Siva Maha Puranam-3    Chapters   

అథ పంచపంచాశత్తమో%ధ్యాయః

బాణుని గర్వభంగము

వ్యాస ఉవాచ |

సనత్కుమార సర్వజ్ఞ బ్రహ్మపుత్ర నమోస్తు తే | అద్భుతేయం కథా తాత శ్రావితా మే త్వయా మునే || 1

జృంభితే జృంభణాస్త్రేణ హరిణా సమరే హరే | హతే బాణబలే బాణః కిమకార్షీచ్చ తద్వద || 2

వ్యాసుడిట్లు పలికెను -

ఓ సనత్కుమారా! బ్రహ్మపుత్రుడవగు నీవు సర్వజ్ఞుడవు. నీకు నమస్కారమగుగాక! ఓ తండ్రీ! మహర్షీ! నీవు నాకు ఈ అద్భుతమగు గాథను వినిపించితివి (1). యుద్ధములో విష్ణువు ప్రయోగించిన జృంభణాస్త్ర ప్రభావముచే శివుడు ఆవులిస్తూ మోహితుడై యుండగా బాణుని సైన్యము సంహరించబడగా బాణుడు ఏమి చేసెనో చెప్పుము (2).

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య వ్యాసస్యామితతేజసః | ప్రత్యువాచ ప్రసన్నాత్మా బ్రహ్మపుత్రో మునీశ్వరః || 3

సూతుడిట్లు పలికెను -

సాటిలేని తేజస్సుగల ఆ వ్యాసుని ఈ మాటలను విని బ్రహ్మపుత్రుడగు ఆ మహర్షి ప్రసన్నమగు అంతఃకరణము గలవాడై ఇట్లు బదులిడెను (3).

సనత్కుమార ఉవాచ |

శృణు వ్యాస మహాప్రాజ్ఞ కథాం చ పరమాద్భుతామ్‌ | కృష్ణశంకరయోస్తాత లోకలీలానుసారిణోః || 4

శయితే లీలయా రుద్రే సపుత్రే సగణ సతి | బాణో వినిర్గతో యుద్ధం కర్తుం కృష్ణేన దైత్యరాట్‌ || 5

కుంభాండసంగృహీతాశ్వో నానాశస్త్రాస్త్ర ధృక్‌ తతః || 6

దృష్ట్వా నిజబలం నష్టం స దైత్యేంద్రో%తిమర్షితః | చకార యుద్ధమతులం బలిపుత్రో మహాబలః || 7

శ్రీకృష్ణో%పి మహావీరో గిరిశాప్తమహాబలః | ఉచ్చైర్జగర్జ తత్రాజౌ బాణం మత్వా తృణోపమమ్‌ || 8

ధనుష్టంకారయామాస శార్‌ఙ్గాఖ్యం నిజమద్భుతమ్‌ | త్రాసయన్‌ బాణసైన్యం తదవశిష్టం మునీశ్వర || 9

తేన నాదేన మహతా ధనుష్టంకారజేన హి | ద్యావాభూమ్యోరంతరం వై వ్యాప్తమాసీదనంతరమ్‌ || 10

చిక్షేప వివిధాన్‌ బాణాన్‌ బాణాయ కుపితో హరిః | కర్ణాంతం తద్వికృష్యాథ తీక్‌ష్ణానాశీవిషోపమాన్‌ || 11

ఆయాతాంస్తాన్నిరీక్ష్యాథ స బాణో బలినందనః | అప్రాప్తానేవ చిచ్ఛేద స్వశ##రైస్స్వధనుశ్చ్యుతైః || 12

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ వ్యాసా! నీవు గొప్ప బుద్ధిశాలివి. ఓ వత్సా! లోకలీలలను అనుసరించే శ్రీకృష్ణుశంకరుల పరమాద్భుతగాథను వినుము (4). రుద్రుడు లీలచే పుత్రులతో మరియు గణములతో గూడి మోహితుడై యుండగా రాక్షసరాజగు బాణుడు శ్రీకృష్ణునితో యుద్ధమును చేయుటకై బయలుదేరెను (5). కుంభాండుడు రథమును తోలుచుండగా, అనేకవిధములగు శస్త్రాస్త్రములను ధరించియున్నవాడు, మహాబలశాలి, బలికుమారుడు అగు ఆ రాక్షసరాజు తన సైన్యము నష్టమగుటను గాంచి మిక్కిలి కోపించినవాడై సాటిలేని యుద్ధమును చేసెను (6,7). మహావీరుడు, శివుని అనుగ్రహముచే పొందబడిన గొప్ప బలము గలవాడు అగు శ్రీకృష్ణుడు కూడ బాణుని తృణప్రాయముగా భావించి అపుడా యుద్ధరంగమునందు బిగ్గరగా గర్జించెను (8). ఓ మహర్షీ! ఆయన అద్భుతమగు తన శార్‌ఙ్గమనే ధనస్సునుండి నారిత్రాటి ధ్వనిని చేసి మిగిలియున్న ఆ బాణుని సైన్యమునకు భీతిని కలిగించెను (9). ధనుష్టంకారమువలన పుట్టిన ఆ పెద్ద ధ్వనిచే స్వర్గలోకభూలోకములకు మధ్యగల ఆకాశమంతయు నిండెను (10). హరి కోపించి నారిత్రాటిని చెవివరకు లాగి సర్పములవలె భయమును గొల్పు వివిధములగు వాడి బాణములను ప్రయోగించెను (11). బలిపుత్రుడగు బాణుడు ఆ బాణములు దూసుకొని వచ్చుచుండగా చూసి, అవి తనను చేరుటకు ముందే వాటిని తన ధనస్సునుండి ప్రయోగించబడిన బాణములచే ముక్కలుగా చేసెను (12).

పునర్జగర్జ స విభుర్బాణోవైరిగణార్దనః | తత్రసుర్వృష్ణయస్సర్వే కృష్ణాత్మానో విచేతసః || 13

స్మృత్వా శివపదాం భోజం చిక్షేప నిజసాయకాన్‌ | స కృష్ణాయాతిశూరాయ మహాగర్వో బలేస్సుతః || 14

కృష్ణో%పి తానసంప్రాప్తానచ్ఛినత్స్వశ##రైర్ద్రుతమ్‌ | స్మృత్వా శివపదాంభోజమసురారిర్మహాబలః || 15

రామాదయో వృష్ణయశ్చ స్వం స్వం యోద్ధారమాహవే | నిజఘ్నుర్బలినస్సర్వే కృత్వా క్రోధం సమాకులాః || 16

ఇత్థం చిరతరం తత్ర బలినోశ్చ ద్వయోరపి | బభూవ తుములం యుద్ధం శృణ్వతాం విస్మయావహమ్‌ || 17

తస్మిన్నవసరే తత్ర క్రోధం కృత్వా%తిపక్షిరాట్‌ | బాణాసురబలం సర్వం పక్షాఘాతైరమర్దయత్‌ || 18

మర్దితం స్వబలం దృష్ట్వా మర్దయంతం చ తం బలీ | చుకోపాతి బలేః పుత్రశ్శైవరాడ్‌ దితిజేశ్వరః || 19

స్మృత్వా శివపదాంభోజం సహస్రభుజవాన్‌ ద్రుతమ్‌ | మహత్పరాక్రమం చక్రే వైరిణాం దుస్సహం స వై || 20

చిక్షేప యుగపద్బాణానమితాంస్తత్ర వీరహా | కృష్ణాదిసర్వయదుషు గరుడే చ పృథక్‌ పృథక్‌ || 21

శత్రుసమూహములను పీడించే సమర్థుడగు ఆ బాణుడు మరల గర్జించగా, యాదవులు శ్రీకృష్ణుని స్మరిస్తూ నిరుత్సాహితులై భయపడిరి (13). బలియొక్క పుత్రుడు, గొప్ప గర్విష్టి అగు ఆ బాణుడు శివుని పాదపద్మములను స్మరించి గొప్ప శూరుడగు శ్రీకృష్ణునిపై తన బాణములను ప్రయోగించెను (14). రాక్షసశత్రువు, మహాబలశాలి అగు శ్రీకృష్ణుడు కూడ ఆ బాణములను తన మీదికి రాకుండగనే శీఘ్రముగా తన బాణములతోఛేదించెను (15). బలవంతులగు బలరామాది యాదవులందరు ఆ యుద్ధములో కంగారు పడి కోపమును పొంది తమ తమ ప్రతిద్వంద్వులను కొట్టజొచ్చిరి (16). ఈ విధముగా బలశాలురగు ఆ రెండు సైన్యముల మధ్య వినుటకైననూ ఆశ్చర్యమును గొల్పే సంకుల సమరము చిరకాలము జరిగెను (17). ఆ సమయములో గరుడుడు మిక్కిలి కోపించి తన రెక్కల దెబ్బలతో బాణాసురుని సైన్యమునంతనూ హింసింపజొచ్చెను (18). బలి యొక్క కుమారుడు, శివభక్తులలో శ్రేష్ఠుడు, బలశాలి అగు ఆ రాక్షసరాజు తన సైన్యము సంహరింపబడుటను గాంచి మిక్కిలి కోపించెను (19). వేయి భుజములు గల ఆతడు శివుని పాదపద్మములను స్మరించి శత్రువులకు సహించ శక్యము కాని గొప్ప పరాక్రమమును శీఘ్రముగా ప్రదర్శించెను (20). శత్రువీరులను సంహరించే ఆ బాణుడు ఆ యుద్ధములో శ్రీకృష్ణుడు మొదలగు యాదవులందరిపై మరియు గరుడునిపై వేరు వేరుగా ఒక్కసారిగా బాణములను గుప్పించెను (21).

జఘానైకేన గరుడం కృష్ణమేకేన పత్రిణా | బలమేకేన చ మునే పరానపి తథా బలీ || 22

తతః కృష్ణో మహావీర్యో విష్ణురూపస్సురారిహా | చుకోపాతి రణ తస్మిన్‌ జగర్జ చ మహేశ్వరః || 23

జఘాన బాణం తరసా శార్‌ఙ్గనిస్సృతసచ్ఛరైః | అతి తద్బలమత్యుగ్రం యుగపత్‌ స్మృతశంకరః || 24

చిచ్ఛేద తద్ధనుశ్శీఘ్రం ఛత్రాదికమనాకులః | హయాంశ్చ పాతయామాస హత్వా తాన్‌ స్వశ##రైర్హరిః || 25

బాణో%పి చ మహావీరో జగర్జాతి ప్రకుప్య హ | కృష్ణం జఘాన గదయా సో%పతద్ధరణీతలే || 26

ఉత్థాయారం తతః కృష్ణో యుయుధే తేన శత్రుణా | శివభ##క్తేన దేవర్షే లోకలీలానుసారతః || 27

ఏవం ద్వయోశ్చిరం కాలం బభూవ సుమహాన్‌ రణః | శివరూపో హరిః కృష్ణస్స చ శైవోత్తమో బలీ || 28

కృష్ణో% థ కృత్వా సమరం చిరం బాణన వీర్యవాన్‌ | శివాజ్ఞయా ప్రాప్తబలశ్చుకోపాతి మునీశ్వర || 29

తతస్సుదర్శనేనాశు కృష్ణో బాణభుజాన్‌ బహూన్‌ | చిచ్ఛేద భగవాన్‌ శంభుశాసనాత్పరవీరహా || 30

అవశిష్టా భుజాస్తస్య చత్వారో%తీవ సుందరాః | గతవ్యథో బభూవాశు శంకరస్య ప్రసాదతః || 31

గతస్మృతిర్యదా బాణశిరశ్ఛేత్తుం సముద్యతః | కృష్ణో వీరత్వమాపన్నస్తదా రుద్రస్సముత్థితః || 32

ఓ మునీ! బలవంతుడగు ఆ బాణుడు ఒక బాణముతో గరుడుని, ఒక బాణముతో గరుడుని, ఒక బాణముతో శ్రీకృష్ణుని, మరియొక బాణముతో బలరాముని, అదే విధముగా ఇతరులను కూడ కొట్టెను (22). అపుడు గొప్ప సమర్థుడు, మహాపరాక్రమశాలి, విష్ణువుయొక్క అవతారము మరియు రాక్షససంహర్త అగు శ్రీకృష్ణుడు ఆ యుద్ధములో గొప్ప కోపమును పొంది గర్జించెను (23). ఆయన వెంటనే శంకరుని స్మరించి శార్‌ఙ్గధనుస్సునుండి ఒక్కసారిగా ప్రయోగించబడిన గొప్ప బాణములచే బాణుని మరియు వాని సైన్యమును దారుణముగా హింసించెను (24). శ్రీ కృష్ణుడు కంగారు లేనివాడై వాని ధనుస్సును విరుగగొట్టి ఛత్రము మొదలగు వాటిని మరియు గుర్రములను తన బాణములతో కొట్టి వాటిని శీఘ్రముగా నేలగూల్చెను (25). మహావీరుడగు బాణుడు కూడా బాగా కోపించి పెద్దగా శ్రీకృష్ణుని గదతో కొట్టగా ఆయన క్రిందపడెను (26). ఓ దేవర్షీ! లోకలీలను అనుసరించే శ్రీకృష్ణుడు తరువాత వెంటనే లేచి, తనకు శత్రువు మరియు శివభక్తుడు అగు బాణునితో యుద్ధమును చేసెను (27). ఈ విధముగా వారిద్దరికి చిరకాలము చాల గొప్ప యుద్ధము జరిగెను. శివస్వరూపుడగు హరియే శ్రీకృష్ణుడు కాగా, బలశాలియగు ఆ బాణుడు శివభక్తులలో ఉత్తముడు (28). ఓ మహర్షీ! అపుడు పరాక్రమవంతుడగు శ్రీకృష్ణుడు చిరకాలము బాణునితో యుద్ధమును చేసి, శివుని ఆజ్ఞచే లభించిన బలము గలవాడై అతిశయించిన కోపమును చేసెను (29). ఆ తరువాత శత్రువీరులను సంహరించే శ్రీకృష్ణభగవానుడు శివుని ఆజ్ఞచే వెంటనే సుదర్శనచక్రముతో బాణుని అనేకభుజములను ఛేదించెను (30). అతనికి మిక్కిలి సుందరమైన నాల్గు భుజములు మాత్రమే మిగిలియుండెను. ఆతనికి శివుని అనుగ్రహముచే వెంటనే నొప్పి తగ్గిపోయెను (31). అపుడు శ్రీకృష్ణుడు స్మృతిని గోల్పోయి శౌర్యమును పొందినవాడై బాణుని శిరస్సును నరుకుటకు ఉద్యుక్తుడగుచుండగా రుద్రుడు తెలివిని తెచ్చుకొనెను (32).

రుద్ర ఉవాచ |

భగవన్‌ దేవకీపుత్ర యదాజ్ఞప్తం మయా పురా | తత్కృతం చ త్వయా విప్ర మదాజ్ఞాకారిణా సదా || 33

మా బాణస్య శిరశ్ఛింధి సంహరస్వ సుదర్శనమ్‌ | మదాజ్ఞయా చక్రమిదం స్యాన్మోఘం మజ్జనే సదా || 34

దత్తం మయా పురా తుభ్యమనివార్యం రణ తవ | చక్రం జయం చ గోవింద నివర్తస్వ రణాత్తతః || 35

దధీచే రావణ వీరే తారకాదిపురేష్వపి | వినా మదాజ్ఞాం లక్ష్మీశ రథాంగం నాముచః పురా || 36

త్వం తు యోగీశ్వరస్సాక్షాత్‌ పరమాత్మా జనార్దన | విచార్యతాం స్వమనసా సర్వభూతహితే రతః || 37

వరమస్య మయా దత్తం న మృత్యుభయమస్తివై | తన్మే వచస్సదా సత్యం పరితుష్టో%స్మ్యఃహం తవ || 38

పురాయం గర్వితో మత్తో యుద్ధం దేహీతి మే%బ్రవీత్‌ | భుజాన్‌ కండూయమానస్తు విస్మృతాత్మగతిర్హరే || 39

తదాహమశపం తం వై భుజచ్ఛేత్తా%%గమిష్యతి | అచిరేణాతికాలేన గతగర్వో భవిష్యసి || 40

మదాజ్ఞయా హరిః ప్రాప్తో భుజచ్ఛేత్తా తవా%థవై | నివర్తస్వ రణాద్గచ్ఛ స్వగృహం సవధూవరః || 41

ఇత్యుక్తస్స తయోర్మైత్రీం కారయిత్వా మహేశ్వరః | తమనుజ్ఞాప్య సగణస్సపుత్రస్స్వాలయం య¸° || 42

రుద్రుడిట్లు పలికెను -

ఓ భగవాన్‌ దేవకీనందనా ! విష్ణో ! నేను పూర్వము ఆజ్ఞాపించిన పనిన సర్వదా నా ఆజ్ఞను పాటించే నీవు పూర్తి చేసితివి (33). నీవు బాణుని శిరస్సును ఛేదించవద్దు. నా ఆజ్ఞచే ఈ చక్రమును ఉపసంహరించుము. ఈ చక్రము సర్వకాలములయందు నా భక్తులయందు మొక్కబోవును (34). ఓ గోవిందా! యుద్ధములో నివారింప శక్యము కాని ఈ చక్రమును మరియు విజయమును నేను పూర్వము నీకు ఇచ్చియుంటిని. కావున, యుద్ధమును విరమించుము (35). ఓ లక్ష్మీపతి! నా ఆజ్ఞ లేకుండగా పూర్వము ఈ చక్రమును నీవు దధీచునియందు, వీరుడగు రావణునియందు, మరియు తారకుని మొదలగు వారి నగరముల యందు ప్రయోగించియుండలేదు (36). ఓ జనార్దనా ! యోగీశ్వరుడవగు నీవు సాక్షాత్తుగా పరమాత్మవు. సర్వప్రాణుల హితమును గోరే నీవు నీ మనస్సులో ఆలోచించుము (37). నీకు మృత్యుభయము లేదని నేను వీనికి వరమునిచ్చి యుంటిని. ఆ నా మాట సర్వదా సత్యమగును. నేను నీ విషయములో సంతసించితిని (38). ఓ హరీ! పూర్వము ఈతడు తన మర్యాదను మరచి భుజముల తీటతో గర్వించినవాడై నాకు యుద్ధముననుగ్రహించుడని నన్ను కోరెను (39). తొందరలోనే నీ భుజములను నరుకువాడు రాగలడు. అపుడు నీ గర్వము తొలగగలదు అని అపుడు నేను వానిని శపించితిని (40). ఓయీ! ఈ హరి నా ఆజ్ఞచేతనే వచ్చి నీ భుజములను నరికినాడు. నీవు ఈ యుద్ధమును విరమించి, వధూవరులతో గూడి నీ ఇంటికి పొమ్ము (41). ఇట్లు పలికి ఆ మహేశ్వరుడు వారికి స్నేహమును కలిపి బాణునకు నచ్చజెప్పి, తన గణములతో మరియు పుత్రులతో గూడి తన నివాసమునకు వెళ్లెను (42).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచశ్శంభోస్సంహృత్య చ సుదర్శనమ్‌ | అక్షతాంగస్తు విజయీ తత్‌ కృష్ణోం%తఃపురం య¸° || 43

అనిరుద్ధం సమాశ్వాస్య సహితం భార్యయా పునః | జగ్రాహ రత్నసంఘాతం బాణదత్తమనేకశః || 44

తత్సఖీం చిత్రలేఖాం చ గృహీత్వా వరయోగినీమ్‌ | ప్రసన్నో%భూత్తతః కృష్ణః కృతకార్యశ్శివాజ్ఞయా || 45

హృదా ప్రణమ్య గిరిశమామంత్ర్య చ బలేస్సుతమ్‌ | పరివారసమేతస్తు జగామ స్వపురీం హరిః || 46

పథి జిత్వా చ వరుణం విరుద్ధం తమనేకధా | ద్వారకాం చ పురీం ప్రాప్తస్సముత్సవసమన్వితః || 47

విసర్జయిత్వా గరుడం సఖీన్‌ వీక్ష్యోపహస్య చ | ద్వారకాయాం తతో దృష్ట్వా కామచారీ చచార హ || 48

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే బాణభుజకృంతనం నామ పంచపంచాశత్తమో%ధ్యాయః (55)

సనత్కుమారుడిట్లు పలికెను-

శ్రీకృష్ణుడు శంభుని ఈ మాటలను విని సుదర్శనమును ఉపసంహరించెను. ఆయన దేహమునకు దెబ్బలు ఏమియు తగులలేదు. ఆయన విజయమును పొంది ఆ అంతఃపురమునకు వెళ్లెను (43). ఆయన భార్యాసమేతుడైయున్న అనిరుద్ధుని ఓదార్చి బాణునిచే ఈయబడిన అనేకములగు శ్రేష్ఠవస్తువులను స్వీకరించెను (44). తరువాత శ్రీకృష్ణుడు కృతార్థుడై శివుని ఆజ్ఞను పొంది ఉషయొక్క చెలికత్తె, గొప్ప యోగిని అగు చిత్రలేఖను దోడ్కొని వెళ్లి ప్రసన్నుడాయెను (45). హరి మనస్సులో కైలాసవాసియగు శివునకు ప్రణమిల్లి బలియొక్క పుత్రుడగు బాణునివద్ద సెలవు తీసుకొని కుటుంబసమేతముగా తన నగరమునకు వెళ్లెను (46). ఆయన తనకు అనేకవిధములుగా విరోధియైన వరుణుని మార్గమధ్యములో జయించి, ద్వారకానగరమును చేరి గొప్ప ఉత్సవమును చేసికొనెను (47). అపుడాయన గరుడుని పంపించివేసి, ద్వారకానగరములోని మిత్రులను గాంచి ఆనందించి యథేచ్ఛగా విహరించెను (48).

శ్రీశివమహాపురాణములోని రుద్రసంహితయందలి యుద్ధఖండలో బాణుని బాహువులను ఖండించుట అనే ఏబది ఐదవ అధ్యాయము ముగిసినది (55).

Siva Maha Puranam-3    Chapters