Siva Maha Puranam-3    Chapters   

అథ వింశో%ధ్యాయః

పురుషార్థ నిరూపణము

వ్యాస ఉవాచ |

సనత్కుమార సర్వజ్ఞ తత్రాప్తిం వద సత్తమ | యద్గత్వాన నివర్తంతే శివభక్తియుతా నరాః || 1

వ్యాసుడు ఇట్లు పలికెను

ఓ సనత్కుమారా ! నీవు సర్వజ్ఞుడవు. ఓ మహాత్మా! ఆ శివలోకమును పొందే ఉపాయమును చెప్పుము. శివభక్తితో కూడిన నరులు దానిని పొందినచో, పునరావృత్తి ఉండదు గదా ! (1)

సనత్కుమార ఉవాచ |

పరాశరసుత వ్యాస శృణు ప్రీత్యా శుభాం గతిమ్‌ | వ్రతం హి శుద్ధభక్తానాం తథా శుద్ధం తపస్వినామ్‌ || 2

యే శివం శుద్ధకర్మాణస్సుశుద్ధతపసాన్వితాః | సమర్చయంతి తం నిత్యం వంద్యాస్తే సర్వథాన్వహమ్‌ || 3

నాతప్తతపసో యాంతి శిలోకమనామయమ్‌ | శివానుగ్రహసద్ధేతుస్తప ఏవ మహామునే || 4

తపసా దివి మోదంతే ప్రత్యక్షం దేవతాగణాః | ఋషయో మునయశ్చైవ సత్యం జానీహి మద్వచః || 5

సుదుర్ధరం దురాసాధ్యం సుధురం దురతిక్రమమ్‌ | తత్సర్వం తపసా సాధ్యం తపో హి దురతిక్రమమ్‌ || 6

సుస్థితస్తపసి బ్రహ్మా నిత్యం విష్ణుర్హరస్తథా | దేవా దేవ్యో%ఖిలాః ప్రాప్తాస్తపసా రుర్లభం ఫలమ్‌ || 7

యేన యేన హి భావేన స్థిత్వా యత్క్రియతే తపః | తతస్సంప్రాప్యతే%సౌ తైరిహ లోకే న సంశయః || 8

సాత్త్వికం రాజసం చైవ తామసం త్రివధం స్వృతమ్‌ | విజ్ఞేయం హి తపో వ్యాస సర్వసాధనసాధనమ్‌ || 9

సాత్త్వికం దైవతానాం హి యతీనామూర్ధ్వరేతసామ్‌ | రాజసం దానవానాం హి మనుష్యాణాం తథైవ చ ||

తామసం రాక్షసానా హి నరాణాం క్రూరకర్మణామ్‌ || 10

త్రివిధం తత్ఫలం ప్రోక్తం మునిభిస్తత్త్వదర్శిభిః | జపో ధ్యానం తు దేవానామర్చనం భక్తి తశ్శుభమ్‌ || 11

సాత్త్వికం తద్ధి నిర్దిష్టమశేషఫలసాధకమ్‌ | ఇహ లోకే పరే చైవ మనోభిప్రేతసాధనమ్‌ || 12

సనత్కుమారుడు ఇట్లు పలికెను -

ఓ పరాశరపుత్రా! వ్యాసా! శుభగతి, పవిత్రభక్తుల వ్రతము, తపశ్శాలుల శుద్ధమగు తపస్సు అను విషయములను గురించి ప్రీతితో వినుము (2). ఎవరైతే పవిత్రమగు కర్మలను చేయుచూ, శుద్ధమగు తపస్సుతో కూడినవారై, నిత్యము ఆ శివుని చక్కగా ఆరాధించెదరో, వారికి ప్రతి దినము అన్ని విధములుగా నమస్కారమును చేయవలెను (3). దుఃఖరహితమైన శివలోకమును తపస్సు చేయనివారు పొందలేరు. ఓ మహర్షీ! శివుని అనుగ్రహమును సంపాదించుటకు చక్కటి హేతువు తపస్సు మాత్రమే (4). దేవతాసమూహములు, ఋషులు మరియు మునులు తపస్సుయొక్క ప్రభావముచేస్వర్గలోకములో ఆనందించుచున్నారు. ఇతి ప్రత్యక్షము. నా మాట సత్యమని తెలుసుకొనుము (5). మిక్కిలి ధరింప శక్యము కానిది, పొంద శక్యము కానిది,అతిశయించిన భారము గలది, అతిక్రమింప శక్యము కానిది అగు సర్వమును తపస్సుచే సాధించవచ్చును. తపస్సును అతిక్రమించుట సంభవము కాదు (6). బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, దేవతలు, దేవీమూర్తులు అందరు నిత్యము తపస్సునందు స్థిరముగా నున్నవారై ఆ తపస్సుచే దుర్లభమగు ఫలమును పొందిరి (7). మానవుడు ఇహలోకములో ఏయే లక్ష్యమును మనస్సులో నిడుకొని తపస్సును చేయునో, ఆయా లక్ష్యమునుపొందుననుటలో సందేహము లేదు (8). ఓ వ్యాసా! సర్వము సాధించుటకు సాధనమైన తపస్సు సాత్త్విక-రాజస-తామసభేదముచే మూడు విధములుగానున్నదని తెలియవలెను (9). దేవతలు, ఊర్ధ్వరేతస్కులగు యతులు సాత్త్వికతపస్సును, దానవులు మరియు మానవులు రాజసతపస్సును, రాక్షసులు మరియు క్రూరమగు పనులనుచేసే మానవులు తామసతపస్సును చేయుదురు (10). తత్త్వవేత్తలగు మునులు తపస్సుయొక్క ఫలము మూడు రకములుగా నున్నదని చెప్పినారు. జపము, ధ్యానము, భక్తితో దేవతలను పూజించుట అనునవి శుభకరమగు సాత్త్వికతపస్సు. అది సర్వఫలములను ఇచ్చుననియు, ఇహపరలోకములలో మనస్సులోని కామనలను తీర్చుకొనే సాధనమనియుచెప్పబడినది (11, 12).

కామానాఫలముద్దిశ్య రాజసం తప ఉచ్యతే | నిజదేహం సుసంపీడ్య దేహశోషకదుస్సహైః || 13

తపస్తాపసముద్దిష్టం మనోభిప్రేతసాధనమ్‌ || 14

ఉత్తమం సాత్త్వికం విద్యాద్ధర్మబుద్ధిశ్చ నిశ్చలా| స్నానంపూజా జపో హోమశ్శుద్ధశౌచమహింసనమ్‌ || 15

వ్రతోపవాసచర్యాచ మౌనమింద్రియనిగ్రహః | ధీర్విద్యా సత్యమక్రోధో దానం క్షాంతిర్దమో దయా || 16

వాసీకూపతడాగాదేః ప్రసాదస్య చ కల్పనా| కృచ్ఛం చాంద్రాయణం యజ్ఞస్సుతీర్థాన్యాశ్రమాః పునః || 17

ధర్మస్థానాని చైతాని సుఖాదీని మనీషిణామ్‌ | సుధర్మః పరమో వ్యాస శివభ##క్తేశ్చ కారణమ్‌ || 18

సంక్రాంతివిషువద్యోగో నాదముక్తే నియేజ్యతామ్‌ | ధ్యానం త్రికాలికం జ్యోతిరున్మనీభావధారణా || 19

రేచకః పూరకం కుంభః ప్రాణాయామస్త్రిధా స్మృతః | నాడీసంచారవిజ్ఞానం ప్రత్యాహారనిరోధనమ్‌ || 20

తురీయం తదధో బుద్ధిరణిమాద్యష్టసంయుతమ్‌ | పూర్వోత్తమం సముద్దిష్టం పరజ్ఞానప్రసాధనమ్‌ || 21

