Siva Maha Puranam-3    Chapters   

అథ షడ్వింశో%ధ్యాయః

యోగ మహిమ

దేవ్యువాచ |

కథితం తు త్వయా దేవ కాలజ్ఞానం యథార్థతః | కాలస్య వంచనం బ్రూహి యథా తత్త్వేన యోగినః || 1

కాలస్తు సన్నికృష్టో హి వర్తతే సర్వజంతుషు | యథా చాస్య న మృత్యుశ్చ వంచతే కాలమాగతమ్‌ || 2

తథా కథయ మే దేవ ప్రీతిం కృత్వా మమోపరి | యోగినాం చ హితాయ త్వం బ్రూహి సర్వసుఖప్రద || 3

పార్వతీదేవి ఇట్లు పలికెను-

ఓ దేవా! నీవు కాలజ్ఞానమును యథాతథముగా చెప్పితివి. యోగి మరణమును తప్పించుకొనే (వాయిదా వేసే) విధానమును యథాతథముగా చెప్పుము (1). సర్వప్రాణులకు మృత్యువు సమీపములోననే యుండును. సంప్రాప్తమైన కాలమును వంచించి, యోగి మృత్యువునకు దూరముగా ఉండే విధానమును చెప్పుము. ఓ దేవా! ఈ విషయమును నీవు నాపై ప్రేమను చూపి చెప్పుము. సర్వులకు సుఖమునిచ్చే నీవు దీనిని యోగుల హితము కొరకై చెప్పుము (2, 3).

శంకర ఉవాచ|

శృణు దేవి ప్రవక్ష్యామి పృష్టోహం యత్త్వయా శివే | సమాసేన చ సర్వేషాం మానుషాణాం హితార్థతః || 4

పృథివ్యాపస్తథా తేజో వాయురాకాశ##మేవ చ | ఏతేషాం హి సమాయోగశ్శరీరం పాంచభౌతికమ్‌ || 5

ఆకాశస్తు తతో వ్యాపీ సర్వేషాం సర్వగః స్థితః | ఆకాశే తు విలీయంతే సంభవంతి పునస్తతః || 6

వియోగే తు సదా కస్య స్వం ధామ ప్రతిపేదిరే | తస్యాస్థిరతా చాస్తి సన్నిపాతస్య సుందరి || 7

జ్ఞానినో%పి తథా తత్ర తపోమంత్రబలాదపి | తే సర్వే సువిజానంతి సర్వమేతన్న సంశయః || 8

శంకరుడు ఇట్లు పలికెను-

ఓ పార్వతీదేవీ! వినుము. సర్వమానవుల హితమును గోరి నీవు ప్రశ్నించిన విషయమును సంగ్రహముగా చెప్పెదను (4). భూమి, నీరు, వాయువు, అగ్ని మరియు ఆకాశము అనే అయిదు భూతముల కలయికచే ఈ శరీరము నిర్మాణమైనది (5). ఆ భూతములన్నింటిలో ఆకాశము సర్వవ్యాపకము. ఇతరభూతములు ఆకాశములో విలీనమై, మరల ఆకాశమునుండి పుట్టుచున్నవి (6). ఈ శరీరము శిథిలము కాగానే ఆయా భూతములు మహా భూతములలో కలిసిపోవును. ఓ సుందరీ! కఫవాతపిత్తములనే మూడు ధాతువుల కలయిక యగు దేహమునకు అస్థిరత్వము ఉండనే ఉన్నది (7). ఈ స్థితి జ్ఞానులకైననూ తప్పదు. కాని, ఈ విషయమును అంతనూ జ్ఞానులు అందరు తపస్సు మరియు మంత్రములయొక్క ప్రభావముచే సుస్పష్టముగా తెలుసుకొనుచున్నారు. ఈ విషయములో సంశయము వలదు (8).

దేవ్యువాచ |

ఖం తేన యన్నశ్యతి ఘోరరూపః కాలః కరాలస్త్రిదివైకనాథః |

దగ్ధస్త్వయా త్వం పునరేవ తుష్టః స్తోత్రై ః స్తుతస్స్వాం ప్రకృతిం స లేభే || 9

త్వయా స చోక్తః కథయా జనానామదృష్టరూపః ప్రచరిప్యసీతి |

దృష్టస్త్వయా తత్ర మహాప్రభావః ప్రభోర్వరాత్తే పునరుత్థితశ్చ || 10

తదద్య భోః కాల ఇహాస్తి కించిన్నిహన్యతే యేన వదస్వ తన్మే |

త్వం యోగివర్యః ప్రభురాత్మతంత్రః పరోపకారాత్తతనుర్మహేశ || 11

దేవి ఇట్లు పలికెను-

దేవతలకు ఏకైక ప్రభుడవు అగు ఓ శివా! ఘోరమగు రూపము గలది, భయంకరమైనది అగు కాలము నాలుగు భూతములను ఆకాశములో విలీనము చేసి, తాను నశించును. ఆ కాలపురుషుని నీవు దహించెదవు. స్తోత్రములచే స్తుతించబడిన నీవు సంతోషించగా, అపుడు మరల ఆ కాలుడు తన స్వరూపమును పొందెను (9). నీవు ఆ కాలునితో సంభాషిస్తూ ఇట్లు పలితివి : 'నీవు జనులకు కానరాకుండగా సంచరించగలవు'. నీవు గొప్ప ప్రభావము గల ఆ కాలుని అచట చూచితివి. సర్వసమర్థుడవగు నీ వరముచే ఆ కాలుడు పునరుజ్జీవింపచేయ బడివాడు (10). ఓ మహేశ్వరా! ఈ కాలుడు ఆ కారణముచే ఇప్పుడు ఇక్కడ నున్నాడు. ఆతనిచే ఏదియో సంహరించబడినది. దానిని గురించి నాకు చెప్పుము. నీవు సర్వసమర్థుడవు ; యోగులలో శ్రేష్ఠుడవు ; స్వతంత్రుడవు ; మరియు పరోపకారము కొరకై దేహమును స్వీకరించినవాడవు (11).

శంకర ఉవాచ |

న హన్యతే దేవవరైస్తు దైత్యైస్సయక్షరక్షోరగమానుషైశ్చ |

యే యోగినో ధ్యానపరాస్సదేహా భవంతి తే ఘ్నంతి సుఖేన కాలమ్‌ || 12

శంకుడు ఇట్లు పలికెను-

దేవతలలో శ్రేష్ఠులైన వారు గాని, దైత్యులు గాని, యక్షులు గాని, రాక్షసులు గాని, నాగులు గాని, మానవులు గాని కాలమును సంహరించలేరు. కాని ధ్యానమునందు నిమగ్నులైన యోగులు దేహముతో జీవించి యుండగనే కాలుని అనాయాసముగా జయించెదరు (12).

సనత్కుమార ఉవాచ |

ఏతచ్ఛ్రుత్వా త్రిభువనగురోః ప్రాహ గౌరీ విహస్య సత్యం త్వం మే వద కథమాసౌ హన్యతే యేన కాలః |

శంభుస్తామాహ సద్యో హిమకరవదనే యోగినో యే క్షిపంతి కాలవ్యాలం సకలమనఘాస్తచ్ఛృణుషై#్వకచిత్తా || 13

పంచభూతాత్మకో దేహస్సదా యుక్తస్తు తద్గుణౖః | ఉత్పాద్యతే వరారోహే తద్విలీనో హి పార్థివః || 14

ఆకాశాజ్ఞాయతే వాయుర్వాయోస్తేజశ్చ జాయతే | తేజసో%మ్బు వినిర్దిష్టం తస్మాద్ధి పృథివీ భ##వేత్‌ || 15

పృథివ్యాదీని భూతాని గచ్ఛంతి క్రమశః పరమ్‌ | ధరా పంచగుణా ప్రోక్తా హ్యాపశ్చైవ చతుర్గుణాః || 16

త్రిగుణం చ తథా తేజో వాయుర్ద్విగుణ ఏవ చ | శ##బ్దైకగుణమాకాశం పృథివ్యాదిషు కీర్తితమ్‌ || 17

శబ్దస్స్పర్శశ్చ రూపం చ రసో గంధశ్చ పంచమః | విజహాతి గుణం స్వం స్వం తదా భూతం విపద్యతే || 18

యదా గుణం విగృహ్ణాతి ప్రాదుర్భూతం తదుచ్యతే | ఏవం జానీహి దేవేశి పంచభూతాని తత్త్వతః || 19

తస్మాద్ధి యోగినా నిత్యం స్వస్వకాలే%ంశజా గుణాః | చింతనీయాః ప్రయత్నేన దేవి కాలజిగీషుణా || 20

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

ముల్లోకములకు తండ్రియగు శివుని ఈ వచనమును విని గౌరి నవ్వి ఇట్లు పలికెను : 'ఈ కాలుడు ఎవనిచే ఏ విధముగా జయించబడును ? నీవు నాకు సత్యమును చెప్పుము' వెంటనే శంభుడు ఆమెతో నిట్లనెను : చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల ఓ పార్వతీ! పాపరహితులైన యోగులు కాలుడనే సర్పమును పూర్ణముగా త్రోసిపుచ్చెదరు. ఆ విషయమును ఏకాగ్రచిత్తముతో వినుము (13). ఓ సుందరీ! ఈ స్థూలదేహము అయిదు భూతములనుండి నిర్మితమై సర్వదా వాటియొక్క గుణములను కలిగియున్నది. ఇది అంతములో వాటిలోననే విలీనమగును (14). ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, దానినుండి పృథివి పుట్టినవని పెద్దలు చెప్పెదరు (15). పృథివితో మొదలిడి ఈ భూతములు క్రమముగా తమ తమ కారణములో విలీనమగును. పృథివితో మొదలిడి ఈ పంచభూతములలో పృథివికి అయిదు, జలమునకు నాలుగు, అగ్నికి మూడు, వాయువునకు రెండు, ఆకాశమునకు శబ్దము అనే ఒకటి చొప్పున గుణములు గలవు (16, 17). శబ్దము, స్పర్శ, రూపము, రసము, మరియు గంధము అనునవి ఈ అయిదు గుణములు. ఆయా భూతములు తమ తమ గుణములను పరిత్యజించి వినష్టమగును. (18). అది ఆ గుణమును స్వీకరించినప్పుడు పుట్టినదని చెప్పబడును. ఓ దేవదేవీ! పంచభూతముల తత్త్వము ఇట్లున్నది. దీనిని నీవు తెలుసుకొనుము (19). ఓ దేవీ! కావున, కాలమును జయించ గోరు యోగి నిత్యము ఆయా కాలముల యందు సూక్ష్మపంచభూతములనుండి పుట్టిన ఈ గుణములను ప్రయత్నపూర్వకముగా ధ్యానించవలెను (20).

దేవ్యువాచ |

కథం జేజీయ్యతే కాలో యోగిభిర్యోగవిత్ర్పభో | ధ్యానేన చాథ మంత్రేణ తత్సర్వం కథయస్వ మే || 21

దేవి ఇట్లు పలికెను-

యోగవేత్తలకు ప్రభువైన ఓ శంకరా ! యోగులు కాలుని ఏ విధముగా జయింపగోరుచున్నారు? ధ్యానముచేతనా ? లేక మంత్రము చేతనా ? ఆ వివరమునంతనూ నాకు చెప్పుడు (21).

శంకర ఉవాచ |

శృణు దేవి ప్రవక్ష్యామి యోగినాం హితకామ్యయా | పరజ్ఞానప్రకథనం న దేయం యస్య కస్యచిత్‌ || 22

శ్రద్ధధానాయ దాతవ్యం భక్తియుక్తాయ ధీమతే | అనాస్తికాయ శుద్ధాయ ధర్మనిత్యాయ భామిని || 23

సుశ్వాసేన సుశయ్యాయాం యోగం యుంజీత యోగవిత్‌ | దీపం వినాంధకారే తు ప్రజాస్సుప్తేషు ధారయేత్‌ || 24

తర్జన్యా పిహితౌ కర్ణౌ పీడయిత్వా ముహూర్తకమ్‌ | తస్మాత్సంశ్రూయతే శబ్దస్తుదన్వహ్నిసముద్భవః || 25

సంధ్యాతో భుక్తమేవం హి చావసన్నం క్షణాదపి | సర్వరోగాన్నిహంత్యాశు జ్వరోపద్రవకాన్‌ బహూన్‌ || 26

యశ్చోపలక్షయేన్నిత్యైరాకారం ఘటికాద్వయమ్‌ | జిత్వా మృత్యుం తథా కామం స్వేచ్ఛయా పర్యటేదిహ || 27

సర్వజ్ఞస్సర్వదర్శీ చ సర్వసిద్ధిమవాప్నుయాత్‌ | యథా నదతి ఖే%బ్దో హి ప్రావృడద్భిస్సుసంయతః || 28

తం శ్రుత్వా ముచ్యతే యోగీ సద్యస్సంసారబంధనాత్‌ | తతస్స యోగిభిర్నిత్యం సూక్ష్మాత్సూక్ష్మతరో భ##వేత్‌ || 29

ఏష తే కథితో దేవి శబ్దబ్రహ్మవిధిక్రమః | పలాలమివ ధాన్యార్థీ త్యజేద్బంధమశేషతః || 30

శబ్దబ్రహ్మ త్విదం ప్రాప్య యే కేచిదన్యకాంక్షిణః | ఘ్నంతి తే ముష్టినాకాశం కామయంతే క్షుధాం తృషామ్‌ || 31

జ్ఞాత్వా పరమిదం బ్రహ్మ సుఖదం ముక్తికారణమ్‌ | అబాహ్యమక్షరం చైవ సర్వోపాధివివర్జితమ్‌ || 32

మోహితాః కాలపాశేన మృత్యుపాశవశం గతాః | శబ్దబ్రహ్మ న జానంతి పాపినస్తే కుబుద్ధయః || 33

శంకరుడు ఇట్లు పలికెను-

ఓ దేవీ! యోగుల హితమును కోరి శ్రేష్ఠజ్ఞానమును చెప్పెదను. వినుము దీనిని యోగ్యతను చూడకుండగా సర్వులకు చెప్పరాదు (22). ఓ భామినీ! శ్రద్ధ, భక్తి మరియు సూక్ష్మబుద్ధి గలవాడు, నాస్తికుడు కానివాడు, శుద్ధమైన అంతఃకరణము గలవాడు మరియు నిత్యము ధర్మమునకు కట్టుబడినవాడు అగు వ్యక్తికి మాత్రమే దీనిని చెప్పవలెను (23). జనులు అందరు నిద్రించు సమయములో యోగవేత్త చక్కని ఆసనముపై గూర్చుండి దీపమును ఆర్పివేసి చీకటిలో ప్రాణాయామమును చేసి మనస్సును ధారణ చేయవలెను (24). చూపుడు వ్రేళ్లతో చెవులను మూసి కొద్దిసేపు నొక్కి పెట్టినచో, చెవుల లోపలినుండి భగ భగ మండే అగ్నియొక్క శబ్దమును పోలిన శబ్దము వినవచ్చును (25). ఈ యోగమును ఈ విధముగా అభ్యసించినచో, జ్వరము మొదలైన సర్వరోగములను మరియు ఇతరములగు అనేకములైన ఉపద్రవములను శీఘ్రకాలములో నశింపజేయును. సంధ్యాసమయము తరువాత తిన్న ఆహారము శీఘ్రముగా జీర్ణమగును (26). ఎవడైతే ప్రతిదినము ఈశ్వరస్వరూపమును రెండు ఘటికల కాలము వరకు ధ్యానించునో, వాడు మృత్యువును మరియు కామనలను జయించి ఈ లోకములో స్వేచ్ఛగా సంచరించును (27). ఆతడు సర్వజ్ఞుడు మరియు సర్వమును చూచే శక్తి గలవాడు అయి సర్వసిద్ధులు పొందును. ఆకాశము దట్టనైన వర్షకాల మేఘములతో నిండి యున్నప్పుడు వచ్చే పిడుగుల శబ్దమును పోలిన శబ్దమును ధ్యానసమయములో విన్న యోగి గొప్ప ఇంద్రియజయము గలవాడై వెంటనే సంసారబంధమునుండి విముక్తిని పొందును. తరువాత యోగులచే వినబడే ఆ శబ్దము క్రమముగా మరింత సూక్ష్మము అగుచుండును (28, 29). ఓ దేవీ! ఇంతవరకు నీకు శబ్దరూపములో నున్న బ్రహ్మను ఆరాధించే క్రమమును చెప్పితిని. ధాన్యమును కోరువాడు ఊకను విడిచిపెట్టు విధముగా, యోగి సకలబంధములను విడిచిపెట్టును (30). ఎవడైతే శబ్దబ్రహ్మను పొందిన తరువాత కూడ ఇతరమును కాంక్షించునో, అట్టివాడు తన పిడికిలితో ఆకాశమును కొట్టినవానితో సమానము. అట్టివాడు ఆకలిదప్పికలను కోరుచున్నాడు (31). సుఖకరము, జగత్సంబంధము లేనిది, వినాశము లేనిది, అన్ని రకముల ఉపాధులనుండి వినిర్ముక్తమైనది అగు పరంబ్రహ్మను తెలుసుకున్న వ్యక్తి మోక్షమును పొందును (32). దుష్టబుద్ధి గల పాపాత్ములు మృత్యువుయొక్క పాశముచే మోహితులై ఆ పాశమునకు వశులై శబ్దబ్రహ్మను తెలియకున్నారు (33).

తావద్భవంతి సంసారే యావద్ధామ న విందతే | విదితే తు పరే తత్త్వే ముచ్యతే జన్మబంధనాత్‌ || 34

నిద్రాలస్యం మహావిఘ్నం జిత్వా శత్రుం ప్రయత్నతః | సుఖాసనే స్థితో నిత్యం శబ్దబ్రహ్మాభ్యసన్నితి || 35

శతవృద్ధః పుమాంల్లభ్ధ్వా యావదాయుస్సమభ్యసేత్‌ | మృత్యుంజయవపుస్తంభ ఆరోగ్యం వాయువర్ధనమ్‌ || 36

ప్రత్యయో దృశ్యతే వృద్ధే కిం పునస్తరుణ జనే | న చోంకారో న మంత్రోపి నైవ బీజం న చాక్షరమ్‌ || 37

అనాహతమనుచ్చార్యం శబ్దబ్రహ్మ శివం పరమ్‌ | ధ్యాయంతే దేవి సతతం సుధియో యత్నతః ప్రియే || 38

తస్మాచ్ఛబ్దా నవ ప్రోక్తాః ప్రాణవిద్భిస్తు లక్షితాః | తాన్‌ ప్రవక్ష్యామి యత్నేన నాదసిద్ధిమనుక్రమాత్‌ || 39

ఘోషం కాంస్య తథా శృంగం ఘంటాం వీణాదివంశజాన్‌ | దుందుభిం శంఖశబ్దం తు నవమం మేఘగర్జితమ్‌ || 40

నవ శబ్దాన్‌ పరిత్యజ్య తుంకారం తు సమభ్యసేత్‌ | ధ్యాయన్నేవం సదా యోగీ పుణ్యౖః పాపైర్న లిప్యతే || 41

న శృణోతి యదా శృణ్వన్‌ యోగాభ్యాసేన దేవికే | మ్రియతేభ్యసమానస్తు యోగీ తిష్ఠేద్దివానిశమ్‌ || 42

తస్మాదుత్పద్యతే శబ్దో మృత్యుజిత్సప్తభిర్దినైః | స వై నవవిధో దేవి తం బ్రవీమి యథార్థతః || 43

ప్రథమం నదతే ఘోషమాత్మశుద్ధికరం పరమ్‌ | సర్వవ్యాధిహరం నాదం వశ్యాకర్షణముత్తమమ్‌ || 44

మానవుడు పరమపదమును పొందనంత వరకు మాత్రమే సంసారమునందు ఉండును. పరబ్రహ్మతత్త్వమును తెలుసుకున్న మానవుడు జన్మబంధమునుండి విముక్తిని పొందును (34). నిద్ర మరియు సోమరితనము అనునవి యోగసాధనకు పెద్ద విఘ్నములు. సాధకుడు ఈ శత్రువులను ప్రయత్నపూర్వకముగా జయించి సుఖకరమగు ఆసనమునందు కూర్చుండి నిత్యము శబ్దబ్రహ్మను అభ్యసించవలెను (35). వంద సంవత్సరముల వయస్సు గల పురుషుడైననూ దీనిని అభ్యసించినచో, మరణమును జయించును. ఆతని శరీరము శిధిలమగుట ఆగి పోవును. ఆరోగ్యము మరియు ప్రాణశక్తి పెరుగును. ఆతడు జీవించి ఉన్నంత వరకు దీనిని అభ్యసించవలెను (36). ఇట్టి ప్రత్యక్షఫలము వృద్ధునియందు కూడ కానవచ్చుచుండగా, యువకుల మాట చెప్పునదేమున్నది? ఓ ప్రియురాలా! వివేకము గలవారు సర్వకాలములలో ప్రయత్నపూర్వకముగా శబ్దబ్రహ్మ స్వరూపుడగు పరమశివుని ధ్యానము చేయుదురు. శబ్దబ్రహ్మ పదార్థములయందలి కంపము వలన పుట్టే శబ్దము కాదు. దానిని నోటితో ఉచ్చరించుటయూ సంభవము కాదు. అది ఓంకారము గాని, మంత్రము గాని, బీజాక్షరము గాని కాదు (37, 38). కావుననే, ప్రాణస్వరూపమునెరింగిన పండితులు తొమ్మిది శబ్దములను చెప్పిరి. నేను వాటిని నాదసిద్ధిని అనుసరించి సరియగు క్రమములో ప్రయత్నపూర్వకముగా చెప్పెదను (39). అవి యేవనగా, ఘోషము (సరళమగు హల్లుల ఉచ్చారణలో వచ్చే శబ్దము), కాంస్యము (కంచుయొక్క శబ్దము), శృంగము (కొమ్ము బూరా ధ్వని), ఘంట (గంట), వీణ, పిల్లనగ్రోవి నుండి పుట్టే శబ్దము, దుందుభి, శంఖశబ్దము మరియు తొమ్మిదవది యగు మేఘగర్జనము (40). ఈ తొమ్మిది శబ్దములను విడిచిపెట్టి తుంకారమును చక్కగా అభ్యసించవలెను నిత్యము ఈ విధముగా ధ్యానమును చేయు యోగి పుణ్యపాపముల లేపమును పొందడు (41). ఓ దేవీ! యోగమును అభ్యసించు యోగి ప్రయత్నించిననూ ఈ శబ్దములను వినలేక పోవచ్చును. యోగమును అభ్యసించుచుండగా, ఆతడు మరణమునకు దగ్గర కావచ్చును. అయిననూ, సాధకుడగు యోగి రాత్రింబగళ్లు అభ్యాసములను చేయుచుండవలెను (42). అట్టి అభ్యాసము వలన మృత్యువును జయించే శబ్దము ఏడు రోజుల తరువాత ఉదయించును. ఓ దేవీ! అది తొమ్మిది రకములుగా నున్నది. వాటిని నేను యథాతథముగా చెప్పెదను (43). మొదటిది ఘోషము అనే శబ్దము. అది అంతఃకరణమును శుద్ధి చేయును. ఉత్తమమగు ఆ నాదము వ్యాధులను అన్నింటినీ పోగొట్టి వశీకరణ, ఆకర్షణశక్తులను ఇచ్చును (44).

ద్వితీయం నాదతే కాంస్యంస్తభ##యేత్ర్పాణినాం గతిమ్‌ | విషం భూతగ్రహాన్‌ సర్వాన్‌ బధ్నీయాన్నాత్ర సంశయః || 45

తృతీయం నాదతే శృంగమభిచారీ నియోజయేత్‌ | విద్విడుచ్చాటనే శత్రోర్మారణ చప్రయోజయేత్‌ || 46

ఘంటానాదం చతుర్థం తు వదతే పరమేశ్వరః | ఆకర్షస్సర్వదేవానాం కిం పునర్మానుషా భువి || 47

యక్షగంధర్వకన్యాశ్చ తస్యాకృష్టా దదంతి హి| యథేప్సితాం మహాసిద్ధిం యోగినే కామతో పి వా||48

వీణా తు పంచమో నాదః శ్రూయతే యోగిభిస్సదా| తస్మాదుత్పద్యతే దేవి దూరాద్ధర్శనమేవ హి||49

ధ్యాయతో వంశనాదం తు సర్వతత్త్వం ప్రజాయతే| దుందుభిం ధ్యాయమానస్తు జరామృత్యువివర్జితః|| 50

శంఖశ##బ్దేన దేవేశి కామరూపం ప్రపద్యతే| యోగినో మేఘనాదేన న విపత్సంగయో భ##వేత్‌||51

యశ్చైకమనసా నిత్యం తుంకారం బ్రహ్మరూపిణమ్‌| కిమసాధ్యం న తస్యాపి యథామతి వరాననే||52

సర్వజ్ఞస్సర్వదర్శీ చ కామరూపీ ప్రజత్యసౌ| న వికారైః ప్రయుజ్యేత శివ ఏవ న సంశయః||53

ఏతత్తే పరమేశాని శబ్దబ్రహ్మస్వరూపకమ్‌| నవధా సర్వమాఖ్యాంతం కిం భూయః శ్రోతుమిచ్ఛసి|| 54

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయాం యోగమహిమవర్ణనం నామ షడ్వింశో %ధ్యాయః (26).

రెండవ నాదము కాంస్యము. ఈ నాదము ప్రాణుల గతిని స్తంభింపజేయును. మరియు, అది విషయమును, సకలభూతదోషములను, గ్రహదోషములను నివారించును. దీనిలో సందేహము లేదు (45). మూడవ నాదము శృంగము. ఇది ద్వేషించువారి వినాశము కొరకు మరియు శత్రుసంహారము కొరకు అభిచారికకర్మలయందు వినియోగించబడును (46). నాల్గవది ఘంటానాదము. ఆనాదమును సాక్షత్తుగా పరమేశ్వరుడు చేయుచుండును. ఇది దేవతలనందరినీ ఆకర్షించును. భూలోకములోని మానవులను ఆకర్షించునని వేరుగా చెప్పవలయునా? (47). అట్టి యోగిచే ఆకర్షించబడిన యక్షకన్యలు మరియు గంధర్వకన్యలు అతడు కోరిన కోర్కెలను తీర్చెదరు. అతడు కోరుకున్ననూ, వారు తమంత తాముగా అతనికి అభీష్టములనిచ్చెదరు (48). అయిదవది వీణానాదము, దీనిని యోగులు సర్వదా వినుచునే యుందురు. ఓ దేవి! దీని వలన దూరమునుండి చూడగలిగే శక్తి లభించును (49). వంశనాదమును ధ్యానించువానికి పృథివ్యాది పంచసూక్ష్మతత్త్వముల జ్ఞానము కలుగును. దుందుభిని ధ్యానించువాడు ముసలితనమునుండి మరియు మృత్యువునుండి విముక్తుడగును (50). ఓ దేవదేవీ! శంఖశబ్దమును జయించిన యోగి తనకునచ్చిన రూపమును స్వీకరించగల్గును. మేఘనాదమును జయించిన యోగికి ఆపదల పాలగుట జరుగదు (51). ఓ సుందరీ! బ్రహ్మస్వరూపమగు తుంకారమును ఎవడైతే ఏకాగ్రమగు మనస్సుతో నిత్యము ధ్యానించునో, వానికి కోరికలతో పొంద శక్యము కానిది ఏది లేదు (52). ఇట్టి యోగి సర్వజ్ఞుడు, సర్వమును చూడగలవాడు, మరియు తనకు నచ్చిన రూపమును స్వీకరించ గలవాడు అగును. వికారములకు అతీతుడుగనుండే ఈ యోగీ శివస్వరూపుడేననుటలో సందేహము లేదు (53). ఓ పరమేశ్వరీ! తొమ్మిది విధముల ఈ శబ్దబ్రహ్మస్వరూపమును నీకు సమగ్రముగా చెప్పియుంటిని, నీవు ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (54).

శ్రీ శివమహాపురాణములో ఉమాసంహితయందు యోగమహిమను వర్ణించే

ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (26).

Siva Maha Puranam-3    Chapters