sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

8. అష్టమోzధ్యాయః - బ్రహ్మ, నారదులు పరస్పరము శపించుకొనుట

సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లు చెప్పెను-

బ్రహ్మా, విశ్వం వినిర్మాయ, సావిత్ర్యాం వరయోషితి | చకార వీర్యాధానంచ కాముక్యాం కాముకో యథా || 1

సా దివ్యం శతవర్షంచ ధృత్వా గర్భం సుదుస్సహం | సుప్రసూతా చ సుషువే చతుర్వేదాన్‌ మనోహరాన్‌ || 2

వివిధాన్‌ శాస్త్ర సంఘాంశ్చ తర్క వ్యాకరణాదికాన్‌ | షట్‌త్రింశత్‌ సంఖ్యకాః దివ్యాః రాగిణీః సుమనోహరాః || 3

షడ్‌ రాగాన్‌ సుందరాంశ్చైవ నానా తాల సమన్వితాన్‌ | సత్య, త్రేతా, ద్వాపరాంశ్చ, కలించ కలహప్రియం || 4

బ్రహ్మ ప్రపంచమును సృష్టించి సావిత్రి అను తన భార్య యందు కాముకుడు, కాముకి యందు వలె వీర్యాధానమును చేసెను. ఆ సావిత్రి నూరు దివ్యవర్షాలు సహించుటకు మిక్కిలి కష్టమైన గర్భమును ధరించి చతుర్వేదములను వివిధములైన తర్క, వ్యాకరణాది శాస్త్రములను నానాతాళ సమన్వితములైన షట్‌రాగములను సత్య, త్రేత, ద్వాపరములను, కలహప్రియమైన కలియుగాన్ని కనెను.

వర్షమాసమృతుం చైవ తిథిం, దండ క్షణాధికం | దినం రాత్రించ వారాంశ్చ సంధ్యాముషసమేవ చ || 5

పుష్టిం చ దేవసేనాం చ, మేధాం చ, విజయాం జయాం | షట్‌ కృత్తికాశ్చ యోగాంశ్చ, కరణం చ తపోధనః || 6

దేవసేనా మహాషష్టీ కార్తికేయప్రియా సతీ| మాతృకాసు ప్రధానా సా బాలానామిష్టదేవతా || 7

బ్రాహ్మం, పాద్మంచ, వారాహం, కల్పత్రయమిదం స్మృతం | నిత్యం నైమిత్తికం చైవ ద్విపరార్థం చ ప్రాకృతం || 8

చతుర్విధం చ ప్రళయం కాలం వై మృత్యుకన్యకాం | సర్వాన్‌ వ్యాధిగణాంశ్చైవ సా ప్రసూయ స్తనం దదౌ || 9

సంవత్సరము, మాసము, ఋతువు, తిథి, దండ, క్షణాదికమును, పగలు, రాత్రి, వారము, సంధ్య, ఉషః కాలమును కనెను. అట్లే పుష్టి దేవసేన, మేధ, విజయ, జయ అను కృత్తికలను, విష్కంభాదియోగములను, బవ మొదలైన కరణములను బ్రాహ్మము, పాద్మము, వారాహము అను మూడు కల్పములను, నిత్యము, నైమిత్తికము, ద్విపరార్థము, ప్రాకృతమను చతుర్విధప్రళయములను, కాలమును, సావిత్రి కనెను.

అట్లే మృత్యుకన్యక, మృత్యుకారణమైన సమస్త వ్యాధిగణమునకు సావిత్రియే మాత.

అథ ధాతుః పృష్ఠదేశాదధర్మః సమజాయత | అలక్ష్మీస్తద్వామపార్శ్వాద్బభూవాత్యంతకామినీ || 10

నాభిదేశాద్విశ్వకర్మా జాతో వై శిల్పినాం గురుః | మహాంతో వసవోzష్టౌ చ మహాబల పరాక్రమాః || 11

అథ ధాతుశ్చ మనసః ఆవిర్భూతాః కుమారకాః | చత్వారః పంచవర్షీయాః జ్వలంతో బ్రహ్మతేజసా || 12

సనకశ్చ సనందశ్చ తృతీయశ్చ సనాతనః | సనత్కుమారో భగవాంశ్చతుర్థో జ్ఞానినాం వరః || 13

ఆవిర్బభూవ ముఖతః కుమారః కనకప్రభః | దివ్యరూపధరః శ్రీమాన్‌ సస్త్రీకః సుందరో యువా || 14

క్షత్రియాణాం బీజరూపః నామ్నా స్వాయంభువో మనుః | యా స్త్రీ సా శతరూపా చ రూపాఢ్యా కమలా కలా || 15

సస్త్రీకశ్చ మనుస్తస్థౌ ధాత్రాజ్ఞా పరిపాలకః | స్వయం విధాతా పుత్రాంశ్చ తానువాచ ప్రహర్షితాన్‌ || 16

బ్రహ్మదేవునియొక్క వెనుకభాగమునుండి అధర్ముడు, ఎడమభాగమునుండి అలక్ష్మి (పెద్దమ్మవారు) బొడ్డుప్రాంతము నుండి శిల్పి గురువైన విశ్వకర్మ, అష్టవసువులు ఉదయించిరి.

అట్లే బ్రహ్మమనస్సునుండి సనక, సనంద, సనాతన, సనత్కుమారులనే ఐదు సంవత్సరాల ప్రాయముతో, బ్రహ్మవర్చస్సుతో ప్రజ్వలించుచున్న నలుగురు కుమారులు ఆవిర్భవించిరి. అతని ముఖమునుండి బంగారుకాంతి, దివ్యరూపమును ధరించిన ఒక సుందర యువకుడు, స్త్రీతో కలసి ఆవిర్భవించెను. ఆ యువకుడు క్షత్రియులకెల్ల మూలభూతుడైన స్వాయంభువ మనువు. ఆతనివెంట ఉదయించిన స్త్రీ స్వాయంభువమనుపత్నియైన శతరూప. స్వాయంభువ మనువు తన భార్యతో కలసి తండ్రియైన బ్రహ్మదేవుని ఆజ్ఞను పరిపాలించుటకు సిద్ధమాయెను.

అప్పుడు సంతోషముతోనున్న తన పుత్రులను చూచి విధాత ఇట్లు పలికెను.

సృష్టిం కర్తుం మహాభాగో మహాభాగవతాన్‌ ద్విజ | జగ్ముస్తే చ నహీత్యుక్త్వా తప్తుం కృష్ణపరాయణాః || 17

చుకోప హేతునా తేన విధాతా జగతాం పతిః | కోపాసక్తస్య చ విధేః జ్వలతో బ్రహ్మతేజసా || 18

ఆవిర్భూతా లలాటాచ్చ రుద్రా ఏకాదశ ప్రభో | కాలాగ్నీరుద్రః సంహర్తా తేషామేకః ప్రకీర్తితః || 19

సర్వేషామేవ విశ్వానాం స తామస ఇతి స్మృతః | రాజసశ్చ స్వయం బ్రహ్మా శివో విష్ణుశ్చ సాత్వికౌ || 20

గోలోకనాథః కృష్ణశ్చ నిర్గుణః ప్రకృతేః పరః | పరంఅజ్ఞానినో మూర్ఖావదంతే తామసం శివం || 21

శుద్ధసత్వస్వరూపం చ నిర్మలం వైష్ణవాగ్రణిం | శ్రుణు నామాని రుద్రణాం వేదోక్తాని చ యాని చ || 22

మహాన్‌ మహాత్మా మతిమాన్‌ భీషణశ్చ భయంకరః | ఋతుధ్వజశ్చోర్ధ్వకేశః పింగళాక్షో రుచిః శుచిః || 23

శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు మహాభాగవతులైన తన కుమారులను సృష్టిచేయమని కోరెను. కాని పరమ భక్తులైన వారు తాము సృష్టికర్మ చేయమని చెప్పి వెళ్ళిపోయిరి. అందువల్ల విధాత కోపగించగా బ్రహ్మతేజస్సుతో ప్రజ్వరిల్లుతూ కోపాసక్తుడైన అతని నొసటినుండి ఏకాదశరుద్రులు ఉద్భవించిరి. సృష్టిసంహారము చేయు కాలాగ్ని రుద్రుడు వారిలో ఒకడు. సమస్త ప్రపంచములందు అతడు తామస స్వభావుడని చెప్పబడినాడు. కాని బ్రహ్మరాజస స్వభావుడు. శివుడు, విష్ణువు ఈ ఇద్దరు సాత్విక స్వభావులు. గోలోకాధిపతియైన శ్రీకృష్ణుడు ప్రకృతికి అతీతుడు. నిర్గుణస్వరూపుడు.

శుద్ధ సత్వ స్వరూపి, నిర్మలుడు, విష్ణుభక్తాగ్రేసరుడగు శివుని పూర్తిగా అజ్ఞానవంతులు, మూర్ఖులైన వారు మాత్రమే తామస స్వరూపి అని అందురు. ఈ ఏకాదశరుద్రుల పేర్లు ఇవి-

మహాన్‌, మహాత్మా, మతిమాన్‌, భీషణుడు, భయంకరుడు, ఋతుధ్వజుడు, ఊర్ధ్వకేశుడు, పింగళాక్షుడు, రుచి, శుచి. ఇంతకు ముందు చెప్పబడిన కాలాగ్ని రుద్రుడు.

పులస్త్యో దక్షకర్ణాచ్చ పులహో వామకర్ణతః | దక్షనేత్రాత్తథాzత్రిశ్చ వామనేత్రాత్ర్కతుః స్వయం || 24

అరణిర్నాసికారంధ్రాత్‌ అంగిరాశ్చ ముఖాద్రుచిః | భృగుశ్చ వామపార్శ్వాచ్చ దక్షో దక్షిణపార్శ్వతః || 25

ఛాయాయాః కర్దమో జాతః నాభేః పంచశిఖస్తథా | వక్షసశ్చైవ వోఢుశ్చ కంఠదేశాచ్చ నారదః || 26

మరీచిః స్కంధదేశాచ్చైవాపాంతరతమా గళాత్‌ | వసిష్ఠో రసనాదేశాత్‌ ప్రచేతాః అధరోష్ఠతః || 27

హంసశ్చ వామకుక్షేశ్చ దక్షకుక్షేర్యతిః స్వయం | సృష్టిం విధాతుం స విధిశ్చకారాజ్ఞాం సుతాన్‌ ప్రతి పితుర్వాక్యం సమాకర్ణ్య తమువాచ స నారదః || 28

బ్రహ్మ దేవుని కుడిచెవినుండి పులస్త్యుడను ముని, ఎడమ చెవినుండి పులహమహర్షి, కుడి కంటినుండి అత్రిమహాముని, ఎడమకంటినుండి క్రతుమహర్షి, నాసికారంధ్రమునుండి అరణిమహర్షి, ముఖమునుండి అంగిరసమహర్షి, ఎడమ పార్శ్వమునుండి భృగుమహర్షి, కుడిపార్శ్వమునుండి దక్షుడు, ఛాయనుండి కర్దమమహర్షి, నాభినుండి పంచశిఖుడు, వక్షస్థలమునుండి వోఢుమహర్షి, కంఠప్రదేశమునుండి నారదుడు, స్కంధప్రదేశమునుండి మరీచి మహర్షి, గొంతుకనుండి అపాంతరతముడనే ఋషి, నాలుకనుండి వసిష్ఠుడు, అధరోష్ఠమునుండి ప్రచేతసుడను వరుణుడు, కుక్షిభాగమునకు ఎడమపార్శ్వమునుండి హంసమహర్షి, కుడిపార్శ్వమునుండి యతి అను ఋషి ఉద్భవించిరి.

బ్రహ్మదేవుడు ఈ కుమారులకు సృష్టికార్యము చేయుడని ఆజ్ఞాపించెను. అప్పుడు తండ్రి ఆజ్ఞను విన్న నారదుడు తండ్రితో ఈవిధముగా అనెను.

నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లనెను-

పూర్వమానయ మజ్జ్యేష్ఠాన్‌ సనకాదీన్‌ పితామహ | కారయిత్వా దారయుక్తాన్‌ అస్మాన్వద జగత్పతే || 29

పితస్తే తపసాయుక్తాః సంసారాయ వయం కథం | అహో హన్త ప్రభోర్బుద్ధిర్విపరీతాయ కల్పతే || 30

కసై#్మ పుత్రాయ పీయూషాత్పరం దత్తం తపోzధునా | కసై#్మ దదాసి విషయం విషమం చ విషాధికం || 31

అతీవ నిమ్నే ఘోరే చ భవాబ్ధౌ యః పతేత్పితః | నిష్కృతిస్తస్య నాస్తీతి కోటికల్పే గతేzపి చ || 32

నిస్తారబీజం సర్వేషాం బీజం చ పురుషోత్తమం | సర్వదం భక్తిదం దాస్యప్రదం సత్యం కృపామయం || 33

భ##క్తైకశరణం భక్తవత్సలం స్వచ్ఛమేవ చ | భక్తప్రియం భక్తనాథం భక్తానుగ్రహకారకం || 34

భక్తారాధ్యం భక్తిసాధ్యం విహాయ పరమేశ్వరం | మనో దదాతి కో మూఢో విషయే నాశకారణ || 35

విహాయ కృష్ణసేవాం చ పీయూషాదధికాం ప్రియాం | కో మూఢో విషమశ్నాతి విషమం విషయాభిధం || 36

స్వప్నవన్నశ్వరం తుచ్ఛమసత్యం మృత్యుకారణం | తథా దీపశిఖాగ్రం చ కీటానాం సుమనోహరం || 37

యథా బాడిశమాంసం చ మత్స్యాపాతసుఖప్రదం | తథా విషయిణాం తత విషయం మృత్యుకారణం || 38

ఇత్యుక్త్యా నారదస్తత్ర విరరామ విధేః పురః | తస్థౌ తాతం నమస్కృత్య జ్వలదగ్నిశిఖోపమః || 39

ఓ తండ్రీ! మాకు అన్నలగు సనక, సనందాదులను మొదట పిలిపించి వారికి వివాహము చేసి, మాకు వివాహముగురించి చెప్పుము. వారు తపస్సు చేసికొనుటకనుమతింపబడినారు. మేముమాత్రము సంసారము చేయుటకు అనుమతించబడినామా? మీ బుద్ధి విపరీతముగానున్నది. ఒక పుత్రునికి అమృతముకంటె గొప్పదైన తపస్సునొసగి, ఇంకొకరికి విషముకన్న మిన్నయైన సంసారమును ఇచ్చుచున్నారు. ఎవరైతే మిక్కిలి లోతైన, భయంకరమైన సంసారసాగరములో పడుదురో, వారికి నూరుకోట్ల కల్పములు గడచినా నిష్కృతి లేదందురు. సంపూర్ణముగా తరించుటకు ఎవరు కారకులో, అందరికి ఎవరు కారణభూతులో, పురుషోత్తముడు, సమస్తకోరికలను తీర్చువాడు, భక్తిప్రదుడు, దాస్యప్రదుడు, సత్యస్వరూపి, కృపామయుడు, భక్తులకు అనన్య శరణుడు, భక్తవత్సలుడు, భక్తప్రియుడు, భక్తులకు నాథుడు, భక్తులను సంతతము అనుగ్రహించువాడు, భక్తులకు ఆరాధ్యదేవత భక్తికి మాత్రమే లొంగువాడు అగు పరమేశ్వరుని వదలి నాశనమునకు కారణమైన సంసారములో ఎట్టి మూఢుడు మనస్సు పెట్టును? అమృతము కన్న మిన్నయైనది, చాలా ఇష్టమైనది అగు కృష్ణసేవను వదలి సంసారమనే విషమును ఎటువంటి మూఢుడు సేవించును? అది కలవలె క్షణికమైనది, తుచ్ఛమైనది, అసత్యమైనది, మృత్యువునకు కారణభూతము. ఇంకను అది పురుగులను దీపశిఖవలె బాగుగా ఆకర్షించి నాశనము చేయును. తేలికగా చేపలు చిక్కుటకు ఎరలయొక్క మాంసము ఏవిధముగా కారణమగునో అట్లే విషయలంపటులైనవారికి సంసారము నాశనకారణమగును.

ఇట్లు నారదుడు తండ్రితో పలికి నమస్కరించి అతని సన్నిధిలో నిలబడెను.

బ్రహ్మా కోపపరీతశ్చ శశాప తనయం ద్విజ | ఉవాచ కంపితాంగశ్చ రక్త్యాస్యః స్ఫురితాధరః || 40

కుమారుడగు నారదుని మాటలు విని బ్రహ్మదేవుడు కంపించుచున్న అవయవములతో, ముఖము ఎఱ్ఱబాఱగా పెదవులు వణకగా ఇట్లనెను.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడు ఈవిధముగా అనెను-

భవితా జ్ఞానలోపస్తే మచ్ఛాపేన చ నారద | క్రీడామృగశ్చ త్వం సాధ్యః యోషిల్లుబ్ధశ్చ లంపటః || 41

స్థిర¸°వనయుక్తానాం రూపాఢ్యానాం మనోహరః | పంచాశత్కామినీనాం చ భర్తా చ ప్రాణవల్లభః || 42

శృంగారశాస్త్రవేత్తా చ మహాశృంగారలోలుపః | నానాప్రకార శృఃగారనిపుణానాం గురోర్గురుః || 43

గంధర్వాణాం చ సువరః సుస్వరశ్చ సుగాయనః | వీణావాదనసందర్భనిష్ణాతః స్థిర¸°వనః || 44

ప్రాజ్ఞో మధురవాక్‌ శాంతః సుశీలః సుందరః సుధీః | భవిష్యసి న సందేహో నామతశ్చోపబర్హణః || 45

తాభిర్దివ్యం లక్షయుగం విహృత్య నిర్జనే వనే | పునర్మదీయశాపేన దాసీపుత్రశ్చ తత్పరః || 46

వత్స వైష్ణవసంసర్గాత్‌ వైష్ణవోచ్ఛిష్ట భోజనాత్‌ | పునః కృష్ణప్రసాదేన భవిష్యసి మమాత్మజః || 47

జ్ఞానం దాస్యామి తే దివ్యం పునరేవ పురాతనం | అధునా భవ నష్టస్త్వం మత్సుతో నిపత ధ్రువం || 48

నారద! నీకు నాశాపము వలన జ్ఞాన లోపము కలుగును. నీవు ఉపబర్హణుడవను గంధర్వుడవుగా పుట్టుదువు. ఆజన్మలో నీవు స్త్రీలోలుడవు. స్థిర ¸°వనము, మంచి అందము కల స్త్రీల కెందరికో నీవు ప్రియుడవు కాగలవు. నీకు భార్యలు ఏబదిమంది ఉందురు. నీవు శృంగారశాస్త్రవేత్తవై, నానావిధములైన శృంగారవిషయములందు మేటి ప్రవీణుడవు కాగలవు. గంధర్వవంశములో నీవు చాలా గొప్పవాడవుగా, సుస్వరముగల మంచిగాయకుడవుగా, వీణావాదనలో మిక్కిలి నిపుణుడవుగా, ప్రాజ్ఞుడు, మధురవాక్‌, శాంతము కలవాడు, మంచినడవడి కలవాడు, సుందరుడు, జ్ఞానవంతుడవుగాకూడ కాగలవు నీవు, నీ భార్యలు, ప్రియురాండ్రతో కలసి నిర్జనమైన అడవిలో లక్షదివ్యయుగాలు గడిపి, మరల నా శాపముతోనే దాసీ పుత్రుడవు కాగలవు. ఆ జన్మలో విష్ణుభక్తులతో కలిసియున్నందువలన, వైష్ణవులయొక్క ఉచ్ఛిష్టమును భుజించుటవలన, మరల నా అనుగ్రహమువలన నాపుత్రుడవు కాగలవు. నీవు ఏ జన్మలో ఉన్నా నీకు దివ్యమైన పూర్వజ్ఞానముండును. ఇక ప్రస్తుతము నీవు దివ్యత్వమును, నాయొక్క పుత్రత్వమును పోగొట్టుకొని భూలోకమున పడిపోవుదువు.

బ్రహ్మేత్యుక్త్వా సుతం విప్ర విరరామ జగత్పతిః | రురోద నారదస్తాతం అవోచత్సంపుటాంజలిః || 49

బ్రహ్మదేవుడు తన పుత్రుడైన నారదునితో ఈవిధముగా అనగా నారదుడు ఏడ్చుచు చేతులు జోడించుకొని తండ్రితో ఈవిధముగా అనెను.

నారద ఉవాచ- నారదుడు ఇట్లు అనెను-

క్రోధం సంహర సంహర్తః తాత తాత జగద్గురో | స్రష్టుః తపస్వీశస్యాహో క్రోధోయం మయ్యనాకరః || 50

శ##పేత్పరిత్యజేత్‌ విద్వాన్‌ పుత్రముత్పథగామినం | తపస్వినం సుతం శప్తుం కథమర్హసి పండిత || 51

జనిర్భవతు మే బ్రహ్మన్‌ యాసు యాసు చ యోనిషు | నజహాతు హరేర్భక్తిర్మా వేదం దేహి మే వరం || 52

పుత్రశ్చేజ్జగతాం ధాతుర్నాస్తి భక్తిః హరేః పదే | సూకరాదతిరిక్తశ్చ సోzధమో భారతే భువి || 53

జాతిస్మరః హరేః భక్తియుక్తః సూకరయోనిషు | జనిర్లభేత్‌ స ప్రవరో గోలోకం యాతి కర్మణా || 54

గోవిందచరణాంభోజ భక్తిమాధ్వీకమీప్సితం | పిబతాం వైష్ణవాదీనాం స్పర్శపూతా వసుంధరా || 55

తీర్థాని స్పర్శమిచ్ఛంతి వైష్ణవానాం పితామహ | పాపానాం పాపితత్త్వానాం క్షాలనాయాత్మనామపి || 56

మంత్రోపదేశమాత్రేణ నరా ముక్తాశ్చ భారతే | పరైశ్చ కోటిపురుషైః సార్థం హరేరహో || 57

కోటిజన్మార్జితాత్పాపాత్‌ మంత్రగ్రహణమాత్రతః | ముక్తాః శుధ్యంతి యత్పూర్వం కర్మ నిర్మూలయంతి చ || 58

ఓ తండ్రీ నాపై నీ కోపమును ఉపసంహరింపుము. జగములను సృష్టించువాడవు. తపస్వులలో శ్రేష్ఠుడవైన నీకు అసందర్భమైన ఈ కోపము తగదు. విద్వాంసుడు తన కొడుకు చెడుత్రోవలలో తిరిగినచో తిట్టవచ్చును. వదలి వేయవచ్చును. కాని తపస్సు చేసుకొను కొడుకును ఎందుకు తిట్టెదవు. ఐనా ఓ తండ్రీ నేను ఏఏ జన్మలెత్తినా హరిభక్తి నన్ను వదలకుండునట్లు, వేదజ్ఞానము వదలకుండునట్లు వరమును మాత్రము ఇమ్ము. బ్రహ్మదేవుని పుత్రుడైనా హరిభక్తి లేనిచో ఈ భారత దేశమున సూకరముకన్న వేరు కాజాలడు. హరిభక్తికలవాడు సూకరజన్మనెత్తినా తన గతజన్మసృతి కలిగిన వాడై తన కర్మలచే గోలోకమును చేరగలడు. భగవంతుడైన హరియొక్క పదపంకజములందలి భక్తియనే తేనెను ఆస్వాదించు వైష్ణవాదుల స్పర్శచేతనే ఈ భూమి పవిత్రమైనది. అట్లే పుణ్యతీర్థములు పాపులయొక్క, పాపితత్వముకలవారియొక్క, పాపముల ప్రక్షాళనకై వైష్ణవులయొక్క స్పర్శను కోరును. నారాయణ మంత్రోపదేశమును పొందినందువలన మానవులు తమకు ముందుపుట్టిన కోటి పురుషులు, తరువాత పుట్టబోవు కోటిమందితో కలసి ముక్తిని పొందుదురు. నారాయణ మంత్రాన్ని స్వీకరించినంతనే కోటి జన్మలనుండి సంపాదించిన పాపములు తొలగి, వారి పూర్వకర్మలు తొలగి పరిశుద్ధులగుదురు.

పుత్రాన్‌ దారాంశ్చ శిష్యాంశ్చ సేవకాన్‌ బాంధవాంస్తథా | యో దర్శయతి సన్మార్గం సద్గతిస్తం లభేత్‌ ధ్రువం || 59

యోదర్శయత్యసన్మార్గం శిషై#్యర్విశ్వాసితో గురుః | కుంభీపాకే స్థితిస్తస్య యావచ్చంద్ర దివాకరౌ || 60

సకింగురుః స కింతాతః స కింస్వామీ స కింసుతః | యః శ్రీకృష్ణపదాంభోజే భక్తిం దాతుమనీశ్వరః || 61

పుత్రులకు, భార్యకు, శిష్యులకు, సేవకులకు, బంధువులకు ఏయజమాని సన్మార్గమును చూపించునో అతడు సద్గతిని పొందును. శిష్యులు సంపూర్ణవిశ్వాసము తనయందుంచినా చెడుమార్గమును ఎవరు చూపింతురో ఆ గురువు సూర్యచంద్రులు కలయంత కాలము కుంభీపాక నరకముననుండును. ఎవరైతే శ్రీకృష్ణపాదభక్తిని ఇవ్వలేరో అతడు గురువైనా, తండ్రియైనా, స్వామియైనా, కొడుకైనా అతడు దుర్మార్గుడే.

శప్తో నిరపరాధేన త్వయాzహం చతురానన | మయా శప్తుం త్వముచితో ఘ్నంతం ఘ్నంత్యపి పండితాః || 62

కవచస్తోత్రపూజాభిః సహితస్తే మనుర్మనోః | లుప్తో భవతు మచ్ఛాపాత్‌ ప్రతివిశ్వేషు నిశ్చితం || 63

అపూజ్యో భవ విశ్వేషు యావత్కల్పత్రయం పితః | గతేషు త్రిషు కల్పేషు పూజ్యపూజ్యో భవిష్యసి || 64

అధునా యజ్ఞభాగస్తే వ్రతాదిష్వపి సువ్రత | పూజనం చాస్తు మా మైకం వంద్యోభవ సురాదిభిః || 65

ఇత్యుక్త్వా నారదస్తత్ర విరరామ పితుః పురః | తస్థౌ సభాయాం స విధిః హృదయేన విదూయతా || 66

ఓ చతురాననుడా! తప్పులేక నీచే శపింపబడినాను. అందువల్ల నీవుకూడ శపించుటకు తగినవాడవు. పండితులైనా చంపుచున్నవానిని చంపుచున్నారు కదా. సృష్టికర్తలకు సృష్టికారకుడవైన నీకు కవచము, స్తోత్రము, పూజ మొదలైనవి నా శాపము వల్ల ఉండకుండుగాక. మూడు కల్పములు సంపూర్ణమైన తర్వాత నీవు పూజింపబడుదువు. నీకు యజ్ఞ భాగము, వ్రతాదులలో పూజ, దేవతలు మొదలగువారిచే గౌరవింపబడడము జరుగదు. అని నారదుడు బ్రహ్మదేవునితో పలికి బాధాతప్తహృదయముతో సభయందు నిలుచుండెను.

ఉపబర్హేణ గంధర్వో నారదస్తేన హేతునా | దాసీ పుత్రశ్చ శాపేన పితురేవ చ శౌనక || 67

తత పునర్నారదశ్చ సబభూవ మహానృషిః | జ్ఞానం ప్రాప్య పితుః పశ్చాత్‌ కథయిష్యామి చాధునా ||

బ్రహ్మదేవుని శాపమువలన ఉపబర్హుడను గంధర్వుడుగా, దాసీపుత్రుడుగా తరువాత జ్ఞానమును పొంది నారదుడయ్యెను.

శౌనక మహర్షీ! నీకు తరువాత కథను చెప్పెదను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ సౌతిశౌనక సంవాదే బ్రహ్మఖండే బ్రహ్మనారద శాపోపలంభనం నామఅష్టమోzధ్యాయః.

బ్రహ్మవైవర్తమను మహాపురాణములో సౌతిశౌనక సంవాదరూపమైన బ్రహ్మఖండమున, బ్రహ్మదేవుడు, నారదుడు పరస్పరము శాపములిచ్చుకొనుట, నిందించుట అనే

ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters