Siva Maha Puranam-3    Chapters   

అథఏకత్రింశో%ధ్యాయః

రామేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యము

సూత ఉవాచ |

అతః పరం ప్రవక్ష్యామి లింగం రామేశ్వరాభిధమ్‌ | ఉత్పన్నం చ యథా పూర్వమృషయశ్శృణుతాదరాత్‌ || 1

పురా విష్ణుః పృథివ్యాం చావతతార సతాం ప్రియః || 2

తత్ర సీతా హృతా విప్రా రావణనోరుమాయినా | ప్రాపితా స్వగృహం సా హి లంకాయాం జనకాత్మజా || 3

అన్వేషణపరస్తస్యాః కిష్కింధాఖ్యాం పురీమగాత్‌ | సుగ్రీవహితకృద్భూత్వా వాలినం సంజఘాన హ || 4

తత్ర స్థిత్వా కియత్కాలం తదన్వేషణతత్పరః | సుగ్రీవాద్యైర్లక్ష్మణన విచారం కృతవాన్‌ స వై || 5

కపీన్‌ సంప్రేషయామాస చతుర్దిక్షు నృపాత్మజః | హనుమత్ర్ప ముఖాన్‌ రామస్తదన్వేషణ హేతవే || 6

అథ జ్ఞాత్వా గతాం లంకాం సీతాం కపివరాననాత్‌ | సీతాచూడామణిం ప్రాప్య ముముదే సో% తి రాఘవః || 7

సూతుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షులారా! ఈ పైన పూర్వము రామేశ్వరుడను పేరుగల లింగము ఆవిర్భవించిన వృత్తాంతమును చెప్పుచున్నాను. సాదరముగా వినుడు (1). సత్పురుషులకు ప్రియుడగు విష్ణువు పూర్వము భూమిపై అవతరించెను (2). ఓ బ్రాహ్మణులారా! అ అవతారములో మహామాయావియగు రావణుడు జనకుని కుమార్తెయగు సీతను అపహరించి లంకయందలి తన గృహమునకు గొనిపోయెను (3). ఆమెను వెదుకుచూ శ్రీరాముడు కిష్కింధయను నగరమును చేరి సుగ్రీవుని ప్రియమిత్రుడై వాలిని సంహరించెను (4). ఆయన అచటనే కొంతకాలము ఉండి సీతను అన్వేషించుటలో తత్పురుడై సుగ్రీవాది వానరులతో మరియు లక్ష్మణునితో చర్చించెను (5). ఆ రాజకుమారుడగు శ్రీరాముడు సీతను వెదుకుటకై హనుమంతుడు మొదలగు వానరులను నాలుగు దిక్కులయందు పంపించెను (6). తరువాత వానరశ్రేష్ఠుడగు హనుమంతుని ద్వారా సీత లంకలో ఉన్నదని తెలిసి ఆమెయొక్క చూడామణిని పొంది శ్రీరాముడు చాల సంతోషించెను (7).

సకపీశస్తదా రామో లక్ష్మణన యుతో ద్విజాః | సుగ్రీవప్రముఖైః పుణ్యౖర్వానరైర్బలవత్తరైః || 8

పద్మైరష్టాదశాఖ్యైశ్చ య¸° తీరం పయోనిధేః | దక్షిణ సాగరే యో వై దృశ్యతే లవణాకరః || 9

తత్రాగత్య స్వయం రామో వేలాయం సంస్థితో హి సః | వానరైస్సేవ్యమానస్తు లక్ష్మణన శివప్రియః || 10

హా జానకి కుతో యాతా కదా చేయం మిలిష్యతి | అగాధస్సాగరశ్చై వాతార్యా సేనా చ వానరీ || 11

రాక్షసో గిరిధర్తా చ మహాబలపరాక్రమః | లంకాఖ్యో దుర్గమో దుర్గ ఇంద్రజిత్తనయో%స్య వై || 12

ఇత్యేవం స విచార్యైవ తటే స్థిత్వా సలక్ష్మణః | ఆశ్వాసితో వనౌకోభిరంగదాది పురస్సరైః || 13

ఏతస్మిన్నంతరే తత్ర రాఘవశ్శైవసత్తమః | ఉవాచ భ్రాతరం ప్రీత్యా జలార్థీ లక్ష్మణాభిధమ్‌ || 14

ఓ బ్రాహ్మణులారా! అప్పుడు లక్ష్మణునితో మరియు వానరాధిపుడగు హనుమంతునితో కూడియున్న శ్రీరాముడు సుగ్రీవుడు మొదలగు మహాబలశాలురు మరియు పుణ్యాత్ములు అగు లక్ష ఎనభై వేల కోట్ల వానరసైన్యము వెంటరాగా దక్షిణసముద్రతీరమునకు వెళ్లెను (8, 9). శివునకు ప్రియుడగు ఆ శ్రీరాముడు వానరులచే సేవించబడుచున్నవాడై లక్ష్మణునితో బాటు స్వయముగా సముద్రముయొక్క చెలియలికట్టవద్దకు వచ్చి అచట నిలబడియుండెను (10). ఓ జానకీ! ఎక్కడకు వెళ్లినావు? నేను నిన్ను కలుసుకొనేది ఎప్పుడు? ఈ అగాధమగు సముద్రమును దాటుట అసంభవము. నా సైన్యము వానరులు (11). ఆ రాక్షసుడు మహాబలపరాక్రమశాలి మరియు కైలాసమును పైకి ఎత్తినవాడు. లంకా అనబడే దుర్గమును జయించుట చాల కఠినము. వాని కుమారుడు ఇంద్రుని జయించినవాడు (12). సముద్రముయొక్క ఒడ్డున లక్ష్మణునితో గూడి నిలబడి ఆయన ఈ తీరున ఆలోచించుచుండగా, అంగదుడు మొదలగు వానరులు ఆయనను ఓదార్చుచుండిరి (13). ఇంతలో శివభక్తాగ్రగణ్యుడగు శ్రీరాముడు సోదరుడగు లక్ష్మణుని ప్రీతిపూర్వకముగా నీటిని ఇమ్మని అడిగెను (14).

రామ ఉవాచ |

భ్రాతర్లక్ష్మణ వీరేశాహం జలార్థీ పిపాసితః | తదానయ ద్రుతం పాథో వానరైః కైశ్చిదేవ హి || 15

శ్రీరాముడు ఇట్లు పలికెను-

ఓ సోదరా! లక్ష్మణా! మహావీరా! నాకు దాహము వేయుచున్నది. కావున వెంటనే వానరులెవరిచేత నైననూ నీటిని తెప్పించుము (15).

సూత ఉవాచ |

తచ్ఛ్రుత్వా వానరాస్తత్ర హ్యధావంత దిశో దశ | నీత్వా జలం చ తే ప్రోచుః ప్రణిపత్య పురః స్థితాః || 16

సూతుడు ఇట్లు పలికెను-

ఆ మాటను విని వానరులు అక్కడ పది దిక్కులయందు పరుగెత్తిరి. వారు నీటిని తెచ్చి నమస్కరించి ఎదుట నిలబడి ఇట్లు పలికిరి (16).

వానరా ఊచుః |

జలం చ గృహ్యతాం స్వామిన్నానీతం తత్త్వదాజ్ఞయా | మహోత్తమం చ సుస్వాదు శీతలం ప్రాణతర్పణమ్‌ || 17

వానరులు ఇట్లు పలికిరి-

ఓ ప్రభూ! నీ ఆజ్ఞచే చాల ఉత్తమమైనది, మిక్కిలి రుచికరమైనది, చల్లనిది, ప్రాణములకు తృప్తిని ఇచ్చునది అగు నీటిని తెచ్చితిమి. స్వీకరించుము (17).

సూత ఉవాచ |

సుప్రసన్నతరో భూత్వా కృపాదృష్ట్వా విలోక్య తాన్‌ | తచ్ఛ్రుత్వా రామచంద్రో%సౌ స్వయం జగ్రాహ తజ్జలమ్‌ || 18

స రామస్తజ్జలం నీత్వా పాతుమారబ్ధవాన్‌ యదా | తదా చ స్మరణం జాతమిత్థమస్య శివేచ్ఛయా || 19

న కృతం దర్శనం శంభోర్గృహ్యతే చ జలం కథమ్‌ | స్వస్వామినః పరేశస్య సర్వానందప్రదస్య వై || 20

ఇత్యుక్త్వా చ జలం పీతం తదా రఘువరేణ చ | పశ్చాచ్చ పార్థివీం పూజాం చకార రఘునందనః || 21

ఆవాహనాదికాంశ్చైవ హ్యుపచారాన్‌ ప్రకల్ప్య వై | విధివత్‌ షోడశ ప్రీత్యా దేవమానర్చ శంకరమ్‌ || 22

ప్రణిపాతైః స్తవైర్దివ్యైశ్శివం సంతోష్య యత్నతః | ప్రార్థయామాస సద్భక్త్యా స రామశ్శంకరం ముదా || 23

సూతుడు ఇట్లు పలికెను-

వారి మాటలను విని ఆ రామచంద్రుడు మిక్కిలి ప్రసన్నుడై వారిని దయాదృష్టితో చూచి స్వయముగా ఆ నీటిని స్వీకరించెను (18). ఆ శ్రీరాముడు ఆ నీటిని తీసుకొని త్రాగబోవునంతలో శివుని సంకల్పముచే ఆయనకు ఈ విధమైన స్మరణ కలిగెను (19). నాకు ప్రభువు, పరమేశ్వరుడు, సర్వులకు ఆనందమునిచ్చువాడు అగు శంభుని దర్శనమును నేను చేయలేదు. నీటిని తీసుకొనుటు ఎట్లు? (20). ఇట్లు పలికి అప్పుడు ఆ రాఘవుడు నీటిని త్రాగి, తరువాత పార్థివ లింగ పూజను చేసెను (21). ఆయన ఆవాహనము మొదలగు పదునారు ఉపచారములను యథావిధిగా చేసి ప్రీతితో శంకరదేవుని ఆరాధించెను (22). ఆ శ్రీరాముడు అప్పుడు నమస్కారములచే మరియు దివ్యములగు స్తోత్రములచే మంగళకరుడగు శివుని ప్రయత్నపూర్వకముగా సంతోషపెట్టి ఆనందముతో సద్భక్తితో ఇట్లు ప్రార్థించెను (23).

రామ ఉవాచ |

స్వామిన్‌ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సల | పాహి మాం శరణాపన్నం త్వద్భక్తం దీనమానసమ్‌ || 24

ఏతజ్జలమగాధం చ వారిధేర్భవతారణ | రావణాఖ్యో మహావీరో రాక్షసో బలవత్తరః || 25

వానరాణాం బలం హ్యేతచ్చంచలం యుద్ధసాధనమ్‌ | మమ కార్యం కథం సిద్ధం భవిష్యతి ప్రియాప్తయే || 26

తస్మిన్‌ దేవ త్వయా కార్యం సాహాయ్యం మమ సువ్రత | సాహాయ్యం తే వినా నాథ మమ కార్యం హి దుర్లభమ్‌ || 27

త్వదీయో రావణో%పీహ దుర్జయస్సర్వథాఖిలైః | త్వద్దత్తవరదృప్తశ్చ మహావీరస్త్రి లోకజిత్‌ || 28

అప్యహం తవ దాసో%స్మి త్వదధీనశ్చ సర్వథా | విచార్యేతి త్వయా కార్యః పక్షపాతస్సదాశివ || 29

శ్రీరాముడు ఇట్లు పలికెను-

ఓ స్వామీ! శంభూ! మహాదేవా! సర్వకాలములలో భక్తులయందు వాత్సల్యము గలవాడా! దీనమైన మనస్సు గలవాడనై నిన్ను శరణు జొచ్చిన నీ భక్తుడనగు నన్ను రక్షించుము (24). సంసారసముద్రమును దాటించువాడా! ఈ సముద్రము అగాధమైనది. రావణాసురుడు మహావీరుడు మరియు మహాబలశాలి (25). చపలచిత్తులైన ఈ వానరుల సైన్యము నాకు యుద్ధమునకు సాధనము. నేను నా ప్రియురాలిని తిరిగి పొందుట అనే కార్యము నాకు ఎట్లు సిద్ధించును? (26) ఓ దేవా! గొప్ప వ్రతము గల వాడా! ఆ కార్యమునందు నీవు నాకు సాహాయ్యమును చేయదగును. ఓ నాథా! నీ సాహాయ్యము లేనిదే నా కార్యము దుర్లభము (27). నీవు ఇచ్చిన వరములచే గర్వించియున్నవాడు, మహావీరుడు, ముల్లోకములను జయించినవాడు మరియు నీవాడు అగు రావణుని ఎవ్వరైననూ ఏ విధముగనైననూ జయించుట అసాధ్యము (28). మరియు నేను నీ దాసుడను, అన్ని విధములుగా నీ ఆధీనములో నున్నవాడను. ఓ సదాశివా! కావున నీవు ఆలోచించి నాయందు పక్షపాతమును చూపదగును (29).

సూత ఉవాచ |

ఇత్యేవం స చ సంప్రార్థ్య నమస్కృత్య పునః పునః | తదా జయ జయేత్యుచ్చైరుద్ఘోషైశ్శంకరేతి చ || 30

ఇతి స్తుత్వా శివం తత్ర మంత్రధ్యానపరాయణః | పునః పూజాం తతః కృత్వా స్వామ్యగ్రే స ననర్త హ || 31

ప్రేమవిక్లిన్నహృదయో గల్లనాదం యదాకరోత్‌ | తదా చ శంకరో దేవస్సుప్రసన్నో బభూవ హ || 32

సాంగస్సపరివారశ్చ జ్యోతీరూపో మహేశ్వరః | యథోక్తరూపమమలం కృత్వావిరభవద్ద్రుతమ్‌ || 33

తతస్సంతుష్టహృదయో రామభక్త్యా మహేశ్వరః | శివమస్తు వరం బ్రూహి రామేతి స తదా బ్రవీత్‌ || 34

తద్రూపం చ తదా దృష్ట్వా సర్వే పూతాస్తతస్స్వయమ్‌ | కృతవాన్‌ రాఘవః పూజాం శివధర్మపరాయణః || 35

స్తుతిం చ వివిధాం కృత్వా ప్రణిపత్య శివం ముదా| జయం చ ప్రార్థయామాస రావణాజౌ తదాత్మనః || 36

తతః ప్రసన్నహృదయో రామభక్త్యా మహేశ్వరః | జయో% స్తుతే మహరాజ ప్రీత్యా స పునరబ్రవీత్‌ || 37

శివదత్తం జయం ప్రాప్య హ్యనుజ్ఞాం సమవాస్య చ | పునశ్చ ప్రార్థయామాన సాంజలి ర్నతమస్తకః|| 38

సూతుడు ఇట్లు పలికెను-

ఆయన ఈ విధముగా చక్కగా ప్రార్థించి పలుమార్లు నమస్కరించి తరువాత 'ఓ శంకరా! జయము, జయము ' అనే ఘోషను బిగ్గరగా చేసెను (30) ఆయన ఆ సమయములో ఈ విధముగా శివుని స్తుతించి మంత్రమును ధ్యానించుటలో నిమగ్నుడై, మరల పూజను చేసి తరువాత ప్రభువు యెదుట నాట్యమును చేసెను (31) శ్రీరాముడు ఎప్పుడైతే ప్రేమతో నిండిపోయిన హృదయము గలవాడై బిగ్గరగా కంఠనాదమును చేసెనో, అప్పుడు శంకరదేవుడు మిక్కిలి ప్రసన్నుడాయెను(32) ప్రకాశస్వరూపుడు మహేశ్వరుడు పూర్వములో వర్ణించిబడిన శుద్దరూపమును దాల్చి సాంగసపరివారముగా శీఘ్రమే ఆవిర్భవించెను(33). అప్పుడు ఆ మహేశ్వరుడు శ్రీరాముని భక్తికి సంతోషించిన హృదయము గలవాడై 'ఓ రామా! శుభమగుగాక ! వరమును కోరుకొనుము' అని పలికెను (34) అక్కడ ఉన్న అందరు ఆ రూపమును గాంచి పవిత్రులైరి. శివధర్మమునందు నిష్ఠ గల రాఘువుడు పూజనుచేసెను(35). ఆయన అపుడు వివిధస్తోత్రములను చేసి శివునకు ఆనందముతో నమస్కరించి రావణునితో యుద్ధమునందు జయమునుకోరెను(36) అప్పుడు శ్రీరాముని భక్తిచే ప్రసన్నమైన హృదయము గల మహేశ్వరుడు 'ఓ మహారాజా! నీకు జయము కలుగుకాక!' అని మరల ప్రేమతో పలికెను(37) శ్రీరాముడు శివుడు అనుగ్రహించిన జయాశీర్వాదమును స్వీకరించి అనుమతిని పొంది చేతులను కట్టుకొని తలను వంచి మరల ఇట్లు ప్రార్థించెను(38).

రామ ఉవాచ|

త్వాయా స్థేయమిహ స్వామింల్లోకానాం పావనాయ చ | పరేషాముపకారార్థం యది తుష్టో% సి శంకర|| 39

శ్రీరాముడు ఇట్లు పలికెను-

ఓ స్వామీ! శంకరా! నీవు సంతుష్టుడవైనచో, లోకములను పవిత్రము చేయుటకొరకు మరియు పరోపకారము కొరకు నీవు ఇచట స్థిరముగానుండదగును (39).

సూత ఉవాచ|

ఇత్యుక్తస్తు శివస్తత్ర లింగరూపో% భవత్తదా| రామేశ్వరశ్చ నామ్నా వై ప్రసిద్ధో జగతీతలే|| 40

రామస్తు తత్ప్ర భావాద్వై సింధుముత్తీర్య చాంజసా| రావణా దీన్ని హత్యా శు రాక్షసాన్‌ ప్రాప తాం ప్రియమ్‌ || 41

రామేశ్వరస్య మహిమాద్భుతో%భూద్భువి చాతులః | భుక్తిముక్తి ప్రదశ్చైవ సర్వదా భక్తకామదః || 42

దివ్యగంగా జలేనైన స్నాపయిష్యతి యశ్శివమ్‌| రామేశ్వరం చ సద్భక్త్వా స జీవన్ముక్త ఏవహి || 43

ఇహభక్త్వాఖిలాన్‌ భోగాన్‌ దేవానాం దుర్లభానపి | అంతే ప్రాప్య పరం జ్ఞానం కైవల్యం ప్రాప్నుయాద్ధ్రువమ్‌ || 44

ఇతి శ్రీ శివమహాపురాణ కోటి రుద్రసంహితాయాం రామేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ వర్ణనం నామ ఏకత్రింశో% ధ్యాయః(31).

సూతుడు ఇట్లు పలికెను-

శ్రీరాముడు ఇట్లు పలుకగా, అప్పుడు శివుడు అచట లింగరూపములో ప్రకటమై భూమండలమునందు రామేశ్వరుడను పేర ప్రసిద్ధిని గాంచెను(40). ఆయన యొక్క ప్రభావముచే శ్రీరాముడు సముద్రమును శీఘ్రముగా దాటి రావణుడు మొదలగు రాక్షసులను సంహరించి వెంటనే తన ఆ ప్రియురాలిని పొందెను (41). ఈ లోకములో భుక్తిని మరియు ముక్తిని ఇచ్చువాడు సర్వలోకములలో భక్తుల కోర్కెలను తీర్చువాడు అగు రామేశ్వరుని మహిమ సాటి లేనిది (42). ఎవడైతే దివ్యమగు గంగాజలముతో రామేశ్వరుని సధ్భక్తితో అభిషేకించునో, వాడు నిశ్చయముగా జీవన్ముక్తుడు అగును (43). అట్టివాడు నిశ్చయముగా ఇహలోకములోదేవతలకైననూ లభించని సకలభోగములననుభవించి మరణించిన తరువాత పరమజ్ఞానమును పొంది మోక్షమును పొందును (44).

శ్రీ శివమహాపురాణలోని కోటి రుద్రసంహితయందు రామేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావవర్ణనమనే ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది(31)

Siva Maha Puranam-3    Chapters