sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

చతుష్పంచాశత్తమోzధ్యాయః - సుయజ్ఞుడు గోలోకమును చేరుకొనుట

రాజోవాచ- మహారాజిట్లనెను.

కుత్రాధారో మహావిష్ణోః సర్వాధారస్య తస్య చ | కాలభీతిస్య కతి చ కాలమాయా మునీశ్వర || 1

క్షుద్రస్య కతిచిత్కాలం బ్రహ్మణః ప్రకృతేస్తథా| మనోరింద్రస్య చంద్రస్య సూర్యస్యాయుస్తథైవ చ || 2

అన్యేషాం వై జనానాం చ ప్రాకృతానాం పరం వయః | వేదోక్తం సువిచార్యం చ వదవేదవిదాం వర|| 3

విశ్వానామూర్ధ్వబాగే చ కస్స్యాద్వా లోక ఏవసః | కథయస్య మహాభాగ సందేహచ్ఛేదనం కురు || 4

సమస్తమునకు ఆదారమైనవాడు, కాలమునకు భయముచెందు శ్రీమహావిష్ణువునకు ఆదారమేమి? కాలముయొక్క మాయ ఎంత ఉండును? క్షుద్ర విరాట్‌ స్వరూపుని ఆయుః కాలమెంత? అట్లే బ్రహ్మదేవుడు, ప్రకృతి. మనువు ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వీరి ఆయుర్దాయమెంత? అట్లే ఇతర ప్రాకృత జనుల కాలమెంత ?

విశ్వములన్నిటియొక్క పైబాగమున ఎవరున్నారు? లేక ఏలోకమున్నది? ఈ సందేహములన్నిటిని తూర్పుమని సుయజ్ఞు డడిగెను.

గోలోకో నృప విశ్వానాం విస్తృతశ్చ నబస్సమః | తథానిత్యం డంబరూపః శ్రీకృష్ణేచ్ఛా సముద్భవః || 5

జలేన పరుపూర్ణశ్చ కృష్ణస్య ముఖబిందునా | సృష్ట్యున్ముఖస్యాది సర్గే పరిశ్రాంతస్య ఖేలతః || 6

ప్రకృత్యా సహ యుక్తస్య కళయా నిజయా నృప | తత్రాధారో మహావిష్ణోః విశ్వాదారస్య విస్తృతః || 7

ప్రకృతేర్గర్భే సంయుక్త డింబోద్భూతస్య తస్య చ | సువిస్తృతే జలాదారే శయానశ్చ మహావిరాట్‌ || 8

రాధేశ్వరస్య కృష్ణస్య షోడాంశః ప్రకీర్తితః | దూర్వాదళశ్యామరూపః సస్మితశ్చ చతుర్బుజ ః || 9

వనమాలాధరః శ్రీమాన్‌ శోభితః పీతవాససా | ఊర్ధ్వం నభసి తద్విష్ణోః నిత్యవైకుంఠ ఏవచ || 10

సమస్త విశ్వములకు పైబాగమున గోలోకమున్నది. ఆది ఆకాశమువలె చాలా విశాలమైనది. శ్రీకృష్ణుని యొక్క ఇచ్ఛననుసరించి ఏర్పడినది. ఆ గోలోకము అండరూపముననుండును. శ్రీకృష్ణుడు ప్రకృతితో కలసి సృష్టిచేయవలెనని అనుకొన్నప్పుడు క్రీడయందు అసలిపోయిన ఆ పరమాత్మయొక్క ముఖమున ఏర్పడిన జలబిందువే జలరాశిగా ఏర్పడి గోలోకమున దాని క్రిందనున్న ఇతరలోకములలోను వ్యాపించినది.

ప్రకృతి యొక్క గర్భముతో కలిసిన (పుట్టిన) అండమునుండి పుట్టిన విశ్వమునకు ఆధారమైన శ్రీమహావిష్ణువునకు పైన పేర్కొనబడ్డ గోలోకము ఆదారమగుచున్నది. ఆ శ్రీమహావిష్ణువే మహావిరాట్‌ రూపుడు. అతడు అతివిశాలమైన జలముపై పవళించియుండును. ఆ మహావిరాడ్రూపుడు రాధేశ్వరుడగు శ్రీకృష్ణునియొక్క పదునారవ అంశభాగము, ఆ మహావిష్ణువు . గడ్డిపరక వలె నల్లని రూపముననుండును. అతనికి నాల్గు భుజములుండును. అతడు వనమాలను, పీతాంబరమును ధరించియుండును. అతడుండు నిత్యవైకుంఠము అన్ని విశ్వములపైన నుండును.

ఆత్మాzకాశసమోనిత్యో విస్తృతశ్చంద్రబింబవత్‌ | ఈశ్వరేచ్ఛాసముద్భూతో నిర్లక్ష్యశ్చ నిరాశ్రయః || 11

ఆకాశవత్సువిస్తారో రత్నౌఘైశ్చ వినిర్మితః | తత్ర నారాయణః శ్రీమాన్‌ వనమాలీ చతుర్భుజః || 12

లక్ష్మీ సరస్వతీ గంగా తులసీపతిరీశ్వరః | సునందనంద కుముదపార్షదాదిభి రావృతః || 13

సర్వేశః సర్వసిద్ధేశో భక్తాముగ్రహవిగ్రహః | శ్రీకృష్ణశ్చ ద్విధాభూతో ద్విభుజశ్చ చతుర్భుజః || 14

చతుర్భుజశ్చ వైకుంఠే గోలోకే ద్వీభుజః స్వయం | ఊర్ద్వం వైకుంఠలోకాచ్చ పంచాశత్కోటి యోజనాత్‌ || 15

శ్రీమహావిష్ణువు నివసించు వైకుంఠము ఆత్మవలె నిత్యమైనది. ఆకాశమువలె విస్తారమైనది. చంద్రబింబమువలె ప్రకాశించునది. ఆలోకము శ్రీకృష్ణపరమాత్మయొక్క ఇచ్ఛవలన ఏర్పడినది. అది నిర్లక్ష్యము. దానికి ఆశ్రయముగా ఇతర లోకములు లేవు. ఆ లోకముననున్న నిర్మాణములన్నియు రత్నములచే చేయబడినవి.

ఆ వైకుంఠమున నాలుగు భుజములు కలవాడు, వనమాలాధరుడుగు శ్రీమహావిష్ణువుండును. అతనికి లక్ష్మీదేవి, సరస్వతి, గంగ, తులసి అను నలుగురు భార్యలు. అతని దగ్గర సునంద నంద, కుముద ,మొదలగు అనుచరులుందురు.

సర్వేశ్వరుడు, సర్వసిద్ధులను కలిగించువాడు, భక్తులను సదా అనుగ్రహీంచువాడగు శ్రీకృష్ణపరమాత్మ తమ ఇచ్ఛవలన ద్విభుజుడుగా, చతుర్భుజుడుగా రెండు రూపములను ధరించెను. చతుర్భుజుడగు శ్రీమహావిష్ణువు వైకుంఠముననుండగా ద్విభుజుడైన శ్రీకృష్ణ పరమాత్మ గోలోకముననే ఉండెను.

గోలోకో వర్తులాకారః వరిష్ఠస్సర్వలోకతః | అమూల్య రత్నఖచితైః మందిరైశ్చ విభూషితః ||16

రత్నేంద్రసారఖచితైః స్తంభసోపాన చిత్రితైః | మణీంద్రదర్పణా సక్తైః కపాటైః కలశోజ్వలైః || 17

నానాచిత్రవిచిత్రైశ్చ శిబిరైశ్చ విరాజితః కోటియోజన విస్తీర్ణో దైర్ఘ్యై శతగుణస్తథా || 18

సరిదర్ధ ప్రమాణన దైర్ఘ్యైణ చ తతేన చ | శైలార్ధ పరిమాణన యుక్తో బృందావనేన చ || 19

తదర్ధమాన విలస ద్రాసమండల మండితః | సరిచ్ఛైల వనాదీనాం మధ్యే గోలోక ఏవ చ || 20

యథా పంకజమధ్యే చ కర్ణికా సుమనోహరా ||

వైకుంఠలోకముపైన యాభై కోట్ల యోజనముల దూరమున గోలోకమున్నది. అది అన్ని లోకములకంటే గొప్పనిది. ఆ లోకము వర్తులముగా నుండును. ఆ లోకమున అమూల్య రత్నములచే నిర్మింపబడిన మందిరములున్నవి. అచ్చటి స్తంభములు, మెట్లు కూడ మణులచేతనే నిర్మింపబడినవి. ద్వారములకు మణిదర్పణములుండును. భవమువపై అనేక కలశములుండును. అట్లే అనేక చిత్ర విచిత్రములైన శిబిరములచట కలవు. అ లోకము కోటియోజన విస్తీర్ణనై దానికి నూరురెట్లున్న పొడవుతో నుండును. అచ్చట విరజ అనునదియు శతశృంగమను పర్వతమున్నది. విరజానదియొక్క పొడవులో సగము, శతశృంగపర్వతముయొక్క వైశాల్యములో సగభాగమున్న పొడవు వైశాస్యములు కల బృందావనము కలదు. ఆ బృందావనములో దీర్ఘవైశాల్యములలో సగమున్న రాసమండలము కలదు.

పద్మము యొక్క మద్యనున్న కర్ణికవలె విరజానది శతశృంగపర్వతము బృందావనముల మధ్య గోలోకమున్నది. తత్ర గోగోపగోపీభిః గోపీశో రాసమండలే || 21

రాసేశ్వర్యా రాధికయా సంయుక్తః సంతతం నృప | ద్విభుజో మురళీహస్తః శిశుర్గోపాలరూపధృక్‌ || 22

వహ్నిశుద్ధాంశుకాధానో రత్నభూషణ భూషితః | చంద్రనోత్‌ క్షితసర్వాంగో రత్నమాలా విరాజితః ||23

రత్నసింహాసనస్థశ్చ రత్నచ్ఛత్రేణ శోభితః | తథా సప్రియగోపాలైః సేవితః శ్వేత చామరై ః || 24

భూషితాభిశ్చ గోపీభిః మాలాచందన చర్చితః | సస్మితః సకటాక్షాభిః సువేషాభిశ్చ వీక్షితః ||25

గోలోకమున గోవులు, గొల్లలు, గోపికలతో, రాసేశ్వరియగు రాధికాదేవితో శ్రీకృష్ణుడుండును. అతడు రెండు భుజములు కలిగి గోపాలరూపముననుండును. అట్లే పరిశుద్ధమైన వస్త్రము, రత్నభూషణములు ధరించిన, శరీరమునందంతయు చందనమును పూసికొని, రత్నముల మాల ధరించియుండును. అట్లే అతడు అచ్చట రత్నసింహసనమున, రత్నచ్ఛత్రము క్రింద తనకు మిక్కిలి ప్రియమైన గొల్లలు సేవించుచుండగా, గోపికలు చామరములు వీయుచుండగా కూర్చొనియుండును. గోపికాస్త్రీలు చక్కగ అలంకరించుకొని చిరునవ్వుతో ఆ పరమాత్ముని చూచుచుందురు.

కథితో లోకవిస్తారో యథాశక్తి యథాగమం | యథాశ్రుతం శంభువక్త్రాత్‌ కాలమానం నిశామయ || 26

సుయజ్ఞమహారాజ! లోకములకు సంబంధించిన విషయమును ఆగమ శాస్త్రమున చెప్పిన విధముగా పరమేశ్వరుడు నాకు చెప్పిన దానిని నాశక్తికి తగినట్లు చెప్పితిని . ఇక కాలప్రమాణమును వినుమని బ్రాహ్మణుడనెను.

పాత్రం షట్పలసంభూతం గభీరం చతురంగుళం || 27

స్వర్ణమాషకృతచ్ఛిద్రం దండైశ్చ చతురంగుళైః | యావజ్జలప్లుతం పాత్రం తత్కాలం దండమేవ చ || 28

దండద్వయం ముహుర్తం చ యామస్తస్య చతుష్టయం | వాసరశ్చాష్టభుర్యామైః పక్షసై#్తర్దశ పంచభిః || 29

మాసో ద్వాఖ్యాం చ పక్షాఖ్యాం వర్షం ద్వాదశ మాసకైః | మాసేన వై నరాణాం చ పితౄణాం తదహర్నిశం || 30

కృష్ణపక్షే దినం ప్రోక్తం శుక్లే రాత్రిః ప్రకీర్తితా| వత్సరేణ నరాణాం చ దేవతానాం దివానిశం || 31

అయనం హ్యుత్తరమహో రాత్రిర్వై దక్షీణాయనం | యుగకర్మానురూపం చ నరాదీనాం వయోనృప || 32

ఆరు పలముల బరువుగల పాత్రను తీసికొనవలెను. ఆ పాత్ర యొక్క లోతు నాలుగంగుళములుండవలెను. దానికి మాసమెత్తు బంగారముచే చేసిన కడ్డీతో సన్నని రంధ్రము నేర్పరుపవలెను. అట్లే నాలుగంగుళములు పొడవైన నాలుగు కడ్డీల నుండవలెను. రంధ్రమునుండి జారిపడు నీటివలన నీటిలోనున్న పాత్ర ఎప్పుడు మునుగునో ఆ సమయమున దండమని పిలుతురు. అటువంటి రెండు దండముల సమయమును ముహూర్తమందురు. అట్టి ముహుర్తములు నాల్గైనచో ఒక యామమందురు. ఎనిమిది యామములు కాలము ఒక దినమగును. పదునైదు దినములు ఒక పక్షమగును. రెండు పక్షములు ఒక మాసమగును. ఇది పితృదేవతలకు ఒక దినమగును.వారికి కృష్ణపక్షము పగలు శుక్లపక్షము రాత్రి. మాలవుల సంవత్సరము దేవతలకు దినమగును. ఉత్తరాయణము వారికి పగలు. దక్షిణాయనము వారికి రాత్రి కాలము. మానవులు మొదలగు జీవులకు యుగధర్మమును, వారివారి కర్మలననుసరించి వయస్సుండును.

ప్రకృతేః ప్రాకృతానాం చ బ్రహ్మాదీనాం నిశామయ | కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగం || 33

దివ్యైః ద్వాదశసాహసై#్రః సావధానం నీశామయ | చత్వాం త్రీణిచ ద్వ్యేకం సహస్రాణి కృతాదికం || 34

తేషాం చ సంధ్యాసంధ్యాంశౌ ద్వేసహస్రే ప్రకీర్తితే | త్రిచత్వారింశ##కైర్ణక్షైస్సవింశతి సహస్తకైః || 35

చతుర్యుగం పరిమితం నరమానక్రమేణ చ | లక్షైశ్చ సప్త దశభిః సాష్టవింశసహస్రకైః || 36

కృతం యుగం నృమానేన సంఖ్యావిద్భిః ప్రకీర్తితం | సహసై#్రః షణ్ణవతిభిర్లక్షై ర్ద్వాదశభిస్సహ || 37

త్రేతాయుగం పరిమితం కాలవిద్భిః ప్రకీర్తితం| అష్టలక్షైస్సహమితం చతుష్షష్టి సహస్రకం || 38

పరిమాణం ద్వాపరస్య సంక్యావిద్భిరితీరితం | సద్వాత్రింశత్సహసై#్రశ్చ చతుర్లక్షైశ్చ వత్సరైః ||

నృమానాద్వా కలియుగం విదుః కాలవిదో బుధాః || 39

తత్ర సప్త చ వారా వై తిథియః షోడశస్మృతాః | దివారాత్ర్యశ్చ పక్షౌద్వౌ మాసో వర్షం చ నిర్మితం || 40

ప్రకృతి , ప్రాకృతులగువారు, బ్రహ్మాదిదేవతల ఆయుస్సును గురించి వినిము.

కృతముగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, అనునవి నాలుగు యుగములు, పన్నెండువేల దివ్య సంవత్సమును నాలుగు యుగములగును, కృతయుగము నాలుగు దివ్య సహస్ర పరిమితము. త్రేతాయుగమున మూడు దివ్య సహస్రములుండును. ద్వారపయుగము రెండు దివ్య సహస్ర వర్షపరిమితము. కలియుగము వేయి దివ్య సంవత్సిములుండును. ఈ యుగముల సంధికాలము, సంధ్యంశకాలము, రెండువేల సంవత్సరములుండును.

మానవ కాలమానము ప్రకారము నాలుగ యుగముల కాలము నలభై మూడు లక్షల ఇరవైవేల సంవత్సరములు. ఇందు కృతయుగము పదిహేడులక్షల ఇరవై ఎనిమిదివేల సంవత్సరలుండును. త్రేతాయుగము పన్నేండు లక్షల తొంభైయారు వేల సంవత్సరములుండును. ద్వాపరయుగము ఎనిమిది లక్షల అరవైనాల్గువేల సంవత్సరములుండును. కలియుగము నాలుగులక్షల ముఫైరెండు వేల సంవత్సరములండును.

ఏడుదినముల వారము, పదహారు తిథులు, రాత్రింబగళ్ళు, రెండు పక్షములు , మాసము, సంవత్సరము అను ప్రకారముగా కాలముండును.

తథభ్రమతి తచ్చక్రం ఏవమేవంచతపర్యుగం | తథాయుగాని రాజేంద్ర తథా మన్వంతరాణి చ || 41

మన్వంతరం తు దివ్యానాం యుగానామేక సప్తతిః | ఏవం క్రమాద్భ్రమంత్యేవ మనవశ్చ చతుర్ధశ || 42

పంచవింశతి సాహస్రం షష్ఠ్యంత శతపంచకం | నరమానయుగం చైవ పరం మన్వంతరం స్మృతం || 43

చక్ర మేవిధముగా గుండ్రముగా తిరుగుచుండునో అట్లే యుగములు మన్వంతరములు ఒకదాని తరువాత ఒకటి తిరుగుచుండును. మన్వంతరమనగా ఇరువదియొక్క దివ్యయుగములు, మానవ మానప్రకారము మన్వంతరము ఇరువదిఐదువేల ఐదు వందల ఆరుయుగములు.

అఖ్యానం చ మనూనాం చ ధర్మిష్ఠానాం నరాధిప | యత్‌శ్రుతం శివవక్త్రేణ తత్వం మత్తో నిశామయ || 44

ధర్మిష్ఠులైన మనువుయొక్క చరిత్రను శంకరుడు నాకు చెప్పినట్లు నీకు తెల్పుదునని బ్రాహ్మణుడు సుయజ్ఞునితో అనెను.

ఆద్యోమనుః బ్రహ్మపుత్రః శతరూపాపతివ్రతా | ధర్మిష్ఠానాం వరిష్ఠశ్చ గరిష్ఠో మనుషు ప్రభుః || 45

స్వాయంభువః సంభుశిష్యో విష్ణువ్రత పరాయణః | జీవన్ముక్తో మహాజ్ఞానీ భవతః ప్రపితామహః || 46

రాజసూయ సహస్రం చ చక్రే వై నర్మదా తటే | త్రిలక్షమస్వమేధం చ త్రిలక్షం నరమేధకం || 47

గోమేధం చ చరుర్లక్షం విధివన్మహదద్భుతం | బ్రాహ్మణానాం త్రి కోటీశ్చ భోజయామాస నిత్యశః || 48

పంచలక్షగవాం మాంసైః సుపక్వైః ఘృత సంస్కృతైః | చవ్యైశ్చోషై#్యర్లేహ్యపేయైః మిష్టద్రవ్యైః సుదుర్లభైః || 49

అమూల్య రత్నలక్షం చ దశ కోటి సువర్ణకం | స్వర్ణశృంగయుతం దివ్యం గవాం లక్షం సుపూజితం || 50

ఓమహారాజా! మొదటి మనువు స్వాయంభువు. అతడు బ్రహ్మదేవుని పుత్రుడు . ఆ మనువుయొక్క భార్యపేరు శతరూప

అతడు పరమ ధర్మిష్ఠుడు. మనువులలో శ్రేష్ఠుడు. విష్ణుమూర్తికి పరమభక్తుడు . అతని గురువు సాక్షాత్‌ శంకరుడే. అతడు నీకు ముత్తాత యగును. స్వాయంభువమనువు నర్మదాతీరమున వేయి రాజసూయయాగములను, మూడు లక్షల అశ్వమేధయాగములను, మరో మూడు లక్షల నరమేధములను, నాలుగు లక్షల గోమేధములను శాస్త్రోక్త ప్రకారము పూర్తిచేసెను.

ఆ మనువు యజ్ఞములు చేయుచున్నప్పుడు ప్రతిదినము మూడు కోట్ల బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనము చేయించుచుండెను. తరువాత ఆ బ్రాహ్మణులకు లక్షలకొలది అమూల్య రత్నములను, పదికోట్ల బంగారు నాణములను, బంగారు కొమ్ములు కల (కొమ్మలకు బంగారురేకు చుట్టిన) లక్షలకొలది ఆవులను దానముచేసెను.

వహ్నిశుద్ధాని వస్త్రాణి మునీంద్రాణాం చ లక్షకం | భూమిం చ సర్వ సస్యాఢ్యాం గజేంద్రాణాం చ లక్షకం |

త్రిలక్షమస్వరత్నం చ శాతకుంభ విభూషితం ||

సహస్రం రథరత్నం చ శిబికా లక్షమేవ చ | త్రికోటి స్వర్ణపత్రాణి సాన్నం సజల మీప్సితం |

త్రికోటి స్వ ర్ణభూషాశ్చకర్పూరాది సువాసితం || 52

తాంబూలం సువిచిత్రం చ త్రికోటి స్వర్ణతల్పకం | రత్నేంద్ర ఖచితైర్మంచైరచితైర్విశ్వకర్మణా || 53

వహ్నిశుద్ధాంశుకైశ్చిత్రై రాజితం మాల్యజారకైః | నిత్యం దదౌ బ్రాహ్మణభ్యో విష్ణుప్రీత్యా శివాజ్ఞయా || 54

సంప్రాస్య సంకరాత్‌ జ్ఞానం కృష్ణమంత్రం సుదుర్లభం | సంప్రాప్య కృష్ణదాస్యం చ గోలోకం వై జగామః || 55

మునీశ్వరులకు పరిశుద్ధమైన లక్షవస్త్రము లను, మంచి సస్యములున్న భూమిని, లక్షలకొలది ఏనుగులను, మూడు లక్షల గుఱ్ఱములను, లక్ష పల్లకీలను, వేయి రథములను, మూడుకోట్ల బంగారు పత్రములను దానముచేసెను. ఇంకను మూడుకోట్ల బంగారు ఆభరణములను, కర్పూరము మొదలగు సువాసన ద్రవ్యములు గల తాంబూలమును, మూడుకోట్ల బంగారు శయ్యలను, రత్నఖచితమైన మంచములను మాలలను విష్ణుమూర్తికి ప్రీతికలుగుటకై శంకరుని ఆజ్ఞననుసరించి ప్రతిదినము దానము చేయుచుండెను.

తనకు విద్యాగురువు, జ్ఞానగురువగు శంకరుని వలన మంచి జ్ఞానమును, శ్రీకృష్ణమంత్రమును, శ్రీకృష్ణదాస్యమును పొంది చివరకు శ్రీకృష్ణుని సన్నిధియైన గోలోకమును చేరుకొనెను.

éదృష్ట్వాముక్తం స్వపుత్రం చ ప్రహృష్టోzభూత్ప్రజాపతి ః | తుష్టావ సంకరం తుష్టః ససృజేzన్యం మనుం విధిః || 56

యతః స్వయంభుపుత్రోzయమతః స్వాయంభూవోమనుః |

బ్రహ్మదేవుడు తనపుత్రుడగు స్వాయంభువమనువు ముక్తిని పొందెనని తెలుసుకొని తన పుత్రుని ముక్తికి కారణమైన శంకరుని స్తుతించెను. స్వయంభుపుత్రుడు కావున అతడు స్వాయంభువు ఆయెను.

స్వాయంభువ మనువు తరువాత బ్రహ్మదేవుడు ఇంకొక మనువును సృష్టించెను.

స్వారోచిషో మనుశ్చైవ ద్వితీయో వహ్నినందనః || 57

రాజా వదాన్యో ధర్మిష్ఠః స్వాయంభువసమోమహాన్‌ | ప్రియవ్రతసుతావన్యౌ ద్యౌ మనూ ధర్మిణాం వరౌ || 58

తౌ తృతీ¸° చతుర్థీ చ వైష్ణవౌ తాపసోత్తమౌ | తౌ చ శంకర శిష్యౌ చ కృష్ణభక్తి పరాయణౌ || 59

ధర్మిష్ఠానాం వరిష్ఠశ్చ రైవతః పంచమోమనుః | షష్ఠశ్చ చాక్షుషో జ్ఞేయః విష్ణుభక్తి పరాయణః || 60

శ్రాద్దదేవః సూర్యసుతో వైష్ణవః సప్తమో మనుః | సావర్ణిః సూర్యతనయో వైష్ణవో మనురష్టమః || 61

నవమో దక్షసావర్ణిః విష్ణువ్రత పరాయణః | దశమో బ్రహ్మసావర్ణిః బ్రహ్మజ్ఞాన విశారదః || 62

తతశ్చ ధర్మసావర్ణిః మనరేకాదశస్మృతః | ధర్మిష్ఠశ్చ వరిష్ఠశ్చ వైష్ణవ వ్రత తత్పరః || 63

జ్ఞానీ చ రుద్రసావర్ణిః మనుశ్చ ద్వాదశ స్మృతః | ధర్మాత్మా దేవసావర్ణిః మనురేవం త్రయోదశ || 64

చతుర్దశో మహాజ్ఞానీ చంద్రసావర్ణిరేవ చ | యావదాయుర్మనూనాం స్యాదింద్రాణాం తావదేవ హి || 65

రెండవ మనువైన స్వారోచిషమనువు అగ్నిదేవుని పుత్రుడు. ఆమనువుకూడ స్వాయంభువ మనువువలె పరమధార్మికుడు, అంతులెని దానములు చేసినవాడు. మూడవ, నాలుగవ మనువులు ప్రియవ్రత మహారాజు పుత్రులు. వారు కూడ గొప్ప దార్మికులే. వారిద్దరు కృష్ణభక్తి పరాయణులు, వారిగురువు మహేస్వరుడు. ఐదవ మనువు రైవతమనువు. ఆరవ మనువు విష్ణుభక్తి పరాయణుడైన చాక్షుష మనువు . ఏడవ మనువు సూర్యపుత్రుడైన శ్రాద్ధదేవుడు. ఎనిమిదల మనువు కూడ సూర్యునియొక్క పుత్రుడే. అతని పేరు సావర్ణి. తొమ్మిదవ మనువు దక్షసావర్ణి. పదవ మనువు పేరు బ్రహ్మసాపర్ణి. పదకొండవ మనువు పేరు ధర్మసావర్ణి. పన్నెడవ మనువు రుద్రసావర్ణి. పదమూడవ మనువు దేవసావర్ణి. పదనాలుగవ మనువు అంతులే ని జ్ఞాన సంపన్నుడైన చంద్రసావర్ణి. ఈ మునువులందలు పరమ ధర్మిష్ఠులై మహాజ్ఞానులై శ్రీకృష్ణుని ఆరాధించినవారే.

మనువుల యొక్క వయస్సెంత ఉండునో ఇంద్రుల వయస్సుకూడ అంతే ఉండును. అనగా ఇంద్రుని వయస్సు కూడ డెబ్భైయొక్క దివ్య యుగములు. మానవ మానముననుసరించినచో ఇరువది ఐదువేల ఆరు యుగములుండును.

చతుర్దశేంద్రావచ్ఛిన్నం బ్రహ్మణో దిముచ్యతే . తాపతీ బ్రహ్మణో రాత్రిః సా చ బ్రాహ్మీ నిశానృప || 66

కాలరాత్రిశ్చ సాజ్ఞేయా వేదేషు పరికీర్తితా| బ్రహ్మణోవాసరో రాజన్‌ క్షుద్రకల్పః ప్రకీర్తితః || 67

సప్తకల్పే చిరంజీవీ మార్కండేయో మహాతపాః | బ్రహ్మలోకాదధః సర్వేలోకా దగ్ధాశ్చ తత్రవై || 68

ఉత్థితేనైవ సహనా సంకర్షణముఖాగ్నినా | చంద్రార్క బ్రహ్మపుత్రాశ్చ బ్రహ్మలోకం గతాధ్రువం || 69

బ్రహ్మరాత్రి వ్యతీతే తు పునశ్చ ససృజే విధిః | తస్యాం బ్రహ్మనిశాయాం చ క్షుద్రః ప్రళయ ఉచ్యతే || 70

దేవాశ్చ మనవశ్చైవ తత్ర దగ్ధా నరాదయః ఏవం త్రింశద్ధివారాత్రైర్బ్రహ్మణో మాసఏవ చ ||

వర్షం ద్వాదశమాసైశ్చ బ్రహ్మసంబంధి చైవ హి | ఏవం పంచదశాబ్దే తు గతే చ బ్రహ్మణో నృప|

దైనందిన స్తు ప్రళయా వేదేషు పరికీర్తితః || 72

మోహరాత్రిశ్చ సాప్రోక్తా వేదవిద్భిః పురాతనైః | తత్ర సర్వే ప్రణష్టా స్స్యుః చంద్రార్కాది దిగీశ్వరాః || 73

ఆదిత్యా వసవో రుద్రా మనవో మానవాదయః | ఋషయో మునయశ్చైవ గంధర్వా రాక్షసాదయః || 74

మార్కండేయా లోమశశ్చ పేచకశ్చిరజీవినః | ఇంద్రద్యుమ్నశ్చ నృపతిశ్చాకూపారశ్చ కచ్ఛపః || 75

నాడీజంఘో బకశ్చైవ సర్వే నష్టాశ్ఛ తత్ర వై | బ్రహ్మలోకా దధ స్సర్వే లోకా నాగాలయాస్తథా || 76

బ్రహ్మలోకం యయుః సర్వే బ్రహ్మపుత్రాదయస్తథా ష గతే దైనందినే బ్రహ్మ లోకాంశ్చ ససృజే పునః || 77

పదునలుగురు ఇంద్రులు గతించినచో బ్రహ్మదేవునకు ఒక పగలగును. అట్లే పదునలుగురు ఇంద్రులు గతించిన కాలము అతనికి రాత్రియగును. ఆ రాత్రినే బ్రహ్మ రాత్రియని యందురు. ఆ రాత్రిని వేదములలో కాలరాత్రియని చెప్పబడినది. బ్రహ్మదేవునకు ఒక దినము గడచినచో దానిని క్షుద్ర కల్పమని అందురు.

