sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

అష్ట చత్వారింశత్తమోzధ్యాయః - రాధోపాఖ్యావ ప్రారంభము

నారద ఉవాచ - నాదమహాముని ఇట్లనెను-

నారాయణ మహాభాగ నారాయణ పరాయణ | నారాయణాంశ భగవన్‌ బ్రూహి నారాయణీం కథాం || 1

శ్రుతం సురభ్యుపాఖ్యానం అతీవ సుమనోహరం | గోప్యం సర్వపురాణషు పురావిద్భిః ప్రశంసితం || 2

అధునా శ్రోతుమిచ్ఛామి రాధికాఖ్యానముత్తమం | తదుత్పత్తిం చ తద్ధ్యానం స్తోత్రం కవచముత్తమం || 3

నారాయణపరాయణుడవు, నారాయణాంశ సంభూతుడవు అగు నారాయణమునీ! నాకిప్పుడు నారాయణునకు సంబంధించిన కథలను వివరింపుము.

ఇంతవరకు మీరు నాకు సురభి ఉపాఖ్యానమును చాలా చక్కగా వివరించితిరి. ఇది అన్ని పురాణములందు రహస్యముగా కన్పించును. దీనిని పురాణ విదులందరు ప్రశంసింపుచుందురు.

ఇక ఇప్పుడు నాకు ఉత్తమమైన రాధా ఉపాఖ్యానమును, రాధాదేవి జనమును, ఆమె ధ్యానమును, స్తోత్రమును, కవచమును నాకు వివరముగా తెలుపుడు అని పలికెను.

శ్రీ నారాయణ ఉవాచ- నారాయణుడిట్లుపలికెను-

పురాకైలాస శిఖరే భగవంతం సనాతనం | సిద్ధేశం సిద్ధిదం సర్వస్వరూపం శంకరం పరం || 4

ప్రపుల్లవదనం ప్రీతం సస్మితం మునిభిః స్తుతం | కుమారాయ ప్రరోచంతం కృష్ణస్య పరమాత్మనః || 5

రాసోత్సవ రసాఖ్యానం రాసమండల వర్ణనం | తదాఖ్యానావసానే చ ప్రస్తావాసరే సతీ || 6

పప్రచ్ఛ పార్వతీ స్ఫీతా సస్మితా ప్రాణవల్లభం | స్తవనం కుర్వతీ భీతా ప్రాణశేన ప్రసాదితా || 7

ప్రోవాచ తం మహాదేవం మహాదేవీ సురేశ్వరీ | అపూర్వం రాధికాఖ్యానం పురాణషు సుదుర్లభం || 8

పూర్వకాలమున కైలాసపర్వతమున భగవంతుడు, సనాతనుడు, సిద్ధేశుడు, సిద్ధులను కలిగించువాడు, సమస్త స్వరూపుడగు శంకరుని మునులు సేవించుచుండగా తన పుత్రడుగు కుమారస్వామికి శ్రీకృష్ణపరమాత్మ యొక్క రాసోత్సవ కథలను మదురముగా వినిపించుచుండెను.

ఆ సమయమున పార్వతీదేవి భయపడుచు తన ప్రాణవల్లభుడగు మహాదేవుని దగ్గరకు వచ్చి అపూర్వమైన రాధికాఖ్యానము చెప్పుమని అడిగెను.

శ్రీ పార్వత్యువాచ- శ్రీపార్వతీదేవి ఇట్లనెను-

ఆగమం నిఖిలం నాథ శ్రుతం సర్వమనుత్తమం | పాంచరాత్రాదికం నీతిశాస్త్ర యోగం చ యోగినాం || 9

సిద్ధానాం సిద్ధిశాస్త్రం చ నానాతంత్రం మనోహరం | భక్తానాం భక్తిశాస్త్రం చ కృష్ణస్య పరమాత్మనః || 10

దేవీనామపి సర్వాసాం చరితం త్వన్ముఖాంబుజాత్‌ | అదునా శ్రోతుమిచ్ఛామి రాధికాఖ్యాన ముత్తమం || 11

శ్రుతౌ శ్రుతం ప్రశస్తం చ రాధాయాశ్చ సమాసతః | త్వన్ముఖాత్కాణ్వ శాఖాయం వ్యాసేనోక్తం వదాధునా || 12

ఆగమాఖ్యాన కాలే చ భవతా స్వీకృతం పురా | నహీశ్వరవ్యాహృతిశ్చ మిథ్యా భవితుమర్హతి || 13

తదుత్పత్తిం చ తద్ధ్యానం నామ్నో మహాత్మ్యముత్తమం | పూజావిధానం చరితం స్తోత్రం కవచముత్తమం || 14

ఆరాధన విధానం చ పూజాపద్ధతి మీప్సితాం | సాంప్రతం బ్రూహి భగవన్మాంభక్తాం భక్తవత్సల || 15

కథం కథితం పూర్వమాగమాఖ్యాన కాలతః | పార్వతీ వచనం శ్రుత్వా నమ్ర వక్త్రో బభూవ సః ||16

నాథ! నీవు చెప్పగా పాంచరాత్రము మొదలగు సమస్త ఆగమశాస్త్రములను, నీతిశాస్త్రమును, యోగశాస్త్రమును, సిద్ధులకు సిద్ధిశాస్త్రము, భక్తులకు భక్తిశాస్త్రము అగు శ్రీకృష్ణ పరమాత్మ చరిత్రమును మనోహరముగా వింటిని.

అట్లే సమస్త దేవతాస్త్రీల చరిత్రలు కూడా వినవలెనని నాకు కోరిక కలదు. ప్రస్తుతము ఆ దేవతాస్త్రీలలో ప్రముఖురాలగు రాధికాదేవి చరిత్రను తెలిసికొనవలెనని అనుకొనుచున్నాను.

రాధాదేవియొక్క ప్రశస్తమైన చరిత్ర వేదములలో సంక్షేపముగా కనిపించుచున్నది. నీవు దానిని కాణ్వశాఖయందున్నట్లు చెప్పితివి. దానినిప్పుడు వివరించి నాకు చెప్పుము.

రాధాదేవియొక్క జన్మవృత్తాంతమును, ఆమెయొక్క ద్యానమును, ఆమె నామమాహత్మ్యమును, పూజావిధానమును, చరిత్రను, స్తోత్రమును, కవచమును, ఆరాధనా విధానమునంతయు నీ భక్తురాలనగు నాకు చెప్పుము అని అడిగెను.

అప్పుడు శ్రీ మహాదేవుడు కొద్దిగా సిగ్గుపడెను.

పంచవక్త్రశ్చ భగవాన్‌ వుష్కకంఠౌష్ఠ తాలుకః | స్వసత్య భంగభీతశ్చ మౌనీభూయ వించితయన్‌ || 17

సస్మార కృష్ణం ధ్యానేనాభీష్ట దేవం కృపానిధిం | తదనుజ్ఞాం చ సంప్రాప్య స్వార్ధాంగాం తామువాచ సం|| 18

నిషిద్ధోzహ భగవతా కృష్ణేన పరమాత్మనా | ఆగమారంభసమయే రాధాఖ్యాన ప్రసంగతః || 19

మదర్థాంగ స్వరూపా త్వం సమద్భిన్నా స్వరూపతః | అతోzనుజ్ఞాం దదౌకృష్ణో మహ్యం వక్తుం మహేశ్వరి || 20

మదిష్టదేవకాంతా యా రాధాయాశ్చరితం సతి | అతీవ గోపనీయం చ సుఖదం కృష్ణభక్తిదం || 21

జానామి తదహం దర్గే సర్వం పూర్వాపరం వరం | యజ్ఞానామి రహస్యం చ నతద్బ్రహ్మా ఫణీశ్వరః 22

న తత్సనత్కుమారశ్చ న చ దర్మస్సనాతనః | న దేవేంద్రో మునీంద్రాశ్చ సిద్ధేంద్ర సిద్ధపుంగవా: 23

మత్తోబలవతీ త్వం చ ప్రాణాంస్త్యక్తుం సముద్యతా | అతస్త్వాం గోపనీయం చ కథయామి సురేశ్వరి || 24

శ్రుణు దుర్గే ప్రపక్ష్యామి రహస్యం పరమాద్భుతం | చరితం రాధికాయాశ్చ దుర్లభం చ సుపుణ్యదం || 25

ఐదుముఖములు కల మహాదేవుడు పార్వతీదేవియొక్క మాటలువిని నోరునాలుక ఎండిపోయినను, తన మాటనే తాను తప్పుట పాడిగాదని క్షణకాలము మౌనముగా ఉండిపోయి, తనకు ఇష్టదేవతయగు శ్రీకృష్ణుని ద్యానించెను. తరువాత శ్రీకృష్ణుని అనుజ్ఞను పొంది పార్వతితో ఇట్లు చెప్పసాగెను.

ఓ దుర్గా! ఆగమములు రచించువేళ శ్రీకృష్ణపరమాత్మ నన్ను రాధాదేవి చరిత్రను అందరకు చెప్పవద్దని నిషేధించెను.

నీవు నాకు అర్థాంగివి. నా కటే భిన్నమైన దానవుకాదు. కావున శ్రీకృష్ణ దేవుడు రాదాదేవి చరిత్ర నీకు చెప్పటకు అనుమతి నొసంగెను. రాధాదేవి నాకు ఇష్టదేవుడగు శ్రీకృష్ణుని భార్య. ఆమె చరిత్ర మిక్కిలి రహస్యమైనది. సుఖమును, శ్రీకృష్ణ భక్తిని ఇచ్చునది. రాధాదేవికి సంబంధించిన చరిత్ర అంతయు నాకు మాత్రము తెలియును. ఇది బ్రహ్మకు గాని ఆదిశేషునకుగాని, సనత్కుమారునకుగాని, ధర్మునకుగాని, దేవేంద్రునకుగాని, మునీంద్రులకుగానీ, సిద్ధేంద్రులకుగాని ఎవ్వరికిని తెలియదు.

రాధాదేవి చరిత్ర చాలా రహస్యమైన నీవునాకు ప్రాణముల కంటె గొప్ప దానవు గావున దీనిని నీకు చెప్పుచున్నాను.

పురాబృందావనే రమ్యే గోలోకేరాసమండలే | శత శృంగైక దేశే చ మాలతీ మల్లికావనే || 26

రత్న సింహాసనే రమ్యే తస్థే తత్ర జగత్పతిః | స్వేచ్ఛామయశ్చ భగవాన్బభూవ రమణోత్సుకః || 27

రిరంసోప్తస్య జగతాం పత్యుస్న్నల్లి కావనే | ఇచ్ఛయా చ భ##వేత్సర్వం తస్య స్వేచ్ఛామయస్య చ || 28

ఏతస్మిన్నంతరే దుర్గే ద్విధా రూపో బభూవ సః | దక్షిణాంగం చ శ్రీకృష్ణో వామార్థాంగా చ రాధికా || 29

బబూవ రమణీ రమ్యా రాసేశా రమణోత్సుకా | అమూల్య రత్నాభరణా రత్నసింహాసన స్థితా || 30

వహ్ని శుద్ధాంవుకాధానా కోటిపూర్ణ శశి ప్రభా | తప్త కాంచన వర్ణాభా రాజితా చ స్వతేజసా || 31

సస్మితా సుదతీ శుద్ధా శరత్పద్మవనిభాననా | భిభ్రతీ కబరీం రమ్యాం మాలతీ మాల్యమండితాం || 32

రత్నమాలాం చ చ దధతీ గ్రీష్మ సూర్య సమప్రభాం | ముక్తా హారేణ శుభ్రేణ గంగా ధారాని భేన ఛ || 33

సంయుక్తం వర్తులోత్తుంగం సుమేరుగిరి సన్నిభం | కఠినం సుందరం దృశ్యం కస్తూరీ పత్ర చిహ్నితం || 34

మాంగళ్యం మంగళార్హం చ స్తనయుగ్నం చ బిభ్రతీ | నితంబశ్రోణి భారార్తా నవ¸°వనసుందరీ || 35

కామాతురః సస్మితాం తాం దదర్శ రసికేశ్వరః దృష్ట్వా కాంతాం జగత్కాంతో బభూవ రమణోత్సుకః || 36

పూర్వము బృందావనమున నున్న రాసమండలములో శతశృంగపర్వతమును రత్నసింహాసనమున శ్రీకృష్ణపరమాత్మ కూర్చొనియుండెను. స్వేచ్ఛామయుడగు ఆ పరమాత్మకప్పుడు రమింపవలెనని కోరిక కలిగినది. అప్పుడాతని ఇచ్చవలన ఆతడే రెండు రూపములుగా నయ్యెను. కుడిపార్శ్వము శ్రీకృష్ణుడుగను ఎడమ పార్శ్వము రాధాదేవిగను ఏర్పడెను.

రాధాదేవి అమూల్యరత్నాభరణములు, బంగారు వన్నెల వస్త్రము దరించి రత్నసింహాసనమున కూర్చిండినది. ఆమె శరీర కాంతికూడా బంగారు వర్ణముననుండెను. చక్కని పలువరుస కలిగి చిరునవ్వుతో ఆమె ఉండెను. శరత్కాలమందలి పద్మమువంటి ముఖముతో మాలతీ పుష్పములమాల చుట్టబడిన కొప్పుతో, సూర్యునివంటి రత్నమాలను, గంగానది ధారవంటి ముత్యాలమాలను ధరించి చాలా అందముగా కన్పించినది.

నూతన ¸°వనమున కన్పించు రాధాదేవిని చూడగానే రసికేశ్వరుడగు శ్రీకృష్ణునకు రమింపవలెనను కోరిక ఎక్కువాయెను. దృష్ట్యా చైనం సుకాంతం చ సాదధార హరేః పురః | తేన రాధా సమాఖ్యాతా పురావిద్భిః మహేశ్వరి || 37

రాధా భజతి తం కృష్ణం స చ తాం చ పరస్పరం | ఉభయోః సర్వసామ్యం చ సదా సంతో వదంతి చ || 38

భరణం ధారణం రాసే స్మరత్యాలింగంనం జపన్‌ | తేన జల్పతి సంకేతం తత్ర రాధాం స ఈశ్వరః || 39

రాశబ్దోచ్చారణాద్భక్తో యాతి ముక్తిం సుదుర్లభాం | ధాశబ్దోచ్చారణాద్దుర్గే ధావత్యేవ హరేః పదం || 40

కృస్ణవామాంశసంభూతా రాధా రాసేశ్వరీ పురా | తస్యాశ్చాంశాంశకళయా బభూవుర్దేవ యోషితః || 41

రాఇత్యాదాన వచనః ధాచ నిర్వాణ వాచకః | తతోవాప్నోతి ముక్తిం చ తేన రాదా ప్రకీర్తితా || 42

రాధాదేవి శ్రీకృష్ణుని చూడగానే అతనిముందు తన రూపమును మరింత అందముగా చేసుకొన్నందువలన రాధ అనుపేరు ఆమెకు వచ్చినదని పెద్దలందరు.

రాధాదేవి శ్రీకృష్ణుని, శ్రీకృష్ణుడు రాధాదేవిని ఇట్లు పరస్పరము అనురాగము కలిగి సేవించుచుండిరి. వారిద్దరి మద్య అన్ని విషయములలోను సమానత్వమున్నదని పూర్వులు చెప్పుదురు.

ఆ రాసమండలమందలి మాలతీమల్లికానికుంజమున శ్రీకృష్ణుడు రాధాదేవిని బరించెడివాడు. స్మరించెడివాడు, ఆలింగనముచేసికొనెడివాడు. ఆమె నామమును జపించెడివాడు.

''రా'' శబ్దమునుచ్చరించుటచే భక్తుడు అత్యంత దుర్లభ##మైన ముక్తిని పొందుచున్నాడు. ''ధా'' శబ్ధమునుచ్చరించగనే ఆ భక్తుడు శ్రీహరి నివసించు వైకుంఠమునకు పరుగెత్తుకొని పోవుచున్నాడు. ''రా'' అనునది ఇచ్చుటను ''ధా'' అనునది ముక్తిని తెలుపును కావున ముక్తిని ప్రసాదించు ఆ దేవి ''రాధ'' యైనదని అందురు.

శ్రీకృష్ణుని వామపార్శ్వమునుండి రాసేశ్వరియగు రాధాదేవి ఆవిర్భవించగా ఆమెయొక్క అంశవలన, అంశాంశలవలన, దాని అంశములవలన దేవతా స్త్రీలందరు ఆవిర్భవించిరి.

బభూవ గోపీసంఘవ్చ రాధాయా లోమకూపతః శ్రీకృష్ణ లోనుకూపేభ్యో బభూవుః సర్వబల్లవాః || 43

రాధావామాంశ భాగేన మహాలక్ష్మీర్బభూవ సా | తస్యాధిష్ఠాతృదేవీ సా గృహలక్ష్మీ ర్బభూవ సా|| 44

చతుర్భుజస్య సా పత్నీ దేవి వైకుంఠవాసినీ | తదంశా రాజలక్ష్మీశ్చ రాజసంపత్ప్రదాయినీ || 45

తదంశామర్త్యలక్ష్మీశ్చ గృహిణాం చ గృహే గృహే | దీపాధిష్ఠాతృదేవీ చ తసై#్యవ పరమాత్మనః || 46

స్వయం రాధాకృష్ణపత్నీ కృష్ణవక్షస్థలస్థితా | ప్రాణాధిష్ఠాతృదేవీ చ తసై#్యవ పరమాత్మనః || 47

రాధాదేవియొక్క రోమకూపములనుండి గోపికా సంఘము ఉత్పన్నముకాగా శ్రీకృష్ణుని రోమకూపములనుండి సమస్త గోపజనము ఆవిర్భవించినది.

రాధాదేవియొక్క ఎడమపార్వ్శమున మహాలక్ష్మి ఆవిర్భవించినది. ఆ మహాలక్ష్మి జగత్పతియొక్క అధిష్ఠానదేవతగా గృహలక్ష్మిగా పిలవబడినది. వైకుంఠనాథుడగు చతుర్భుజుడైన నారాయణునకు ఆ మహాలక్ష్మి భార్యయైనది. ఆమెయొక్క అంశస్వరూపమే రాజలక్ష్మి, ఆ దేవి రాజులకు రాజసంపదను కలిగించును. రాజలక్ష్మియొక్క అంశ్వరూపము మర్త్యలక్ష్మి. ఈదేవీ భూలోకమున అందరి ఇండ్లలో దీపాధిష్ఠాన దేవతగా నున్నది.

శ్రీరాధాదేవి శ్రీకృష్ణుని వక్షస్థలమున ఎల్లప్పుడుండును. ఆమె ఆ పరమాత్మయొక్క ప్రాణములకు అధిష్ఠాన దేవత.

ఆ బ్రహ్మస్తంబపర్యంతం పర్వం మిథ్యైవ పార్వతి | భజ సత్యం పరంబ్రహ్మ రాధేశం త్రిగుణాత్పరం || 48

పరం ప్రధానం పరమం పరమాత్మాన మీశ్వరం | సర్వాద్యం సర్వపూజ్యం చ నిరీహం ప్రకృతేః పరం || 49

స్వేచ్ఛామయం నిత్యరూపం భక్తానుగ్రహ విగ్రహం | తద్భిన్నానాం చ దేవానాం ప్రాకృతం రూపమేవ చ || 50

తస్యప్రాణాధికా రాధా బహుసౌభాగ్యసంయుతా | మహావిష్ణోః ప్రసూః సా చ మూలప్రకృతిరీశ్వరీ || 51

మానినీం రాధికాం సంతః సేవంతే నిత్యశః సదా | సులభం యత్పదాంభోజం బ్రహ్మాదీనాం సుదుర్లభం || 52

స్వప్నే రాధా పదాంభోజం నిహిపశ్యంతి బల్లవాః | స్వయం దేవీ హరేః క్రోడే ఛాయా రూపేణ కామినీ || 53

బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంబపర్యంతమున్న ఈచారాచర జగత్తు సమస్తము నశ్వరమైనది. శాశ్వతమైనవాడు. త్రిగుణాతీతుడు, పరాత్పరుడైన రాధాకాంతుడొక్కడే పరమాత్మ, ఈశ్వరుడు సర్వసృష్టికి విభూతుడు సమస్తజనులచే పూజలనందుకొనువాడు. కోరికలులేనివాడు. ప్రకృతికంటే శ్రేష్ఠుడు. స్వేచ్చామయుడు, భక్తులననుగ్రహించువాడు అగు శ్రీకృష్ణుని నీవు ఆరాధింపుము.

అతడు తప్ప మిగిలిన దేవతల యొక్క రూపము ప్రాకృతమైనది. రాధాదేవి శ్రీకృష్ణునకు తన ప్రాణములకంటే ప్రియమైనది. ఆమె బహుభాగ్యవతి, శ్రీమహావిష్ణువునకు మాత. ఆమెయే మూల ప్రకృతి.

సత్ఫురుషులెల్లప్పుడు రాధాదేవిని సేవించుచుందురు. బ్రహ్మది దేవతలకుకూడా దుర్లభ##మైన ఆమె పాదసేవ వారికి సులభముగా లభించును. గోలోకముననున్న గోపలకులకు సైతము ఆమె పదపంకజములసేవ కలలోనైనా లభింపదు. అట్టి రాధాదేవి శ్రీకృష్ణుని వక్షస్థలమున చాయగా ఎల్లప్పుడు నివసించుచుండును.

స చ ద్వాదశగోపానాం రాయణ ప్రవరః ప్రియే | శ్రీకృష్ణాంశశ్చ భగవాన్‌ విష్ణుతుల్య సరాక్రమః 54

సుదామ శాపాత్సా దేవీ గోలోకాదాగతా మహీం | వృషభాను గృహే జాతా తన్మాతా చ కళావతీ 55

ఆ రాధిక సుదాముని యొక్క శాపమువలన భూలోకమున కళావతీ వృషభానులకు కూతురుగా జన్మించెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదాంతర్గత హరగౌరీ సంవాదే రాధోపాఖ్యానే రాధోత్పత్తి తత్పూజాది కథనం నామ అష్టచత్వారింశత్తమోధ్యాయః |

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణ సంవాదమున కనిపించి గౌరీశంకరుల సంవాదమున చెప్పబడిన రాదోపాఖ్యానమున రాధాదేవి జననము ఆమె యొక్క పూజాదులు గల నలభై ఎనిమిదవ అధ్యయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters