Mahayogama    Chapters   

ఓమ్‌

మహాయోగము

8. నాహంస్థితి

- * -

ఈ ప్రపంచం సాపేక్షం. అందు మూడు ఆలంబనాలు - జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, అవి నిజమని భ్రమింప జేసేది అహమిక. వానికి ఆధారము సత్యం. ఆ మూడింటనూ సత్యాంశమున్నది. అలీకమైన ఆ మూటిదృశ్యం సత్యాన్ని కప్పివేసింది. ఈ భ్రాంతికిమూలం అహంభావన. అది నిలిచి యున్నంత కాలం అజ్ఞానానికీబంధానికీ అంతం లేదు. అహంత లేనినాడే మనం ముక్తులం కాగలం. ఇది ఇప్పటికి మనం నేర్చినది.

మోక్షస్థితిని నాహంస్థితిగా వర్ణించారు. దానికే చిత్‌ లేక జ్ఞాన, ఆనంద, పూర్ణ, శాంత, సహజములని పేర్లు: ఈ వర్ణనలు ఆస్థితి లక్షణాలను సూచించేట్లగుపిస్తుంది. కాని అట్లవిచేయవు. ఆస్థితి తలపు పల్కుల కందేదిగాదు.

ఇచట రెండు ప్రశ్నలు - అట్టిస్ధితి యంటూ ఉన్నదా? ఉంటే అది కోరతగ్గదా? మొదట దానిలో ఒక సందియమిమిడి యుంది. జీవుడు నష్టమై ఆస్థితి కేవల శూన్యంగా తీరునా? దీనికి ప్రేరణంజీవుడే తానవ్న గాఢ విశ్వాసం. జీవునికి విశిష్టంగా సత్యమైనఆత్మకలదనుటే దీనికి సమాధానం. అది అహమికకు భిన్నమూ, ఉత్తమోత్తమమూ; ఋషి వచనరీత్యా అది సత్యం గనుక అహంతా నాశం తర్వాత గూడ శేషించియే యుండునది. అభిలషనీయమా అనటం ఆనందాన్ని సుఖాలనుకోవటం వల్ల నిష్ర్పపంచస్థితిలో వానికవకాశం లేనందువల్ల.

మహర్షి శిష్యులకీ సందేహాలేవీ రావు. రమణ పాదవర్తులనివే వీబాధించవు. నాహం స్థితికి మహర్షియే పరమోదాహరణం. మహర్షి ప్రసారిత ప్రభావ మహితులకు, నాహంస్థితి నిజమనీ దేనిని త్యజించి యైనా దానిని సాధింపనే వలె ననుటకు వేరు ప్రమాణాలు, వాదాలు అక్కర్లేదు. ఆస్థితిపూర్ణము, పరమము, కేవలము, నిత్యానందము; అది కామముచేత కుంటువడదు, భయంచేత బాధితం కాదు. ఇది వారి కెఱుకే.

ఋషులు యిలాంటి సందేహాలను పెద్దపరిగణింప వలదన్నారు. ఆనందానికి ప్రబలవైరియైన అహమికే సంశయాలకు మూలకందమన్నారు. తన తుదిని దూరీకరించటానీకి అహమికే యిన్ని సందేహలను వెలార్చు నన్నారు మహర్షి. ఈ సందేహములను మన్నించివాని నివర్తనకై కాలాన్నీ సత్యాన్నీ వ్యయించటం, శత్రువు చేతిలోచిక్కుకోవడమే. కర్తవ్యం ప్రశ్నల రూపొందించి సమాధానాలసంతరించడం గాదు. అవి బుద్ధి విషయకాలు, ఎట్టి విలువాలేనివి. అసలుదోషి అహంతను పట్టి బోనెక్కించి స్వస్వరూప విచారాన వానినిజం కైతవమని ఆభాస పట్టించుటే చేయతగ్గది. అంటే ఆత్మసిద్ధి కావలె. అన్ని ప్రశ్నలకూ తుది సమాధాన మదే. ప్రతి ప్రశ్నా అజ్ఞానదూషితమే. అజ్ఞానం అహమిక తనకారోపించుకొన్న సత్యాన్ని ధ్రువమంటుంది. అన్ని ప్రశ్నలూ ఒకే ప్రశ్న యందిముడుతవి : ''నేనెవరు?'' అని. ఇదియే ఆత్మవిచారము. దీననే నాహంస్థితి సిద్ధి. ఆస్థితిలో నున్నది అహంస్ఫూర్తి యొకటే, మరేమీ లేదు; ప్రశ్నలూ ఉత్తరాలూ లేవు. ఉన్నది మౌన మొక్కటే, అన్నారు మహర్షి,1 ఉపనిషత్తులిదే యర్థాన్ని ప్రతిపాదిస్తున్నవి. అవి మనకిచ్చే హెచ్చరిక స్పష్టమే. కడలేని ప్రశ్నలు అహంత బ్రదుకును పొడిగించే ఉపాయమే. అదియొక వ్యసనం, ఆపేరివాని కన్నిటి కంటెను తీవ్రమయినది. అది శ్రద్ధాలోపాన్ని, బంధమందే నిగూఢాదరాన్ని సూచిస్తుంది. అడుగడుగునా సందియాలతో అదేపనిగా ప్రశ్నించడం మెచ్చరుగాని నిజంగానే తెలిసికొనగోరే పృచ్ఛకుని మహర్షి ఆదరించి వానికి నమ్మజెప్పుతారు. ఎట్టి ప్రశ్నలకునూ సమాధానము లున్నవనీ, కానిప్రశ్నల కొక తుది యంటూ ఉండవలెననీ.

ఆత్మసాధనా బద్ధదీక్షితుడూ పూర్ణ పరిణతుడూ అయిన శిష్యునికి ఈ ప్రశ్నలు అముఖ్యాలు. స్వస్వరూపాను సంధాన తత్పరుడు ఈ అహంతావిష్ట జీవితాన్ని త్యజించటాని కెప్పుడూ సంసిద్ధుడే ఆ చెఱసాలనుండి వెలువడ యత్నించే వానికి మహర్షి తెల్పుతారు: ''స్వస్వభావస్థితియే అహంతకునూమూలం; పూర్ణజీవితానికి దానిని వెదకి పట్టడం అవసరం'' అని. వానికదిచాలు; అతడేమీ వెనుదీయడు. వాని విచారాని కాతంకంగా ఏ సందేహాలనూ పెంచడు. మొదటి ప్రకరణంలో మహర్షి గూడ ఎట్టి భయసంశయాల జేసివెనుదీయ లేదని కనుగొన్నాము. అహంత నీడలోని యీ సాపేక్ష జీవితం అల్పమూల్యమూ, మూల్యహీనమని యెన్ని, స్వభావలబ్ధికై సర్వమునూ త్యజింప సన్నద్ధుడయ్యెను కాబోలు. అప్పుడాయనకు మనకున్నంత సమృద్ధంగా పురాతన వైదిక దర్శనాలూ, ఋషిజన బోధలూలాంటి సదవకాశాలు ఏవీ లేవని మనం గుర్తించవలె.

మన సమస్యలను ఋషులెట్లు పరిష్కరించారో పరికిస్తాము. నాహంస్థితి శూన్యతగాదు: అచట ఆత్మ స్వస్వరూపంలో అహంత

____________

1. చూ. అనుబంధం 'చ'. శ్లో. 247

చేత నియంతంగాక సహజంగా ఉంది. అట్లుగా చిరకాలానుగత ఋషి పరంపరయే ప్రామాణ్యం. ఆ సద్వస్తువే మనకు జీవనం, అదియే రక్షకం. అదిలేక అన్యాపేక్ష మీ బ్రదుకు దుస్సహం. అంతకన్న మరణమే మేలు. ''అనంతమా ఆనందములేక ఎవడీజీవనము సాగించును?2'' ఇపుడును ఈ అజ్ఞాన భూములలో మనకు జీవన దాతలు ఆ స్వరూపానంద స్రోతస్సులే. అవియెంత మందములూ విరళములై ననూ, అజ్ఞానాషుముల సాంద్రగహనముల నురలి పొరలి, మనబ్రదుకు మాత్రమునకు చాలి, నిరాశ ఆత్మహత్యల పాలు గానీయక కాపాడునవి అవియే, ఆ వైదిక దర్శనములే, ''హృద్గుహానిహిత మా బ్రహ్మ మెవనికి సిద్ధమో, అతడు సకలకామములతో సహా పరమానందము ననుభవించును.''3

ఇందు ''సహా'' పదము ఏకకాలాన్ని సూచించుట చేత సార్థకము. అభిలాష తీరుటతో కలిగే సంతోషం తత్కాలీనము; అప్పుడునూ తీరని కోరికల నీడలు దానిని కలుచుచునే యుంటాయి. మహర్షి యనుభవించే ఆత్మానంద మట్టిదిగాదు. తైత్తిరీయోపనిషత్‌ బ్రహ్మానందవల్లిలోనే ఎనిమిదవ అనువాకంలో ఆత్మానందము పూర్ణమనీ అందెట్టి కోరికాజనింపజాలదనీ తెలిపి యుంది. మహర్షి వచించి నట్లు నాహంస్థితియందలి నిర్మల, పూర్ణ, సంతతానందకారణం, లోభ మోహ కర్మ ప్రవృత్తులకు కూకటి వేరైన అహమిక తన వికృతపు తలను మరియెత్తలేని గతిగ సర్వనాశమగుటే. ''సముద్రముప్పొంగి

__________

2. కోహ్యేవాన్యాత్‌, కః ప్రాణ్యాత్‌ | యధేష ఆకాశ ఆనందో న స్యాత్‌'' తైత్తిరీయోపషనిత్‌, బ్రహ్మానందవల్లీ, vii, I

3. సత్యంజ్ఞాన మనంతం బ్రహ్మ | యో వేద నిహితం గుహాయాం పరమేవ్యోమన్‌ |

సో7శ్నుతే | సర్వాన్‌ కామాన్‌ సహ | బ్రహ్మణావిపశ్చితేతి || తైత్తిరీయోపనిషత్‌ బ్రహ్మానందవల్లీ, I

పొరలగా అల్పజంతువు తలెత్తలేనట్లు, బోధము (శుద్ధచిత్‌) పొంగగా క్షుద్రమగు అహము ఉన్న తశీర్ష మౌటయెట్లు?''4

వైదిక దర్శనములూ మహర్షీ యీ బోధ సత్యాపనమునకై వివేకము నాశ్రయింపు మన్నారు. లేమినుండి ఉనికి ఉదయింపదని నిరూపణకై శ్రుతులెంతగనో శ్రమించాయి. ''కథము స్తతః సజ్జాయేత?''5 అభావంనుండి ప్రపంచంఎట్లు జనించింది? ఈ విషయక మానసిక జీవజగత్తును చూస్తున్నాము గనుక అది యున్నదనిమననమ్మకం. కాబట్టి ఆ దృశ్యంలోనూ చిదంశం ఉండనేవలె. మహర్షి ఇంకా అన్నారు: ''ఉన్నది - అనగా జ్ఞానరూపమైయుండు వస్తువు - లేక, ఉన్నట్టు తోచు జ్ఞానము ఉండగలదా?''6

అంటే సత్‌ అంతస్సున చిత్‌ (జ్ఞానము) ఉన్నదని మనం గ్రహించవలె.

ఆత్మ ఉన్నదని మనకు తెలుసు. కాని దాన్ని మనం అహమికగా భ్రమిస్తాము. ఎదో నిజమైన ఆత్మయొకటి లేకుంటే మనకు ఆత్మభావనే కలిగేదికాదు. కాబట్టి యధార్థమైన ఆత్మఉన్నదని మనం నమ్మితీరవలె. దాని స్వరూపస్థితి ఋషుల వల్లనే తెలియగలము. నాహంస్థితిలో ఉన్నది శుద్థమూ, అనంతమూ అయిన జ్ఞానమని వారంటారు.

ఆ బోధను నసామాన్యానుభవం సమర్ధిస్తుంది. మహర్షి అన్నట్లు, ఎవడైనా తాను లేనంటాడా? మరిదేన్ని కాదన్నా, తాను ఉన్నానని ఒప్పుకొనకతప్పదు. అసలు ఆత్మస్వభావమే నిస్సంశయస్థితి.

__________

4. చూ. అనుబంధం 'చ', శ్లో. 231

5. ఛాందోగ్యోపనిషత్‌. vi, ii, 2.

6. చూ, అనుబంధము ''క'' శ్లో. 4 : ఉ, న, ఉపోద్ఘాతం. I

మనము సావధికము, వ్యష్టియగుదాని నాత్మయని ఊహించి, అది లేదన్న నాడు, ఎదో కానిదానికి ఆత్మనారోపించామనే గాని, ఆత్మయే అభావమని గాదు.

జాగ్రత్‌ స్వప్న సుషుప్తుల్లో ఏఅవస్థలోనూ ఆత్మను శుద్ధ స్వరూపంలో తెలియరాదు. 'నే' నన్న స్ఫూర్తి యుంటుందిగాని అహమికా అది కల్పించిన అవధీ ఆరోపాల్లో జిక్కి ఆ ఎఱుక అణుమాత్ర ప్రమాణ మవుతుంది. శంకరులు వివేకచూడామణిలోచెప్పినట్లు ఆత్మ ప్రకాశము మనఃప్రత్యయము వల్ల రెక్కొనలేనంతగా వ్యత్యస్త మవుతున్నది: మూడవస్థలనూ నిరసించే నాహంస్థితిలో మాత్రమే ఆత్మ ఉన్నరూపున భాసిస్తుంది. ఆ స్థితిని పూర్తిగా చేరుకోక మునుపే దాని చిన్నెలు కొన్ని సుషుప్తిలో కనుపిస్తాయి. మూడవస్థలనూ అధిగమించి పూర్ణంగా స్వస్వరూపానుభూతిని పొందేవరకు ఆత్మ సత్యం రూపించుట కాపాటియే చాలును.

గాఢ సుప్తిలో అహమిక, తను మనములు లేవు. కానినిద్రలో మనం మిగిలేయున్నామని, మరి దేనిని నమ్మనంతగా విశ్వసిస్తున్నాము. ఈ మిగులుటవల్లనే, ఆత్మ సాతత్యము నిరాక్షేపంగానిశ్చిత మౌతున్నది. దీనిని విపులంగా చర్చించక పూర్వం, ఋషి ప్రోక్తాను సారంగా అవస్థాత్రయాన్ని నాహంస్థితిలో పోల్చి చూడవలసియున్నది.

జాగ్రదవస్ధలో యీఈ జగత్తును చూస్తాము. దానిలో నానా జీవులు. అవధులున్నవారు కనుపిస్తారు. వారందరికి ఈ ప్రపంచం సమానమే. జగత్తును వ్యావహారిక సత్యంగా గణిస్తాము. దానికీ మనకూ సంధానము ఇంద్రియముల ద్వారా, ఆ ద్వారములు జాగ్రత్తులోనే విచ్చియుంటవి. ప్రపంచం తథ్యమని మనకు నమ్మజెప్పుకొన డంలో దేహేంద్రియాలు జగద్దృశ్వంలో భాగాల నేది మఱచిపోయి, అవి ప్రధానంగా సత్యములనే భావిస్తాము. నిశ్చయించవలసిన దాని నిట్లు దొంగ చాటుగా సిద్ధముగా గ్రహిస్తాము. అటుపైన మిగత ప్రపంచాన్ని పక్షపాతి యింద్రియాల సాయంతో సత్యంగా నిరూపించడం సులువే. ఇచట నిర్ణేత వివేకం. అబద్ధాల పుట్టయైన అహంత సంతానం గనుక అదియోగ్య సాక్ష్యం గాదు.

జాగ్రత్తులో ఉత్థితమగు ఆత్మ వివేకం రూపించేట్లు సావధికం కాదని శ్రుతులన్నవి. అది, యే యొక్క దేహానికీ కట్టువడదు. విశ్వమంతా - సర్వసృష్టీ - దాని తనువే. దానిని వైశ్యానరుడని విశ్వుడని అన్నారు. మన మహర్షి యంటారు; జాగృతిలో యీప్రపంచం పూర్ణము, అవిభాజ్యము. చేతనైతే అది సర్వమూ మనమేనని గ్రహింపవలె. కాకుంటే అది సర్వమూ భ్రాంతియని వర్జించవలె. ''దేహము పంచకోశాకారము. నుక దేహమన్న పదములో నైదును అణగును. దేహము లేకలోకమున్నదా? దేహము లేకయే లోకమును గన్నవారు కలరా? చెప్పుము.''7

ఇచట మహర్షి ఒక విషయం మన జ్ఞప్తికి తెస్తున్నారు. దానిని సామాన్యంగా విస్మరిస్తాము. గాని దాని యాధార్థ్యాన్ని మాత్రం కాదనలేము. ప్రపంచాన్ని చూస్తూన్నతడు, తన దేహాన్ని చూస్తాడు. ఇది జాగ్రత్‌ స్వప్నాలకు రెంటికీ సమమే. దేహమూ జగత్తూ సమవాయంగా కనుపిస్తాయి. జగత్తు గోచరించనపుడు, దేహమూ, అట్లే. మహర్షి అడుగుతారు : ''ప్రపంచం ఉనికి దేహానికి వేరుగా విలక్షణమయతే నిద్రలో, దేహోపాధి లేనప్పుడు మనకా ప్రపంచం గోచరించదేం?'' దీనికి బదులీయ సాధ్యం కాదు. నిజంగా దేహానికి విశిష్టంగా జగత్తులేదు. అందుచేత జగత్తే మనశరీరం, కలలలోవలె అహంత ప్రసరింప జేసినది, దాని కల్పన.

కాని కలల్లో దేహం లేదుగదా? అయినా ఎదో ప్రపంచం కనబడుతూనే ఉన్నది. కలగనే వాని దేహం అచేతనంగా పడి

_____________

7. చూ. అనుబంధము 'క', శ్లో, 10 : ఉ. న. 5.

యుంది : అయినా వానికి మెలకువలో చూచే ప్రపంచం వంటిందే బహురూపి జగత్తు అగుపిస్తుంది. అలాగే ఒకడు ''మరణించి'' తన భౌతిక దేహాన్ని వదలి వెళ్ళిపోతాడు. దాన్ని దహించటమో పూడ్చి వేయటమో జరుగుతుంది. అతనికిక శరీరం లేదు; కాని వేరేలోకా లకు వెళ్ళి, కొంత కాలం అక్కడ వసించి, ఈ ప్రపంచంలో మళ్ళీ పుట్టుతాడు. ఆ యితరలోకంలో ఉండగా వాడా ప్రపంచాన్ని చూస్తూనే ఉండడా? అంటే దేహం కేవలం మాంసలమే కానక్కర్లే దని సమాధానం. సూక్ష్మ దేహాలూ ఉన్నవి. అట్లని శ్రుతులంటవి. మహర్షి అంగీకరించి దానినే ఈ ప్రశ్నలకు సమాదానంగా ఉదాహరిస్తారు. అంతరాత్మను కప్పుతూ లోన దాస్తూ పంచకోశాలున్నవి. అవన్నీ కలిసిందే దేహం. వీనిలో ఏ యొక్క కోశ##మైనా మిగిలి యున్నంతకాలం, ఆత్మ శరీరహీనం కాదు; ఇతర కోశాలకూ అను రూపంగా జగత్తును చూడగలదు. కలగంటున్నప్పుడు అహంతకు మిగిలి యున్నది సూక్ష్మ లేక మానసిక దేహం : ఈ సూక్ష్మ శరీరం విస్తరించి స్వప్న ప్రపంచ మౌతుంది. పరలోక యాత్రికుని దీ యీవిథమే. వాడు లింగ శరీరంతో పయనించి పరలోకంతో లావాదేవీలు పెట్టుకుంటాడు ఆలోకమూ మనః కల్పితమే. కాబట్టి యేప్రపంచమేని కనుపించిన ప్రతి సందర్భంలోనూ దానికి సదృశ శరీరం ఆహమిక తాల్చుతుంది. అందుకే శరీరమూ జగత్తూ సమకాలంలో కలిసే గోచరిస్తాయని యన్నారు. అవి రెండూ ఒకేఒక విడదీయరాని దృశ్యమన్నది అక్షరాలా నిజము.

కలలో గన్న లోకాలూ, మెలకువలో చూచినవీవస్తుతః సదృశాలని గుర్తించే ఉన్నాము. కలల్లోనివి ఎవ్వరూ కల్ల కాదనరు. అధవాకాదన్నా పట్టించుకోనక్కఱలేదు. వారి సిద్ధాంతాలలోని లోపాలు వారిని ఈఅసంగతానికి పాల్పడజేస్తాయి. మనము గుర్తించే ఉన్నట్లు జాగ్రత్‌ స్వప్నాలు రెండూకలలే. మెలకువ అనేది నిజంగా మెలకువగాదు. ఈ మెలకువ అనే కల అజ్ఞాన నిద్రలోనిది. అందుండి నిరహంస్థితి జేరుకోవడమే నిజమైన మేలుకోనటం. ఇట్టి మెలకువలో కల్లలు కనబడలేవు.

ఇక ఆత్మ యవిరళత లేక సాతత్యాన్ని గూర్చి, ఇది నిద్రా వస్థ విషయం. అచ్చటే యీసందేహానికి తావుంది. అచట, కలలు రాని నిద్రలో తనుమనములూ అహంతా ఉండవు గదా?

నిద్రలోనూ పిదప మెలకువనూ ఆ తానే కొనసాగుతున్నాయని సామాన్యుడెవ్వడూ సంశయించడు. సుప్తిలోని ఆత్మ జాగ్రత్‌ స్వప్నాలలోనిదివలె సావధికమూ అహంతావృతమూ కాదని అతడెఱుగడు. మహర్షి యన్నట్లు ''నేను నిద్రలో లే''నని ఎవ్వడూ అనడు. తన ఉనికి త్రెంపులేక సాగుతున్నదా అనే శంక కేవలం నాగరక జనానికి కలిగేదే. కాని ఋషులందరూ మూడవస్థల్లోనూ ఆత్మ ఆధారభూతమని, దానినర్థంజేసుకోవటానికి నిదర్శనాలిచ్చి యున్నారు.

గాఢసుప్తి చైతన్యశూన్యమని మనమొదటి భ్రాంతి. ఈ ప్రస్తావన వచ్చినపుడు మహర్షి యున్నారు : 'నిద్ర చైతన్య శూన్యమని మేల్కొన్న తర్వాత అంటావు. నిద్రలోనే ఉండగా అనవు. నిద్ర చైతన్యరహితమనుటకు నిన్ను లోనుండి ప్రోత్సహించేది మనస్సు కాని అది నీ నిద్రలో లేదు. నిద్రలోని నీ చైతన్యం దానికి తెలియక పోవడం సహజమే. నిద్రించని తాను అదెట్టిదో స్మరించజాలదు. అందువల్లే ఆపొరబాటు. గాఢసుప్తి మనస్సు కవ్వలిది. ''కనుక ఒక అవస్థలోని మనస్సును వేరొక అవస్థలోని మనస్సుతో నిరూపించ నెంచటం సరికాదు. మెలకువలోని మనస్సు నిద్రావిషయం నిర్థారించ లేదు అవస్థాత్రయాన్ని అధిగమించిన మహర్షి యొక్కరే వానినైజాన్ని నిర్ణయించ సమర్థులు.

గాఢ నిద్రలో ఆత్మ శేషించుననుటకు వలసినన్ని నిదర్శనలున్నవి. మచ్చకు మహర్షి సంవాదమొకటి. పాశ్చాత్యుడొకడు ప్రశ్నించాడు : ''నాహంస్థితి ప్రయోజనమేమి? జగన్మిధ్యాత్వమున కది విరళము కాదే. ఒకడుగానని సమయమున మరియొకడు దానిని కాంచునే కదా?'' ఇది యొప్పదని పూర్వమువలెనే తెల్పి మహర్షి వచింపసాగినారు : ''నీవీ ప్రపంచాన్ని నిజమను కొంటున్నావు, కలలో వలెనే అది నీ మనః కల్పన గనుక. నిద్రలో నీవు దానిని చూడవు; అప్పుడది అహముతో మనస్సుతో చుట్టచుట్టుకొని ఆత్మలో లగ్నమై బీరూపంలో ఉంటుంది. నీ జాగృత జనము నీ స్వప్నజగత్తు వలెనే మానసిక సృష్టి. మెలకువలో కలలో గూడ దానిని చూచు వాడుండ వలె. వాడెవడు? దేహమా, కాదు : మనసా, అదిగనే ఉండవలె. కాని నీవున్న నిద్రలో మనస్సు లేదే. అందు చేత నీవు మనస్సుకావు.'' ''అదేమో, నేనెఱుగను. బహుశా అపుడు నేను లేనేమో'' అన్నాడతడు. ''అట్లయితే నిన్నటి నీ యనుభవాలను ఇపుడెట్లు స్మరిస్తున్నావు? నీ ఉనికిలో విచ్ఛేదం ఉందని నమ్మియే వాదిస్తున్నావా?'' ''అది సంభవమే'' అన్నాడాయన. ''అలాగే. జాన్‌సన్‌గా నిద్రి చి బెన్‌సన్‌గా మేలుకోవచ్చు. కాని అది జరుగదే. నీ ఏకరూపత నిరత మన్నభావన నేమని ప్రఖ్యాపిస్తావు? 'నేను నిద్రించాను' 'నేను మేల్కొన్నా' నంటావు. దాని యర్థం అప్పటి నిద్రాగతుడు ఇప్పటి నీ వనేనా?'' పృచ్ఛకునికి బదులేమీ తోచలేదు. మహర్షి తమభాషణ సాగించారు : ''నిద్రలేవగానే 'నేను సుఖంగానిద్రబోయాను, ఎంతో హాయిగానున్నా' నంటావు. నిద్ర నీ యనుభవమన్నమాట. నిద్రా సుఖమెఱిగినవాడు -'నేను సుఖంగా నిద్రించానన్నవాడు -| ఆ సుఖాన్ననుభవించినవానికి వేరు కాజాలడు. ఆ యిర్వురూ ఒకరే.''8

_____________

8. ఉపదేశత్మకమైన యీ సంవాద శేషమిది - మహర్షి ! - ''నీవన్నట్లు నీ నిద్రలో జగత్తుంటే, అది నీతో అట్లు చెప్పినదా?'' (తరువాత 115 వ పేజీలో చూడుము)

ఇట్లు నిద్రలో ఎదో విధంగా ఆత్మ సాతత్యముందనడానికి ఎన్నో నిదర్శనాలున్నవి. ఔపనిషదమైన ఆత్మ యొకటి కలదనీ, అది

_____________

(114 వ పేజీలో తరువాయి)

పృ :- లేదు. కాని అట్లది యిప్పుడు తెల్పుతున్నది. ప్రపంచం ఉందన్న నిదర్శనం దారిలోనా కాలికి రాయి కొట్టుకున్నపుడు దొరికినట్లే : ఆ బాధ రాతిని, అది అంశ##మైనజగత్తును నిరూపిస్తుంది.

మ :- రాయి యుందని చెప్పేది నీ పాదమా?

పృ :- కాదు, నేను.

మ :- ఈ నేను ఎవరు? అది నీ దేహం కాబోదు : మనస్సూ కాజాలదు. అది జాగ్రత్‌ స్వప్న సుప్త్యవస్థలకు మూటికి సాక్షి మాత్రం. అవి 'నేను' ను బాధించవు. ఆఆవస్ధలువచ్చేవి పోయేవీ : కాని ఆ 'నేను' ఎప్పుడూ స్థిరంగా మిగిలి యుంటుంది. అదియే సంతతా నందమూ పూర్ణమూనయిన నీ నిజస్వరూపము. ఈ స్వరూపానుభూతి అతృప్తి నంతనూ హరిస్తుంది; పూర్ణతనూ ఆనందాన్ని ప్రసాదిస్తుంది.

పృ :- లోక కల్యాణానికై వేలు మెదపక ఆనందంలో మునిగి యుండటం స్వార్థంకాదా?

మ :- నీకాస్థితిని గూర్చి తెలిపింది, దాన్ని నీవుసాధించి, ప్రపంచం నీకన్యంగాదన్న సత్యాన్ని గ్రహిస్తావని. అది గ్రహిస్తే స్వార్థపదానికర్థం ఉండదు, జగత్తు నీ స్వరూపంలో లీనం గనుక.

పృ :- ప్రపంచంలో యుద్ధాలు దుస్సహ దుఃఖాలున్నవని మహర్షి ఎఱుగునా ? తెలిసియుంటే ఆయన సుఖించటం ఎలా సంభవం?

మ :- అగ్ని వఱదల దృశ్యాలు సినీ తెరపై మెదలి కదలిపోతే, తెరకేమైన మొప్ప మివచ్చిందా? ఆ తెరలాగే స్వస్వరూపం, జగత్తులోని ఘటనలు ఆత్మనేమీ బాధించవు. కర్త కార్యముల విభేద భావ మున్నపుడే దుఃఖానుభం సాధ్యం. ఈ భేదభావన నాహం స్థితిలో ఉండదు. అచటిది స్వస్థితి యొక్కటే. అక్కడ ఋషి ఆత్మయే, అతడు శుద్ధ చేతస్సు, పూత ప్రేతాత్మ (Holy Ghost). వానికీ ప్రపంచమే స్వారాజ్యము, ఆ రాజ్యం నీలో నున్నది.''

అంత మహర్షి జీసస్‌ ప్రసక్తి దెచ్చి అతడు బోధించిన స్వారాజ్యం నాహంస్థితియే; అచట నున్నది ఆత్మ యొకటే, అచట ప్రపంచ దుస్థితి, దాని వారబమెట్లున్న ప్రశ్నలె కలుగవని విశదపఱిచారు.

జీవుడు కాదనీ ఋషులు నేర్పినారు. మన నిద్రానుభవం మనోదేహా లకు విశిష్టమైనది ఆత్మయని స్పష్ట పరుస్తున్నది. నిద్రలో తను మన ములు లేవుగనుక అహంభావన అసలు లేదు.

నిరహంస్థితికీ నిద్రకూ చాల సాదృశ్యముంది. రెంటికీగల అతి ముఖ్యమైన అంతరం గూర్చి తరువాత తెలిసికొందాం. ప్రస్తుతం గుర్తించవలసింది నిద్రలో వ్యక్తీమనోభావనల అభావం, నిద్రాసౌఖ్యానికిగాని దాని సంస్కృతికి గాని భంగకారిగాదు. నాహంస్థితి అది అసమగ్రమైనా, దాని వల్లనే నిద్రాసౌఖ్యమని శ్రుతులంటాయి.

మూడవస్థల్లోనూ దేహములు కోశములు ఆత్మను నిరంతరం ఆవరిస్తూ అవధికం చేస్తూన్నందున ఆ అవస్థలను నాహంస్థితికి విలక్షణంగా పరిగణించారు. దేహాలు మూడు, కోశాలు అయిదు. భౌతిక లేక స్థూలదేహం జాగ్రత్తుకూ, మానసిక లేక సూక్ష్మదేహంస్వప్నానికీ సరిపెట్టారు. స్వర్గనరకాది ఇతరలోకాలకు పయనిస్తూ అటనటవసిస్తుండేది యీ సూక్ష్మదేహమే అన్నారు. మరోశరీరం, దాన్ని కారణ శరీరమన్నారు. నిద్రలో మిగిలియుండేది అది యొక్కటే. అహమికా, అజ్ఞానమూ, బీజాకృతినిమనస్సు. అదే యివన్నీను పంచ కోశాలు యీ మూడుపాధులే.

స్ధూల శరీరము = అన్నమయ కొశము

సూక్ష్మశరీరము = ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల సమిష్టి

కారణ శరీరము = ఆనందమయ కోశము.

సూక్ష్మ శరీరంలోని కోశాలకు వానివాని వృత్తులనుబట్టి ఆయా పేర్లిడినారు. ప్రాణమయానికి జీవనవ్యయసాయము; ఇంద్రియ విషయ ములకూ తలపులకూ, మనోమయము; విజ్ఞానమయము ధిషణకు, యుక్తాయుక్త వినిశ్చయానికి,

ఆనందమయం ఆనందం గాదు. ఆనందం నాహంస్థితిలోనిఆత్మ, ఏ దేహాలూ కోశాలూ ఆవరింపనిది. ఈ చివరిది ఊహామత్రం, ఉప దేశ ప్రయోజనానికై కల్పింపబడినది, అన్నారు మహర్షి. ఆత్మాన్వే షికిది నిష్ప్రయోజకం. దీని నతడు దాటవేస్తాడు.

ఈ శరీరాలూ కోశాలూ నిజమనుకోరాదు. అపరోక్షజ్ఞాన మనే ఆత్మానుభూతి, అహంతావశత నున్నట్లుగా అగపడే ప్రతిదాని అభావాన్ని తెలియడమే. అపరోక్ష జ్ఞానమంటే సర్వకోశవిసర్జనమే. అటుపై శేషించేది సత్యం, శుద్ధం. అవికార్యం, అనంత చిత్త్వమగు ఆత్మ.

ఇక ఆత్మ నధికరించిన రమణ దర్శనాన్ని పరికిస్తాం.

నాహంస్థితిలోని స్వస్వరూపమే యదార్థం. అదియే 'సత్‌' - ఉన్నదేదో అది. ఈ 'సత్‌' యే చేతన, 'చిత్‌' స్వయంస్థితం కానిదేదీ నిజంకాదు. చిద్రహిత మెల్లాఉండగల్గినది చిత్తు మూలంగానే. అందుకే ఋషులీ జగాన్ని మానసికమన్నారు. మనం తెలుసుకొన్నట్లు ఆత్మ యొక్కటే నిశ్చయాత్మకమైన సత్యం. కోశములు వ్రాలిపోయినపుడు మూడవస్ధలకవ్వల, శుద్ధచైతన్యంగా శేషించేది అదే.

ఆత్మను జ్ఞానముకలది యనక జ్ఞానమని యేలన్నారు? దీనికి వివరణం ఎంత సులువో అంతకంత ప్రధానం. మనస్సుకు చైతన్య ముందిగాని అది అల్పిష్టం, చపలం. దానిచైతన్యం నిద్రలోపూర్తిగా వినష్టమౌతుంది. పూర్వం చెప్పినట్లు మన శ్చేతనకు ఆధారం మరేదో ఉండవలె. ఆ ఆధారం మనస్సువలెగాక సదాభాసించే మూలచిత్‌ కావలే. దాని జ్ఞానం ఎన్నడూ మఱగేది కాదు కనుక అది దాని నైజమే. ఈ యర్ధాన్నే పర్యాయంగా చెప్పారు, మనంపలుకుతూన్న మూలాధారమైన ఆత్మయేచిత్‌ లేక జ్ఞానము అని. సనాతన వాఙ్మయమూ అలాగే అన్నది, ఉపనిషత్తులు దానిని ''జ్ఞానమనంత'' మన్నవి. జనసామాన్యం జ్ఞానంగా అనుకొనే చంచలం విషయాభిజతను నేర్పఱచుటకే, దానిని ''జ్ఞానము'' అన్నారని శంకర భగవత్పాదులు వివరించారు.

ఇట్లు జ్ఞానము యధార్థ స్వరూపగుణ విశేషంకాదు. సారస్వ రూపమే అది. దాని వ్యక్త రూపము 'నేను న్నాను' అన్ని తలపులకూ భావనలకూ సమతత్వమది. ఐతరేయోపనిషత్‌ యీ చిత్‌ నే ''ప్రజ్ఞాన'' మన్నది. కోశదులూ వాని వివిధదశల సమ్మి శ్రణమూ లేని శ్రుద్ధజ్ఞానమే ఆత్మ. తెలివికీ, ఎఱుకకూ అది లక్షణమో విశేషణమో అని జనసామాన్యమనుకొనే దానికి పైబోధ సరిగ్గా విరుద్ధము. జ్ఞానము గుణం కాదు, సద్వస్తువే. నిజం నిజం కావటం అది కేవల జ్ఞానం గనుకనే. దాని కన్యంలేదు. మనోబుద్ధుల కది విశిష్టమని తెల్పుటకే దాన్ని చిత్‌ అని పేర్కొంటారు.

ఈ చిత్‌ ఆదిని విశ్వమునకునూ మున్నున్నదని ఉపనిషత్తులు. అది తనలో నుండే యీ జీవకోటిని సృజించి అందు తానాత్మగా ప్రవేశించింది. ఇట్లు కావటం, లేక సృష్టి, నిజంగానే సంభవించింది కాదు. కాని పురాతన వాఙ్మయంలోని యీ సృష్టిగాధలు మనలోని ఆత్మ వ్యక్తిగతంకాదనీ, అది కేవలసత్యమనీ కన్నులకు కట్టేట్లు తెలుపుటకై పన్నినవి.

సృష్టి జరిగే ఉంటే సత్యం విభక్తమై యుండవలె. అది పొసగ దని ముందే చూచాము. మహర్షి యన్నదిది. ''సత్యం శకలితం కాదు; దానికి పరిధీలేదు. అట్లుగా అగపడునంతే కోశాలతో సమపఱచి దానిని పరిమిత మనిపించేది మనస్సే. తాను పరిమితమని నమ్మి ఆ పరిధిని సత్యానికీ అంటగట్టుతుంది. ఈ మర్యాదలూ విభాగాలూ కేవలం మనస్సు లోనివే. కాని ఆత్మకన్యంగా మనస్సుకు స్థితిలేదు. బంగారునగ స్వర్ణ సమంకాదు, దానికొకనామం, రూపం అధిరోపితాలు గనుక. కాని అది బంగరు కన్యంకాదు. మనస్సు ఆత్మదైన నిగూఢ శక్తి. దానిచేత 'ఏ కాత్మ అనే కాత్మలుగా కనుపిస్తుంది. మనస్సు ఉత్థితమైనప్పుడే జగజ్జీవేశ్వరులు గోచరించటం, నిద్రలో ఆమువ్వురూ కనరారు, వారి నూహింపనూగాదు.''

దీనినే అద్వైతాధ్యాత్మంలో అజాతవాదమంటారు. దీన్ని నిశ్చింతంగా సుస్పష్టంగా ప్రతిపాదించినవారు శ్రీగౌడపాదులు మాండూక్య కారికల రచించారు. దానికి శ్రీ శంకరుల విపులవ్యాఖ్య వెలిసింది. శంకరుల స్వీయ రచనలూ ఆ సిద్ధాంతాన్ని పోషించేవే. దానిని శ్రీ రమణులు స్వంతమే జేసుకున్నారు. ఈ విషయంగా వారి శిష్యులొకరన్నారు: ''పృచ్ఛకుల అభిరుచులకు, అర్హతల కనుగుణంగా సత్యాన్ని వివరించినా శ్రీభగవా& యీ అజాతవాదాన్ని స్వానుభవ నిష్కృష్టార్థంగానే బోధించేవారు.9 ఆ గ్రంధంలో అజాత సిద్ధాంత స్వరూప కధనం యిట్లున్నది : ''సృష్టిలేదు, దాని విధ్వంసనమూ లేదు, బద్ధుడులేడు, ముముక్షువు లేడు; మనస్సు, దేహము, జగత్తు, జీవాత్మ - ఇవేవీ లేవు. ఉన్నది ఏకము, శుద్ధము, శాంతము, నిర్వికారము, అద్వితీయము, పరిణామభేద విహీనము.''10

అహంతావిష్టుడు జగతిగల వైవిధ్యాన్ని చూచి దాని సంభవ మెట్లో తెలిసికొని నుత్సుకుడౌతాడు. ఈశ్వరుడు కారణమనీ తనలో నుండే దానినంతా సృజించాడనీ చెప్పగా వింటాడు. విని యోచించి, ఈ నానాత్వానికి మూలం ఏకమెదో ఉందనీ, అదేదైవమనీ కనుగొంటాడు. ఆ తరువాత దైవ మేమన్న విచారము. గుణశక్తి ప్రమాణాల్లో అత్యధికుడైనా అతడూ తనలాంటి వ్యక్తి యేనని తలపోస్తాడు. ఆరంభంలో అతని యూహనట్లే సాగనీయవలె. ఆ పై దైవం వ్యక్తి కాదంటే అతడు సహించే తరుణం వస్తుంది. అంతట ఋషి దైవ

_______________

9. చూ. అనుబంధం 'చ', శ్లో. 22

10. చూ. అనుబంధం 'చ' శ్లో. 20 - 21

మహంస్థితుడు కాదని వానికి తెలియేస్తాడు : అంటే దైవం ఏకం సత్‌ సర్వగతుడు సమాత్మయని.

ఈశ్వరుడు నాహంస్థితుడనే నిర్వచనం చాలపేలవంగా తోస్తుంది. అహంవర్తి మనస్సుకది అర్ధహీన మనిపిస్తుంది. ఈశ్వరుడు గగనంలో ఎందొ వైభవోజ్జ్వల లోకాల్లో దివ్యజన పరీవృతుడై దేవాప్సరో గణ సేవితుడై ఉంటాడంటే వారి కదొక తృప్తి. దైవము వారి హృదంతస్థితుడంటే గ్రహించటానికి వారికి కొంతకాలం పడుతుంది. అక్కడా వానికీ ఆత్మకూ ఎదో అంతరాన్ని ఊహిస్తారు. స్వ స్వరూపమే ఈశ్వరుడంటే, వారిక దేదో దైవ నిందయనిపిస్తుంది.

నాహంస్థితి యంటే వ్యక్తి త్వాభావమని, వీనిలో ఏదిగొప్ప, వ్యక్తిత్వమూ, దాని యభావమా? వ్యక్తిత్వమంటే ఎదో పరిమాణం స్ఫురిస్తుంది; దాని అభావం. ఊహించటాని కేముంది? ఇచట మనం గ్రహించనిది యొకటి - వ్యక్తిత్వం దేహమాత్ర పరిమితం, అ వ్యక్తిత్వం నిస్సీమము. రెంటనూ చేతన ఉంది. వ్యక్తిలో అది కోష్టగతము (Cabined), సంకీర్ణమూ, ఆబద్ధమూ; వ్యక్తిత్వ అభావంలో జ్ఞానము కేవలమూ నిర్నింబంధనమూ, నిస్సీమమూ శుద్ధమూ.

ఇట్లు అవ్యక్తిత్వానికీ వ్యక్తిత్వానికీ గల భేదం వెలుగు చీకటులకూ, స్వేచ్ఛా దాస్యాలకూ జ్ఞానాజ్ఞానాలకూ గలట్టిది. వీనిలో సంకలనమేది, వ్యవకలనమేది? ఋషిబోధన లిన్నివిన్నపిదప సమాధానం నిస్సంశయమే - సంకలనమవ్యక్తిత్వము, నిరహంస్థితి: వ్యక్తిత్వ మారెండవది.

అవ్యక్తిత్వం అన్యూనమగు జ్ఞానం. అది పూర్ణసత్‌, పూర్ణ చిత్‌. ఉనికిని లేక సత్‌ను మనస్సు త్రిధావిభజిస్తుంది.

సత్‌ + నానాత్వము = జగత్తు

సత్‌ + వ్యష్టి, లేక, వ్యక్తిత్వము = జీవుడు

సత్‌ + సమష్టి = ఈశ్వరుడు.

మూడింటను సమాంకము సత్‌. ఉనికి, నానాత్వము, వ్యష్టి సమష్టి - యీ మూడునూ మిథ్యలు. వానిని మనస్సు కల్పించి సత్తున కారోపించింది. ఈశ్వరునితో సహా అన్ని అవగమములనూ అధిగమించింది ఉనికి. ఈశ్వరుడని పేరిడినంతకే ఈశ్వరభావన (Concept) నిజం కాజాలదు. దైవం యధార్థ నిర్వచనం ''నేనున్నాను.'' ''హీబ్రూలు దాన్ని ''జిహోవా'' (నేనున్నాను) అంటారు. అది దైవయధార్థాన్ని చక్కగా తెలుపుతుంది.

మహర్షి బైబిల్‌ లోని మరియొక నిగూడార్థ వ్యాక్యాన్ని ఉదహరించారు. దాన్నిదైవమే పలికినాడట మోసెస్‌ కాంచిన తేజోదృశ్య గాధ అది. ఆ తేజంలోంచి వినవచ్చిన వాక్కు, వాని ప్రజలను ఈజిప్టునుండి వలస నడుపుమన్నది. ఆశబ్ద మెవ్వరిదో తెలుపరా, నా ప్రజలకు నమ్మెప్పుట కది అవసరమని మోసెస్‌ మొఱలిడినాడు. అందుకు ప్రతిగ వచ్చింది. ''నేనున్నాను; అదే నేనున్నాను'' (Iam that I am) అని, మహర్షి యన్నారు: 'ఆ గ్రంధాల్లో కెల్ల వరిషాక్షరాలతో లిఖింప తగ్గ దా వాక్యమొక్కటే. దానికెంతో ప్రాధాన్యముండవలె. ఈ దైవవాక్కు దైవస్వరూప రహస్యాన్ని వెలివరుస్తున్నది. కేవలము ''నేనున్నా''నే బ్రహ్మము. అదియే మన హృదయంలో సంతతమూ భాసించే చిత్కాంతి. ఆత్మయన్న అదియే.

సత్‌ ఏకమనీ, నిజమదేయనీ, ఇతరములన్నీ అజ్ఞానము దాని కారోపించినవనీ మహర్షి పలుతావుల పలుమారులు స్పష్టపరచి యున్నారు.

యధార్థ జ్ఞానమే ఆత్మ. దానికి నామరూపముల ననుసంధించుట వల్ల ఈజీవ విషయ జగత్తు ఏర్పడుతున్నది. దీనినే మహర్షి ''జ్ఞానమైన తానే సత్యము. నానాకారజ్ఞానము అజ్ఞానము, అసత్యమైన ఆజ్ఞానమునూ సత్యజ్ఞానమైన తనకన్న మేఱులేదు. పలుతెగల నగలు సత్యము కావు అవి సత్యమైన బంగారమును వదలి యుండగలవా? చెప్పుము'' అని యన్నారు.11

ఇచ్చట (నానాకార) జ్ఞానమన్న ప్రపంచమే. ప్రపంచం మనస్సులో పొదలి కదలే తలపులకు వేరుకాదు. మనస్సు ఇంద్రియ మూలకంగా తెలిసికొనే బాహ్యజగత్తు ఉందనుకొనుటవల్ల, అజ్ఞానులా తలపులనే జ్ఞానముగా ఎంచుచున్నారు. ఈ ''జ్ఞానం'' సర్వమూ అజ్ఞాన మాత్రమేకాదు, అది అసలే లేనిది. అది అంతా అహంతా మూల మని మనకు తెల్లమే. దీనికితోడు అజ్ఞానం అస్తిత్వం లేనిది. దానికి స్వయంగా కాళ్ళులేవు. లేని జగత్తును గూర్చి మనకెన్నెన్నో భావాలు. ఈ అజ్ఞానమూ మనస్సు కల్పించిన నామరూపములతోడి జ్ఞానమే, ఆత్మయే. అంతసేపూ బంగారుగనే ఉన్న దానికి నగలంటూ పెట్టిన ఎన్నెన్నొ పేర్లలాగా, జ్ఞానానికిడిన ఆనామరూపాలూ అసత్యాలే. ఇచ్చట నగలనూ బంగారునూ మహర్షి 'అసత్యాలూ ''సత్యమూ' అని వ్యవహరించడం ఉద్దేశ్యపూర్వకంగానే. నగలను ఎవ్వరూనిజం కావనరు. కానియిక్కడ నానాకారజ్ఞానమైన ఈ ప్రపంచం కల్ల యనుటకే యీ దృష్టాంతం. ఈ పదముల నుపయోగించింది వాని సమ్యగను రూపతను స్థాపించుటకే. ఆ పదాలే వాడకపోతే ఉన్మార్గ శిష్యులెవరన్నా నిర్దిష్టా ర్థాన్ని వక్రంజేసి మహర్షి నామరూపాలు సత్యమన్నారని ప్రచురించ వచ్చు. ఉద్దిష్టార్థమే వేరు మాటలలో - ''సత్యం వెలుగు సినీ తెర

_______________

11. చూ. అనుబంధం, ''క'', శ్లో. 18 : ఉ. న. 13

వంటిది. దానిపైగా జగజ్జీవేశ్వర చిత్రాలు కదలాడుతవి; భాసితమైన పటమువలె బ్రహ్మమొకడే కేవల సత్యము. అది విశుద్ధము, భేద రహితము. అనృతములైనను చిత్రములు సత్యమునకు భిన్నములు కావు. కాని సత్యము వానికి విశిష్టమే, అది నాహంస్థితిలో వాని నపేక్షించకే ఒంటినుండును గనుక. మిధ్యా దృశ్యములను జూచువాడు సత్యాన్నవలోకించడు. సత్యద్రష్ట మృషాదృశ్యాలగానడు'. చలనము లేని (సినీ) పటమువలె నిశ్చల బ్రహ్మమునుచే వదలి, కదలు చిత్రము లలో తన్నొకనిగా, అన్యములను యితర జీవ జగత్తులుగ కనుచున్నాడు.''12

జగము దృశ్యము. దానిని చూచు జీవాత్మ దానికభిన్నము. అవి రెండునూ మనః కల్పితములే.

ఈ ఉపదేశాన్నంతనూ ఒక అమెరికన్‌ శిష్యునికి మహర్షి యిట్లు ప్రసాదించారు. "Only one consciousness, equally distributed everywhere. You, through musion, give It unequal distribution. No distribution, no everywhere." (కేవలజ్ఞానము సర్వత్రా సమంగా పర్వియున్నది. భ్రాంతిచే నీవు దానిని విషమంగా విభాగిస్తావు. ఎల్లయెడలూ లేవు. విభజనా లేదు.) అ తరుణంలోనే మహర్షి ఆంగ్లంలో భాషించారు పై లిఖించినవి యధాతథంగా వారి వాక్కులే. మొదటి వాక్యంలో వ్యాప్తి, ఎడలూ అన్నభావన లాదరింపబడ్డవి. మూడవ వాక్యంలో వానిని భ్రాంతులుగా త్రోసిపుచ్చుటైనది. అవియు అహంతాకల్పనలే.

నాహంస్థితిలోని ఆత్మను, అల్పిష్టమూ మూడవస్థలకులోగు జీవాత్మకు విలక్షణంగా పరమాత్మయని వాకొన్నారు. మహర్షి యనేట్లు

_________

12. చూ. అనుబంధం 'చ', శ్లో 289 - 292.

ఆ వైశిష్ట్యం మహీయము అణీయము అనిగాదు, సత్యము అసత్యము నని. మహీయమైనదే సత్యాత్మ; ఆ రెండవదానికి అసలు అస్తిత్వమే లేదు. మిధ్యయైన అహంత వినష్టం కాగానే జీవాత్మస్థానే పరమాత్మ కుదురుకొంటుంది.

మాటవరసకు మహర్షిని 'ఆత్మజ్ఞు'డంటారు. కాని దీనిని యధా శబ్దం గ్రహించరాదు. ఇది తత్కాలానికుపయోగించేవర్ణనం : అజ్ఞానమంటూ ఒకటుందని నమ్మేవాళ్ళకై ఉద్దేశించింది. ''ఆత్మజ్ఞానం'' సాధించి యీ అజ్ఞానం తొలగించుకొడని వారికిచ్చిన సలహా ఇందులో రెండు విధాల భ్రాంతులున్నవి. మొదటిది అది విషయమని, రెండవది, అది అజ్ఞాతం, క్రొత్తగా తెలియవలసిందియని. ఆత్మ ఏకంసత్‌ గనుక, అది జ్ఞాన విషయంగాదు. స్వస్వరూపమే గనుక తెలియనిదెన్నడును గాదు. మన కాత్మ తెలిసినదిగాదు, తెలియనిదియుగాదని శ్రుతులు. మహర్షియునట్లే యన్నారు.

అదెట్లు సంభవం? ఆత్మ అచ్చమైన ''నేనున్నాను'' స్వయం వ్యక్తమదొక్కటే. దాని కాంతియే ప్రపంచాన్నంతా వెలిగిస్తుంది. కాని జగత్తు, అహమిక దాన్ని ఆవరిస్తున్నందున, తెలియనిదిగా, తెలిసికోవలసినదిగా తోస్తుంది. ఈ ఆవరణలను తొలగించడం కర్తవ్యం. దానిని చెత్తచెదారంతో నింపిన గదితో పోలుస్తారు మహర్షి. గదిలో చోటు కావలసివస్తే. ఆ చెత్తను తొలగిస్తే చాలు. క్రొత్తగా బయటినుంచి స్థలాన్ని తెచ్చి కూర్చవలెనా? అలాగే అహంభావి మనస్సునూ, దాని కల్పనలను ఖాళీచేస్తే, ఆత్మకాంతి యొక్కటే మిగిలి అడ్డులేక అగుపిస్తుంది. మామూలుగా ''ఆత్మనెఱుగుట'' అంటామే దాని అర్థం నాహంస్థితిలో ఆత్మగా నుండుమనియే. అట్లు మహర్షి ఆత్మ నెఱుగరు, ఆయన స్వయమాత్మయే.

ఉపనిషత్తులు యధార్థమన్నది; ఆత్మ అమరము, స్వతస్సిద్ధమైన సత్యమని, దానికి నిదర్శనం అందరి అనుభవంలోనిదే యన్నారు మహర్షి. కాని ఆ అనుభవం మాత్రం విధి విరుద్ధమనిపిస్తుంది. మృత్యువు తప్ప రానిదని అందరెఱుగుదుము. కాని నడతలో మాత్రం అట్టిదేమీ లేనట్లే ప్రవర్తిస్తాము. ఇంతకు మించిన ఆశ్చర్య ముండునా?13 ఆత్మగా మృతియేలేదని మహర్షి మతం. దాని నాదరించే మనకు అందాశ్చ ర్యానికేముంది? ఆత్మ ఎప్పుడుగానిబద్ధమూ నియతమూగాదు : తన స్వభావస్థితినది యెప్పుడూ కోల్పోదనుటకిది సూచకం.

ఇట్లు సత్‌ లేక ఆత్మ అభావమూ అజ్ఞానమూ కాదు : అది సంస్థితి, సమ్యక్‌ జ్ఞానము.

ఆత్మకే ఆనందమని మరియొక నిర్వచనం. కాని యీ సందర్భంగా అహంతా జగత్తుకు గల యూహల నప్రమత్తంగా పరికించవలె. ఆత్మ అశరీరి. కనుక అది ఆనందము, ఎదో ఆనందము కలదిగాదు. ఆనందించేవాడు సదా అట్లే యుండడు : ఒక్కొక్కప్పుడు శోక హతుడూ కావచ్చు. ఆనందం గూడ వేర్వేరు వేళల హెచ్చుతగ్గులుగా ఉండవచ్చు. నాహంస్థితుడిట్టి 'సుఖి' కానేకాడు. సత్తు చిత్తులవలె, ఆనందం వాని సారస్వరూపం. వ్యక్తమైనయెల్లకడలా, ఆత్మ సకలస్థితి చేతనలకూ మూలమైనట్లు, ఆనంద సకలమునకూ - ముఖ్యముగా అహం ప్రవృత్తుల సౌఖ్య రూపమున సైతం - మూలం ఈ ఆత్మయే.

ఆత్మ సహజస్థితిని నిరూపిస్తూ మహర్షి యోగవాసిష్ఠం నుంచి ఉదాహరించారు. ''తత్త్వదర్శికి బలమును బుద్ధియు తేజస్సును, వసంత కాలమునందు వృక్షమునకు సౌందర్యాది గుణములవలె, వృద్ధి చెందును.''14 గుణాతిశయ నవవికాసాని కాధారభూతమును శంకించు

_____________

13. అహన్యహని భూతాని ప్రవిశంతియమాలయమ్‌ |

శేషాః స్థావరమిచ్ఛన్తి కిమాశ్చర్య మితః పరమ్‌ || మహాభారతము.

14. చూ. అనుబంధము 'క', శ్లో. 75. : సూక్తిసుధ. 29.

వారి కొఱకే యిన్న దృశ్యాలూ. ఆ ఆధారము పూర్ణశక్తి, పూర్ణ జ్ఞానమూ.

గాఢనిద్రలో ఇది అతి విస్పష్టమే. ఆ అవస్థలూ ఆత్మయే ఆనంద మూలమనడం నిస్సంశయం. మేల్కొన్న పిదప స్మరించేది ఆ ఆనందాన్నే. జాగ్రత్తులో విషయ సంగతివలన జనిస్తాయనుకొనే సుఖతృప్తులు సైతం ఆత్మ కారణంగానే అని తెలిసయే యున్నాము ఆ సుఖతృప్తులు ఆత్మానంద నిష్యంది బిందుమాత్రాలు. మూలాజ్ఞాన సంతానా లైన ఆశా, అతృప్తీ, భీతిపీడాదుల రూపమైన మనస్సు విధిగా సహాజానందాన్ని అరికట్టుతుంది. అది స్వయంవ్యక్తివలె వర్తిస్తూ, ఆత్మగా మనకు సహజమైన ఆనందాన్ని యించుమించు పూర్తిగా తుడిచి వేస్తుంది. ఎడనెడా వికల్పంగా మనస్సీ అడ్డుకోడం మానటమూ కద్దు. ఆయా వేళల్లో మనకు కల్గే ఆనందం అప్రమేయ మనిపిస్తుంది. జరిగేదే మంటే, గాఢసుప్తిలో ఒక లిప్తకాలం మనస్సు ఆత్మతో నొకటౌతుంది. ఆ పాటికి మనం ఆనంద భరితులమౌతాము. ఉత్కటమైన ఇచ్ఛ పరిపూర్తి అయినందున్నో భయనివృత్తివల్లనో మనసులోని ఆందోళన తగ్గిన తరుణాల్లో కాదాచిత్కంగా, ఆత్మా మనస్సూ ఏకం కావటం తటస్థిస్తుంది. ఆ ఆనందం అంతంతకే. నెఱవేరని కోరికలు కూడగట్టుకొని మనస్సుకు గల ఆత్మాలంబనాన్ని క్రుంగదీస్తాయి. మనస్సుకు ఆత్మతోడి ఎడబాటే శోకం; అది తిరిగి తన మూలస్వరూపాన్ని చేరటమే మోదం, అన్నారు మహర్షి. అన్యమెన్నడం మనస్సును ఆత్మను వేరుచేయటం. దుఃఖమదే. ఎట్టి తలపులూ విషయాలూ ఎఱుగకుండటమే ఆనందం, అపుడు మనం స్వస్వరూపమే గనుక.

మన ప్రాచీన వాఙ్మయంలో దీన్ని కన్నులకు గట్టినట్లుగా వర్ణించియున్నారు. ''ప్రియాగాఢ పరిష్వంగంలో బాహ్యాంతరాలు తెలియని రీతిగా, ప్రజ్ఞానాత్మ పరీరంభంలో పురుషుడు బాహ్య మెఱుగడు, అంతరమూ తెలియదు.''15 అది చేతనా శూన్యతకాదు ''అతడు చూచుచునే తిలకించడు. అది దృష్టిలోపించి కాదు; అది అనశ్వరము. చూచుటకు అతని కన్యంగా రెండవ విషయమే లేదు.''16

ఇట్లు మనకు తలకొన్న ప్రశ్నలు రెంటికీ సమాధానాలు లభించాయి. మూడవస్థలకూ ఆధారంగా సహజ స్వరూపస్థితి ఉంది. అది, మిధ్యయైన అహంత సర్వనాశ##మైన పిదపా, శేషించియే యుంటుంది. ఆత్మ సహజ స్వరూపమే ఆనందం. కాబట్టి నాహంస్థితి యొక్కటే అత్యంత మభిలషణీయం. సాపేక్షమైనదేదీ దాని సాటిగాదు.

దీని నొప్పుకోవడంలో ఒక కష్టం ఉన్నది. బుద్ధి తనకు తెలిసిన జగత్తుకూ ఒరులు తెలిపిన సద్వస్తువునకూ సహేతుక సంబంధ మపేక్షిస్తుంది. కాని అట్టి వారధి ఏదీలేదు. దాని నిర్మాణం సంభవమూ గాదు. జగత్తుకూ సద్వస్తువునకూ గల పరస్పర విరోధమట్టిది. బుద్ధి పక్షమది. కాని ప్రపంచంగా మనకు కనుపించేది వస్తుతః సద్వస్తువే యని గుర్తించియున్నాము. రజ్జు సర్పోపమ దీన్ని విశదం చేసింది. ఆవలెనే జగత్తు సద్వస్తుల ప్రాతికూల్యం గూడా. రెంటినీ ఏక కాలంలోచూడం. త్రాడుకూ పాముకూ ఎట్టి సంబంధమూ లేదు : పాము దాని నుండి జనించలేదు. అలాగే సత్తు జగత్తులు పరస్పర విరుద్ధాలంటే అందొకటిని చూచేవాడు అదేపరి రెండవ దానిని చూడలేడు.రెండూ ఏకకాలంలో మన అనుభవంలోకిరావు. ప్రపంచాన్ని చూస్తూనే తన్నూ, అంటే సత్తను, చూడలేడు : తన్ను కంటూనే జగాన్నీ కాన

___________________

15. తద్యధా ప్రియయాస్త్రియా సంపరిష్వక్తో నకించన బాహ్యో వేద, నాంతరం, ఏవమే వాయం పురుషః ప్రజ్ఞేనాత్మనా సంపరిష్నక్తో నకించిన బాహ్యో వేద, నాంతరమ్‌ ||

బృ. ఉ. IV, III 21

16. యద్వే తన్నపశ్యతి పశ్యన్‌ వైతన్నపశ్యతి | నహిద్రష్టుర్దృష్టే ర్విపరిలోపో విద్యతే7 వినాశిత్వాత్‌ | నతు తద్వితీయ మస్తితతో7 న్యద్విభక్తం యత్‌ పశ్యేత్‌ || బృ. ఉ. IV, III 23.

లేడు. కాబట్టి, ఆ రెంటిలో ఏ యొకటో నిజంకావలె - రెండూకావు. జగం సత్యంలోంచి పుట్టుకోరాలేదు. సత్యానికీ, జగత్తుకూ ఏ సంబంధమూలేదు. అందుచేత బుద్ధి ప్రతీక్షించే వారధి కట్టిలేదు, కట్టనూ గాదు.

అలాంటి వంతెన ఉందనే ప్రాతిపదికపై ప్రశ్నలను పెంచి సమాధానాలకై ప్రతీక్షించడం అర్థంలేనిపని : వానికి బదులీయ తగదు. అందొకటి మూలాజ్ఞానం పుట్టువును గూర్చినది ముందే చూచాము. అదే ప్రశ్నను మరొక రూపంలో మహర్షి నడిగారు : ''ప్రపంచానికీ విమోచనకూ మేళన మెట్లు?'' ''అది విమోచనలోనే యన్నారు మహర్షి. స్వస్థితిలోని మహర్షికి అపశ్రుతి యోక్కడిది? నిష్ప్రపంచమైన కేవలస్థితిలో గాకుంటే పూర్ణమైన స్వరమేళనం మరెక్కడ? ఆ ఏక తానం బుద్ధి గ్రహించలేదు, తానక్కడ చేరుకోలేదు గనుక, చేరితే తాను మిగులదు గనుక. స్వభావ సంస్థితమైన ఆత్మ బుద్ధి కతీతమన్న యీ యర్ధాన్నే శ్రుతులు మరల మరల ఘోషించినవి.

ఆ స్థితి బుద్ధి కవ్వలిది గనుక వాక్కునకూ అందనిదే. వాచా దాని యధా స్వరూపవర్ణనం సాధ్యమేగాదు. వాగ్రూపంలో అది యిది యని వర్ణింపబూనితే, ఏదో అంశంలోనో కాక అంశాల్లోనో, అది తప్పయితీరుతుంది. ప్రాచీన గ్రంథాల్లో కనబడే అలాంటి కధనాలెన్నో చూచి, వానిని సరిజేయడానికైన తరువాతి ప్రక్షిప్తాలను పరిశీలించి పరిశీలించి పరిణతుడై శిష్యుడది నిర్లోపంగా బుద్ధి గ్రాహ్యం కాదని గ్రహిస్తాడు. దానిని యధారూపం తెలియలేకున్నా, విపరీత గ్రహణం మానుటకైనా సాక్షాదనుభూతి యొక్కటే మార్గమని అవగామన జేసుకుంటాడు.

ఫలితార్థమిది : స్వరూపస్థితి ఏదికాదో తెలియగలంకాని అది యిదియని నిర్ణయింపనెన్నడూ సాధ్యంకాదు. బోధ పారమ్యంలో సహజస్థితి యంతస్సారం నిరూపించే యత్నమే లేదు. దర్శనాలుపరమ స్థితిని ''నేతి'' ''నేతి'' - ఇది కాదు, ఇది కాదు - గాగ్రహించుమన్నవి. దానిభాష మాటలు కావు, మౌనము. దీనికి పరమ నిదర్శనం పరమ దైవం దక్షిణామూర్తియే. ఆయన శిష్యులగు సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులకు ప్రసాదించింది మౌనవ్యాఖ్యా ప్రవచనమే గదా? వారు ఛిన్నసంశయులై, వాఙ్మానసముల కవ్వలి సత్యానెఱుగుటకు వాచామనసా మౌనమే సాధనమని గ్రహించారు. వారట్లుగా ఉన్నారు. అధికన్నారు. మహర్షియు ''మౌనము ఆత్మవచస్సు, అదియే పరమమైన ప్రవచనము. పదములు విద్యుద్దీప కేసరములు (filaments) మౌనమన్ననో విద్యుత్‌ శక్తియే'' యన్నారు.

ఇట్లు నాహంస్థితిని గూర్చికాని, ఆస్థితిలోని యాత్మనధికరించి గాని సాకల్యమగు వర్ణన నాసింప లేము. మహర్షికినీ అది శక్యం గాదు. శక్యమయ్యేది దాన్ని గూర్చి విపరీతాలైన మనయూహల తొలగించటమే. అది యేది కాదో, మనమెఱిగిన సాపేక్షస్థితులకది యెట్లు విలక్షణమో, వానివలన తెలియగలం. ఇంతకూ స్వరూపస్ధితిని తెలుప గల సమర్థుడు ఋషి యొక్కడే. కాని జనులలో ఒకనానుడి ఉన్నది: ''మాటాడునది చూడలేదు; చూచినది మాటాడదు'' అని.

మన ప్రాచీన గ్రంధాల్లో ఆత్మను సచ్చిదానందమంటూ ప్రస్ఫుటంగా వర్ణించియే యున్నారు. ఆ వర్ణనలు రూపంలో నిశ్చయాత్మి కాలుగాని, అర్థంలో గావు. ఉద్దేశ్యం విపరీతోహల నిషేధానికే. దానిని సత్‌ అనటం అసత్‌ భావన పోగొట్టడానికి : చిత్‌ అనటం అది జడవిషయాలవలె చిద్రహితమూ విరళజ్ఞానమూ కాదనడానికి. దాని నానంద మనటం అన్యసంబంధంవల్ల విధిగా కలిగే దుఃఖాన్ని దాటుటను సూచించటానికి.

ఆత్మస్థితి ఇప్పుడో మృతికి పిదపనో ముక్తులనివాసంగాని లోకంగాని కాదు. వివిధమతస్థులు యీ విషయంగా చిత్రవిచిత్ర భావనల పెంచుకున్నారు. ముక్తికలుగగానే సశరీరంగా గగనంలోకి కదలి పోతాడని కొందఱు. తనువేదో అద్భుతంగా అదృశ్యభావమంది అట్లే అంతర్హితమౌతుందని మరి కొందఱు. వీరి ప్రకారం శవం మిగిలితే ముక్తిలేదని. మోక్షమంటే స్వర్గానికో మరేదివ్యలోకాలకో చేరుకోవటమని బహుజనాభిప్రాయం. యోగవాసిష్టంలో చెప్పారు : ''మోక్షం ఆకాశానికి ఉపరితలంలోగాని భూతల పాతాళాల్లోగాని లేదు. ఆశలన్నిటితోటి మనోనాశ##మే మోక్షము.''17 నాహంస్థితి అన్యాపేక్షలో లేదు, ఉండవీలుగాదు సర్వదా నిషిద్ధం. దర్శనాల్లోనూ అట్లే చెప్పియుంది : ''హృదయాన్ని వేధించే కోర్కులన్నీ నష్టమైనపుడు, మర్త్యుడమరుడౌతాడు. ఆపై అతడు బ్రహ్మమే.''18

కాని దీనికి ప్రతికూల వాక్యాలూ కానవస్తాయి. మత గ్రంథాలూ, మహర్షిగూడా సత్తు హృదిస్థితమన్నారు. ''స్వారాజ్యము నీలోనున్నది'' అన్న జీసస్‌ వాక్యాన్ని మహర్షి ఉటంకించే యున్నారు. ఇవి చూస్తే ఆత్మ అన్యసంబంధియేగాక, అంగుష్ఠమాత్ర దేశంలో యిమిడేంత అణుప్రమాణ మనిపిస్తుంది. కాని దీన్ని యధా తథం గ్రహించరాదు. అంతచిన్ని హృద్దేశంలోనే, అనేక విశ్వగోళాల తోటి అనంతాకాశమూ నిహితమైయున్నదన లేదా? తాత్పర్యము, ప్రపంచానికి దూరంగా అంతర్ముఖులమై ఆత్మన్వేషించవలెనని. యోగ వాసిష్ఠ ముదాహరిస్తూ మహర్షి యన్నారు : ''హృదయమని అందరెఱిగిని మాంసపిండాన్ని నిర్దేశించి యనలేదు. అది సద్వస్తువు. మూలజ్ఞానము. దానిని హృదయమన్నారు. అందుండియే మనస్సు

______________

17. నమోక్షోనభసః పృష్ఠే న పాతాలే న చ భూతలే |

సర్వాశాసంక్షయే చేతం క్షయోమోక్ష ఇతీర్యతే ||

18. యదాసర్వే ప్రముచ్యన్తే కామాయే7స్వహృదిశ్రితాః |

అథమర్త్యో7మృతో భవత్యత్ర బ్రహ్మసమశ్నుతే || కాఠకోపనిషత్‌, IV, 1

జనించి, జగత్తుగా విస్తరిల్లుతుంది. ఆ మూలానికి అభిముఖంగా మరలితేనే అన్యాపేక్ష ఆకుంచితమై అంతరిస్తుంది. మనస్సు ప్రాణంతో కలసి హృదినిచేరి అందు ఏకనిష్ఠమైతే ఆపైన అది జగద్దృశ్యాన్ని ప్రసరింపజేసి ఆత్మను కప్పియుంచలేదు.'' పృచ్ఛకుల మనోదౌర్బల్యా లెఱిగి మహర్షి తెలియబల్కరుగాని నిజంగా ఆయన ఈ ప్రపంచాన్ని చూడరు.

ఒక విధంగా చూస్తే, ఆత్మయే సర్వమూను. దాన్ని సమిష్టి యనీ, జగజ్జీవాలను వ్యష్టియనీ అంటారు. నిజానికి పరమార్థంలో అంశ భాగాలేవీ ఉండబోవు. కాబట్టి ఆత్మసిద్ధి సర్వసిద్ధియన్న మాట. దర్శనాలన్నవి : ''నిరవధిక మానందము : సావధికంలో సుఖంలేదు.''19 మహర్షి యంటారు : ''భూతమైనది ఆత్మయొక్కటే : ఇతరములన్నీ అత్యల్పములు. మన మాత్మను అమ్మ జూపినను దాని కన్యమేమి యును చూడము.''20 ఇక్కడ జీసస్‌ వాక్యమొకటి జ్ఞప్తికి వస్తుంది. ''ఆత్మనేనష్టపోయేటైతే, సర్వజగత్తునెగెలిచినా ఒరిగేలాభ##మేమి?'' అత్యల్పమూల్యమీ యహమిక అప్పనంగా, నిరవధికమూ మహీయమూ అయిన ఆత్మనే గడించవచ్చును. కాని ఆ కాస్తవెలనూ యీ యనేవలె.

అదెందుకోగాని, వ్యక్తిత్వం లేనిస్థితియంటే మనుజులకు తగని భయం. భయాల్నిటికీ హేతుభూతమైన అహంస్థితి వరికి వెఱపు గొల్పదు. వారికి స్వస్వరూపం తెలియక, అహమికయే తామని నమ్ముతారు. అహంతపోతే తమగతీ అంతేయని శంక. నిశ్శంకగా అహితాన్నక్కున జేర్చుకుంటారు. భీరహితమైన నిరహంతయంటే జడుపు.

___________

19. యోవై భూమా, తత్‌ సుఖమ్‌ | నాత్పే సుఖమితి ||

- ఛాందోగ్యోపనిషత్‌ vi, xiii, I

20. చూ. అనుబంధము 'చ'. శ్లో. 300

భయమే తానగు అహమిక అంటే నిర్భయం. 21 అహంతపోక నష్టం కాదని, నిద్రలోని సుఖానుభవం వల్ల వారికి విశదం కాదోయోమో. అది అహమిక లేమియేయైనా, నిద్రించటానికి ఎవరూ జంకరు. మరి సకల భయ కారణమైన అహంతను ఉవ్వెత్తుగా త్రోసిపుచ్చి నిర్భయ లాభమంద డానికింత ఆశంకయేమి?

ఈ సహజస్థితికి యోగిజనం మన్నించే సమాధి స్థితికీ గల భేదాన్ని మహర్షి వివరించారు. సమాధి స్థితులు పలువిధాలు. వానిలో కెల్ల ఉత్తమం నిర్వికల్ప సమాధి. ఈ ''నిర్వికల్ప'' మన్నది సహజస్థితి కినీ సమానమే. యోగులభ్యసించునది ''కేవల నిర్వికల్పసమాధి. స్వభావస్థితిని సహనిర్వికల్పసమాధి యన్నారు. సహజమంటే స్వభావ సిద్ధమన్నమాట. ముక్తస్థితి యిదియే, ఆయితరం గాదు. ఒక శిష్యుని ప్రశ్నకు మహర్షి యిచ్చిన సమాధానం యీవైశిష్ట్యాన్ని ఎత్తిజూపు తున్నది.

పృ|| ''నిర్వికల్ప సమాధిలో నున్నతడు తనుమనః క్రియలు వేని వల్లగాని చలించడని నానిశ్చయం. దానికి మహర్షియే నిదర్శనం. సమాధికీ దైహిక వృత్తులకూ పొసగదని, అవి సమకాలంలో సంభవింప వనీ కొందరి మతం. ఈ రెంటిలో ఏది సమ్మతం?''

భ|| ''రెండూసరియే. నిర్వికల్ప సమాధి రెండు విధాలు - ఒకటి 'సహజ' లేక సహ నిర్వికల్పసమాధి; రెండవది కేవల నిర్వికల్ప సమాధి; నీ భావన సహజానికి చెందినది. ఆయితరము రెండవపరము. వానిలో భేదమిట్లు - సహజములో మనస్సు కరగి ఆత్మలో లీనమగును. అట్లు నాశమందుటవల్ల అది మరల పుట్టుట లేదు. బంధము అంతతో అంతమగును. కేవల నిర్వికల్పములో అట్లుకాదు. మనస్సు

21. యోగినోబిభ్యతి హ్యస్మాదభ##యేభయ దర్శినః. ||

మాండూక్యకారికాః. iii, 39.

చిదాత్మకాంతియందు మునిగియుండును. అది అట్లుండుదనుక ఆ సమాథిలో యోగి పరమానందమందును. మునిగినది వృత్తిమాత్రమయి నందున ఆత్మకు భిన్నముగా శేషించియున్న మనస్సు మరల క్రియా శీలమై, యోగి అజ్ఞానమునకు బంధమునకు వశుడౌతాడు సహజ స్థితుడు ఋషి; అతడు నిత్యముక్తుడు; మరల బద్ధుడగుటయేలేదు. ఈ భేదాన్ని విశదీకరించే ఉపమయొకటి - సహజస్థితుడు జలధిని గల సిన నది. అది మరల రాదు. కేవల సమాథిగతుడు చేత్రాటి చివర నూతి నీటమునిగిన ఘటము. త్రాడులాగితే ఘము పైకివచ్చును. అట్లు యోగిమనస్సు మరల జగత్ర్పవృత్తము కావచ్చును. అతడు ముక్తుడు కాడు. ఆరీతిగా యోగి యితర ప్రాకృతులసాటియే. యోగి మనస్సు నిద్రితుని మనస్సువంటిది. భేదమిది - సుప్తుని మనస్సు తమోమగ్నము : యోగిమనస్సు ఆత్మకాంతి నిమగ్నము. ఆత్మ యందు మనస్సు లీనమైన ఋషి జగత్‌ వ్యాపారములలో ప్రవృత్తు డైనట్లగుపించునేకాని, ఆ కార్యములతని మనోదేహములవి. అవి యతని నేవిధముగను బాధింపవు. జ్ఞానివ్యవహారములు తల్లి తినిపింపగా నిదిరించు శిశువు భుజించుటవలె; చాలకుడు నిద్రింపగా బండి పోవుటలువలె.''

అహంత నంత మొందించి సహజస్థితి నందినతడే స్వస్వరూప సత్యాన్ని ఉపదేశింపతగును; 'కేవల సమాధి' స్థిత యోగిమాత్రులందుకు పూనుకోరాదు. ఒక యోగి కేవల నిర్వికల్పాన్ని సాధించాడు. ఎంతో ప్రయత్నంపై, తడవ తడవ కేండ్ల తరబడి సమాధిమగ్నుడు కానేర్చినాడు. ఒకమారు సమాధినుండి మేల్కొన్నాడు. దప్పిఅయింది దగ్గర ఉన్న శిష్యుణ్ణి నీరు తెమ్మన్నాడు. వాడు నీరు తెచ్చుటలో జాప్యమయింది. అతడు వచ్చేసరికి యోగి సమాధిలో మునిగి యున్నాడు అట్లు శతాబ్దాలు గడచన్నవి. హిందూముస్లిమ్‌ పాలన ములు ముగిసి ఆంగ్లేయులు పాలకులైనారు. కట్టకడకు యోగి కండ్లు తెరచినప్పుడతనికి స్ఫురించిన తొలి తలంపు శిష్యుడు నీరు తెచ్చి యుంటాడని ''నీరు తెచ్చావా'', అన్నమాట వెలువడింది ఉద్దిష్టార్థమిది - అతడు సమాధిలోనున్న పుడు మనస్సు నిద్రాణమై మిగిలే ఉండింది. సమాధి చెదరగానే ఎక్కడ పూర్వమాగిందో అక్కడి నుండే మరల ప్రవృత్తమయింది. అంటే మనస్సు మిగిలిన చోట ముక్తి దుర్లభం.

కేవల నిర్వికల్పానుభవం పునః పునః మాసాలూ వత్సరాలూ గడచిన తర్వాత, క్రమంగా సహజస్థితి యలవడటం సంభవమే. పానకంలో మరల మరల ముంచిన చక్కెరబొమ్మవలె, మనస్సు క్రమశః కరిగి కరిగి ఏమీ మిగులక పోవచ్చు.

మన వైదిక గ్రంధాల్లో చిరకాలంగా తలయెత్తియున్న ప్రశ్నయొకటి బహుశః పాఠకునికి స్ఫురించి యుంటుంది. మోక్షస్థితి అహం తాశూన్యం; నిద్రగూడ అట్లే. నిద్రమూలంగా ముక్తిలభింపరాదా? అట్లనుకోటం వెఱ్ఱి. నిద్రితుడు మేల్కోగానే పూర్వంలాగే బంధాల్లో చిక్కుకొనే యుంటాడు. సమాధినుండి మేల్కొన్నయోగి గతిగూడ యిట్టిదేయని కన్నాము గదా? ప్రశ్నయేమంటే, ''నిద్రించగానే అహం అంతరించింది. అది అట్లే అడగిపోక, లేవగానే తానూ మరల తలయెత్తనేల?''

దానికి సమాధానం ఆలోచించకముందు, నిద్రనుగూర్చే శ్రుతులు పల్కిన యొక లక్షణాన్ని గ్రహించవలె. నిద్రమోక్షానికి వివృతద్వారంగాదు, సరికదా, ఆతంకంగూడా. ముముక్షువు విచార మధ్యంలో నిద్రిస్తే, మేల్కొనగానే మరల అన్వేషణ మొదలెత్త వలె. ఆత్మసాక్షాత్కరించిందాకా, విచారణ కాలమంతా, మెలకువతో పట్టువిడక సాధనసాగిస్తేనే అతనికి బంధమోచనం. తైత్తిరీయోపనిషత్‌ బ్రహ్మానందవల్లిలోని వృత్తాంతం స్మరణార్హం. భృగువు తండ్రి యైన వరుణుని వనల ఉపదేశముపొంది, ఆత్మా (ఆనందా) నుభూతిని సూటిగా విజ్ఞానమయకోశంనుండే సిద్ధింప జేసుకున్నాడు. అతడా కోశాన్ని విసర్జించి, ఆపై ఆనందమయ కోశంలో తన్ను మఱచి పోలేదు. తన్ను మఱవలేదంటే నిద్రపోదన్నమాట. ఆ చివరికోశాన్ని అంటే కారణ శరీరాన్ని, విజ్ఞానమయకోశంతో, కలిపెకానీ దాన్నే ప్రత్యేకంగా అధిగమించలేదు.

ఇకపై ప్రశ్నవిషయం. సమాధానం మహర్షి ఉపనిషత్తుల లోనే చూపినారు. ఆ రెండుదశల్లోను కీలకమైన భేదమొకటున్నది. మూలాజ్ఞానమైన అహంతను సర్వనాశమొనర్చుటతోనే ఋషి నాహం స్థితిని ప్రవేశిస్తాడు. సాపేక్ష సిద్ధాంతభాషలో మూలాజ్ఞానమగు కారణ శరీర లేక ఆనందమయకోశ నాశంతో అతనికి స్థూల సూక్ష్మ శరీరములతో సంసర్గం మఱగి పోతుంది. అహం నశించి అతడు జాగ్రదవస్థనుండి నేరుగా, అన్యాపేక్ష కవ్వలి నాహంస్థితి లేక స్వస్థితిని చేరు కుంటాడు. ఇట్లు ఋషికి కారణోపాధిగూడ వదలి పోతుంది. స్వభావ స్థఋషికీ, ఇతరోపాధులకూ లంకె ఆ కారణశరీరమే. అది లేనందుచేత అతడు మనో దేహాల కతీతుడు.

సామాన్యుని నిద్ర వేరొక పాటిది. మూలాజ్ఞానమైన అతని కారణోపాధి విలయనంగాదు దానిలో మనస్సు అహమికలు గుది కట్టి అతడు మేలుకునే వరకు బీజాకృతిలో అందే ఉంటవి. అపుడు మనస్సు విరతమైనందువల్ల నిద్రలో ఆనందంకద్దు. కాని యీ ఆనందానికీ నిరహంస్థితికీ పోలికేలేదు. మహర్షి యన్నారు : ''సుషుప్తి సుఖం తరు వర్ణాంతరాంతరాల్లో విరళ##మై తరుతలాన్ని వెలిగించే చంద్రిక; జీవన్ముక్తుని ఆనందంవిశాల సమతలినున్మేషించే నిరుపహత చంద్రజ్యోత్స్న.''22

___________________

22. చూ. అనుబంధం, 'చ' శ్లో. 310.

ఒక కాలంలో రాజదండనలలో అగ్ని పరీక్షయొకటి. దూషితుడు తాను నిర్దోషినని స్థాపించడానికి అగ్నితప్త పరశువునుచే దాలుస్తారు. చేయికాలితే అతడు దోషి, దండనార్హుడు: కాలకుంటే నిర్దోషి, బంధముక్తుడు. అసత్యాన్ని ఆశ్రయించి దోసి చేయికాల్చుకున్నాడు. సత్యకవచం నిర్దోషిని రక్షించింది. అలాగే తాను తనువన్న మిధ్యాజ్ఞానాన్ని కప్పుకొని నిద్రలో సత్యైక్యముగ నెడి కల్లరి, జాగృతిలో అందుండి నిర్వాసితుడై మరల బంధంలో చిక్కుకుంటాడు. సత్య జ్ఞానమాశ్రయించిన ఋషి సత్యమే ¸°తున్నాడు. అతని కహంత లేదు. స్వస్థితి నుండి చ్యుతియులేదు.

నాహంస్థితి యిట్లతి విశిష్టమైనది. అది జాగ్రత్‌ స్వప్న సుషుప్త్యవస్థలవలె ప్రపంచవ్యవస్థకు చెందినదికాదు. నిద్రలోనూ ప్రగాఢ మైనది అజ్ఞానం. అది ఆత్మను కప్పివేస్తుంది. అందువల్లనే అహమికను దానిపై చూపులనుబట్టి యధార్థమగు ఆత్మగనే గ్రహించటం సంభవిస్తున్నది. నాహంస్థితి నిరావరణ సత్‌ స్థితి. అందు అది శుద్ధమగు అహంస్ఫూర్తిగా భాసిస్తుంది. దీనిని మిగత మూడవస్థలకునూ అతి శయంగా తురీయ మంటారు. ఈ నిరూపణమూ తాత్కాలికమే. ''దానిని నాల్గవ అవస్థగా మన్నిస్తారు'' అని మాండూక్యోపనిషత్‌23 చాలజాగరూకతగా వ్యవమరించింది. దానికి మహర్షి వర్ణన : ''జాగ్రత్‌ స్వప్నసుషుప్తులను మూటినే చూచువారికి జాగ్రత్సుషుప్తి యని నాల్గవదిగ జెప్పబడు నాతురీయమే వాస్తవము. అది శాంతము, కాలాతీతము, శివమునూ. ఆ మూడవస్థలునూ ఆభాసమాత్రములు, మృషలు నగుటచే నీశుద్ధసంవిత్‌ స్థితి తురీయాతీతమగును.''24 ఆ రీతిని అవి నాల్గవస్థలు కావు, ఒక్కటే. అది ఆత్మసహజస్థితి, కేవల సత్యము.

_________________

23. చతుర్థమ్‌ మన్యంతే || మాండూకోపనిషత్‌, 7.

24. చూ. అనుబంధం 'క' శ్లో 79. సూక్తి సుధ 32.

ఇక్కడ సహజస్థితిని జాగ్రత్సుషుప్తి యనటం ఉపదేశాత్మకం. నిద్రను పోలినా సరియైన జాగృతి అదే. దీనినే భగవద్గీత ''సకలభూత ములకునూ నిశయగుదానిని ఋషి యెఱుగును : ఎందుభూతములు మేల్కనునో, అది మెలకువనున్న ఋషికి నిశ##యే,''25 అన్నది. అహమిక లేనిస్థితియందే నిష్ఠుడు కేవలము సత్‌ స్వరూపమునే తెలియును. జగత్తు అతనికి నిశ##యే. అది మిధ్యగనుక అతనికది కనుపించనే కనుపించదు. ఇట్లు రేయి పగళ్ళను జ్ఞాని అజ్ఞానులు తమలో పంచుకొన్నారు. జ్ఞానికి పవలు అన్నది, అజ్ఞానులకు నిశ : జ్ఞానికి నిశ, వారికి పగలు. జ్ఞాని జాగృతికి ఆద్యంతములు లేవు, కాలమే మిధ్య గనుక.

నిజమైన జాగృతి అజ్ఞానులు పవలని భ్రమించే కలగాక, నిరహం స్థితియే కనుక, అహమిక నిరతంగా ఉండేస్వర్గాది స్వాప్నికలోకాలను నమ్మే అజ్ఞానులు ఆ కలలు మరింత సుఖాపాదులు కావలెననేగాని అందుండి మేలుకోనిష్టపడరు. అహంతాయుత జీవితమంటే వారికంత ఆసక్తి. ఆ అనురక్తి కారణంగానే వ్యక్తిత్వనష్టమంటే ''చచ్చే చావుగ'' (Worst death) భావిస్తారు. ఋషులు నిజంగా మృతి ఒకే ఒకటి యనీ, అది అహంతాజీవితమేయనీ ప్రమాణీకరిస్తారు. వ్యక్తిత్వం నిల్పుకోవటం స్వభావస్థితి యనుకొంటే యదార్థ జీవితం నుండి శాశ్వతంగా వలస పోవడమే : స్వస్వభావనాశం సర్వనాశ##మే. మహర్షి స్పష్టం చేసినట్లు పుట్టుక పుట్టుకగాదు, గిట్టుటకే గనుక : అట్లే మృతి మృతీగాదు, మరల జనించుటకే గనుక, సహజస్థితి నందుటే నిజమైన పుట్టువు అపుడు శాశ్వతంగా మృత్యువే మరణిస్తుంది. ఆ స్థితిలోని ఋషిని గూర్చి మహర్షి యన్నారు. ''తాను పుట్టుచోటెదియని యెంచి తనమూలమౌ బ్రహ్మమందు ఋట్టువాడే, పుట్టినాడు; దినము

_______________

25. యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమీ |

యస్యాం జాగ్రతి భూతాని సానిశాపశ్యతో మనేః ||

పుట్టువాడు, ఎల్లపుడు నవీనుడామునీంద్రుడు.''26 కాలమునకూ అవ్వలి సద్వస్తువు నిత్యనూతనము, నవంనవము, కాలగతిచే అబాధితము.

సహజస్థితి మహర్షియే నిదర్శనమని చెప్పియున్నాము జీవద్గురు సన్నిధిలో ఆత్మనిష్ఠామహత్వం, మహత్తేజం అస్పష్టంగానే కానరావచ్చుగాని మనజీవితాన్నే మార్చగలవిగా అనుభవానికి వస్తాయి. ఆయనలో ఉన్న రూపున ఆత్మసాక్షాత్కరిస్తుంది. అంతకన్న పరలాభము కలదా? సకలభయనివృత్తి సర్వకామ్యఫలప్రాప్తియును అందే కానగలం. వైదికదర్శనాలు ఆత్మనధికరించి చేసిన ప్రస్తుతి యందతిశయోక్తి అసలు లేదని, దానిమహత్వము నణుమాత్రమైనను సరిపోలదని మనము గుర్తించగలం.

బాహాటంగా మతంలో ధర్మంలో విశ్వాసం ప్రకటిస్తూ, తెలివి మీరిన అల్పబుద్ధులకు, ఇప్పుడూ ఎప్పుడూ, తెలిసినా తెలియకున్నా, మనం సిద్ధాత్ములమే అంటే గ్రహింపవలవియేగాదు. మన స్వభావ స్థితిని విశదీకరించే వైదిక దర్శనాలు వారికేమీ నచ్చవు. సాధించి స్వత్వం జేసుకొని సంతోషించటానికి వారికి కాలసినవి సిద్ధులు. ఈ సిద్ధుల సంపాదనం వల్ల జగతిలో మహోన్నత పదవి ననుభవింపనేనని వారి ఆశ. వానికై ఎన్నో మంత్రాలూ నిగూఢ తంత్రాలూ. వానిని ఆత్మజ్ఞానం వల్లా సాధించవచ్చని కొందరి మతం : కాని యింతలేసి తృష్ణాలోభాలు పేరుకుంటున్నవారికి సత్యజ్ఞానం ఎట్లు సాధ్యమో ఊహింపలేము. వాని మూలాన భౌతికంగా అమరత్వమూ, అఖిల లోకాధిపత్యమూ ఆశించే వారున్నారు. విశ్వపాలకుడుగా ఈశ్వరుడు విఫలుడైనాడని వారి నమ్మకమేమో! తామైతే యీ సిద్థులవల్ల ఈశ్వరసములై, యాతనినధిగమించి, భువనపాలనం ఎంతోచక్కగా

_______________

26, చూ. అనుబంధం '' శ్లో. 57ః సూక్తిసుధ ||

నిర్వహింపగలమని భావించి యుంటారు. తమవంతువచ్చినపుడు భూతల స్వర్గం నిర్మిస్తామని యీ విశాలలోకాలకు వారిహామీ. విశ్వనిర్వహణం మనపని కాదనీ ఈశ్వరునిదనీ మహర్షి మరిమరి చెప్పియున్నారు.

వీరి యీ అపలాపాలను పెడచెవిని బెట్టవచ్చును. కాని వారి పై మేలిమి బోధలవిని సుజునులెందరో తప్పుదారి ద్రొక్కుదురన్న శంక అందుకెడమీయలేదు. తన శిష్యులైనా ఆ దారిని బోరాదని మహర్షి ఆ సిద్ధులు అజ్ఞానభూములగుటచే మిధ్యలని చెప్పియున్నారు. ''సిద్ధమైయుండు వస్తువు నెఱిగి యుండుటయే సిద్ధి. ఇతరసిద్ధులన్నియు స్యప్నసిద్ధసిద్ధులే. నిద్రపోయి మేలుకొనిన వెనుక అవి సత్యమగునా? సత్యవస్తు నిష్ఠులై మాయవీడిన వారు వానియందు భ్రమ నొందగలరా? తెలియుము''27 సిద్ధులు అహంకారంనుండి పుట్టిన వగుట అని కల్లలనుట స్పష్టమే. సిద్ధుల నార్జించిన వాడు అజ్ఞాన దాస్యంలో మరింతా క్రుంగిపోతాడు. యదార్థంగా ఆత్మసాధన చేస్తున్నతనికి అహంతానాశానికి మునుపే, ఒక్కొకపుడయత్నంగా కొన్నిసిద్ధులు కలుగవచ్చు : అవి గతించిన వెనుక ఆత్మసాధన మళ్ళీ మొదలెత్తు కోవలసి వస్తుంది. ఆత్మసిద్ధికి పిదప అవి ప్రాప్తిస్తే, ఆ విషయం అతడెఱుగడు, వానివలన బాధితుడూ కాడు.

ఇటు మనం ముఖ్యంగా లక్ష్యముంచుకోవలసింది ఆత్మ అగుట. ఆత్మను సాధించుటలు అర్థహీనాలు అసంబద్ధాలు. మనం నిత్య సిద్ధులము; వేరుగా ఎన్నడూ లేము. ఆత్మక్రొత్తగా సాధింపవలసినదైతే, అది పోనూపోయేదే. స్వయంసిద్ధుడు నష్టుడయ్యేదేమి! సిద్ధులట్లుగావు: అవి మను సహజాలు కావు. అందువల్ల సర్వదా ఉండక క్రమంగా వినష్టమౌతాయి.

సహజసిద్ధికి యీ సిద్ధులకూ మరొక అంతరముంది. సత్‌

_________________

27. చూ, అనుబంధం, 'క', శ్లో. 40 : ఉ. న. 35

ఏకము; సిద్ధులు బహుళములు, నానాత్వము మిధ్యాచిహ్నం. ఏకత సద్వస్తు లక్షణం.

ఇదంతా, ప్రాచీన అర్వాచీన వైదిక దర్శనముల ప్రధాన బోధల కనురూపమే. ఆత్మ ఏకైక సత్యము. అది దిక్కాలముల కవ్వలిది. ఇతరములన్నీ కల్లలు. కావున సహజస్థితి కాలానికి కట్టువడదు. అందుచేత దాని కాదిలేదు, అంతమూలేదు. ఆద్యంతములు కాలభావనలు గనుక నిజములు కావు. సద్వస్తువు ఏకతగూడ అనాదియే. బహుళత ఎప్పుడూ అసత్యమని గుర్తించేఉన్నాము. ఆ కారణంగానే మహర్షికి తాను ముక్తుడను కాగంటి నను తలపేలేదు. వారుముక్తులైన డెప్పుడన్న ప్రశ్నకు వారు యిట్లు బదులిచ్చారు:

''నా కేమీ కాలేదు. నేను సదా యెట్లో యిపుడునూ అట్లే ఉన్నాను.'' ఇట్లు బంధము విమోచనము రెండూ పరస్పరాపేక్షములు. కావున రెండూ మిధ్యలే. '' 'బద్ధుడునేను' అనువరకే బంధముక్తి చింతులుండును. బద్ధుడెవడని తన్ను దాజూడగ, సిద్ధమై నిత్యముక్తుడైన తానుండి బంధచింతయంత మొందు ననిన ముక్తిచింత ముందుకు నిలువ గలదా?28

కాలం వలెనే దేశం గూడ సహజస్థితి కవధిగాదు. నిత్య ముక్తికై, సంతతానందానికై, ఎటకో ఏదూరాలకో సోనక్కఱతలేదు. అహంతపోతే ముక్తి యిపుడే యిక్కడే ఉంది. అజ్ఞానమూ, బంధమూ, బంధసంగతులూ, నానాత్వమూ, విభేదములూ ఇవేవీ ఇప్పుడు లేవు. మనకు నిజములే అనిపించే యీ వేని నీ అహము నశించిన ఋషి కనబోడు. సినిమాదృశ్యమగు ప్రపంచం ద్రష్టయగు అహం కారం ఋషికి లేనివే. అతని దృష్టికి మిగిలేది తెరయే, చిత్‌ ప్రకాశశ##మే; కదలాడు చిత్రాలన్నీ అదృశ్యములే. ఆతెరశుద్ధాహంస్ఫురణ,

_____________

28. చూ, అనుబంధం, ''క'', శ్లో 44 : ఉ, న. 39

'నేనున్నాను.' ఈ మిధ్యాదృశ్యాలన్నీ అజ్ఞానం దాని కారోపించినవి. అందుకే మహర్షి యన్నారు : ''మనము లోకమున్నట్టు గనుటవలన బహువిధశక్తులుగల యొక కారణకర్తగలడని యొప్పుకొనుట యందరంగీకరింపదగినది. నామరూప చిత్రములు, చూచువారు, ఆధార వస్త్రము, వెలిగించు వెలుగు, ఇవి యన్నియు దానే యగువాడు.''29 అగపడుచున్న యీ వైవిధ్యాని కంతకూ సత్యాత్మ స్వయంగాతానే కారణం కాదని యిచట సునిశ్చయముగ చెప్పినారు. అది అగుట పరిణమించుట - లేదు. ప్రపంచంగా అగునది మాయ, యీ జగద్దృశ్యనిమిత్తంగా ఆత్మయందనుమానింప (ఊహింప) వలసిన నిగూఢ శక్తి. అహమిక యన్నా, మనసన్నా మాయయే. ఈ మాయనుండి జనించేవే పై నాల్గువిషయములునూ. జీవాత్మ అందొక్కటి. అందు వల్లనే అదికల్ల. ఈ మిధ్యాదృశ్యం అహమున్నంతవరకే మన కగుపిస్తుంది : ఆపిదప కాదు. మహర్షి ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఒరుల కగుపించినా, ప్రపంచాన్ని తాను చూచుటలేదని ఆయన ఎపుడూ చెప్పకున్నా, మహర్షి యీ ప్రపంచాన్ని నిజంగానే చూడరు.

ఈ సహజస్థితిని గూర్చి తెలియదగిన అంవాలింకెన్నో, మహర్షిని వారి సహజస్థితినీ సూచించేవానిని, మరొక ప్రకరణంలో పరికిస్తాము.

సర్పభావనచేత రజ్జువువలె, అహమికా అదికల్పించిన మనోదేహ జగత్తులచేత ఆత్మ అంతరితమై యుంటుంది. వాని నందుచేత మిధ్యలన్నారు. వానిలోని కాస్తసత్యాంశా, ఆత్మ ప్రసరింపజేసినదే. స్వస్వరూపసత్యాన్ని స్వానుభూతిగా గోరేవారు, జగత్తు కల్లయని దాని యెడల విముఖులై, అరుణాచలర్షి నిర్దేశించిన మార్గాన హృదయంలో సద్వస్తువు నన్వేషింపవలె.

_____________

29. చూ. అనుబంధం. 'క', శ్లో 5 : ఉ. న. 1

Mahayogama    Chapters