sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

అష్టాదశోzధ్యాయ ః - మహాపురుష స్తోత్రము

సౌతిరువాచ - సౌతి మహర్షి ఇట్లనెను -

దేవాస్సార్థం బ్రాహ్మణన మోహితా విష్ణుమాయయా | ప్రయయుర్మాలతీమూలం బ్రహ్మేశానపురోగమాః || 1

బ్రహ్మా కమండలుజలం దదౌ గాత్రే శవస్య చ | సంచారం మనసస్తస్య చకార సుందరం వపుః || 2

జ్ఞానం దదౌ తస్య జ్ఞానానందః శివః స్వయం | ధర్మజ్ఞానం స్వయం ధర్మో జీవదానం చ బ్రాహ్మణః ||3

వహ్నిదర్శనమాత్రేణ బభూవ జఠరానలః | కామదర్శనమాత్రేణ సర్వకామః సునిశ్చతం || 4

తస్య వాయోరధిష్టానాజ్జగత్ర్పాణస్వరూపిణః | నిశ్వాసస్య చ సంచారః ప్రాణానాం చ బభూవ హ|| 5

సూర్యధిష్ఠానమాత్రేణ దృష్టిశక్తిర్బభూవ హ | వాక్యం వాణీదర్శనేన శోభా శ్రీదర్శనేన చ || 6

శవస్తథాzపి నోత్తస్థౌ యథా శేతే జడస్తథా | విశిష్టబోధనం ప్రాప చాధిష్ఠానం వినాత్మనః || 7

బ్రహ్మణో వచనాత్సాధ్వీ తుష్టావ పరమేశ్వరం | స్నాత్వా శీఘ్రం సరిత్తోయే ధృత్వా ధౌత్వా ధౌతే చ వాససీ || 8

విష్ణుమూర్తి యొక్క మాయవలన మాయచేకప్పబడిన దేవతలందరు బ్రాహ్మణునితో పాటు మాలతీదేవి దగ్గరకు పోయిరి.

బ్రహ్మదేవుడు ఉపబర్హణుని శవముపై తన కమండలంలోని నీరు చల్లి అతనికి అందమైన శరీరము, మనస్సంచార మేర్పడునట్లు చేసెను. జ్ఞాన స్వరూపుడైన శివుడు జ్ఞానమును ప్రసాదించగా ధర్మదేవత ధర్మ జ్ఞానమును బ్రాహ్మణుడు ప్రాణములనిచ్చెను. అగ్నిని చూడగానే జఠరాగ్ని, మన్మథుని చూడగానే సమస్తమైన కోరికలు, ప్రపంచమునకే ప్రాణ స్వరూపుడైన వాయువువలన ప్రాణసంచార రూపమైన ఉచ్ఛ్వాస నిశ్వాసములేర్పడినవి. సూర్యుని వలనచూపు, సరస్వతి వలన మాటలు, లక్ష్మీదేవివలన ఆ శవమునకు కాంతి కలిగినవి.

ఐనను ఆశవము సోమరి పడుకొనిఉన్నట్లు ఆత్మతప్ప తక్కిన చైతన్యమునంతయు పొందెను.

బ్రహ్మదేవుని సూచనననుసరించి సాధ్వియైన మాలావతి నదిలో స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకొని పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని ఇట్లు స్తుతించినది.

వందే తం పరమాత్మానం సర్వకారణ కారణం | వినా యేన శవాః సర్వే ప్రాణినో జగతీ తలే || 9

నిర్లిప్తం సాక్షిరూఫం చ సర్వేషాం సర్వకర్మసు | విద్యమానం న దృష్టం చ సర్వైః సర్వత్ర సర్వదా ||10

యేన సృష్టా చ ప్రకృతిః సర్వాధారా పరాత్పరా | బ్రహ్మ విష్ణు శివాదీనాం ప్రసూర్యా త్రిగుణాత్మికా|| 11

జగత్‌ స్రష్టా స్వయం బ్రహ్మో నియతో యస్య సేవయా | పాతా విష్ణుశ్చ జగతాం సంహర్తా శంకరః స్వయం || 12

ధ్యాయంతే యం సురాః సర్వే మునయో మనవస్తథా | సిద్ధాశ్చ యోగినః సంతః సంతతం ప్రకృతేః పరం || 13

సాకారం చ నిరాకారం పరం స్వేచ్ఛామయం ప్రభుం | వరం వరేణ్యం వరదం వరార్హం వరకారణం || 14

తపఃఫలం తపోబీజం తపసాం చ ఫలప్రదం | స్వయం తపఃస్వరూపం చ సర్వరూపంచ సర్వతః||15

సర్వాధారం సర్వబీజం కర్మ తత్కర్మణాం ఫలం | తేషాం చ ఫలదాతారం తద్భీజం క్షయకారణం || 16

స్వయం తేజః స్వరూపంచ భక్తానుగ్రహవిగ్రహం | సేవాధ్యానం న ఘటతే భక్తానాం విగ్రహం వినా || 17

తత్తేజోమండలాకారం సూర్యకోటి సమప్రభం | అతీవ కమనీయం చ రూపం తత్ర మనోహరం ||18

నవీననీరదశ్యామం శరత్పంకజలోచనం | శరత్పార్వణచంద్రాస్యమీషద్ధాస్యసమన్వితం ||19

కోటికందర్పలావణ్యం లీలాధామ మనోహరం | చందనోత్‌క్షిత సర్వాంగం రత్నభూషణ భూషితం || 20

ద్విభుజం మురళీహస్తం పీతకౌశేయవాససం | కిశోరవయసం శాంతం రాధాకాంతమనంతకం || 21

గోపాంగనా పరివృతం కుత్రచిన్నిర్జనే వనే | కుత్రచిద్రాసమధ్యస్థం రాధయా పరిషేవితం || 22

కుత్ర చిద్గోపవేషం చ వేష్టితం గోపబాలకైః | శతశృంగాచలోత్కృష్టే రమ్యే బృందావనే వనే || 23

నికరం కామధేనూనాం రక్షంతం శిశురూపిణం | గోలోకే నిరజాతీరే పారిజాతవనే వనే || 24

వేణుం క్వణంతం మధురం గోపీసమ్మోహకారణం | నిరామయే చ వైకుంఠే కుత్రచిచ్చ చతుర్భుజం || 25

సమస్త కారణములకు కారణమైన పరమాత్మను సమస్కరించుచున్నాను. ఆ పరమాత్మ లేనిచో ఈ ప్రపంచమున నున్న ప్రాణులన్నీ శవములవలె ఉండును. సమస్త ప్రాణులు చేయు కర్మలకు అతడు సాక్షీభూతుడు. అట్లే అంతటా అతడు ఉన్నప్పటికి ఎవరికీ కనిపించడు. పరమాత్మ సృష్టియైన ప్రకృతి త్రిగుణాత్మికయైనది. ఆ ప్రకృతియే బ్రహ్మాది దేవతలకు కారణముగా నున్నది. ఆ పరమాత్మను సేవించినందువలననే బ్రహ్మదేవుడు ఈ ప్రపంచమునంతా సృష్టించుచున్నాడు. విష్ణుమూర్తి ఆ సృష్టినంతయు రక్షించుచున్నాడు. అట్లే శంకరుడు సంహరించుచున్నాడు.

దేవతలు, మునులు, మనువులు, యోగులు, సిద్ధులు, సత్పురుషులందరు ప్రకృతికి అతీతుడైన ఆ పరమేశ్వరుని సేవించుచున్నారు. ఆ పరమేశ్వరుడు సాకారుడు, నిరాకారుడు కూడా. అతడు స్వేచ్ఛామయుడు, శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు. వరములనిచ్చువాడు . వరముల నిచ్చుటకు తగిన అర్హత కలవాడు, అతడే తపఃఫలము. తపస్సుకు కారణము. తపఃఫలములనిచ్చువాడు. తపస్స్వరూపుడు. అందరకు ఆధారభూతుడు, అన్నిటికి కారణరూపుడు, కర్మస్వరూపుడు అందరి కర్మలకు ఫలితము కూడ అతడే . కర్మఫలములనిచ్చువాడు కర్మలకు కారణము, వాటి క్షయమునకు అతడే కారణమగుచున్నాడు.

ఆ పరమాత్మయే తేజఃస్వరూపుడు, అతడు భక్తుల ననుగ్రహించుటకు శరీరమును ధరించినవాడు. భక్తులు, అతనిని సేవించుటకు ధ్యానించుటకు అతనికి శరీరము లేనిచో వారికి కష్టమగును. ఆ పరమాత్మ కోటి సూర్యులతో సమానమైన కాంతికలవాడు. అతని తేజస్సు మండలాకారమున నుండును. అతని రూపము మిక్కిలి అందమైనది. నూతన మేఘమువలె నల్లనిది. అతడు శరత్కాలమందలి పద్మములవంటి కన్నులు కలవాడు. శరత్కాలమందలి పున్నమి చంద్రునివలె గుండ్రని ముఖము కలవాడు. చిరునవ్వుకలవాడు. కోటి మన్మథుల సౌందర్యము కలవాడు. రత్నభూషణాలంకృతుడు అతని అవయవములన్నీ చందన చర్చితములై యుండును.

అతడు రెండు భుజములు కలవాడు. చేతిలో మురళిని ధరించును. పచ్చని పట్టుబట్టలు ధరించును. రాధాకాంతుడైన అతడు కిశోర వయస్కుడు శాంతుడు అనంతుడు.

ఒక్కచోట అతడు గోపాంగనలతో పరీవృతుడు. మరియెకచోట నిర్జనమైన వనమున ఉండును. ఒకచోట రాసక్రీడలో విహరించును. మరియొకచోట రాధతో కలిసియుండును. ఒకచోట గోపవేషముతో గోపబాలకులతో కలసియుండును. మరియొకసారి శతశృంగపర్వతముపై నున్న బృందావనమున ఉండును. ఒకసారి విశురూపియై ధేనువులను రక్షించును. మరియొకసారి గోలోకమున విరజానదీ తీరమున నున్న పారిజాతవనమున గోపికలను సమ్మోహపరచుచు వేణువును మధురముగా పాడును. ఒకప్పుడు వైకుంఠమున చతుర్భుజుడుగా కనిపించును.

లక్ష్మీకాంతం పార్షదైశ్చ సేవితం చ చతుర్భుజైః | కుత్రచిత్‌ స్వాంశరూపేణ జగతాం పాలనాయ చ|| 26

శ్వేతద్వీపే విష్ణురూపం పద్మయా పరిషేవితం | కుత్రచిత్‌ స్వాంశకళయా బ్రహ్మాండే బ్రహ్మరూపిణం || 27

విశ్వస్వరూపం శివదం స్వాంశేన శివరూపిణం | స్వాత్మనః షోడశాంశేన సర్వాధారం పరాత్పరం || 28

స్వయం మహద్విరాడ్రూపం విశ్వౌఘం యస్య లోమసు | లీలయా స్వాంశకలయా జగతాం పాలనాయ చ || 29

నానావతారం బిభ్రంతం బీజం తేషాం సనాతన | వసంతం కుత్రచిత్‌ సంతం యోగినాం హృదయే సతాం || 30

ప్రాణరూపం ప్రాణానాం చ పరమాత్మానమీశ్వరం | తం చ స్తోతుమశక్తాz హం అబాలా నిర్గుణం విభుం || 31

నిర్లక్ష్యం చ నిరీహంచ సారం వాఙ్మనసః పరం | యం స్తోతుమక్షోమోz నంతః సహస్రవదనేన చ || 32

పంచవక్త్రశ్చతుర్వక్త్రో గజవక్త్రః షడాననః యం స్తోతుం నక్షమా మాయా మోహితా యస్య మాయయా || 33

యం స్తోతుం న క్షమా శ్రీశ్చ జడీభూతా సరస్వతీ | వేదా న శక్తా యం స్తోతుం కో వా విద్వాంశ్చ వేదవిత్‌ || 34

కిం స్తౌమి తమనీహం చ శోకార్తా స్త్రీ పరాత్పరం | ఇత్యుక్త్వా సా చ గాంధర్వీ విరరామ రురోద చ || 35

ఒక చోట లక్ష్మీకాంతుడై చతుర్భుజులైన పార్షదులతో కలసియుండును. మరియొకచోట అతని అంశ రూపమైన విష్ణురూపముతో శ్వేత ద్వీపములో లక్ష్మీదేవితో కలిసి యుండును.

మరియొక చోట ఆ పరమాత్మయొక్క అంశాంశ##మైన బ్రహ్మదేవుని రూపముతోనుండును. అట్లే అతని అంశ##యైన శివరూపముతో మంగళప్రదుడై కనిపించును. అతని పదునారవ అంశ##మే సమస్తమునకు ఆధారమైన పరాత్పరుడు. మహత్స్వరూపుడు. విరాడ్రూపుడు. అతని ఒక్కొక్క రోమమున ఒక్కొక్క విశ్వమున్నది.

ప్రపంచముల రక్షించుటకు అతడు అంశాంశములతో అనేకావతారములను ధరించును. ఒకప్పుడతడు యోగుల యొక్క సత్పురుషులయొక్క హృదయములలోనుండును. ప్రాణులకు ప్రాణరూపి, పరమాత్మ, ఈశ్వరుడునైన ఆ శ్రీకృష్ణుని స్తుతించుటకు నేను శక్తురాలిని కాను.

నిరీహుడు, నిర్లక్ష్యుడు వాక్కులకు మనస్సునకు అందనివాడు ఐన ఆ పరమాత్మను ఆదిశేషుడు తన సహస్ర వదనములతో నుతించలేడు. అట్లే పంచవక్త్రుడైన పరమశివుడు. చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు హస్తిముఖుడైన వినాయకుడు, ఆరుముఖములు కల కుమారస్వామికూడ అతనిని స్తుతించలేరు. అదేవిధముగ లక్ష్మీదేవిగాని, సరస్వతి గాని వేదములుగాని అతనిని స్తుతించలేవు. అట్టి సమయమున విద్వాంసుడు అతనిని స్తుతించగలడా?

మరి శోక సంతప్తయైన స్త్రీ నిన్ను ఏమని స్తుతించును? అని పలికి గంధర్వరాజుపుత్రికయైన మాలావతి ఏడ్చెను.

కృపానిధిం ప్రణనామ భయార్తా చ పునః పునః కృష్ణశ్చ శక్తిభిస్సార్థమధిష్ఠానం చకార హ|| 36

భర్తురస్యాంతరే తస్యాః పరమాత్మా నిరాకృతిః | ఉత్థాయ శీఘ్రం వీణాం చ ధృత్వా స్నాత్వా చ వాససీ || 37

ప్రణనామ దేవసంఘం బ్రాహ్మణం పురతః స్థితం | నేదుర్దుందుభయో దేవా పుష్పవృష్టిం చ చక్రిరే || 38

దృష్ట్వా చోపరి దంపత్యోః ప్రదదుః పరమాశిషం | గంధర్వో దేవపురతో ననర్త చ జగౌ క్షణం || 39

జీవితం పురతః ప్రాప దేవానాం చ వరేణ చ | జగామ పత్న్యా సార్థం చ పిత్రా మాత్రా చ హర్షితః || 40

ఉపబర్హణగంధర్వో గంధర్వనగరీం పునః మాలావతీ రత్నకోటిం ధనాని వివిధాని చ || 41

ప్రదదౌ బ్రాహ్మణభ్యశ్చ భోజయామాస తాన్‌ సతీ| వేదాంశ్చ పాఠయామాస కారయామాస మంగళం || 42

మహోత్సవం చ వివిధం హరేర్నామైకమంగళం | జగ్ముర్ధేవాశ్చ స్వస్థానం విప్రరూపీ హరిః స్వయం || 43

మాలావతి దయానిధియైన పరమాత్మను భయముతో మాటిమాటికి నమస్కరించెను. ఆమె చేసిన స్తుతికి సంతోషించిన కృష్ణుడు సమస్త శక్తులతో ఉపబర్హణునిలో నిలిచిపోయెను. అప్పుడా ఉపబర్హుణుడు లేచి, స్నానముచేసి, శుధ్ధవస్త్రములు ధరించి వీణను పట్టుకొని ఎదుటనున్న దేవతాగణములను, బ్రాహ్మణుని స్తుతించెను ఆ సమయమున దేవతలు దుందుభులను మ్రోగించిరి. పుష్పవర్షమును కురిపించిరి. అట్లే ఆ దంపతులనాశీర్వదించిరి.

ఉపబర్హణుడు దేవతల వరముచే జీవము పొంది క్షణకాలము దేవతల ముందు నృత్యము చేయుచుపాటపాడెను. ఆ తర్వాత అతడు తన తలిదండ్రులతో భార్యతో కలసి గంధర్వనగరమునకు వెళ్లిపోయెను.

మాలావతి బ్రాహ్మణులకు రత్నములను వివిధములైన ధనములనిచ్చి వారికందరకు మృష్ఠాన్నమునిడెను వేదములు చదివించి ఉత్సవమును చేసినది.

శ్రీమన్నారాయణుని నామగానమే చాలాగొప్ప ఉత్సవము. దానిని చూచి దేవతలందరు తమ తమ స్థానములకు వెళ్లిపోయిరి.

ఏతత్తే కథితం సర్వం స్తవరాజం చ శౌనక | ఇదం స్తోత్రం పుణ్యరూపం పూజాకాలేతు యః పఠేత్‌ || 44

హరిభక్తిం హరేర్దాస్యం లభ##తే వైష్ణవో జనః | వరార్థీ యః పఠేద్భక్త్యా చాస్తికః పరమాస్థయా || 45

ధర్మార్థ కామమోక్షాణాం నిశ్చితం లభ##తే ఫలం | విద్యార్థీ లభ##తే విద్యాం ధనార్థీ లభ##తే ధనం || 46

భార్యార్థీ లభ##తే భార్యాం పుత్రార్థీ లభ##తే సుతం | ధర్మార్థీ లభ##తే ధర్మం యశోzర్థీ లభ##తే యశః ||47

భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం ప్రజాభ్రష్టః ప్రజాం లభేత్‌ | రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్‌ || 48

భయాన్ముచ్యేత భీతస్తు ధనం నష్టధనో లభేత్‌ | దస్యుగ్రస్తో మహారణ్య హింస్రజంతుసమన్వితః || దావాగ్నిదగ్దోముచ్యేత నిమగ్నశ్చ జాలార్ణవే || 49

ఓ శౌనక మహార్షి స్తోత్రములలో శ్రేష్ఠమైన దీనిని నీకు చెప్పితిని. ఈ స్తోత్రము చాలా మంగళప్రదమైనది.

ఈస్తోత్రమును పూజా సమయమున చదువువారికి వైష్ణవులైనచో హరిభక్తి, హరి యొక్క దాస్యము లభించును. ఆస్తికులై పరమశ్రద్ధతో ఈ స్తోత్రమును చదివినచో ధర్మార్థ కామ మోక్షముల ఫలితము లభించును. విద్యను కోరిన విద్య, ధనము కోరిన ధనము, వివాహము కోరుకొనినచో వివాహము, పుత్రును కోరుకున్న పుత్రులు, ధర్మమును కోరుకొనిన ధర్మము, కీర్తిని కోరుకున్న కీర్తిని పొందగలడు. అట్లే రాజ్య భ్రష్టుడు రాజ్యమును, సంతానమును పొగొట్టకొనినవాడు సంతానమును, రోగార్తుడు ఆరోగ్యమును పొందును. ఇంకను కారాగారాబద్ధుడు విముక్తిని, భయపడినవాడు నిర్భీతిని, గొప్ప అడవిలో క్రూరజంతువులతో కలసి ఆటవికులకు పట్టుబడినను, దవాగ్నిదగ్థుడైనను, సముద్రములో మునిగిపోయినను ఈ స్తోత్రమహిమవలన తప్పించుకొనును.

ఇతి శ్రీబ్రహ్మ వైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతి శౌనక సంవాదే గంధర్వ జీవదానే మహాపురుషస్తోత్రప్రణయనం నామ అష్టాదశోz ధ్యాయః |

శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున సౌతి శౌనిక సంవాదముగల బ్రహ్మ ఖండమున గంధర్వునకు జీవదానము చేయు సందర్భమున చెప్పబడిన మహాపురుష స్తోత్రముగల

పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters