sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

సప్తవింశతి తమోధ్యాయః - భక్ష్యా భక్ష్య పదార్థముల వివరణ

నారద ఉవాచ - నారదుడు ఇట్లు పలికెను -

భక్ష్యం కివాzప్యభక్ష్యం చ ద్విజానాం గృహిణాం ప్రభో | యతీనాం వైష్ణవానాం చ విధవాబ్రహ్మచారిణాం || 1

కి కర్తవ్యమకర్తవ్యం అభోగ్యం భోగ్యమేవ వా | సర్వం కథయ సర్వజ్ఞ సర్వేశ్‌ సర్వకారణం || 2

ఓ ప్రభూ బ్రాహ్మణులు, గృహస్థులు, సన్యాసులు, వైష్ణవులు విధవలు, బ్రహ్మచారులు తినతగిన వస్తువులు, తినతగనివి ఏవి? అట్లే ఏది చేయదగినది? ఏది చేయదగినది. ఏది అనుభవించతగినది? ఏది అనుభవించతగనిది. సర్వేశుడు ఎవరు? సర్వకారణమేది? వీటనన్నిటినీ విస్తరముగా నాకు తెలుపవలసినది.

మహేశ్వర ఉవాచ - మహేశ్వరు డిట్లనెను -

కశ్చిత్తపస్వీ విప్రశ్చ నిరాహారీ చిరం మునిః | కశ్చిత్సమీరణాహారీ ఫలాహారీ చ కశ్చన || 3

అన్నాహారీ యథాకాలే గృహీ చ గృహిణీయుతః | యేషామిచ్ఛా చ యా బ్రహ్మన్‌ రుచీనాం వివిధాగతిః || 4

హవిష్యాన్నం బ్రహ్మణానాం ప్రశస్తం గృహిణాం సదా | నారాయణోచ్ఛిష్టమిష్ట మభక్ష్యమనివేదితం || 5

అన్నం విష్ఠా జలం మూత్రం యద్విష్ణోరనివేదితం | విణ్మూత్రం సర్వధా ప్రోక్తం అన్నం చ హరివాసరే || 6

బ్రాహ్మణః కామతోzన్నం చ యో భుంక్తే హరివాసరే | త్రైలోక్యజనితం పాపం సోzపి భుంక్తే న సంశయః || 7

న భోక్తవ్యం న భోక్తవ్యం న భోక్తవ్యం చ నారద | గృహిభిర్భ్రాహ్మణౖరన్నం సంప్రాప్తే హరివాసరే || 8

గృహీ శైవశ్చ శాక్తశ్చ బ్రహ్మణో జ్ఞనదుర్బలః | ప్రయాతి కాలసూత్రం చ భుక్త్వా చ హరివాసరే || 9

కృమిభిః శాలిమానైశ్చ భక్షితస్తత్ర తిష్ఠతి | విణ్మూత్రభోజనం కృత్వా యావదింద్రాశ్చతుర్దశ || 10

జన్మాష్టమీ దినే రామనవమీ దివసే హరేః | శివరాత్రౌ చ యో భుంక్తే సోzపి ద్విగుణ పాతకీ || 11

ఉపావాసాసమర్థశ్చ ఫలం మూలం జలం పిబేత్‌ || నష్టే శరీరే స భ##వేదన్యథా చాత్మఘాతకః || 12

సకృద్భుంక్తే హవిష్యాన్నం విష్ణోర్నైవేద్యమేవ చ | నభ##వేత్‌ ప్రత్యవాయీ స చోపవాసఫలం లభేత్‌ || 13

ఏకాదశ్యామనాహారం గృహీ విప్రశ్చ భారతే | స చ తిష్ఠతి వైకుంఠే యావద్వై బ్రహ్మణో వయః || 14

గృహిణాం శైవశక్తానాం ఇదముక్తం చ నారద | విశేషతో వైష్ణవానాం యతీనాం బ్రహ్మచారిణాం || 15

నిత్యం నైవేద్యభోజీయః శ్రీవిష్ణుస్స హి వైష్ణవః | నిత్యం శతోపవాసానాం జీవన్ముక్తవఫలం లభేత్‌ || 16

వాంఛంతి తస్య సంస్పర్శం తీర్థాన్యఖిలదేవతాః | ఆలాపం దర్శనం చైవ సర్వపాప ప్రణాశనం || 17

ద్విః స్విన్నమన్నం పృథుకం శుద్ధం దేశవిశేషకే | నాత్యంతం శస్తం విప్రాణాం భక్షణ న నివేదనే || 18

అభక్ష్యం వై యతీనాం చ విధవా బ్రహ్మచారిణాం | తాంబూలం చ యథా బ్రహ్మన్‌ దథైతద్వస్తు న ధ్రువం || 19

తాంబూలం విధవాస్త్రీణాం యతీనాం బ్రహ్మచారిణాం | తపస్వినాం చ విప్రేంద్ర గోమాంససదృశం ధ్రువం || 20

ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై తపస్వి కావచ్చును. అట్లే మరియొక ముని గాలిని మాత్రమే ఆహారముగా స్వీకరింపవచ్చును. ఇంకొకడు ఫలములను మాత్రమే ఆహారముగా తీసికొనవచ్చును. ఒక గృహస్థుడైన బ్రాహ్మణుడు భార్యతో కలిసి కాలనియమములతో అన్నమును తినవచ్చును.

ఈ విధముగా ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్క విధముగా నుండవచ్చును.

గృహస్థులైన బ్రాహ్మణులకు హోమమునకు సంబంధించిన అన్నము (హవిష్యాన్నము) మిక్కిలి ప్రశస్తమైనది. నారాయణునకు నైవేద్యముగా పెట్టిన అన్నముకూడ శ్రేష్ఠమైనది. కాని నైవేద్యము పెట్టని అన్నము మాత్రము తినతగినది కాదు. విష్ణుమూర్తికి నైవేద్యమిడక తిన్న అన్నము, పానీయము మలమూత్రములవంటివి. అట్లే హరివాసరమైన ఏకాదశినాడు తిన్న అన్నము, త్రాగిన పానీయము కూడా మలమూత్రములవంటివే. ఏకాదశినాడు భోజనము చేసినవాడు ముల్లోకములందున్న పాపములనన్నిటిని అనుభవించును. ఏకాదశినాడు గృహస్థాశ్రమముననున్న బ్రాహ్మణులు ఎట్టి పరిస్థితులలోను అన్నము భుజించరాదు. జ్ఞానములేని బ్రాహ్మణ గృహస్థు, శైవుడైనను, శాక్తేయుడైనను ఏకాదశినాడు అన్నము తినినచో నరకమునకు పోవును. అచ్చట పదునలుగురు ఇంద్రుల కాలమువరకు క్రిమికీటకముచే బాధింపబడును. మలమూత్రములను అనుభవించును.

అట్లే శ్రీకృష్ణాష్టమి దినము, శ్రీరామనవమి, శివరాత్రి దినములలో అన్నమును భుజించినవాడు ఏకాదశినాడు భుజించినవానికన్న రెండురెట్లు అధికపాపమును పొందును.

పై దినములలో ఉపవాసము సంపూర్ణముగా చేయలేనివాడు పండ్లను, గడ్డలను, జలములను త్రాగవచ్చును. ఉపవాసముచేయు సామర్థ్యములేనివాడు బలవంతముగా ఉపవాసముచేసి చనిపోయినచో ఆత్మహత్య చేసికొనిన వాడగును.

విష్ణునివేదితాన్నమునుగాని, హవిష్యాన్నమును గాని ఒక సారి మాత్రము తిననిచో అతనికి పాపమంటదు. పైగా అతడు ఉపవాసముచేసిన ఫలమును పొందును.

ఏకాదశీ దినమున ఆహారము తీసికొనని గృహస్థుడు బ్రహ్మదేవుడు బ్రతికియున్నంతవరకు వైకుంఠమున శ్రీహరి సన్నిధిలో నివసించగలడు. ఇది శైవులు, శాక్తేయులు, వైష్ణవులు, యతులు, బ్రహ్మచారులు అనుసరించవలసిన పద్ధతి.

ప్రతిదినము శ్రీహరికి నివేదితమైన అన్నము తిను వైష్ణవుడు శ్రీవిష్ణువే యగుచున్నాడు. అతడు ప్రతి వంద ఉపవాసములు చేసినవారితో సమానమైన ఫలమును, జీవన్ముక్తుని ఫలమును పొందును. అట్టి పుణ్యవంతుని స్పర్శను పొందవలెనని సమస్త పుణ్యతీర్థములు, సమస్త దేవతలు కోరుకొందురు. అతనిని చూచినను, అతనితో మాట్లాడినను సమస్త పాపములు తొలగిపోవును.

రెండుమార్లు ఉడికించిన అన్నము (వేపుడు బియ్యము?) అటుకులు కొన్ని ప్రాంతములలో పరిశుధ్దమే ఐనను బ్రాహ్మణులు తినుటకుగాని భగవంతునకు నైవేద్యము పెట్టుటకు గాని పనికిరావు. అట్లే బ్రహ్మచారులకు, యతులకు, విధవలకు పై వస్తువుల పనికిరావు. బ్రహ్మచారులు మొదలైనవారు తాంబూలమును తిన్నచో అది గో మాంసభక్షణముతో సమానవైనది. అందువల్ల బ్రహ్మచారులు, సన్యాసులు, విధవలు తాంబూలమును తీసికొనకూడదు.

సర్వేషాం బ్రాహ్మణానాం యదభక్ష్యం శ్రుణు నారద | యదుక్తం సావేదే చ హరిణా చాహ్నిక క్రమే || 21

తామ్రపాత్రే పయః పానముచ్ఛిష్టే ఘృత భోజనం | దుగ్థం లవణసార్థం చ సద్యో గోమాంస భక్షణం || 22

నారికేళోదకం కాంస్యే తామ్రపత్రే స్థితం లఘు | ఐక్షవం తామ్రపత్రస్థం సురాతుల్యం న సంశయః || 23

ఉత్థాయ వామహస్తేన యస్తోయం పిబతి ద్విజః | సురాపీ చ స విజ్ఞేయః సర్వధర్మ బహిష్కృతః || 24

అనివేద్యం హరేరన్నం భుక్తశేషం చ నిత్యశః | పీతశేషజలంచైన గోమాంససదృశం మునే || 25

వానింగణఫలం చైవ గోమాంసం కార్తికే స్మృతం | మాఘే చ మూలకం చైవ కలంబీ శయనే తథా || 26

శ్వేతవర్ణం చ తాళం చ మసూరం మత్స్యమేవ చ | సర్వేషాం బ్రాహ్మణానాం చ త్యాజ్యం సర్వత్ర దేశ##కే || 27

మత్స్యాంశ్చ కామతో భుక్త్వా సోపవాసః త్ర్యహం వసేత్‌ | ప్రాయశ్చిత్తం తతః కృత్వా శుద్ధిమాప్నోతి బాడవః || 28

ప్రతిపత్సు చ కూష్మాండం అభక్ష్యం హ్యర్థనాశనం | ద్వితీయాయాం చ బృహతీ భోజనేన స్మరేద్ధరిం || 29

అభక్ష్యం చ పటోలం చ శత్రువృద్ధి కరం పరం | తృతీయాయాం చతుర్థ్యాం చ మూలకం ధననాశనం || 30

కలంకకారణం చైవ పంచమ్యాం బిల్వభక్షణం | తిర్యగ్యోనిం ప్రాపయేత్తు షష్ఠ్యాం వై నింబభక్షణం || 31

రోగవృద్ధికరం చైవ నరాణాం తాళభక్షణం | సప్తమ్యాం చ తథా తాళం శరీరస్య చ నాశకం || 32

నారికేళఫలం భక్ష్యమష్టమ్యాం బుద్ధినాశనం | తుంబీ నవమ్యాం గోమాంసం దశమ్యాం చ కలంబికా || 33

ఏకాదశ్యాం తథ శింబీ ద్వాదశ్యాం పూతికా తథా | త్రయోదశ్యాం చ వార్తాకీ న భక్ష్యా పుత్రనాశనం || 34

చతుర్దశ్యాం మాషభక్ష్యం మహాపాపకరం పరం | పంచాదశ్యాం తథా మాంసమభక్ష్యం గృహిణాంమునే || 35

సామవేదమున 'ఆహ్నిక' విషయమున శ్రీహరి చెప్పిన బ్రాహ్మణులు తినకూడని వస్తువులను నారదా ! తెలిసికొనుము.

రాగిపాత్రలో పోసిన పాలు త్రాగినచో, తిని వదలివేసిన అన్నములో నేయి వేసికొని తిన్నదానితో సమానము. అట్లే పాలలో ఉప్పువేసికొని తాగినచో, అది గోమాంసమును తిన్నదానితో సమానము. కంచుపాత్రలో, రాగిపాత్రలో నున్న కొబ్బరినీరు, రాగిపాత్రలో పోసిన చెరుకురసము కల్లుతో సమానమైనవి.

ఎడమచేతితో నీళ్ళుత్రాగు బ్రాహ్మణుడు కల్లు తాగినవానితో సమానుడు. శ్రీహరికి నివేదితముకాని అన్నము. తినగా మిగిలిన అన్నము (భుక్త శేషము), త్రాగగా చెంబులోనో ఇతర పాత్రలోనో మిగిలిన నీరు, ఆవుమాంసముతో సమానమైనవి.

కార్తిక మాసములో వానింగణ ఫలము మాఘమాసములో గడ్డకూరలు, ఆషాఢమాసములో బచ్చలికూర తినకూడదు. అదే విధముగా తాటిపండ్లు (ముంజలు), చిరుసెనగలు, చేపలు అన్ని కాలములందును, అన్ని ప్రదేశములలోను తినకూడదు. చేపలను తిన్న బ్రాహ్మణుడు మూడుదినములుపవాసముండి ప్రాయశ్చిత్తము చేసికొన్నగాని పరిశుద్ధుడు గాలేడు.

ప్రతిపద (పాడ్యమి) తిథినాడు గుమ్మడికాయ, విదియానాడు బృహతీ పత్రములలో భోజనము, పొట్లకాయ తృతీయనాడు, చవితినాడు గడ్డకూరలు, పంచమినాడు మారేడు, షష్ఠినాడు వేపపువ్వు తినుట, సప్తమినాడు తాటిపండ్లు తినుట, అష్టమినాడు కొబ్బరికాయ తినుట, నవమినాడు సొరకాయ, దశమినాడు తీగబచ్చలి, ఏకాదశినాడు పెసర్లు మినుములవంటి ధాన్యములు, ద్వాదశినాడు పూతిక, త్రయోదశినాడు వంకాయ, చతుర్దశినాడు మినుములతో చేసిన వస్తువులు, అమావాస్యా,పౌర్ణిమలలో మాంసము తినకూడని వస్తువులు.

గృహిణాం ప్రోక్షితం మాంసం భక్ష్యమన్యదినేషు చ | ప్రాతః స్నానే తథా శ్రాద్ధే పార్వణ వ్రతవాసరే || 36

ప్రశస్తం సార్షపం తైలం పక్వతైలం చ నారద | కుహూ పూర్ణేందు సంక్రాంతి చతుర్దశ్యష్టమీషు చ || 37

రవౌ శ్రాద్ధే వ్రతాహే చ దుష్టం స్త్రీతిలతైలకం | మాంసం చ రక్తశాకం చ కాంస్యపాత్రే చ భోజనం || 38

నిషిద్ధం శయనం చైవ కూర్మమాంసం చ మంత్రితం | నిషిద్ధం సర్వవర్ణానాం దివా స్వస్త్రీ నిషేషణం || 39

రాత్రౌ చ దధిభక్ష్యం చ శయనం చ సంధ్యయోర్దినే | రజస్వలా స్త్రీగమనమేతన్నరక కారణం || 40

ఉదక్యవీరయో రన్నం పుంశ్చల్యన్నమభక్షకం | శూద్రాన్నం యాజకాన్నం చ శూద్రశ్రాద్ధాన్నమేవ చ || 41

అభక్ష్యాన్నం చ విప్రర్షే యదన్నం వృషలీపతేః | బ్రహ్మన్‌ వార్ధుషికాన్నం చ గణకాన్నమభక్షకం || 42

అగ్రదాని ద్విజాన్నం చ చికిత్సాకారకస్య చ | హస్తచిత్రహరౌ తైల మగ్రాహ్యం చాప్యభక్షకం || 43

మూలే మృగే భాద్రపదే మాంసం గోమాంసతుల్యకం | అమాయాం కృత్తికాయాం చ ద్విజైః క్షౌరం వివర్జితం || 44

కృత్వా తు మైథునం క్షౌరం యో దేవాంస్తర్పయోత్పితౄన్‌ | రుధిరం తద్భవేత్తోయం దాతా చ నరకం వ్రజేత్‌ || 45

యత్కర్తవ్యమకర్తవ్యం యద్భోజ్యం యదభోజ్యకం | సర్వం తుభ్యం నిగదితం కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 46

గృహస్థులు పైన తెల్పిన దినములు కాక మిగిలిన దినములలో మాంసము తినవచ్చును. ఉదయము స్నానము చేయగానే పార్వణశ్రాద్ధమున, వ్రతములనాడు ఆవాలనూనె లేదా పక్వము చేసి తీసిన నూనె ప్రశస్తమైనది.

అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి దినములు, అష్టమీ చతుర్దశీతిథులు, ఆదివారమునాడు, శ్రాద్ధదినము, వ్రతదినములలో స్త్రీ సహవాసము, నూవులనూనె పనికిరానివి.

మాంసము, ఎఱ్ఱని కూరగాయలు, కంచుపాత్రలో భోజనము, ఇతరస్త్రీల పొందు, తాబేటిమాంసము నిషిద్ధములు. అట్లే అన్ని కులములవారు పగటిపూట తన భార్యతోనైనా సంగమము చేయరాదు. అదేవిధముగా రాత్రిపూట పెరుగువేసికొని తినుట, పగటిపూట, ప్రాతః సాయంకాల సంధ్యలలో నిద్రపోవుట కూడనివి. ముట్టైన స్త్రీసంగమము పూర్తిగా వదిలిపెట్టవలెను. అది నరకమునకు కారణమగుచున్నది.

రజస్వలయైన స్త్రీయొక్క అన్నము, జారస్త్రీ పెట్టిన అన్నము, యాజకాన్నము, శూద్రాన్నము, శూద్రస్త్రీని ఉంచుకొనిన బ్రాహ్మణుని అన్నము, ధనమప్పుగానిచ్చి దాని వడ్డీవలన బ్రతుకువాని అన్నము, కరణముయొక్క అన్నము తినరానివి.

అట్లే అగ్రదాని లే అత్యాశకుపోయి తొలుతనే దానము తీసుకొను బ్రాహ్మణుని అన్నము, వైద్యుని అన్నము కూడా భుజించకూడదు.

మూలానక్షత్రమున మృగశిరనక్షత్రమున, భాద్రపమాసమందును మాంసము భుజింపరాదు. అది ఆ దినములలో గో మాంస సమమై ఉండును.

అమావాస్యనాడు, కృత్తికా నక్షత్రమునాడు ద్విజులు క్షారముచేసికొనకూడదు. క్షౌరము చేసికొనిన తరువాత, స్త్రీసంగమము తరువాత దేవతార్చన, పితృతర్పణము చేయకూడదు.

నారద! గృహస్థులు చేయతగిన పనులు, చేయతగని పనులు, తినతగినవి, తిన తగనివి అన్నిటినీ నీకుచెప్పితిని. ఇంకను వినవలసినవి ఏవైనా ఉన్నచో అడుగుము.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతిశౌనక సంవాదే నారదం ప్రతి శివోపదేశే భక్ష్యాది వివరణం నామ సప్తవింశతితమోzధ్యాయః

శ్రీబ్రహ్మ వైవర్తమహాపురాణమున సౌతిశౌనకుల సంవాదముగల బ్రహ్మఖండమున నారదునకు శివుడుపదేశించిన భక్ష్యాభక్ష్యముల వివరణ గల

ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters