాంగనా యత్ర గిరం గిరన్తి|

ద్వారస్థ నీడాంతర సం నిరుద్ధా

జానీహి తన్మండన పండితౌకః||

- మాధవశంకర విజయము.

ఏ గృహద్వారమందు పంజరబద్ధములైన చిలుకలు- 'వేదము స్వతః ప్రమాణమా? లేక పరతః ప్రమాణమా?' అని వల్లె వేస్తూ ఉంటాయో అదే మండనుల యిల్లు- అని సమాధానం యిచ్చేరు.

'స్వతః ప్రమాణము, పరతః ప్రమాణము' అనగా ఏమిటి? కాణాదుడు, గౌతముడు అనే యిద్దరు తర్క శాస్త్రాన్ని రచించేరు. వారు రచించిన ఆ శాస్త్రాన్ని అనుసరించి గంగేశ మిశ్రోపాధ్యాయులనేవారు 'తత్త్వచింతామణి' అనే గ్రంథాన్ని రచించేరు. ఈ తత్త్వచింతామణిలో అరువదినాలుగు వాదాలు వివరించబడ్డాయి.

గంగేశమిశ్రులు వంగదేశానికి చెందినవారు. వారు కులీన బ్రాహ్మణవంశంలో జన్మించేరు బాల్యంలో వారు మిక్కిలి మూర్ఖులుగా ఉండేవారట! వారికి వివాహం అయింది. అత్తవారి యింటనే యిల్లరికం ఉన్నారు. వంగదేశంలో బ్రాహ్మణులు మత్స్య భుక్కులు. ఆదేశంలో మత్య్సాలను 'జలపుష్పాలు' అంటారు. గంగేశమిశ్రులను అత్తవారి యింట 'గంగ' అని పిలిచేవారు. ఆయన జడుడుకదా! అందుచే ఆయన విస్తరిలో వట్టి ఎముకలు వడ్డించి, ఇతరుల విస్తరులలో చక్కగా వండిన మత్స్యాలను వడ్డించే వారట! ఆయన మందుడుకదా! అందుచే ఇలా అనాదరం చూపేవారు. ఒకనాడు గంగేశమిశ్రులు ఎవరికినీ చెప్పకుండా కాశికి వెళ్ళి పోయేరు. అప్రయోజకుడు ఎక్కడో వెళ్ళినాడని ఎవరునూ ఆయనను గూర్చి వెదకలేదు. గంగేశమిశ్రులు కాశిలో పదేండ్లు పరిశ్రమించి శాస్త్రాలు నేర్చుకొని పెద్ద పండితులై అత్తవారి యింటికి వచ్చేరు. ఈ అప్రయోజకుడు మరల వచ్చినాడని అత్తవారి యింట్లో అనుకొన్నారు. ఆనాడు భోజనంలో మామూలుగా వారి విస్తరలో అస్థులు వడ్డించేరట. అపుడు గంగేశమిశ్రులు

'నా హం గంగా కింతు గంగేశ మిశ్రః'

నేను గంగను కను, గంగేశమిశ్రుడను, గంగ అయితే అస్థులు వేయడం న్యాయమే' అని శ్లోకరూపంలో మందలించేరట! గంగేశమిశ్రులు రచించిన తత్త్వ చింతామణికి తరువాతి కాలంలో ఎన్నో వ్యాఖ్యానాలు పుట్టేయి. రఘునాథ శిరోమణి అనే వారు తత్త్వచింతామణికి 'దీధతి' అనే వ్యాఖ్యానం రచించేరు. అటు తరువాతనే 'శిరోమణి' అనే పట్టము (ఈ|సషౌ-శష|) వాడుకలోనికి వచ్చింది. గదాధరులు దీధితికి వ్యాఖ్యను రచించేరు. ఈ గదాధరీయవ్యాఖ్య చాలా పెద్దది. మూల గ్రంథంలోని పది వాక్యాలకు వ్రాసిన వ్యాఖ్యానమే ఒక పెద్ద పుస్తకం అయింది. ఇలా విస్తరించి వ్రాయబడి నప్పటికి ఇందులో ఒక్క మాటకూడా అనవసరంగా అనుచితంగా అధికంగా చెప్పబడింది అనడానికి వీలు లేదు. చింతామణి అనేది వేరొక తర్కగ్రంథం. దానికి 'జాగదీశి' అనే వ్యాఖ్యానం ఉన్నది. ధర్మరాజ దీక్షితులవారు, మధురనాథలు రచించిన వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. అయినా గదాధరీయ వ్యాఖ్యనే అంతా చదువుతూ ఉంటారు.

ప్రామాణ్యవాదం గదాధరీయంలో వివరింప బడంది. వెనుక ఒకరు దక్షణదేశంనుండి తర్కశాస్త్రం నేర్చుకోవడానికి నవద్వీపం వెళ్ళేరట. ఆయన కవి. కవిత చెప్పి చాలా ధనం ఆర్జించేడు. తర్కం మీది మక్కువతో నవద్వీపం వెళ్ళేడు. నవద్వీపం తర్కానికి ప్రసిద్దమైన చోటు. అక్కడ తర్కపండితులు ఎక్కువ. ఈయన తర్కశాస్త్రం ఆరంభించి 'ప్రామాణ్యవాదం' దగ్గరకు వచ్చేరు. ఆ వాదం జటిలమైనది. అయినా దానిని నేర్వాలని ఆయన ఎంతో ప్రయత్నించేడు. ఆయన చేసిన యీ ప్రయత్నంవల్ల 'ప్రామాణ్యవాదం' ఆయనకు తెలియలేదు సరికదా! ఆయన సంపాదించుకొన్న కవితాశక్తి కూడా లోపించి పోయిందట! చేతిలో ఉన్న సొమ్ము ఖర్చుపడిపోయింది, కవనం చెప్పే నేర్పు నశించి పోయింది. ప్రామాణ్యవాదం తెలిసిరాలేదు. అప్పుడానయన -

'నమః ప్రామాణ్యవాదాయ మత్కవిత్వాపహారిణ'

'నా కవిత్వాన్ని అపహరించిన ప్రామాణ్యవాదానికి నమస్కారము' అని ప్రామాణ్యవాదానికి నమస్కరించేరట!

మండనమిశ్రుల ద్వారంలో పంజరబద్ధములైన చిలుకలు జటిలమైన ప్రామాణ్యవాదాన్ని గూర్చి పలుకుతూ ఉండేవి. ప్రామాణ్యవాదం అంటే ఏమటి? కొంత పరిశీలిద్దాం!

ఒక వస్తువును చూచిన మీదట మనకు కలిగే జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సరి అయినది . రెండవది తపై#్పనది. పంచదారను చూచి పంచదారగా తెలియుట సరియైన జ్ఞానము. అలా కాక మరియొక వస్తువుగా తెలియుట తపై#్పనజ్ఞానం. సరియైన జ్ఞానాన్నే ప్రమాణం అంటారు. తపై#్పన జ్ఞానం అంటే భ్రమ పడడం. ఈ భ్రమ 'సంశయం, నిశ్చయం' అని రెండు రకాలు. భ్రమ తప్పే అయినప్పటికి ఆ సమయంలో అది నిజమే అనిపించి అపుడు అజ్ఞానం ప్రమాణంగానే తోస్తుంది. తరువాత విచారించిన మీదట అది భ్రమగా నిరూపితమై అప్రమాణం అవుతుంది. కొన్ని జ్ఞానములు మొదటనే తప్పు అని తెలిసిపోతాయి. బావిలో చెట్టునీడ కనబడుతుంది. మనం చూచేము. తొలిచూపులోనే ఇది చెట్టుకాదు, నీడ అని తెలిసికొన్నాం, అంటే ఈ నీడను చెట్టుగా తలచడం తప్పు అని మొదటనే గ్రహించి ఇది అప్రమాణం అని తెలికొన్నాము. ఇలా జ్ఞానం ఆవిర్భవిస్తూనే ప్రమాణంగా తెలియడం, అప్రమాణంగా తెలియడం అని రెండు రకాలుగా ఉన్నది.

జ్ఞానం ఆవిర్భవించే ప్రథమదశయందే 'ఇది నిజం, ఇది ప్రమాణం' అని తెలియవస్తే ఆ జ్ఞానాన్ని 'ప్రామాణ్యగ్రహజ్ఞానం' అంటారు. అలాకాక జ్ఞానావిర్భావ ప్రథమదశయందు - 'ఇది నిజం కాదు, ఇది అప్రమాణం' అన్న తెలివి ఏర్పడితే దానిని 'అప్రామాణ్యగ్రహ ఆస్కందిత జ్ఞానం' అంటారు. ప్రమాణము, భ్రమ యీ రెండింటియందు కూడా ప్రమాణజ్ఞానం ఉన్నది.

పంచదారనులేక దీపాన్ని చూచినపుడు 'ఇది పంచదార' 'ఇది దీపం' అన్న జ్ఞానం మొదట కలుగుతుంది. దానికి వెనువెంటనే 'అవును! ఇది నిజం' అని మరియొక జ్ఞానం కలుగుతుంది. ఇది అరటిచెట్టు' అని తెలియగానే 'అవును! ఇది నిజం!' అన్న రెండవ జ్ఞానంకూడా పుడుతోంది. అరటిచెట్టును చూడగానే కలిగిన యీ రెండవ జ్ఞానానికి అరటిచెట్టును చూచుటయే కారణమా లేక వేరొకదానివల్ల ఆ జ్ఞానం కలుగుతోందా? అంటే అరటిచెట్టు చూచుటయే యీ రెండవ జ్ఞానానికి కారణం అనేవారు స్వతః ప్రమాణం వాదులు, అలాకాదు, వేరొకదానివల్ల యీ రెండవ జ్ఞానమేర్పడుతోంది, అనేవారు పరతః ప్రమాణావాదులు. స్వతఃప్రమాణ - పరతః ప్రమాణాల స్థూల స్వరూపం ఇట్టిది.

మండనమిశ్రుల యింటి చిలుకలు 'స్వతః ప్రమాణం, పరతః ప్రమాణం' అని వల్లె వేస్తూ ఉండేవట! ఆదిశంకరులు వారి యింటికి బయలుదేరేరు. ఆ రోజున మండనుల యింటిలో శ్రాద్ధము. మండనులు, మంచి ఐశ్వర్యం కలవారు. అనేక సోమయాగాలు వారు ఆచరించేరు.

సోమయాగాన్ని జ్యోతిష్టోమం అంటారు. జీవితంలో ఒక మారు జ్యోతిష్టోమాన్ని ఆచరించినవారు అనేకులు ఉన్నారు. ఒకే జీవితంలో అనే జ్యోతిష్టోమాలు చేసినవారు అరుదు. యజ్ఞానికి ద్రవ్యము, సామర్ధ్యము, జ్ఞానము ఈ మూడు అవసరం. ఒక సంవత్సరం పండించిన ధాన్యం మూడేళ్ళవరకు నిలువ ఉంచుకొని జీవనం చేయగల ఐశ్వర్యం కలవారు ప్రతి వసంతంలోనూ యాగం చేయాలి. అట్టివారిని 'వసంత సోమయాజులు' అంటారు.

మండనులు మంచి ఐశ్వర్యం కలవరైనందున చక్కగా శ్రాద్ధం చేయడానికి ఉపక్రమించేరు. శంకరులు మండనుల యింటికి వచ్చేసరికి వారి గృహకవాటాలు మూయబడి ఉన్నాయి. అందుచే వారు యోగశక్తితో గృహంలో ప్రవేశించేరు. లోపల వ్యాసులవారు, జైమిని బ్రాహ్మణార్థమునకు వచ్చి ఉన్నారు. పరీక్ష్మిన్మహారాజు దగ్గరకు నిమ్మపండులో ప్రవేశించి తక్షకుడు వెళ్ళినట్లే ఎన్నోవిధాలుగా శ్రాద్ధక్రియా సక్రమ నిర్వహణానికి రక్షణలు ఏర్పాట్లు చేసుకొన్న మండనుల వద్దకు ఆచార్యులవారు చేరుకొన్నారు.

ఆచార్యులవారిని చూడగానే మండన మిశ్రులకు చాలా కోపం వచ్చింది. అపుడు శంకరులను మండనులకు వాగ్వాదం జరిగినట్లు కథలు జనశ్రుతిలోను గ్రంథాలలోనూ ఉన్నాయి.

మండనమిశ్రులవారు ఆచార్యులను చూచి ఎక్కడ నుండి ముండి? అని ప్రశ్నించేరట! ఆచార్యులవారు వేడుకగా 'కంఠము నుండి ముండివి' అని సమాధానం చెప్పేరట! ముండనం చేసుకొన్నవాడు ముండి. సన్యాసులు కంఠానికి దిగువ ముండనం చేసికొనకూడదు. ఇలా సాగుతూఉన్న వాదాన్ని ఆలకించి వ్యాసజైమినులు వారిని సమాధానపరచి మండన మిశ్రులతో - 'శ్రాద్ధమునకు సన్యాసిని పిలువాలని' శాస్త్రం చెపుతూ ఉన్నది. అందుచే విష్ణువునకు ఉద్ధేశించిన విస్తరలో ఆచార్యులవారిని కూర్చుండబెట్టి పూజించు అని చెప్పేరు.

మండన మిశ్రులకు ఏమీ పాలుపోలేదు. ఈ వ్యాసజైమినులు బ్రాహ్మణార్థమునకు వచ్చేరు. బ్రాహ్మణార్థమునకు వచ్చినవారు చెప్పినట్లు చేయాలని శాస్త్రం. సన్యాసిని చూడడానికైనా అంగీకరించని తనను సన్యాసిని శ్రాద్ధసమయంలో పూజించవలసిందిగా వారు ఆదేశిస్తున్నారు. ఏం చేసేది? వారు బ్రాహ్మణార్థమునకు వచ్చేరు, వారి మాట విని తీరాలి. వినకపోతే దోషం. అందుచే మండనులు శంకరులతో వాదం విరమించి భిక్షకు రావలసినదిగా అర్థించేరు. అపుడు శంకరులు నేను కోరేది వాదభిక్ష, సాధారణభిక్ష నాకు అక్కరలేదు, అన్నారట!

వాదం అంటే ఈ రోజులలో వివాదము లేక జగడం అనుకొనడం పరిపాటి అయింది. కాని అది సరికాదు. అది 'జల్పం' అనబడుతుంది. తెలియనిదానిని తెలిసికొనడానికి లేదా తత్త్వ గ్రహణానికి చేయబడే సమాలోచనకు వాదం అని పేరు. 'తనకు తెలిసినదే యథార్థమైనది, ఇతరులు చెప్పేది యధార్థం కాదు, అన్న నిశ్చయజ్ఞానంతో చేయబడేది 'జల్పం', ఈ రెండేకాక మూడవది మరియొకటి ఉన్నది అది 'వితండవాదం'. తనకు ఏ అభిప్రాయామూ లేకపోయినా ఎదుటివాడుచెప్పేది అంతా తప్పు అనడమే వితండవాదం.

ఆచార్యులవారు వాదభిక్ష కోరినంతనే మండనులు 'మొదట యీ భిక్ష స్వీకరించండి, తరువాత వాదభిక్షను గూర్చి గమనిద్దాం' అన్నారు.

శ్రాద్ధం సమాప్తం అయినంతనే ఇరువురూ వాదించుటకు ఆరంభించేరు. సరస్వతీదేవియొక్క అవతారమైన మండన మిశ్రులవారి భార్య సరసవాణిని ఇరువురి వాదాలను ఆలకించి తీర్పు చెప్పడానికి మధ్యస్థురాలుగా ఎన్నుకొన్నారు. ఆమె ఎవరిపక్షంలో మాటాడుతుంది! ఒక వంక సన్యాసి, ఒక వంక భర్త. వీరి వాదంలో తాను తీర్పు చెప్పడం ఎలాగు? ఇది ఆమెకు ధర్మసంకటంగా తోచింది. అందుచే ఆమె ఇరువురికి చెరియొక మాలను యిచ్చి ఎవరి మాల వాడిపోతే వారు పరాజితులైనట్లు అని నిర్దేశించింది.

