Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వావింశో ధ్యాయః

వ్యాసః : స తయా నోద్యమాన స్తు రాజపత్న్యా పునః పునః | ప్రాహ భ##ద్రే కరోమ్యేష విక్రయం తే సునిర్ఘృణః. 1

నృశంసై రపి యత్కర్తుం న శక్యం తత్కరోమ్యహమ్‌ | యది తే భ్రాజతే వాణీ వక్తుమీదృక్సునిష్ఠురమ్‌. 2

ఏవ ముక్త్వా తతో రాజా గత్వా నగర మాతురః | అవతార్య తదా రంగే తాం భార్యాం నృపసత్తమః. 3

బాష్పగద్గదకంఠ స్తు తతో వచన మబ్రవీత్‌ | భో భో నాగరికాః సర్వే శృణుధ్వం వచనం మమ. 4

కస్య చి ద్యది కార్యం స్యా ద్దాస్యా ప్రాణష్టయా మమ | స బ్రవీతు త్వరాయుక్తో యాత్స్వం ధారయామ్యహమ్‌.

తేబ్రువన్పండితాః పాపః కస్త్వం పత్నీం విక్రేతు మాగతః |

రాజోవాచ : కిం మాం పృచ్ఛసి కస్త్వంభో నృశంసోహ మమానుషః. 6

రాక్షషో వాస్మి కఠిన స్తతః పాపం కరోమ్యహమ్‌ | తం శబ్దం సాహసా శ్రుత్వా కౌశికో విప్రరూపధృక్‌. 7

వృద్ధరూపం సమాస్థాయ హరిశ్చంద్ర మభాషత | సామర్పయస్వ మే దాసీ మహం క్రేతా ధనప్తదః. 8

అస్తి మే విత్త మతులం సుకుమారీ చ మే ప్రియా | గృహకర్మ న శక్నోతి కర్తు మస్మా త్ర్పయచ్చమే. 9

అహం గృహ్ణామి దాసీం తు కతి దాస్యామి తే ధనమ్‌ | ఏవ ముక్తేతు విప్రేణ హరిశ్చంద్రస్య భూపతేః. 10

విదీర్ణం తు మనో దుఃఖా న్న చైనం కించి దబ్రవీత్‌ | విప్రః కర్మణ శ్చ వయోరూపశీలానాం తవ యోషితః.

అనురూప మిదం మిత్తం గృహాణార్పయ మేబలామ్‌ | ధర్మశాస్రేఘ యద్దృష్టం స్త్రీయో మౌల్యం నరస్యచ.

ద్వాత్రింశల్లక్షణోపేతా దక్షా శీలగుణాన్వితా | కోటిమౌల్య సువర్ణస్య స్త్రీయః పుంస స్తథార్బుదమ్‌. 13

ఇత్యాకర్ణ్య వచ స్తస్య హరిశ్చంద్రో మహీపతిః | దుఃఖేన మహతా೭೭విష్టో న చైనం కించి దబ్రవీత్‌. 14

ఇరువది రెండవ అధ్యాయము - హరిశ్చంద్రోపాఖ్యానము

వ్యాసుడిట్లనెను: రాజపత్ని తన్నమ్ముమని మాటిమాటికి ప్రేరేపించగ హరిశ్చంద్రు డామె కిట్లనెను. కల్యాణీ: నిన్ను దయమాలి యమ్మివేతునా! నీ కిట్టి బెట్టిదమైన మాట యిష్టమైనచో నేను సైతము మహాక్రూరులకు సాధ్యము గాని కఠినమైన పని చేయగలను. అని పలికి రాజు శోకాతురుడై తన భార్యను వెంటగొని నగరు లోని రాజ వీథిలో నిలువబడెను. కన్నీరు తొడిబడ తడపడు నుడులతో రాజిట్లనెను. ఓ పౌరులారా! మీరందఱు నా మాట నాలింపుడు. మీలో నెవనికైన దాసి కావల సినచోచెప్పుడు. నా ప్రాణప్రియ నమ్మగలను. నేను చెప్పినంతకు కొనుడు. నీ వెవరవు? నీ భార్యనేల యమ్ముచున్నావని పండితు లడిగిరి. రాజిట్లనెను. నీ వెవరవని నన్నేల యడిగెదరు. నేనొక క్రూరుడను. పశువును. నేను రాక్షసుడను. కఠినాత్ముడను. అందుచే నింత పాపము చేయుచున్నాను. అను రాజు మాటలు విని విశ్వామిత్రుడు వెంటనే విప్ర రూపమున వచ్చెను. ముని ముదుసలి విప్రురూపమునవచ్చి హరిశ్చంద్రునితో నిట్లు పలికెను. ఆదాసిని నాకిమ్ము. నేనుకొని నీకు వలసిన ధన మీయగలను. నాయొద్ద ధనము మూలుగుచున్నది. నాభార్య కడు సుకుమారి. ఇంటి పనులొక్కతెయే చేసుకొనలేకున్నది. కనుక నీమెను నా కమ్ముము. నేనీ దాసిని తీసికొందును. నీ కెంత ధన మీయవలయును. అని విప్రుడు హరిశ్చంద్ర నర పతితో బలకెను. అపుడు రాజు హృదయము దుఃఖముతో వ్రయ్యలయ్యెను. రాజునకు నోట మాట రాలేదు. విప్రుడిట్లనెను: నీ భార్య యొక్క వయస్సు - రూపు - శీలము - పని యన్నిట తగినవి. నీ భార్యకు తగిన ధనము తీసికొనుము. నాకు నీ బార్యనిమ్ము. ధర్మశాస్త్రములందు స్త్రీ పురుషులకు నిర్ణయింపబడిన వెల తెల్పుదు వినుము. ముప్పది రెండు లక్షణములు గల్గి-శీలగుణములు దక్షత గల యాడుది కోటి సువర్ణములు వెల చేయును. పురుషుడొక యర్బదము వెల చేయును. అను మాటలు విని హరిశ్చంద్ర రాజు మహాశోకములో నేమియు బలుకకుండెను.

తతః స విప్రో నృపతేః పురతో వల్కలోపరి | ధనం నిధాయ కేశేషు ధృత్వా రాజ్ఞీ మకర్షయత్‌. 15

రాజ్ఞ్యువాచ : ముంచ ముంచార్య మాం సద్యోయావత్పశ్వామ్యహం సుతమ్‌ |

దుర్లభం దర్శనం విప్ర పునరస్య భవిష్యతి. 16

పశ్యేహం పుత్ర మామేవం మాతరం దాస్యతాం గతామ్‌ |

మాం మా స్ర్పాక్షీ రాజపుత్ర న స్పృశ్యాహం త్వయాధునా. 17

తతః స బాలః సహసా దృష్ట్వా೭೭కృష్టాం తు మాతరమ్‌ | సమభ్యదా వదంబేతి వదన్సాశ్రువిలోచనః. 18

హస్తే వస్త్రం సమాకర్షన్కాకపక్షధరః స్ఖలన్‌ | తమాగతం ద్విజః క్రోధాద్బాలమప్యాహన త్తదా. 19

వదం స్తథాపి సోంబేతి నైవ ముంచతి మాతరమ్‌ |

రాజ్ఞ్యువాచః ప్రసాదం కురు మే స్వామిన్‌ : క్రీణీష్వేమం హి బాలకమ్‌. 20

క్రీతాపి నాహం భవితా వినైనం కార్యసాధికా | ఇత్థం మమాల్పభాగ్యాయాః ప్రసాదం కురుమే ప్రభో. 21

బ్రాహ్మణ ఉవాచ: గృహ్యతాం విత్తమేతత్తే దీయతాం మమ బాలకః |

స్త్రీపుంసోర్దర్మ శాస్త్రజ్ఞైః కృతమేవ హి వేతనమ్‌. 22

శతం సహస్రం లక్షం చ కోటిమౌల్యం తథాపరైః | ద్వాత్రిశం లక్షణోపేతా దక్షా శీలగుణాన్వితా. 23

కోటి మౌల్యం స్త్రీయః ప్రోక్తం పురుషస్యతథా ర్బుదమ్‌ |

సూత ఉవాచ : తథైవ తస్య తద్విత్తం పురః క్షిప్తం పటే పునః. 24

ప్రగృహ్య బాలకం మాత్రా సహైకస్థ మబంధయత్‌ | ప్రతస్థే స గృహం క్షిప్రం తయాసహ ముదాన్వితః. 25

ప్రదక్షిణాం తు సా కృత్వా జానుభ్యాం ప్రణతాస్థితా | బాష్పపర్యాకులా దీనా త్విదం వచన మబ్రవీత్‌. 26

యది దత్తం యది హుతం బ్రాహ్మణా స్తర్పితా యది | తేన పుణ్యన మే భర్తా హరిశ్చంద్రోస్తు వై పునః. 27

పాదయోః పతితాం దృష్ట్వా ప్రాణభ్యోపి గరీయసిమ్‌ | హా హేతి చ వదన్రాజా విలలాపాకులేంద్రియః. 28

పిదప విప్రుడు రాజు ముందొక వస్త్రముపై ధనముంచి రాణి తల వెండ్రుకలు పట్టిలాగెను. రాణి యిట్లనెను: ఓ విప్రా! వదలు - వదలుము. నా కొడుకు మొగమొకసారి చూడనిమ్ము. మరల నా కొడుకు దర్శనమగునో కాదో! ఆమె రాకుమారునితో నిట్లనెను. ఓ రాజపుత్రా! నీ తల్లి యిపుడొక దాసియైనది. నీవు నన్ను తాకకుము. నిన్ను తాకుటకును నేను తగను. పిదప తన తల్లిని ముని లాగుచుండుట జూచి బాలుడు వెంటనే అమ్మాయని కన్నుల నీరు నింపుకొని యేడ్చుచు తల్లిని జేరెను. బాలుడు తన తల్లి చీర చెఱగు పట్టుకొని లాగుచు నేడ్చుచుండుటగని విప్రుడతనిని కోపముతో కొట్టెను. అయి నను బాలుడు తన పట్టిన పట్టు వదలక అమ్మాయని బావురుమని యేడ్చెను. విప్రునితో రాణి యిట్లనెను. బాలుని సైతముకొని నాకు సంతోషము గల్గించుము. నేను నా బాలుడు లేనిచో నీ పనులు చక్కగ చేయజాలను. కనుక నీ నిర్మాగ్యురాలి పట్లదయ బూని యితనిని కొనుము. రాజుతో బ్రాహ్మణుడిట్లనెను. ఇదిగో! ఈ ధనము తీసికొని బాలుని కూడ నాకిమ్ము. ధర్మశాస్త్రవిధులు స్త్రీ పురుషులకు వేర్వేరుగ వెలలు గట్టిరి. పండితులు స్త్రీల గుణములను బట్టి కొందఱికు నూఱు-వేయి-లక్షమఱి కొందఱికి కోటి వెల నిర్ణయించిరి. ఒక యువతి ముప్పదిరెండు శుభ లక్షణములు నేర్పుగల్గియుండవలెను. ఆమె కోటి బంగారు ముద్రల విలువ చేయును. ఇక పురుషుని వెల అర్బుదము. సూతుడిట్లనెను. విప్రుడు వస్త్రముపై పురుషుని వెల యంద ధనముంచెను. అతడు బాలుని తీసికొని యతని తల్లితో బంధించెను. ఇట్లు విప్రుడు ప్రమోదముతో వారిని తీసికొని తన యింటి కేగెను. రాణి వెళ్ళుటకు పూర్వము తన భర్తకు ప్రదక్షిణ మొనరించి యతని ముందు మోకరిల్లి కన్నీరు జలజలరాల దీన ముగ నిట్లు పలికెను. నేను పూర్వము చేసిన దానము గాని హోమముగాని బ్రాహ్మణ సంత్పరణముగాని యున్నచో దాని పుణ్యమున హరిశ్చంద్రుడు నాకు మరల భర్త యగుత. తనకు ప్రాణముల కన్న ప్రియురాలగు భార్య యట్లు తల పాదాలపై పడుట చూచి రాజు వ్యాకులచిత్తుడై అక్కట! యెంత కష్టము వచ్చెనే! యని వాపోయెను.

వియుక్తేయం కథం జాతా సత్యశీలగుణాన్వితా | పృక్షచ్ఛాయాపి వృక్షం తం న జహాతి కదాచన. 29

ఏవం భార్యాం వదిత్వాథ సుసంబద్దం పరస్పరమ్‌ | పుత్రం చ తమువాచేదం మాం త్వం హిత్వాక్వయాస్యసి. 30

కాం దిశం ప్రతియాస్వామి కో మే దుఃఖం నవారయేత్‌ | రాజ్యత్యాగే న మే దుఃఖం వనవాసే నమే ద్విజ. 31

యత్పుత్రేణ వియోగో మే ఏవ మాహ సభూపతిః | సద్బర్తృభోగ్యాది సదాలోకే భార్యా భవంతిహి. 32

మయా త్యక్తాసి కల్యాణి దుఃఖేన వినియోజితా | ఇక్ష్వాకువంశసంభూతం సర్వరాజ్యసుఖోచితమ్‌. 33

మామీదృశం పతిం ప్రాప్య దాసీభావంగతాహ్యసి | ఈదృశే మజ్జమానం మాం సుమహచ్ఛోకసాగరే. 34

కో మా ముద్ధరతే దేవి పౌరాణాఖ్యాన విస్తరైః | సూత ఉవాచ : పశ్యత స్తస్య రాజర్షేః కశాఘాతైః సుదారుణౖః. 35

ఘాతయిత్వా తు విప్రేశో నేతుం సముపచక్రమే | నీయమానౌ తు తౌ దృష్ట్వా భార్యా పుత్రౌ సపార్థివః. 36

విలలాపాతిదుఃఖార్తో నిఃశ్వస్యోష్ణం పునః పునః | యాం నవాయుర్న వా೭೭దిత్యో న చంద్రోన పృథగ్జనాః. 37

దృష్టవంతః పురా పత్నీం సేయం దాసీత్వ మాగతా | సూర్వవంశ ప్రసూతో యం సుకుమారకరాంగులిః. 38

సంప్రాప్తో విక్రయం బాలో ధిజ్‌ మామస్తు సుదుర్మతిమ్‌ | హా ప్రియే హా శిశో వత్స మమానార్యస్య దుర్ణయః 39

దైవాధీన దశాం ప్రాప్తోన మృతో స్తి తథాపి ధిక్‌ |

వ్యాస ఉవాచ : ఏవం విలపతో రాజ్ఞోగ్రే విప్రోం తర ధీయత. 40

వృక్ష గేహాదిభి స్తుంగై స్తానాదాయ త్వరాన్వితః | అత్రాంతరే మునిశ్రేష్ఠ స్త్వాజగామ మహాతపాః. 41

సశిష్యః కౌశికేంద్రోసౌ నిష్ఠురః క్రూరదర్శనః |

విశ్వామిత్ర ఉవాచ : యా త్వయోక్తా పురా రాజ న్రాజసూయస్య దక్షిణా.42

తాందదస్వ మహాబాహో : యది సత్యం పురస్కృతమ్‌.

ఒక చెట్టు నీడ చెట్టు నెన్నడును వీడదు. మఱి సత్యశీల గుణముల గల యీమె యెట్లు వియోగము చెందును. ఇట్లు భార్యతో రాగానుబంధము గల మాటలాడి పిదప రాజు తన కొడుకునుద్దేశించి యిట్లనెను : నీవు నన్ను వదిలి యెట కేగుదువు? ఇక నాకేది దిక్కు! నా దుఃఖము బాపు వాడెవడు! ఓ బ్రాహ్మణుడా! నాకు రాజ్యము వదిలనపుడు గాని వన వాసమున గాని దుఃఖము గలుగలేదు. కాని యీ పుత్త్ర వియోగమున నాకు మిక్కిలి దుఃఖము గల్గుచున్నది. లోకమున సద్బావము గల భర్త యున్నచో నతని భర్యకు సుఖము గల్గును. ఓ కల్యాణీ! ఇక్ష్వాకు వంశజాతుడు సకల రాజ్య సుఖములకు తగినవాడు దుఃఖార్తుడునైన నా వంటి రాజుచే దుఃఖితురాలవైతివి. ఇట్టి నన్ను పతిగ బొంది నీవు వేరొకనికి దాసి వైతివి. ఇట్లు నేనెంతయో శోకసాగరమున మునిగితిని. దేవి : నాకు పురాణకథలు వినిపించి నన్నుద్ధరించు వాడెవడు? అని రాజు పలికి చూచుచుండగనే విప్రుడామెను బెత్తాలతో గొట్టెను. అట్లు కొట్టుచు విప్రు డామెను కొనిపోసాగెను. అట్లు తన భార్యాపుత్రులు కొనిపోబడుట రాజు చూచెను. రాజు దుఃఖార్తితో వేడి నిట్టూర్పులు నిగుడించుచు భోరున నేడ్చెను. నా భార్యను వాయువు గాని సూర్యుడు గాని చంద్రుడు గాని ఇతరులు గాని చూడజాలరు. అట్టి చూడబడని నా భార్యనేడొకనికి దాసియయ్యెనే! అకట! ఈ సుకుమారుడు సూర్యవంశజుడు-మెత్తని చేతి వ్రేళ్ళుగలాడు-ఇట్టి బాలుడమ్ముడు పోయెనే! నేనెంత దుర్మతిని. వ్యర్థుడను: ఓ ప్రియురాలా: ఓ కుమారకా! అనార్యుడనగు నా వలన మీ కెం దుర్గతి వచ్చెనే! దైవము వలన నింతటి దుర్దశ బొందియును నేను చావకున్నానే అని రాజు విలపించుచుండగనే విప్రుడు అదృశ్యుడయ్యెను. ఇట్లువిప్రుడు పొడవైన చెట్లు మేడలు దాని వారినిగొని త్వరగవెళ్ళెను. అంతలో మహాతపుడగు విశ్వామిత్రుడచటి కేతెంచెను. అతడు క్రూరమైన చూపులతో నిష్టురముగ శిష్యులను వెంటగొని వచ్చెను. విశ్వామిత్రు డిట్లనెను: ఓ రాజా! మున్ను నీవు రాజసూయ దక్షిణ యిత్తునని మాటయిచ్చితివి. ఓ మహానుభావా! నీవు సత్యవంతుడవైనచో దక్షిణ యిమ్ము.

హరిశ్చంద్ర ఉవాచ : నమస్కరోమి రాజర్షే గృహాణమాం స్వదక్షిణామ్‌ | 43

రాజసూయస్య యాగస్య యా మయోక్తా పురానఘ |

విశ్వామిత్ర ఉవాచ : కుతోలబ్ద మిదం ద్రవ్యం దక్షిణార్థే ప్రదీయతే. 44

ఏతదాచక్ష్వ రాజేంద్ర యథా ద్రవ్యం త్వయార్జితమ్‌ | రాజోవాచ : కిమనేన మహాభాగ కథితేన తవానఘ. 45

శోకస్తు వర్ధతే విప్ర శ్రుతేనానేన సువ్రత | ఋషిరువాచ : అశ స్తం నైవ గృహ్ణామి శస్తమేవ ప్రయచ్ఛ మే. 46

ద్రవ్యస్యాగమనం రాజన్కథయస్వ యథాతథమ్‌ |

రాజోవాచ : మయా దేవీ తు సా భార్యా విక్రీతా కోటి సమ్మితైః. 47

నిషై#్కః పుత్రో రోహితాఖ్యో విక్రీతోర్బుదసంఖ్యయా | విపై#్రకాదశ కోటి స్త్వం సువర్ణస్య గృహాణమే. 48

సూత ఉవాచ : తద్విత్తం స్వల్పమాలక్ష్య దారవిక్రయ సంభవమ్‌ |

శోకాభిభూతం రాజానం కుపితః కౌశికోబ్రవీత్‌. 49

రాజసూయస్య యజ్ఞస్య నైషా భవతి దక్షిణా | అన్య దుత్పాదయ క్షిప్రం సంపూర్ణా యేన సా భ##వేత్‌. 50

క్షత్రబంధో మమేయాం త్వం సదృశీం యది దక్షిణామ్‌ | మన్యసే త్హరి తత్షిప్రం పశ్యత్వం మే పరం బలమ్‌. 51

తపసోస్య సుత ప్తస్య బ్రాహ్మణస్యా మలస్య చ | మత్పృభావస్య చోగ్రస్య శుద్ధస్యాధ్యయనస్య చ. 52

రాజోవాచ : అన్యద్దాస్యామి భగవన్కాలః కశ్చిత్పృతీక్ష్యతామ్‌ | అధునైవాస్తి విక్రీతా పత్నీ పుత్రశ్చ బాలకః. 53

విశ్వామిత్ర ఉవాచ : చతుర్బాగః స్థితో యోయం దివసస్య నరాధిప |

ఏష ఏవ ప్రతీక్ష్యో మే వక్తవ్యం నోత్తరం త్వయా. 54

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధే ద్వావింశోధ్యాయః.

హరిశ్చంద్రు డిట్లనెను. రాజర్షీ! నీకు నమస్కారము ఈ దక్షిణ స్వీకరింపుము. అనఘా మునుపు నేను రాజ సూయ యాగమునకు దక్షిణ యిత్తునంటిని. విశ్వామిత్రు డిట్లనెను. ఈ దక్షిణగ నిచ్చు ధన మెచట లభించెను. రాజేంద్రా ! నీ వెట్లు ధనము గడించితివో నాకు తెల్పుము. రాజిట్లనెను. అనఘా! మహానుభావా! దానిని గూర్చి చెప్పుటేల! సువ్రతా! విప్రా! దానిని వినిన కొలది శోకమే పెల్లుబుకుచుండును. ఋషి యిట్లనెను. నేను న్యాయార్జితమైన ధనమే గ్రహింతునుగాని అన్యాయార్జితమును గ్రహింపను. రాజా! ఈ ధనమెట్లు వచ్చెనో నిజము తెలుపుము. రాజిట్లనెను. నా భార్యను కోటి సువర్ణముల కమ్మితిమి. నా రోహితుడను కొడు కర్బదమున కమ్ముడుపోయెను. విప్రా ! నీవీ పదునొకండు కొట్ల సువర్ణము గ్రహింపుము. సూతుడిట్లనెను. భార్యాపుత్రుల నమ్మి సంపాదించిన ధనము స్వల్పమైనది. అని ముని పలుకగనే రాజుమఱల శోక సంతప్తు డయ్యెను. ముని కోపించి యిట్లనెను. ఇది రాజసూయ యజ్ఞమునకు దక్షిణ గాదు. ఇంక కొంత సంపాదింపుము. దానివలన దక్షిణ పూర్తిగా గలదు. ఓరీ! క్షత్రియాధమా! ఈ నీ ధనము దక్షిణకు సరిపోవువని తలతువేని వెంటనే నా తపోబలము చూతువుగానిలే. నా నిర్మల తపోవీర్యము-బ్రాహ్మణ ప్రభావము-అధ్యయన బలము-నాశక్తి చూతు గానిలే! రాజిట్లనెను. ఓ భగవానుడా! నీ కింకను ధన మీయగలను. కొంతకాల మోపిక పట్టుము. ఇపుడే నా భార్యాపుత్రుల నమ్మితిని గదా! విశ్వామిత్రు డిట్లనెను. ఓ రాజా! దినము లోని నాల్గవ భాగము మాత్రకు నేనెదురు చూడవలసియున్నది. అది గడచిన పిదప నీతో బలుకవలసిన పని నాకు లేదు.

ఇది శ్రీదేవీ భాగవత మహా పురాణ మందలి సప్తమాధ్యాయమున నిరువదిరెండవ యధ్యాయము

Sri Devi Bagavatham-2    Chapters