చిరంజీవియగు మార్కండేయుడు. ఏడు కల్పములవరకు జీవించును.

బ్రహ్మలోకము క్రిందనున్న లోకములన్నియు సంకర్షణుని (ఆదిశేషుని) ముఖమునుండి బయలుదేరిన అగ్నివలన దగ్ఘములగుచున్నవి. ఆ సమయమున సూర్యుడు, చంద్రుడు , ఇతర బ్రహ్మపుత్రులందరు బ్రహ్మలోకమునకు పోవుదురు. ఆ బ్రహ్మరాత్రి గడచిన పిమ్మట అనగా క్షుద్రకల్పము తరువాత బ్రహ్మదేవుడు తిరిగి సృష్టికార్యమును ప్రారంభించును. ఈ బ్రహ్మరాత్రయందు దేవతలు మనువులు. మానవులు మొదలగు జీవులన్నియు చనిపోవును.

బ్రహ్మదేవునకిట్టి రాత్రి పగలు (దినము) ముప్పదియైనచో ఒక బ్రహ్మమాసమగును. ఇటువంటి పన్నెండు మాసములు గడచినచో బ్రహ్మదేవునకు ఒక సంవత్సపమగును. ఈ విదముగా బ్రహ్మదేవునకు పదునైదు సంవత్సరములు గడచినచో దానిని దైనందిన ప్రళయమందురు. ఆ దైనందిన ప్రళయమును వేదములు తెలిసిన పెద్దలు మోహరాత్రియని అందురు. ఆ సమయమున సూర్యచంద్రులు దిక్పాలకులు, ఆదిత్యులు వసవులు, ఏకాదశరుద్రులు, చతుర్ధశ మనువులు, ఋషులు, మునులు, గంధర్వలు, రాక్షసులు మొదలగువారందరు నశించి పోవుదురు.

ఆ సమయమున చిరంజీవులగు మార్కండేయుడు, లోమశుడు, పేచకుడనువారు మాత్రముందురు. ఇంద్రద్యుమ్నుడను రాజు, అకూపారుడు, కచ్ఛపుడు నాడీజంఘుడు, బకుడు మొదలగు వారందరు నశింతురు. బ్రహ్మలోకము క్రిందనున్న నాగలోకములన్నియు అప్పుడు నశించిపోవును.

ఈ దైనందిన ప్రళయము గడచిన పిదప బ్రహ్మదేవుడు మరల లోకములను సృష్టించును.

ఏవం శతాబ్ద పర్యంతం పరమాయుః ప్రజాపతేః| బ్రహ్మణశ్చ నిపాతే స్యన్మహాకల్పో భ##వేన్నృప || 78

ప్రకీర్తితా మహారాత్రిః సైవ చేహ పురాతనైః | బ్రహ్మణశ్చ నిపాతే చ బ్రహ్మాండౌఘో జలప్లుతః 79

దేవమాతా చ సావిత్రీ వేదా ధర్మాదయస్తథా | సర్వేప్రమష్టా మృత్యుశ్చ ప్రకృతిం చ శివాం వినా ||80

నారాయణ ప్రలీనాశ్చ విస్వస్థా వైష్ణవాస్తథా| కాలాగ్నిరుద్రః సంహర్తా సర్వరుద్రగణౖః సహ || 81

మృత్యుంజయే మహాదేవీ ప్రలీనః స తమోగుణః | బ్రహ్మణశ్చ నిపాతేన నిమేషః ప్రకృతేర్భవేత్‌ || 82

నారాయణస్య శంబోశ్చ మహావిష్ణోశ్చ నిశ్చిచం | నిమేషాంతే పునః సృష్టిః భ##వేత్కృష్ణేచ్ఛయా పునః || 83

ఈవిధముగా నూరుసంవత్సరములు బ్రహ్మదేవుని ఆయుస్సు ఉండును. బ్రహ్మదేవునకు నూరుసంవత్సరములు నిండినచో బ్రహ్మదేవుడు గతించును. దానిని మహాకల్పము అందురు. మహారాత్రి అనికూడ పిలుతురు. ఆ సమయమున బ్రహ్మండములన్నియు నీటిలో మునిగిపోవును. దేవమాతయైన అదితి, సావిత్రీదేవి, వేదములు, ధర్మము మొదలగునవన్నియు నశించును. మృత్యువు ప్రకృతి, శివుడు మాత్రము మిగులుదురు.

ఆ సమయమున వైష్ణవులందరు నారాయణుని యందు లీనమగుదురు. సంహారకారుడైన కాలాగ్ని రుద్రుడు మొదలగు రుద్రులందరు తమోగుణముతో కలిసి మృత్యుంజయుడగు మహాదేవునియందు విలీనమగుదురు.

బ్రహ్మదేవుడు గతించినచో ఆ కాలము ప్రకృతికి ఒక నిమిషకాలము. నారాయణునకు, మహాదేవునకు మహావిరాడ్రూపుడైన శ్రీమహావిష్ణువునకు కూడ నిమిషకారమగును. ఆ నిమిషకాలము తరువాత శ్రీకృష్ణపరమాత్మయొక్క ఇచ్ఛననుసరించి మరల సృష్టికార్యము ప్రారంభమగును.

కృష్ణో నిమేష రహితో నిర్గుణః ప్రకృతే పరః | సగుణానాం నిమేషశ్చ కాలసంఖ్యావయోమితః |. 84

నిర్గుణస్య చ నిత్యస్య చాద్యంత రహితస్య చ | నిమిషాణాం సహస్రేణ ప్రకృతేర్దండ ఉచ్యతే || 85

షష్టిదండాత్మికాస్తస్యా వాసరశ్చ ప్రకీర్తితః | త్రింశద్రాత్రిందినైర్మాసో వర్షం ద్వాదశమాసకైః || 86

ఏవం గతే శతాబ్ధే చ శ్రీకృష్ణే ప్రకృతేర్లయః |ప్రకృత్యాం చ ప్రలీనాయాం శ్రీకృష్ణే ప్రాకృతోలయః || 87

సర్వాన్‌ సంహృత్య సా చైకా మహావిష్ణోః ప్రసూశ్చయా| కృష్ణవక్షసి లీనా చ మాలప్రకృతి రీశ్వరీ || 88

శ్రీకృష్ణునకు నిమేషము (రెప్పపాటు) లేదు. అతడు నిర్గుణుడు ప్రకృతికంటె విశిష్టుడు. సగుణులయొక్క నిమేషములకే కాలము, సంఖ్యా వయస్సు అనునవి యుండును. నిర్గుణుడు నిత్యుడు, ఆద్యంతం రహితుడైన ఆ పరమాత్మకు కార సంఖ్యావయః పరిమితి ఎట్లుండును?

ప్రకృతికి వేయి నిమేషములైనచో ఆ కాలమును దండమందురు. అరవై దండముల కాలము ప్రకృతికి ఒక దినమగును. అట్టి దినములు ముప్పది గడిచినచో ప్రకృతి మాసమగును. ప్రకృతిమాసములు పన్నెండు గడచినచో అది ప్రకృతి సంవత్సరమగును. అట్టి ప్రకృతి సంవత్సరములు నూరు గడచినచో ప్రకృతి లయము జరుగును. ప్రకృతియొక్క లయమును ప్రాకృత లయమని కూడ అందురు. అప్పుడు మూలప్రకృతు అందరిని సంహరించి శ్రీకృష్ణుని వక్షస్థలమున విలీనమైపోవును.

సంతో వదంతి తాం దుర్గాం విష్ణుమాయాం సనాతనీం| సర్వశక్తి స్వరూపాం చ పరాం నారాయణీం సతీం |. 89

బుద్ధ్యధిష్ఠాతృదేవీంచ శ్రీకృష్ణసై#్యవ నిర్గుణాం | యన్మాయా మోహితాశ్చ బ్రహ్మవిష్ణు శివాదయః ||90

వైష్ణవాస్తాం మహాలక్ష్మీ పరాం రాధాం వదంతి తే | అర్ధాంగాం చ మహాలక్ష్మీః ప్రియానారాయణస్య చ || 91

ప్రాణాధిష్ఠాతృదేవీం చ ప్రేవ్ణూ ప్రాణాధికాం వరాం | స్థిరప్రమేమయీం శక్తిం నిర్గుణాం నిర్గుణస్య చ || 92

నారాయణశ్చ శంభుశ్చ సంహృత్య స్వగుణాన్‌ బహున్‌ | శుద్ధసత్వస్వరూపే శ్రీకృష్ణే లీనశ్చ నిర్గుణ || 93

గోపా గోప్యశ్చ గావశ్చ సవత్సాశ్చ నరాధిప | సర్వే లీనాః ప్రకృత్యాం చ ప్రకృతిః పరమేశ్వరే || 94

మహావిష్ణౌ ప్రలీనాశ్చ తే సర్వే క్షుద్రవిష్ణవః | మహావిష్ణుః ప్రకృత్యాం చ సా చైవ పరమాత్మని || 95

ప్రకృతిర్యోగనిద్రాచ శ్రీకృష్ణనయన ద్వయే | అధిష్ఠానం చకారైవం మాయయా చేశ్వరేచ్ఛా యా || 96

మూల ప్రకృతి దుర్గయనియు, విష్ణుమాయ యనియు పెద్దలు చెప్పుదురు. ఆమె సనాతని, సర్వశక్తి రూపిణి, నారాయణి, ఆ దేవి శ్రీకృష్ణునకు నిర్గుణస్వరూపిణి, బుద్ధికి అధిష్ఠాన దేవత. ఆ దేవియొక్క మాయవలన బ్రహ్మవిష్ణు శివాదులందరు మోహమును చెందుచున్నారు. వైష్ణవులందరు ఆ దేవిని "మహాలక్ష్మీ" యనియు "పరరాఢ" అనియు పిలుచుచున్నారు. ఆ దేవి నారాయణునకు అర్ధాంగి, అతనికి ప్రియురాలు. నిర్గుణుడైన శ్రీకృష్ణపరమాత్మ ప్రాణములకు నిర్గుణయైన రాధాదేవి అధిష్ఠానదేవత. ప్రేమవలన ప్రాణములకంటె మిన్నయైనది. సుస్థిరమైన ప్రేమగలది.

నారాయణుడు, మహాదేవుడు తమ తమగణములను ఉపసంహరించుకొని శుద్ధ సత్వస్వరూపుడు, నిర్గుణుడు అగు శ్రీకృష్ణ పరమాత్మునిలో విలీనమగుదురు. గోపులు, గోపికలు, దూడలతోనున్న గోవులన్నియు ప్రకృతిలో లీనముకాగా ఆ ప్రకృతి పరమాత్మనందు విలీనమగును. సమస్త క్షుద్ర విష్ణువులు శ్రీ మహావిష్ణువులో విలీనము కాగా మహావిష్ణువు ప్రకృతియందు విలీనమగును. ఆ ప్రకృతి పరమాత్మలో విలీనమగును. ప్రకృతి, యోగనిద్ర ఈ రెండు శ్రీకృష్ణపరమాత్మయొక్క నయనములలో మాయ మరియు ఈశ్వరేచ్ఛ వలన నివాసముండినవి.

ప్రకృతే ర్వాసరో యావన్మితః కాలః ప్రకీర్తితః | తావత్‌ బృందావనే నిద్రా కృష్ణస్య పరమాత్మనః || 97

అమూల్యరత్నతల్పే చ వహ్ని శుద్ధాంశుకార్చితె | గంధచందన మాల్యౌఘ వాయ్వాదిసురభీకృతే || 98

పునః ప్రజాగరే తస్య సర్వసృష్టిర్భవేత్పునః | ఏవం సర్వే ప్రాకృతాశ్చ శ్రీకృష్ణం నిర్గుణం వినా || 99

తద్వందనం తత్‌స్మరణం తస్య ధ్యానం తదర్చనం | కీర్తనం తద్గుణానాం చ మహాపాతక నాశనం || 100

ఏతత్తే కథితం సర్వం యద్యన్మృత్యుంజయాచ్ఛృతం | యథాగమం మహారాజ కిం భూయుః శ్రోతుమిచ్ఛసి || 101

ప్రకృతియొక్క ఒక దిన (రాత్రిందినము) కాలమున శ్రీకృష్ణుడు బృందావనమున అమూల్యమైన రత్నతల్పమున, పరిశుద్ధమైన వస్త్రముపై గంధము, మాలల యొక్క సువాసనలు గుబాళించుచుండ నిద్రపోవును.

ఆ పరమాత్మ మేల్కొనగానే మరల సమస్త కార్యక్రమము ప్రారంభమగును. నిర్గుణుడగు శ్రీకృష్ణపరమాత్మ తప్ప మిగిలిన వారందరు ప్రాకృతులు.

ఆ శ్రీకృష్ణ పరమాత్మను నమస్కరించుట, ఆతనిని స్మరించుట ఆతనిని ధ్యానము, ఆతని అర్చన, ఆతని మంగళ గుణకీర్తన చేసినచో సమస్త మహాపాపములు నాశనమై పోవును.

శ్రీమహాదేవుని వలన విన్న ఈ విషయమంతయు నీకు తెల్పితిని.

సుయజ్ఞ ఉవాచ - సుయజ్ఞ మహారాజిట్లనెను -

కాలాగ్ని రుద్రో విశ్వానాం సంహర్తా చ తమోగుణః | బ్రహ్మణోzంతే విలీనశ్చ సత్వం మృత్యుంజయే శివే || 102

శివో లీనో నిర్గుణచ శ్రీకృష్ణే ప్రాకృతేలయే | కథం తన గురోర్నామ మృత్యుంజయ ఇతిశ్రుతం || 103

కథం ప్రసూర్మహావిష్ణోర్మూల ప్రకృతిరీశ్వరీ | అసంఖ్యాని చ విశ్వాని సంతివై యస్య లోకసు || 104

కాలాగ్నిరుద్రుడు సమస్త విశ్వములను సంహరించువాడని, అతడు తమోగుణుడని, మీరు చెప్పితిరి. అట్లే ఈ కాలాగ్ని రుద్రడు బ్రహ్మదేవుని జీవిత కాలాంతమున మృత్యుంజయుడైన శివునిలో విలీనమైనట్లు చెప్పితిరి. ఆ మృత్యుంజయుడు ప్రాకృత లయమున నిర్గుణుడైన శ్రీకృష్ణపరమాత్మలో విలీనమై మృత్యువును పొందినందువలన అతడు మృత్యుంజయుడెట్లు అగును?

ఇట్లే అసంఖ్యాకమైన లోకములు శ్రీమహావిష్ణువు యొక్క రోమములలోనున్నట్లు చెప్పితిరి. అట్టి శ్రీమహావిష్ణువునకు మూలప్రకృతిమాతగా ఎట్లైనది? అని సుయజ్ఞుడడిగెను.

సుతపా ఉవాచ - సుతపుడను బ్రాహ్మడుడిట్లు పలికెను -

బ్రహ్మణోంతే మృత్యుకన్యా ప్రణష్టా జలబింబవత్‌ | సంహార్త్రీ సర్వలోకానాం బ్రహ్మాదీనాం నరాధిప || 105

కతిధా మృత్యుకన్యానాం బ్రహ్మణాం కోటిశోలయే | కాలేన లీనః శంబుశ్చ సత్వరూపే చ నిర్గుణ || 106

మృత్యుకన్యా జితాశశ్వత్‌ శివేన గురుణామమ | న మృత్యునా జితః శంభుః కల్పే కల్పేశ్రుతౌ శ్రుతం || 107

శంభోర్నారాయణస్త్యేవ ప్రకృతేవ్చ నరాధిప | నిత్యానాం లీనతా నిత్యే తన్మాయా నతు వాస్తవీ || 108

స్వయం పుమాన్నిర్గుణశ్చ కాలేన సగుణః స్వయం | స్వయం నారాయణం శంభుః మాయయా ప్రకృతిః స్వయం || 109

తదంశః తత్సమః శశ్వద్యథావహ్నేః స్ఫులింగవత్‌ | యేయే చ బ్రహ్మణా సృష్టా రుద్రాదిత్యాదయస్తథా || 110

కల్పే కల్పే జితాస్తే తే నశ్వరా మృత్యుకన్యయా | న శివోబ్రహ్మణా సృష్టః సత్యో నిత్యః సనాతనః || 111

బ్రహ్మదేవుని ఆయుస్సు తీరి అతడు గతించినప్పుడు సమస్త లోకములను, బ్రహ్మదేవునిసైతము సంహరించు మృత్యుకన్య నీటిలో కనిపించు ప్రతిబింబము వలె నశించిపోవుచున్నది. ఎందరో మృత్యుకన్యలు, కోట్లకొలది బ్రహ్మదేవతలు నశించినను, శివుడు మాత్రము నశింపలేదు. అతడు సమయముననుసరించి నిర్గుణుడు, సత్వరూపుడగు శ్రీకృష్ణపరమాత్మలో విలీనమగును. పరమశివుడు మృత్యుకన్యను జయించెనుగాని, మృత్యుకన్య అతనినెప్పుడు జయించలేదని ప్రతి కల్పమున చెప్పబడినది. నిత్యులగు శివుడు, నారాయణుడు, ప్రకృతి ఈ ముగ్గురు నిత్యుడైన శ్రీకృష్ణ పరమాత్మలో విలీనమగుట వాస్తవముకాదు. నిర్గుణుడు పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు కాలముననుసరించి సగణుడగుచున్నాడు. అతడే తన మాయవలన నారాయణుగా, శివుడుగా, ప్రకృతిగా రూపమునొందుచున్నాడు. వీరు ముగ్గురు పరమాత్మతో సమానమైనవారు. అతని అంశరూపులు. అగ్నికి నిప్పురవ్వలకు భేదములేనట్లే వీరికి పరమాత్మకు మధ్య భేదములేదు.

రుద్రులు, ఆదిత్యులు, మొదలగు వారినందరిని బ్రహ్మదేవుడు సృష్టించెను. అందువలన వారందరిని మృత్యుకన్య జయించినది. కాని పరమశివుడు సత్వరూపుడు, నిత్యుడు, సనాతనుడు అగు శివుని మృత్యుకన్య ఎప్పుడు జయించలేదు కావున అతడు మృత్యుంజయుడగుచున్నాడు.

కతిధా బహ్మణాం పాతో యన్నిమేషేణ భూమిప | అథాదిసర్గే శ్రీకృష్ణః ప్రకృత్యాం చ జగద్గురుః || 112

చకారవీర్యాధానం చ పుణ్య బృందావనే వనే | తద్వామాంశ సముద్భూతా రాసే రాసేశ్వరీపురా || 113

గర్భం దధార సారాధా యావద్వైబ్రహ్మణో వయః | తతః సుషావ సాడింభం గోలోకే రాసమండలే || 114

చుకోప డింభం సా దృష్ట్వా హృదయేన విదూయతా | తడ్డింభం ప్రేరయామాస తదధో విశ్వగోళ##కే || 115

త్యక్త్వాపత్యం మహాదేవి రురోదచ మహుర్ముహుః | కృష్ణస్తాం బోధయామాస మహాయోగేన యోగవిత్‌ || 116

బభూవ తస్యాడ్డింభాచ్చ సర్వాధారో మహావిరాట్‌ || 117

మృత్యుంజయుడైన పరమశివుని రెప్పపాటు కాలమున ఎందరో బ్రహ్మదేవులు గతించిరి.

ఆదిసృష్టి సమయమున జగద్గురువగు శ్రీకృష్ణపరమాత్మ బృందావనమున ప్రకృతికి వీర్యాధానము చేయగా ఆ పరమాత్మ వామభాగమునుండి ఉద్భవించిన ఆ రాసేశ్వరియగు రాధాదేవి బ్రహ్మదేవుని ఆయుస్సుండునంతవరకు గర్భమును ధరించెను. ఆ తరువాత పరాప్రకృతి రూపిణియగు ఆ రాధాదేవి గోలోకమందలి రాసమండలమున ఒక అండమును కనెను. రాధాదేవి ఆ అండమును చూచి బాధకు గురికాగా కోపముతో ఆ అండముగును గోలోకమునందు అధోభాగుమున నున్న విశ్వగోళకమున పడవేసెను.

ఆ రాధాదేవి తన సంతానమును వదిలిపెట్టి ఏడ్చుచుండగా శ్రీకృష్ణపరమాత్మ మహాయోగజ్ఞానమును బోధించి ఆమెను ఓదార్చెను.

విశ్వగోళకమున పడిపోవుచున్న ఆ అండమునుండి సమస్తలోకములకు ఆధారభూతుడగు మహావిరాట్పురుషుడు (మహావిష్ణువు) ఉదయించెను.

సుయజ్ఞ ఉవాచ - సుయజ్ఞ మహారాజిట్లనెను -

అద్యమే సఫలం జన్మ జీవనం సార్థకం మమ | శాపో మే వరరూపశ్చాప్యభవద్భక్తి కారణం || 118

సుదుర్లభాహారేర్భక్తిః సర్వమంగళమంగళా | న తస్యాశ్చ సమం విప్ర వేదోక్తం భక్తి పంచకం || 119

యథాబక్తిర్మమభ##వేత్‌ శ్రీకృష్ణే పరమాత్మని | సుదుర్లభా చ సర్వేషాం తత్కురుష్వ మహామునే || 120

నహ్యమ్మయాని తీర్థాని న దేవా మృచ్ఛిలామయాః | తే పునంత్యురు కాలేన కృష్ణభక్తాశ్చ దర్శనాత్‌ || 121

సర్వేషా మాశ్రమాణాం చ ద్విజాతేర్జాతిరుత్తమా | స్వధర్మ నిరతాశ్చైవ తేషు శ్రేష్ఠాశ్చ భారతే || 122

కృష్ణ మంత్రోపాసకశ్చ కృష్ణభక్తి పరాయణః | నిత్యం నైవేద్య భోజీ చ తతః శ్రేష్ఠో మహాన్‌ శుచిః || 123

త్వాం వైష్ణవం ద్విజశ్రేష్ఠం మహాజ్ఞానార్ణవం పరం | సంప్రాప్య శివశిష్యం చ కం యామి శరణం మునే || 124

ఆధునాహం గళుత్కుష్ఠీ తవ శాపాన్మహామునే | కథం తపస్యామ్యశుచిః నాధికారీ కరోమి చ || 125

ఓ మహాత్మా! నా జీవితము ధన్యమైనది. నా జన్మ సఫలమైనది. భగవంతునిపై భక్తిని కలిగించిన మీ శాపము నా పాలిట వరమైనది. సమస్త మంగళములకు మంగళరూపమైన శ్రీహరి భక్తి అందరకు తేలికగా లభించునదికాదు. వేదములందు చెప్పబడిన భక్తి పంచకము శ్రీహరి భక్తితో సమానమైనది కాదు. అందువలన అందరికి లభింపని శ్రీకృష్ణపరమాత్మ భక్తి నాకు కలుగునట్లు అనుగ్రహింపుడు.

పవిత్రమైన జలముండు తీర్థములు మాత్రమే తీర్థములుకాదు. అట్లే మట్టి, శిలానిర్మితములైన వారు మాత్రమే దేవతలు కాజాలరు. పైగా తీర్థములు, దేవతలు, చాలాకాలము సేవించినగాని పవిత్రము చేయరు. కాని శ్రీకృష్ణభక్తులు దర్శనమాత్రముననే వారిని పవిత్రముగా చేతురు. అన్ని ఆశ్రమములలో (వర్ణములలో) బ్రాహ్మణజాతి చాలా శ్రేష్ఠమైనది. వారిలో స్వధర్మనిరతులైనవారు చాలా శ్రేష్ఠులు. కృష్ణమంత్రోపాసకుడు, కృష్ణభక్తి పరాయణుడు, ప్రతిదినము శ్రీహరి నైవేద్యమును భుజించువాడు స్వధర్మనిరతుడైన బ్రాహ్మణునికంటె శ్రేష్ఠుడు.

జ్ఞానసముద్రుడు, వైష్ణవుడు, శంకరుని శిష్యుడు, బ్రాహ్మణ శ్రేష్ఠులగు మీరుండగా జ్ఞానముకై శాపవిమోచమునకై నేనెవరిని శరణుపొందవలెను? మీ శాపమువలన నేనిప్పుడు కుష్టురోగగ్రస్తుడనైతిని. ఈ విధముగా అశుచినైన నేను తపస్సు ఎట్లు చేయగల్గుదునో తెలుపుడని సుయజ్ఞుడు సుతపునితో ననెను.

సుతపా ఉవాచ - సుతపుడను ఆ బ్రాహ్మణుడిట్లనెను -

హరిభక్తి ప్రదాత్రీ సా విష్ణుమాయా సనాతనీ | సా చ యాననుగృహ్ణాతి తేభ్యో భక్తిం దదాతి చ || 126

యాంశ్చ మాయా మోహయతి తేభ్యస్తాం నదదాతి చ | కరోతి వంచనాం తేషాం నవ్వరేణ ధనేన చ || 127

కృష్ణప్రేమమయీం శక్తిం ప్రాణాధిష్ఠాతృదేవతాం | భజ రాధాం నిర్గుణాం తాం ప్రదాత్రీం సర్వసంపదాం || 128

శీఘ్రం యాసస్యి గోలోకం తదనుగ్రహసేవయా | సాసేవితా శ్రీకృష్ణేన సర్వారాధ్యేన పూజితా || 129

ధ్యానసాధ్యం దురారాధ్యం భక్తా సంసేవ్య నిర్గుణం | సుచిరేణ చ గోలోకం ప్రయాంతి బహుజన్మతః || 130

కృపామయీం చ సంసేవ్య భక్తా యాంత్యచిరేణవై | సా ప్రసూశ్చ మహావిష్ణోః సర్వసంపత్స్వరూపిణీ || 131

సహస్రవర్ష పర్యంతం విప్రపాదోదకం పిబ | కామదేవ స్వరూపశ్చ రోగహీనో భవిష్యసి || 132

విప్రపాదోదక క్లిన్నా యావత్తిష్ఠతి మేదినీ | తావత్పుష్కర పత్రేషు పిబంతి పితరో జలం || 133

పృథివ్యాం యాని తీర్థాని తానితీర్థాని సాగరే | సాగరేయాని తీర్థాని విప్రపాదేషు తాని వై || 134

విప్రపాదోదకం చైవ పాపవ్యాధి వినాశనం | సర్వతీర్థోదక సమం భుక్తి ముక్తిప్రదం శుభం || 135

విప్రో మానవరూపి చ దేవదేవోజనార్దనః | విప్రేణ దత్తం ద్రవ్యం భుంజతే సర్వదేవతాః || 136

సనాతని యగు విష్ణుమాయ శ్రీహరిపై భక్తిని కలిగించును. ఆమె అనుగ్రహించిన వారికి మాత్రమే శ్రీహరి భక్తిని కలిగించును. మాయచే మోహితులైనవారికి ఆ దేవి శ్రీకృష్ణ భక్తిని కలిగించక వంచించుచు అశాశ్వతమైన ధనమునిచ్చును.

అందువలన శ్రీకృష్ణ ప్రేమ రూపిణి, శ్రీకృష్ణుని ప్రాణములకు అధిదేవత, శక్తిస్వరూపిణి, సమస్త సంపదల నొసగునది. నిర్గుణ స్వరూపిణియగు రాధాదేవిని సేవింపుము. ఆమెను సర్వారాధ్యుడైన శ్రీకృష్ణుడే ఆరాధించుచు సేవించును. ఆమెను సేవించి అనుగ్రహము పొందినచో నీవు త్వరగా గోలోకమునకు పోయెదవు.

శ్రీకృష్ణ భక్తులు నిర్గుణుడు, కష్టముతో ఆరాధింప తగినవాడు, ధ్యానముచేతనే సాధ్యమైన శ్రీకృష్ణుని అనేక జన్మలలో చాలాకాలము సేవించి గోలోకమును చేరుచున్నారు. అందువలన శ్రీకృష్ణుని సేవించుటకంటె మాతృమూర్తియగు రాధాదేవిని సేవించుట బహుసులభము. దయామూర్తి, సమస్త సంపదల నొసగునది శ్రీమహావిష్ణువునకు మాతృరూపిణి అగు రాధాదేవిని సేవించిన భక్తులు త్వరగా గోలోకమునకు చేరుకొందురు.

అట్లే వేయి సంవత్సరములవరకు బ్రాహ్మణుల పాదోదకమును నీవు స్వీకరించినచో కుష్ఠురోగ నిర్ముక్తుడవై మన్మథుని వంటి ఆకారమును పొందెదవు. బ్రాహ్మణుల సేవించుచు వారి పాదోదకమును స్వీకరించునపుడు భూమిపై వారి పాదోదకమెంతకాలము పడునో అంతవరకు ఆ భక్తుని పితృదేవతలు తర్పణ జలమును కమలపత్రములలో ఆనందముగా స్వీకరించెదరు. భూమిపైనున్న సమస్త తీర్థములు సముద్రముననున్నవి. సముద్రముననున్నవి. సమస్త తీర్థములు విప్రుల పాదోదకముననుండును. ఆ ఉదకము సమస్త పాపములను, రోగములను పోగొట్టును. సమస్త తీర్థములందున్న నీటితో సమానమైనది. భుక్తిని, ముక్తిని కలిగించును. బ్రాహ్మణుడు మానవరూపమునున్న సాక్షాత్‌ శ్రీమహావిష్ణువు. అతడు చేసిన పూజను సమస్త దేవతలు సంతోషముతో స్వీకరింతురు.

ఇత్యేవ ముక్త్వా విప్రశ్చ గృహీత్వా తస్యపూజనం | జగామ గృహవిత్యుక్త్వా త్వాయాస్యే వత్సరాంతరే || 137

భక్త్వా చ బుభుజే రాజా విప్రపాదోదకం శివే | విప్రాంశ్చ పూజయామాస భోజయామాస భోజయామాస వత్సరం || 138

సంవత్సరే వ్యతీతేతు నిర్ముక్తో వ్యాధితో నృపః | ఆజగామ మునిశ్రేష్ఠః సుతపాః కశ్యపాగ్రణీః || 139

సుతపుడు పైవిధముగా సుయజ్ఞమహారాజునకు ఉపదేశించి ఆ మహారాజొనర్చిన పూజను స్వీకరించి సంవత్సరాకాలము దాటిన తరువాత వత్తునని చెప్పిపోయెను.

సుయజ్ఞమహారాజు సుతపబ్రాహ్మణుడు చెప్పినట్లు సంవత్సరకాలము బ్రాహ్మణులను సేవించుచు వారికి భక్తితో భోజనము పెట్టుచు వారి పాదోదకమును స్వీకరించెను. అందువలన అతనికంటిన కుష్ఠువ్యాధి మటుమాయమయ్యెను. ఆ సమయమున పూర్వము చెప్పినట్లే సుతప బ్రాహ్మణుడు ఆ మహారాజు ఇంటికి తిరిగివచ్చెను.

రాధా పూజావిధానం చ స్తోత్రం చ కవచం మనుం | ధ్యానం చ సమావేదోక్తం దదౌ తసై#్మ నృపాయసః || 140

రాజన్‌ నిర్గమ్యతాం శీఘ్రమిత్యుక్త్వా తపసే మునిః | జగామ స్వాలయాద్దుర్గం నిర్జగామ త్వరన్‌ నృపః || 141

రురుదుర్బాంధవాస్సర్వే త్రిరాత్రం శోకమూర్ఛితాః | భార్యశ్చ తత్యజుః ప్రాణాన్‌ పుత్రో రాజా బభూవ హ || 142

సుయజ్ఞః పుష్కరంగత్వా చక్రేవై దుష్కరం తపః | దివ్యం వర్షశతం రాజా జజాప పరమం మనుం || 143

తదా దదర్శ గగనే రథస్థాం పరమేశ్వరీం | స తద్దర్శన మాత్రేణ నిష్పాపశ్చ బభూవ హ || 144

తత్యాజ మానుషం దేహం దివ్యాం మూర్తిం దధార హ | సాదేవి తేన యానేన రత్నేంద్రైర్నిర్మితేన చ || 145

నృపం నీత్వా చ గోలోకం తత్రచైషా య¸° తదా | రాజా దదర్శ గోలోకం నద్యా విరజయావృతం || 146

సుతపబ్రాహ్మణుడతనికి రాధికాదేవి పూజావిధానమును స్తోత్రమును, కవచమును, మంత్రమును, సామవేదమునందు చెప్పబడిన ఆమె ధ్యానమును అంతయు మహారాజునకు చెప్పెను. తరువాత ఓ రాజా! నీవు వెంటనే తపస్సు చేయుటకు అడవికి పొమ్ము అని చెప్పగా రాజువెంటనే అడవికి వెళ్ళెను. అప్పుడతని భార్యలు మూడురాత్రులు శోకముచే మూర్ఛనొంది చనిపోయిరి. బంధువులు దుఃఖించిరి.

ఐనను సుయజ్ఞుడు పుష్కరమునకు వెళ్ళి అచ్చట తీవ్రమైన తపమాచరించెను. ఆతడచ్చట నూరు దివ్య సంవత్సరములు సుతపుడు చెప్పిన రాధికా మంత్రమును జపించెను.

అప్పుడాదేవి రథముపై అచ్చటకు వచ్చి ఆ మహారాజునకు దర్శనమొసగెను. ఆ రాధికాదవేవి దర్శనమాత్రముననే అతని పాపములన్నీ తొలగిపోయినవి. ఆతడు తన మానవదేహమును వదలి దివ్యశరీరము ధరింపగా రాధాదేవి అతనిని తన రథముపై నుంచుకొని గోలోకమును చేరెను. ఆ విధముగా రాధాదేవి అనుగ్రహము వలన ఆమె వెంట వెళ్ళిన సుయజ్ఞుడు విరజానదిని ఆవరించియున్న గోలోకమును చూచెను.

వేష్టితం పర్వతేనైవ శతశృంగేణ చారుణా | శ్రీబృందావన సంయుక్తం రాసమండల మండితం || 147

గోగోపగోపీనికరైః శోభితం పరిసేవితైః | రత్నేంద్రసారఖచితైర్మందిరైః సుమనోహరైః || 148

నానాచిత్ర విచిత్రైశ్చ రాజితం పరిశోభితం | సప్తత్రింశద్బిరాక్రీడైః కల్పవృక్ష సమన్వితైః || 149

పారిజాతద్రుమాకీర్ణైర్వేష్టితం కామధేనుభిః | ఆకాశవత్సువిస్తీర్ణం వర్తులం చంద్రబింబవత్‌ || 150

అత్యూర్ధ్వమపివైకుంఠాత్‌ పంచాశత్కోటి యోజనం | శూన్యేస్థితం నిరాధారం ధ్రువమేవేశ్వరేచ్ఛయా || 151

ఆత్మాకాశసమం నిత్యం అస్మాకం చ సుదుర్లభం | అహం నారాయణోనంతో బ్రహ్మవిష్ణుర్మహాన్విరాట్‌ || 152

ధర్మక్షుద్రవిరాట్‌ సంఘో గంగా లక్ష్మీః సరస్వతీ | త్వం విష్ణుమాయా సావిత్రీ తులసీ చ గణశ్వరః || 153

సనత్కుమారః స్కందశ్చ నరనారాయణావృషీ | కపిలో దక్షిణాయజ్ఞో బ్రహ్మపుత్రాశ్చ యోగినః 154

పవనోవరుణశ్చంద్రః సూర్యో రుద్రో హుతాశనః | కృష్ణమంత్రోపాసకాశ్చ భారతస్థాశ్చ వైష్ణవాః || 155

ఏభిర్దృష్టశ్చ గోలోకో నాన్యైర్దృష్టః కదాచన |

గోలోకముచుట్టు శతశృంగమను పర్వతమున్నది. అచ్చట బృందావనము, రాసమండలమున్నది. అట్లే గోవులు, గోపికలు, గొల్లలున్న అందమైన రత్నమయ మందిరములున్నవి. అందలి మందిరములలో అనేక చిత్రవిచిత్రములున్నవి. అనేక కల్పవృక్షములున్నవి. ఆ మందిరముచుట్టు అనేక పారిజాత వృక్షములున్నవి. అనేక కామధేవులచ్చటనున్నవి. ఆ లోకము చంద్రబింబమువలె గుండ్రముగాను, చాలా విశాలముగాను ఉన్నది. అది వైకుంఠము కంటె యాభైకోట్ల యోజనముల దూరమున పైభాగముననున్నది. అది శూన్యములో ఎట్టి ఆధారము లేక స్థిరముగ నున్నది. అది ఆకాశమువలె నిత్యమైనది. నేను (మహాదేవుడు) నారాయణుడు, అనంతుడు, బ్రహ్మవిష్ణువులు ధర్మదేవత క్షుద్రవిరాడ్రూపములు, గంగాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి నీవు (పార్వతి) విష్ణుమాయ, సావిత్రి, తులసి గణపతి, సనత్కుమారుడు, స్కందుడు, నరనారాయణ మునులు, కపిలమహర్షి, దక్షిణాదేవి యజ్ఞుడు, బ్రహ్మపుత్రులు, వాయువు, వరుణుడు, చంద్రుడు, సూర్యుడు, రుద్రుడు, అగ్ని, ఇతర కృష్ణభక్తులు, భూలోకముననున్న విష్ణుభక్తులు ఈ గోలోకమును చూచెదరు. కాని ఇతరులెవ్వరు దీనిని సందర్శింపలేరు.

నిరాయమే చ తత్రైవ రత్నపసింహాసనే స్థితం || 156

రత్నామాలా కిరీటైశ్చ భూషితం రత్నభూషణౖః | సునిర్మలైః పీతవసై#్త్రః వహ్ని శుద్దైర్విరాజితం || 157

చందనోత్‌క్షిత సర్వాంగం కిశోరం గోపరూపిణం | నవీన నీరదశ్యామం శ్వేత పంకజ లోచనం || 158

శరత్పార్వణ చంద్రాస్య మీషద్ధాస్యం మనోహరం | ద్విభుజం మురళీహస్తం భక్తానుగ్రహ విగ్రహం || 159

స్వేచ్ఛామయం పరంబ్రహ్మ నిర్గుణం ప్రకృతేః పరం | ధ్యానసాధ్యం దురారాధ్యమస్మాకం చ సుదుర్లభం || 160

ప్రియైర్ద్వాదశ గోపాలైః సేవితం శ్వేతచామరైః | వీక్షితం గోపికాబృందైః సస్మితైః సుమనోహరైః || 161

పీడితైః కామబాణౖశ్చ శశ్వత్‌ సుస్థిర ¸°వనైః | వహ్నిశుద్ధాంశుకాధానై రత్నభూషణ భూషితైః || 162

రాసమండలమధ్యస్థం శ్రీకృష్ణం చ పరాత్పరం | దదర్శ రాజా తత్రైవ రాధయాదర్శితం తదా || 163

అచ్చట రత్నసింహాసమున రత్నమాల కిరీటములు, రత్నభూషణములు, పరిశుద్ధమైన పీతవస్త్రములు ధరించిన శ్రీకృష్ణపరమాత్మను సుయజ్ఞుడు చూచెను. ఆ పరమాత్మ శరీరమునందంతట చందనము ఉన్నది. అతడు గోపవేషముననుండెను. అతని శరీరకాంతి నూతన మేఘమువలెనుండెను. ఆ పరమాత్మ రెండు భుజములు కలవాడు. అతని హస్తమున ఎల్లప్పుడు మురళియుండును. ఆ దేవదేవుడెల్లప్పుడు భక్తులననుగ్రహించుచుండును. అతడు స్వేచ్ఛామయుడు, పరబ్రహ్మ, నిర్గుణుడు, ప్రకృతికంటె మిన్నయైనవాడు. ధ్యానమువలన మాత్రమే అతడు లభించును. మావంటివారికి సైతము అతడు దుర్లభుడు. ఆ గోపికామానోహరునికి పన్నెండుగురు ప్రధాన గోపాలురు ఎల్లప్పుడు చామరములను వీచుచుందురు. అతని పరిశుద్ధమైన వస్త్రములు ధరించిన గోపికలు కామముతో చిరునవ్వులు నవ్వుచు చూచుచుందురు. అతడు రాసమండలమున ఉండగా సుయజ్ఞుడు ఆ దేవదేవుని రాధాదేవి అనుగ్రహము వలన చూచెను.

స్తుతం చతుర్భిర్వేదైశ్చ మూర్తిమద్భిర్మనోహరైః | రాగిణీనరాం చ రాగాణామతీవ సుమనోహరం || 164

శ్రుతవంతం చ సంగీతం యంత్రవక్త్రోత్థితం మునే | నిత్యయా చ సనాతన్యా ప్రకృత్యా చ సహ త్వయా || 165

శశ్వత్పూజిత పాదాబ్జమఖండ తులసీ దళైః | కస్తూరీ కుంకుమాక్తైశ్చ గంధచందన చర్చితైః || 166

దూర్వాభిరక్షతాభితాభిశ్చ పారిజాత ప్రసూనకైః | నిర్మలైర్విరజా తోయైర్దత్తార్ఘ్యె రతిశోభితం || 167

సుప్రసన్నం స్వతంత్రం చ సర్వకారణం కారణం | సర్వేషాం చాంతరాత్మానం సర్వేశం సర్వజీవినం || 168

సర్వాధారం పరంపూజ్యం బ్రహ్మజ్యోతిః సనాతనం | సర్వసంవత్స్వరూపం చ దాతారం సర్వసంపదాం || 169

సర్వమంగళ రూపం చ సర్వమంగళకారణం | సర్వమంగళదం సర్వమంగళానాం చ మంగళం || 170

తం దృష్ట్వా నృపతిస్త్రస్తో హ్యవరుహ్య రథాత్త్వరన్‌ | సాశ్రునేత్రః పులకితోమూర్ద్నా స

ప్రణనామ చ || 171

ఆ పరమాత్మను నాల్గువేదములు ఆకారమును ధరించి ఎల్లప్పుడు స్తుతింపుచుండును. మనోహరమైన రాగములు సంగీతము వాద్య యంత్రములనుండి వచ్చుచుండగా సంతోషముననతడు వినుచుండును. నిత్య, సనతానియగు ప్రకృతి మరియు నీవు ఆ పరమాత్మ పాదపంకజములను అఖండతులసి దళములతో కస్తూరి, కుంకుమ కలిసిన గంధచందనములతో దుర్వాంకురములతో, అక్షతలతో, పారిజాత ప్రసూనములతో ఎల్లప్పుడు పూజించుచుందురు. ఇంకను ఆ పరమాత్మకు మీరు పవిత్రమైన విరజానది తీర్థముతో అర్ఘ్యము నిచ్చుచుందురు.

ఆ శ్రీకృష్ణుడు చక్కగా ప్రసన్నముగానుండువాడు, స్వతంత్రుడు, సమస్త కారణములకు కారణమైనవాడు. అన్ని ప్రాణులకు అంతరాత్మయైనవాడు, సర్వేశుడు, సమస్తమునకు ఆధారభూతుడు, మిక్కిలి పూజించతగినవాడు, సనాతనుడు సమస్త సంపదల స్వరూపము, సమస్త సంపదల నొసగువాడు. సర్వమంగళరూపి, సర్వమంగళ కారణుడు, సర్వమంగళదాత, సమస్త మంగళములకు మంగళకరమైనవాడు.

అటువంటి గోపికా వల్లభుని చూడగానే సుయజ్ఞుడు తొందరగా రథమునుండి దిగి పులకించిన శరీరము కలవాడై ఆనందబాష్పములు రాలగా పరమాత్మ పాదములకు నమస్కరించెను.

పరమాత్మా దదౌతసై#్మ స్వదాస్యం చ శుభాశిషం | స్వభక్తి నిశ్చలాం సత్యామస్మాకం సుదుర్లభం || 172

రాధావరుహ్య స్వరథాత్‌ కృష్ణవక్షస్యువాస సా | గోపీభిస్సుప్రియాభిశ్చ సేవితా శ్వేత చామరైః || 173

సంభాషితా శ్రీకృష్ణేన సస్మితేన చ పూజితా | సముత్థితేన సమసా భక్త్వా వై సంభ్రమేణ చ || 174

ఆదౌ రాధాం స ముచ్చార్య పశ్చాత్కృష్ణం చ మాధవం | ప్రవదంతి చ వేదేషు వేదవిద్భిః పురాతనైః || 175

విపర్యయం యే వదంతి యే నిందంతి జగతః ప్రసూం | కృష్ణప్రాణాధికాం ప్రేమమయీం శక్తిం చ రాధికాం || 176

తే పచ్యంతే కాలసూత్రే యావచ్చంద్ర దివాకరం | భవంతి స్త్రీపుత్రహీనాః రోగిణః శతజన్మసు || 177

శ్రీ కృష్ణపరమాత్మ సుయజ్ఞ మహారాజునకు తనపై భక్తిని, ఆశీస్సులను ఒసగెను. ఇవి మావంటివారికి కూడా దుర్లభ##మైనది.

తరువాత రాధాదేవి రథమునుండి దిగి గోపికలు చెలికత్తెలు సేవించుచుండగా కొందరు శ్వేతచామరములను వీయుచుండగా శ్రీకృష్ణ పరమాత్మ సమీపమునకు వచ్చి అతనిని ఆలింగనమును చేసికొనెను. శ్రీకృష్ణపరమాత్మ ఆమెను పలుకరించి గౌరవించెను.

తొలుత రాధాదేవి పేరునుచ్చరించి శ్రీకృష్ణునిపేరు (రాధాకృష్ణుడు, రాధామాధవుడు) ను ఉచ్ఛరింపవలెనని వేదములు తెలిసిన పెద్దలు పలుకుచున్నారు. ఆ విధముగా కాక తొలుత కృష్ణుని తరువాత రాధాదేవి నామమునుచ్చరించినచో, లేక అఖిల ప్రపంచములకు మాత, కృష్ణునకు ప్రాణములకంటె గొప్పనిది శక్తిరూపిణియగు రాధను నిందించినచో వారు సూర్యచంద్రులున్నంతవరకు నరకమున బాధలు పడుదురు. తరువాత భూలోకమున జన్మించనను భార్యపుత్ర విహీనులై రోగపీడితులగుదురు.

ఇత్యేవం కథితం దుర్గేరాధికాఖ్యానముత్తమం| సా త్వం సతీ భగవతీ వైష్ణవీ చ సనాతనీ || 178

నారాయణీ విష్ణుమాయా మూలప్రకృతిరీశ్వరీ | మాయయా మాం పృచ్ఛసి త్వం సర్వజ్ఞా సర్వ రూపిణీ || 179

స్త్రీ జాతిష్వధిదేవీ చ పరా జాతిస్మరావరా | కథితం రాధికాఖ్యానం కిం భూయం శ్రోతుమిచ్ఛసి || 180

ఓ పార్వతీ! నీకింతవరకు రాధికోపాఖ్యానమును చెప్పితిని. నీవు భగవతి, వైష్ణవి, విష్ణుమాయ, సనాతని, నారాయణి మూలప్రకృతి ఈశ్వరి అనుపేర్లతో ప్రకాశించుచున్నావు. నీవు సర్వజ్ఞురాలవైనను, సమస్త చరాచర రూపిణివైనను, స్త్రీలలో అత్యుత్తమురాలివైనను తెలియనట్లు నన్నడిగితివి అని శంకరుడు పార్వతీదేవితో ననెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణాంతర్గత హరగౌరీ సంవాదే రాధాఖ్యానే సుయజ్ఞాఖ్యానే సుతపః సుయజ్ఞసంవాదే సుయజ్ఞస్య గోలోక ప్రాప్తిర్నామ చతుష్పంచాశత్తమోzధ్యాయః ||

శ్రీబ్రహ్మవైవర్త మహాపురణమునందలి రెండవదైన ప్రకృతిఖండమున నారదనారాయణ సంవాదమున చెప్పబడిన సుయజ్ఞమహారాజునకు గోలోక ప్రాప్తియను

ఏబదినాల్గవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters