Siva Maha Puranam-3    Chapters   

అథ వింశో%ధ్యాయః

భీమాసురుని ఉపద్రవము

సూత ఉవాచ |

అతః పరం ప్రవక్ష్యామి మాహాత్మ్యం భైమశంకరమ్‌ | యస్య శ్రవణమాత్రేణ సర్వాభీష్టం లభేన్నరః || 1

కామరూపాభిధే దేశే శంకరో లోకకామ్యయా | అవతీర్ణస్స్వయం సాక్షాత్కల్యాణసుఖభాజనమ్‌ || 2

యదర్థమవతీర్ణో%సౌ శంకరో లోకశంకరః | శృణుతాదరతస్తచ్చ కథయామి మునీశ్వరాః || 3

భీమో నామ మహావీర్యో రాక్షసో%భూత్పురా ద్విజాః | దుఃఖదస్సర్వభూతానాం ధర్మధ్వంసకరస్సదా || 4

కుంభకర్ణాత్సముత్పన్నః కర్కట్యాం సుమహాబలః | సహ్యే పర్వతే సో%పి మాత్రా వాసం చకార హ || 5

కుంభకర్ణే చ రామేణ హతే లోకభయంకరే | రాక్షసీ పుత్రసంయుక్తా సహ్యే%తిష్ఠత్స్వయం తదా || 6

స బాల ఏకదా భీమః కర్కటీం మాతరం ద్విజాః | పప్రచ్ఛ చ ఖలో లోకదుఃఖదో భీమవిక్రమః || 7

సూతుడు ఇట్లు పలికెను-

ఈ పైన భీమశంకరుని మహిమను గురించి చెప్పెదను. దీనిని విన్నంత మాత్రాన మానవునకు అభీష్టములన్నియు నెరవేరును (1). కల్యాణములకు, సుఖములకు నిధానమగు శంకరుడు జనుల కోరికపై కామరూపమును ప్రాంతమునందు స్వయముగా అవతరించెను (2). ఓ మహర్షులారా! లోకములకు మంగళములను కలిగించు ఆ శంకరుడు ఇట్లు అవతరించుటకు గల ప్రయోజనమును చెప్పుచున్నాను. సాదరముగా వినుడు (3). ఓ బ్రాహ్మణులారా! పూర్వము సర్వప్రాణులకు దుఃఖమును కలిగించువాడు, సర్వదా ధర్మమునకు హానిని తలపెట్టువాడు, మహా పరాక్రమశాలి అగు భీముడనే రాక్షసుడు ఉండెను (4). కుంభకర్ణునివలన కర్కటియందు జన్మించిన మహాబలశాలియగు అతడు తల్లితో కలసి సహ్యపర్వతముపై నివసించెడివాడు (5). లోకభయంకరుడగు కుంభకర్ణుని శ్రీరాముడు సంహరించిన తరువాత ఆ రాక్షసి తన కొడుకుతో గూడి సహ్యపర్వతమునందు ఉండెడిది (6). ఓ బ్రాహ్మణులారా! బాలకుడు, దుష్టుడు, లోకములకు దుఃకమును కలిగించువాడు, భయంకరమగు పరాక్రమము గలవాడు అగు ఆ భీముడు ఒక నాడు తల్లియగు కర్కటిని ఇట్లు ప్రశ్నించెను (7).

భీమ ఉవాచ |

మాతర్మే కః పితా కుత్ర కథం వైకాకినీ స్థితా | జ్ఞాతుమిచ్ఛామి తత్సర్వం యథార్థం త్వం వదాధునా || 8

భీముడు ఇట్లు పలికెను-

అమ్మా! నా తండ్రి ఎవరు? ఎచ్చటనున్నాడు? నీవు ఒంటరిగా నుండుటకు కారణమేమి? ఈ సర్వమును నేను తెలియగోరుచున్నాను. నీవు ఇపుడు సత్యమును చెప్పుము (8).

సూత ఉవాచ |

ఏవం పృష్టా తదా తేన పుత్రేణ రాక్షసీ చ సా | ఉవాచ పుత్రం సా దుష్టా శ్రూయతాం కథయామ్యహమ్‌ || 9

సూతుడు ఇట్లు పలికెను-

అపుడు తన కుమారుడు ఇట్లు ప్రశ్నించగా దుష్టురాలగు ఆ రాక్షసి పుత్రునితో పలికిన వచనములను నేను చెప్పుచున్నాను. వినుడు (9).

కర్కట్యువాచ |

పితా తే కుంభకర్ణశ్చ రావణానుజ ఏవ చ | రామేణ మారితస్సో%యం భ్రాత్రా సహ మహాబలః || 10

అత్రాగతః కదాచిద్వై కుంభకర్ణస్స రాక్షసః | మద్భోగం కృతవాంస్తాత ప్రసహ్య బలవాన్‌ పురా || 11

లంకాం స గతవాన్‌ మాం చ త్యక్త్వాత్రైవ మహాబలః | మయా న దృష్ట్వా సా లంకా హ్యత్రై వ నివసామ్యహమ్‌ || 12

పితా మే కర్కటో నామ మాతా మే పుష్కసీ మతా | భర్తా మమ విరాధో హి రామేణ నిహతః పురా || 13

పిత్రోః పార్శ్వే స్థితా చాహం నిహతే స్వామిని ప్రియే | పితరౌ మే మృతౌ చాత్ర ఋషిణా భస్మసాత్కృతౌ || 14

భక్షణార్థం గతౌ తత్ర క్రుద్ధేన సుమహాత్మనా | సుతీక్‌ష్ణేన సుతపసా%గస్త్యశిష్యేణ వై తదా || 15

సాహమేకాకినీ జాతా దుఃఖితా పర్వతే పురా | నివసామి స్మ దుఃఖార్తా నిరాలంబా నిరాశ్రయా || 16

ఏతస్మిన్‌ సమయే హ్యత్ర రాక్షసో రావణానుజః | ఆగత్య కృతవాన్‌ సంగం మాం విహాయ గతో హి సః || 7

తతస్త్వం చ సముత్పన్నో మహాబలపరాక్రమః | అవలంబ్య పునస్త్వాం చ కాలక్షేపం కరోమ్యహమ్‌ || 8

కర్కటి ఇట్లు పలికెను-

రావణుని సోదరుడగు కుంభకర్ణుడే నీ తండ్రి. మహాబలశాలియగు కుంభకర్ణుని మరియు ఆతని సోదరుని శ్రీరాముడు సంహరించినాడు (10). బలవంతుడగు ఆ కుంభకర్ణుడనే రాక్షసుడు పూర్వము ఒకనాడు ఇచటకు వచ్చి బలాత్కారముగా నన్ను అనుభవించినాడు (11). మహాబలశాలయగు ఆతడు నన్ను ఇచటనే విడిచిపెట్టి లంకకు వెళ్లినాడు. నేను ఆ లంకను చూడలేదు. నును ఇచటనే నివసించుచున్నాను (12). నా తండ్రి కర్కటుడు; తల్లి పుష్కసి. నా భర్తయగు విరాధుని పూర్వము శ్రీరాముడు సంహరించినాడు (13). నా ప్రియభర్త మరణించిన తరువాత నేను తల్లిదండ్రులవద్దనే యున్నాను. ఇదే స్థానములో తనను భక్షించుటకు వచ్చిన నా తల్లిదండ్రులను గొప్ప మహాత్ముడు, అగస్త్యుని శిష్యుడు అగు సుతీక్‌ష్ణుడు అను ఋషి కోపించి భస్మము చేసినాడు (14, 15). అప్పటినుండియు నేను ఏకాకినై ఈ పర్వతమునందు ఆశ్రయము మరియు జీవిక లేనిదాననై దుఃఖముచే పీడింపబడుతూ నివసించుచున్నాను (16). అదే సమయములో రావణుని సోదరుడగు కుంభకర్ణుడు ఇచటకు వచ్చి నాతో స్నేహమును చేసి నన్ను విడిచిపెట్టి వెళ్లినాడు (17). తరువాత మహాబలపరాక్రశాలివియగు నీవు జన్మించినావు. నేను నిన్ను నమ్ముకొని మరల కాలక్షేపము చేయుచున్నాను (18).

సూత ఉవాచ |

ఇతి శ్రుత్వా వచస్తస్యా భీమో భీమపరాక్రమః | క్రుద్ధశ్చ చింతయామాస కిం కరోమి హరిం ప్రతి || 19

పితా%నేన హతో మే హి తథా మాతామహో హ్యపి | విరాధశ్చ హతో%నేన దుఃఖం బహుతరం కృతమ్‌ || 20

తత్పుత్రో%హం భ##వేయం చేద్ధరిం తం పీడయామ్యహమ్‌ | ఇతి కృత్వా మతిం భీమస్తపస్తప్తుం మహద్య¸° || 21

బ్రహ్మాణం చ సముద్దిశ్య వర్షాణాం చ సహస్రకమ్‌ | మనసా ధ్యానమాశ్రిత్య తపశ్చక్రే మహత్తదా || 22

ఊర్ధ్వబాహుశ్చై కపాదస్సూర్యే దృష్టిం దధత్పురా | సంస్థితస్స బభూవాథ భీమో రాక్షసపుత్రకః || 23

శిరసస్తస్య సంజాతం తేజః పరమదారుణమ్‌ | తేన దగ్ధాస్తదా దేవా బ్రహ్మాణం శరణం యయుః || 24

ప్రణమ్య వేధసం భక్త్యా తుష్టుపుర్వివిధైః స్తవైః | దుఃఖం నివేదయాఞ్చక్రుర్బ్ర హ్మణ తే సవాసవాః || 25

సూతుడు ఇట్లు పలికెను-

భయంకరమగు పరాక్రమముగల భీముడు ఆమెయొక్క ఈ వచనములను విని కోపించి విష్ణువు విషయములో ఏమి చేయవలెనా యని ఆలోచించెను (19). ఈతడు నా తండ్రిని, తల్లియొక్క తండ్రిని, మరియు విరాధుని సంహరించి అతిశయించిన దుఃఖమును కలిగించినాడు (20). నేను నా తండ్రియొక్క పుత్రుడనైనచో, ఆ హరికి దుఃఖమును కలిగించెదను అని నిశ్చయించుకొని భీముడు గొప్ప తపస్సును చేయుటకై వెళ్లెను (21). అపుడాతడు మనస్సును ఏకాగ్రము చేసి బ్రహ్మను ఉద్దేశించి వేయి సంవత్సరముల గొప్ప తపస్సును చేసెను (22). కుంభకర్ణపుత్రుడగు భీముడు చేతులను పైకెత్తి, ఒంటికాలిపై నిలబడి, సూర్యునికేసి చూస్తూ నిలబడియుండెను (23). ఆతని శిరస్సునుండి పరమదారుణమగు తేజస్సు పుట్టెను. దానిచే దహింపబడిన దేవతలు బ్రహ్మను శరణు జొచ్చిరి (24). ఇంద్రుడు మొదలగు దేవతలు బ్రహ్మకు భక్తితో నమస్కరించి వివిధస్తోత్రములతో స్తుతించి తమ దుఃఖమున విన్నవించుకొనిరి (25).

దేవా ఊచుః |

బ్రహ్మన్‌ వై రక్షసస్తేజో లోకాన్‌పీడితుముద్యతమ్‌ | యత్ర్పార్థ్యతే చ దుష్టేన తత్త్వం దేహి వరం విధే || 26

నో చేదద్య వయం దగ్ధాస్తీవ్రతత్తేజసా పునః | యాస్యామ సంక్షయం సర్వే తస్మాత్త్వం దేహి ప్రార్థితమ్‌ || 27

దేవతలు ఇట్లు పలికిరి-

ఓ బ్రహ్మా! రాక్షసుని తేజస్సు లోకములను పీడించుటకు సంసిద్ధమగుచున్నది. ఓ విధీ! కావున నీవు ఆ దుష్టుడు ఏ వరమును కోరితే దానిని ఇమ్ము (26). నీవు అట్లు ఈయనిచో, వాని తీవ్రమగు తేజస్సుచే దహింపబడే మేము అందరము వినాశమును పొందెదము. కావున వాని కోర్కెను తీర్చుము (27).

సూత ఉవాచ |

ఇతి తేషాం వచశ్శ్రు త్వా బ్రహ్మా లోకపితామహః | జగామ చ వరం దాతుం వచనం చేదమబ్రవీత్‌ ||

సూతుడు ఇట్లు పలికెను-

లోకములకు పితామహుడగు బ్రహ్మ వారి ఈ వచనములను విని వానికి వరమును ఇచ్చుటకొరకై వెళ్లి ఇట్లు పలికెను (28).

బ్రహ్మోవాచ |

ప్రసన్నో%స్మి వరం బ్రూహి యత్తే మనసి వర్తతే | ఇతి శ్రుత్వా విధేర్వాక్యమబ్రవీద్రాక్షసో హి సః || 29

బ్రహ్మ ఇట్లు పలికెను-

నేను ప్రసన్నుడనైతిని. నీ మనస్సులో గల వరమును చెప్పుము. బ్రహ్మయొక్క ఈ వచనమును విని ఆ రాక్షసుడిట్లు పలికెను (29).

భీమ ఉవాచ |

యది ప్రసన్నో దేవేశ యది దేయో వరస్త్వయా | అతులం చ బలం మే%ద్య దేహి త్వం కమలాసన || 30

భీముడు ఇట్లు పలికెను-

ఓ దేవదేవా! కమలాసనా! నీవు ప్రసన్నుడవై నాకు వరమునీయ నిశ్చయించినచో, నాకు ఈ నాడు నీవు సాటి లేని బలమును ఇమ్ము (30).

సూత ఉవాచ |

ఇత్యుక్త్వా తు నమశ్చక్రే బ్రహ్మణ స హి రాక్షసః | బ్రహ్మా చాపి తదా తసై#్మ వరం దత్త్వా గృహం య¸° || 31

రాక్షసో గృహమాగత్య బ్రహ్మాప్తాతిబలస్తదా | మాతరం ప్రణిపత్యాశు స భీమః ప్రాహ గర్వవాన్‌ || 32

సూతుడు ఇట్లు పలికెను-

ఆ రాక్షసుడు ఇట్లు పలికి బ్రహ్మకు నమస్కరించెను. బ్రహ్మ కూడ అపుడు వానికి వరమును ఇచ్చి తన ఇంటికి వెళ్లెను (31). అప్పుడ బ్రహ్మనుండి పొందబడిన అతిశయించిన బలము గల ఆ భీమాసురుడు వెంటనే వచ్చి తల్లికి నమస్కరించి గర్వముతో ఇట్లు పలికెను (32).

భీమ ఉవాచ |

పశ్య మాతర్బలం మే%ద్య కరోమి ప్రలయం మహాన్‌ | దేవానాం శక్రముఖ్యానాం హరేర్వై తత్సహాయినః || 33

భీముడు ఇట్లు పలికెను-

ఓ అమ్మా! ఈనాడు నా బలమును చూడుము. ఇంద్రాది దేవతలకు మరియు వారికి సహకరించే విష్ణువునకు ప్రళయమును సృష్టించెదను (33).

సూత ఉవాచ |

ఇత్యుక్త్వా ప్రథమం భీమో జిగ్యే దేవాన్‌ సవాసవాన్‌ | స్థానాన్నిస్సారయామాస స్వాత్స్వాత్తాన్‌ భీమవిక్రమః || 34

తతో జిగ్యే హరిం యుద్ధే ప్రార్థితం నిర్జరైపి | తతో జేతుం రసాం దైత్యః ప్రారంభం కృతవాన్ముదా || 35

పురా సుదక్షిణం తత్ర కామరూపేశ్వరం ప్రభుమ్‌ | జేతుం గతస్తతస్తేన యుద్ధమాసీద్భయంకరమ్‌ || 36

భీమో%థ తం మహారాజం ప్రభావాద్ర్బ హ్మణో%సురః | జిగ్యే వరప్రభావేణ మహావీరం శివాశ్రయమ్‌ || 37

స హి జిత్వా తతస్తం చ కామరూపేశ్వరం ప్రభుమ్‌ | బబంధ తాడయామాస భీమో భీమపరాక్రమః || 38

గృహీతం తస్య సర్వస్వం రాజ్య సోపస్కరం ద్విజాః | తేన భీమేన దుష్టేన శివధాసస్య భూపతే || 39

రాజా చాపి సుధర్మిష్ఠః ప్రియధర్మో హరప్రియః | గృహీతో నిగడైస్తేన హ్యేకాంతే స్థాపితశ్చ సః || 40

సూతుడు ఇట్లు పలికెను-

ఇట్లు పలికి భయంకరమగు పరాక్రమము గల భీముడు ముందుగా ఇంద్రాది దేవతలను జయించి వారిని వారి వారి అధికారిక స్థానములనుండి తొలగించెను (34). తరువాత ఆతడు దేవతలచే ప్రార్థించబడి యుద్ధమునకు వచ్చిన విష్ణువును యుద్ధములో జయించెను. తరువాత ఆ రాక్షసుడు ఆనందముతో పాతాళమును జయించే ప్రయత్నమునారంభించెను (35). ముందుగా ఆతడు కామరూపప్రాంతమునకు అధిపతియగు సుదక్షిణుని జయించుటకై ఆ ప్రాంతమునకు వెళ్లెను. అచట వానికి ఆయనతో భయంకరమగు యుద్ధము జరిగెను (36). అపుడు భీమాసురుడు బ్రహ్మ యొక్క వరప్రభావముచే శివభక్తుడు, మహావీరుడు అగు ఆ మహారాజును జయించెను (37). భయంకరమగు పరాక్రమముగల ఆ భీముడు ఆ కామరూపప్రభుని జయించి ఆ తరువాత ఆయనను బంధించి కొట్టెను (38). ఓ బ్రాహ్మణులారా! దుష్టుడగు ఆ భీముడు శివభక్తుడగు ఆ మహారాజు యొక్క రాజ్యమును సకలసామగ్రిని సర్వస్వమును లాగుకొనెను (39). పరమధర్మాత్ముడు, ధర్మకార్యములయందు ప్రీతి కలవాడు, ప్రియమైనవాడు అగు ఆ రాజును గొలుసులతో ఏకాంతస్థానమునందు బంధించెను (40).

తత్ర తేన తదా కృత్వా పార్థివీం మూర్తిముత్తమామ్‌ | భజనం చ శివసై#్యవ ప్రారబ్ధీ ప్రియకామ్యయా || 41

గంగాయాః స్తవనం తేన బహుధా చ తదా కృతమ్‌ | మానసం స్నానకర్మాది కృత్వా శంకరపూజనమ్‌ || 42

పార్థివేన విధానేన చకార నృపసత్తమః | తద్ధ్యానం చ యథా స్యాద్వై కృత్వా చ విధిపూర్వకమ్‌ || 43

ప్రణిపాతైస్తథా స్తోత్రై ర్ముద్రాసన పురస్సరమ్‌ | కృత్వా హి సకలం తచ్చ న భేజే శంకరం ముదా || 44

పంచాక్షరమయీం విద్యాం జజాప ప్రణవాన్వితమ్‌ | నాన్యత్కార్యం స వై కర్తుం లబ్ధవానంతరం తదా || 45

తత్పత్నీ చ తదా సాధ్వీ దక్షిణా నామ విశ్రుతా | విధానం పార్థివం ప్రీత్యా చకార నృపవల్లభా || 46

దంపతీ త్వేకభావేన శంకరం భక్తశంకరమ్‌ | భేజాతే తత్ర తౌ నిత్యం శివారాధనతత్పరౌ || 47

అప్పుడు ఆ మహారాజు ప్రియఫలమును పొందగోరి, అచట ఉత్తమమగు శివుని పార్థివమూర్తిని చేసి భజనమును ఆరంభించెను (41). ఆ సమయములో ఆయన మానసికమగు స్నానాదికర్మలను చేసి శంకరుని పూజించి గంగాదేవిని అనేకవిధములుగా స్తుతించెను (42). ఆ మహారాజు పార్థివ విధానముచే యథావిథిగా పూజను చేసి అక్కడి వీలును బట్టి శివుని ధ్యానించుచుండెను (43). ఆయన ఆసనమును వేసి, నమస్కారమును చేసి, స్తోత్రమును పఠించి, ముద్రలను ప్రదర్శించి, శంకరుని ఆనందముతో సకలోపచారములతో సేవించెను (44). ఆయన ఓంకారముతో గూడిన పంచాక్షరీ మంత్రమును జపించెను. ఆయనకు అచట మరియొక పనిని చేయుటకు అవకాశ##మే లభించకుండెను (45). ప్రియురాలు, పతివ్రత, దక్షిణ యని ప్రసిద్ధిని గాంచినది అగు ఆయన భార్య కూడ ఆ సమయములో ప్రీతితో పార్థివపూజను చేసెను (46). శివారాధనాపరాయణులగు ఆ దంపతులు ఏకాగ్రతతో భక్తులకు మంగళములనొసంగు శంకరుని నిత్యము సేవించిరి (47).

రాక్షసో యజ్ఞకర్మాది వరదర్పవిమోహితః | లోపయామాస తత్సర్వం మహ్యం వై దీయతామితి || 48

బహుసైన్యసమాయుక్తో రాక్షసానాం దురాత్మనామ్‌ | చకార వసుధాం సర్వాం స్వవశే చర్షిసత్తమాః || 49

వేదధర్మం శాస్త్ర ధర్మం స్మృతిధర్మం పురాణజమ్‌ | లోపయిత్వా చ తత్సర్వం బుభుజే స్వయమూర్జితః || 50

దేవాశ్చ పీడితాస్తేన సశక్రా ఋషయస్తథా | అత్యంతం దుఃఖమాపన్నా లోకాన్నిస్సారితా ద్విజాః || 51

తే తతో వికలాస్సర్వే సవాసవసురర్షయః | బ్రహ్మవిష్ణూ పురోధాయ శంకరం శరణం యయుః || 52

స్తుత్వా స్తోత్రై రనేకైశ్చ శంకరం లోకశంకరమ్‌ | ప్రసన్నం కృతవంతస్తే మహాకోశ్యాస్తటే శుభే || 53

కృత్వా చ పార్థివీం మూర్తిం పూజయిత్వా విధానతః | తుష్టువుర్వివిధైః స్తోత్రై ర్నమస్కారాదిభిః క్రమాత్‌ || 54

ఏవం స్తుతస్తదా శంభుర్దేవానాం స్తవనాదిభిః | సుప్రసన్నతరో భూత్వా తాన్‌ సురానిదమబ్రవీత్‌ || 55

వరమును పొంది ఆ గర్వముతో విమోహితుడైయున్న ఆ రాక్షసుడు అహుతులను నాకు ఈయవలెనని చెప్పి యజ్ఞయాగాది కర్మలన్నిటికి లోపము కలుగునట్లు జేసెను (48). ఓ మహర్షులారా! దుర్మార్గులగు రాక్షసుల పెద్ద సైన్యముతో గూడినవాడై ఆతడు భూమండలము నంతనూ తన వశము చేసుకొనెను (49). బలవంతుడగు ఆ రాక్షసుడు వేదశాస్త్ర స్మృతిపురాణ ధర్మములకు లోపమును కలిగించి సర్వమును తానే అనుభవించెను (50). ఓ బ్రాహ్మణులారా! వానిచే పీడింపబడిన ఇంద్రాదిదేవతలు మరియు ఋషులు తమ తమ స్థానములనుండి వెడలగొట్టబడినవారై మహాదుఃఖమును పొందిరి (51). అప్పుడు ఇంద్రాది దేవతలు మరియు ఋషులు అందరు మిక్కిలి దుఃఖించి బ్రహ్మవిష్ణువులను ముందిడుకొని శంకరుని శరణు పొందిరి (52). వారు పవిత్రమగు మహాకోశీనదీతీరమునందు లోకములకు మంగళకారకుడగు శంకరుని వివిధ స్తోత్రములతో స్తుతించి ప్రసన్నుని చేసుకొనిరి (53). వారు పార్థివమూర్తిని చేసి యథావిధిగా పూజించి వివిధస్తోత్రములతో స్తుతించి నమస్కారము మొదలగు ఉపచారములను క్రమముగా చేసిరి (54). దేవతలు చేసిన ఈ స్తోత్రములు మొదలగు వాటిచే మిక్కిలి ప్రసన్నుడైన శంభుడు అపుడు ఆ దేవతలతో నిట్లనెను (55).

శివ ఉవాచ |

హే హరే హే విధే దేవా ఋషయశ్ఛాఖిలా అహమ్‌ | ప్రసన్నో%స్మి వరం బ్రూత కిం కార్యం కరవాణి వః || 56

శివుడు ఇట్లు పలికెను-

ఓ విష్ణూ! బ్రహ్మా! దేవతలారా! ఋషులారా! మీ అందరి విషయములో నేను ప్రసన్నుడనైతిని. వరమును కోరుకొనుడు. నేను మీకు సాధించి పెట్టదగిన పనియేది? (56).

సూత ఉవాచ |

ఇత్యుక్తే చ తదా తేన శివేన వచనే ద్విజాః | సుప్రణమ్య కరౌ బద్ధ్వా దేవా ఊచుశ్శివం తదా || 57

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! అప్పుడు శివుడు ఇట్లు పలుకగా, దేవతలు చక్కగా ప్రణమిల్లి చేతులను కట్టుకొని శివునితో నిట్లనిరి (57).

దేవా ఊచుః |

సర్వం జానాసి దేవేశ సర్వేషాం మనసి స్థితమ్‌ | అంతర్యామీ చ సర్వస్య నాజ్ఞాతం విద్యతే తవ || 58

తథాపి శ్రూయతాం నాథ స్వదుఃఖం బ్రూమహే వయమ్‌ | త్వదాజ్ఞయా మహాదేవ కృపాదృష్ట్యా విలోకయ || 59

రాక్షసః కర్కటీపుత్రః కుంభకర్ణోద్భవో బలీ | పీడయత్యనిశం దేవాన్‌ బ్రహ్మదత్తవరోర్జితః || 60

తమిమం జహి భీమాహ్వం రాక్షసం దుఃఖదాయకమ్‌ | కృపాం కురు మహేశాన విలంబం న కురు ప్రభో || 61

దేవతలు ఇట్లు పలికిరి-

ఓ దేవదేవా! సర్వుల మనస్సులలోనున్న సర్వము నీకు ఎరుకయే. సర్వాంతర్యామివి అగు నీకు తెలియనది లేదు (58). ఓ నాథా! అయిననూ మేము మా దుఃఖమును నీ ఆజ్ఞచే చెప్పెదము వినుము. ఓ మహాదేవా! దయాదృష్టితో చూడుము (59). కర్కటీకుంభకర్ణులకు పుట్టిన బలశాలియగు రాక్షసుడు బ్రహ్మచే ఈయబడిన వరముచే మరింత బలమును పొంది సర్వకాలములలో దేవతలను పీడించుచున్నాడు (60). ఈ విధముగా దుఃఖమును కలిగించుచున్న ఈ భీమాసురుని నీవు సంహరించుము. ఓ మహేశ్వరా! దయను చూపుము. ఓ ప్రభూ! ఆలస్యమును చేయకుము (61).

సూత ఉవాచ |

ఇత్యుక్తస్తు సురైస్సర్వై శ్శంభుర్వై భక్తవత్సలః | వధం తస్య కరిష్యామీత్యుక్త్వా దేవాంస్తతో%బ్రవీత్‌ || 62

సూతుడు ఇట్లు పలికెను-

దేవతలందరు ఇట్లు చెప్పగా భక్తవత్సలుడగు శంభుడు వానిని వధించెదనని చెప్పి దేవతలతో మరల ఇట్లనెను (62).

శంభురువాచ |

కామరూపేశ్వరో రాజా మదీయో భక్త ఉత్తమః | తసై#్మ బ్రూతేతి వై దేవాః కార్యం శీఘ్రం భవిష్యతి || 63

సుదక్షిణ మహారాజ కామరూపేశ్వర ప్రభో | మద్భక్తస్త్వం విశేషేణ కురు మద్భజనం రతేః || 64

దైత్యం భీమాహ్వయం దుష్టం బ్రహ్మప్రాప్తవరోర్జితమ్‌ | హనిష్యామి న సందేహస్త్వత్తిరస్కారకారిణమ్‌ || 65

శంభుడు ఇట్లు పలికెను-

కామరూపమహారాజు నా భక్తులలో ఉత్తముడు, ఓ దేవతలారా! ఆతనితో ఈ విధముగా చెప్పుడు. మీ కార్యము శీఘ్రముగా సంపన్నము కాగలదు (63). ఓ సుదక్షిణ మహారాజా! కామరూపాధిపతీ! నీవు నా భక్తులలో శ్రేష్ఠుడవు. నీవు నన్ను ప్రీతితో సేవించుము (64). దుష్టుడు, బ్రహ్మచే ఈయబడిన వరముచే బలమును పొందియున్నవాడు, నిన్ను తిరస్కరించినవాడు అగు భీమాసురుని నిస్సందేహముగా సంహరించెదను (65).

సూత ఉవాచ |

అథ తే నిర్జరాస్సర్వే తత్ర గత్వా ముదాన్వితాః | తసై#్మ మహానృపాయోచుర్యదుక్తం శంభునా చ తత్‌ || 66

తమిత్యుక్త్వా చ వై దేవా ఆనందం పరమం గతాః | మహర్షయశ్చ తే సర్వే యయుశ్శీఘ్రం నిజాశ్రమాన్‌ || 67

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయాం భీమాసురకృతోపదరవ వర్ణనం నామ వింశో%ధ్యాయః (20).

సూతుడు ఇట్లు పలికెను-

తరువాత ఆ దేవతలందరు ఆనందముతో గూడినవారై అచటకు వెళ్లి ఆ మహారాజునకు శంభుని వచనములను విన్నవించిరి (66). ఆ దేవతలు మరియు మహర్షులు అందరు ఆయనకు విన్నవించిన పిదప పరమానందమును పొంది వెంటనే తమ స్థానములకు వెళ్లిరి (67).

శ్రీ శివమహాపురాణములోని కోటిరుద్రసంహితయందు భీమాసురుని ఉపద్రవమును వర్ణించే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).

Siva Maha Puranam-3    Chapters