కాష్ఠావస్థా మృతావస్థా హరితా వేతి కీర్తితాః | నానోపలబ్ధయో హ్యేతాస్సర్వపాపప్రణాశనాః || 22

కోర్కెలను తీర్చుకొనుటకై చేసే తపస్సు రాజసమనబడును. దేహమును శోషింపచేసి మిక్కిలి పీడకు గురిచేసి సహించుటకు కష్టమైన విధముగా చేసే తపస్సు తామసమనబడును. మనస్సులోని కోరికలను తీర్చుటకు సాత్వికతపస్సు ఉత్తమమైనదని తెలియవలెను. నిశ్చలమగు దర్మబుద్ధి, స్నానము, పూజ, జపము, హోమము, బాహ్యశౌచము, అంతరశౌచము, అహింస, వ్రతములను మరియు ఉపవాసములను చేయుట, మౌనము, ఇంద్రియములను నియంత్రణలోనుంచుకొనుట, సద్బుద్ధి, విద్య, సత్యము, కోపము లేకుండుట, దానము, క్షమ, బాహ్యేంద్రియనిగ్రహము, దయ, దిగుడుబావులు-నూతులు-చెరువులు-విశ్రాంతిగృహములు మొదలగు వాటిని నిర్మించుట, కృచ్ఛ్ర చాంద్రాయణవ్రతములను చేయుట, యజ్ఞము, తీర్థములను సేవించుట, ఆశ్రమములను అనేకపర్యాయములు దర్శించుట అనునవి వివేకమంతులకు సుఖమునిచ్చే ధర్మస్థానములు, ఓ వ్యాసా! ఇవియే చక్కని ధర్మము అగును. ఇవి శివభక్తికి హేతువులు (13, 18). మకరసంక్రణమునాడు ఉత్సవము చేయవలెను. ప్రతిదినము మూడు కాలములయందు ధ్యానమును చేయవలెను. మనస్సును అనాహతపద్మమునందు, అనగా హృదయపుండరీకమునందు నియంత్రించి,మనస్సును ఉద్దీపింపచేసే ఆత్మచైతన్యము (ఆత్మజ్యోతి) నందువిలీనము చేయవలెను (19). ప్రాణాయామము రేచక-పూరక-కుంభకములని మూడు విధములుగా నున్నది. నాడీ సంచారముయొక్క జ్ఞానము, ప్రత్యాహారముచే ఇంద్రియములను నిగ్రహించుట, బ్రహ్మాత్మైక్యాను సంధానము అనునవి ఒకదానిని మించి మరియొకటి ఉత్తమజ్ఞానమునకు సాధనములగును అణిమ మొదలగు ఎనిమిది సిద్దులు జాగ్రత్‌-స్వప్న-సుషుప్తి-అవస్థలకు అతీతమైన ఆత్మనిష్ఠకంటె తక్కువస్థాయికి చెందినవి మాత్రమే (20, 21). సమాధిలో కాష్ఠావస్థ (దుంగవలె నిశ్చలముగా నుండుట), మృతావస్థ (మరణించిన వానివలె నుండుల), హరితా (?)అను రకములు గలవు. ఈ సమాధులు అనేకములగు సిద్ధులను ఇచ్చుటయే గాక, పాపముల నన్నిటినీ నశింపచేయును (22).

నారీ శయ్యా తథా పానం శస్త్రధూపవిలేపనమ్‌ | తాంబూలభక్షణం పంచ రాజైశ్వర్యవిభూతయః || 23

హేమభారస్తథా తామ్రం రత్నధేనవః | పాండిత్యంవేదశాస్త్రాణాం గీతనృత్యవిభూషణమ్‌ || 24

శంఖవీణామృదంగాశ్చ గజేంద్రశ్ఛత్రచామరే | భోగరూపాణి చైతాని ఏభిశ్శక్తో%నురజ్యతే || 25

ఆదర్శవన్మునే స్నేహైస్తిలవత్స నిపీడ్యతే |అరం గచ్ఛేతి చాప్యేనం కురుతే %జ్ఞానమోహితః || 26

జానన్నపీహ సంసారే భ్రమంతే ఘటియంత్రవత్‌ | సర్వయోనిషు దుఃఖార్తః స్థావరేషు చరేషు చ || 27

ఏవం యోనిషు సర్వాసు ప్రతిక్రమ్య భ్రమేణ తు | కాలాంతరవశాద్యాతి మానుష్యమతిదుర్లభమ్‌ || 28

వ్యుత్క్ర మేణాపి మానుష్యం ప్రాప్యతే పుణ్యగౌరవాత్‌ | విచిత్రా గతయః ప్రోక్తాః కర్మణాం గరులాఘవాత్‌ || 29

మానుష్యం చ సమాసాద్య స్వర్గమోక్షప్రసాధనమ్‌ | నాచరత్యాత్మనః శ్రేయస్స మృతశ్శోచతే చిరమ్‌ || 30

దేవాసురాణాం సర్వేషాం మానుష్యం చాతిదుర్లభమ్‌ | తత్సంప్రాప్య తథా కుర్యాన్న గచ్ఛేన్నరకం యథా || 31

స్వర్గాపవర్గలాభాయ యది నాస్తి సముద్యమః | దుర్లభం ప్రాప్య మానుష్యం వృథా తజ్ఞన్మ కీర్తితమ్‌ || 32

సర్వస్య మూలం మానుష్యం చతుర్వస్య కీర్తితమ్‌ | సంప్రాప్య ధర్మతో వ్యాస తద్యత్నాదనుపాలయేత్‌ || 33

స్త్రీ, తల్పము, పానము, వస్త్రములు-ధూపము-విలేపనము, మరియు తాంబూలమును నములుట అను ఈ ఐదు రాజుయొక్క ఐశ్వర్యమును ప్రకటించు మహిమలు (23). అధికమగు బంగారమును మణులను కలిగియుండుట, ఇల్లు, రత్నములు, గోవులు, వేదశాస్త్రములలో పాండిత్యం, సంగీతనృత్యములు, అలంకారములు, శంఖవీణామృదంగములనే వాద్యములు, గొప్ప ఏనుగు,గొడుగు, వింజామరలు అనునవి భోగముయొక్క రూపములు. సమర్థుడగువాడు వీటియందు అనురాగమునుకలిగియుండును (24, 25). ఓ మునీ! ఇవి అద్దములోని ప్రతిబింబముల వలె మథ్యారూపములు. మానవుడు అజ్ఞానముచే మోహమును పొంది, ఎవరో వెనుకనుండి వీనిని 'తొందరగా పద' అని తరుముచున్నారా యన్నట్లు వీటి వెనుక పరుగులెత్తుచుండును. నువ్వులను పిండి నూనెను తీసిన విధముగా, అవి మానవుని శక్తియుక్తులను పిండి వేయును (26). ఇవి నిస్సారములని తెలిసి కూడా మానవుడు సంసారములో నీటిని తోడే చక్రము వలె తిరుగాడుచున్నాడు. మానవుడుచెట్టుచేమలు, క్రిమికీటకములు, పశుపక్ష్యాదులు మొదలగు సకలజన్మలనెత్తి దుఃఖముచే పీడితుడగుచున్నాడు (27). ఈ విధముగా విధయోనులలో జన్మించి తిరిగి తిరిగి కాలమునకు వశుడై ఇకానొక కాలములో మిక్కిలి దుర్లభ##మైన మానవజన్మను పొందుచున్నాడు (28). పుణ్యప్రభావము అధకముగా నున్నచో, నీచయోనిలోనున్న జీవుడు క్రమమును దాటి మానవజన్మను పొందవచ్చును. కర్మసముదాయములో ఒకప్పుడుపుణ్యమునకు, మరియొకప్పుడుపాపమునకు ప్రాముఖ్యము కలిగి జీవుడు విభిన్నయోనులలో జన్మించుటకు అవకాశము గలదని మహర్షులు చెప్పుచున్నారు (29). ఎవడైతే స్వర్గమోక్షములను పొందుటకు శ్రేష్ఠసాధనమైన మానవజన్మను పొందియు తనకు శ్రేయస్సు కొరకై యత్నించడో,వాడు మరణించిన తరువాత చిరకాలము యాతనలను పొందును (30). దేవతలకు, రాక్షసులకు, సర్వులకు మానవజన్మ దుర్లభ##మైనది. దానిని పొందిన తరువాత జీవుడు మరల నరకమునకు పోనక్కర లేనివిధముగా ప్రవర్తించవలెను (31). దుర్లభమగు మానవజన్మను పొందియూ, స్వర్గమును మోక్షమును పొందుటకు చక్కని ప్రయత్నమును చేయనిచో, ఆ జన్మ వ్యర్థమనిచెప్పబడినది (32). ఓ వ్యాసా! ధర్మర్థకామమోక్షములనే నాలుగు పురుషార్థములకు మానవజన్మయే మూలమని చెప్పబడినది. కావున, అట్టి చక్కని జన్మను పొందిన తరువాత దానిని ప్రయత్నపూర్వకముగా ధర్మమార్గములో పాలించవలెను (33).

ధర్మమూలం హి మానుష్యం లబ్ధ్వా సర్వార్థసాధకమ్‌ | యది లాభాయ యత్నస్స్యాన్నూలం రక్షేత్స్వయం యతః || 34

మానుష్యే%పి చ విప్రత్వం యః ప్రాప్య ఖలు దుర్లభమ్‌ | నాచరత్యాత్మనః శ్రేయః కో%న్యస్తస్మాదచేతనః || 35

ద్వీపానామేవసర్వేషాం కర్మభూరియముచ్చతే | ఇతస్స్వర్గశ్చ మోక్షశ్చ ప్రప్యతే సముపార్జితః || 36

దేశే%స్మిన్‌ భారతే వర్షే ప్రాప్య మానుష్యమధ్రువమ్‌ | న కుర్యాదాత్మనః శ్రేమస్తేనాత్మా ఖలు వంచితః || 37

కర్మభూమిరియం విప్ర ఫలభూమిరసౌ స్మృతా | ఇహ మత్క్రియతే కర్మ స్వర్గే తదనుభుజ్యతే || 38

యావత్స్వాస్థ్యం శరీరస్య తావద్ధర్మం సమాచరేత్‌ | అస్వస్థశ్చోదితో%ప్యన్యైర్న కించిత్కర్తుముత్సహేత్‌ || 39

అధ్రువేణ శరీరేణ ధ్రువం యో న ప్రసాధయేత్‌ | ధ్రువం తస్య పరిభ్రష్టమధ్రువం నష్టమేవ చ|| 40

ఆయుషః ఖండఖండాని నిపతంతి తదగ్రతః | అహోరాత్రోపదేశేన కిమర్థం నావబుధ్యతే || 41

యదా న జ్జాయతే మృత్యుః కదా కస్య భవిష్యతి | ఆకస్మికే హి మరణ ధృతిం విందతి కస్తథా || 42

పరిత్యజ్య యదా సర్వమేకాకీ యాస్యతి ధ్రువమ్‌ | న దదాతి కదా కస్మాత్పాథేయార్థమిదం ధనమ్‌ || 43

పురుషార్థములను అన్నింటినీ సంపాదించే సాధనము మరియు ధర్మము మూలముగా గలది అగు మానవజన్మను పొంది పురుషార్థమును సాధించుటకు ప్రయత్నమునుచేయు వ్యక్తి ఆ ప్రయత్నము వలన స్వయముగా తనకు మూలమగు ధర్మమును రక్షించుకొనును (34). మానవజన్మలో మరల బ్రాహ్మణజన్మ దుర్లభ##మైనది. దానిని పొందియు ఎవడైతే తనకు శ్రేయస్సు కలుగువిధముగా ఆచరించడో, వానికంటె మూర్ఖుడు ఎవడు ఉండును ? (35) ఖండములన్నింటిలో భారతదేశమునకు కర్మభూమి యని పేరు. ఇచట జన్మించిన వ్యక్తి ప్రయత్నముచే స్వర్గమును గాని, మోక్షమును గాని పొందగలడు (36). ఎవడైతే అనిత్యమగు మానవజన్మను ఈ భారతదేశమునందు పొందియు తనకు శ్రేయస్సు కలుగు విధముగా ఆచరించడో, వాడు తనను తానే వంచించుకున్నవాడు అగును (37). ఓ బ్రాహ్మణా! ఈ భూమి కర్మభూమియని, ఫలభూమి యని వర్ణించబడినది. ఇచట చేయబడిన కర్మ స్వర్గములో అనుభవించబడును (38). శరీరములో ఆరోగ్యము ఉన్నంత వరకు ధర్మమును చేయవలెను. ఆరోగ్యము లేని వానిని ఇతరులు ప్రోత్సహించిననూ ఏ పనినైననూ చేయుటకు సమర్థుడు కాడు (39). అనిత్యమగు శరీరముతోధ్రువమగు ధర్మమును ఎవడైతే సంపాదించుకొనడో, వానికి నిత్యమగు ధర్మము దూరమగును. అనిత్యమగు శరీరము ఎటులైననూ నశించునదియే (40). పగలు, రాత్రి అనే మిషతో ఆయుర్దాయము యొక్క ముక్కలు మన యెదుట పడుచున్నవి. కాని మానవుడు ఏల తెలుసుకొన లేక పోవుచున్నాడు ? (41). మరణము ఎవనికి ఎప్పుడు వచ్చును అను విషయము తెలియదు. మరణము ఆకస్మికముగా వచ్చును. ఇట్టి స్థితిలో ఎవడు ధైర్యముగా నుండగలడు ? (42). మానవుడు సర్వమును ఇచటనే విడిచిపెట్టి ఒంటరిగా పరలోకమునకు పోవును. మానవుడుచేసిన దానము ఆ ఒంటరి యాత్రలో మార్గమధ్యములో ఆహారమును సంపాదించి పెట్టును. అయిననూ, మానవుడు ఈ దానమునుఏ కాలములోనైననూ దానము కొరకై ఏల వినియోగించుట లేదు ? (43).

గృహీతదానపాథేయస్సఖం యాతి యమాలయమ్‌ | అన్యథా క్లిశ్యతే జంతుఃపాథేయరహితే పథి || 44

యేషాం కాలేయ పుణ్యాని పరిపూర్ణాని సర్వతః | గచ్ఛతాం స్వర్గదేశం హి తేషాం లాభః పదే పదే || 45

ఇతి జ్ఞాత్వా నరః పుణ్యం కుర్యాత్పాపం వివర్జయేత్‌ | పుణ్యన యాతి దేవత్వమపుణ్యో నరకం వ్రజేత్‌ || 46

యే మనాగపిదేవేశం ప్రపన్నాశ్శరణం శివమ్‌ | తే%పి ఘోరం న పశ్యంతి యమం న నరకం తథా || 47

కిం తు పాపైర్మహామోహైః కించిత్కాలే శివాజ్ఞయా | వసంతి తత్ర మానుష్యస్తతో యాంతి శివాస్పదమ్‌ || 48

యే పునస్సర్వభావేన ప్రతిపన్నా మహేశ్వరమ్‌ | న తే లింపంతి పాపేన పద్మపత్రమివాంభసా || 49

ఉక్తం శివేతి యైర్నామ తథా హర హరేతి చ | న తేషాం నరకాద్భీతిర్యమాద్ధి మునిసత్తమ || 50

పరలోకస్య పాథేయం మక్షోపాయమనామయ్‌ | పుణ్యసంఘైకనిలయం శివ ఇత్యక్షరద్వయమ్‌ || 51

శివనామైవ సంసారమహారోగైకశామకమ్‌ | నాన్యత్సంసారరోగస్య శామకం దృశ్యతే మయా || 52

బ్రహ్మహత్యాసహస్రాణి పురా కృత్వా తు పుల్కసః | శివేతి నామ విమలం శ్రుత్వా మోక్షం గతః పురా || 53

తస్మాద్వివర్ధయేద్భక్తిమీశ్వరే సతతం బుధః | శిభక్త్యా మహాప్రాజ్ఞ భుక్తిం చ విందతి || 54

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయం పురుషార్థనిరూపణం నామ వింశో%ధ్యాయః (20)

దానము చేసిన వానిక యమలోకమార్గములో ఆ దానమే ఆహారముగా పరిణమించిసుఖమును కలిగించును. అట్టి దానమునుచేసిన వ్యక్తి యమాలయమునకు సుఖముగా వెళ్లును. దానము చేయనివాడు మధ్యలో ఆహారము లేకుండగా దారిలో చాల కష్టమును పొందును (44). ఓ మహర్షీ! అన్ని విధములుగా పరిపూర్ణమైన పుణ్యము గల జీవులు స్వర్గలోకమునకు వెళ్లునప్పుడు ప్రతి అడుగులో లాభము కలుగును (45). ఈ సత్యమును తెలుసుకొని మానవుడు పాపమునకు దూరముగా నుండి పుణ్యమునుచేయవలెను. పుణ్యమునుచేసినవాడు దేవత్వమును పొందగా, పుణ్యమును చేయని వాడు నరకమును పొందును (46). ఎవరైతే కొంచెమైననూ దేవదేవుడగు శివుని శరణు పొందెదరో, వారు కూడ భయంకరుడగు యముని మరియు నరకమును చూడరు (47). కాని ఆ మానవులు మహామోహము గల పాపాత్ములైనచో, శివుని ఆజ్ఞచే అచట కొంత కాలము నివసించి తరువాత శివలోకమును పొందెదరు (48). ఎవరైతే మహేశ్వరునిసర్వస్వార్పణము చేసి శరణు పొందెదరో, వారు తామరాకు నీటిచేతను వలె, పాపముచే స్పృశించబడరు (49). ఓ మహర్షీ! ఎవరైతే శివ, హర, హర లనే నామములనుఉచ్చరించెదరో, వారికి నరకము వలన, యమునివలన భయము ఉండదు (50). శివ అనే రెండు అక్షరముల నామము పరలోకమునకు వెళ్లే దారిలో ఆహారమై సుఖమును కలిగించునది, మోక్షమునకు ఉపాయము, దోషములు లేనిది మరియు పుణ్యసమూహములకు నిలయమైనది (51). సంసారము అనే పెద్ద వ్యాధికి శివ అనే నామము మాత్రమే మందు. సంసారరోగమును కుదిర్చే మందు నాకు మరియొకటి కానవచ్చుట లేదు (52). పూర్వము పుల్కసుడు వేలాది బ్రహ్మహత్యలను చేసి, శివ అనే పవిత్రనామమును విని, మోక్షమును పొందినాడు (53). కావున, వివేకిసర్వకాలములలో ఈశ్వరుని యందు భక్తిని పెంపొందిచుకొన వలయును. ఓ మహాబుద్ధిశాలీ ! మానవుడు శివభక్తిచే భుక్తిని మరియు ముక్తిని పొందును (54).

శ్రీ శివమహాపురాణములోని ఉమాసంహితయందుపురుషార్థనిరూపణము అనేఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).

Siva Maha Puranam-3    Chapters