వాదారంభానికి ముందు శంకరులు మండనులు ఒక నిబంధన ఏర్పరుచుకొన్నారు. వాదంలో శంకరులు జయిస్తే మండనులు సన్యాసం స్వీకరించాలి. మండనులే జయిస్తే శంకరులు ప్రాయాశ్చిత్తం చేసుకొని గృహప్రస్థాశ్రమం స్వీకరించాలి. వారి యీ నియమాన్ని సరసవాణి తెలిసికొన్నది. వాదం ఇరువదియొక్క రోజులు సాగింది. ఇరవై ఒకటవ రోజున మండనమిశ్రుల మెడలోని మాల వాడిపోయింది. వెంటనే సరసవాణి ఇద్దరిని భిక్షాగ్రహణానికి దయచేయండి అని ఆహ్వానించింది. నాటితో మండనులు సన్యాసులయ్యారు. సురేశ్వరాచార్యులు అన్నది ఆయన సన్యాసాశ్రమ నామధేయం. సురేశ్వరులవారు 'నైష్కర్మ్యసిద్ది' అనే గ్రంథాన్ని రచించేరు. అందులో వారు 'కర్మ ఫలాన్నే కాకుండా వేదం ఒక అత్యున్నతమైన ఆనందాన్ని సూచిస్తోంది' అని సిద్ధాంతీకరించారు.

అయితే మండనులను ఆచార్యులవారు ఏ విధంగా జయించేరు? అన్నది కూడా కొంత తెలిసికొందాం.

'శబ్డం కార్యాన్ని నిర్దేశించాలి' అనికదా మీమాంసకుల అభిప్రాయం. శంకురులు- 'అలాకాదు, శబ్దం కార్యప్రయోజనానికి సహాయకారిగా ఉండాలి' - అన్నారు. ఏమంటే కొన్ని చోట్ల కార్యము లేకపోవుటయే శబ్దానికి ప్రయోజనం అవుతుంది. 'సురాపానం చేయరాదు అన్నాము. ఈ శబ్దం వినగానే చేయవలసిన కార్యం ఏమీ ఉండడం లేదు కదా! అందుచే శబ్దానికి ఒక్క ప్రయోజనమే లక్షణం అని అంగీకరించడం తగినది కాని కార్యనిర్దేశర శబ్ద తాత్పర్యంగా ఉండాలి. అనుకొనడం తగదు'- అన్నారు.

'సురాపానం చేయరాదు' అన్నమాటకు ఏదో చేయుమని కాక ఏమీ చేయవద్దూ అన్నదే తాత్పర్యమై ఉన్నది. ఏమీ లేకపోవవడాన్ని అభావం అంటారు. నిషేధ వాక్యాలన్నీ కార్యాభావాన్ని బోధిస్తాయి. ఏదో ఒక కార్యము చేయకపోవుటయే ఒక ప్రయోజనంగా ఉన్నప్పుడు ఏ కార్యమయినా చేయక పోవడం, ఏ కార్యము లేకుండా ఉండడం ఒక పెద్ద ప్రయోజనంగా ఉండాలి. ఏ కార్యము లేక పోవుటయే పరమ ప్రయోజనంగా కలవైనందున వేదాంతశబ్దాలు అన్నిటికి శిఖరాయమాణాలై ఉన్నాయి.

'సర్వం కర్మాఖిలం పార్ధ! జ్ఞానే పరి సమా ప్యతే' - అని గీతలో చెప్పబడిఉంది. అన్ని కర్మలూ పరమేశ్వరునియందు వినియోగం పొందాలి. కార్యము (చేయవలసినది లేకపోవుటయే) లేక పోవుటయే పరమప్రయోజనం అదియే బ్రహ్మానందం. దానిచే మరి జన్మ ఏర్పడదు. వేదానికి పరమతాత్పర్యం ఇదే! కర్మ కాండము సర్వాన్నీ జ్ఞానకాండలోనికి సమన్వయించు కోవాలి. అపుడే దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. అని శంకరులు మండన మిశ్రులవారికి బోధించేరు.

మండనులు ఆచార్యులవారికి శిష్యులైనంతనే సరస్వతి (అనగా సరసవాణి) ఇక నాకేమి పని ఉన్నదని బయలుదేరింది. అపుడు శంకరులు ఆమెను వారించి- 'నీవును ఇక్కడనే ఉండు, శారదా పీఠముగా నీవు ఉందువుగాక!' అని ఒక పీఠాన్ని స్థాపించి సరస్వతిని ఆ పీఠంలోనికి ఆహ్వానించేరు.


Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page