Siva Maha Puranam-3    Chapters   

అథ పంచమో%ధ్యాయః

మహా పాతక నిరూపణము

వ్యాస ఉవాచ |

యే పాపనిరతా జీవా మహానరకహేతవః | భగవంస్తాన్‌ సమాచక్ష్వ బ్రహ్మపుత్ర నమో%స్తుతే || 1

వ్యాసుడు ఇట్లు పలికెను-

ఓ బ్రహ్మపుత్రా! నీకు నమస్కారము. మహానరకములను పొందుటకు కారణమైన పాపములను జీవులు చేయుచుందురు. ఓ పూజ్యా! ఆ వివరములను చెప్పుము (1).

సనత్కుమార ఉవాచ |

యే పాపనిరతా జీవా మహానరకహేతవః | తే సమాసేన కథ్యంతే సావధానతయా శృణు || 2

పరస్త్రీ ద్రవ్యసంకల్పశ్చేతసా%నిష్టచింతనమ్‌ | అకార్యాభినివేశశ్చ చతుర్ధా కర్మ మానసమ్‌ || 3

అవిబద్ధప్రలాపత్వమసత్యం చాప్రియం చ యత్‌ | పరోక్షతశ్చ పైశున్యం చతుర్థా కర్మ వాచికమ్‌ || 4

అభక్ష్యభక్షణం హింసా మిథ్యాకార్యనివేశనమ్‌ | పరస్వానాముపాదానం చతుర్ధా కర్మ కాయికమ్‌ || 5

ఇత్యేతద్ద్వాదశవిధం కర్మ ప్రోక్తం త్రిసాధనమ్‌ | అస్య భేదాన్‌ పునర్వక్ష్యే యేషాం ఫలమనంతకమ్‌ || 6

యే ద్విషంతి మహాదేవం సంసారార్ణవతారకమ్‌ | సుమహత్పాతకం తేషాం నిరయార్ణవగామినామ్‌ || 7

యే శివజ్ఞానవక్తారం నిందంతి చ తపస్వినమ్‌ | గురూన్‌ పితౄ నథోన్మత్తాస్తే యాంతి నిరయార్ణవమ్‌ || 8

శివనిందా గురోర్నిందా శివజ్ఞానస్య దూషణమ్‌ | దేవద్రవ్యాపహరణం ద్విజద్రవ్యవినాశనమ్‌ || 9

హరంతి యే చ సమ్మూఢాశ్శివజ్ఞానస్య పుస్తకమ్‌ | మహాంతి పాతకాన్యాహురనంతఫలదాని షట్‌ || 10

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

మహానరకములకు హేతువులగు పాపములయందు ఆసక్తి గల జీవుల గురించి సంగ్రహముగా చెప్పుచున్నాను. సావధానముగా వినుము (2). మనస్సులో ఇతరుని భార్యను, ఇతరుల ద్రవ్యమును కోరుట, ఇతరులకు హానిని తలపెట్టుట, చేయకూడని పనియందు పట్టుదల అనునవి నాలుగు రకముల మానసికపాపములు (3). అనుచితమగు ప్రలాపము, అసత్యమును పలుకుట, అప్రియమును పలుకుట, పరోక్షములో కొండెములను చెప్పుట అను నాలుగు విధములుగా వాచికమగు పాపకర్మ గలదు (4). తినకూడని పదార్థములను తినుట, హింసించుట, వ్యర్థకార్యములయందు లగ్నమగుట, ఇతరుల ద్రవ్యమును అపహరించుట అనునవి నాలుగు కాయికములగు పాపకర్మలు (5). మనోవాక్కాయములనే మూడు సాధనములచే చేయబడే కర్మలు ఈ విధముగా పన్నెండు రకములుగా నున్నవి. వీటిలో గల భేదములను మరల చెప్పగలను. వీటికి అనంతమగు పాపఫలము గలదు (6). ఎవరైతే సంసారసముద్రమునుండి తరింపజేసే మహాదేవుని ద్వేషించెదరో, వారు మహాపాపమును పొంది నరకసముద్రములో పడెదరు (7). ఎవరైతే తపశ్శాలి, శివజ్ఞానమును బోధించువాడు అగు వ్యక్తిని, గురువులను మరియు తల్లిదండ్రులను నిందించెదరో, అట్టి పిచ్చివారు నరక సముద్రమును పొందెదరు (8). శివుని నిందించుట, గురువును నిందించుట, శివజ్ఞానమును దూషించుట, దేవుని సొమ్మును అపహరించుట, బ్రాహ్మణుల ధనమునకు ముప్పును కలిగించుట, శివజ్ఞానమునకు సంబంధించిన పుస్తకమును అపహరించుట అను ఆరు మహాపాపములు అనంతపాపఫలమునిచ్చునని చెప్పెదరు (9, 10).

నాభినందంతి యే దృష్ట్వా శివపూజాం ప్రకల్పితామ్‌| న నమంత్యర్చితం దృష్ట్వా శివలింగం స్తువంతి న || 11

యథేష్ట చేష్టా నిశ్శంకాస్సంతిష్ఠంతి రమంతి చ | ఉపచారవినిర్ము క్తాశ్శివాగ్రే గురుసన్నిధౌ || 12

స్థానసంస్కారపూజాం చ యే న కుర్వంతి పర్వసు | విధివద్వా గురూణాం చ కర్మయోగవ్యవస్థితాః|| 13

యే త్యజంతి శివాచారం శివభక్తాన్‌ ద్విషంతి చ | అసంపూజ్య శివజ్ఞానం యే%ధీయంతే లిఖంతి చ || 14

అన్యాయతః ప్రయచ్ఛంతి శృణ్వంత్యుచ్చారయంతి చ | విక్రీడంతి చ లోభేన కుజ్ఞాననియమేన చ || 15

అసంస్కృతప్రదేశేషు యథేష్టం స్వాపయంతి చ | శివజ్ఞానకథా%%క్షేపం యః కృత్వాన్యత్ర్ప భాషతే || 16

న బ్రవీతి చ యస్సత్యంన ప్రదానం కరోతి చ | అశుచిర్వా శుచిస్థానే యః ప్రవక్తి శృణోతి చ || 17

గురుపూజామకృత్వైవ యశ్శాస్త్రం శ్రోతుమిచ్ఛతి | న కరోతి చ శుశ్రూషామాజ్ఞాం చ భక్తిభావతః || 18

నాభినందతి తద్వాక్యముత్తరం చ ప్రయచ్ఛతి | గురుకర్మణసాధ్యం యత్తదుపేక్షాం కరోతి చ || 19

గురుమార్తమశక్తం చ విదేశం ప్రస్థితం తథా | వైరిభిః పరిభూతం వా యస్సంత్యజతి పాపకృత్‌ || 20

తద్భార్యాపుత్రమిత్రేషు యశ్చావజ్ఞాం కరోతి చ | ఏవం సువాచకస్యాపి గురోర్ధర్మానుదర్శినః|| 21

ఏతాని ఖలు సర్వాణి కర్మాణి మునిసత్తమ | సుమహత్పాతకాన్యాహుశ్శివనిందాసమాని చ || 22

ఇతరులు చక్కగా శివపూజను చేసినప్పుడు చూచి ఎవరైతే అభినందించరో, అర్చించబడియున్న శివలింగమునకు ఎవరైతే నమస్కరించరో, మరియు స్తుతించరో (11). ఎవరైతే బిడియము లేకుండగా ఇచ్చవచ్చిన రీతిలో ప్రవర్తించెదరో మరియు రమించెదరో, శివుని సన్నిధిలో మరియు గురువు యెదుట మర్యాద లేకుండగా ప్రవర్తించెదరో (12). ఎవరైతే పండుగ దినములలో కర్మయోగమునందు నిష్ఠ గలవారై యథావిధిగా పూజాస్థానమును శుభ్రము చేసి పూజను చేయరో, మరియు గురువులను పూజించరో (13), ఎవరైతే శివాచారమును విడిచిపెట్టి శివభక్తులను ద్వేషించెదరో, శివజ్ఞానమును బోధించే పుస్తకమును ఆరాధించకుండగా అక్షరాభ్యాసమును చేసి వ్రాసి అధ్యయనమును చేయుదురో (14), ఎవరైతే తప్పు పద్ధతిలో దానమును చేయుదురో, తప్పు మాటలను వినెదరో మరియు పలికెదరో, లోభముతో క్రీడలయందు ప్రవేశించెదరో, జ్ఞానము విషయములో సరియగు నియమములను పాటించరో (15), సంస్కారములేని ప్రదేశములలో యథేచ్ఛగా నిద్రించెదరో, ఎవడైతే శివజ్ఞానముయొక్క ప్రవచనమును నిందించి మరియొక ప్రసంగమును చేయునో (16), ఎవడైతే సత్యమును పలుకడో, దానమును చేయడో, అశుచియై మరియు అశుచియగు ప్రదేశములో ప్రవచనమును చెప్పునో మరియు వినునో (17), ఎవడైతే గురువును పూజించకుండగనే శాస్త్రమును వినగోరునో, గురుశుశ్రూషను మరియు ఆజ్ఞాపాలనను భక్తిభావముతో చేయడో (18), గురువుయొక్క వచనమును స్వీకరించకుండగా ప్రత్యుత్తరమునిచ్చునో, గురువుగారి పనులలో కఠినమైన దానిని ఉపేక్షించునో (19), ఆపదలో నున్నవాడు, శక్తి లేనివాడు, విదేశమునకు వెళ్లినవాడు మరియు శత్రువులచే పరాభవించబడినవాడు అగు గురువును ఏ పాపాత్ముడైతే విడిచి పెట్టునో (20), ధర్మమునెరింగి చక్కగా పాఠములను చేప్పే గురువుయొక్క భార్యను, పుత్రులను మరియు మిత్రులను ఎవడైతే అవమానించునో (21). వీరందరు మహాపాపమును పొందెదరు. ఈ కర్మలను చేయువారు శివనిందతో సమమగు పాపమును పొందెదరని చెప్పెదరు (22).

బ్రహ్మఘ్నశ్చ సురావశ్చ స్తేయీ చ గురుతల్పగః | మహాపాతకినస్త్వేతే తత్సంయోగీ చ పంచమః || 23

క్రోధాల్లోభాద్భయాద్ద్వేషాద్ర్బాహ్మణస్య వధే తు యః | మర్మాంతికం మహాదోషముక్త్వా స బ్రహ్మహా భ##వేత్‌ || 24

బ్రాహ్మణం యస్సమాహూయ దత్త్వా యశ్చాదదాతి చ | నిర్దోషం దూషయేద్యస్తు స నరో బ్రహ్మహా భ##వేత్‌ || 25

యశ్చ విద్యాభిమానేన నిస్తేజయతి సుద్విజమ్‌ | ఉదాసీనం సభామధ్యే బ్రహ్మహా స ప్రకీర్తితః || 26

మిథ్యాగుణౖర్య ఆత్మానం నయత్యుత్కర్షతాం బలాత్‌ | గుణానపి నిరుద్వాస్య స చవై బ్రహ్మహా భ##వేత్‌ ||27

గవాం వృషాభిభూతానాం ద్విజానాం గురుపూర్వకమ్‌ | యస్సమాచరతే విఘ్నం తమాహుర్బ్రఘాతకమ్‌ || 28

దేవద్విజగవాం భూమిం ప్రదత్తాం హరతే తు యః | ప్రనష్టామపి కాలేన తమాహుర్ర్బహ్మఘాతకమ్‌ || 29

దేవద్విజస్వహరణమన్యాయేనార్జితం తు యత్‌ | బ్రహ్మహత్యాసమం జ్ఞేయం పాతకం నాత్ర సంశయః || 30

