Sri Koorma Mahapuranam    Chapters   

నవమాధ్యాయః

ఋషయ ఊచుః :-

నిష్కలో నిర్మలో నిత్యో నిష్క్రియః పరమేశ్వరః | త న్నో వద మహాదేవ విశ్వరూపః కథం భవాన్‌ || || 1 ||

తొమ్మిదవ అధ్యాయము

ఋషులు పలికిరి.

తాము పరమేశ్వరులు, నిష్కలులు, నిర్మలులు, నిత్యులు, నిష్క్రియులు అయినపుడు తాము విశ్వరూపులెట్లగుదురు? ఈ విషయమును మాకు వివరించుడు. (1)

ఈశ్వర ఉవాచ -

నాహం విశ్వో న విశ్వం చ మా మృతే విద్యతే ద్విజాః | మాయా నిమిత్త మాత్రాస్తి సా చాత్మాన మపాశ్రితా || || 2 ||

అనాదినిధనా శక్తి ర్మాయా వ్యక్తసమాశ్రయా | తన్నిమిత్తః ప్రపంచోయ మవ్యక్తా దభవత్‌ ఖలు || || 3 ||

అవ్యక్తం కారణం ప్రాహుః ఆనందం జ్యోతి రక్షరమ్‌ | అహమేవ పరం బ్రహ్మం మత్తో హ్యన్యన్న విద్యతే || || 4 ||

తస్మా న్మే విశ్వరూపత్వం నిశ్చితం బ్రహ్మవాదిభిః | ఏకత్వే చ పృథక్త్వే చ ప్రోక్త మేత న్నిదర్శనమ్‌ || || 5 ||

అహం తత్‌ పరమం బ్రహ్మ పరమాత్మా సనాతనః | అకారణం ద్విజాః ప్రోక్తో న దోషో హ్యాత్మన స్తథా || | 6 ||

ఈశ్వరుడు పలికెను.

బ్రాహ్మణోత్తములారా! నేను విశ్వమును కాను. నేను లేక విశ్వము కూడా లేదు. ఇదంతయూ మాయా నిమిత్తముతో జరుగుచున్నది. ఆ మాయ కూడా ఆత్మను ఆశ్రయించి యుండును. ఆద్యంతము లేని మాయ శక్తి రూపము. అవ్యక్తమును ఆశ్రయించి యుండును. మాయా నిమిత్తముగా అవ్యక్తము నుండి ప్రపంచము పుట్టినది. అ వ్యక్తము కారణముగా చెప్పబడుచున్నది. నేను ఆనంద స్వరూపుడను. జ్యోతి స్వరూపుడను. అక్షరుడను. (నాశనము లేనివాడను) నేనే పరబ్రహ్మను. నా కంటె భిన్నమైనది. మరియొకటి లేదు. కావున నేను విశ్వరూపుడనని బ్రహ్మ వాదులు నిశ్చయించిరి. ఒకటి అనేక రూపుడనుటకు ఇదియే నిదర్శనము. అనగా పరివర్తన చెందిన ప్రపంచమును చూచిన పరమాత్మ అనేకరూపుడు. వాస్తవముగా ఏకరూపుడు. అని అభిప్రాయము నేను ఆ పరబ్రహ్మను. పరమాత్మను సనాతనుడను. నాకు ఏ కారణము లేదు కావున నాలో ఎలాంటి దోషమూ లేదు. అనగా ఈ జగత్తులో వైషమ్యము క్రూరత మొదలగు దోషములకు కారణము జీవులా చరించు కర్మలే కాని ఈశ్వరుడు కాదడు. ఈశ్వరుడు సాధారణ కారణము కావున దోష రహితుడు. అని అభిప్రాయము. (2-6)

అనంతా శ్శక్తయోవ్యక్తే మాయాద్యాః సంస్థితా ధ్రువాః | తస్మిన్‌ దివి స్థితం నిత్య మవ్యక్తం భాతి కేవలమ్‌ || || 7 ||

యాభి స్తల్లక్ష్యతే భిన్న మభిన్నం తు స్వభావతః | ఏకయా మమ సాయుజ్య మనాది నిధనం ధ్రువమ్‌ || || 8 ||

పుంసోభూ దన్యయా భూతి రన్యయా తత్తిరోహితమ్‌ | అనాదిమధ్యం తిష్ఠన్తం యుజ్యతేవిద్యయా కిల || || 9 ||

త దేవతత్‌ పరమం వ్యక్తం ప్రభామండలమండితమ్‌ | త దక్షరం పరం జ్యోతి స్తత్‌ విష్ణోః పరమం పదమ్‌ || || 10 ||

తత్ర సర్వ మిదం ప్రోత మోతం చైవాఖిలం జగత్‌ | త దేవ చ జగత్‌ కృత్స్నం తత్‌ విజ్ఞాయ విముచ్యతే || || 11 ||

అవ్యక్తము నందు మాయాద్య నన్త శక్తులు ధ్రువములున్నవి. ఆ అవ్యక్తము మాత్రము ఒంటిగా శబ్ద తన్మాత్రము నందు నిలిచి యుండును. ఈ అవ్యక్తమే మాయలలో బహురూపములుగా భిన్నముగా కనపడును. కాని స్వభావముగా ఇది అభిన్నమే. దానికి మూలమగు ఒకే పరమ శక్తితో ఆద్యన్తములు లేని ధ్రువమగు నా సాయుజ్యమును పొందును. మరొక శక్తితో ఐశ్వర్యము కలుగును. మరొక శక్తితో ఆ ఐశ్వర్యము లోపించును. ఆది మధ్యములు లేని పురుషుడు అవిద్యతో కూడి యుండును. ప్రభా మండలముతో కూడి పరమ వ్యక్తము, అక్షరము, పరంజ్యోతి స్వరూపమగునది శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదము. అచటనే ఈ సకల జగత్తు కూర్చబడియున్నది. అదియే సకల జగత్తు. ఆ పరమ పదమును తెలిసినచో ముక్తి లభించును. (7-11)

యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ | ఆనందం బ్రహ్మణూ విద్వాన్‌ బిభేతి న కుతశ్చన || || 12 ||

వేదాహ మేతం పురుషం మహాన్త మాదిత్య వర్ణం తమసః పరస్తాత్‌ |

తత్‌ విజ్ఞాయ పరిముచ్యేత విద్వాన్‌ | నిత్యనన్దీ భవతి బ్రహ్మ భూతః || || 13 ||

దానిని పొందలేక వాక్కులు మనసుతో కూడ మరలివచ్చును. అట్టి ఆనంద స్వరూపుడను పరబ్రహ్మను తెలిసినవాడు ఎక్కడ ఎటువంటి భయమును పొందడు. తమోగుణమునకు అతీతుడు సూర్య సమాన వర్ణుడగు మహా పురుషుని నేను తెలియుదును. ఆ పురుషుని తెలిసి సంసార బంధము నుండి విడివడును. బ్రహ్మమయుడై నిత్యానంద స్వరూపుడగును. (12-13)

యస్మా త్పరం నాపరమస్తి కించిత్‌ యజ్జ్వోతిషాం జ్యోతి రేకం దివిస్థమ్‌ |

త దేవాత్మానం మన్యమానోథ విద్వా నాత్మానందీ భవతి బ్రహ్మభూతః || || 14 ||

త దవ్యయం కలిలం గూఢదేహం బ్రహ్మానంద మమృతం విశ్వధామ | వదంత్యేవం బ్రాహ్మణా బ్రహ్మనిష్ఠా యత్ర గత్వా న నివర్తతే భూయః || || 15 ||

ఇతనికంటే విడిగా పరాపరములు లేక ద్యులోకమున నుండు సకల జ్యోతులకు ఇది యొక్కటియే ప్రకాశకము. దానినే ఆత్మగా తలచు జ్ఞాని నిత్యానంద స్వరూపుడు బ్రహ్మమయుడగును. బ్రహ్మ నిష్ఠులగు బ్రాహ్మణులు దానిని ఆవ్యయమని, సూక్ష్మరూపమని, రహస్య స్వరూపము కలదని, బ్రహ్మానంద భూతమని, అమృత స్వరూపమని సకల ప్రపంచమునకు నివాస భూతమని అందురు. ఇచటికి చేరినవారు మరల ఈ సంసారమునకు రారు. (14-15)

హిరణ్మయే పరమాకాశతత్త్వే యధార్చిషి ప్రతిభాతీవ తేజః | తద్విజ్ఞానే పరపశ్యన్తి ధీరా విభ్రాజమానం విమలం వ్యూమధామ || || 16 ||

తతః పరం పరిపశ్యన్తి ధీరాః ఆత్మ న్యాత్మాన మనుభూయానుభూయ | స్వయంప్రభః పరమేష్ఠీ మహీయాన్‌ బ్రహ్మానందీ భగవానీశ ఏషః || || 17 ||

ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా | త మేవైకం యేనుపశ్యన్తి ధీరా స్తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషాం || || 18 ||

సర్వాననశిరోగ్రీవః సర్వభూతగుహాశయః | సర్వవ్యాపీ చ భగవాన్‌ న తస్మా దన్యదిష్యతే || || 19 ||

ఇ త్యేత దైశ్వరం జ్ఞాన ముక్తం వో మునిపుంగవాః | గోపనీయం విశేషేణ యోగినామపి దుర్లభమ్‌ || || 20 ||

ఇతి శ్రీకూర్మపురాణ ఉత్తరార్థే ఈశ్వరగీతాసు నవమోధ్యాయః

హిరణ్మయమగు పరమాకాశతత్త్వమున తేజస్సువలె భాసించు తేజమును ధీరజనులు (ఆత్మజ్ఞలు) విజ్ఞానమున ప్రకాశించు పరిశుద్ధమగు పరమ వ్యోమమును పరమధామమునుగా చూచెదరు. తరువాత ధీరులు ఆత్మలో ఆత్మాను భవమును సాగించుచు పరమతత్త్వమును దర్శించుకొన గలుగుదురు. ఆత్మతత్త్వము స్వయం ప్రకాశము, పరమేష్ఠి, చాలా గొప్పదన బ్రహ్మానంద స్వరూపము, భగవానుడు, ఈశ్వరుడు ఈ రూపమున నుండు నని తెలియును.

అన్ని ప్రాణులలో అంతరాత్మ సర్వవ్యాపి ఒకే దేవుడు దాగి యుండును. అట్టి అద్వితీయ పరమాత్మ తత్త్వమును సాక్షాతకరించుకొనిగలవారు మాత్రమే శాశ్వత శాంతిని పొందగలరు. ఇతరులు పొందజాలరు. ఆ పురుషుడు అన్నివైపులా శిరములు ముఖములు కంఠములు కలవాడు అన్ని ప్రాణులలో అంతర్యామిగా నుండువాడు అంతటా వ్యాపించియుండువాడు. భగవంతుడు. అతనికంటె ఇతరము ఏదీ లేదు. ఓ ముని పుంగవులారా మీకు పరమేశ్వర జ్ఞానమును బోధించితిని. ఈ జ్ఞానము యోగులకు కూడా సులభముగా లభించదు. కావున భద్రముగా దాచుకొన వలయును. (16-20)

ఇది షట్సాహస్రి సంహితయగు కూర్మపురాణమున ఉత్తర విభాగమున ఈశ్వర గీతలో 9వ అధ్యాయము

Sri Koorma Mahapuranam    Chapters