Sri Koorma Mahapuranam    Chapters   

ఏకాదశోధ్యాయః

అథ దేవ్యవతారః

కూర్మ ఉవాచ-

ఏవం సృష్ట్వా మరీచ్యాదీ న్దేవదేవః పితామహః | సహైవ మాససైః పుత్రై స్తతాప పరమం తపః || || 1 ||

తసై#్యవ తపతో వక్త్రా ద్రుద్రః కాలాగ్ని సంభవః | త్రిశూలపాణి రీశానః ప్రాదురాసీ త్త్రిలోచనః || || 2 ||

అర్థనారీనరవపుః దుష్ప్రే క్ష్యో తిభయంకరః | విభజాత్మాన మిత్యుక్త్వా బ్రహ్మా చాన్తర్దధే భయాత్‌ || || 3 ||

తథోక్తో సౌ ద్విధా స్త్రీత్వం పురుషత్వం తథా కరోత్‌ | బిభేద పురుషత్వం చ దశధాచైకధా పునః || || 4 ||

ఏకాదశాధ్యాయము

దేవ్యవతారము

కూర్మస్మామి చెప్పెను :-

దేవదేవుడైన బ్రహ్మ ఈ విధముగా మరీచి మొదలగు వారిని సృష్టించి, తన మానస పుత్రులతో కూడ కలిసి గొప్ప తపస్సు నాచరించెను. (1)

తపము చేయుచున్న ఆ బ్రహ్మముఖము నుండి, ప్రళయకాలపు అగ్నికి కారణభూతుడు, చేతియందు త్రిశూలము కలవాడు, మూడు కన్నులు కల ఈశానుడైన రుద్రుడు పుట్టెను (2)

అతడు సగము పురుషుడు, సగము స్త్రీ రూపము కలవాడై చూచుటకు శక్యము కాని భయంకర రూపుడై ఉండెను. ''నీ స్వరూపము ను విభజించుము'' అని పలికి బ్రహ్మ కూడా భయము వలన అంతర్థానము చెందెను. (3)

ఆ విధముగా చెప్పబడిన రుద్రుడు తన రూపమును స్త్రీపురుష రూపాలతో విభజించెను. మరల పురుష రూపమును పదకొండు భేదములు కల దానినిగా చేసెను. (4)

ఏకాదశైతే కథితా రుద్రాస్త్రి భువనేశ్వరాః | కపాలీశాదయో విప్రా దేవకార్యే నియోజితాః || || 5 ||

సౌమ్యాసౌమ్యై స్తథా శాన్తాశాన్తైః స్త్రీత్వంచ స ప్రభుః | బిభేద బహుధా దేవః స్వరూపై రసితైః సితైః || || 6 ||

తావై విభూతయో విప్రా విశ్రుతాః శక్తయో భువి | లక్ష్మ్యాదయో యద్వపుషా విశ్వం వ్యాప్నోతి శాంకరీ || || 7 ||

విభజ్య పునరీశానీ స్వాత్మాంశ మకరో ద్ద్విజాః | మహాదేవనియోగేన పితామహ ముపస్థితా || || 8 ||

తా మాహ భాగవాన్‌ బ్రహ్మా దక్షస్య దుహితా భవ | సాపి తస్య నియోగేన ప్రాదురాసీ త్ర్పజాపతేః || || 9 ||

ఈ పదకొండు మంది రుద్రులని చెప్పబడుదురు. ఓ బ్రాహ్మణులారా! కపాలి, ఈశుడు మొదలైన ఆ రుద్రులు ముల్లోకములకు ప్రభువులుగా ఆయా దేవకార్యములందు నియమింపబడిరి (5)

ప్రభువైన ఆ శివుడు తన రూపములోని స్త్రీ భాగమును కూడా సాధు, అసాధు, శాంతము, అశాంతము అనే లక్షణాలతో, నల్లని, తెల్లని స్వరూపాలతో అనేక విధముల భిన్నముగా చేసెను. (6)

బ్రాహ్మణులారా! ఆ స్త్రీ రూపాలు శక్తి రూపాలైన విభూతులుగా లోకములో ప్రసిద్ధములు. అవి లక్ష్మి మొదలగు శక్తి రూపములు శంకరుని స్త్రీతత్త్వము ఏ శరీరములో ప్రపంచమును వ్యాపించి యున్నదో అది విభూతి రూపమైనది (7)

విప్రులారా! ఆ ఈశ్వరి మరల తనను విభజించుకొని భాగములు చేసెను. మహాదేవుని ఆ దేశముతో బ్రహ్మదేవుని వద్దకు వచ్చెను. (8) భగవంతుడగు బ్రహ్మ, నీవు దక్షుని పుత్రికవు కమ్మని ఆమెతో అనెను. ఆమె కూడ బ్రహ్మ సూచన ప్రకారము దక్ష పుత్రికగా జన్మించెను. (9)

నియోగా ద్ర్బహ్మణో దేవీం దదౌ రుద్రాయ తాం సతీమ్‌ | దాక్షీం రుద్రో పి జగ్రాహ స్వకీయా మేవ శూలభృత్‌ || || 10 ||

ప్రజాపతివినిర్దేశా త్కాలేన పరమేశ్వరీ | విభజ్య పునరీశానీ ఆత్మానం శంకరా ద్విభోః || || 11 ||

మేనాయా మభవ త్పుత్రీ తదా హిమవతః సతీ | స చాపి పర్వతవరో దదౌ రుద్రాయ పార్వతీమ్‌ || || 12 ||

హితాయ సర్వదేవానాం త్రైలోక్య స్యాత్మనో ద్విజాః | సైషా మాహేశ్వరీ దేవీ శంకరార్థశరీరిణీ || || 13 ||

శివా సతీ హైమవతీ సురాసురసమస్ర్కతా | తస్యాః ప్రభావమతులం సర్వే దేవాః సవాసవాః || || 14 ||

వదన్తి మునయో వేత్తి శంకరోవా స్వయం హరిః | ఏతద్వః కథితం విప్రాః పుత్రత్వం పరమేష్ఠినః || || 15 ||

ఇతి శ్రీకూర్మపురాణ దేవ్యవతారే ఏకాదశోధ్యాయః||

ఆ దక్షుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారము తన పుత్రిక అగు సతీదేవిని రుద్రునికి భార్యగా ఇచ్చెను. శూలధారియైన రుద్రుడు దక్షపుత్రని తన దానినిగా స్వీకరించెను. (10)

బ్రహ్మ యొక్క ఆజ్ఞ వలన కొంతకాలము తరువాత పరమశివుని భార్య తనను శంకరుని నుండి మరల విభజించుకొని (11)

హిమవంతుని వలన అతని భార్య యగు మేన యందు పార్వతిగా జన్మించినది. ఆ పర్వతరాజు తన కూతురైన పార్వతిని రుద్రునికి ఇచ్చి వివాహము జరిపెను. (12)

భూసురులారా! సమస్త దేవతల యొక్క ముల్లోకముల యొక్క తనయొక్క మేలు కొరకు హిమవం0తుడట్లు చేసినాడు. అటువంటి మహేశ్వరుని భార్య, శంకరుని సగము శరీరము ధరించినది అయినదేవి యీమే. (13)

మంగళరూప, సాధ్వి, హిమవంతుని పుత్రి, దేవదానవుల చే నమస్కరింపబడునది యీమే. సాటి లేని ఆమె గొప్పతనమును ఇంద్రునితో గూడ దేవతలందరు; (14)

మునులు కూడా ప్రశంసింతురు - ''ఆ ప్రభావమును శంకరుడే స్వయముగా తెలియును. లేదా నారాయణుడెరుగును'' అని - బ్రహ్మ పద్మభవుడగుట, శివుడు బ్రహ్మ కుమారుడగుట అను విషయము మీకు తెలుపబడినది.

శ్రీ కూర్మపురాణములో ఏకాదశాధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters