sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ద్వితీయోzధ్యాయః - సంతాన ప్రాప్తికై పార్వతి పరమేశ్వరుని ప్రాధేయపడుట

నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి నారదునితో ఇట్లనెను.

త్యక్త్వా రతిం మహాదేవో దదర్శ పురతః సురాన్‌ | పలాయధ్వమితి ప్రాస కృపయా పార్వతీభయాత్‌ || 1

దేవాఃపలాయితా భీతాః పార్వతీశాపహేతునా | సర్వబ్రహ్మాండసంహర్తా చకంపే పార్వతీభయాత్‌ || 2

తల్పాదుత్థాయ సా దుర్గా న చ దృష్ట్యా పురః సురాన్‌ | సముత్థితం కోపవహ్నిం స్తంభయామాస దేహతః || 3

అద్యప్రభృతి తే దేవా వ్యర్థవీర్యా భవంత్వితి | శశాప దేవీ తాన్‌ దేవాన్‌ అతిరుష్టా బభూవహ || 4

శంకరుడు రతికార్యమును వదలి ఎదురుగానున్న దేవతలను చూచి పార్వతీదేవి భయమువలన దేవతలపైగల దయతో వారిని పరుగెత్తిపొండని పలికెను. దేవతలు కూడ పార్వతీదేవి శాపము పెట్టునను భయమువలన పరుగెత్తుకొనిపోయిరి. సమస్తలోకములనన్నిటిని సంహరించు రుద్రుడు సహితము పార్వతీ దేవి శాపము పెట్టునను భయమువలన కంపించిపోయెను.

పార్వతీదేవి శయ్యపైనుండి కోపముతో లేచినది. కాని దేవతలామెకు ఎదురుగా కన్పించినందువలన తనకోపమును తనలోనే కొంతసేపు అణచుకొనెను. ఐనను కోపమును పట్టలేక దేవతలకందరకు సంతానము కలుగవద్దని శపించినది.

తతః శివః శివాం దృష్ట్వా క్రోధసంరక్తలోచనాం | రుదంతీం నమ్రవదనాం లిఖంతీం ధరణీతలం || 5

శివస్తాం దుఃఖితాం దృష్ట్వా క్రోధసంరక్తలోచనాం | హస్తే గృహీత్వా దేవేశో వాసయామాస వక్షసి || 6

అతీవభీతః సంత్రస్త ఉవాచ మధురం వచః |

పార్వతీదేవి తాను సంతానమునకు దూరమైతినను దుఃఖముతో తలవంచుకొని భూమిని తన పాదనఖాంగుష్ఠముతో వ్రాయుచుండెను. ఆమెకన్నులు కోపముతో ఎరుపెక్కినవి. బాధపడుచున్న తనభార్యను చూచి శంకరుడు ఆమెను ఓదార్చుచు ఇట్లు మధురముగా అనెను.

శంకర ఉవాచ- శంకరుడిట్లు పార్వతితోననెను.

కథం రుష్టా గిరిశ్రేష్ఠకన్యే ధన్యే మనోహరే || 7

మమ సౌభాగ్యరూపేచ ప్రామాధిష్ఠాతృదేవతే | కింతేzభీష్టం కరిష్యామి వద మాం జగదంబికే || 8

బ్రహ్మాండసంఘే నిఖిలే కిమసాధ్యమిహావయోః | అహో నిరపరాధం మాం ప్రసన్నా భవ సుందరి || 9

దైవాదజ్ఞాతదోషస్య శాంతిం మే కర్తుమర్హసి | త్వయాయుక్తః శివోzహం చ సర్వేషాం శివదాయకః || 10

త్వయా వినా హీశ్వరశ్చ శవతుల్యోzశివః సదా | ప్రకృతకిస్త్యం చ బుద్ధిస్త్యం శక్తిస్త్వం చ క్షమాదయా || 11

తుష్టిస్త్వం చ తథా పుష్ఠిః శాంతిస్త్వం క్షాంతిరేవచ | క్షుత్త్వం ఛాయా తథా నిద్రా తంద్రా శ్రద్దా సురేశ్వరి || 12

సర్వాధారస్వరూపా త్వం సర్వబీజస్వరూపిణీ | స్మితపూర్వం వద వచః సాంప్రతం సరసం శివే || 13

త్వత్కోప విషసందగ్దం ద్రుతం జీవయ మాం మృతం || 14

పర్వతశ్రేష్ఠుడగు హిమాలయునిపుత్రికా! నీవు చాలా అందమైనదానవు. నీవు నా ప్రాణములకు అధిష్ఠానదేవతవు. నాయొక్క సౌభాగ్యరూపిణివి. జగన్మాతవగు నీకోరిక ఎట్టిదైనను దానిని నాకు చెప్పినచో తీర్తును.

ఈలోకములన్నిటియందు మన ఇద్దరకు అసాధ్యమైనదేదియులేదు. నేను ఏతప్పుచేయలేదు. నన్ను కోపించుట నీకు తగదు. అందువలన నీవు నావిషయమున ప్రసన్నురాలవు కమ్ము. నేను చేసిన తప్పు ఏమో నాకు తెలియదు. నీవలననే నేను మంగళస్వరూపుడనైతిని. ఇతరులకు శుభములు కలిగించువాడనైతిని. నీవు లేనిచో నేను శవమువలె అమంగళస్వరూపుడనైయుండువాడను.

నీవు ప్రకృతిస్వరూపిణివి, బుద్దిరూపిణివి, శక్తి, క్షమ, దయ, తుష్టి, పుష్టి, శాంతి, క్షాంతి, ఆకలి, ఛాయ, నీడ, నిద్ర, అలసత, శ్రద్ధ మొదలగునవన్నియు నీరూపములే. సమస్తసృష్టికి ఆధారరూపవు, సమస్తమునకు కారణరూపవు. నీవే. ఇట్టినీవు నవ్వుచు సరసముగా నాతో సంభాషింపుము అని పరమేశ్వరుడు పార్వతీదేవితో పలికెను.

శంకరస్య వచః శ్రుత్వా క్షమాయుక్తా చ పార్వతీ | ఉవాచ మధురం దేవీ హృదయేన విదూయతా || 15

మృదుమధురమైన శంకరుని మాటలను క్షమాగుణముకల పార్వతీదేవి విని హృదయము బాధతోనున్నను మధురముగా పరమేశ్వరునితో ఇట్లు పలికినది.

పార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లు పలికెను.

కిం త్వాzహం కథయిష్యామి సర్వజ్ఞం సర్వరూపిణం | ఆత్మారామం పూర్ణకామం సర్వదేహేష్వవస్థితం || 16

కామినీ మానసం కామమప్రజ్ఞం స్వామినం వదేత్‌ | సర్వేషాం హృదయజ్ఞం చ హృదీష్టకం కథయామి కిం || 17

సుగోప్యం సర్వనారీణాం లజ్జాజననకారణం | అకథ్యమపి సర్వాసాం మహేశ కథయామి తే || 18

ఓమహేశ! నీవు సర్వము తెలిసినవాడవు. సమస్తరూపములు నీవే. నీవు ఆత్మారాముడవై యోగిగానున్నావు. నీవు సంపూర్ణకాముకుడవు.

కాముకురాలగు స్త్రీ తన మనస్సులోనున్న కోరికను తెలివితక్కువ భర్తతో నైనను చెప్పుకొనును. కాని నీవు అందరి కోరికలు గుర్తుంచువాడవు. అట్టి నీకు నామనస్సులోని కోరికను ఏమని చెప్పుకొందును. నాకోరిక చాలా రహస్యమైనది. ఇది స్త్రీలందరకు సిగ్గును కలింగించునది. ఇతరులకు చెప్పరానిది. ఐనను నీకు చెప్పెదను.

సుఖేషు మధ్యే స్త్రీణాం చ విభ##వేషు సురేశ్వర | సత్పుంసా సహ సంభోగో నిర్జనేషు పరం సుఖం || 19

తద్భంగేన చ యద్దుఃఖం తత్సమం నాస్తి చ స్త్రియాః | కాంతానాం కాంతవిచ్ఛేదశోకః పరమదారుణః || 20

కృష్ణపక్షే యథా చంద్రః క్షీయమాణో దినే దినే | తథా కాంతం వినా కాంతా క్షీణా కాంత క్షణక్షణ || 21

చింతాజ్వరశ్చ సర్వేషాముపతాపశ్చ వాససాం | సాధ్వీనాం కాంతవిచ్ఛేదస్తురగానాం చ మైథునం || 22

రతిభంగో దుఃఖమేకం ద్వితీయం వీర్యపాతనం | దుఃఖాతిరేకి దుఃఖం చ తృతీయమనపత్యతా || 23

త్రైలోక్యకాంతం కాంతం త్వాం లబ్ద్యాzపి నచ మేసుతః | యాస్త్రీపుత్రవిహీనా చ జీవనం తన్నిరర్థకం || 24

జన్మాంతరసుఖం పుణ్యం తపోదానసముద్భవం | సద్వంశజాతః పుత్రశ్చ పరత్రేzహ సుఖప్రదః || 25

ఓ పరమేశ్వర! స్త్రీలకు సమస్తసుఖములలో గొప్పనైన సుఖము ప్రియు డగు తనభర్తతో రమించుట. అది నిర్జనప్రదేశమున మరింత సుఖమును కలిగించును. అట్టి సంభోగభంగముకంటె గొప్పనైన దుఃఖము స్త్రీలకు లేనే లేదు. అట్లే భర్తృవియోగము స్త్రీలకు పరమదారుణమైనది.

చంద్రుడు కృష్ణపక్షమున ప్రతిదినము ఎట్లు క్షీణించునో భర్తలేని స్త్రీ ప్రతిక్షణము క్షీణించును. అందరకు చింత బాధాకరమైనది. బట్టలకు వేడిమి బాధాకరమైనది. అట్లే స్త్రీలకు వియోగము పరమదారుణమైనది.

సుపుత్రః స్వామినోంశశ్చ స్వామితుల్యసుఖప్రదః | కుపుత్రశ్చ కులాంగారో మనస్తాపాయ కేవలం || 26

స్వామీ స్వాంశేన సుస్త్రీణాం గర్భే జన్మ లభేత్‌ ధ్రువం | సాధ్వీ స్త్రీమాతృ తుల్యాచ సతతం హితకారిణీ || 27

అసాధ్వీ వైరితుల్యా చ శశ్వత్సంతాపదాయినీ | ముఖదుష్టా యోనిదుష్టా చాసాధ్వీతి త్రిధాస్మృతా || 28

కిముపాయం కరిష్యామి వద యోగీశ్వరేశ్వర | ఉపాయసింధో తపసాం సర్వేషాం చ ఫలప్రద || 29

మంచిపుత్రుడు తనభర్తయొక్క అంశరూపుడు. అతడు భర్తవలె సుఖమును కలిగించును. చెడ్డకొడుకు తన కులమునకు తనభార్యయొక్క గర్భమున తన అంశరూపమును పుత్రుడై పుట్టును. అట్లే పతివ్రతయగు స్త్రీ తల్లివలె ఎల్లప్పుడు తనభర్తయొక్క మేలునే కోరుచుండును. పతివ్రతకాని స్త్రీ శత్రువువలె ఎల్లప్పుడు తనభర్తకు దుఃఖమునే కలిగించుచుండును. ముఖదుష్ట (ఎల్లప్పుడు తన భర్తతో కలహము పెట్టుకొనునది) యోనిదుష్ట (జారస్త్రీ) అసాధ్వి అని దుష్టస్త్రీలు మూడువిధములుగానున్నారు.

అందువలన ఉపాయసముద్రుడవు. సమస్తతపః ఫలితములనిచ్చు ఓయోగీశ్వరేశ్వర నా బాధకు నివృత్తిమార్గమును నీవే ఉపదేశింపుమని పార్వతి పరమేశ్వరుని కోరెను.

ఇత్యుక్త్వా పార్వతీదేవీ నమ్రవక్త్రా బభూవ హ | ప్రహస్య శంకరోదేవే బోధయామాస పార్వతీం || 30

సత్పుత్రబీజం సుఖదం తాపనాశనకారణం | మితం స్నిగ్ధం సురుచిరం ప్రవక్తుముపచక్రమే || 31

పార్వతీదేవి ఇట్లు తనభర్తతో పలికి తలవంచుకుని కూర్చుండెను. అప్పుడు శంకరుడు నవ్వి పార్వతిని ఇట్లు మధురమైన భాషణములతో లాలించెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే ద్వితీయోzధ్యాయః ||

శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణమున మూడవదగు గణపతిఖండమున నారదనారాయణసంవాదములో

రెండవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters