Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల ఇరువదిఒకటవ అధ్యాయము - రావణభూలోక విజయము

శైలూషః : శ్రోతుమిచ్ఛా మ్యహం తస్య దశగ్రీవస్య రక్షసః | త్రిలోక విజయం బ్రహ్మన్‌ ! తత్రమే సంశయో మహాన్‌ ||

నాడాయనః : వరప్రదానా త్సంమత్తో దశగ్రీవో నిశాచరః | దేవగంధర్వ దైత్యానాం నాగేంద్రోరగ రక్షసామ్‌ || 2

ఆక్రమాక్రమ్య రత్నాని స జహార తదా బలాత్‌ | పత్న్యశ్చ రాజ శార్దూల ! తదా దుహితర శ్శుభాః || 3

నరేంద్రాన్‌ ధర్మ సంయుక్తాన్‌ బ్రాహ్మణాంశ్చ జిఘాంసతి | ఆయోధ్యా వాసినం వీర మనరణ్యంచ జఘ్నివాన్‌ || 4

సంగ్రామే నిహత స్తేన దశగ్రీవం స శప్తవాన్‌ | ఉత్పత్స్యతికులే నీచ పురుషో మమ వీర్యవాన్‌ || 5

యస్తవాదాస్యతి ప్రాణాన్‌ సమరే సమరప్రియ ! యుయుధే చ తథా రాజ్ఞా మాంధాత్రా రణశాలినా || 6

తత్త్రైనం వారయామాస నారదో మునిసత్తమః | మయూరస్య తతో యజ్ఞే భక్షయామాస వై ద్విజాన్‌ || 7

ఇంద్రో మయూరరూపేణ తస్మాద్యజ్ఞా దపాక్రమత్‌ | మయూరస్య వరం ప్రాదాత్‌ మేఘే వర్షతి సర్వదా || 8

గమిష్య స్యతులాం ప్రీతిం మమ నేత్ర గణాకృతిమ్‌ | ధారయిష్యసి లోకేస్మిన్‌ కలాపం సుమనోహరమ్‌ || 9

కృకలాసస్య రూపేణ ధనాధ్యక్షో ప్యపాక్రమత్‌ | వర్ణం తస్య సువర్ణాభం సద్రవ్యం చ తథా శిరః || 10

ప్రాదా ద్వర మమే యాత్మా రాజరాజోపి దానవ ! వరుణశ్చ తదా రాజన్‌ ! హంసరూపేణ నిర్గతః || 11

హంసస్య చ వరం ప్రాదాత్‌ తోయే రతి మవాప్స్యసి | వర్ణత శ్చంద్రర శ్మ్యాభో భవిష్యసి తథైవ చ || 12

యమో వాయస రూపేణ తస్మా ద్యజ్ఞా దపాక్రమత్‌ | వాయసస్య వరం ప్రాదాత్‌ అమరత్వం వినా వధాత్‌ || 13

యుష్మద్దత్తేన చాన్నేన ఘోరామ ద్విషయే స్థితాః | పరాం తృప్తిం గమిష్యన్తి తదా పుణ్యన మోక్ష్యసే || 14

వక్ష్యధ్వం బలిదాతౄణాం దిగ్దేశ గత చేష్టితైః | శుభాశుభం మనుష్యాణాం తత్రాతిథ్యం భవిష్యతి || 15

వజ్ర తుండాశ్చ యే కాకాః ఘోరా మద్విషయే స్థితాః | బలి పిండాశ్చ దాతౄణాం భవిష్యన్తి తత శ్శివమ్‌ || 16

శైలూషుడు దశకంఠరాక్షసుని త్రిలోకవిజయ వృత్తాంతము వినవలయునన నాడాయనుడు వచింపదొడగెను. వరప్రదానముచే మందించి దేవ గంధర్వ దైత్య నాగేంద్రోరగ రక్షస్సులయొక్క రత్నములను (ఏయేజాతులందేవి శ్రేష్ఠవస్తువులో వానిని) బలిమై పలుమారులు పైకొని పైకొని లాగికొనెను. వారి పెండ్లాలను చక్కనివారిం గూతుళ్లను గాజేసెను. ధర్మరతులయిన నరేంద్రులను బ్రాహ్మణులను హింసించెను. ఆయోధ్యావాసియైన వీరుని అనరణ్యునింజంపెను. అతడు నాకులమందు వీర్యవంతుడు పురుషుడుదయింపగలడు.ఓరి నీచుడా! సమరప్రియ! అతడు నీప్రాణములను లాగికొనగలడు. అట్లే యారాక్షసరాజు రణదక్షుడైన మాంధాతతో బోరెను. అక్కడ నారదుడు వీనిని వారించెను. మయూరుని (మరుత్తునియని పాఠాంతరము) యజ్ఞమందు ద్విజులను దినివేసెను. ఇంద్రుడు నెమలిరూపున నాయజ్ఞమునుండి పారెను. అప్పుడతడు నెమిలికి మేఘమువర్షించుచుండ నసామాన్య ప్రీతి నందెదవు. నాకన్నులు వేయింటి యాకారముగల మిగుల చక్కని పించెముంబూనెదవను వరమిచ్చెను. తొండరూపున ధనపతి పారిపోయెను. అతొండకు బంగారు రంగుగల రూపమును దలనొసంగెను. వరుణుడుహంసరూపుగొని వెడలెను. అందుచేహంసకు నీటిపై నపేక్ష వరమిచ్చెను మఱియు చంద్రకిరణములట్లు తెల్లగా నుండగలవనియె. యముడు కాకిరూపుగొని యాయజ్ఞమునుండి పారెను. ఎవరును జంపనంతవరకు నీవమరమై యుందువు (చావవని) వరమిచ్చెను. నీకు బెట్టినయన్నముచే నాదేశమందున్న ఘోరపాపులు జీవులు పరమ తృప్తినందుదురు. అప్పుడు నీవు పుణ్యముం బొందెదవు. నీవు నీకు బలిపెట్టు మానవులకు ఆయా దిక్కునందాయా ప్రదేశమందు నీచేసిన చేష్టలంబట్టి శుభాశుభముల నెరింగింతువు. అందుచేత నీకక్కడ నాతిథ్యమీయబడును. నాలోకమందు వజ్ర తుండములతి ఘెరములు గలవని బలిపిండములు బలియిచ్చిన పిండములు దినునవి కాగలవు. అందువలన పిండదాతలకు శుభము గల్గును.

మరుత్త యజ్ఞే విత్రాసం జనయిత్వా దివౌకసామ్‌ | బభ్రామ వసుధాం రాజా రాక్షసానాం వ్రతాప వాన్‌ || 17

దదర్శ స తదా కన్యాం తపస్యన్తీం మహత్తపః | రూపేణాప్రతిమాంలోకే ¸°వనే ప్రథమే స్థితామ్‌ || 18

దశగ్రీవః స పప్రచ్ఛ తాం కన్యాం లోక సుందరీమ్‌ | కాత్వం కి మర్థం సుశ్రోణి ! చాస్థితా ¸°వనే తపః || 19

శ్రుత్వా తస్య తు సా కన్యా సత్యం వచన మబ్రవీత్‌ | బృహస్పతి సుతో విద్వాన్‌ పితా మమ కుశధ్వజః || 20

వేదాభ్యాస ప్రవృత్తస్య తస్యాహం నృప బాంధవా | సుతా పరా సముత్పన్నా తత్పత్న్యా విదితా తథా || 21

నామ్నా వేదవతీ త్యేవం ఖ్యాతా లోకేషు రాక్షస! విష్ణో ర్మయే యం దా తవ్యా తస్యాసీన్మే పితుర్మతిః || 22

మద్యాచనా నిరస్తేన దైత్య నాథేన శంభునా | పితా మమ హతో రాత్రౌ త మాలింగ్య విభావసుమ్‌ || 23

ప్రవిష్టా జనయిత్రీ మే యథాహం విధృతా చిరమ్‌ | స్వర్గస్థస్య పితుః కామం సాహం సత్య మభీప్సతీ || 24

ఆరాధయామి తపసా పత్యర్థం మధుసూదనమ్‌ | తతస్తా మబ్రవీ ద్రక్షో మా త్వం క్లేశే మతిం కృథాః || 25

భవస్వ ! మే వరారోహే ! భార్యా త్రైలోక్య సుందరీ | రూపస్య వయస శ్చైవ నానురూపం తవ స్తవ || 26

త్వాం కృత్వోపరతో మన్యే రూపం కృత్వా స విశ్వకృత్‌ | సహి రూపోపమా త్వన్యా తథాస్తి సదృశీ యతః || 27

సంపూర్ణ కాంతిమ త్సౌమ్యం వదనం తే వరాననే ! సకలంకేన చంద్రేణ కథ మౌపమ్య మర్హతి || 28

భవ! భూషణజాతానాం భూషణం త్వం శుచిస్మితే ! వృణుష్వ ! మాం వరారోహే ! పతిత్వే వర వర్ణిని | 29

రావణుడు మరుతుని యజ్ఞమందు దేవతలకు పెనుభీతి పుట్టించి ప్రతాపశీలి యతడెల్ల మేదినిపై స్వేచ్ఛా విహారముసేసెను, అప్పుడు మహా తపస్సుచేయుచున్న అప్రతిమాన సౌందర్యవతి నొక్కకన్యం దొలిజవ్వన మందున్న దానిం జూచెను. దశగ్రీవుడామెను నీవెవ్వతవు లేజవ్వనమున నెందులకు దపమూనితివి. అని యడుగ నాలోకసుందరి విని నిజముం బలికెను. మాతండ్రి బృహస్పతి కొడుకు కుశధ్వజుడు. తెలిసినవాడు వేదాభ్యాసముసేయు నతనికి రాజబంధువు నింకొక కూతురై పుట్టితిని. ఆయన భార్య నన్నా యన కూతురునని గ్రహింపబడితిని. వేదవతియనుపేరనేను లోకములందు ప్రఖ్యాతిగంటిని. ఈమె విష్ణువున కీయదగినదను నూహమాతండ్రికి గల్గినది. నన్నడిగి కాదనిపించుకొన్న దైత్యపతి శంభుడనువానిచే మాతండ్రి యొకరేయిం జంపబడెను. ఆయనంగౌగలించి నన్ను బెంబినమా తల్లి యగ్ని ప్రవేశము సేసినది (సహగమనము సేసినది) ఆ నేను స్వర్గస్థుడైన మాతండ్రి కోరికను నిజము నొనరింప గోరుచు తపస్సుచే మధుసూదనుని పతియగుట కారాధించుచున్నాను. అంతట నారక్షస్సు వలదు వలదు నీవీ క్లేశమునందు మనసుంపకు త్రైలోక్య సుందరి వీవు నాకు భార్యవగుము. నీరూపమునకు నీయిడునకు (లేజవ్వనమునకు) తపస్సు నీకనురూపము గాదు. నిన్ను జేసి విశ్వకర్త మేటిరూపము సేయుటను విరమించినాడని యెంతును. నీపోలికరూపుగలది మరియొకతె యికలేనందున నాకీయూహగల్గినది. ఓవరానన! నీముఖము సువర్ణకాంతి మంతము సౌమ్యము. కలంకముతోనున్న చంద్రునితోడి సామ్యమున కది యెట్లు తగును? తెలినవ్వులదాన ! నా భూషణము లయిన యందటికి నీవు భూషణమవగుము. ఓవరవర్ణిని! వరారోహా! నన్ను పతిగా వరింపుము.

ఆక్రమ్యాక్రమ్య లోకస్య ప్రధానాయా మయా హృతాః | స్త్రియః కురుష్వ ! సర్వాసాం తాసాం స్వామ్య మనిందితే !

జటా మాలాజినధరీ త్వ మేవం రతి వర్ధినీ | న జానే మండనాం ప్రాప్య కథం భీరు ! భవిష్యసి || 31

రూపేణ వయసా లక్ష్మ్యా తథైవ గుణ సంపదా ! విక్రమే మే వరారోహే ! న నమో హి జనార్దనః || 32

జన్మ తస్య న జానన్తి పరేభ్యో యే వరే జనాః | తేన త్వ మకులీనేన కిం కరిష్యసి సుందరి ! 33

అనింద్రం లోక మిచ్ఛన్తీ సురాణాం హితకామ్యయా | హతాయేనాను వృత్తేన యోషి త్కావ్యారణిః పురా || 34

పురాణా యే జగత్యస్మిన్‌ తేభ్యః పూర్వతరాశ్చయే | తేభ్యో ప్యతి పురాణం తం భర్తారం కథ మిచ్ఛసి ? || 35

బ్రహ్మణో వరదానేన యస్త్వసధ్యో దివౌకసామ్‌ | తే దైత్య నాధాః సబలా శ్ఛద్మనా తేన ఘాతితాః || 36

తత్ర్పతాప నివిష్టేన చేతసా రక్షసాం శ్రియమ్‌ | యో బిభర్త్యపి తాం తేన కిం కరిష్యతి భామిని ! 37

వృద్ధేభ్యో న శ్రుతం తస్య త్వయా రూప మనిందితే ! విదితం సర్వలోకానాం విశ్వరూప ధర స్త్వసౌ || 38

శేషా హి భోగ పర్యంకే తేన త్వం శయితా సహ | సవిషైర్భోగ నిశ్వాసైః పరాం గ్లాని ముపైష్యసి || 39

కంఠ గ్రహేణ నిహతౌ యేన తౌ మధుకైటభౌ | కథం కంఠగ్రహం తస్య సముషైష్యసి సుందరి ! 40

హిరణ్యకశిపుర్యేన నఖై రుత్క్రాన్త జీవితః | కథం రత్యన్తరే తస్య నభాఘాతం సహిష్యసి || 41

తస్మా ద్భావం సముత్సృజ్య చారుగాత్రి జేనార్దనే | భజస్వ ! భజమానం మాం చిరం ప్రీతి మావాప్నుహి ! 42

వేదవతీ: గుణా ఏవ సురేశస్య దోషా స్తే రజనీచర! జగత్ర్పకాశకాః భానో రులూకస్యేవ రశ్మయః || 43

కిం త్వయా సహ వాదేన వరణీయ స్సమే ప్రభుః | యాదృశ స్తాదృశో వాపి పతిత్వే రజనీచర ! 44

లోకప్రధానులయిన యెందరనో పైకురికి యురికి హత మార్చితిని. ఆ స్త్రీలందరికి పైని స్వామ్యము (పెత్తనమును) సేయుము. జటామాలను చర్మముందాల్చి నీ విట్లు రతి వర్ధని వగుచుంటివి. నగ లెల్లంబూని నీ వెట్లుందువో ఓ యబల ! నేనుదెలియ జాలను. రూపముచే నీడుచే సంపదచే గుణ సంపదచే విక్రమమందు నాకు జనార్దనుడీడు గాదు. ఆతని ముందటి వారికంటె ముందటి వారె యెరుంగరు. అట్టి కులములేని వానితో నో సుందరి ! నీ వేమి సేసెదవు ? లోక మనింద్రము కావలెనని కోరి కావ్యారణి యైన యింతి దితినియనువర్తించి యెవ్వడు హత మార్చెనో వానినా నీవు వలచుట? ఈ జగమందు బురాణులు వారికంటె బురాతనులు వారి కంటెను బురాతనుడైన వానిని భర్తగా నీ వెట్లు కోరుచున్నావు ? బ్రహ్మ యిచ్చిన వరమున నెవ్వరు దేవతల కవధ్యులో అట్టి దైత్య నాధులను సైన్యములతో మిషవెట్టి మట్టుపెట్టినాడు. ఆ రాక్షసులయొక్క ప్రతాపము నెడల మనసుపడిన రాక్షస లక్ష్మిని తానుహరించి భరించు చున్నాడో - (ఆమెకు తాను భర్త యను చున్నాడో పరదారమన మను దోషము విష్ణుని యెడ ధ్వనించు చున్నది.) అట్టి వానితో నీవేమి వేగెదవు ? ఓ గుణపతి ! వాని రూపము సర్వలోక విదిత మయినను నీవు దానిని గూర్చి పెద్దల వలన వినలేదు. అతడు విశ్వరూపుడు దిగంబరి యనివ్యంగ్యార్థము సర్వవిశ్వాంతర్యామి విష్ణువని శ్లేష సరశార్థము. శేష సర్పముపడగల పాన్పుపై వానితో శయనించి విషభరితములైన యా పాముపడగల నిశ్వాసములచే సుకుమారపు నీవు వాడిపోయెదవదియెటు ? సుందరి ! మధుకైటభుల పీకనులిమి చంపిన ఆదుష్టుని కంఠగ్రహణమును (కౌగిలింత) నీవెటుపొందుదువు హరణ్యకశిపుడు ఎవ్వని గోళ్ళచే ప్రాణమువిడిచినాడో అట్టివాని నఖాఘాతమును (నఖక్షతమును) రతియందు నీవెట్లు సహింపగలవు ? అందుచే నో సుగాత్రి విష్ణుపై వలపువిడిచి నాయంత వలచివచ్చిన నన్నుబొందుము. దాన శాశ్వతప్రీతినందుము అని రావణుడు వేదవతి ఓ రాత్రించర ? సురేశ్వరుని గుణములే జగమ్మునకు వెలుగిచ్చు భానుకిరణములు. గ్రుడ్లగూబకువలె నీకు దోషములయినవి. నీతో వాదెందులకు ! ఎటువంటివాడటువంటివాడుకానిమ్ము నా కా ప్రభువు వరణీయుడు. కోరదగినవాడనియె.

ఇతి వేదవతీ వాక్యం శ్రుత్వా కోవ సమన్వితః | కామేన రాక్షసేంద్ర స్తాంకేశపాశే పరామృశత్‌ || 45

ఈ వేదవతి మాటవిని కుపితుడై కామవృత్తితో నా రాక్షసేంద్రు డామెకొప్పుపట్టుకొనెను

త్వయా సంధర్షితా పాప! ప్రవేక్ష్యామి హుతాశనమ్‌ | అయోనిజా భశిష్యామి వధార్థంచ తథా తవ || 46

ఏవ ముక్త్వా చితాం కృత్వా ప్రవిష్టా జాతవేదసమ్‌ | భూయః సీతా సముత్పన్నా జనకస్య మహాత్మనః || 47

అయోనిజా మహాభోగా కర్షతో యజ్ఞ మేదినీమ్‌ | భర్తారం తపసా విష్ణుం రామం లబ్ధవతీ యథా || 48

యస్యా అర్థే స రామేణ దశగ్రీవో హతో రణ | లోకాపవాద భీతేన దశగ్రీవ గృహోషితా || 49

అంతర్వత్నీ పరిత్యక్తా సీతా భూయో జనేశ్వర! | వాల్మీకే రాశ్రమే సాతు ప్రసుతా దారక ద్వయమ్‌ || 50

కుశంలవం చ విక్రాంతౌ యయోస్సర్వాః క్రియాః కృతాః | వాల్మీకినా మహాభాగౌ వేద మధ్యాపితౌ యథా || 51

ప్రకర్షంచ ధనుర్వేదే పారం నీతౌ తు తౌ శిశూ | వాల్మీకినా తథా కృత్వా రామస్య చరితం శుభమ్‌ || 52

అధ్యాపితౌ పిశాలాక్షౌ దారకౌ ప్రియదర్శనౌ | ఆగాయతాం తతస్తౌతు రామయజ్ఞే కుమారకౌ || 53

రామస్య చరితం కృత్స్నం రామస్య పురతః స్థితౌ | తస్మా త్కావ్యాత్తు విజ్ఞాయ పుత్రౌ తౌ ప్రియ దర్శనౌ || 54

యజ్ఞే తాం చ తథాభూతామానయా మాస సత్వరః | ఉవాచ చ వరారోహా ప్రత్యయం కురు మే శుభే! 55

రామస్య వచనం శ్రుత్వా సీతా వచన మబ్రవీత్‌ | యథాహం రాఘవా దన్యం మనసాపి న కామయే || 56

తేన సత్యేన మేదేవీ వివరం సంప్రయచ్ఛతు | ఏతస్మిన్నేవ కాలేతు భువం భిత్వా సముత్థితమ్‌ || 57

ధృతం సింహాసనం నాగైః తత్రైనా ముపవేశయత్‌ || స్వయం వసుమతీ దేవీ పాతాలం సా తతో గతా || 58

అవిచ్ఛిన్నేన పతతా పుష్పవర్షేణ పార్థివ ! తస్యాం భూమి ప్రవిష్టాయాం రాఘవం క్రోధ సంయుతమ్‌ || 59

ఆమె నీచే బెదిరింపబడినదాన నేనగ్నిం బ్రవేశింతును. నీబావునకై యేనయె నిజనయ్యెదను. అని చితిపేర్చికొని జాతవేదుని యందు (వేదములకు జన్మస్థానమైన యగ్ని యందు) బ్రవేశించెను. తిరిగి మహాత్ముడు జనకునకు సీతయై యవతరించెను. యజ్ఞ భూమిని దున్నుచుండ నా సాధ్వి అయోనిజయై యవతరించెను. తపస్సుచేత రాముని సాక్షాద్విష్ణువును భర్తనుగా బొందెను. ఆమె నిమిత్తముననే రామునిచే రావణుడీల్గెను. అవ్వల దశకంఠునింట నున్న దని లోకాపవాదకు బెదరి రాముడు గర్భతవియైయున్న యా సీతామహాసాధ్విని వదలిపెట్టెను. వాల్మీకాశ్రమమందాతల్లి యిర్వురను బిడ్డలంగనెను. కుశుడు లవుడునను నాయిద్దరకు వాల్మీకి మహర్షి జాతకర్మాదులు నిర్వర్తించెను. ఆ మహాభాగు లామహర్షితో వేదాధ్యయనము సేవింపబడిరి. ఆ శిశువులాయనచేతనే ధనుర్వేదమందుగూడ పారంగతులు గావింపబడిరి. వాల్మీకి శుభదమైన రామచరితము (రామాయణము) చేసి యా విశాలనయనుల బాలురు పరమసుందరులను జదివించెను. అవ్వల నాపిల్లలు రామునియజ్ఞమందు రామునెదుటనిలచి సమగ్రముగ నా రామచరితముం బాడిరి. ఆ కావ్యమువలన రాముడా చక్కనివారు తనపుత్రులని యెరింగి యయ్యజ్ఞమందారీతినున్న యామెను (సీతను) సత్వరమ రావించెను. అరమణితంగని కల్యాణి ! నాకు ప్రత్యయము (నమ్ముటకనువైన) శోధనంజేయమనెను. రాముని పలుకువిని సీత, నేను రాఘవుని కంటె నింకొకని మనసుచేతనైన కోరనిదాననేని య నిజముచే నాకు దేవి (భూదేవి) వివరమును (సొరంగమును) ఇచ్చుగాక ! అనెను. ఇదేసమయమున భూమింపగిలించుకొని మీదికివచ్చని నాగులచే వహింపబడిన సంహాసనమందు వారిచే నామె యెక్కించుకొని వసుమతి స్వయముగా పాతాళమునకేగెను. అయ్యెడ నెడతెఱపిలేకుండ పూలవాన గరియుచుండ నా జగజ్జనని భూమిలో బ్రవేశింప కినుకతోనున్న రామచంద్రప్రభువును సర్వలోకవంద్యుడగు బ్రహ్మ సాంత్వనపఱచెను.

సాంత్వయామాస వై బ్రహ్మా సర్వలోక సమస్కృతః | రామోపి కృత్వా సౌవర్ణీం సీతాం పత్నీం యశస్వినీమ్‌ || 60

ఈజే యజ్ఞై ర్బహువిధైః సహభ్రాతృభి రచ్యుతః | నాపద్భయం నవిధవా నచ వ్యాళకృతం భయమ్‌ || 61

నచ వ్యాధి కృతం కించి ద్రామే రాజ్యం ప్రశాసతి | ఆ జాను బహు ర్ధర్మాత్మా సింహస్కంధో నరేశ్వరః || 62

పృథ్వీ ససాగరాం రామో ధర్మేణా న్వశిషత్ర్పభుః | దేవాశ్చ ఋషయశ్చైవ గంధర్వాప్సరసాం గణాః || 63

యక్షా శ్చ భూతాని తథా కిం నరాశ్చైవ రాక్షసాః | మానుష్యాణాం దర్శనం తే సౌమ్యా స్సంతో యయు స్సదా || 64

యదర్థమేషా చరతి గాథా లోకే పురాతనీ | ఆజానుబాహు సింహాస్యః కంబుగ్రీవో మహాబలః || 65

సర్వభూత శరణ్యశ్చ విష్ణుర్మానుష్యతాం గతః | సత్యవా ననృశంసశ్చ జాతో భక్తజన ప్రియః || 66

ధృతియక్తో దయాశీలో ధర్మయుక్తో జితేంద్రియః | మితవాగపి కార్యేషు వక్తా వాచస్పతే స్సమః || 67

వీర్యవా న్నచవీర్యేణ మహతా తేన విస్మితః | తేజసా భాస్కర సమః క్షమయా పృథివీసమః || 68

మహేశ్వర సమః క్రోధే నీతా పుశనసా సమః | ఏవం సర్వేషు భూతేషు గుణౖర్దాశరథి ర్బభౌ || 69

వర్ణానా మాశ్రమాణాంచ న సాంకర్యం నృపోత్తమే | ధర్మిష్ఠాశ్చ జనా స్సర్వే రామే రాజ్యం ప్రశాసతి || 70

నిర్దస్యు రభవల్లోకో నానర్థః కించి దస్పృశత్‌ | నాకాల వర్షీ వర్జన్యః సర్వ సస్యధరా ధరా |

జనానురాగశ్చ మహాన్‌ రామస్య విదితాత్మనః || 71

న తే క్షమంతేన నరేంద్ర చంద్ర ! వైరం మహాత్మా సతు లోక పూజ్యః |

తస్యాస్త్ర వేగస్య రణచ వేగం సోఢుం శక్తాః త్రిదశాః స శక్రాః || 72

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే రావణస్య భూలోక విజయ వర్ణనంనామ ఏకవింశత్యుత్తర ద్విశతతమోధ్యాయః.

రాముడు నవ్వల బంగారు సీతం గావించికొని తమ్ములతో బహువిధములగు యజ్ఞములాచరించెను. ఆ రామప్రభువు రాజ్యమందాపద్భయము లేదు విధవలు లేరు. ఘాతుక మృగ భయము లేదు. రాముడు పాలించుచుండ వ్యాదిభయమించుకేని లేదు. ఆజానుబాహువు సింహస్కంధుడు ధర్మమూర్తి రామనరపాలుడు సర్వసముద్ర పర్యంతమైన పృథ్విని ధర్మముతో శాసించెను. దేవతలు ఋషులు గంధర్వాప్సరోగణములు యక్షులు భూతములు కిన్నరులు రాక్షసులు సౌమ్యులై ప్రసన్నమూర్తులై యయ్యెడ మానవులకు దర్శనమిచ్చిరి. తన్నిమిత్తముగనే లోకమందీ పురాతనగాథ వ్యాప్తికివచ్చినది ఆజానుబాహువు సింహముఖుడు కంబుకంఠుడు (శంఖమువోలిన కంఠముగలవాడు) మహాబలశాలి సర్వభూత శరణ్యుడు (దిక్కు) నై విష్ణువు మనుష్యావతారమెత్తి నాడు. సత్యవంతుడు సర్వజనప్రసంశనీయుడు భక్తజన ప్రియుడు ధృతియుక్తుడు (ధైర్యశాలి) దయాశీలుడు ధర్మయుక్తుడు జితేంద్రియుడు మితభాషి కార్యములందు బృహస్పతింబోలినవక్త వీర్యవంతుడు తన వీర్యాతిశయమున దాను వింతపడడు. తేజస్సుచే భాస్కరునికి సముడు క్షమచే (ఓరిమిచే) భూదేవింబోలినవాడు. క్రోధమునందు మహేశ్వర సముడు నీతిలో శుక్రునికి సముడు ఇట్టి గుణములతో సర్వభూతములందును దాశరథి మిగుల తేజరిల్లెను. రాముడు నృపోత్తముడు పాలించుచుండ వర్ణముల కాశ్రమములకు సాంకర్యములేదు. సర్వజనులను ధర్మనిష్ఠులే. రాముడు రాజ్యమును శాసించుచుండ లోకము నిర్దస్యువయ్యెను (దొంగలుబందిపోటులులేనిదయ్యెను) అనర్థము (కీడు) ఏకొంచెమెవ్వరినిస్పృశించదు. మేఘుడకాలమున వర్షింపడు. ధర సర్వసస్యధర. ఆత్మజ్ఞుడయిన రామునియెడ జనానురాగ మింతింతగాదు. ఆయనతో నో నరేంద్రచంద్ర! మహాత్మునితో నీకు వైరము తగదు. అతడు లోక పూజ్యుడు. ఇంద్రునితోనెల్ల దేవతలు ననిలో నాతని యస్త్ర వేగముయొక్క వేగము నోర్వలేరు.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున శైలౌషుని గూర్చి నాడాయనుడు చెప్పిన రావణ భూలోకవిజయమను రెండువదల యిరువదియొక్క యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters