Sri Koorma Mahapuranam    Chapters   

షష్ఠో7ధ్యాయః

అథ పృథివ్యుద్ధారః -

కూర్మ ఉవాచ :-

ఆసీ దేకార్ణవం ఘోర మవిభాగం తమోమయమ్‌ | శాన్తవాతాదికం సర్వం న ప్రాజ్ఞాయత కిఞ్చన || || 1 ||

ఏకార్ణవే తదా తస్మి న్నష్టే స్థావరజఙ్గమే | తదా సమభవ ద్బ్రహ్మా సహస్రాక్షః సహస్రపాత్‌ || || 2 ||

సహస్రశీర్షా పురుషో రుక్మవర్ణో హ్యతీన్ద్రియః | బ్రహ్మా నారాయణాఖ్యస్తు సుష్వాప సలిలే తదా || || 3 ||

ఇమం చోదాహరం త్యత్ర శ్లోకం నారాయణం ప్రతి | బ్రహ్మస్వరూపిణం దేవం జగతః ప్రభవావ్యయమ్‌ || || 4 ||

ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపోవై నరసూనవః | అయనం తస్య తా యస్మాత్తేన నారాయణః స్మృతః || || 5 ||

ఆరవ అధ్యాయము

కూర్మస్వామి చెప్పెను

మొట్టమొదట ఈ సృష్టి ఒకేసముద్రమయముగా, విభాగరహితముగా, భయంకరముగా, చీకటితోనిండి, వాయువుమొదలగునవి విరమించినట్లు, ఏమియు తెలియరాకుండ ఉండెను. (1)

అప్పుడు స్థావర జంగమాలన్నీ నశించి, ఒక సముద్ర రూపములో జగత్తు ఏర్పడినప్పుడు, వేయికన్నులు, వేయి పాదములు కలిగిన బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను. (2)

వేయి శిరస్సులు కలవాడు, బంగారు వర్ణము కలవాడు, ఇంద్రియములను జయించిన వాడు అగుపురుషుడు, నారాయణుడను పేరుకల పరబ్రహ్మ ఆసముద్ర జలముపై శయనించెను. (3)

ఈ సందర్భములో నారాయణునిగూర్చి యీ శ్లోకమును ఉదాహరింతురు. ప్రపంచముయొక్క సృష్టికి కారణభూతుడు, నాశరహితుడు అగు బ్రహ్మరూపుడైన దేవుని గూర్చి ఇట్లు చెప్పుదురు. (4)

నారములనగా ఉదకములు. అవి మనుష్యులకు ప్రభవ కారణములు. అతనికి అవి మార్గము అయిన కారణముచేత నారాయణుడని చెప్పబడుచున్నాడు. (5)

తుల్యం యుగసహస్రస్య నైశం కాల మపాస్య సః | శర్వర్యన్తే ప్రకురుతే బ్రహ్మత్వం సర్గకారణాత్‌ || || 6 ||

తతస్తు సలిలే తస్మి న్విజ్ఞాయాం తర్గతాం మహీమ్‌ | అనుమానా త్తదుద్ధారం కర్తుకామః ప్రజాపతిః || || 7 ||

జలక్రీడాసు రుచిరం వారాహం రూపమాస్థితః | అధృష్యం మనసా ప్యన్యై ర్వాఙ్మయం బ్రహ్మ సంజ్ఞితమ్‌ || || 8 ||

పృథివ్యుద్ధరణార్థాయ ప్రవిశ్య చ రసాతలమ్‌ | దంష్ట్రయా భ్యుజ్జహారైనా మాత్మాధారో ధరాధరః || || 9 ||

దృష్ట్వా దంషాగ్రవిన్యస్తాం పృథ్వీం ప్రథిత పౌరుషమ్‌ | అస్తువ ఞ్జనలోకస్థాః సిద్ధా బ్రహ్మర్షయో హరిమ్‌ || || 10 ||

వేయి యుగాలకు సమానమైన రాత్రిమయమైన కాలాన్ని గడిపి, రాత్రి గడిచిన తరువాత అభగవంతుడు సృష్టికార్యకారణముగా మరల బ్రహ్మ రూపమును ధరించును. (6)

తరువాత నీటిలో మునిగియున్న భూమిని, అనుమాన ప్రమాణముతో గుర్తించి, దానిని నీటినుండి పైకి తీయుటకు సృష్టికర్త అయిన ప్రజాపతి తలచినవాడై (7) జలక్రీడలయందు మనోహరముగా ఉండు వరాహరూపమును ధరించినవాడై, ఇతరులకు మనస్సుచేత కూడ చలింప జేయుటకు శక్యముకాని బ్రహ్మ అనుపేరుగల వాఙ్మయమును, (8) భూమిని జలమునుండి ఉద్ధరించుటకు పాతాళమును ప్రవేశించి, వరాహరూపుడు తన కోరతో భూమిని పైకి ఎత్తినాడు. అప్పుడు తనకు తానే ఆధారముగా కలిగిఉండెను. (9)

వరాహ పురుషుని దంష్ట్రకొనపై#్త నిలుప బడిన భూమిని చూచి, జనలోకమందున్న సిద్ధులు, బ్రహ్మర్షులు, తన పరాక్రమమును ప్రదర్శించిన విష్ణువును ప్రశంసించిరి. (10)

ఋషయ ఊచుః :-

నమస్తే దేవదేవాయ బ్రహ్మణ పరమేష్ఠినే | పురుషాయ పురాణాయ శాశ్వతాయ జయాయ చ || || 11 ||

నమః స్వయమ్భువే తుభ్యం స్రష్ట్రే సర్వార్థ వేదినే | నమో హిరణ్యగర్భాయ వేధసే పరమాత్మనే || || 12 ||

నమస్తే వాసుదేవాయ విష్ణవే విశ్వయోనయే | నారాయణాయ దేవాయ దేవానాం హితకారిణ || || 13 ||

నమో7స్తుతే చతుర్వక్త్రశార్‌ఙ్గచక్రాసిధారిణ | సర్వభూతాత్మభూతాయ కూటస్థాయ నమోనమః || 14 ||

నమో వేదరహస్యాయ నమస్తే వేదయోనయే | నమో బుద్ధాయ శుద్ధాయ నమస్తే జ్ఞానరూపిణ || || 15 ||

ఋషులు ఇట్లన్నారు :-

దేవతలకు దేవుడవు, పరమేష్ఠివి, బ్రహ్మదేవుడవు, పురాణపురుషుడవు, శాశ్వతుడవు, జయ రూపుడవు అగునీకు వందనము. (11)

స్వయంభువు అయిననీకు, సమస్త విషయములు తెలిసిన సృష్టికర్తవు, హిరణ్యగర్భుడవు, పరమాత్మ స్వరూపుడవు, బ్రహ్మకు అగునీకు నమస్కారము. (12)

వాసుదేవుడవు, ప్రపంచమునకు కారణభూతుడవు, సర్వవ్యాపిని, దేవతలకుమేలు చేయువాడవు,నారాయణదేవుడవైన నీకు నమస్కారము. (13)

నాలుగు ముఖములు కలిగి, శార్‌ఙ్గమనే ధనుస్సు, చక్రము, ఖడ్గమును ధరించి, సమస్త ప్రాణులకు ఆత్మరూపుడవు. కూటస్థ పురుషుడవగు నీకు వందనము. (14)

వేద ప్రతిపాద్యరహస్యములు కలవాడవు, వేదములకు కారణభూతుడవు, జ్ఞానాత్మకుడవు, నిర్మలాత్ముడవు అగునీకు నమస్కారము. (15)

నమో7 స్త్వానన్దరూపాయ సాక్షిణ జగతాం నమః | అనన్తాయా ప్రమేయాయ కార్యాయ కరణాయ చ || || 16 ||

నమస్తే పఞ్చభూతాయ పఙ్చభూతాత్మనే నమః | నమో మూలప్రకృతయే మాయారూపాయ తే నమః || || 17 ||

నమో7స్తు తే వరాహాయ నమస్తే మత్స్యరూపిణ | నమో యోగాధిగమ్యాయ నమః సంకర్షణాయ తే || || 18 ||

నమ స్త్రిమూర్తయే తుభ్యం త్రిధామ్నే దివ్యతేజసే | నమః సిద్ధాయ పూజ్యాయ గుణత్రయవిభాగినే || || 19 ||

నమో7 స్త్వాదిత్యరూపాయ నమస్తే పద్మయోనయే | నమో7 మూర్తాయ మూర్తాయ మాధవాయ నమోనమః || || 20 ||

ఆనందస్వరూపుడవు, లోకములకు సాక్షిభూతుడవు, అంతములేనివాడవు, కొలుచుటకు శక్యము కానివాడవు, కార్యభూతుడవు, కారణ రూపుడవును అయిన నీకు నమస్కారము. (16)

పంచభూతాత్మకుడవు, పంచభూతముల వ్యస్తరూపుడవు, మూల ప్రకృతివి, మాయారూపుడవు అయిన నీకు వందనము. (17)

వరాహరూపుడవు, మత్స్యరూపమును ధరించినవాడవు, యోగసాధనచేత తెలియదగినవాడవు, ఇంద్రియములను నిగ్రహించువాడవు అగునీకు నమస్సులు. (18)

త్రిమూర్తి స్వరూపుడవు, మూడులోకములు నివాసముగా కలవాడవు, దివ్యమైన తేజస్సు కలిగిన సంకల్పసిద్ధుడవు, పూజింపదగినవాడవు, సత్త్వరజస్తమోగుణములనే మూడిటి విభాగముచేయు నీకు నమస్కారము. (19)

సూర్యస్వరూపుడవు, కమలము జన్మస్థానముగా కలవాడవు, ఆకార రహితుడవు, మూర్తిమంతుడవు, లక్ష్మీపతివి అగునీకు వందనము. (20)

త్వయైవ సృష్ట మఖిలం త్వయ్యేవ సకలం స్థితమ్‌ | పాలయైత జ్జగత్సర్వం త్రాతా త్వం శరణం గతిః || || 21 ||

ఇత్థం స భగవాన్‌ విష్ణుః సనకాద్యై రభిష్టుతః | ప్రసాద మకరో త్తేషాం వరాహవపు రీశ్వరః || || 22 ||

తతః స్వస్థాన మానీయ పృథివీం పృథివీధరః | ముమోచ రూపం మనసా ధారయిత్వా ధరాధరః || || 23 ||

తస్యోపరి జలౌఘస్య మహతీ నౌరివ స్థితా | వితతత్వా చ్చ దేహస్య న మహీ యాతి సంప్లవమ్‌ || || 24 ||

పృథివీం స సమీకృత్య పృథివ్యాం సో7 చినోద్గిరీన్‌ | ప్రాక్‌సర్గదగ్ధా నఖిలాన్‌ తతః సర్గే దధన్మనః || || 25 ||

ఇతి శ్రీకూర్మపురాణ పృథివ్యుద్ధారో నామషష్ఠోధ్యాయః

ఈ సమస్తము నీచేతనే సృష్టిచేయబడినది. నీయందే అదిఅంతా నిలిచిఉన్నది. ఈ సమస్తలోకాన్ని కాపాడుము. నీవే రక్షకుడవు, శరణమైన వాడవు. దిక్కునీవే. (21)

ఈవిధముగా ఆవిష్ణువు సనకాదిమునులచేత స్తోత్రము చేయబడినవాడై, వరాహరూపము ధరించిన ఆ భగవంతుడు వారియందు అనుగ్రహము చూపెను. (22)

తరువాత భూమిధరుడైన ఆవరాహపురుషుడు, భూమిని తనపూర్వపు స్థానమును పొందించి, మనస్సులో ధ్యానించుకొని ఆవరాహ రూపమును విడిచిపెట్టెను. (23)

ఆనీటి సమూహము యొక్క పైభాగములో భూమి పెద్దనావవలె నిలిచి ఉండెను. దాని ఆకారము చాలా విశాలముగా వ్యాపించిఉన్నందువలన భూమి నీటిలో ప్రయాణము చేయకుండెను. (24)

వరాహరూపి యగునీశ్వరుడు భూమిని సమానముగాచేసి, దానియందు పర్వతములను నిలిపెను. పూర్వకల్పములో నశించినవానినన్నిటిని మరల సృజించుటకు సంకల్పించెను. (25)

శ్రీ కూర్మపురాణములో పృథివ్యుద్థారమను ఆరవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters