Sri Devi Bagavatham-2    Chapters   

అథషష్టో ధ్యాయః

సూత ఉవాచ ః శ్రీశస్యపచనాద్దేవాః సంతుషాః సర్వ ఏవహి | ప్రసన్నమనసో భూత్వా పునరేనం సమూచిరే. 1

దేవా ఊసుః దేవ దేవ మహవిష్ణో స్వష్టి స్థిత్యంతకారణ | విష్ణో వింధ్యనగోర్కస్య మార్గరోధం కరోతిహి. 2

తేన భానునిరోధేన సర్వ ఏవ మహావిభో | అలబ్ధ భోగభాగాహి కింకుర్మః కుత్ర యామహి. 3

శ్రీ భగవానువాచ : యా కర్త్రీ సర్వజగతా మాద్యా చ కులవర్ధనీ | దేవీ భగవతీ తస్యాః పూజకః పరమద్యుతి ః. 4

అగస్త్యో మునివర్యోసౌ వారాణస్యాం సమాసతే | తత్తేజోవంచకోగస్త్యో భవిష్యతి సురోత్తమాః 5

తం ప్రసాద్య ద్విజవర మగస్త్యం పరమౌజసమ్‌ | యాచధ్వం విబుధాః కాశీం గత్వా నిః శ్రేయసః పదమ్‌. 6

సూత ఉవాచ ః ఏవం సముప దిష్టాస్తే విష్ణునా విబుధోత్తమా ః | ప్రతీతాః ప్రణతాః సర్వే జగ్ము ర్వారాణసీం పురీమ్‌. 7

క్షణన విబుధ శ్రేష్ఠా గత్వా కాశీపురీం శుభామ్‌ | మణికర్ణీం సమాప్లుత్య సచైలం భక్తి సంయుతాః 8

సంతర్ప్య దేవాం శ్చ పితౄ న్దత్త్వా దానం విధానతః | ఆగత్యముని వర్యస్య చాశ్రమం పరమం మహత్‌. 9

ప్రశాంత శ్వాపదాకీర్ణం నానా పాదపసంకులమ్‌ | మయూరైః సారసైర్హం సై శ్చ క్రవాకైరు పాశ్రితమ్‌. 10

మహావరాహైః కోలై శ్చ వ్యాఘ్రైః శార్ధూలకైరపి | మృగైరురుభిరత్యర్ధం ఖడ్గైః శరభ##కైరపి. 11

సమాశ్రితం పరమయా లక్ష్మ్యా మునివరం తదా | దండవత్పతితాః సర్వే ప్రణము శ్చ పునః పునః 12

దేవా ఊచుః ః జయ ద్విజగణాధీశ మాన్య పూజ్య ధరాసుర | వాతాపిబలనాశాయ సమస్తే కుంభయోనయే. 13

లోపాముద్రాపతే శ్రీమన్మిత్రావరుణసంభవ | సర్వ విద్యానిధేగస్త్య శాస్త్రయోనే నమోస్తుతే. 14

ఆరవ అధ్యాయము

శ్రీదేవీ చరితము

సూతు డిట్లనెను. ః విష్ణు వచనములకు దేవత లెల్లరును సంతోషించి ప్రసన్నులై మరల విష్ణువుతో నిట్లు పలికిరి. దేవత లిట్లనిరి ః దేవదేవా ! మహావిష్ణూ ! సృష్టి స్థిత్యం తకారణ ! విష్ణూ! వింధ్యగిరి సూర్యుని త్రోవ కడ్డముగ నిలిచి కదలుట లేదు. మహావిభూ ! భాస్కరుని గమన మాగిపోవుట వలన మాకు హవిర్బాగములు లభించుటలేదు. ఇపుడేమి చేతుము ? ఎక్కడికేగుదుము ? శ్రీ భగవాను డిట్లనెను. ః సకల జగముల సృష్టికర్త్రి- ఆద్య- కులవర్ధిని-దేవి- భగవతి. ఆమెను పూజించువాడు గొప్ప శక్తిమంతుడు. అట్టి శక్తిగలవాడు. ఆగస్త్య మహాముని- అతడు కాశిలో నవిసించుచున్నాడు. సురసత్తములారా ! వింధ్య గర్వ మణచగలవా డగస్త్యుడు మాత్రమే. పరమ తేజస్వి-ద్విజవర్యుడు నగు అగస్త్యమునిని సంతోషపెట్టుడు. దేవతలారా ! మీరు మోక్షప్రదమైన కాశి కేగి యతనని యాచింపుడు. సూతు డిట్లనెను. ః ఇట్లు హరి హితవు చెప్పగ దేవతలు హరికి సవినయముగ నమస్కరించి కాశీపురికి జనిరి. అట్లు విబుధులు క్షణములోనేపవిత్ర కాశీపురి కరిగి మణికర్ణికా ఘట్టమున భక్తితో సచేలముగ స్నాన మాడిరి. వారు పితృదేవతలకు తర్పణము లిచ్చి దానధర్మము లొసంగి పరమంబైన మున్యాశ్రమమున కేగిరి. ఆ యాశ్రమము పెక్కు వన్య జంతువులతో నిండియు ప్రశాంతముగ నలరుచుండెను. అందుపలు విధములైన వృక్షములును గలవు. నెమళ్ళు రాయంచలు చక్రవాకములు సారసముల మహావరాహములు పందులు పెద్దపులులు శరభ శార్దూలములు ఖడ్గమృగములు మృగములు అన్ని జంతువులు నచట ఆశ్రమము నాశ్రయించి యుండెను. మునివరుడు ప్రశాంతితో ప్రసన్నుడై యలరారుచుండెను. దేవతలు మునిని దర్శించి దండప్రణామము లాచరించిరి. దేవతలిట్లనిరి: బ్రాహ్మణోత్తమా ! మాన్య-పూజ్య విప్రవర్యా ! కుంభసంభవా ! వాతాపి బలనాశకా ! నీకు నమస్కారములు. లోపాముద్రావతీ! శ్రీమిత్రావరుణ సంభవా ! సర్వ విద్యానిధీ! శాస్త్రవేది! అగస్త్య మహర్షీ! నీకునమస్కారములు.

యస్యోదయే ప్రసన్నాని భవంత్యు జ్జ్వల భాంజ్యపి | తోయాని తోయరాశీనాం తసై#్మతుభ్యం నమోస్తుతే. 15

కాశపుష్పవికాసాయ లంకావాసప్రియాయ చ | జటామండల యుక్తాయ సశిష్యాయ నమోస్తుతే. 16

జయ సర్వా మరస్తవ్య గుణరాశే మహామునే | వరిష్ఠాయ చ పూజ్యాయ సస్త్రీకాయ నమోస్తుతే. 17

ప్రసాదః క్రియాతాం స్వామి న్వయం త్వాం శరణం గతాః | దుస్తరా చ్చైలజా ద్దుఃఖాత్పీడితాః పరమద్యుతే. 18

ఇత్యేవం సం స్తుతోగస్త్యో మునిః పరమధార్మికః | ప్రాహ ప్రసన్నయా వాచా విహసన్ద్విజసత్తమః. 19

మునిరువాచ ః భవంత ః పరమశ్రేష్ఠా దేవా స్త్రీ భువనేశ్వరాః | లోకపాలా మహాత్మానో నిగ్రహానుగ్రహక్షమాః 20

యో మరావత్య ధీశానః కులిశం యస్య చా೭೭యుధమ్‌ | సిద్ధ్యష్టకం చ యద్ద్వారి సశక్రో మరుతాంపతిః 21

వైశ్వానరః కృశానుర్హి హవ్యకవ్య వహోనిశమ్‌ | ముఖం సర్వామరాణాం హి సోగ్నిః కిం ః తస్య దుష్కరమ్‌. 22

రక్షగణాధిపో భానుః సర్వేషాం కర్మ సాక్షికః | దండవ్యగ్రకరో దేవః కిం తస్యాసుకరం సురాః 23

తథా పి యది దేవేశాః కార్యం ముచ్చక్తి సిద్ధిభృత్‌ | ఆస్తి చే దుచ్చతాం దేవా ః కరిష్యామి న సంశయః 24

ఏవం మునివరేణోక్తం నిశమ్య విబుధర్షభాః | ప్రతీతాః ప్రణయోద్విగ్నాః కార్య నిజగదు ర్నిజమ్‌. 25

మహర్షే వింధ్యగిరిణా నిరుద్ధోర్కవినిర్గమః | త్రైలోక్యం తేన సంవిష్టం హాహాభృత మచేతనమ్‌. 26

తద్వృద్ధిం స్తంభయ మునే నిజయా తపసః శ్రియా | భవత స్తేజ సాగస్త్య నూనం నమ్రో భవిష్యతి. 27

ఏత దేవాస్మదీయం చ కార్యం కర్తవ్యమస్తి హి |

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ దశమస్కంధే షష్ఠోధ్యాయః

ఎవ్వని యదయమున సాగర జలములు నిర్మలములు ప్రసన్నములగునో యట్టి పరమ మునివరుడుగు నీకు నమస్కారములు. ఱల్లుపూలు వికసింపజేయువాడవు; లంకానివాస ప్రియుడవు- జటామండలధారివి- శిష్యసమేతుడవు నీకు నమస్కారములు. ఎల్ల వేల్పులచేత పొగడబడదగిన సుగుణములు గల మునివరా! మునివరిష్ఠా! పూజ్యా! భార్యా సమేతా! నీకు నమస్కారములు స్వామీ! పరమతేజః స్వరూపా ! ప్రసన్నుడవు గమ్ము. నీకు మేము శరణాగతులము దుస్తరమైన పర్వతము వలన సంకటముల పాలైతిమి. ఇట్లు సంస్తుతింపబడిన పరమ ధార్మికుడు- ద్విజోత్తముడు నగు అగస్త్యముని నవ్వుచు ప్రసన్న వచనముల నిట్లనెనుః దేవతలారా! మీరు పరమశ్రేష్ఠులు. త్రిభువనాధీశులు-లోకపాలురు - మహాత్ములు- లోకపాలురు- నిగ్రహాను గ్రహ సమర్థులు; అమరావతీ పతి- వజ్రాయుధుడు-తన ద్వారమున అష్టసిద్ధులు గలవాడు-మరుత్పతియగు వాడు ఇంద్రుడు. హవ్య కవ్యములు వహించువాడు - దేవతలకు ముఖము వంటివాడు -నగు వైశ్వానరుడు అగు అగ్నికి సాధ్యము కాని దేమున్నది? సురలారా! రాక్షసుల కధిపతి-విశ్వకర్మసాక్షి-దండధారి- ప్రకాశవంతుడునైన దేవుని వలన కానిపని యేము న్నది ! ఐనను నా వలన గాగలపని యున్నచో తెల్పుడు. నా శక్తి కొలదినిక్కముగ మీకు సాయము చేసిపెట్టగలను. అని యగస్త్యముని పలుకగ విని దేవతలు వినయ పూర్వకముగ తమ వచ్చినపని యిట్లు విన్నవించుకొనిరి. మహర్షీ ! వింధ్య గిరి సూర్యు నడ్డగించెను. అంందుచే ముల్లోకములు హాహాకారములు చేయుచున్నవి. అగస్త్య మునీశా ! పుణ్యతపము సంపదపేర్మిచే వింధ్యగిరి పెరుగుదల గర్వము నణచి వేయుము. మీ తేజః ప్రభావమున నది తప్పక లొంగిపోగలదు. ఇది మాకు మీరు చూపవలసిన వెలుగుబాట.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమండలి దశమ స్కంధమున నారవ యధ్యాయము

Sri Devi Bagavatham-2    Chapters