Mahayogama    Chapters   

ఓమ్‌

మహా యోగము

4. ప్రామాణ్యము

- * -

వాంఛాభయాల బారి నుండి విదుమర నిచ్చేది ఆత్మవిచారం, దానికి పూనుకోకపూర్వం కొంత సన్నాహమవసరం. ఇంతవరకు మనకున్న అభిప్రాయాలను సవిమర్శంగా పునరాలోచించవలె. వానిలో ఆత్మాన్వేషణకు ఆతంకాలు కాగలవానిని త్రోసిపుచ్చవలె. మన భావనల పునర్విమర్శనను తత్త్వ దర్శనమన్నారు. తత్త్వం సాధనే, గమ్యంకాదు.

కాని తత్త్వ శాస్త్రాలు వివిధాలు. సరియైన దానిని ఎన్నుకోటం ముఖ్యం. అందు లోపముంటే ఆత్మవిచారం దారి తప్పుతుంది; మన బాధలన్నింటికీ కారణమైన అజ్ఞానం గాఢతరమవుతుంది. సరియైన తత్త్వ దర్శనమంటే జగజ్జీవేశ్వరుల గూర్చి మన సర్వ భావనల నిష్పాక్షిక విమర్శ. మనం పెంచిన భావనలను బలపరచటమే గురిగా గల తత్త్వాలోకం ఆత్మవిచార సాఫల్యానికి శత్రువు. అట్టి దర్శనాలను చేరదీయరాదు.

ఏ దర్శనమైనా ఉపకారకం కావలెనంటే మూలజ్ఞానాన్ని గుర్తించుటతో మొదలుపెట్టవలె. అంటే మహర్షి వివరించినట్లు ఇప్పటి మన భావనలన్నీ శంకింపతగినవే. వానిని నిశితంగా పరీక్షించి కాదనరాని వానితో పూరిస్తే ఆత్మవిచారాని కనువౌతుంది. మన భావాలనంగీకరింప. నిర్ణయించే ముందు వానికి అనుకూల ప్రతికూల ఆధారాల రెంటినీ పరిశీలించుటవసరం. ఆ ఆధారాలు గూడ ఋజువైనవిగా ఉండవలె.

ఋజు సాక్ష్యమెలాటిది ? అది ప్రజానీకం యొక్క తరతరాల యనుభవమా ? ఆ అనుభవం మూలజ్ఞానం నుంచి పుట్టింది. దానిని గ్రహించటం మనం విమర్శించే భావాలకు తాత్త్విక ముద్రవేయటమే. కాబట్టి మన మెన్నుకోవలసిన సాక్ష్యం తీరు వేరు.

తాత్త్విక చర్చ వృధాయాసమన్న పేరెలా వచ్చిందో ఇప్పటి కర్థమై యుంటుంది. జీవితం ఒక క్లిష్టసమస్య. దీన్ని పూరించటంలో తత్త్వదర్శనాలు విధిగా విఫలమైనవి. ఈ వైఫల్యం పాశ్చాత్య దేశాల్లో మరీ హెచ్చు కారణం వారు మెచ్చిన సాక్ష్యంలోని దోషం. దుష్టసాక్ష్యాన్ని ఎన్నుకోవటం, మూలజ్ఞానాన్ని విస్మరించి ప్రజల అనుభవం మీద ఆధారపడినందువల్ల ఆ అనుభవం అజ్ఞాన జనితమనీ, లోపభూయిష్టమనీ ముందే చెప్పియున్నాం. దానిని గుర్తించని నిర్ణయాలు అజ్ఞానాన్ని ధృవపఱిచి, మోక్షానికి ఆటంకాలౌతాయి.

దేహమే ఆత్మయని కొందఱు; మనస్సేయని మరికొందఱు. ఇర్వురూ జగం సత్యమంటారు: ఆత్మలనేకాలు, వానిలో వ్యక్తి ఆత్మయొకటి అంటారు. ఇంక కొందఱు ఆత్మ మనమెఱిగిన మనశ్శరీరాలు కావంటూనే అదియొక శ్రేష్ఠతర మానసమని ఊహిస్తారు. వీరందరి మతంలో ఆత్మకొక అవధి ఉంటుంది. పరిధిదాస్య కారణం. ఆత్మకవధి నైజమైతే, ముక్తివాంఛకు తిలోదకాలిచ్చినట్లే, మూలదృష్టిలో వీరికి భేదంలేదు. మూలజ్ఞాన నిర్మూలనలో వీరి తత్త్వవాదాలు మనకే విధంగానూ సాయపడవు.

తత్త్వదర్శనం ఋజువుకు పై వారి దోషాలన్నిటినీ పరిహరించి సరియైన సాక్ష్యాన్ని సంతరించవలె. సాక్ష్యానికై మనం వెదకే అనుభవం అజ్ఞానజం కాకూడదు.

విశ్వసింపతగ్గ సాక్ష్యం అజ్ఞుల అనుభవంగాదు, ఋషుల అనుభవ అనుభావములు. వారు అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించుకొన్నవారు అట్టివారి అనుభవం ఆధారంగా మనం తత్త్వబోధను పెంచుకోవలె. అప్పుడే మనపై అజ్ఞానపు పట్టు సడలుతుంది. అప్పుడారంభించిన ఆత్మ విచారం చివరిదాకా సాగిస్తే, ఋషుల అనుభూతివంటిదే మనకూ సిద్ధిస్తుంది.

మానవ సామాన్యమైన అనుభవ ప్రయాణం లేకుండా సత్యాన్ని అందుకోలేమని అమెరికన్‌ ప్రొఫెసర్‌ జేమ్స్‌ అభిప్రాయం. ''ధర్మానుభూతిలోని వివిధరీతు''లన్న తమ గ్రంథం (Varieties of Religious Experience) లో ఆ అవసరాన్ని సమకూర్చ చేతనైనంత యత్నించాడు; డాక్టరు బక్‌ (Dr. Bucke) వ్రాసిన ''సమష్టి చైతన్యం'' (cosmi Consciousness) లోని భాగాలను విశేషంగా ఉపయోగించుకున్నాడు. ఈ గ్రంథాలలో సంకలించింది క్రొద్ది యసాధారణ వ్యక్తుల అనుభవం. గ్రంథకర్తలకు మూలజ్ఞాన విషయంగా సరియైన గ్రహింపులేక తమ కందిన ఆధారాలను వారు సవిమర్శంగా చర్చింపలేకపోయారు. ఈ అసాధారణులు మూడు తెగలవారు- వేర్వేరు అంతరంవారు అరుదైన యనుభూతి పొందినవారు ముత్తెఱుగులు- యోగులూ, సిద్ధపురుషులూ (Saints), ఋషులూ, వారిలో తారతమ్యం గుర్తించి అందెవరి సాక్ష్యం ప్రామాణికమో నిర్ణయించుటవసరం.

ఇందు యోగులక్కఱకు రారు. వారు అజ్ఞాన భూమికలను దాటినవారు కారు. అట్లని వారిలో వారికున్న భావభేదాలే తెలుపుతున్నవి. సిద్ధపురుషులూ ఆతరంవారే. ఋషులు అజ్ఞానాని కవ్వలివారు గనుక వారిలో భావభేదాలుండవు.

ఏ ఋషీ మరో ఋషిని తప్పుపట్టడు, ఋషులందరూ ఏకవాక్కులని శ్రుతి (Revelation). దీని యాధార్థ్యం తరువాతి ప్రకరణాల్లో బోధపడుతుంది.

యోగులకన్న సిద్ధపురుషులనే ఎక్కువగా అనుసరించవచ్చు. కాని వాళ్ళలోనూ తరతమ్యాలు చూడవలసి ఉంది. వారివారి పరిణతిని బట్టి వారి యభిప్రాయాల్లో భేదం కనుపిస్తుంది. ఋషిత్వాన్ని సమీపించే కొద్దీ వారి వాక్కుల్లో వివేచన హెచ్చుతుంది. కొందఱు సిద్ధపురుషుల భాషణల్లో, వక్రం ఎక్కువ.అదీగాక వారు స్ధిరబుద్ధులుగారు. ఆ అస్థిరత వారినుండి బుద్ధికి సంక్రమించిందో, బుద్ధిలోనిదే వారి నావహించిందో చెప్పలేము. ఋషుల రీతి అట్లుగాదు.

యోగుల అనుభూతులు వివిధంగా జటిలంగా ఉంటవి. అందుచేతనే వారి వర్ణనలంటే మనకు ఆగరాని వ్యామోహం. తమ్మెంతగ మూలాజ్ఞానం శాసిస్తున్నదో అన్న స్పృహయే వారికుండదు.వారిలక్ష్యం అజ్ఞాన నిర్మూలనంగాదు; ఆ అజ్ఞాన పరిధుల్లోనే తమ కోరతగ్గంత ఔన్నత్యాన్ని శాయశక్తులా సాధించటమే వారి ఆశయం. మనస్సే ఆత్మయని వారి నమ్మకం. అట్లు కాదని వారు వాదించినా స్థితియదే. వారు నమ్మే ఆనంద స్థితిలోనూ అనంత కీర్తీ, అద్భుత శక్తులూ కలిగి మనస్సు మిగిలే యుండవలె. వారి యూహలో పొందతగ్గ పరమలాభమదే. దీనికినీ పై తరం ఆశలవారు కొందరు; ఆ శక్తులన్నీ సిద్ధించిన పిదప (అదే మోక్షమని వారి భ్రమ) జగత్తునంతా స్వాధీనంజేసుకొని దాన్ని గుర్తింపరానంతగా మార్చి భూతల స్వర్గం నిర్మించవలెనని వారి యుబలాటం. సిద్ధ పురుషులా పొంతలకు పోరు.

యోగులకూ సిద్ధులకూ గూడ బ్రహ్మతత్త్వం అవగాహన కాదని శంకరులు.''ఋషులు కానివారి బ్రహ్మతత్త్వ దర్శనము మన శ్చాంచల్యము వలన యితర ప్రత్యయములతో గలిసి, వ్యత్యస్తమగు చున్నది.'' ఇది వారి నిర్ణయం.1

యోగులు చెప్పే అతిశాయి మనస్సు నిజంగా ఒక సూక్ష్మదేహం. దీన్నే ఆత్మయనుకుంటే మూలాజ్ఞానం మరింత చెరుపుచేస్తుంది. యోగికన్న పామరుడు ఎంతో భద్రస్థితిలో నున్నాడు. మూలాజ్ఞానంలో లోతుగా కూరుకుపోయిన యోగికి ముక్తి లాభం మరింత దూరమవుతుంది.

యోగుల సాక్ష్యాన్ని సవినయంగా నిరాకరించనే వలె. సిద్ధసమాజం సన్మానార్హమేగాని ప్రస్తుతానికి వారి యూహలను సైతం అటుంచి ఋషివచనాలే ప్రమాణంగా మన తత్త్వదర్శనం సమీకరించవలసియుంది. అటు పిదప ఋషుల బోధనలను సిద్ధుల యుపదేశాలను సరిజూచుకోందాం. ఈ అభ్వాసానికి గల విలువ యెంతో తర్వాత తెలియగలం.

యుగయుగాలుగా నేటివరకూ ఋషులుంటూనే వచ్చారు. వారి బోధలను వేదశీర్షాలైన ఉపనిషత్తులలో నిబంధించారు. వాటిలో ఎన్నో భాగాలు సూటిగా హృదయంలో హత్తుకొనేవి ఉన్నవి. వానిలో జీవత్‌ హృదయం పలుకుతుంది. అదే ఆత్మ శిష్యుని మనస్సులో రెండే తలపులు ఒకే పరి మొదలుతాయి. బోధ ఋతమనీ, గురువు ఋషియనీ.

అది అంతే. కాని జీవద్గురువు లభిస్తే శిష్యుడు వాచా వారి బోధనలనే, ఉపనిషద్వాక్యాలకన్న మిన్నగామన్నించడం నిస్సంశయం.

_______________

1. నిర్వికల్ప సమాధినాస్ఫుటం బ్రహ్మతత్త్వ మవగమ్యతే ధృవమ్‌

నాన్యధా చ లతయా మనోగతేః ప్రత్యయాంతర విమిశ్రితం భ##వేత్‌ ||

- వివేకచూడామణి, శ్లో 365.

శ్రుతి వాక్యాలను గూడ శంకింపవచ్చునేమోగాని జీవద్గురు వాక్యములనట్లుగాదు. వానిని వారే సంగ్రధించి యుంటే అవి మరీ ఆదరణీయాలు. అది మరొక విధంగా కూడా అనుకూలం. అందు ఏ భాగమైనా మనకర్థంగాకపోతే ఋషినే వివరింప గోరవచ్చు. బోధకుని సాటి వ్యాఖ్యాత వేరొకరుందురా?

మన ప్రాచీన గ్రంథాలపై, వానిని వల్లించిన పండితులపై ఆధారపడేవారికన్న అరుణాచలర్షి శిష్యులు మేలుస్థితిలో నున్నారు. మహర్షి తమ బోధలకు తామే గ్రంథ రూపమిచ్చారు. వానిలో కొన్నిటికి అర్థ వివరణమూ చేసియుంచారు. ఏండ్లుగా ఎందరో భక్తుల ప్రశ్నలకు ముఖతః వారిచ్చిన సమాధానాలలో పెక్కింటిని యధాతథంగా వారి శిష్యులు వ్రాసి భద్రపఱచి యున్నారు; వానిలో కొన్ని పుస్తక రూపంలో వెలువడ్డాయి.2 వీనిని మించినది ప్రాచీన గ్రంథాలు ఎంత గనో వర్ణించిన మహర్షి సన్నిధి సేవ. ఆ అవకాశాన్ని జారవిడుచు కొన్న నష్టమింతంతగాదు. శ్రుతిసారం సద్గురువే తెలియగలడుగాని కేవల పండితుని కది సాధ్యమా? తనలో నిగూఢ గుప్తంగా ఉన్న ఆధ్యాత్మశక్తిని ఉజ్జీవింపజేయలేని గురువు శిష్యుణ్ణి ఏ విధంగానూ అట్టి సమర్థునిజేయలేడు జ్ఞానోపదేశానికై మనం దరిసే గురువు, మూర్తి గొన్న జ్ఞానంగా తానుండవలె.

మనకు మహర్షి బోధయే సద్దర్శనం: అదే అత్యంత ప్రామాణికం. అది ముఖ్యాధారంగా తీసుకొని దాన్ని వివరించటానికి, పూరించడానికి శ్రుతుల నుపయోగిస్తూ మన ఆధ్యాత్మ దర్శనం సంధానించుకోవలె.

పండిత సంప్రదాయం దీనికి విరుద్ధం, వారికి వేదశాస్త్రాలు ముఖ్యప్రమాణం. వాని ననువదించిని వరకే జీవద్గురు భాషణలకు

_______________

2. Maharshi"s Gospel; Talks with Maharshi, etc.

(శ్రీ రమణ భాషణములు)

ప్రామాణికత అలవడుతుంది. ఈ వాదాన్ని తరువాత చర్చిస్తాం. ఇప్పటికి మాత్రం అసలు ప్రమాణభావన యెట్టితో స్పష్టంగా, సహేతుకంగా పరిశీలిద్దాం.

అజ్ఞానాని కవ్వలిది మహర్షుల స్వాత్మానుభూతి. వారి ప్రవచనం దాన్ని సూచిస్తుంది. అందుచేత అది ప్రమాణం. మనం మూలజ్ఞానానికి వశులం. ముక్తస్థితియేమో స్వస్వరూపమేమో మనకు తెలియదు. వానిని నమ్మకంగా మనకు తెలిపే ఏకైక సాక్ష్యం మహర్షి ప్రవచనం. అందుకని అది ప్రమాణం.

వివేచనా మార్గానికీ ప్రమాణవాదానకీ ఏదో వైరుధ్యం కనుపిస్తుంది. ఒక ఐరోపీయుడు, తత్త్వశాస్త్రం చదివినవాడు, కొన్ని వత్సరాలుగ మహర్షి పదసన్నిధినున్నవాడు, వారితో అన్నాడు : - ''చరిత్ర యీ కాలాన్ని 'వివేచనాయుగ' మన్నది. అందుచేత మేము విని ఆదరించే బోధన వివేచన కాగవలె. '' దానికి మహర్షి బదులిచ్చారు : ''ఎవరి వివేచన? అని అడిగితే 'నాది' అంటావు ఆ విధంగా వివేకము నీకు ఉపకరణం. వైవిధ్యం వాసిగట్టడానికై దాన్ని వినియోగిస్తావు. అది నీవు కావు; నీకు వేరుగా దానికి నిలుకడాలేదు. నిత్యవస్తువు నీవు; వివేకము విషయము మాత్రమే. నిన్ను నీవు వెదకి చేజిక్కించుకో, నీ వివేకము కలలెఱుగని గాఢసూప్తిలో లేదు : శిశువులోనూ లేదు. వయస్సుతో వివేకం పెరుగుతుంది. కాని నిద్ర లోనూ నిసుగులోనూ బీజప్రాయంగానైన లేకుంటే వివేకానికి పరిణామంగాని, వ్యక్తంకావటంగాని ఎట్లు సాధ్యం? ఇంత ముఖ్యాంశాన్ని కనుగొనడానికి చరిత్రను తఱచుటెందుకు? చరిత్రలోనూ చారిత్రకుని లోనూ నిజం సమపాళ్ళే.

మరొక విధంగా చెప్పితే మూలాజ్ఞానంలో అది పుట్టినందున దాని చుట్టూ పరిధులు నెలకొన్నాయి. తమ అజ్ఞానాధీనత తెలియని వారికీ, తెలసీ అందులోనే తృప్తిగాంచే వారికీ, వారి యవసరాలన్నిటికీ వివేకంసరిపడే సాధనమే. అంటే మూలాజ్ఞాన ప్రయోజనాలకు దానంతటి ఉపకరణం మరిలేదు. అంటే ఆ అజ్ఞానాన్ని అధిగమించవలెనంటే మాత్రం వివేకం అక్కఱకురాదు : తన పరిధుల నెఱిగి మన సత్యాన్వేషణ కడ్డురాకుంటే అదే పదివేలు. తన జన్మ కాలుష్యాన్నీ, అన్వేషణకు ఋషివచన ప్రమాణావశ్యకతనూ గుర్తించిన క్షణం నుంచి వివేకం మన కాపాటి ఉపకారం చేయగలదు. అప్పుడు ప్రామాణికమైన ఆత్మదర్శనం సాధ్యమవుతుంది. ఇట్లు చూస్తే హేతువాదానికీ ప్రామాణ్యవాదానకీ విరోధం అగపడదు.

ఋషి వచన ప్రమాణ్యం అహేతుకంగాదు. ఇంతకూ దాన్ని ఆధారంగా గ్రహించటం తత్కాలానికే. ఆత్మయంటే ఏమి? దాన్ని సాక్షాత్కరించుకొనేదెలాగ - ఇవేగదా ఋషులు తెలుపుతున్నవి? వారు తాము చెప్పినది గ్రుడ్డిగా నమ్మమనరు. ఆత్మానుభూతిని మనమై సాధించి వారు చెప్పింది సరియో కాదో సరిజూచుకొమ్మంటారు. వారి బోధలో ముఖ్యాంశం ఆత్మస్వరూప వర్ణనంగాదు; మోక్ష స్థితి, దానిని పొందగల్గే విధానం. అందుకే ఆరంభంలోనే ఋషి శిష్యునితో తాము జూపిన మార్గాన్నే బోయి ఆత్మను కనుగొమ్మంటారు, వేరేమీ జెప్పినా అది విచార విధానానికి అనుబంధమే. కనుక వారి బోధను పూర్ణంగా తత్కాలానికైనా గ్రహించవలె. అటుగాకుంటే మనం విచార మార్గం మెట్టి సాఫల్యం సాధించలేము.

వివేచనకూ గురు ప్రమాణ్యానకీ విరోధం శంకిస్తారే. అది గురు బోధనభ్యసిస్తే అదృశ్యమౌతుంది. ఋషులందరి వలెనే అరుణాచల మహర్షి గూడ లౌకికుల అనుభవాన్ని ఉదాహరిస్తూ తమ బోధనారంభిస్తారు. మూలాజ్ఞాన జనితమైన ఆ అనుభవం నమ్మరానిదని ముందే సూచించాము. కాని దానిలో నుంచి గూడ కొన్ని యంశాలను ఏరి, అవి ప్రాతిపదికలుగా అడుగడుగునా విప్లవాత్పకమైన తమ బోధను మనకు తెలియ జెప్పుతారు. వారి దృష్టి ప్రసారంవల్ల ప్రాత అను భవాలే క్రొత్తలుగా కనుపిస్తాయి. విశ్వాసం వివేచనకు విరోధికాదని స్పష్టమౌతుంది.

ప్రామాణికతా స్వభావం యిది. చివరిదాకా సాగిస్తే ఎవరికి వారు స్వతః ప్రమాణంగా స్థిరపడుతారు. ప్రమాణ బుద్ధితో ఋషి బోధల నంగీకరించే మునుపు మనం నిశ్చయించుకోవలసినవి కొన్ని ఉన్నవి: వారు ఋషియేనా? స్వానుభూతి కలిగి, అది మొదలు స్వస్వరూపం దెలిసి, అందు స్థిరపడ్డముక్తులా? మనకు ప్రాప్యం మోక్షం గనుకనే యిదంతాను సుఖశత్రువులైన భయకామనల పోద్రోలి, అవిరళమూ అప్రత్యయమూనైన సౌఖ్యానందంలో రమించేవారే తన గురువన్న నిశ్చయానికి రావలె. గణింపరాని లాభాన్ని ఎదురుసూచి, సర్వమూ అర్పింపదగ్గ వ్యక్తి తటస్థపడిందాకా శిష్యుడు తన వివేచనను మాననక్కఱలేదు. వాని శరణాగతి ఏ ఋషికో, ఆయనే వాని గురువు, ప్రభువునూ.

ఋషిని నిర్వర్ణించటానికి చాలా నైపుణ్యం కావలె. అందుకై ఏ నియమ నిబంధనలూ చెప్పిలేవు. నియమాలనవసరం ఋషి గురువుగా తాను శిష్యుడుగా విధి వ్రాసియుంటే, తాను తారసిల్లిన వారలో అట్టివారుంటే గుర్తించటం పెద్ద శ్రమయేమీ కాదు. విధివేరైతే, వాని కన్ని నియమాలూ వృధలే. గురుపరిగణనం, పరిగ్రహం - యీ పరిష్క్రియలో దైవానుగ్రహమే నిశ్చాయకం. గురుని ఎన్నుకొన్న పిదప తను విన్న ఋషి లక్షణాలు వారిలో కలవేమో తీరికగా నిరూపించి తన ఎన్నిక సరియో కాదో ధృవపఱచుకోవచ్చు. కలతజెందని ప్రసన్నత, నిశ్చల సౌఖ్యం ఇవి ముఖ్య లక్షణాలు. వానినే పూర్ణశాంతి యంటారు. నిరహంకారం మరియొక లక్షణం దానిని నిందాస్తుతుల యెడల ఔదాసీన్య మనవచ్చును. ఇతర లక్షణాలూ ఉన్నవి: వాని నింకొకచోట పేర్కొంటాను.

ప్రమాణ భావన యెట్టిది? మహర్షి పదసన్నిధి నెఱుగని సంప్రదాయజ్ఞ పండితుల దృష్టిలో వేదశాస్త్రాలే ప్రమాణం. వాని పుట్టువు దివ్యము. కాబట్టి ఆ వాఙ్మయం సర్మమూ ప్రమాణమే. అది నిస్సందేహం. అవి పదపదమూ, ప్రతి వాక్యమూ దివ్యమే, వాని ప్రామాణ్యం శంకించడం సహింపరాదు. అవి స్వతః ప్రమాణాలు ఆ యర్థంలో ప్రామాణ్యాన్ని విధించేది మనకు వెలిగానున్న ఏదోశక్తి. ఇది తాత్త్విక నియంతృత్వం. సత్యాన్వేషి దానికి ఊడిగం చేయడంతో సరిపోదు. ఆ వైదిక వాఙ్మయంలో వివాదాస్పదాలైన భాగాలకు ఆ పండితులందించే వివరణలకూ వ్యాఖ్యలకూ గూడ ముందే దాసోహమనవలె.

అధికారిక పరంపర యా నెలకొన్న మఠాలూ, క్రైస్తవచర్చి లాంటి మతసంస్థలూ తెచ్చిన చెడు ఫలితాలలో పై భావన ఒకటి. పుట్టినది మొదలు గిట్టేదాకా అజ్ఞానంలో మునిగి తృప్తి జెంది యున్న వారు దానిని ఆదరిస్తారు. కాని దాని పరిధిని దాటిపోనెంచే వారికి మరో తరం ప్రమాణం కావలె.

వైదిక వాఙ్మయం కూడా సాపేక్షమే.3 దాన్ని వెలకట్టడానికి వేరు సాక్ష్యమవసరం, తన్ను తాను ధృవపరచుకోనేది ఆత్మ యొక్కటే.

సంప్రదాయవాదులు ఋషి వచనాన్ని స్వతః ప్రమాణంగా మన్నించరు. సనాతన శాస్త్ర వాఙ్మయానకి ఒక ప్రత్యేక పావిత్య్ర మున్నది. దానికెట్టి తుడుపూ పెంపూ అసాధ్యమని వారి నమ్మకం.

కాని నిజం దానికి పూర్తిగా విరుద్ధం. ఆ వాఙ్మయం సాధికారికం కావటానికి కారణం లేకపోలేదు. వానిలో కొన్ని ప్రాచీన ఋషుల వాక్సంకలనాలు. అన్ని యుగాలలోనూ ఋషుల రీతి సమమే.

_______________

3. చూ. అనుబంధం 'ఛ', శ్లో 32.

ఆ వాఙ్మయమే చెప్పేట్లు వారు కాలానికి కట్టువడరు. వారు దాని కవ్వలివారు. సమకాలపు ఋషుల యొద్ద ఉపదేశం పొందవలెనని సంప్రదాయమే విధించింది. నిజానికి ఋషి వ్యక్తి మాత్రుడే కాడు; రూపుదాల్చిన దైవం. ''జ్ఞానీత్మాత్మైవ'' అని గీత. ఆత్మయే ఋషి. సనాతన వాఙ్మయంలోని ప్రధాన బోధనల్లో అది యొకటి. దానిని పండితులు పూర్తిగా అర్థంచేసుకున్నట్లు కనిపించదు.

దేన్ని గాని సమకాలపు ఋషి ఉపదేశంతో ఆరంభించడం సనాతనాచారం. గురువు ఋషియో, కాదో నిశ్చయించేది మన అంతః స్ఫురణయే. (Intution). ఋషులు ప్రాచీనులయినప్పుడు అది సాధ్యం కాదుగదా?

అదీగాక మన ప్రాచీన శాస్త్రగ్రంథాలు నాడు ఋషులు చెప్పినట్లు యధాతథంగా మనకు లభిస్తున్నవనలేము. వానిలో ఋషులు కాని వారి వాక్కులూ ప్రక్షిప్తాలుగ ఉండవచ్చును. వారి అభిభాషణలు పుస్తకరూపం దాల్చడానికి ఎన్ని దశాబ్దాలు గడిచాయో! ఆ మధ్య కాలంలో మూలం మౌఖికంగా తరతరాలు అనుస్స్యూతంగా వస్తున్నది; బహుశః అందువల్లనే అవే అంశాలు భిన్న గ్రంథాలలో భిన్న రూపాలలో కానవస్తున్నవి.

సనాతన వాఙ్మయపు ప్రామాణికత కొంతవరకు దాని ప్రాచీనతే కావచ్చు. అసలు కాభావనే వాస్తవమా కాదా యన్న విచికిత్సలో పౌర్వాపర చర్చ కవకాశ##మే లేదు.

మనకు ప్రధాన ప్రమాణం అరుణాచల మహర్షి ప్రవచనం' ప్రాచీన శాస్త్రాలు దానికి వ్యాఖ్యగనో, విపులీకరణాలుగనో గ్రహింప తగును.

-*-

Mahayogama    Chapters