Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకాదశోధ్యాయః

జనమేజయః : వసిష్ఠేన చ శప్తోసౌ త్రిశంకుర్నృపతేః సుతః | కథం శాపాద్వినిర్ముక్తస్తన్మే బ్రూహి మహామతే.

వ్యాసః : సత్యవ్రత స్తథా శప్తః పిశాచత్వ మవాప్తవాన్‌ | తస్మి న్నేవా೭೭శ్రమే తస్థౌ దేవీభక్తి పరాయణః.

కదాచి న్నృపతి స్తత్ర జప్త్వా మంత్రం నవాక్షరమ్‌ | హోమార్థం బ్రాహ్మణా న్గత్వాప్రణమ్యోవాచ భక్తితః. 3

భూమిదేవాః శృణుధ్వం వై వచనం ప్రణతస్యమే | ఋత్విజో మమ సర్వేత్ర భవంతః ప్రభవంతు హ. 4

జపస్య చ దేశాంశేన హోమః కార్యో విధానతః | భవద్బిః కార్యసిద్ధ్యర్థం వేదవిద్బిః కృపాపరైః. 5

సత్యవ్రతోహం నృపతేః పుత్రో బ్రహ్మవిదాం వరాః | కార్యం మమ విధాతవ్యం సర్వథా సుఖహేతవే. 6

తచ్ఛ్రుత్వా బ్రాహ్మణా స్తత్ర తమూచు న్నృపతేః సుతమ్‌ |

శప్తస్త్వం గురుణా ప్రాప్తం పిశాచత్వం త్వయాధునా. 7

న యాగార్హోసి తస్మా త్త్వం వేదేష్యనధి కారతః | పిశాచత్వ మను ప్రాప్తం సర్వలోకేషు గర్హితమ్‌. 8

పదునొకొండవ అధ్యాయము

త్రిశంకు వృత్తాంతము

జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా త్రిశంకురాజు వషిష్ఠునిచేత శపింపబడి తిరిగి యెట్లు శాపవిముక్తుడయ్యెనో తెల్పుము. సత్యవ్రతు డట్లు శపింపబడి పిశాచత్వమంది యదే యాశ్రమమునందు శ్రీదేవీ భక్తిపరాయణుడై యుండెను. ఆ రాజు శ్రీనవాక్షర మంత్రరాజమును జపించి భక్తితో బ్రాహ్మణులకు నమస్కరించి హోమము చేయదలచి వారి కిట్లనియెను. ఓ విప్రులారా! మీకు నమస్కారములు. నా మాట యాలింపుడు. మీరెల్లరును నేను జేయు యజ్ఞమునందు ఋత్విజులుగ నుండుడు. చెయింపుడు నేను రాజును. నా పేరు సత్యవ్రతుడు మీరు బ్రహ్మ విద్వరులు. నా సుఖముగోరి మరునా హోమము మీరు దయాపరులు-వేదవిదులు. నేను దేవీ మంత్రజప మొనరించితిని. కనుక కార్యసిద్ది కొఱకు నా జపములోనిదశాంశము హోమము యథావిథిగ జరిపింపుడు. అను మాటలువిని బ్రాహ్మణులు రాకొమరున కిట్లనిరి: నిన్ను గురుడు పిశాచత్వముబొందు మని శపించెను. కనుక నీవు యాగము చేయుటకు తగవు. నీకు వేదమం దధికారము లేదు. నీవు పిశాచత్వమంది లోక మందు నిందలు పొందితివి.

తన్నిశమ్య వచస్తేషాం రాజా దుఃఖమవాప హ | ధి గ్జీవిత మిదం మేద్య కిం కరోమి వనే స్థితః. 9

పిత్రా చాహం పరిత్యక్తః శప్తశ్చ గురుణా భృశమ్‌ | రాజ్యా ద్ర్బష్టః పిశాచత్వ మను ప్రాప్తః కరోమికిమ్‌.

తదా పృథుతరాం కృత్వా చితాం కాష్ఠైర్నృపాత్మజః | సస్మార చండికాం దేవీం ప్రవేశ మను చింతయన్‌. 11

స్మృత్వా దేవీం మహామాయాంచితాం ప్రజ్వలితాం పురః | కృత్వా స్నాత్వా ప్రవేశార్థం స్థితః ప్రాంజలి రగ్రతః.

జ్ఞాత్వా భగవతీ తంతు మర్తుకామం మహీపతిమ్‌ | ఆజగామ తదాకాశం ప్రత్యక్షం తస్య చాగ్రతః. 13

దత్త్వాథ దర్శనం దేవీ తమువాచ నృపాత్మజమ్‌ | సింహారుఢా మహారాజ మేఘగంభీరయా గిరా. 14

కిం తే వ్యవసితం సాధో హుతాశే మా తనుం త్యజ | స్థిరోభవ మహాభాగ పితా తే జరసాన్వితః. 15

రాజ్యం దత్త్వా వనే తుభ్యం గంతాస్తి తపసే కిల | విషాదం త్యజ హే వీర పరశ్వోహని భూపతే. 16

నేతుం త్వా మాగమిష్యంతి సచివాశ్చ పితుస్తవ | మత్త్రసాదా త్పి తా చత్వా మభిషిచ్య నృపాననే. 17

జిత్వా కామం బ్రహ్మలోకం గమిష్యత్యేష నిశ్చయః | ఇత్యుక్త్వాతం తదాదేవీ తత్రైవాంతరధీయత. 18

రాజపుత్రో విరమితో మరణా త్పావకా త్తతః | అయోధ్యా యాం తదాగత్య నారదేన మహాత్మనా. 19

వృత్తాంతః కథితః సర్వో రాజ్ఞే సత్వరమాదితః | శ్రుత్వా రాజాథ పుత్రస్య తం తథా మరణోద్యమమ్‌. 20

అను వారి మాటలువిని రాజు దుఃఖ మొందెను. ఇక నా జీవితము వ్యర్థము. ఈ వనమం దింక నేనేమి చేయగలను! తండ్రిచే విడువబడితిని. గురునిచే శపింపబడితిని. రాజ్యభ్రష్టత్వము-పిశాచత్వము-పొందితిని. ఇపుడేమి చేతును అని తలచి యా రాకుమారుడు కట్టెలతో పెద్ద చిత పేర్చి యందు ప్రవేశింపదలచి శ్రీచండికాదేవిని నెమ్మది తలంచెను. అతడు చితకు నిప్పంటించి స్నానముచేసి చితకెదురుగ దోసిలొగ్గి నిలుచుండి శ్రీమహామాయాదేవినిని సంస్మరించెను. చావనున్న రాజు భావమెఱిగి శ్రీభగవతీదేవి యాకాశమార్గమున నేతెంచి ప్రత్యక్షమయ్యెను. రాజా! శ్రీదేవి రాజకుమారునకు సింహారూఢయై దర్శనమిచ్చి మేఘమువలె గంభీరవాక్కుల నిట్లనియెను. మహాత్మా! సాధూ! నీ వేమి తలంచితివి? నీవీ మంటలలో దుముకవలదు. నీ తండ్రి ముసలివాడు. కనుక స్థిరచిత్తముతో నుండుము. నీ తండ్రి నీకు రాజ్య మప్పగించి తపమున కడవుల కేగదలచెను. వీరా! విచారము వదలుము. ఎల్లుండి నీ యింటికే జేరుము. నా దయవలన మంత్రులు నిన్ను గొనిపోవుటకు రాగలరు. నీ తండ్రి నిన్ను సింహాసనమున నభిషేకించును. పిదప నీ తండ్రి కామము జయించి ధ్రువముగ బ్రహ్మ సాలోక్యమందును. అని దేవి పలికి యచటనే యంతర్థాన మొందెను. అపుడు రాజపుత్రు డగ్నిచే మరణము తప్పించుకొని యయోధ్యానగరమేగెను. మహాత్ముడగు నారదు డంతయు నెఱిగెను. అతడు జరిగిన దంతయు నరుణునకు వేగిరమే తెలిపెను. తన కొడుకు చావతలంచుట విని రాజు దుఃఖించెను.

ఖేదమాధాయ మనసి శుశోచ బహుధా నృపః | సచివానాహ ధర్మాత్మా పుత్రశోక పరిప్లుతః. 21

జ్ఞాతం భవద్బి రత్యుగ్రం పుత్రస్య మమ చేష్టితమ్‌ | త్యక్తో మయా వనే ధీమా న్పుత్రః సత్యవ్రతో మమ. 22

ఆజ్ఞయాసౌ గతః సద్యో రాజ్యార్హః పరమార్థవిత్‌ | స్థిత స్తత్రైవ విజనే ధనహీనః క్షమాన్వితః. 23

వసిష్ఠేన తథా శప్తః పిశాచసదృశః కృతః | సోద్య దుఃఖేన సంతః ప్రవేష్టుం చ హుతాశనమ్‌. 24

ఉద్యతః శ్రీమహాదేవ్యా నిషిద్దః సంస్థితః పునః | తస్మా ద్గచ్చంతు తం శీఘ్ర జ్యేష్ఠపుత్రం మహాబలమ్‌. 25

అశ్వాస్య వచనై రత్ర తరసై వానయం త్విహ | అభిషిచ్య సుతం రాజ్యే ఔరసం పాలన లక్షమమ్‌. 26

వనం యాస్వామి శాంతోహం తపసే కృతనిశ్చయః | ఇత్యుక్త్యా మంత్రిణః సర్వా న్ర్పేషయామాస పార్థివః.

తసై#్యవా೭೭న యనార్థం హి ప్రీతి ప్రవణమానసః | తే గత్వా తం సమాశ్వాస్య మంత్రిణః పార్థివాత్మజమ్‌. 28

అయోధ్యాయాం మహాత్మానం మానపూర్వం సమానయన్‌ | దృష్ట్వా దస్యవ్రతంరాజా దుర్బలం మలినాంబరమ్‌.

జటాజూటధరం క్రూరం చింతాతుర మచింతయత్‌ | కిం కృతం నిష్ఠురం కర్మ మయా పుత్రో వివా సితః. 30

రాజ్యార్హ శ్చాతిమేధావీ జానతా ధర్మనిశ్చయమ్‌ | ఇతి సంచింత్య మనసా తమాలింగ్య మహీపతిః. 31

ధర్మాత్ముడగు రాజు పుత్రశోకములో మునిగి మనసులో పరిపరి విధముల చింతించి మంత్రులతో నిట్లు పలికెను. నేను బుద్ధిమంతుడగు నా కొడుకును వనముల కంపితిని. మీరు నా కొడుకు తలపెట్టిన మహోగ్రమైన పనిని నాకు దెలిపితిరి. నా కుమారుడు రాజ్యమునకు తగినవాడు-పరమార్థవిదుడు-విజ్ఞానశీలి. నే నా జ్ఞాపింపగనే నిర్జనవనములకేగి యోర్మితో బీదవాడై కష్టము లొందెను. అతడు వసిష్ఠునిచేత పిశాచముగ శపింపబడి భరింపరాని దుఃఖముచే నిప్పులో దుముకదలచెను. అతని దుస్సాహసమును శ్రీదేవి వారించెను. కనుక మహాబలుడగు జ్యేష్ఠపుత్రుని వేవేగ జేరవలయును. మీరు త్వరిత గతిని చల్లని మాటలతో నతని నూరడించి కొనితెండు. పరిపాలింపదగిన నా కన్నకొడుకును రాజ్యమంభిషేకింతును. పిదప నేను వనమునకేగి శాంతముగ తప మొనర్చుకొన నిశ్చయించుకొంటిని. అని రాజు తన మంత్రులను పంపెను. మంత్రులు రాకుమారుని తోడితెచ్చుటకు ప్రేమపూర్వకముగ వెళ్ళి యతనిని మంచిమాటలతో నోదార్చిరి. వారు మహాత్ముడగు రాచపట్టిని సగౌరవముగ నయోధ్యకు కొనితెచ్చిరి. సత్యవ్రతుడు కృశించి మురికిగుడ్డలు గట్టియుండెను. అతడు పెద్ద జడలుదాల్చి క్రూరముగ చింతాపరుడై యుండగ రాజు చూచి నేనెంత నిష్ఠురమైన పని చేసితినే! నా కొడుకును వెళ్లగొట్టితినే! ఇతడు రాజ్యార్హుడు- మేధావి-ధర్మనిర్ణయ మెఱిగినవాడు. అని రాజు తన కొడుకు శరీరమును కౌగిలించుకొనెను.

అసనే స్వసమీవస్థే సమాశ్వా స్యోపవేశయత్‌ | ఉపావిష్టం సుతం రాజా ప్రేమపూర్వ మువాచహ. 32

ప్రేమగద్గదయా వాచా నీతిశాస్త్రవిశారదః | పుత్ర ధర్మే మతిః కార్యా మాననీయా ముఖోద్బవాః. 33

న్యాయాగతం ధనం గ్రాహ్యం రక్షణీయాః సదా ప్రజాః | నాసత్యం క్వాపి వక్తవ్యం నామార్గే గమనం క్వచిత్‌.

శిష్టప్రోక్తం ప్రకర్తవ్యం పూజనీయా స్తపస్వినః | హంతవ్యా దస్యవః క్రూరా ఇంద్రియాణాం తథా జయః. 35

కర్తవ్యః కార్యసి ద్ధ్యర్థం రాజ్ఞా పుత్ర సదైవ హి | మంత్ర స్తు సర్వథా గోప్యః కర్తవ్యః సచివై సహ. 36

నోపేక్ష్యోల్పోపి కృతినా రిపుః నర్వాత్మనా సుత | న విశ్వసే త్పరాసక్తం సచివంచ తథా నతమ్‌. 37

చారాః సర్వత్ర యోక్తవ్యాః శత్రు మిత్రేషు సర్వథా | ధర్మే మతిః సదా కార్యా దానం దద్యాచ్చ నిత్యశః. 38

శుష్కవాదో న కర్తవ్యో దుష్టసంగం చ వర్జయేత్‌ | యష్టవ్యా వివిధా యజ్ఞాః పూజనీయా మహర్షయః. 39

న విశ్వసే త్త్య్రియ్రం క్వా పిసై#్రణం ద్యూతరతం నరమ్‌ | అత్యాదరో నకర్తవ్యోమృగయా యాం కదాచన.

ద్యూతే మద్యే తథా గేయే నూనం వారవధూషుచ | స్వయం తద్విముఖో భూయాత్ర్ప జ్రాస్తేభ్యశ్చరక్షయేత్‌. 41

బ్రాహ్మే ముహూర్తే కర్తవ్య ముత్థానం సర్వథా సదా | స్నానాదికం సర్వవిధిం విధాయ విధివత్యథా. 42

నీతి విశారదుడగు రాజు పిమ్మట తన తనయుని తన యాసనముచెంత కూర్చుండబెట్టుకొని ప్రేమగదుర నోదార్చి ప్రేమగద్గగవాక్కుల నతని కిట్లనెను. పుత్రా! ధర్మమందు బుద్ధి నిల్పుము. విప్రులు గౌరవపాత్రులు. న్యాయముగ ధనము సంపాదించవలయును. ప్రజలను కన్నబిడ్డలవలె పాలింపవలయును. ఎప్పుడు నసత్య మాడరాదు. చెడు మార్గము పట్టరాదు. తాపసులు పూజనీయులు. క్రూర దానవులను చంపవలయును. ఇంద్రియములు జయింపవలయును. రాజు కార్యసిద్ధికొఱకు మంత్రివరులతో మంత్రాంగము నెఱపవలెను. రహస్యమును వెల్లడించరాదు. కుమారకా! శత్రువు కొలది వాడైనను నుపేక్షించి యుండరాదు. ఇతరులను జేరిన మంత్రి వినయముగ నున్నను నమ్మి యుండరాదు. శత్రులను మిత్రులను చారదృష్టితో కనిపెట్టి యుండవలయును. నిత్యము దానధర్మములందు మనస్సు నిలుకడ జెందవలయును. వట్టి మాటలు కట్టిపెట్టుము. చెడు సంగతి విడిచిపెట్టుము. పెక్కులు జన్నము లొనరింపుము. మహర్షులు పూజనీయులు. ఎన్నడును స్త్రీని స్త్రీ స్వభావముగలవానిని జూదగానిని నమ్మరాదు. వేటయందు చెడ్డ తమకము తగదు. జూదము త్రాగుడు పాటలు వారవని తలు- అను విషయములందు తగుల్కొనక ప్రజలను వాని జోలికి పోనిక ఉండవలయును. తెలతెలవారక మున్నే మేల్కొన వలయును. తప్పత యథావిధిగ స్నాన సంధ్య లోమరింపవలయును.

పరాశ##క్తేః పరాంపూజాం భక్యాకుర్యాత్సు దీక్షితః | పుత్రై తజ్జనసాఫల్యం పరాశ##క్తేః పదార్చనమ్‌. 43

సకృత్కృత్యా మహాపూజాం దేవీపాదజలం పిబన్‌ | న జాతు జననీ గర్బే గచ్చేదితి వినిశ్చయః. 44

సైవ దృశ్యం మహాదేవీ ద్రష్టా సాక్షీచ సైవహి | ఇతి తద్బావభరిత స్తిష్ఠేన్నిర్బయ చేతసా. 45

కృత్వా నిత్యవిధిం సన్యగ్గంతవ్యం సదపి ద్విజాన్‌ | సమాహూయ చ ప్రష్టవ్యో ధర్మశాస్త్రవినిర్ణయః. 46

సంపూజ్య బ్రహ్మణా న్పూజ్యా న్వేందవేదాంగపారగాన్‌ | ఘోభూహిరణ్యాదికం చ దేయం పాత్రేషు సర్వదా. 47

అవిద్వా న్బ్రాహ్మణః కోపి నైవ పూజ్యః కదాచన | ఆహారాదధికం నైవ దేయం మూర్ఖాయ కర్హిచిత్‌. 48

నవా లోభా త్త్వయా పుత్ర కర్తవ్యం ధర్మలంఘనమ్‌ | అతఃపరం న కర్తవ్యం క్వచి ద్విప్రావమానమ్‌ 49

బ్రాహ్మణా భూమిదేవాశ్చ మాననీయాః ప్రయత్నతః | కారణం క్షత్రియాణాం చ ద్విజా ఏవ నసంశయః. 50

అద్బ్యోగ్ని ర్బ్రహ్మణః క్షత్రమశ్మనో లోహనుత్థితమ్‌ | తేషాం సర్వత్రగం తేజః స్వాసు యోనిషు శామ్యతి.

తస్మా ద్రాజ్ఞా విశేషేణ మాననీయా ముఖోద్బవాః | దానేన వినయేనైవ సర్వథా భుతిమిచ్ఛతా. 52

దండనీతిః సదా కార్యా ధర్మశాస్త్రానుసారతః | కోశస్య సంగహః కార్యో నూనం న్యాయాగతస్యహ. 53

ఇతిశ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే ఏకాదశోధ్యాయః.

పుత్త్రా: శ్రీపరాశక్తి పరమపూజను పరమభక్తితో దీక్షాపరత నొనర్పలయును. పరాశక్తి పదార్చనమున జన్మము తరించును. శ్రీదేవీ మహాపూజను జీవితకాలమం దొక్కసారియైన చేసి దేవీ పాదతీర్థము సేవించినవాడు మరల తల్లి గర్బము తప్పక ప్రవేశింపడు. ఆ మహాదేవియే దృశ్యము-దృష్ట-సాక్షి-అన్ని యామెయే అను నిశ్చల భావముతో నిర్బయ ముగ తన్మనస్కుడై యుండవలయును. నిత్యవిధు లొనరించి శ్రీదేవీ మహాసభలు జరిపి యందు తెలిసిన బ్రాహ్మణుల నాహ్వానించి దేవితత్త్వమును ధర్మముగూర్చి యడుగవలయును. వేదవేదాంగపారగులగు బ్రాహ్మణులను సంపూజింపవల యును. తగిన వారికి గోవులు-భూమి-బంగారము దాన మీయవలయును. చదువురాని విప్రుని పూజింపరాదు. మూర్ఖున కెప్పుడు నన్నము మాత్రము పెట్టవలయును. మరేదియు నీయరాదు. పుత్రా! ఎన్నడును లోభమువలన ధర్మమును త్రోసి పుచ్చరాదు. అన్నిటికన్న ముఖ్యముగ విప్రుల నెన్నడు నవమానింపరాదు. బ్రాహ్మణులు భూదేవతలు. వారు క్షత్రియులకు తప్పక కారణభూతులు. మఱి ఆదరణీయులు. నీటినుండి నిప్పు బ్రహ్మతేజమునుండి క్షాత్రము రాతినుండి లోహము గల్గును. ఇవి పరస్పర వైరముగలవయ్యు తమ కారణమునందే తాములయముజెందును. కనుక సుఖసంపదలు గోరుకొను రాజు తప్పక విశేషముగ వినయముతో దానములతో బ్రాహ్మణులను సేవించి గౌరవించవలయును. రాజు ధర్మశాస్త్రముసారముగ దండనీతి ప్రయోగించవలయును. న్యాయముగ ధనము గడించి నిలువ చేయవలయును.

ఇది శ్రీదేవీ భాగవతమందలి సప్తమస్కంధమున పదునొకండవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters