Siva Maha Puranam-3    Chapters   

అథ సప్తదశో%ధ్యాయః

మహాకాల జ్యోతిర్లింగ మాహాత్మ్యము

ఋషయ ఊచుః |

మహాకాలసమాహ్వస్థజ్యోతిర్లింగస్య రక్షిణః | భక్తానాం మహిమానం చ పునర్బ్రూ హి మహామతే || 1

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ మహాబుద్ధిశాలీ! భక్తరక్షకుడు, జ్యోతిర్లింగరూపములోనున్నవాడు అగు మహాకాలేశ్వరుని మహిమను గురించి మరల చెప్పుము (1).

సూత ఉవాచ|

శృణుతాదరతో విప్రా భక్తరక్షావిధాయినః | మహాకాలస్య లింగస్య మాహాత్మ్యం భక్తివర్ధనమ్‌ || 2

ఉజ్జయిన్యామభూద్రాజా చంద్రసేనాహ్వయో మహాన్‌ | సర్వశాస్త్రా ర్థతత్త్వజ్ఞశ్శివభక్తో జితేంద్రియః || 3

తస్యాభవత్సఖా రాజ్ఞో మణిభద్రో గణో ద్విజాః | గిరీశగణముఖ్యశ్చ సర్వలోకనమస్కృతః || 4

ఏకదా స గణంద్రో హి ప్రసన్నాస్యో మహామణిమ్‌ | మణిభద్రో దదౌ తసై#్మ చింతామణిముదారధీః || 5

స వై మణిః కౌస్తుభవద్ద్యోతమానో%ర్కసన్నిభః | ధ్యాతో దృష్టశ్శ్రు తో వాపి మంగలం యచ్ఛతి ధ్రువమ్‌ || 6

తస్య కాంతితలస్పృష్టం కాంస్యం తామ్రమయం త్రపు | పాషాణాదికమన్యద్వా ద్రుతం భవతి హాటకమ్‌ || 7

స తు చింతామణిం కంఠే బిభ్రద్రాజా శివాశ్రయః | చంద్రసేనో రరాజాతి దేవమధ్యే వ భానుమాన్‌ || 8

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! భక్తులను రక్షించే మహాకాలేశ్వరలింగముయొక్క భక్తిని పెంపొందించే మాహాత్మ్యమును ఆదరముతో వినుడు (2). ఉజ్జయినీ నగరములో సర్వశాస్త్ర ముల సారము నెరింగినవాడు, శివభక్తుడు, ఇంద్రియజయము గలవాడు అగు చంద్రసేనుడనే గొప్ప రాజు ఉండెను (3). ఓ బ్రాహ్మణులారా! శివుని గణాధ్యక్షులలో ప్రముఖుడు, సర్వలోకములకు నమస్కరించి దగినవాడు అగు మణిభద్రుడు ఆ రాజునకు మిత్రుడు (4). ఉదారమగు బుద్ధిగలవాడు, ప్రసన్నమైన ముఖము గలవాడు, గణాధ్యక్షుడు అగు ఆ మణిభద్రుడు ఒకనాడు ఆతనికి చింతామణి అనే గొప్ప మణిని ఇచ్చెను (5). కౌస్తుభమాణిక్యమువలె మరియు సూర్యునివలె ప్రకాశించే ఆ మణి తనను ధ్యానించువారలకు, చూచినవారికి మరియు వినువారికి కూడ మంగళములనిచ్చుననుటలో సందేహము లేదు (6). కంచు, రాగి, ఇనుము, తగరము, పాషాణము ఇత్యాది సర్వద్రవ్యములు ప్రకాశించే దాని ఉపరితలమును స్పృశించి వెంటనే బంగారముగా మారిపోవును (7). శివుడే ఆశ్రయముగా గల ఆ చంద్రసేనమహారాజు ఆ చింతామణిని కంఠములో ధరించి దేవతల మధ్యలో ఆదిత్యునివలె ప్రకాశించెను (8).

శ్రుత్వా చింతామణిగ్రీవం చంద్రసేనం నృపోత్తమమ్‌ | నిఖిలాః క్షితిరాజానస్తృష్ణాక్షుబ్ధహృదో%భవన్‌ || 9

నృపా మత్సరిణస్సర్వే తం మణిం చంద్రసేనతః | నానోపాయైరయాచంత దేవలబ్ధమబుద్ధయః || 10

సర్వేషాం భూభృతాం యాచ్ఞా చంద్రసేనేన తేన వై | వ్యర్థీకృతా మహాకాలదృఢభ##క్తేన భూసురాః || 11

తే కదర్థీకృతాస్సర్వే చంద్రసేనేన భూభృతాః | రాజానస్సర్వదేశానాం సంరంభం చక్రిరే తదా|| 12

అథ తే సర్వరాజానశ్చతురంగబలాన్వితాః | చంద్రసేనం రణ జేతుం సంబభూవ కిలోద్యతాః || 13

తే తు సర్వే సమేతా వై కృతసంకేతసంవిదః | ఉజ్జయిన్యాశ్చతుర్ద్వారం రురుధుర్బహుసైనికాః || 14

సంరుధ్యమానాం స్వపురీం దృష్ట్వా నిఖిలరాజభిః | తమేవ శరణం రాజా మహాకాలేశ్వరం య¸° || 15

నిర్వికల్పో నిరాహారస్స నృపో దృఢనిశ్చయః | సమానర్చ మహాకాలం దివా నక్తమనన్యధీ || 16

చంద్రసేన మహారాజు చింతామణిని మెడలో ధరించియుండునని వినిన మహారాజుల అందరి హృదయములు దురాశ##చే క్షోభను పొందెను (9). బుద్ధిహీనులు,అసూయాపరులు అగు ఆ రాజులందరు పరమేశ్వరునినుండి లభించిన ఆ మణిని తమకు ఇమ్మని అనేకములగు ఉపాయములతో చంద్రసేనుని అర్థించిరి (10). ఓ బ్రాహ్మణులారా! మహాకాలేశ్వరునియందు దృఢమగు భక్తిగల చంద్రసేనమహారాజు ఆ రాజులందరి ప్రార్థనలను మన్నించలేదు (11). చంద్రసేనమహారాజుచే నిరాకరింపబడిన ఆ సర్వదేశముల రాజులు అపుడు యుద్ధమునకు సన్నద్ధము కాజొచ్చిరి (12). తరువాత ఆ రాజులందరు చతురంగబలములతో గూడినవారై చంద్రసేనుని యుద్ధములో జయించుటకు తగిన ఏర్పాట్లను చేసిరి (13). వారందరు కలిసి సమాలోచనలను చేసి కుట్రను పన్ని, పెద్ద సైన్యముతో ఉజ్జయినీ నగరముయొక్క నాల్గు ద్వారములను ముట్టడించిరి (14). తన నగరమును రాజులందరు ముట్టడించుటకు గాంచి ఆ మహారాజు మహాకాలేశ్వరుని మాత్రమే శరణు జొచ్చెను (15). సంశయములు లేనివాడు, దృఢమగు నిశ్చయము గలవాడు అగు ఆ రాజు ఉపవసించి రాత్రింబగళ్లు ఏకాగ్రచిత్తముతో మహాకాలేశ్వరుని చక్కగా అర్చించెను (16).

తతస్స భగవాన్‌ శంభుర్మహాకాలః ప్రసన్నధీః | తం రక్షితుముపాయం వై చక్రే తం శృణుతాదరాత్‌ || 17

తదైవ సమయే గోపీ కాచిత్తత్ర పురోత్తమే | చరంతీ సశిశుర్విప్రా మహాకాలాంతికం య¸° || 18

పంచాబ్దవయసం బాలం వహం తీ గతభర్తృకా | రాజ్ఞా కృతాం మహాకాలపూజాం సాపశ్యదాదరాత్‌ || 19

సా దృష్ట్వా సుమహాశ్చర్యాం శివపూజాం చ తత్కృతామ్‌ | ప్రణిపత్య స్వశిబిరం పునరేవాభ్యపద్యత || 20

ఏతత్సర్వమశేషేణ స దృష్ట్వా వల్లవీసుతః | కుతూహలేన తాం కర్తుం శివపూజాం మనో దధే || 21

ఆనీయ హృద్యం పాషాణం శూన్యే తు శిబిరాంతరే | అవిదూరే స్వ శిబిరాచ్ఛివలింగం స భక్తితః || 22

గంధాలంకారవాసోభిర్ధూపదీపాక్షతాదిభిః | విధాయ కృత్రిమైర్ద్రవ్యైర్నైవేద్యం చాప్యకల్పయత్‌ || 23

భూయో భూయస్సమభ్యర్చ్య పత్రైః పుషై#్పర్మనోరమైః | నృత్యం చ వివిధం కృత్వా ప్రణనామ పునః పునః || 24

తరువాత భగవాన్‌ మహాకాలేశ్వరుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై ఆతనిని రక్షించే ఉపాయమును చేసెను. దానిని ఆదరముతో వినుడు (17). ఓ బ్రాహ్మణులారా! అదే సమయములో ఆ గొప్ప నగరములో ఒకానొక గొల్ల యువతి తన బిడ్డతో సహా సంచరిస్తూ మహాకాలేశ్వరుని సమీపమునకు వెళ్లెను (18). భర్తృవిహీనమగు ఆ యువతి ఐదు సంవత్సరముల వయస్సు గల తన బాలుని ఎత్తుకొని మహారాజు చేయుచున్న మహాకాలేశ్వరపూజను శ్రద్ధతో దర్శించెను (19). మహారాజు చేసిన ఆ మహాశ్చర్యకరమగు శివపూజను గాంచి ఆమె ప్రణమిల్లిన పిదప తన నివాసమునకు వెళ్లెను (20). ఆ గొల్ల పిల్లడు ఆ పూజనంతనూ చూచి, కుతూహలముచే ఆ శివపూజను చేయుటకు నిశ్చయించుకొనెను (21). ఆ బాలుడు తన ఇంటికి సమీపములోనున్న ఒక అందమైన పాషాణమును తెచ్చి ఇంటిలోపల ఏకాంతములో దానిని శివలింగరూపములో స్థాపించి భక్తితో ఆరాధించెను (22). ఆతడు ఉత్తుత్తి పదార్థములతో గంధము, అలంకారము, వస్త్రము, ధూపము, దీపము, అక్షింతలు, నైవేద్యము ఇత్యాది ఉపచారములనన్నింటినీ చేసెను (23). ఆతడు సుందర మగు పత్రపుష్పములతో పలుమార్లు అర్చించి వివిధములగు నృత్యములను ప్రదర్శించి అనేక పర్యాయములు ప్రణమిల్లెను (24).

ఏతస్మిన్‌ సమయే పుత్రం శివాసక్త సుచేతసమ్‌ | ప్రణయాద్గోపికా సా తం భోజనాయ సమాహ్వయత్‌ || 25

యదాహూతో%పి బహుశశ్శివపూజాసక్తమానసః | బాలశ్చ భోజనం నైచ్ఛత్తదా తత్ర య¸° ప్రసూః || 26

తం విలోక్య శివస్యాగ్రే నిషణ్ణం మీలితేక్షణమ్‌ | చకర్ష పాణిం సంగృహ్య కోపేన సమతాడయత్‌ || 27

ఆకృష్టస్తాడితశ్చాపి నాగచ్ఛత్స్వసుతో యదా | తాం పూజాం నాశయామాస క్షిప్త్వా లింగం చ దూరతః || 28

హాహేతి దూయమానం తం నిర్భర్త్స్య స్వసుతం చ సా | పునర్వివేశ స్వగృహం గోపీ క్రోధసమన్వితా || 29

మాత్రా వినాశితాం పూజాం దృష్ట్వా దేవస్య శూలినః | దేవదేవేతి చుక్రోశ నిపపాత స బాలకః || 30

ప్రనష్టసంజ్ఞస్సహసా స బభూవ శుచాకులః | లబ్ధసంజ్ఞో ముహూర్తేన చక్షుషీ ఉదమీలయత్‌ || 31

ఈ సమయములో ఆ గోపిక శివునియందు స్థిరముగా లగ్నమైన చిత్తముగల తన పుత్రుని భోజనముకొరకు పిలిచెను (25). శివపూజయందు నిమగ్నమైన మనస్సుగల ఆ బాలకుడు ఎన్నిసార్లు పిలిచిననూ భోజనమును అపేక్షించలేదు. అపుడాతని తల్లి అచటకు వచ్చెను (26). శివుని యెదుట కన్నులను మూసుకొని కూర్చుండియున్న ఆ బాలకుని గాంచి ఆమె చేతిని పట్టుకొని లాగి కోపముతో కొట్టెను (27). ఆమె పుత్రుడు లాగి కొట్టిననూ వెళ్లలేదు. అపుడామె లింగమును దూరముగా పారవైచి ఆ పూజను చెడగొట్టెను (28). కోపముతో కూడియున్న ఆ గోపిక ఆయ్యో ! అయ్యో ! అని దుఃఖించుచున్న తన కుమారుని బెదిరించి మరల తన ఇంటిలోపలికి వెళ్లెను (29). తల్లి శివపూజను ధ్వంసము చేయుటను గాంచిన ఆ బాలకుడు దేవదేవా! అని ఏడుస్తూ క్రింద బడెను (30). దుఃఖముచే కల్లోలితుడైయున్న ఆ బాలుడు వెంటనే స్పృహను గోల్పోయెను. కొద్ది సేపటిలో ఆతడు మరల తెలివిని పొంది కన్నులను తెరచెను (31).

తదైవ జాతం శిబిరం మహాకాలస్య సుందరమ్‌ | దదర్శ స శిశుస్తత్ర శివానుగ్రహతో%చిరాత్‌ || 32

హిరణ్మయబృహద్ద్వారం కపాటవరతోరణమ్‌ | మహార్హనీల విమలవజ్రవేదీవిరాజితమ్‌ || 33

సంతప్తహేమకలశైర్విచిత్రై ర్బహుభిర్యుతమ్‌ | ప్రోద్భాసితమణిస్తంభైర్బద్ధస్ఫటికభూతలైః || 34

తన్మధ్యే రత్నలింగం హి శంకరస్య కృపానిధేః | స్వకృతార్చన సంయుక్తమపశ్యద్గోపికాసుతః || 35

స దృష్ట్వా సహసోత్థాయ శిశుర్విస్మితమానసః | సంనిమగ్న ఇవాసీద్వై పరమానందసాగరే || 36

తతః స్తుత్వా స గిరిశం భూయో భూయః ప్రణమ్య చ | సూర్యే చాస్తం గతే బాలో నిర్జగామ శివాలయాత్‌ || 37

అథాపశ్యత్స్వశిబిరం పురందరపురోపమమ్‌ | సద్యో హిరణ్మయీభూతం విచిత్రం పరమోజ్జ్వలమ్‌ || 38

అదే సమయంలో ఆ ఇల్లు శివుని అనుగ్రహముచే ఆ బాలుడు చూచుచుండగనే వెనువెంటనే సుందరమగు మహాకాలేశ్వరుని నిలయము ఆయెను (32). బంగారముతో చేసిన పెద్ద ద్వారములు గలది, శ్రేష్ఠమగు తలుపులు, తోరణములు గలది, మిక్కిలి విలువైన నీలమణులు, స్వచ్ఛమగు వజ్రములు పొదిగిన అరుగులతో ప్రకాశించునది (33), పుటము పెట్టిన బంగారముతో చేసిన రంగురంగుల పెక్కు కలశములతో కూడియున్నది, అతిశయించిన ప్రకాశము గల మణిస్తంభములు గలది, స్ఫటికములు పొదిగిన నేలలు గలది (34) అగు ఆ మందిరములో మధ్యలో దాను చేసిన పూజాద్రవ్యములతోనలరారు దయానిధియగు శంకరుని రత్నలింగమును ఆ గొల్ల పిల్లవాడు చూచెను (35). ఆశ్చర్యముతో నిండిన మనస్సు గల ఆ బాలుడు దానిని చూచి పరమానందసముద్రములో మునిగియున్నాడా యన్నట్లు వెంటనే లేచి నిలబడెను (36). అపుడా బాలకుడు కైలాసపతిని స్తుతించి పలుమార్లు ప్రణమిల్లి, సూర్యుడు అస్తమించిన పిదప శివాలయము నుండి బయటకు వచ్చెను (37). ఆ తరువాత ఆతడు అంతటా బంగరు కాంతులను వెదజల్లుతూ మహేంద్రుని రాజధానిని పోలియున్న విచిత్రమైన తన ఇంటిని చూచెను (38).

సోంతర్వివేశ భవనం సర్వశోభాసమన్వితమ్‌ | మణిహేమగణాకీర్ణం మోదమానో నిశాముఖే || 39

తత్రాపశ్యత్స్వజననీం స్వపంతీం దివ్యలక్షణామ్‌ | రత్నాలంకారదీప్తాంగీం సాక్షాత్సురవధూమివ || 40

అథో స తనయో విప్రాశ్శివానుగ్రహభాజనమ్‌ | జవేనోత్థాపయామాస మాతరం సుఖవిహ్వలః || 41

సోత్థితాద్భుతమాలక్ష్యాపూర్వం సర్వమివాభవత్‌ | మహానందసుమగ్నా హి సస్వజే స్వసుతం చ తమ్‌ || 42

శ్రుత్వా పుత్రముఖాత్సర్వం ప్రసాదం గిరిజాపతేః | ప్రభుం విజ్ఞాపయామాస యో భజత్యనిశం శివమ్‌ || 43

స రాజా సహసా గత్య సమాప్తనియమో నిశి | దదర్శ గోపికాసూనోః ప్రభావం శివతోషణమ్‌ || 44

దృష్ట్వా మహీపతిస్సర్వం తత్సామాత్యపురోహితః | ఆసీన్నిమగ్నో విధృతిః పరమానందసాగరే || 45

ప్రేవ్ణూ బాష్పజలం ముంచన్‌ చంద్రసేనో నృపో హి సః | శివనామోచ్చరన్‌ ప్రీత్యా పరిరేభే తమర్భకమ్‌ || 46

మహామహోత్సవస్తత్ర ప్రబభూవాద్భుతో ద్విజాః | మహేశకీర్తనం చక్రుస్సర్వే చ సుఖ విహ్వలాః || 47

సకలశోభలతో గూడియున్నది, సర్వత్ర మణులతో మరియు బంగారముతో వ్యాప్తమై యున్నది అగు భవనములోనికి అతడు రాత్రియొక్క ఆరంభమునందు ప్రవేశించెను (39). ఆతడు అచట నిద్రపోవుచున్నది, దివ్యలక్షణములతో కూడియున్నది, రత్నాలంకారములతో ప్రకాశించే ఆవయవములు గలది, సాక్షాత్తుగా దేవతాస్త్రీవలె నున్నది యగు తన తల్లిని చూచెను (40). ఓ బ్రాహ్మణులారా! శివానుగ్రహమునకు పాత్రమైన ఆ బాలకుడు పట్టరాని ఆనందముతో అపుడు తన తల్లిని వేగముగా నిద్ర లేపెను (41). ఆమె నిద్ర లేచి అద్భుతము, అపూర్వము అగు ఆ సర్వమును గాంచి మహానందసముద్రములో మునకలు వేయుచూ ఆ తన కుమారుని కౌగిలించుకొనెను (42). ఆమె కొడుకు నోటినుండి పార్వతీపతియొక్క అనుగ్రహవృత్తాంతమునంతనూ విని, నిత్యశివారాధకుడగు రాజునకు విన్నవించెను (43). ఆ రాజు వ్రతనియమము పూర్తి అయిన వెంటనే విచ్చేసి, ఆ గొల్ల పిల్లవాడు శివుని సంతోషపెట్టి సంపాదించిన మహిమను గాంచెను (44). మంత్రులతో మరియు పురోహితులతో కూడియున్న ఆ మహారాజు ఆ సర్వమును చూచి, పరమానందసముద్రములో మునకలు వేసి, విశేషమగు ధైర్యమును పొందెను (45). ఆ చంద్రసేనమహారాజు ప్రేమతో కన్నీటిని విడుచుచూ, శివనామమును ఉచ్చరించుచూ, ఆ బాలకుని ప్రీతితో కౌగిలించుకొనెను (46). ఓ బ్రాహ్మణులారా! అపుడు అచట అద్భుతమగు మహోత్సవము జరిగెను. సర్వులు ఆనందమును పట్టలేనివారై మహేశ్వరుని కీర్తించిరి (47).

ఏవమత్యద్భుతాచారాచ్ఛివమాహౄత్మ్యదర్శనాత్‌ | పౌరాణాం సంభ్రమాచ్చైవం సా రాత్రిః క్షణతామగాత్‌ || 48

అథ ప్రభాతే యుద్ధాయ పురం సంరుధ్య సంస్థితాః | రాజానశ్చారవక్త్రే భ్యశ్శుశ్రువుశ్చరితం చ తత్‌ || 49

తే సమేతాశ్చ రాజానస్సర్వే యే యే సమాగతాః | పరస్పరమితి ప్రోచుస్తచ్ఛ్రుత్వా చకితా అతి || 50

ఈ విధముగా అత్యద్భుతమగు ఆ ఘటనలో శివుని మహిమ ప్రకటమగుటచే పురజనులు మహాసంరంభమును చేయుచుండగా ఆ రాత్రి క్షణమువలె గడచి పోయెను (48). మరునాడు తెల్లవారిన తరువాత నగరమును ముట్టడించి సిద్ధముగా నున్నరాజులు గూఢచారుల ముఖములనుండి ఆ వృత్తాంతమును వినిరి (49). అచట జతగూడిన ఆ రాజులందరు ఆ వృత్తాంతమును విని మిక్కిలి చకితులై వారిలో వారు ఇట్లు పలికిరి (50).

రాజాన ఊచుః |

అయం రాజా చంద్రసేనశ్శివభక్తో%తి దుర్జయః | ఉజ్జయిన్యా మహాకాలపుర్యాః పతిరనాకులః || 51

ఈదృశాశ్శిశవో యస్య పుర్యాం సంతి శివవ్రతాః | స రాజా చంద్రసేనస్తు మహాశంకరసేవకః || 52

నూనమస్య విరోధేన్యశివః క్రోధం కరిష్యతి | తత్ర్కో ధాద్ధి వయం సర్వే భవిష్యామో వినష్టకాః || 53

తస్మాదనేన రాజ్ఞావై మిలాపః కార్య ఏవ హి | ఏవం సతి మహేశానః కరిష్యతి కృపాం వరామ్‌ || 54

రాజులు ఇట్లు పలికిరి-

మహాశివభక్తుడగు ఈ చంద్రసేనమహారాజును జయించుట సంభవము కాదు. మహాకాలేశ్వరుని నగరమగు ఉజ్జయిని యొక్క పాలకునకు దుఃఖము కలుగదు (51). ఎవని నగరములో మహాశివభక్తులగు ఇట్టి బాలకులు గలరో, అట్టి ఆ చంద్రసేనమహారాజు శంకరసేవకులలో గొప్పవాడు (52). ఈతనితో విరోధమును పెట్టుకొనువారిపై శివుడు క్రోధమును బూనుట నిశ్చయము. ఆయన కోపించినచో మనము అందరము వినాశమును పొందెదము (53). కావున ఈ రాజుతో మనము సంధిని చేసుకొని తీరవలెను. అట్లు చేసినచో, మహేశ్వరుడు అపారమగు దయను చూపగలడు (54).

సూత ఉవాచ |

ఇతి నిశ్చిత్య తే భూపాస్త్యక్తవైరాస్సదాశయాః | సర్వే బభూవుస్సుప్రీతా న్యస్తశస్త్రా స్త్ర పాణయః || 55

వివిశుస్తే పురీం రమ్యాం మహాకాలస్య భూభృతః | మహాకాలం సమానర్చుశ్చంద్రసేనానుమోదితాః || 56

తతస్తే గోపవనితాగేహం జగ్ముర్మహీభృతః | ప్రశంసంతశ్చ తద్భాగ్యం సర్వే దివ్యమహోదయమ్‌ || 57

తే తత్ర చంద్రసేనేన ప్రత్యుద్గమ్యాభిపూజితాః | మహార్హవిష్టరగతాః ప్రత్యనందన్‌ సువిస్మితాః || 58

గోపసూనోః ప్రసాదాత్తత్ర్పా దుర్భూతం శివాలయమ్‌ | సంవీక్ష్య శివలింగం చ శివే చక్రుః పరాం మతిమ్‌ || 59

తతస్తే గోపశిశ##వే ప్రీతా నిఖిలభూభుజః | దదుర్బహూని వస్తూని తసై#్మ శివకృపార్థినః || 60

యే యే సర్వేషు దేశేషు గోపాస్తిష్ఠంతి భూరిశః | తేషాం తమేవ రాజానం చక్రిరే సర్వపార్థివాః || 61

అథాస్మిన్నంతరే సర్వైస్త్రి దశైరభిపూజితః | ప్రాదుర్బభూవ తేజస్వీ హనూమాన్‌ వానరేశ్వరః || 62

తే తస్యాభిగమాదేవ రాజానో జాతసంభ్రమాః | ప్రత్యుత్థాయ నమశ్చక్రుర్భక్తినమ్రాత్మమూర్తయః || 63

తేషాం మధ్యే సమాసీనః పూజితః ప్లవగేశ్వరః | గోపాత్మజం తమాలింగ్య రాజ్ఞో వీక్ష్యేదమబ్రవీత్‌ || 64

సూతుడు ఇట్లు పలికెను-

ఆ రాజులందరు ఈ విధముగా నిశ్చయించుకొని, వైరమును వీడి, శుద్ధమగు అంతఃకరణము గల వారై చేతులలోని శస్త్రాస్త్రములను పారవైచి గొప్ప ప్రీతిని పొందిరి (55). ఆ రాజులు చంద్రసేనుని అనుమతిని పొంది సుందరమగు మహాకాలేశ్వరుని నగరములోనికి ప్రవేశించి మహాకాలుని చక్కగా అర్చించిరి (56). తరువాత ఆ రాజులు అందరు ఆ గోపికయొక్క గృహమునకు వెళ్లి దేవదేవుని గొప్ప అనుగ్రహముచే ఆమెకు కలిగిన భాగ్యమును కొనియాడిరి (57). చంద్రసేనుడు అచట వారికి ఎదురేగి సత్కరించి మిక్కిలి విలువైన ఆసనములలో కూర్చుండబెట్టెను. వారు మహాశ్చర్యమును పొంది ఆయనను అభినందించిరి (58). శివుడు గొల్ల పిల్లవానిపై చూపిన అనుగ్రహముచే ప్రాదుర్భవించిన శివాలయమును మరియు శివలింగమున దర్శించి వారు శివునిపై మనస్సును ఏకాగ్రము చేసిరి (59). తరువాత శివుని అనుగ్రహమును కోరే ఆ రాజులు అందరు ఆ గోపబాలకునిపై ప్రేమను పొంది అతనికి అనేకవస్తువులను ఇచ్చిరి (60). ఆ రాజులందరు వారి వారి దేశములన్నింటిలో గోపాలకులు అధికముగా గల ప్రాంతములన్నింటికీ అతనిని రాజుగా చేసిరి (61). ఇంతలో అచట దేవతలందరిచే పూజింపబడువాడు, తేజశ్శాలి, వానరవీరుడు అగు హనుమంతుడు ప్రత్యక్షమయ్యెను (62). ఆయనను చూచుటతోడనే ఆ రాజులందరు కంగారుగా లేచి ఆయనకు ఎదురేగి భక్తితో వినమ్రమైన దేహములు గలవారై నమస్కరించిరి (63). వానరవీరుడగు హనుమంతుడు పూజలనందుకొని ఆ గోపబాలకుని కౌగిలించుకొని వారి మధ్యలో కూర్చున్నవాడై ఆ రాజులకేసి చూస్తూ ఇట్లు పలికెను (64).

హనూమానువాచ |

సర్వే శృణ్వంతు భద్రం వ రాజానో యే చ దేహినః | ఋతే శివం నాన్యతమో గతిరస్తి శరీరిణామ్‌ || 65

ఏవం గోపసుతో దిష్ట్యా శివపూజాం విలోక్య చ | అమంత్రేణాపి సంపూజ్య శివం శివమవాప్తవాన్‌ || 66

ఏష భక్తవరశ్శంభోర్గోపానాం కీర్తివర్ధనః | ఇహ భుక్త్వాఖిలాన్‌ భోగానంతే మోక్షమవాప్స్యతి || 67

అన్య వంశే%ష్టమో భావీ నందో నామ మహాయశాః | ప్రాప్స్యతే తత్ర పుత్రత్వం కృష్టోనారాయణస్స్వయమ్‌ || 68

అద్య ప్రభృతి లోకే%స్మిన్నేష గోపకుమారకః | నామ్నా శ్రీకర ఇత్యుచ్చైర్లోకఖ్యాతిం గమిష్యతి || 69

హనుమంతుడు ఇట్లు పలికెను-

ఓ రాజులారా! అందరు వినుడు. మీకు మంగళము కలుగుగాక! దేహధారులగు ప్రాణులకు శివుడు తక్క మరియొక గతి లేదు (65). ఈ గోపబాలకుడు దైవవశముచే శివపూజను చూచి మంత్రము లేకుండగనే శివుని పూజించి శివానుగ్రహమును పొందినాడు (66). శివభక్తాగ్రేసరుడు, గోపాలకుల కీర్తిని వర్ధిల్లజేయువాడు అగు ఈ బాలకుడు ఈ లోకములో సకలభోగములననుభవించి దేహత్యాగానంతరము మోక్షమును పొందగలడు (67). ఈతని వంశములో ఎనిమిదవ తరములో గొప్ప కీర్తిమంతుడగు నందుడను వాడు పుట్టగలడు. నారాయణుడు స్వయముగా ఆయనకు పుత్రుడై శ్రీకృష్ణుడను పేరుతో అవతరించగలడు (68). ఈనాటినుండియు ఈ గోపాలబాలకుడు ఈ లోకములో శ్రీకరుడను పేరుతో గొప్ప ఖ్యాతిని పొందగలడు (69)

సూత ఉవాచ |

ఏవముక్త్వాఞ్జనీసూనుశ్శివరూపో హరీశ్వరః | సర్వాన్‌ రాజ్ఞశ్చంద్రసేనం కృపాదృష్ట్వా దదర్శ హ || 70

అథ తసై#్మ శ్రీకరాయ గోపపుత్రాయ ధీమతే | ఉపాదిదేశ సుప్రీత్యా శివాచారం శివప్రియమ్‌ || 71

హనూమానథ సుప్రీతస్సర్వేషాం పశ్యతాం ద్విజాః | చంద్రసేనం శ్రీకరం చ త త్రై వాంతరధీయత || 72

తం సర్వే చ మహీపాలాస్సంహృష్టాః ప్రతిపూజితాః | చంద్రసేనం సమామంత్ర్య ప్రతిజగ్ముర్యథాగతమ్‌ || 73

శ్రీకరో%పి మహాతేజా ఉపదిష్టో హనూమతా | బ్రాహ్మణౖస్సహ ధర్మజ్ఞైశ్చక్రే శంభోస్సమర్హణమ్‌ || 74

చంద్రసేనో మహారాజశ్శ్రీ కరో గోపబాలకః | ఉభావపి పరప్రీత్యా మహాకాలం చ భేజతుః || 75

కాలేన శ్రీకరస్సో%పి చంద్రసేనశ్చ భూపతిః | సమారాధ్య మహాకాలం భేజతుః పరమం పదమ్‌ || 76

ఏవంవిధో మహాకాలశ్శివలింగస్సతాం గతిః | సర్వథా దుష్టహంతా చ శంకరో భక్తవత్సలః || 77

ఇదం పవిత్రం పరమం రహస్యం సర్వసౌఖ్యదమ్‌ | అఖ్యానం కథితం స్వర్గం శివభక్తివివర్ధనమ్‌ || 78

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయాం మహాకాల జ్యోతిర్లింగ మాహాత్మ్యవర్ణనం నామ సప్తదశో%ధ్యాయః (17).

సూతుడు ఇట్లు పలికెను-

అంజనీపుత్రుడు, వానరవీరుడు, శివస్వరూపుడు అగు హనుమంతుడు ఇట్లు పలికి రాజులనందరినీ మరియు చంద్రసేనుని దయాదృష్టితో చూచెను (70). తరువాత ఆయన గోపబాలకుడు, బుద్ధిశాలి అగు ఆ శ్రీకరునకు శివప్రీతికరమగు శివవ్రతమును పరమప్రీతితో ఉపదేశించెను (71). ఓ బ్రాహ్మణులారా! తరువాత హనుమంతుడు మిక్కిలి సంతసించి, అందరు చంద్రసేనశ్రీకరులను చూచుచుండగా అచటనే అంతర్ధానమాయెను (72). చక్కగా సత్కరించబడుటచే హర్షమును పొందియున్న రాజులందరు ఆ చంద్రసేనునివద్ద సెలవు తీసుకొని వచ్చిన దారిన మరలి వెళ్లిరి (73). హనుమంతుని వద్దనుండి ఉపదేశమును పొందియున్న మహాతేజశ్శాలియగు శ్రీకరుడు కూడ ధర్మజ్ఞులగు బ్రాహ్మణులతో గూడి శంభుని చక్కగా అర్చించెను (74). చంద్రసేనమహారాజు మరియు గోపబాలకుడగు శ్రీకరుడు ఇద్దరు కూడ పరమానందముతో మహాకాలుని సేవించిరి (75). చంద్రసేనమహారాజు మరియు శ్రీకరుడు కొంతకాలమువరకు మహాకాలుని శ్రద్ధగా ఆరాధించి పరమపదమును పొందిరి (76). ఈ విధముగా సత్పురుషులకు శరణము, సర్వ విధములుగా దుష్టులను సంహరించువాడు మరియు భక్తవత్సలుడగు అగు శంకరుడు మహాకాలేశ్వరరూపమును దాల్చెను (77). పరమపవిత్రమైనది, రహస్యము, సకలసౌఖ్యములనిచ్చునది, స్వర్గప్రదము, శివునియందు భక్తిని పెంపొందించునది అగు ఈ వృత్తాంతమును చెప్పితిని (78).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు మహాకాల జ్యోతిర్లింగ మాహాత్మ్యవర్ణనమనే పదునేడవ అధ్యాయము ముగిసినది (17).

Siva Maha Puranam-3    Chapters