Siva Maha Puranam-3    Chapters   

శ్రీ గణశాయ నమః

శ్రీ శివమహాపురాణము

శతరుద్ర సంహితా

అథప్రథమో%ధ్యాయః

శివుని అయిదు అవతారములు

శ్రీగణశాయ నమః | అథ తృతీయా శతరుద్రసంహి తా ప్రారభ్యతే ||

వందే మహానంద మనంతలీలం మహేశ్వరం సర్వవిభుం మహాంతమ్‌ |

గౌరీప్రియం కార్తిక విష్నురాజసముద్భవం శంకర మాది దేవమ్‌ || 1

శ్రీగణశునకు నమస్కరించి మూడవదియగు శతరుద్ర సంహిత ఆరంభింపబడుచున్నది.

ఆనందఘనుడు, ఆనంతమగు లీలలు గలవాడు, మహేశ్వరుడు, సర్వవిభుడు, పరబ్రహ్మ, గౌరీపతి, కుమారస్వామి మరియు విఘ్నేశ్వరులకు తండ్రి, ఆదిదేవుడు అగు శంకరుని నమస్కరించుచున్నాను (1).

శౌనక ఉవాచ |

వ్యాస శిష్య మహాభాగ సూత జ్ఞానదయానిధే | వద శంభ్వవతారాంశ్చ యై రకార్షీత్సతాం శివమ్‌ || 2

శౌనకుడిట్లు పలికెను-

ఓయీ వ్యాస శిష్యా ! మహాత్మా ! సూతా! నీవు జ్ఞానమునకు, దయకు నిధివి. శంభుడు ఏ అవతారములలో సత్పురుషులకు మంగళములను కలిగించినాడో, వాటిని చెప్పుము (2).

సూత ఉవాచ |

మునే శౌనక సద్భక్త్యా దత్త చిత్తో జితేంద్రియః | అవతారాన్‌ శివస్యాహం వచ్మి తే మునయే శృణు || 3

ఏతత్పృష్టః పురా నందీ శివమూర్తి స్సతాం గతిః | సనత్కుమారేణ మునే తమువాచ శివం స్మరన్‌ || 4

సూతుడిట్లు పలికెను -

ఓ శౌనకమహర్షీ ! నేను జితేంద్రియుడనై మనస్సును లగ్నముచేసి పరమభక్తితో శివుని అవతారములను మహర్షివగు నీ కొరకు చెప్పెదను వినుము (3). శివస్వరూపుడు, సత్పురుషులకు శరణ్యుడు అగు నందీశ్వరుని పూర్వము సనత్కుమారుడు ఇటులనే పృచ్ఛించెను. ఓ మహర్షీ! అపుడాయన శివుని స్మరించి సనత్కుమారునితో నిట్లనెను (4).

నందీశ్వర ఉవాచ |

అసంఖ్యాతా హి కల్పేషు విభోస్సర్వేశ్వరస్యవై | అవతారాస్త థాపీహ వచ్మ్యహం తాన్యథామతి || 5

ఏకోనవింశకః కల్పో విజ్ఞేయశ్శ్వేతలోహితః | సద్యో జాతావతారస్తు ప్రథమః పరికీర్తితః || 6

తస్మింస్తత్పరమం బ్రహ్మా ధ్యాయతో బ్రహ్మణస్తథా | ఉత్పన్నస్తు శిఖాయుక్తః కుమారశ్శ్వేతలోహితః || 7

తం దృష్ట్వా పురుషం బ్రహ్మా బ్రహ్మరూపిణ మీశ్వరమ్‌ | జ్ఞాత్వా ధ్యాత్వా స హృదయే వవందే ప్రయతాంజలిః || 8

సద్యోజాతం శివం బుద్ధ్వా జహర్ష భువనేశ్వరః | ముహుర్ముహుశ్చ సద్బుద్ధ్యా పరం తం సమచింతయత్‌ || 9

తతో%స్య ధ్యాయతశ్శ్వేతాః ప్రాదుర్భూతా యశస్వినః | కుమారాః పరవిజ్ఞాన పరబ్రహ్మ స్వరూపిణః || 10

సునందో నందనశ్చైవ విశ్వనందోనందనౌ | శిష్యాస్తస్య మహాత్మానో యైస్తద్బ్రహ్మ సమావృతమ్‌ || 11

నందీశ్వరుడిట్లు పలికెను-

సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు అగు శివుడు వివిధకల్పములలో స్వీకరించిన అవతారములకు లెక్క లేదు. అయిననూ, నా బుద్ధికి తోచిన వాటిని నేను చెప్పెదను (5). పందొమ్మిదవ కల్పమునకు శ్వేత లోహితమని పేరు. ఆ కల్పములో మొదటిది యుగు సద్యోజాతావతారము సంపన్నమైనదని మహర్షులు చెప్పెదరు (6). ఆ కల్పములో పరబ్రహ్మను ధ్యానించుచున్న బ్రహ్మనుండి శిఖతో కూడినవాడు, తెలుపు, ఎరుపు రంగు గలవాడు నగు కుమారుడు జన్మించెను (7). బ్రహ్మ ఆ పురుషుని గాంచి, ఆతడు పరబ్రహ్మరూపుడగు ఈశ్వరుడని గుర్తించి హృదయములో ధ్యానించి చేతులు జోడించి నమస్కరించెను (8). జగత్ప్రభువగు బ్రహ్మ శివుడు సద్యో జాతరూపముగా అవతరించినాడని యెరింగి గొప్ప ఆనందమును పొంది, పవిత్రమగు మనస్సుతో ఆ పరమాత్మను పలుమార్లు ధ్యానించెను(9). బ్రహ్మ ఇట్లు ధ్యానించుచుండగా తెల్లని వర్ణము గలవారు, కీర్తిమంతులు, మహాజ్ఞానులు, పరబ్రహ్మస్వరూపులునగు కుమారులు జన్మించిరి (10). సునందుడు, నందనుడు, విశ్వనందుడు, ఉపనందనుడు అను పేర్లు గల ఆ మహాత్ములు బ్రహ్మకు శిష్యులైరి. వారిచే ఆ బ్రహ్మలోకము వ్యాపించబడెను (11).

సద్యోజాతశ్చ వై శంభుర్దదౌ జ్ఞానం చవేధసే | సర్గశక్తి మపి ప్రీత్యా ప్రసన్నః పరమేశ్వరః || 12

సద్యోజాతావతారుడు, పరమేశ్వరుడు అగు శంభుడు ప్రీతితో బ్రహ్మకు జ్ఞానమును సృష్టించే సామర్థ్యమును ఇచ్చెను (12) - ఇతి సద్యో జాతావతారః||

తతో వింశతిమః కల్పో రక్తో నామ ప్రకీర్తితః | బ్రహ్మా తత్ర మహాతేజా రక్తవర్ణమధారయత్‌ || 13

ధ్యాయతః పుత్రకామస్య ప్రాదుర్భూతో విధేస్సుతః | రక్తమాల్యాంబరధరో రక్తాక్షో రక్తభూషణః || 14

స తం దృష్ట్వా మహాత్మానం కుమారం ధ్యానమాశ్రితః | వామదేవం శివం జ్ఢాత్వా ప్రణనామ కృతాంజలిః || 15

తతస్తస్య సుతా హ్యాసంశ్చత్వారో రక్త వాససః | విరజాశ్చ వివాహశ్చ విశో కో విశ్వభావనః || 16

వామదేవస్స వై శంభుర్దదౌ జ్ఞానం చ వేధసే | సర్గశక్తి మపి పీత్యా ప్రసన్నః పరమేశ్వరః || 17

తరువాత ఇరువదియవ కల్పము వచ్చెను. దానికి రక్తకల్పమని పేరు. ఆ కల్పమునందు బ్రహ్మ ఎరుపురంగును కలిగి యుండెను (13). బ్రహ్మ పుత్రుని గోరి ధ్యానించుచుండగా ఆతనికి పుత్రుడు కలిగినాడు. ఆ కుమారుడు ఎర్రని మాలను మరియు వస్త్రములను ధరించియుండెను. ఎర్రని కన్నులుగల ఆ కుమారుడు ఎర్రని ఆభరణములను ధరించెను (14). బ్రహ్మ మహాత్ముడగు ఆ కుమారుని చూచి, ధ్యానమార్గములో ఆతడు శివుని వామదేవావతారమని యెరింగి చేతులు జేడించి నమస్కరించెను (15). తరువాత అతనికి విరజసుడు, వివాహుడు, విశోకుడు, విశ్వభావనుడు అను పేర్లు గల, ఎర్రని వస్త్రములను ధరించిన నల్గురు కుమారులు కలిగిరి (16). వామదేవరూపుడు, పరమేశ్వరుడునగు ఆ శంభుడు ప్రసన్నుడై బ్రహ్మకు జ్ఞానమును మరియు సృష్టి సామర్థ్యమును ప్రీతితో నొసంగెను (17).

- ఇతి వామదేవావతారః ||

ఏకవింశతిమః కల్పః పీత వాసా ఇతి స్మృతః | బ్రహ్మ యత్ర మహాభాగః పీతనాసా బభూవ హ || 18

ధ్యాయతః పుత్రకామస్య విధేర్జాతః కుమారకః | పీతవస్త్రాదిక ప్రౌఢో మహాతేజా మహాభుజః|| 19

తం దృష్ట్వా ధ్యానసంయుక్తః జ్ఞాత్వా తత్పురుషం శివమ్‌ | ప్రణనామ తతో బుద్ధ్యా గాయత్రీం శాంకరీం విధిః || 20

జపిత్వా తు మహాదేవీం సర్వలోక నమస్కృతామ్‌ | ప్రసన్నస్తు మహాదేవో ధ్యానయుక్తేన చేతసా || 21

తతో%స్య పార్శ్వతో దివ్యాః ప్రాదుర్భూతాః కుమారకాః | పీతవస్త్రా హిసకలా యోగమార్గ ప్రవర్తకాః || 22

ఇరువది ఒకటవ కల్పమునకు పీతవాసః కల్పము అని పేరు. ఆ కల్పములో మహానుభావుడగు బ్రహ్మ పచ్చని వస్త్రమును ధరించెను (18). పుత్రుని గోరి ధ్యానమును చేయుచున్న బ్రహ్మకు పచ్చని వస్త్రము మొదలగు వాటితో గంభీరమైన వాడు, గొప్ప తేజశ్శాలి, మహాబాహుడునగు కుమారుడు జన్మించెను (19). బ్రహ్మ ఆ బాలకుని చూచి ధ్యానమార్గమును పొంది అతడు శివుని తత్పురుషావతారమని యెరింగి, ఆయనకు నమస్కరించి, శంకరగాయత్రిని జపించెను (20).సర్వలోకములచే నమస్కరింపబడే మహాదేవ గాయత్రిని మనస్సులో బ్రహ్మ ధ్యానించగా మహాదేవుడు ప్రసన్నుడాయెను (21). తరువాత అతని పార్శ్వ భాగమునుడి పచ్చని వస్త్రములను ధరించిన దివ్యకుమారులు ప్రకటమైరి. వారందరు యోగమార్గమును ప్రవర్తిల్లజేసిరి (22).- ఇతి తత్పురుషావతారః ||

తతస్తస్మిన్‌ గతే కల్పే పీతవర్ణే స్వయంభువః | పునరన్యః ప్రవృత్తస్తు కల్పో నామ్నా శివస్తు సః || 23

ఏకార్ణవే సంవ్యతీతే దివ్యవర్ష సహస్రకే | స్రష్టుకామః ప్రజా బ్రహ్మా చింతయామాస దుఃఖితః || 24

తతో%పశ్యన్మహాతేజాః ప్రాదుర్భూతం కుమారకమ్‌ | కృష్ణవర్ణం మహావీర్యం దీప్యమానం స్వతేజసా || 25

ధృతకృష్ణాంబరోష్ణీషం కృష్ణయజ్ఞోపవీతినమ్‌ | కృష్ణేన మౌళినా యుక్తం కృష్ణస్నానానులేపనమ్‌ || 26

స తం దృష్ట్వా మహాత్మానమఘోరం ఘోరవిక్రమమ్‌ | వవందే దేవదేవేశమద్భుతం కృష్ణపింగలమ్‌ || 27

అఘోరం తు తతో బ్రహ్మా బ్రహ్మరూపం వ్యచింతయత్‌ | తుష్టావ వాగ్భి రిష్టా భిర్భక్తవత్సల మవ్యయమ్‌ || 28

తరువాత స్వయంభువుడగు బ్రహ్మగారి పీతవర్ణకల్పము గడచిపోయెను. శివమను పేరు గల మరియొక కల్పము మరల ఆరంభమయ్యెను (23). సర్వము జలమయమై ఉన్న అవస్థలోపు వేయి దివ్య సంవత్సరములు గడచెను. అపుడు బ్రహ్మ ప్రజలను సృష్టించగోరి దుఃఖితుడై చింతిల్లెను (24). అపుడు బ్రహ్మ చూచుచుండగా గొప్ప తేజశ్శాలి, నల్లని రంగు గలవాడు, మహాపరాక్రమశాలి, తన తేజస్సుచే వెలిగి పోవుచున్నవాడు, నల్లని వస్త్రముల తలపాగాను ధరించినవాడు, నల్లని యజ్ఞోపవీతముగలవాడు, నల్లని కిరీటమును ధరించినవాడు, స్నానము చేసి నల్లని చందనమును ధరించినవాడు అగు కుమారుడొకడు జన్మించుటను గాంచెను (25, 26). మహాత్ముడు, భయంకరమగు పరాక్రమము గలవాడు, దేవదేవేశుడు, ఆశ్చర్యమును కలిగించువాడు, కృష్ణపింగళ వర్ణములు గలవాడు అగు ఆ అఘోరుని బ్రహ్మ గాంచెను (27). అపుడు బ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడగు అఘోరుని ధ్యానించెను. భక్తప్రియుడు, అక్షరుడునగు ఆ పరమేశ్వరుని ప్రియవచనములతో స్తుతించెను (28).

అథాస్య పార్శ్వతః కృష్ణాః కృష్ణస్నానానులేపనాః | చత్వారస్తు మహాత్మా నస్సంబభువుః కుమారకాః || 29

కృష్ణః కృష్ణ శిఖశ్చైవ కృష్ణాస్యః కృష్ణకంఠధృక్‌ | ఇతి తే%వ్యక్తనామాన శ్శివరూపాస్సుతేజసః || 30

ఏవం భూతా మహాత్మానో బ్రహ్మణస్సృష్ణిహేతవే | యోగం ప్రవర్తయామాసుర్ఘోరాఖ్యం మహదద్భుతమ్‌ || 31

అపుడాతని పార్శ్వమునుండి నల్లనివారు, సాన్నముచేసి నల్లని చందనమును ధరించినవారు, మహాత్ములు అగు నల్గురు కుమారులు జన్మించిరి (29). కృష్ణుడు, కృష్ణశిఖుడు, కృష్ణాస్యుడు, కృష్ణకంఠధృక్‌ అనునవి వారి పేర్లు. అప్రసిద్ధమగు నామములు గల ఆ నలుగురు తేజశ్శాలురు శివస్వరూపులే (30). ఈ విధముగా బ్రహ్మగారి సృష్టికొరకై ఆవిర్భవించిన ఆ మహాత్ములు ఘోరమను పేరు గలది, గొప్పది, అద్భుతమైనది అగు యోగమును లోకములో ప్రవర్తిల్ల జేసిరి (31). - ఇతి అఘోరావతారః||

అథాన్యో బ్రహ్మణః కల్పః ప్రావర్తత మునీశ్వరాః | విశ్వరూప ఇతి ఖ్యాతో నామతః పరమాద్భుతః || 32

బ్రహ్మణః పుత్రకామస్య ధ్యాయతో మనసా శివమ్‌ | ప్రాదుర్భూతా మహానాదా విశ్వరూపా సరస్వతీ || 33

తథావిధస్స భగవానీశానః పరమేశ్వరః | శుద్ధస్ఫటిక సంకాశస్సర్వాభరణ భూషితః || 34

తం దృష్ట్వా ప్రణనామాసౌ బ్రహ్మేశానమజం విభుమ్‌ | సర్వగం సర్వదం సర్వం సురూపం రూపవర్జితమ్‌ || 35

ఈశానో%పి తథాదిశ్య సన్మార్గం బ్రహ్మణ విభుః | సశక్తిః కల్పయాంచక్రే స బాలాంశ్చతురశ్శుభాన్‌ || 36

జటీ ముండీ శిఖండీ చ అర్ధముండశ్చ జజ్ఞిరే | యోగేనా దిశ్య సద్ధర్మం కృత్వా యోగగతిం గతాః || 37

ఓ మహర్షులారా ! తరువాత బ్రహ్మగారి మరియొక కల్పము ఆరంభమయ్యెను. గొప్ప అద్భుతమగు ఆ కల్పమునకు విశ్వరూపమని పేరు ప్రసిద్ధి గాంచెను (32). బ్రహ్మ పుత్రుని గోరి మనస్సులో శివుని ధ్యానించుచుండగా గొప్ప నాదముగలది, విశ్వము రూపముగా గలది యగు సరస్వతి ఆవిర్భవించెను (33). అదే విధముగా భగవానుడగు ఆ పరమేశ్వరుడు స్వచ్ఛమగు స్ఫటికమువలె ప్రకాశించువాడు, ఆభరణములన్నింటితో అలంకరింప బడినవాడు నగు ఈశాన రూపములో ఆవిర్భవించెను (34). పుట్టుక లేనివాడు, సర్వవ్యాపి, సర్వమును పొందువాడు, సర్వమును ఇచ్చువాడు, సర్వజగత్స్వరూపుడు, సుందరాకారుడు, కాని రూపములేనివాడు అగు ఆ ఈశానుని గాంచి బ్రహ్మ నలుగురు బాలకులను సృజించెను (36). అట్లు జన్మించిన ఆ నల్గురు బాలకులకు జటి, ముండి, శిఖండి మరియు అర్ధముండుడు అని పేర్లు. వారు యోగ బుద్ధితో సద్ధర్మముననుష్ఠించి, యోగులు పొందు గతిని పొందిరి (37). - ఇతి ఈశానావతారః ||

ఏవం సంక్షేపతః ప్రోక్తః సద్యాదీనాం సముద్భవః | సనత్కుమార సర్వజ్ఞ లోకానాం హితకామ్యయా || 38

అథ తేషాం మహాప్రాజ్ఞ వ్యవహారం యథా యథమ్‌ | త్రిలోకహితకారం హి సర్వం బ్రహ్మాండ సంస్థితమ్‌ || 39

ఈశానః పురుషో%ఘోరో వామసంజ్ఞస్తథైవ చ | బ్రహ్మ సంజ్ఞా మహేశస్య మూర్తయః పంచ విశ్రుతాః || 40

ఈశానశ్శివరూపశ్చ గరీయాన్‌ ప్రథమస్స్మృతః | భోక్తారం ప్రకృతే స్సాక్షాత్‌ క్షేత్రజ్ఞ మధితిష్ఠతి || 41

శైవస్తత్పురుషాఖ్యశ్చ స్వరూపో హి ద్వితీయకః | గుణాశ్రయాత్మకం భోగ్యం సర్వజ్ఞ మధితిష్ఠతి || 42

ధర్మాయ స్వాంగసంయుక్తం బుద్దితత్త్వం పినాకినః | అఘోరాఖ్య స్వరూపో యస్తిష్ఠత్యంతస్తృతీయకః || 43

వామదేవాహ్వయో రూపశ్చతుర్థశ్శంకరస్య హి | అహంకృతేరధిష్ఠానో బహుకార్యకరస్సదా || 44

ఈశానాహ్వ స్వరూపో హి శంకరస్యేశ్వరస్సదా | శ్రోత్రస్య వచసశ్చాపి విభోర్వ్యోమ్న స్తథైవ చ || 45

ఓయీ! సనత్కుమారా! నీవు సర్వజ్ఞుడవు. నేను మానవుల హితమును గోరి సద్యోజాతాది అవతారములు ప్రాదుర్భావమును ఈ తీరున సంగ్రహముగా చెప్పితిని (38). ఓయీ మహాబుద్ధిశాలీ! వారు బ్రహ్మాండమునంతనూ వ్యాపించి ముల్లోకములకు హితమును చేయగోరి ఎట్టి విధముగా ప్రవర్తిల్లుచున్నారో యథాతథముగా ఇపుడు చెప్పెదను (39). ఈశానుడు, పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, బ్రహ్మ అను పేర్లుగల మహేశ్వరుని అయిదు రూపములు లోకప్రసిద్ధిని గాంచినవి (40). శివరూపములలో శ్రేష్ఠుడగు ఈశానుడు ప్రథమస్థానములో నుండునని మహర్షులు చెప్పినారు. ఆయన ప్రకృతిని అనుభవించు క్షేత్రజ్ఞుని స్వయముగా అధిష్ఠించి యుండును (41). శివుని రెండవ రూపమునకు తత్పురుషుడని పేరు. ఆయన గుణములకు ఆశ్రయమగు ప్రకృతియే స్వరూపముగా కలిగి భోగ్యమైన సర్వజ్ఞతత్త్వమును అధిష్ఠించి యుండును (42). శంకరుని నాల్గవ రూపమునకు వామదేవుడని పేరు. ఆయన అహంకారమునధిష్ఠించి, సర్వదా వివిధకార్యముల ననుష్ఠించుచుండును (44). శంకరుని స్వరూపమగు ఈశానుడు శ్రోత్రోంద్రియమునకు, వాక్కునకు మరియు వ్యాపకమగు ఆకాశమునకు సర్వదా అధిష్ఠానదైవమై యుండును (45).

త్వక్పాణి స్పర్శ వాయూనామీశ్వరం రూపమైశ్వరమ్‌ | పురుషాఖ్యం విచారజ్ఞా మతిమంతః ప్రచక్షతే || 46

వపుషశ్చ రసస్యాపి రూపస్యాగ్నేస్తథైవ చ | అఘోరాఖ్య మధిష్ఠానం రూపమాహుర్మనీషిణః || 47

రసనాయాశ్చ పాయోశ్చ రసస్యాపాం తథైవ చ | ఈశ్వరం వామదేవాఖ్యం స్వరూపం శాంకరం స్మృతమ్‌ || 48

ఘ్రాణస్య చైవోపస్థస్య గంధస్య చ భువస్తథా | సద్యో జాతాహ్వయం రూపమీశ్వరం శాంకరం విదుః || 49

ఇమే స్వరూపాశ్శంభోర్హి వందనీయాః ప్రయత్నతః | శ్రేయో%ర్థి భిర్నరైర్నిత్యం శ్రేయసామేకహేతవః || 50

యః పఠేచ్ఛృణు యా ద్వాపి సద్యాదీనాం సముద్భవమ్‌ | స భుక్త్వా సకలాన్‌ కామాన్‌ ప్రయాతి పరమాం గతిమ్‌ || 51

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్ర సంహితాయాం శివస్య పంచావతార వర్ణనం నామ ప్రథమో%ధ్యాయః (1)

చర్మము, చేతులు, స్పర్శ మరియు వాయువులకు పరమేశ్వరుని పురుషుడను పేరుగల రూపము అధీశ్వరుడని శాస్త్రమునెరింగిన బుద్ధిమంతులు చెప్పుచున్నారు (46). శరీరమునకు, రసమునకు, రూపమునకు మరియు అగ్నికి అఘోరరూపము అధిష్ఠానమని పండితులు చెప్పెదరు (47). వామదేవుడనే శంకరావతారము జిహ్వకు, విసర్జనేంద్రియమునకు, రసమునకు మరియు జలములకు అధీశ్వరుడని మహర్షులు చెప్పెదరు (48). ఘ్రాణంద్రియము, ఉపస్థ, గంధము, మరియు భూమి అను వాటికి శంకరుని సద్యోజాతరూపము అధీశ్వరుడని చెప్పెదరు (49). ఈ శంభుని రూపములు శ్రేయస్సునకు ఏకైక కారణములు గనుక, శ్రేయస్సును గోరు మానవులు ప్రతిదినము ఈ రూపములకు శ్రద్ధతో వందనమాచరించవలెను (50). సద్యోజాతాది అవతారములు ఉత్పత్తిని ఏ మానవుడు పఠించునో లేక వినునో, అట్టివాడు కోర్కెలనన్నిటినీ అనుభవించి పరమపదమును పొందును (51).

శ్రీ శివమహాపురాణములోని శతరుద్రసంహితయందు శివుని పంచావతారవర్ణనమనే మొదటి అధ్యాయము ముగిసినది (1).

Siva Maha Puranam-3    Chapters