అధీత్య యో ద్విజో వేదం బ్రహ్మజ్ఞానం శివాత్మకమ్‌ | యది త్యజతి యో మూఢస్సురాపానస్య తత్సమమ్‌ || 31

యత్కించిద్ధి వ్రతం గృహ్య నియమం యజనం తథా | సంత్యాగః పంచయజ్ఞానాం సురాపానస్య తత్సమమ్‌ || 32

బ్రహ్మహత్యను చేసినవాడు, సురాపానము చేసినవాడు, చోరుడు, గురుభార్యతో రమించువాడు, మరియు ఈ నలుగురితో స్నేహమును చేయువాడు అను ఐదుగురు మహాపాపాత్ములు (23). ఎవడైతే కోపముచే గాని, లోభముచేగాని, భయముచే గాని, ద్వేషముచే గాని బ్రాహ్మణుని వధకొరకై ఆతని రహస్యమును బట్టబయలు చేసే మహాదోషమును చెప్పునో, వాడు బ్రహ్మహత్యాదోషమును పొందును (24). ఏ మానవుడు బ్రాహ్మణుని ఆహ్వానించి ఇచ్చిన దానిని తిరిగి తీసుకొని దోషము లేకుండగనే దూషించునో, వాడు బ్రహ్మహత్యాదోషమును పొందును (25). ఎవడైతే తాను విద్వాంసుడననే అహంకారముతో సభామధ్యములో ఉదాసీనుడగు సద్ర్బాహ్మణుని చిన్నబుచ్చునో వానికి బ్రహ్మహత్యాదోషము కలుగును (26). ఎవడైతే ఇతరుల గుణములనుకూడ ప్రయత్నపూర్వకముగా కప్పిపుచ్చి తనయందు లేని గుణములను ప్రచారము చేసుకొని తనకు ఉత్కర్ష కలుగునట్లు చేసుకొనునో, వానికి బ్రహ్మహత్యాదోష ము కలుగును (27). వృషభముతో సంగమించే గోవునకు, గురువువద్ద ఉపదేశమును పొందుచున్న బ్రాహ్మణునకు ఎవడైతే విఘ్నమును చేయునో, వానికి బ్రహ్మహత్యాదోషము సంక్రమించును (28). దేవాలయమునకు, బ్రాహ్మణులకు మరియు ఆవులు మేయుటకు ఈయబడిన భూమిని ఎవడైతే అపహరించునో, వానికి బ్రహ్మహత్యాదోషము సంక్రమించును. ఆ భూమి కాలక్రమములో పాడుపడియున్ననూ, ఆయా హక్కుదారుల అధికారమునకు కాలదోషము పట్టిననూ, దానిని ఆక్రమించరాదు (29). దేవుని సొమ్మును, బ్రాహ్మణుల సొత్తును అపహరించుట మరియు అన్యాయముగా ధనమునార్జించుట బ్రహ్మహత్యతో సమానమగునని తెలియవలెను (30). మూర్ఖుడగు ఏ బ్రాహ్మణు డైతే వేదమును మరియు శివస్వరూపమగు బ్రహ్మజ్ఞానమును అధ్యయనము చేసి విడిచిపెట్టునో, వానికి సురాపానముతో సమానమగు పాపము వచ్చును (31). ఏదేని వ్రతమును నియమమును లేదా పూజను చేపట్టి వదిలిపెట్టుట, దేవ-ఋషి-పితృ-మనుష్య-భూతయజ్ఞములచే అయిదు మహాయజ్ఞములను వదలిపెట్టుట సురాపానముతో సమానమగును (32).

పితృమాతృపరిత్యాగః కూటసాక్ష్యం ద్విజానృతమ్‌ | ఆమిషం శివభక్తానామభక్ష్యస్య చ భక్షణమ్‌ || 33

వనే నిరపరాధానం ప్రాణినాం చాపఘాతనమ్‌ | ద్విజార్థం ప్రక్షిపేత్సాధుర్న ధర్మార్థం నియోజయేత్‌ || 34

గవాం మార్గే వనే గ్రామే యైశ్చైవాగ్నిః ప్రదీయతే | ఇతి పాపాని ఘోరాణి బ్రహ్మహత్యాసమాని చ || 35

దీనసర్వస్వహరణం నరస్త్రీ గజవాజినామ్‌ | గోభూరజతవస్త్రాణామౌషధీనాం రసస్య చ|| 36

చందనాగరుకర్పూరకస్తూరీపట్టవాససామ్‌ | విక్రయస్త్వవిపత్తౌ యః కృతో జ్ఞానాద్ద్విజాతిభిః || 37

హస్తన్యాసాపహరణం రుక్మస్తేయసమం స్మృతమ్‌ | కన్యానాం వరయోగ్యానామదానం సదృశే వరే || 38

పుత్రమిత్రకలత్రేషు గమనం భగినీషు చ | కుమారీసాహసం ఘోరమద్యపస్త్రీ నిషేవణమ్‌ || 39

సవర్ణాయాశ్చ గమనం గురుభార్యాసమం స్మృతమ్‌ | మహాపాపాని చోక్తాని శృణు త్వముపపాతకమ్‌ || 40

ఇతి శ్రీశివమహాపురాణ ఉమాసంహితయందు మహాపాతకవర్ణనం నామ పంచమో% ధ్యాయ ః (5).

తల్లిదండ్రులను విడిచిపెట్టుట, తప్పుడు సాక్ష్యమును చెప్పుట, బ్రాహ్మణునితో అసత్యమును పలుకుట, శివభక్తులకు మాంసమును తినిపించుట, నిషిద్ధమగు ఆహారమును భుజించుట (33), అడవిలోని అపరాధమునెరుంగని ప్రాణులను సంహరించుట అనునవి బ్రహ్మహత్యతో సమానమగు పాపములు. సాధుస్వభావము గల మానవుడు బ్రాహ్మణధనమును తనవద్ద ఉంచుకొనరాదు. దానిని ధర్మము కొరకైననూ వినియోగించరాదు. అట్లు చేయుట బ్రహ్మహత్యతో సమానమగును (34), గోవులు సంచరించే మార్గములో, అడవిలో, మరియు గ్రామములో నిప్పును పెట్టుట అనునవి బ్రహ్మహత్యతో సమానమైన ఘోర పాపములు (35). దీనుల సర్వస్వమును అపహరించుట, బ్రాహ్మణుడై యుండి ఆపత్కాలము కాకున్ననూ బుద్ధిపూర్వకముగా, పురుషుడు, స్త్రీ, ఏనుగు, గుర్రము, ఆవు, భూమి, వెండి, బట్టలు, మందులు, సాదరసము, చందనము, అగరు, కర్పూరము, కస్తూరి, పట్టు వస్త్రములు అను వాటిని అమ్ముట (36,37), ఇతరులు నమ్మి చేతిలో పెట్టిన సంపదను అపహరించుట అను కార్యములు బంగారమును అపహరించుటతో సమానమని మహర్షులు చెప్పుచున్నారు. వివాహయోగ్యమగు వయస్సు వచ్చిన కన్యలను యోగ్యులగు వరులకు ఇచ్చి వివాహమును చేయకుండుట, పుత్రుని మరియు మిత్రుని భార్యతో మరియు సోదరితో సంగమము, కన్యను బలాత్కరించుట, భయంకరముగా మద్యమును సేవించు స్త్రీతో గాని, తన కులమునకు చెందిన పరస్త్రీతో గాని సంబంధమును పెల్టుకొనుట అనే కర్మలు గురుభార్యాగమనముతో సమానమగు పాపకర్మలు అని చెప్పబడినది. నేను ఇంతవరకు మహాపాపములను గురించి చెప్పితిని. ఇప్పుడు ఉపపాతకములను గురించి వినుము (38-40).

శ్రీశివమహాపురాణములోని ఉమాసంహితయందు మహాపాతకవర్ణనము అనే ఐదవ అధ్యాయము ముగిసినది (5).

Siva Maha Puranam-3    Chapters