Mahayogama    Chapters   

ఓమ్‌

మహా యోగము

1. అరుణాచల మహర్షి

-*-

గాఢసత్య మొకటి మనలో అంతర్లీనంగా దాగిఉంది. అది మన నిజస్థితి. ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే మనం ముక్తుల మౌతాము. కాని ముక్తిని కోరేవారు దానిని స్వయం ముక్తులైన వారిని శ్రద్ధగా శుశ్రూషించి అడిగి తెలుసుకోవలె. మన సంప్రదాయమది. 1 మనకట్టి గురువుదొరకవలెనేగాని, సత్స్వరూపజ్ఞానం లభించటానికి వారే శరణ్యమనడం నిశ్చయమే. వైదిక వాఙ్మయం ఇచ్చే జ్ఞానపు వెల కొంచమే. జీవితమంతా ఆ చదువులోనే వెచ్చించి పొందే జ్ఞానంకన్న ఎన్నోరెట్లు ఎంతో త్వరలో ప్రసాదించగలది అట్టి జీవద్గురువుల మౌన మొక్కటే.

శ్రీరామకృష్ణులు, యోగులు ఇరుతెగలన్నారు. ఒకరి పుట్టుకేపరులకు బోధించి తరింపజేయటానికి. రెండవవారికి ఏ ప్రయోజనమూ నిర్దిష్టంగా లేదు. ఆ మొదటివారిని పుట్టు వాదిగా విషయేచ్ఛలేవీ

________________

1. తద్విద్ధిప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా

ఉపదేక్ష్యన్తి తేజ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః || గీత, IV, 34.

అంటవు. బాల్యంగడవకముందే వారు ముక్తస్థితి నందు కొంటారు. అయత్నంగానే వారికది సిద్థిస్తుంది. రెండవవారు పుట్టింది మొదలు విషయవాంఛలకు దౌర్బల్యాలకులోనై అదిపనిగా శ్రమించి చివరకాగమ్యాన్నే చేరుతారు. ఆ మొదటితరం యోగులు అరుదు. అట్టివారు పొడసూపగానే లెక్కకు మిక్కిలిగా శిష్యులూ భక్తులూ చుట్టుకొని వారి సన్నిథిసేవ ననుభవిస్తారు. భగవాన్‌ రమణులట్టి మహాయోగి. చిరకాలంగా వస్తూన్న ఋషి పరంపరలో ఇప్పటికి చివరివారు; సనాతన శ్రుతిబోధకు మరల జీవంపోసి ప్రతిష్ఠించినవారు.

శ్రీరమణులు పుట్టింది దక్షిణభారతం, మధురకు ముప్పదిమైళ్ళ కవలి తిరుచ్చుళి గ్రామంలో, వారికి పెద్దలిచ్చిన పేరు వేంకటరామన్‌ *బిడ్డనికి పన్నెండేండ్లు నిండలేదు. తండ్రి చనిపోయినారు. ఆ తరువాత పెంపకం తల్లీ, చిన్నాయనా, చదువు మొదట దిండిగల్లులో, ఆపైన పుణ్యక్షేత్రమైన మధురలో. ముందుముందు అతడేమి కానున్నాడో ఆ పోషకుల కేమెఱుక? తమ యూహలకొద్దీ, ఈ ప్రపంచంలో సుఖంగా బ్రదుకడానికి అనువుగా ''పెద్దచదువు''కై వానికన్ని సదుపాయాలూ సరిపెట్టినారు.

పిల్లని తెలివితేటలకేలోటూ లేదు. కాని వానికాచదువు లంటేనే గిట్టదు. పాఠాలు చదివి వల్లించేదే లేదు. ఆచదువు ఏ కాసై#్తనా ఒంటబట్టియుంటే, అది వాని యత్నంవల్ల మాత్రం కాదు. ఒకపాటి తెలివిగల పిల్లలందరూ జీవితంలో పైపైకి పోవలెనని కోరటం సహజం. కాని ఈయన కట్టికోరికా లేదు, అట్టి సంకల్పమూ లేదు. బోలెడంత ఆధ్యాత్మిక సంపత్తి ముందే సంతరించుకొని పుట్టే అరిది జీవుల్లో ఆయన యొకరని మనకిప్పుడు తెలుసు. సద్గురువుగా తన్ను

_____________

* ఈ పేరు బడిలో చేరినప్పుడు. మొదటపేరుపెట్టినది వేంకటేశ్వరశర్మయని. ఉపనయనంలో ప్రవరలో చెప్పుకొన్నది ఆపేరే. అను.

లక్షలాది జనులు పూజింపదగ్గ పూర్ణత అప్పటికే ఆయనలో అవ్యక్తంగా ఉన్నది. విషయలాభవిరాగం ఆధ్యాత్మికతకు సహజలక్షణం. జనసామాన్యానికట్టి తాత్త్విక సంపద కొఱవడియుంటుంది. అందుచేత వారు జీవితంలో పడరానిపాట్లుబడి ఎలాగో తాము కోరినదాన్ని సాధించు కొంటారు. ఈ పొట్టకూటి చదువులంటే శ్రీరామకృష్ణుల కెంత యేవగింపో అందరెరిగిందే.

బడి చదువు వేంకటరామన్‌ కేవిధంగానూ లాభించలేదు. కాని విధివశాత్తు తమిళ గ్రంథమొకటి ఆయన చేజిక్కింది. అది చాల పవిత్రమూ, పురాతనమూ, శైవాగమసారసంపన్నులయిన అరువత్తి మూవర్‌ నాయన్మారులచరిత లందున్నవి. అమిత ఆసక్తితో వాని నీ బాలుడు చదివాడు. తాత్త్విక పరిణతిలో ఆ భక్త శ్రేష్టుల సాటిగా పేరుమోసి వారికినీ మిన్న అయినాడని నమ్మవచ్చు. మహర్షి పదం అంతకూపైది. దాన్ని సాథింపగల శక్తి ఆయనలో స్పందిస్తున్నది. తరువాతి ''భక్తి'' ప్రకరణంలో యోగికీ ఋషికీ గల తారతమ్యం వర్ణించాను. ప్రస్తుతానికి ఆ భేదం ప్రసవానికీ పక్వఫలానికీ ఉండేదిగా అనుకొంటే చాలు. యోగసాధన ఋషిత్వాన్ని సాధించే సామర్ధ్యాన్ని సూచిస్తుంది అంతమాత్రమే. ''పరమపితవలె మీరునూ పూర్ణులుగ నుండు'' డని జీసస్‌ శిష్యులకుపదేశించాడు. అప్పుడాయన ఉద్దేశించింది ఋషినేగాని యోగిని కాదు.

చిన్ననాడే ఆయన అరుణాచలమని పేరు విన్నారు. అదేదో పరమ పవిత్రమనీ మహిమగలదనీ తనకు తఱచు స్ఫురిస్తూఉండేదని ఆయనే తరువాత శిష్యులకై వ్రాసిన పద్యంలో వర్ణించారు. సాధారణంగా మనందైవమనే గుహ్యవస్తువులో పరిపక్వభక్తిఆయన పూర్వజన్మలనుండి జన్మతః తెచ్చుకొన్నదే. నిజానికి ఆవస్తువు మన ఆధ్యాత్మిక జీవితానికి మూలము. అందాయన భక్తికొక నిదర్శనం - ఒక మారాయన్ను పినతండ్రి కఠినంగా మందలించారు. ఊరట ఉపశమాలకై బాలుడు పరువిడింది కన్నతల్లి వద్దకు గాదు; గుడిలోని దేవివద్దకు. ఒక్కొక్కపుడాయన గాఢంగా నిద్రించేవారు, ఆయన్ను మేల్కొల్ప నెవ్వరికీ సాధ్యమయ్యేది కాదు. నిజంగా అదినిద్రకాదు : ఆయన తాత్త్విక జీవితంలో అదియొక ఉత్తమభూమిక. తర్వాత తర్వాత ఆయన సాథించిన పూర్ణతనూ, మెలకువలోనూ నెలకొన్న సహజస్థితినీ చూస్తే ఆ నిద్రవట్టిదిగానే భావించవలె.

ఇట్లు ఆయనజీవితం రెండు పంథాలుగా సాగింది. ఒకటికొకటి అందదు పొందదు. ఒకటి యాంత్రికంగా తనకీ ప్రపంచంలో ఎట్టిఆసక్తీ దానితో ఏ పొత్తూ లేనట్లుగా : రెండవది ఆధ్యాత్మికం : తనకతి సన్నిహితులుగూడ యేకొంచెమూ అనుమానింపరాని విధంగా.

పదహారేండ్లు నిండేదాకా అదేవిధం. అప్పటికాయన ఉన్నది హైస్కూలు చదువులో చివరిమెట్టు. కొద్దిరోజుల్లో మద్రాసు యూనివర్సిటీ వారి మెట్రిక్యులేషన్‌ పరీక్షకు కూర్చోవలె. కాని అదియట్లు జరుగలేదు. అంతలో నేదో ఘటన; అనుకోనివిధంగా ఆ పిల్లని బడి చదువునకు స్వస్తి పల్కుటైనది.

పదహారు - పదిహేడేండ్ల ప్రాయం జీవితంలో ఒకసంధికాలం. సామాన్యుల మనస్సులపుడు కామభావనలతో వాంఛలతో సతమతమౌతుంటవి. ఏక్రొద్దిమందో విశిష్టులుంటారు. వారికపుడునిజమైనజీవితం పొటమరిస్తుంది. దానితోపోలిస్తే, సాధారణంగా మనం జీవితమనుకొనేది నిజంగా మృత్యువే. వారలలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మికత ఈ ప్రాయాస పూర్ణంగా వికసింపనారంభిస్తుంది. ఇది ఋషుల జీవితాల్లో ప్రచురంగా మనకగుపించేదే.

ఋషుల్లో యిట్టి ప్రబోధం బహుళంగా హఠాన్మృత్యుభీతితో అంకురిస్తుంది. మరణభయం అందరికీ ఉన్నదే, పలుమార్లు కలగనూవచ్చు. దానికి ప్రతిస్పందనం మాత్రం వారివారికి వేర్వేరుగాఉంటుంది. దానివల్ల జనుల్లో పెద్దమార్పేమీరాదు. చనిపోయినవాని దేహాన్ని స్మశానానికి చేర్చేటప్పుడు తఱచుగా సాంప్రదాయక వేదాతం వెళ్ళ బెట్టడమూకద్దు. కాని ఆ వైరాగ్యం మరుభోజన వేళవరకే. ఆ తరువాత మామూలే; జీవితం ఎప్పటిలాగే సాగిపోతుంది.

కాని ఋషి జనుల్లో మృత్యుభావన తెచ్చే మార్పు వేరురీతి. నిరాకులంగా నిశితంగా వారు మృతి సమస్యను వివేచిస్తారు. అది మొదలు మృత్యువును జయించటానికై తమశక్తిని కూడగట్టుకుంటారు. గౌతమబుద్ధుని విషయంలో అట్లే. 2 శ్రీరమణుల విషయం లోనూ అట్లే.

శ్రీరమణు లిట్లు విచారించారు :- ''చనిపోయే దెవరు ఏది ? కనబడే ఈ దేహం చనిపోతుంది. బంధువులు దాన్ని తీసుకొని వెళ్ళి కాల్చిబుగ్గి చేస్తారు. కాని యీ దేహం చనిపోయాక, నేనూ చనిపోతానా? అది 'నేను' నిజంగా ఏదోదాన్ని బట్టి ఉంటుంది. 'నేను' దేహమే అయితే దానితోబాటు 'నేనూ' చనిపోవలె: కాని అది దేహమాత్రం కాకుంటే 'నేను' మిగిలే ఉంటుంది.''

ఆ సరికే ఆయనలో ప్రగాఢమైన యిచ్ఛ - ''మృతి తర్వాత యధార్థమైన 'నేను' శేషించునా? అదేమో అప్పటికప్పుడే నిష్కర్షగా తేల్చుకోవలె. దానికొక్కటే మార్గం'' - మరణాను భవనటనం (enact) 3 ఆయన అట్లే తనదేహం మరణించిందని భావించారు.4

__________________

2. బుద్ధ పదాని కర్థం ఋషి యని, బుద్ధుని సుగతుడన్నారు. అంటే మోక్షస్థితి నందినవాడని.

3. ఈ 'నటన' (enact) పదం యిప్పుడు వాదనలకు దారితీసింది. 'మరణానుభవం' అనడం సరి. - అను.

4. ''తాను మరణించానని భావించారు'' అనడంసరి. కాకుంటే అది సిద్ధసాధనం అవుతుంది (Begging the question) - అను.

ఆ భావన యెంతగాఢమంటే, అంతకే ఆయనదేహం శవంలాగ నిశ్చేతనమై బిర్రబిగుసుకుపోయింది. ప్రాణశక్తులన్నీ తిరుగుమొగమై మనస్సులోకి మరలి, అంతర్ముఖాలై, ఆయన సంకల్ప ప్రేరణంవల్ల నిజమైన 'నేను'ను - నేనని అసలుంటేదాన్ని - వెదకసాగాయి. అదే తరుణంలో ఏదో గూఢశక్తి ఆయన హృత్కుహరాంతరాల్లో నుంచి ఎగసి మనః ప్రాణాలనావరించి ఆయన్ను ఆంతరగతుణ్ణి చేసింది. అప్పుడేం జరిగిందో తెలియ వశంగాదు. కాని మహర్షి బోధనలను పరిశీలిస్తే దాన్ని కొంతకుకొంత యిట్లూహించవచ్చును. ఆ 'శక్తి'ని భక్తులు సామాన్యంగా 'అనుగ్రహమని' మన్నిస్తారు. ఆ శక్తివల్ల ఆయనమనస్సు లోలోన సర్వమనః ప్రాణాల కూటస్థలిలో మునిగి అందు లీనమైంది. ఈ జరిగిందంతా ఆయన జాగ్రదవస్థలోనే గనుక ఆయనకు స్వస్వరూపజ్ఞానం కలిగింది. తలపులు కదల్చని దాస్థితిః భయకామాలు లేని ఆస్వరూప స్థితిలో వెల్లివిరిసేవి శాంతిసౌఖ్యాలే. అపుడాయన చేరింది నాహంస్థితి. అచట భాసించేది సునిశ్చలదాత్మశాంతి, ఆస్థితి యెట్టిదో మనకు తెలిసే మార్గమే లేదు. మనం గూడ ఆస్థితి నందుకొని అందే సుప్రతిష్ఠితుల మైతే తప్ప. అది అట్లేఅయిన వారి వెల్లడింతల (Revelstion) సాయంతో ఆస్థితి యెట్టిదికాదో గ్రహించవీలవుతుంది.

దీనివల్ల తేలిందిది. ఆత్మసిద్ధికి సాధనం ఏకాగ్రమూ అవిరళమూ అయిన స్వస్వరూపానుచింతన. శుద్థమూ పరమమూ అయిన భక్తి యన్నా అదే. దీన్ని బలపరుస్తూ శ్రుతివాక్యమున్నది - ''అందలి పూర్ణభక్తి చేత బలంగా ఆ కృష్ణుడైనవాడే ఆత్మను కనుగోగలడు: వానికే స్వస్వరూపము అభివ్యక్తమౌతుంది.'' 5 అన్ని మతాలకూ పర

__________________

5. ''యమేవైషవృణుతే తేనలభ్యస్తసై#్యష ఆత్మావివృణుతే తనూం స్వామ్‌.''

- కఠోపనిషత్‌, II, 23

సత్యమిదే. దానినే మరోవిధంగా జీసస్‌ చెప్పాడు: ''అర్ధించు, అది లభిస్తుంది: తట్టిచూడు, వివరమెఱుగనౌతుంది.''

ఆయన వ్రాతల్లోను, ప్రశ్నోత్తరాల్లోను మహర్షి బోధించేమార్గమిదే. ఒకరచనలో వారుదానిని ఋజుమార్గమన్నారు. జీవితసమస్యలన్నింటికి తారకమదే. దానిలో నడచే వారిని నిజస్థితిలో అంటే సహజస్థితిలో చేరవేస్తుంది. అజ్ఞులకు కనిపించేట్లుగాక, ఆస్థితిలో సత్‌ స్వరూపం అభివ్యక్తమౌతుంది. దానిని సహజ భావమన్నారు. దానికే అహమిక లేనిస్థితి యనీ, నష్టమానసమనీ పేర్లు. మహర్షీ శ్రుతులూ దానినెట్లు వర్ణించాయో తరువాతి ప్రకరణంలో వివరిస్తాను. ఆ భూమిక పరస్థితి. అది సిద్ధిస్తే మరి సాధింపవలసిన దేమీ లేదు. అంతతో వాని జీవయాత్ర పూర్తి అయినట్లే.

ఆ యనుభవంతో రమణులు ఋషి అయినారు. అంతవరకూ సదా ఆయనలో మణిగియుండిన ఋషిత్వం ఉద్బుద్ధమయింది. ఆథ్యాత్మికంగా ఆయన పరిణతి పూర్ణమయింది. ఆయన ఆత్మ స్థితికీ మనోదేహాలకూ పొత్తువిడిపోయింది. అంటే దేహాత్మ భావన ఆపైన లేదు. దేహాత్మ భావనే అజ్ఞానం. అసలీ అజ్ఞానం వల్లనే మనస్సు పుట్టుక. కనుక యీ అనుభవాన్ని మనోలయమనీ, మనోనాశమనీ వివరిస్తారు. పరికించి చూస్తే ఋషికి మనస్సులేదు దేహంలేదు. జగత్తూలేదు. అంటే ఆమనోదేహాలు నాశ##మైనాయని కాదు. జనులు వారిని చూడనూ చూస్తారు. వెలివిషయాలు వారిని బాధిస్తున్నట్లూ అగపడుతుంది. అంతలో ఆయన జీవిత చరిత్ర ముగిసిపోదు. నిజంగా తాను కర్తకాకున్నా బహువిధ కర్మల్లో ప్రవృత్తుడుగా కూడ ఆయన పైకి కనుపిస్తాడు. ఆ మహానుభూతికి పిమ్మటి ఘటనలు కొన్ని ఆయనవిగా యిందు వర్ణించాను. నిజంగా అవి ఆఋషికి సంబంధించనవి కావు; వానిఛాయలు ఆయనపై ఏవిధంగానూ ప్రసరించవు.

నామరూపాలులేని, నిర్వర్ణింపగాని బ్రహ్మమును గూర్చి రమణులు వినీ చదివీ ఎఱుగరు. కాని యీ యనుభవంవల్ల ఆయన కేదో సిద్ధించింది. దానినైజాన్ని ఆయన శకించలేదు. వైదికవాఙ్మయం ముక్తిని సత్‌ అనీ స్వాత్మస్థితియనీ నిర్వచించింది. ఇది తరువాత ఎప్పుడో ఆయనకు తెలియవచ్చినపుడు తన కానాడు సిద్ధించింది అట్టి స్థితేయని, అదేయని, ఆయన సులువుగనే గుర్తించారు.6

మహర్షి జీవితంలోని తరువాతి ఘటనలు వారి తనుమనః ప్రవృత్తులేగాని, తానుగా యొనర్చినవిగావు. సహజస్ధితిలో గూఢంగా నుండిన వారిదివ్యశక్తులు త్వరలో వెలువడినవి. మరి వారవతరించిన ప్రయోజనం ఫలించవలెగదా?

అనుభూతి తర్వాత వారిమనస్సు ఆస్ధితిలో విరళంగా ఉండేది. ఆ అంతరాల్లో దానికేదో ఆలంబనం ఆవశ్యకమైంది. దైవమే ఆ ఆలంబనం. అరువత్తిమూవర్‌ నాయన్మారులు ప్రేమానంద పారమ్యాన్ని అందుకొన్నది అందేగదా?

అంతనుండి రమణులు దేవాలయానికి మరింత తఱచుగా పోవనారంభించారు. సన్నిధిలోనిలిచి యున్నప్పుడు ఆయనకు కన్నీరు ఏరులై పారేది. అది గాఢభక్తి పరాయణుల కెవరికోగాని కలిగేది కాదు. అట్టి యనుభవానికై భక్తులెంతగా తహతహలాడతారో చెప్పలేము. వారిదృష్టికట్టి యశ్రుధార భక్తి పరిణతి లక్షణము, దైవానుగ్రహఫలమూను. పూర్వజన్మలో ఆయన ఎంతటి భక్తి పరా

___________________

6. శుకులు వ్యాసమహర్షి కొడుకు. ఆయనకు అయత్నంగా ఆత్మసాక్షాత్కారం కలిగింది. కాని ఆస్థితియే పరమగమ్యమని ఆయన నమ్మలేక పోయినాడు. అడిగితే, తండ్రి అవునన్నారు. కాని అతని కాసందేహం మిగిలేయుందని గుర్తించి అతన్ని జనకులయొద్దకు పంపినారు. అక్కడికి ఆయనకు తెలిసివచ్చింది, ఇకపై తాను సాధింపవలసినదేమీలేదని, శుకులకువలె ఎట్టి సంశయమూ రమణులకు కలుగలేదు. ఇది గమనించతగ్గది.

యణుడో దానిపక్వఫలమే రమణుల యిప్పటి అభివ్యక్తి. ఈకన్నీటి వెల్లువల కేదో ప్రయోజనాన్ని దైవం నిర్దేశించియుంటాడు. వానిని కురిసిన' వారి నవి పునీతులను ఉత్తములను చేస్తాయి: వారి జ్ఞానేంద్రియాలుఅధికశక్తివంతములౌతాయి. ఇట్లు తీరినరమణుల మనోదేహాలు, దైవదూతయగు ఆ సద్గురునకు అర్హనిలయాలైనవి.

ఆ అనుభూతుల సమయంలో రమణుల దేహంలో తీవ్రమైన తపన జనించేది. వారు అరుణాచల సన్నిధి చేరేదాక, అది ఉంటూనే వచ్చింది. శ్రీ రామకృష్ణులూయిట్లే తపించినారని వాడుక.

బడిచదువులో రమణులు తీసికట్టు. చూచేవారికి విసుగుపుట్టేది. ఆ దిగజారడం ఇప్పుడు మరింతఅయింది. అశ్రమంగా సిద్ధించిన, అనిర్వచనీయమైన ఆ ఆత్మస్థితిలో వారు తఱచు మగ్ను లయ్యేవారు. అందుండి తేరిన వేళల్లో చదువంటే ఆసక్తి లవలేశమూలేదు. పిల్లవాడీగతి యెందుకైనాడో పెద్దల కర్థమేకాలేదు. చదువన్న అతని వైముఖ్యం సహజంగానే వారికి కోపం తెప్పించేది. అది యిప్పుడధికాధికమయింది. అన్న తానూ విద్యార్థియే. తమ్ముని పద్ధతి అతనికేమాత్రం గిట్టలేదు. రమణులు ఆత్మస్థితి నంది ఆరువారాలు గడిచాయి. పాఠాలు వల్లించకుండా తమ్ముడు మళ్ళీ ఆస్థితిలో మునుగ బోతున్నాడు. భరించలేక ఆయన తమ్ముడి మనస్సు నొచ్చేట్టుగా అన్నాడు: ''ఇట్టివాని కీచదువులూ చట్టబండలూ ఎందుకు ?'' అని.

ఆమాటలైతే మనస్సులో గ్రుచ్చుకొన్నవిగాని ఫలితం వాళ్ళ అన్న ఊహించినట్లుగాదు. అప్పటికి మాత్రం కొంచెంగా నవ్వి ఆయన పుస్తకం చేబట్టాడు. కాని లోలోన తలపులు రాసాగాయి; ''అవును, అన్న అన్నదేసరి. ఇకపైన నాకీ బడీ, ఈపుస్తకాలు వృథా.'' అంతే త్వరలోనే ఇల్లువదలి పోవలె: దూరంగా, తన్ను తమ వాడనుకొనే వారి కెవ్వరికీ తెలియని తావుల్లో నివసింపవలెనన్న భావం రూపుదాల్చింది.

తిరువణ్ణామలై పుణ్యక్షేత్రం. చాలప్రసిద్ధమైనది. తానెంతగనో మెచ్చే అరుణాచలం 7 అదే యని అచటికి వెళ్ళివచ్చిన ఒక బంధువు చెప్పగా ముందే విని ఆశ్చర్యపడి యున్నాడు. అంతవరకూ ఆయూరు భూతలంలోనిదని ఆయన అనుకొననేలేదు.

తానెంచుకొన్నట్లు, అరుణాచలం తగు దూరంలో ఉంది. చేరరాని దూరమూగాదు. రహస్యంగా యిల్లువదలి అక్కడికి వెళ్లిపోవలె. ఆపైగతి, విధినడిపినట్లు. అతని యత్నానికి అదృష్టం తోడయింది. అంతవరకూ అన్న బడి జీతం కట్టలేదు. బడికే వెడుతున్నా డనుకొని తమ్ముణ్ణి పెట్టెలోంచి అయిదు రూపాయలు తీసుకొని తన జీతం కట్టి రమ్మన్నాడు. ఆ తమ్ముని ఊహలో తన ప్రయాణానికి మూడు రూపాయలు చాలు: మిగత రెండు రూపాయలూ, ఒకజాబూ అందేవదలి ఆయన బయటికి నడిచాడు: తండ్రిని వెదకుతూ వెడుతున్నాననీ, దీనికై ఎవ్వరూ ఎన్నడూ వెదకి రానక్కఱలేదని ఆజాబు.

మధురలో టికెట్‌కొని రమణులు రైలెక్కారు. కూర్చోగనే అహంమరచి ఆస్థితిలో చాలసేపు ఉండిపోయారు. ఆకలివేసిన జాడేలేదు. తిన్నది చూస్తే అసలు తిననే లేదనవచ్చు. పోవలసిన దారి నాయన సరిగా నిర్ణయించుకోలేదు, కాని ఎవ్వరో దానిని సరిగా తెలిపినారు. ఉన్న డబ్బు చాల లేదు. కొంతదూరం నడవవలసీవచ్చింది. మధ్యేమార్గంలో చెవిదుద్దులు కుదువబెట్టి కొంతసొమ్ము జత చేసుకొని చివరకెట్లో తిరువణ్ణామలై చేరుకున్నాడు.

రైలు దిగిందే తడవు; పరుగున గుడిజేరి సన్నిధిని భక్త్యావేశంతో ఎలుగెత్తి 'అప్పా, నీ ఆజ్ఞ మేరకు వచ్చా'నని విన్నవించుకొన్నాడు. ఆక్షణంలోనే ఆరువారాలుగానున్న ఆయన దేహ తాపం

________________

7. అరుణాచలం అచటిదేవుని ప్రతీక. అరవంలో ఆయూరు అన్నామలై. 'తిరు' అంటే పవిత్రము, మలై = కొండ : ఉచ్చారణలో అది తిరువణ్ణామలై అయింది.

మాయమయింది. తనకు తెలియని లోటేదో తీరిపోయింది: అశ్రుస్రావమాగింది. అట్టి కన్నీరు కార్చింది ఆ తరువాత ఒక్కమారు, ఎపుడో తనశిష్యులకై 'అరుణాచలస్తుతిపంచకం'లో భక్తిగీతాలు రచిస్తున్నప్పుడు.

గుడివెలుపలికి వచ్చాక రమణుల వేషం రూపంమారిపోయింది. అందుకని యొక యోచనా, ఒకనిర్ణయం లేదు. ఆయన తటస్థుడే. ఒక మంగలి తానైపూనుకొన్నాడు, ఆయన తల బోడియైంది. తత్పూర్వపు మజిలీనుండి ఆయనతోనున్న ఒకటి రెండు గుడ్డలూ, చిల్లర డబ్బులూ కొలనులో పారవేసి ఆయన గోచిమాత్రంగా మిగిలాడు. తానీ దేహంకాదుగదా! దానికిన్ని ఉపచారాలేలన్న యీసడింపు. క్షౌరమైన పిదప విధిగా చేసే స్నానం తలపెట్టనేలేదు. అట్లే దేవాలయానికి తిరిగి వెడుతున్న ఆయన్ను. తలవని తలంపుగా కురిసిన వాన పూర్తిగా అభిషేకించింది. పిమ్మట చాలకాలం ఆయనకు నిలుకడగా ఏ నివాసమూ లేదు. అల్లరికి సరదాకు చుట్టుమూగే జనంవల్ల ఆయన సమాధి కంతరాయం కలిగేది. అది లేని తావెల్లా ఆయనకు వాసయోగ్యమే. దేహ, పరిసరముల స్పృహయే లేకుండా ఎంతెంతసేపో గడచిపోయేది. పరికించిన వారాయన్ను మౌనిగా, సన్న్యాసిగా భావించారు. అందుచేత వారాయన్ను పలుకరింతలతో బాధించలేదు. ఆయనా మౌనాన్ని పాటిస్తున్నందున వారిభావం పొల్లనిపించలేదు. ఆ మౌనం ఏండ్లు పూండ్లు సాగింది. అందుచే ఆయనవాక్కు అస్పష్టమైంది. పిదప కొన్నేండ్లకు శిష్యులాయన చుట్టూజేరి ప్రశ్నలతో వేధిస్తే వారికి జవాబులు వ్రాసి యీవలసివచ్చింది. అలాకొంతకాలం గడిచాక, కొంతశ్రమించాక, ఆయనకు వాక్కు తిరిగీ స్వాధీనమయింది.

ఆహార విషయంగా ఆయనకేలోటూ కలుగలేదు. ఆయన ఉత్తమ తాత్త్వికుడనీ, ఆపునీతుణ్ణి సేవించడమే మహాభాగ్యమని నమ్మి అనేకులాయన అవసరాలెల్ల సమకూర్చేవారు. మొదట్లో అల్లరి పిల్లల ఆగడాలున్నవి. కాని అవి ఆయన అంతశ్శాంతి నేమీ భంగించలేదు.

ఆయన సమాధి నిరతికి విరతిలేదు. అరుణాచల జేరిన అనతికాలానికే ఆయనకు శ్రుతులు పాడిన పరసత్యం బోధపడింది. 'నేనూ, నాతండ్రీ అభిన్నులం; అంతతో ఆయన పూర్ణ ఋషి అయినారు ఆపై ఆత్మానందానికై అంతర్ముఖులు కావలసిన పనేలేదు. ఆయనకాస్థితి సహజమైపోయింది. దైవం ఆత్మకు వేరుకాదు. దేవదూతగా ప్రపంచంలో నిర్వహించవలసిన కార్యం పూర్తిగా నేరవేరింది. ఈ రీతిదైన నిరంతర స్వాత్మనిష్ఠనే సహజ సమాధి (సహజభావ) స్థితి అన్నారు. 8

ఇల్లు వీడిన పిల్లవానికై కుటుంబం వారెంతగనో వెదకి వేసారినారు. వారి యత్నాలు ఫలించలేదు. కొన్ని యేండ్లకతడు తిరువణ్ణామలైలో ఉన్నట్లు తెలిసింది. ఆయన్ను తిరిగి తమతో తీసుకొని వెళ్ళవలెనని మొదట పినతండ్రీ తరువాత తల్లీ వచ్చారు. తమతో కాకున్నా తమకు దగ్గరలోనైనావచ్చి యుండమని బ్రతిమాలి భంగపడ్డారు. వారాయన్ను తమకు సొంతమైనట్లు భావించారు. దాన్ని యీ విధంగా రమణులు త్రోసిపుచ్చారనవచ్చు. దేహం తానై తేనే ఆస్వత్వం: తానుదేహం కాదు గదా !

తల్లీ, ఆ అన్నదమ్ముల్లో మిగిలియున్న ఒక్కతమ్ముతూ ఆయన తోనే యుండిపోవలెనని వచ్చిచేరారు. ఆయనా వారిని రానిచ్చారు. అది అవకాశంగా తమ బోధతోతల్లిని ఆధ్యాత్మికంగా పరిణతనుజేయబూనుకొన్నారు.

______________

8. ఈ స్ధితి ఎట్టిదో గ్రహించుటలో తప్పులు తప్పవు. గ్రంధాలు దీన్ని నిశ్చితంగా వర్ణించలేదు. అందు శిష్యుని తెలియమికలిసిఉంటుంది. వేరే నిర్వచనాల సాయంతో సరిదిద్దుకోవలె. ఎనిమిదో ప్రకరణంలో దీని వివరణతో కొంత బోధపడవచ్చు.

తిరువణ్ణామలై చేరిన క్రొత్తల్లో మహర్షి కెన్నో యిక్కట్లు ఎదురైనవి. కాని వారి మనశ్శాంతికే కలతాలేదు. గీతలో చెప్పినట్లు 'దుఃఖము లెంత గాఢములైనా ఆత్మ సంస్థితుణ్ణి చలింపజేయవు'.9 నిజానికి వెలివిషయాలు, తమదేహాన్ని తాకినా, ఋషిదృష్టిలోనవి యధార్థాలుకావు. అతడెప్పుడూ నిస్సీమమూనిర్ని బంధనమూ అయిన ఆనందంలో సుస్థిరుడై యుంటాడు. ఆ ఆనందం ఎల్లెడలా ప్రసరిస్తుంది. అది ఆకర్షింపగా శిష్యులూ భక్తులూ ఆమరణాంతం వారి సన్నిధినే తమ జీవితాలు గడపుతారు. రమణులను ఎందరొ నరాకృతి నున్న దైవంగా భావిస్తారు.

చిత్రమేమంటే స్వస్వరూప విషయంగా మహర్షి ఏ గ్రంధాలూ చదువలేదు. వాగంతం దాన్నే వివరించే పుస్తకాలచాయలకే పోలేదు. వేదధర్మరహస్యాల నాయనకుపదేశించిన వారూ లేరు. తన ఆత్మసిద్ధి వెనుక ఎంతకాలానికో గాని ఆయనకలాంటి వాఙ్మయపు జాడే తెలియదు. ఆయన దరినున్న శిష్యుల్లో ఆగ్రంధాల్లో కొన్నిటిని చదివినవారున్నారు. వారికందు తెలియని భాగాల కర్థమేమని రమణుల నడిగేవారు. శ్రద్ధాభక్తులతో వానిని పఠించిన నిశితబుద్ధులూ గ్రహింపలేనివి ఆ వాఙ్మయంలో ఉండేవి. వాని కర్ధం రమణులు సులువుగా విడమరచి చెప్పేవారు మోక్షార్ధి ప్రతివాడూ సమర్ధుడైన గురువునొద్ద దీక్ష స్వీకరించడం చిరకాలంగా వస్తూన్న సంప్రదాయం. అది రమణుల విషయంలో పాటింపబడలేదు. ఆయన కాయనే గురువు.

ఈ రమణ గురు వైశిష్ట్యమింకొకటి. వారి యుపదేశం వాచాతక్కువ; ఎక్కువమౌనంగానే. పరిసరాలనుండీ దూరాలనుండీ వారి దర్శనానికై వచ్చేవారిలో ఎందరో తమతమ సందేహాలనుమూటలుగా తెచ్చేవారు. మహర్షికినమ స్కరించి సన్నిథిలో కూర్చోగానే ఎందరో

_________________

9. 'యస్మిన్‌ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే' - గీత, VI, 22,

తమ ప్రశ్నల మాటే మఱచేవారు. కొంతసేపటికి అవి మటుమాయమయ్యేవి. అదేపనిగావచ్చిన పృచ్ఛకుడు, తనప్రశ్నల్లో చాలావాటికి బదుళ్ళనవసరమే అని, యితరాలు తానెఱిగినవేఅనీ, వానినడిగేవాడే కాడు.

ఇంతకూ పూర్తిగా ఇహార్థం కాని సందేహాలు తీర్చడానికి మహర్షి యెప్పుడూసుముఖులే. ఆ ఉత్తరములూముక్తసరిగా స్పష్టంగా ఉంటాయి. వానిలోగ్రంధాల్లోవలె పారిభాషిక పదాలుండవు. ఆయన మాటలవలెనే వ్రాతలూనూ, ఆ సామర్థ్యానికి మూలం స్వానుభవమే గాని గ్రంథ పరిచయం గాదు. పండితులట్లు గాదు; గ్రంథాల్లోని పదజాలం గుప్పించక మాటాడలేరు. అక్కడ పెత్తనం వారు చదివిన పుస్తకాలదే గాని వారిదిగాదు.

మహర్షి కూడ కొన్ని పుస్తకాలు వ్రాశారు. అలతి మాటలు, అనల్పార్థాలూ, ఆ రచనలూ శిష్యుల యొత్తిడి వల్లనే, తాను సంకల్పించికాదు. తమ కందుబాటులోని గ్రంధాల పాండిత్యం కన్న మహర్షి ముఖతః సూటిగా వారిసద్దర్శన వివరణమే శిష్యులెక్కువగా అభిలషించేవారు. శిష్యులుకోరినందున వారు కొన్ని పురాతన గ్రంథాలను తమిళంలోనికనువదించారు. ప్రాచీనగ్రంథ భాషలకన్నా తత్త్వజ్ఞానంలో మహర్షి శిష్యులే ఎక్కువ నిరూఢులు. పృచ్ఛకులకు మహర్షి యిచ్చిన సమాధానాలను కొన్నిటిని వారిశిష్యులు పుస్తక రూపేణ వెలువరించారు.

వారి వైశిష్ట్యాన్ని ఎత్తిచూపే ప్రముఖలక్షణంతుల్యనిందాస్తుతి తన్నుపొగిడితే ఉబ్బరు: తెగడినా క్రించుపఱచినా నొచ్చుకోరు. ఇదే మంతగొప్పగా తోచకపోవచ్చు. ప్రకృతి సహజంగాసజ్జనుల్లోయింతో అంతో సల్లక్షణాలు మరెన్నైనా ఉండవచ్చు కాని దూషణ భూషణల కతీతంగా ఉండటమట్టిదిగాదు. ఈ లక్షణ మొక్కటే చాలు మహర్షిని గుర్తించటానికి అహంతచావనివాడు ఎంతఉత్తముడైనా నిందాస్తుతుల సందర్భంలో సాధారుణులలాగే ప్రవర్తిస్తాడు. 10 అవి బాథింపజాలనిది ఋషి నొక్కణ్ణ.

అహమెఱుగని యోగి తనకూ ఒరులకూ, వారిలో వారికీ, భేదమెన్నడు. అతని దృష్టిలో లింగసంపదధికారభేదాలు లేనివే. అతని సర్వసమతలో అరగొరలుండవు. జంతువులను సైతం ఆయన మనుజులనువలెనే సంభావిస్తారు. నమ్మజాలంగాని, నిజంగా ఆయన దృష్టిలో పాపిగానీ అజ్ఞానిగానీ అసలే లేడు.

ఋషియే ఋషిని గుర్తింపగలడని పలువుర భావన; అంటే పరులెవ్వరూ ఆయన్ను నిశ్చయంగా నిరూపించలేరని. ఇది నిండు నిజం గాదు. శ్రద్ధాళువైన ముముక్షువు సమర్థుడని తానెన్నిన గురువు ఋషియో కాదో ఏదో యొక రీతిగా తానే నిర్ణయించుకోవలె, శుద్ధుడూ భక్తి పూర్ణుడూ అయితే అందుకు దైవానుగ్రహం వానికి తోడ్పడుతుంది. ఆఋషిబోధించే పరమసత్యాన్ని అర్థంజేసుకొనే శక్తినిస్తుంది.

ఋషి దేవదూత. వారి జన్మవలని ప్రయోజనం రెండు విధాలుగ నుంటుంది. శ్రుతులలోని సారసత్యాలను ఉద్ధరించి ప్రతిష్ఠించడం ఒకటి: మరొకటి దైవానుగ్రహానికి ప్రసార కేంద్రంగా, శ్రుత్యర్థాలు తెలుసుకొన్నందుననో, కాక వారి అంతః స్ఫురణ అట్టి దైనందువల్లనో, కొందరు శిష్యులు గురువును దైవాన్ని వేరుగా చూడరు.వారికి గురువే రూపుగొన్న దైవం. దైవాన్ని సేవించినట్లే వారు గురువును సేవిస్తారు. అట్టి వారిపై దైవానుగ్రహం గురుమూలంగా ప్రసరిస్తుంది. ఈ నిగమార్ధాన్ని తెలిపేదే యీ క్రింది శ్లోకం :-

__________________

10. అనుబంధం 'క' శ్లోకం, 83. ఉన్నదినలువది, సూక్తి సుధ, 37

''ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే

వ్యోమవత్‌ వ్యాప్తదేహాయ, దక్షిణామూర్తయే నమః||''

'పరమ జ్ఞానమూర్తికి దక్షిణామూర్తికీ, ఆకాశమువలె సర్వవ్యాపికి, ఈశ్వరుడు గురువు ఆత్మయను విభాగములతోడి త్రిమూర్త్యాత్మకునకు నమస్కారము.' ఈ వివరణ మెఱిగిన శిష్యులూ భక్తులూ ఋషిని పలుమార్లు దర్శించే పనిలేదు; వారి సన్నిధినే వసించటమూ అంత అవసరం గాదు. ఋషి దేశకాలాల కతీతుడు, సర్వగతుడు.

-*-

Mahayogama    Chapters