Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

మూడవ యధ్యాయము - రాజలక్షణము

పుష్కర ఉవాచ:- సర్వలక్షణ లక్షణ్యో వినీతః ప్రియ దర్శనః | అదీర్ఘ సూత్రీ ధర్మాత్మా జితక్రోధో జితేంద్రియః ||

స్థూల లక్షో మహోత్సాహః స్మిత పూర్వాభి భాషకః | సురూపః కులసంపన్నః క్షిప్రకారీ మహాబలః || 2

బ్రహ్మణ్య శ్చా విసంవాదీ దృఢ భక్తిః ప్రియంవదః | అలులోప స్సంయతవా గ్గంభీరః ప్రియదర్శనః || 3

నాతి దండో న నిర్దండ శ్చారచక్షు రజిహ్మగః | వ్యవహారే సమః ప్రాప్తే పుత్రస్య రిపుణా సహ || 4

రథే గజేశ్వ ధనుషి వ్యాయామేచ కృత శ్రమః | ఉపవాస తపశ్శీలో యజ్ఞయాజీ గురుప్రియః || 5

మంత్రి సాంవత్సరాధీనః సమరేష్వ నివర్తకః | కాలజ్ఞశ్చ కృతజ్ఞశ్చ నృవిశేషజ్ఞ ఏవచ || 6

పూజ్య పూజయితా నిత్యం దండ్య దండయితా తథా | షాడ్గుణ్యస్య ప్రయోక్తా చ శక్త్యు పేత స్తథైవచ || 7

ఉక్తై రనుక్తైసు గుణౖ రనేకై రలంకృతో భూమి పతిశ్చ కార్యః |

సంభూయ రాష్ట్ర ప్రవరై ర్యధావ ద్రాష్ట్రస్య రక్షార్థ మదీన సత్వః || 8

ఇతి విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే రాజలక్షణ నిరూపణం నామ తృతీయోధ్యాయః

పుష్కరుడనియె: సర్వలక్షణములుగల్గి వినయవంతుడై చూడముచ్చటయై ధర్మపరుడై కోపము నిగ్రహించి యింద్రియము లంగెల్చి యేవిషయమైన వెంటవెంటనే యాలోచించి తేల్చగలవాడై, మహోత్సహియై, స్థూలలక్షుడై = మిక్కిలి యీవికలవాడై, చిఱు నవ్వు ముందుగా తానేముందు బలుకరించువాడై, సురూపియై, యుత్తమ కుల సంపన్నుడై, క్షిప్రకారియై=ఏపనినైన వేగముగ నిర్వహించువాడై, బలశాలియై బ్రహ్మణ్యుడై (బ్రహ్మజ్ఞానసంపన్నుడై) ఏరితో దగవు వడనివాడై, గట్టిభక్తిగలవాడై, ప్రియబాషియై విషయలోలుడుగాక మాట యిమిడిక కలవాడై, గంభీరుడై (లోతుగుండెగలవాడు) ప్రియదర్శనుడై దండపారుష్యము లేనివాడై ఏనేరమున కెంత దండనము శాస్త్రవిహితమో యా దండనము విధించువాడై చారులే కన్నులుగాగల్గి (రాజ్యమందలి రహస్యాతిరహస్య వార్తలం దెలిసికొని రాజునకు వెంటనే తెలుపువారు గూఢచారులు. తెలుగులో వేగులవాండ్రందురు. వారే చారులనబడుదురు.) వారు రాజునకు కన్నువంటివారు. రాష్ట్రమందు జరుగు మంచిచెడ్డలను రాజు వారి మూలమున దెలిసికొనవలెను. వక్రమార్గమునబోక కొడకు, శత్రువను భేదములేకుండ వ్యవహారములపట్ల ననువర్తనుడై, రథ, గజాశ్వారోహణముమందు ధనుర్వ్యాయామమందు సుశిక్షితుడై మిక్కిలి పరిశ్రమ చేసినవాడై, ఉపవాసములు తపస్సునుంచేయు వాడై, యజ్ఞ యాజియై, గురులకు మిగులు నిష్టుడై గురువులయెడ ప్రీతిగలవాడై మంత్రులు సాంవత్సరులు = జ్యౌతిషికులుననువారి యభిప్రాయములపై నాధారపడువాడై, రణమునందు వెనుదివనివాడై, కాలము నడక నెఱగి (లేదా ఏకాలములో నేది చేయవలె నది చేయుట తెలిసి) చేసినమేలు గుర్తించువాడై, జనులలో నెవరి విశేషమేమో తెలిసిన వాడై, పూజ్యులం బూజించుచు దండ్యులం దండించుచు షాడ్గుణ్య ప్రయోగ నిపుణడై, (సంధి-విగ్రహ(యుద్దము) యాన+ఆసన ఆసన ద్వైథీభావ సమాశ్రయములు రాజ్యంగమందలి రాజగుణములు ప్రసిద్ధములు) శక్తిసహితుడై (సమర్థుడై) ఈ చెప్పిన యింకనునిట జెప్పనియనేకోత్తమ రాజలక్షణ భూషితుడైనవానిని దృఢసత్త్వుని రాష్ట్రములోనున్న పెద్దలందఱు గలసి రాష్ట్రరక్షణము యధావిధిగ జరుగుటకు పట్టాభిషిక్తుం గావించి కొనవలయును.

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురుణమందు ద్వితీయఖండమున రాజలక్షణమను మూడవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters