Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటనలుబది నాల్గవ అధ్యాయము - ఉత్పాత ప్రశమనము

గర్గః- ప్రాసాదతోరణాట్టాల ద్వార ప్రాకార వేశ్మనామ్‌ | అనిమిత్తంతు పతనం దృఢానాంరాజమృత్యవే ||

రజసా వాధ ధూమేన దిశోయత్ర సమాకులాః | ఆదిత్య చంద్ర తారాశ్చ వివర్ణా భయవృద్ధయే ||

గర్గాచార్యు లిట్లనిరి. రాజ ప్రాసాదము తోరణము (బహిర్ద్వారము) అట్టాలికము = రాజద్వారము మీది గది ద్వారము ప్రాకారము గృహమును గట్టివికూడ కారణము లేకుండ పడిపోయినచో రాజునకు మృత్యుకారణమగును. ధూళిచేత, పొగచేత దిక్కులు గ్రమ్ముకొనెనేని సూర్యచంద్ర నక్షత్రములు కాంతిహీనములగునేని రాజ్యము భయాకులమగును.

రాక్షసా యత్ర దృశ్యన్తే బ్రాహ్మణాశ్చ విధర్మిణః | ఋతవశ్చ విపర్యస్తా అపూజ్యః పూజ్యతే జనైః ||

నక్షత్రాణి వియోగీని తన్మహద్భయ లక్షణమ్‌ | కేతూదయోపరాగౌచ ఛిద్రతా శశిసూర్యయోః ||

గ్రహర్ష వికృతి ర్యత్ర తత్త్రాపి భయ మాదిశేత్‌ | స్త్రియశ్చ కలహాయన్తే బాలానిఘ్నన్తి బాలకాన్‌ ||

శీలాచార విహీనాశ్చ మద్యమాంసానృత ప్రియాః | తధా పాషండ భూయిష్ఠా స్త్రయీ మార్గచ్యుతా ద్విజాః ||

యత్రదేశే విజాయన్తే తత్ర విద్యాపదుద్రవమ్‌ | ఉచితైర్నాభి పూజ్యన్తే యూపాన్నబలిభి స్సదా ||

క్రియాణా ముచితానాంచ విచ్ఛిత్తి ర్య్రత జాయతే | అగ్నిర్యత్ర నదీప్యేత హూయమానాసు శాంతిషు ||

బ్రాహ్మణులు ధర్మముదప్పి రాక్షసులై ఎందు కనిపింతురో ఋతుధర్మములు తారుమారగునో జనులపూజ్యునిం బూజింతురో నక్షత్రములు వియోగము నందుచుండునో, అది మహాభయము రాకడకు లక్షణము. కేతూదయము, ఉపరాగము=గ్రహణం కేతు రాహూ పరాగము, సూర్యచంద్ర బింబములందు ఛిద్రములు, (చిల్లులు పడుట) గ్రహనక్షత్రముల వికృతియు భయచిహ్నములు.

స్త్రీలు కలహింతురు. బాలురు బాలురను గొట్టుదురు. శీలము ఆచారము నుండదు. మద్యమాంసముల రుచి మరుగుదురు. అనృతము ప్రియమగును. వేదమార్గ భ్రష్టులై ద్విజులు పాషండ వాదపరులగుదు. నాస్తికులగుదురు. ఈ లక్షణము లెక్కడ పుట్టునో అక్కడ నుపద్రవమున్నదని యెఱుంగవలెను. ఆయా దేవతాదులకు ఉచితములయిన యూపములతో అన్నములతో బలులుతో నాయా దేవతలను బూజింపరు. ఉచిత క్రియలకు విచ్ఛిత్తి గల్గును. శాంతి హోమమలు చేయుచుండగా నగ్నులు చక్కగా జ్వలింపవు.

పిపీలికాస్తు క్రవ్యాదోయాన్తి చాతురత స్తథా | పూర్ణ కుంభాః స్రవన్తే చ హవిర్వా విప్రలుప్యతే ||

మంగల్యాశ్చ గిరోయత్రన శ్రూయన్తే సమన్తతః | క్షవథుః ధావతీ చాధ ప్రహసన్తి రుదన్తి చ ||

నచ దేవేషు వర్తన్తే యధా వద్రృహ్మణషుచ | మర్మ దోషాణి చోచ్యన్తే వాద్యన్తే విసురాణిచ ||

గురు మిత్రద్రుహో యత్ర శత్రుపూజారతా జనాః | బ్రాహ్మణాన్‌ సుహృదోమాత్యాన్‌ జనోయత్రావమన్యతే ||

శాన్తి మంగళహోమేషు నాస్తిక్యం యత్రజాయతే | రాజావా మ్రియతే తత్ర సవాదేశో వినశ్య ||

చీమలు ఆకలికి జిక్కి పచ్చిమాంసముం గొరికి తినును. పూర్ణకుంభములు కారిపోవును. హవిస్సు లోపించిపోవును. ఎక్కడ ఎల్లెడ మంగళవాక్యములు వినబడవు. తుమ్ములు, దగ్గులు, పరుగుడు జనులు అట్టహాసముతో ఏడ్చుచుందురు. దేవతల యెడగాని, బ్రాహ్మణులయెడగాని భక్తిప్రపత్తులతో ప్రవర్తింపకుండను. వారియెడను మర్మములను, రహస్యమును, దోషములను వెల్లడించును. గురుద్రోహులు, మిత్రద్రోహులు, శత్రుపూజారతులునై, జనులు, బ్రాహ్మణులను సుహృదులను (మిత్రులను) మంత్రులను నవమానింతురు. శాంతిహోమములయెడ మంగళ హోమములందు నాస్తిక్య మెక్కడ యేర్పడునక్కడ రాజైన మరణించును. ఆదేశమయిన వినాశమందును.

రాజ్ఞో వినాశే సంప్రాప్తే నిమిత్తాని నిబోధమే | బ్రాహ్మణాన్‌ ప్రధమం ద్వేష్టి బ్రాహ్మణౖశ్చ విరుధ్యతే ||

బ్రాహ్మణౖర్నింద్యతే వాపి బ్రాహ్మణాంశ్చ జిఘూంసతి | నతాన్‌ స్మరతి కృత్యేషు యాచిత శ్చాభిభూయతే ||

రాజునకు వినాశమందుటకు నిమిత్తము లిదె దెలిసికొనుము. మొదట బ్రాహ్మణులను ద్వేషించును. బ్రాహ్మణులతో విరోధించును. బ్రాహ్మణులచే నిందింపబడును. బ్రాహ్మణులం జంపనెంచును. రాజకార్యములందు వారినితలపనైన దలంపడు. ఒకవేళ వారు యాచింపవచ్చినను వారిని పరాభవించును.

రమతే నిర్దయ శ్చైషాం ప్రశంసాం నాభినందతి | అపూర్వంతు కరం లోభాత్తధా పాతయతే జనే ||

ఏతేష్వభ్యర్చయే చ్ఛక్రం సపత్నీకం ద్విజోత్తమ! | భోజ్యాని చైవ కార్యాణి సురాణాంబలయ స్తధా ||

గావశ్చ దేయా ద్విజపుంగవేభ్యో భువం తధా కాంచన మంబరం చ |

హోమశ్చ కార్యః సురపూజనంచ ఏవం కృతే శాన్తి ముపైతి పాపమ్‌ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయ ఖండే ఉత్పాత ప్రశమనం నామ చతుశ్చత్వారింశ దుత్తర శతతమోధ్యాయః

వారియెడ నిర్దయుడై రమించును. వారొకవేళ తనను కొనియాడినను వారిని మెచ్చుకొనడు. వారి నెవరేని కొనియాడినను దానుమెచ్చడు. లోభముచే నెన్నడు విని కని యెఱుగని పన్నులభారమును జనులపైపెట్టును. ఇట్టి విడ్వరములందు (విడ్డూరములందు) సపత్నీకుని (శచీదేవి సమేతుని) ఇంద్ర నర్చింపవలెను. దేవతలకు దృప్తిగ భోజ్యములను నివేదింపవలెను. బలులు నీయవలెను. విప్రపుంగవులకు గోవు నీయవలెను. భూ సువర్ణ వస్త్రదానములు సేయవలెను. హోమములు దేవపూజయు నొనరింపవలెను. ఇట్లు సేసిన నీ యుపద్రవములు శాంతినందును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున ఉత్పాతప్రశమనమను నూటనలుబదినాల్గవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters